74వ కథ
భయపడని వ్యక్తి
ఈ యువకుడిని ప్రజలు ఎలా హేళన చేస్తున్నారో చూడండి. ఆయన ఎవరో మీకు తెలుసా? ఆయన పేరు యిర్మీయా. ఆయన చాలా ప్రముఖుడైన దేవుని ప్రవక్త.
యోషీయా దేశములోని విగ్రహాలను నాశనం చేయడం ప్రారంభించిన తర్వాత యెహోవా యిర్మీయాను తన ప్రవక్తగా నియమించాడు. అయితే యిర్మీయా, ప్రవక్తగా ఉండడానికి తాను బాలుడినేనని అనుకున్నాడు. కానీ యెహోవా ఆయనకు సహాయం చేస్తానని చెప్పాడు.
యిర్మీయా ఇశ్రాయేలీయులతో చెడ్డ పనులు చేయడం మానుకోవాలని చెప్పాడు. ‘అన్యజనులు ఆరాధించే దేవుళ్ళు, అబద్ధ దేవుళ్ళు’ అని ఆయన చెప్పాడు. అయినా చాలామంది ఇశ్రాయేలీయులు సత్య దేవుడైన యెహోవాను ఆరాధించడం కంటే విగ్రహాలను ఆరాధించడానికే ఇష్టపడ్డారు. ప్రజల చెడుతనాన్నిబట్టి యెహోవా వాళ్ళను శిక్షిస్తాడని యిర్మీయా చెప్పినప్పుడు వాళ్ళు నవ్వేవాళ్ళు.
సంవత్సరాలు గడిచాయి. యోషీయా మరణించగానే మూడు నెలల తర్వాత ఆయన కుమారుడైన యెహోయాకీము రాజయ్యాడు. యిర్మీయా ప్రజలతో, ‘మీరు మీ చెడు మార్గాలు విడిచిపెట్టకపోతే యెరూషలేము నాశనం చేయబడుతుంది’ అని పదే పదే చెప్పాడు. యాజకులు యిర్మీయాను పట్టుకొని, ‘ఇలాంటి విషయాలు చెబుతున్నందుకు నువ్వు చంపబడాలి’ అని కేకలు వేశారు. తర్వాత వాళ్ళు ఇశ్రాయేలు అధిపతులతో, ‘యిర్మీయా మన పట్టణానికి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఆయనను చంపేయాలి’ అన్నారు.
అప్పుడు యిర్మీయా ఏమి చేశాడు? ఆయన భయపడలేదు! ఆయన వాళ్ళందరితో, ‘ఈ విషయాలను మీకు చెప్పడానికే యెహోవా నన్ను పంపాడు. మీరు మీ చెడు జీవిత విధానాన్ని మార్చుకోకపోతే యెహోవా యెరూషలేమును నాశనం చేస్తాడు. కానీ ఒకటి మాత్రం నిశ్చయం: మీరు నన్ను చంపితే, ఒక నిరపరాధిని చంపినవాళ్ళవుతారు’ అని చెప్పాడు.
అధిపతులు యిర్మీయాను చంపకుండా వదిలేశారు, కానీ ఇశ్రాయేలీయులు తమ చెడు మార్గాలను మార్చుకోలేదు. తర్వాత బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి యెరూషలేముతో యుద్ధం చేశాడు. చివరకు నెబుకద్నెజరు ఇశ్రాయేలీయులను తన దాసులుగా చేసుకున్నాడు. ఆయన ఎన్నో వేలమందిని బబులోనుకు తీసుకువెళ్ళాడు. అపరిచితులు మిమ్మల్ని మీ ఇంటినుండి ఒక క్రొత్త ప్రదేశానికి తీసుకువెళ్తే ఎలా ఉంటుందో ఊహించండి!