కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

66వ కథ

యెజెబెలు—ఒక దుష్ట రాణి

యెజెబెలు—ఒక దుష్ట రాణి

రాజైన యరొబాము మరణించిన తర్వాత, 10 గోత్రాల ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన ప్రతీ రాజు చెడ్డవాడే. వాళ్ళందరిలోకి రాజైన అహాబు మరీ చెడ్డవాడు. ఎందుకో మీకు తెలుసా? దానికి ఒక ముఖ్యకారణం దుష్ట రాణియైన ఆయన భార్య యెజెబెలే.

యెజెబెలు ఇశ్రాయేలు స్త్రీ కాదు. ఆమె సీదోను రాజు కుమార్తె. ఆమె అబద్ధ దేవుడైన బయలును ఆరాధించేది, అహాబుతోపాటు అనేకమంది ఇశ్రాయేలీయులు కూడా బయలును ఆరాధించేలా ఆమె చేసింది. యెజెబెలు యెహోవాను ద్వేషించి ఆయన ప్రవక్తలను చాలామందిని చంపించింది. ఇతర ప్రవక్తలు ఆమె చేతుల్లో చావకుండా ఉండడానికి గుహల్లో దాక్కోవలసి వచ్చింది. యెజెబెలు ఏదైనా కావాలనుకుంటే దాన్ని పొందడానికి ఒక వ్యక్తిని చంపడానికి కూడా వెనుకాడేది కాదు.

ఒకరోజు రాజైన అహాబు చాలా దుఃఖంగా ఉన్నట్లు కనిపించాడు. కాబట్టి యెజెబెలు, ‘నువ్వెందుకు దుఃఖంగా ఉన్నావు?’ అని అడిగింది.

దానికి అహాబు, ‘నాబోతు అన్న మాటలనుబట్టి దుఃఖిస్తున్నాను. నేను అతని ద్రాక్ష తోట కొనాలనుకున్నాను. కానీ అతను దానిని నాకు ఇవ్వనన్నాడు’ అని సమాధానమిచ్చాడు.

అప్పుడు యెజెబెలు, ‘చింతపడవద్దు. అది నీకు దక్కేలా నేను చేస్తాను’ అని చెప్పింది.

యెజెబెలు నాబోతు నివసించే ఊరిలోని పెద్దల్లో కొందరికి ఉత్తరాలు వ్రాసి, ‘కొంతమంది పనికిమాలిన మనుష్యులను పిలిపించి, నాబోతు దేవునిని, రాజును దూషించాడని చెప్పేలా చెయ్యండి, తర్వాత నాబోతును పట్టణము బయటికి తీసుకువెళ్ళి రాళ్ళతో కొట్టి చంపండి’ అని చెప్పింది.

నాబోతు మరణించాడని తెలుసుకున్న వెంటనే యెజెబెలు అహాబుతో, ‘వెళ్ళి, అతని ద్రాక్ష తోట తీసుకో’ అంది. అలాంటి ఘోరమైన పని చేసినందుకు యెజెబెలుకు శిక్షపడాలని మీరు అంగీకరించరా?

అందుకే తగిన కాలంలో, యెహోవా ఆమెను శిక్షించడానికి యెహూ అనే వ్యక్తిని పంపించాడు. యెహూ వస్తున్నాడని యెజెబెలు విన్నప్పుడు, ఆమె తన కండ్లకు రంగు వేసుకొని, అందంగా కనపడడానికి ప్రయత్నించింది. అయితే యెహూ వచ్చినప్పుడు కిటికీలో కూర్చొని ఉన్న యెజెబెలును చూసి, భవనంలోని మనుష్యులతో, ‘ఆమెను క్రింద పడవేయండి!’ అన్నాడు. మీకు చిత్రంలో కనిపిస్తున్నట్లు ఆ మనుష్యులు అలాగే చేశారు. వాళ్ళు ఆమెను క్రింద పడేసినప్పుడు ఆమె చనిపోయింది. ఆ విధంగా దుష్ట రాణి యెజెబెలు అంతమయ్యింది.