కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

76వ కథ

యెరూషలేము నాశనం కావడం

యెరూషలేము నాశనం కావడం

నెబుకద్నెజరు ఇశ్రాయేలీయుల్లోని మంచి విద్యావంతులందరిని బబులోనుకు తీసుకువెళ్ళి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత ఏమి జరిగిందో చిత్రంలో చూడండి! యెరూషలేము కాల్చివేయబడింది. ఇశ్రాయేలీయులు చాలామంది చంపబడ్డారు, అలా చంపబడనివాళ్ళు బబులోనుకు బంధీలుగా తీసుకెళ్ళబడ్డారు.

ప్రజలు తమ చెడు మార్గాలను మార్చుకోకపోతే ఇదే జరుగుతుందని యెహోవా ప్రవక్తలు హెచ్చరించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కానీ ఇశ్రాయేలీయులు ప్రవక్తల మాట వినలేదు. వాళ్ళు యెహోవాకు బదులు అబద్ధ దేవుళ్ళను ఆరాధించడంలోనే కొనసాగారు. కాబట్టి ప్రజలు అలా శిక్షించబడడానికి అర్హులే. దేవుని ప్రవక్తయైన యెహెజ్కేలు ఇశ్రాయేలీయులు చేసిన చెడ్డ పనుల గురించి చెప్పాడు కాబట్టి మనకు ఆ విషయం ఖచ్చితంగా తెలుసు.

యెహెజ్కేలు ఎవరో మీకు తెలుసా? యెరూషలేము ఇలా పూర్తిగా నాశనం చేయబడడానికి 10 కంటే ఎక్కువ సంవత్సరాల ముందు నెబుకద్నెజరు రాజు బబులోనుకు తీసుకెళ్ళిన యువకుల్లో ఆయన కూడా ఒకడు. దానియేలు ఆయన ముగ్గురు స్నేహితులు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు కూడా అదే సమయంలో బబులోనుకు తీసుకెళ్ళబడ్డారు.

యెహెజ్కేలు బబులోనులో ఉండగానే, యెరూషలేములోని ఆలయంవద్ద జరుగుతున్న చెడ్డ పనులను యెహోవా ఆయనకు చూపించాడు. యెహోవా ఒక అద్భుతం ద్వారా అలా చూపించాడు. యెహెజ్కేలు నిజానికి బబులోనులోనే ఉన్నాడు, కానీ యెహోవా ఆలయంలో జరుగుతున్న పనులన్నింటిని ఆయన చూసేలా చేశాడు. యెహెజ్కేలు దిగ్భ్రాంతికరమైన విషయాలను చూశాడు!

యెహోవా యెహెజ్కేలుతో ‘ఈ ప్రజలు ఆలయంలో చేస్తున్న అసహ్యమైన పనులు చూడు. పాముల బొమ్మలతోను ఇతర మృగాల బొమ్మలతోను నిండివున్న గోడలను చూడు. వాటిని ఆరాధిస్తున్న ఇశ్రాయేలీయులను చూడు!’ అని చెప్పాడు. యెహెజ్కేలు వాటిని చూసి, అక్కడ జరుగుతున్నవాటిని వ్రాశాడు.

‘ఇశ్రాయేలీయుల పెద్దలు రహస్యంగా చేస్తున్న పనులు నీకు కనిపిస్తున్నాయా?’ అని యెహోవా యెహెజ్కేలును అడిగాడు. అవును, యెహెజ్కేలు వాటిని కూడా చూడగలిగాడు. అక్కడ 70 మంది పురుషులు ఉండడాన్ని, వాళ్ళంతా అబద్ధ దేవుళ్ళను ఆరాధించడాన్ని ఆయన చూశాడు. ‘యెహోవా మమ్మల్ని చూడడంలేదు. ఆయన ఈ దేశాన్ని విడిచిపెట్టాడు’ అని వాళ్ళు అనడాన్ని చూశాడు.

ఆ తర్వాత యెహోవా యెహెజ్కేలుకు ఉత్తర ద్వారము దగ్గరున్న కొంతమంది స్త్రీలను చూపించాడు. వాళ్ళు అక్కడ కూర్చొని అబద్ధ దేవతయైన తమ్మూజును ఆరాధించడం ఆయనకు కనిపించింది. తర్వాత ఆయనకు యెహోవా ఆలయ ముఖ ద్వారము దగ్గర కూర్చొనివున్న పురుషులు కనిపించారు. అక్కడ యెహెజ్కేలు దాదాపు 25 మంది పురుషులను చూశాడు. వాళ్ళు తూర్పువైపుకు తిరిగి వంగి నమస్కరించి సూర్యుణ్ణి ఆరాధించడం ఆయనకు కనిపించింది!

‘ఈ ప్రజలకు నేనంటే గౌరవం లేదు. వాళ్ళు చెడు పనులు చేయడమే కాకుండా నా ఆలయంలోకి ప్రవేశించి వాటిని చేస్తున్నారు!’ అని యెహోవా చెప్పాడు. కాబట్టి ‘వాళ్ళు నా కోపం తీవ్రతను తెలుసుకుంటారు. వాళ్ళు నశించినప్పుడు నేను చింతించను’ అని యెహోవా చెప్పాడు.

యెహోవా యెహెజ్కేలుకు ఈ విషయాలు చూపించిన తర్వాత కేవలం మూడు సంవత్సరాలకే ఇశ్రాయేలీయులు రాజైన నెబుకద్నెజరుపై తిరుగుబాటు చేశారు. అప్పుడు ఆయన వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఒకటిన్నర సంవత్సరాల తర్వాత బబులోనీయులు యెరూషలేము గోడలను పగులగొట్టి, పట్టణం మొత్తం నాశనమయ్యేవరకూ కాల్చివేశారు. చాలామంది ప్రజలు చంపబడ్డారు, మిగిలినవారు బబులోనుకు బంధీలుగా తీసుకెళ్ళబడ్డారు.

ఇశ్రాయేలీయులు ఇంత భయంకరంగా నాశమవ్వడానికి యెహోవా ఎందుకు అనుమతించాడు? ఎందుకంటే వాళ్ళు యెహోవా మాట వినలేదు, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించలేదు. దేవుడు చెప్పిన దానిని ఎల్లప్పుడూ చేయడం ఎంత ప్రాముఖ్యమో ఇది చూపిస్తోంది.

మొదట కొద్దిమంది ప్రజలు ఇశ్రాయేలు దేశములో ఉండడానికి అనుమతించబడ్డారు. నెబుకద్నెజరు ఈ ప్రజలపై గెదల్యా అనే యూదున్ని అధికారిగా నియమించాడు. అయితే కొంతమంది ఇశ్రాయేలీయులు గెదల్యాను హత్య చేశారు. అప్పుడు ఆ చెడు సంఘటన జరిగినందుకు బబులోనీయులు మళ్ళీ వచ్చి తమనందరిని చంపుతారేమోనని ప్రజలు భయపడ్డారు. కాబట్టి వాళ్ళు యిర్మీయాను కూడా తమతో రమ్మని బలవంతపెట్టి, ఐగుప్తుకు పారిపోయారు.

ఆ తర్వాత ఇశ్రాయేలు దేశం నిర్జనంగా మారింది. 70 సంవత్సరాల వరకు ఆ దేశములో ఎవరూ నివసించరు. అది పూర్తిగా నిర్మానుష్యంగా అయిపోయింది. అయితే 70 సంవత్సరాల తర్వాత తన ప్రజలను తిరిగి ఆ దేశానికి రప్పిస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. అయితే బబులోనుకు బంధీలుగా తీసుకెళ్ళబడిన దేవుని ప్రజలకు ఏమి జరిగింది? మనం ఇప్పుడు చూద్దాం.