కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

71వ కథ

దేవుడు ఒక పరదైసును వాగ్దానం చేయడం

దేవుడు ఒక పరదైసును వాగ్దానం చేయడం

దేవుడు తన ప్రవక్తయైన యెషయాకు చూపించిన పరదైసు ఈ చిత్రంలా ఉండివుండవచ్చు. యోనా జీవించిన కొద్దికాలానికి యెషయా జీవించాడు.

పరదైసు అంటే “తోట” లేక “ఉద్యానవనము” అని అర్థం. ఈ చిత్రాన్ని చూసినప్పుడు ఇదే పుస్తకంలో మనం ఇంతకు ముందు చూసినదేదైనా మీకు జ్ఞాపకం వస్తోందా? ఇది యెహోవా దేవుడు ఆదాము హవ్వల కోసం తయారు చేసిన అందమైన తోటవలే ఉంది, కదా? అయితే ఈ భూమంతా ఎప్పటికైనా పరదైసుగా మారుతుందా?

దేవుని ప్రజల కోసం రాబోయే పరదైసు గురించి వ్రాయమని యెహోవా తన ప్రవక్తయైన యెషయాకు చెప్పాడు. ఆయన ఇలా చెప్పాడు: ‘తోడేళ్ళు, గొర్రెలు కలిసి సమాధానంగా జీవిస్తాయి. కోడెదూడలు, కొదమసింహాలు కలిసి మేస్తాయి. చిన్న పిల్లలు వాటిని చూసుకుంటారు. చిన్న బిడ్డ విషసర్పము దగ్గర ఆటలాడినా ఏ హాని జరగదు.’

‘అలా ఎప్పటికీ జరగదు. భూమ్మీద ఇదివరకు బాధలుండేవి, ఇకపై కూడా అవి అలాగే ఉంటాయి’ అని చాలా మంది అంటారు. కానీ దీని గురించి ఆలోచించండి: దేవుడు ఆదాము హవ్వలకు ఎలాంటి గృహాన్నిచ్చాడు?

దేవుడు ఆదాము హవ్వలను పరదైసులో ఉంచాడు. వాళ్ళు దేవునికి అవిధేయత చూపించినందుకే తమ అందమైన గృహాన్ని పోగొట్టుకుని, వృద్ధులై మరణించారు. అయితే దేవుడు తనను ప్రేమించే ప్రజలకు ఆదాము హవ్వలు పోగొట్టుకున్నవాటిని ఇస్తానని వాగ్దానం చేశాడు.

రాబోయే క్రొత్త పరదైసులో ఏదీ హాని చేయదు, లేక నాశనం చేయదు. పరిపూర్ణమైన సమాధానం ఉంటుంది. ప్రజలందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. మొదట దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడో అలాగే ఉంటుంది. అయితే దీనినంతటిని దేవుడు ఎలా చేస్తాడు అనే దాని గురించి మనం తరువాత తెలుసుకుందాం.