70వ కథ
యోనా, పెద్ద చేప
నీళ్ళలో ఉన్న వ్యక్తిని చూడండి. ఆయన ఎంతో ఆపదలో ఉన్నాడు కదా? ఆ చేప ఆయనను మ్రింగెయ్యబోతోంది! ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆయన పేరు యోనా. ఆయన ఇంతటి ఆపదలో ఎలా చిక్కుకున్నాడో చూద్దాం.
యోనా యెహోవా ప్రవక్త. ఎలీషా చనిపోయిన తర్వాత కొంతకాలానికి యెహోవా యోనాతో, ‘నీవు గొప్ప పట్టణమైన నీనెవెకు వెళ్ళు. అక్కడి ప్రజల చెడుతనం చాలా ఎక్కువైపోయింది, దాని గురించి నీవు వాళ్ళకు చెప్పాలి’ అన్నాడు.
అయితే యోనాకు అలా వెళ్ళడం ఇష్టంలేదు. కాబట్టి ఆయన నీనెవెకు వ్యతిరేక దిశలో వెళ్లే ఓడ ఎక్కాడు. యోనా అలా పారిపోవడాన్ని చూసి యెహోవా సంతోషించలేదు. అందుకే ఆయన ఒక పెద్ద తుపానును కలుగజేశాడు. ఆ తుపాను ఓడను ముంచివేసేంత తీవ్రంగా మారింది. ఓడలోని నావికులు ఎంతో భయపడి, సహాయం కోసం తమ దేవుళ్ళకు ప్రార్థించారు.
చివరకు యోనా వాళ్ళతో, ‘నేను భూమ్యాకాశాలను సృష్టించిన యెహోవా దేవున్ని ఆరాధిస్తాను. యెహోవా చెప్పిన దానిని చేయకుండా నేను పారిపోతున్నాను’ అని చెప్పాడు. అప్పుడు ఆ నావికులు, ‘తుపాను ఆగిపోవాలంటే మేము నీకేమి చెయ్యాలి?’ అని అడిగారు.
‘నన్ను సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం నిమ్మళిస్తుంది’ అని యోనా వాళ్ళకు చెప్పాడు. నావికులు అలా చేయడానికి ఇష్టపడలేదు, అయితే తుపాను అంతకంతకు తీవ్రమవ్వడంతో చివరకు వాళ్ళు యోనాను ఓడలోనుండి కిందకు పడేశారు. వెంటనే తుపాను ఆగిపోయి, సముద్రం నిమ్మళించింది.
యోనా నీళ్ళలో మునిగిపోతుండగా, ఆ పెద్ద చేప ఆయనను మ్రింగేసింది. కానీ ఆయన చనిపోలేదు. మూడు రోజులు, మూడు రాత్రులు ఆయన ఆ చేప కడుపులోనే ఉన్నాడు. యెహోవా చెప్పిన మాట విని నీనెవెకు వెళ్ళనందుకు యోనా చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆయన ఏమి చేశాడో మీకు తెలుసా?
యోనా సహాయం కోసం యెహోవాకు ప్రార్థించాడు. అప్పుడు యెహోవా ఆ చేప యోనాను పొడినేలపై కక్కివేసేలా చేశాడు. తరువాత యోనా నీనెవెకు వెళ్ళాడు. యెహోవా ఏమి చెప్పినా దానిని చేయడం ఎంత ప్రాముఖ్యమో ఇది మనకు బోధించడంలేదా?
బైబిలు పుస్తకమైన యోనా