73వ కథ
ఇశ్రాయేలీయుల చివరి మంచి రాజు
యోషీయా ఇశ్రాయేలీయుల దక్షిణ ప్రాంతపు రెండు గోత్రాలకు రాజైనప్పుడు, ఆయన వయస్సు కేవలం ఎనిమిది సంవత్సరాలే. ఒక వ్యక్తి రాజు కావడానికి అది చాలా చిన్న వయస్సు. కాబట్టి ఆయన ఆ జనాంగాన్ని పరిపాలించడానికి మొదట్లో కొందరు పెద్దవాళ్ళు సహాయం చేశారు.
యోషీయా ఏడు సంవత్సరాలపాటు రాజుగా ఉన్న తర్వాత, యెహోవావద్ద విచారించడం ప్రారంభించాడు. ఆయన దావీదు, యెహోషాపాతు, హిజ్కియావంటి మంచి రాజుల మాదిరిని అనుసరించాడు. ఆయన యౌవనస్థుడిగా ఉన్నప్పుడే ధైర్యముతో కూడిన ఒక పని చేశాడు.
ఎంతోకాలంగా ఇశ్రాయేలీయుల్లో చాలామంది చెడ్డగా ప్రవర్తించడం ప్రారంభించారు. వాళ్ళు అబద్ధ దేవుళ్ళను ఆరాధించేవారు. విగ్రహాలకు మ్రొక్కేవారు. కాబట్టి యోషీయా తన మనుష్యులతోపాటు వెళ్ళి దేశంనుండి అబద్ధ ఆరాధనను నిర్మూలించడం మొదలుపెట్టాడు. అది చాలా పెద్ద పని, ఎందుకంటే ఎంతోమంది ప్రజలు అబద్ధ దేవుళ్ళను ఆరాధించేవారు. చిత్రంలో యోషీయా, ఆయన మనుష్యులు విగ్రహాలను పగలగొట్టడాన్ని మీరు చూడవచ్చు.
ఆ తర్వాత యోషీయా యెహోవా ఆలయాన్ని మరమ్మతు చేసే పనికి ముగ్గురు మనుష్యులను అధికారులుగా నియమించాడు. ప్రజల దగ్గరనుండి వసూలు చేయబడిన డబ్బును ఆ అధికారులు ఆలయాన్ని మరమ్మతు చేసేవారికి చెల్లించేవారు. అలా వాళ్ళు ఆలయంలో పని చేస్తున్నప్పుడు ప్రధాన యాజకుడైన హిల్కీయాకు ప్రాముఖ్యమైనది ఒకటి దొరికింది. అది ఎంతోకాలం క్రితం యెహోవా మోషేచేత వ్రాయించిన ధర్మశాస్త్ర గ్రంథం. అది చాలా సంవత్సరాలవరకు కనబడకుండా పోయింది.
ఆ గ్రంథం యోషీయా దగ్గరకు తీసుకెళ్ళబడినప్పుడు, ఆయన దానిని తనకు చదివి వినిపించమని అడిగాడు. దానిని వింటుండగా ప్రజలు యెహోవా ధర్మశాస్త్ర నియమాలను పాటించడంలేదని యోషీయా గ్రహించాడు. ఆ విషయం ఆయనకు ఎంతో బాధ కలిగించింది, మీరు ఇక్కడ చూస్తున్నట్లు ఆయన బాధతో తన వస్త్రాలను చింపుకున్నాడు. ‘మన పితరులు ఈ గ్రంథంలోని నియమాలను పాటించనందుకే యెహోవాకు మనపై కోపము వచ్చింది’ అని అన్నాడు.
యెహోవా తమకు ఏమి చేయబోతున్నాడో తెలుసుకొమ్మని యోషీయా ప్రధాన యాజకుడైన హిల్కీయాకు ఆజ్ఞాపించాడు. హిల్కీయా ప్రవక్త్రియైన హుల్దా దగ్గరకు వెళ్ళి, ఆమెను అడిగాడు. ఆమె యెహోవానుండి వచ్చిన ఈ వర్తమానాన్ని యోషీయాకు తెలియజేయమని చెప్పింది: ‘యెరూషలేము, అందులోని ప్రజలందరూ అబద్ధ దేవుళ్ళను ఆరాధించారు కాబట్టి, దేశము చెడుతనంతో నిండిపోయింది కాబట్టి నేను వాళ్ళను శిక్షిస్తాను. అయితే యోషీయావైన నీవు, సరైన దానిని చేశావు కాబట్టి నీవు మరణించేవరకు ఆ శిక్షను అమలు చేయను.’