కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

72వ కథ

హిజ్కియా రాజుకు దేవుడు సహయం చేయడం

హిజ్కియా రాజుకు దేవుడు సహయం చేయడం

ఈ వ్యక్తి యెహోవాకు ఎందుకు ప్రార్థిస్తున్నాడో మీకు తెలుసా? ఆయన ఈ ఉత్తరాలను యెహోవా బలిపీఠము ఎదుట ఎందుకు పెట్టాడు? ఆయన హిజ్కియా. ఆయన ఇశ్రాయేలీయుల దక్షిణ ప్రాంతపు రెండు గోత్రాలకు రాజు. ఆయన చాలా కష్టంలో ఉన్నాడు. ఎందుకు?

ఎందుకంటే అష్షూరీయుల సైన్యాలు అప్పటికే ఉత్తర ప్రాంతపు 10 గోత్రాలను నాశనం చేసేశాయి. ఆ ప్రజలు చాలా చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళు నాశనం చేయబడడానికి యెహోవా అనుమతించాడు. ఆ తర్వాత అష్షూరీయుల సైన్యాలు రెండు గోత్రాల రాజ్యంతో యుద్ధం చేయడానికి వచ్చాయి.

అష్షూరు రాజు హిజ్కియా రాజుకు ఉత్తరాలు పంపించాడు. హిజ్కియా దేవుని ఎదుట పెట్టిన ఉత్తరాలు అవే. ఆ ఉత్తరాలు యెహోవాను హేళనచేస్తూ, హిజ్కియాను లొంగిపొమ్మని చెప్పాయి. అందుకే హిజ్కియా, ‘యెహోవా, అష్షూరు రాజునుండి మమ్మల్ని రక్షించు. అప్పుడు సమస్త జనములు నీవు మాత్రమే దేవుడవని తెలుసుకుంటారు’ అని ప్రార్థించాడు. యెహోవా హిజ్కియా ప్రార్థనను విన్నాడా?

హిజ్కియా మంచి రాజు. ఆయన ఇశ్రాయేలీయుల 10 గోత్రాల చెడ్డ రాజులవంటి వాడుకాదు, లేక తన చెడ్డ తండ్రియైన ఆహాజు రాజువంటి వాడు కాదు. హిజ్కియా యెహోవా శాసనాలన్నింటికి ఎంతో జాగ్రత్తగా విధేయత చూపించాడు. కాబట్టి హిజ్కియా ప్రార్థన చేయడం ముగించిన తరువాత, ప్రవక్తయైన యెషయా యెహోవానుండి వచ్చిన ఈ వర్తమానాన్ని ఆయనకు పంపించాడు: ‘అష్షూరు రాజు యెరూషలేములోకి రాడు. అతని సైనికులెవరూ దానికి సమీపంగానైనా రారు. వాళ్ళు పట్టణంపై ఒక బాణమైనా వేయరు.’

ఈ పేజీలో ఉన్న చిత్రాన్ని చూడండి. చనిపోయిన ఈ సైనికులంతా ఎవరో మీకు తెలుసా? వాళ్ళంతా అష్షూరీయులు. యెహోవా తన దూతను పంపించినప్పుడు, ఆ దేవదూత ఒక్కరాత్రిలోనే 1,85,000 మంది అష్షూరు సైనికులను చంపేశాడు. అందుచేత అష్షూరు రాజు యుద్ధం విరమించుకొని ఇంటికి తిరిగివెళ్ళాడు.

రెండు గోత్రాల రాజ్యం కాపాడబడింది, ప్రజలు కొంతకాలంపాటు సమాధానంగా జీవించారు. కానీ హిజ్కియా మరణించిన తర్వాత ఆయన కుమారుడు మనష్షే రాజయ్యాడు. మనష్షే, ఆ తర్వాత వచ్చిన ఆయన కుమారుడు ఆమోను, ఇద్దరూ చాలా చెడ్డ రాజులే. కాబట్టి దేశం మళ్ళీ నేరంతో, దౌర్జన్యంతో నిండిపోయింది. ఆమోను రాజును తన స్వంత సేవకులే హత్య చేసినప్పుడు, ఆయన కుమారుడు యోషీయా రెండు గోత్రాల రాజ్యానికి రాజుగా చేయబడ్డాడు.