కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

64వ కథ

సొలొమోను ఆలయాన్ని నిర్మించడం

సొలొమోను ఆలయాన్ని నిర్మించడం

దావీదు చనిపోయేముందు, యెహోవా ఆలయాన్ని నిర్మించేందుకు దేవుడిచ్చిన నమూనాలను సొలొమోనుకు ఇచ్చాడు. సొలొమోను తన పరిపాలనలోని నాలుగవ సంవత్సరంలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. దానిని పూర్తి చేయడానికి ఏడున్నర సంవత్సరాలు పట్టింది. ఆలయాన్ని నిర్మించడానికి లక్షలాదిమంది పురుషులు పని చేశారు. దాని నిర్మాణానికి విస్తారంగా ధనం ఖర్చయ్యింది. ఎందుకంటే దానికి ఎంతో బంగారము, వెండి ఉపయోగించబడ్డాయి.

గుడారంలో ఉన్నట్లే ఆలయంలో కూడా రెండు ముఖ్యమైన గదులు ఉండేవి. అయితే ఆలయంలోని గదులు గుడారంలోని గదులకు రెట్టింపు పరిమాణంలో ఉండేవి. సొలొమోను నిబంధన మందసాన్ని ఆలయపు లోపలి గదిలో పెట్టించాడు, గుడారంలో ఉంచబడిన ఇతర వస్తువులను ఆయన మరో గదిలో పెట్టించాడు.

ఆలయ నిర్మాణం పూర్తైనప్పుడు పెద్ద ఉత్సవం జరిగింది. మీరు ఈ చిత్రంలో చూస్తున్నట్లు సొలొమోను ఆలయం ముందు మోకాళ్ళూని ప్రార్థించాడు. ‘ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ ఆలయం నిన్ను పట్టునా? దేవా, నీ సేవకులు ఈ స్థలమువైపు తిరిగి చేసే ప్రార్థనలను నీవు ఆలకించుము’ అని సొలొమోను యెహోవాతో అన్నాడు.

సొలొమోను తన ప్రార్థన ముగించగానే ఆకాశమునుండి అగ్ని దిగివచ్చి, సిద్ధం చేయబడిన జంతు బలులను దహించి వేసింది. యెహోవానుండి వచ్చిన తేజోవంతమైన వెలుగు ఆలయాన్ని నింపేసింది. అది యెహోవా వింటున్నాడని, ఆలయం విషయంలోనూ సొలొమోను ప్రార్థన విషయంలోనూ ఆయన సంతోషించాడని చూపించింది. అప్పటినుండి గుడారం కాక ఆ ఆలయమే ప్రజలు ఆరాధించడానికి వచ్చే స్థలంగా మారింది.

చాలాకాలం వరకు సొలొమోను జ్ఞానయుక్తంగా పరిపాలించాడు, ప్రజలు సంతోషంగా ఉండేవారు. కానీ సొలొమోను యెహోవాను ఆరాధించని ఇతర దేశాలకు చెందిన స్త్రీలను చాలామందిని వివాహం చేసుకున్నాడు. వాళ్ళలో ఒకరు విగ్రహాన్ని ఆరాధించడం మీకు కనిపిస్తోందా? చివరకు సొలొమోను భార్యలు ఆయన కూడా ఇతర దేవుళ్ళను ఆరాధించేలా చేశారు. సొలొమోను అలా చేసినప్పుడు ఏమి జరిగిందో మీకు తెలుసా? ఆయన ప్రజలతో దయగా వ్యవహరించడం మానేశాడు. ఆయన క్రూరమైన వ్యక్తిగా తయారయ్యాడు, ప్రజలు సంతోషంగా ఉండలేకపోయారు.

ఆ కారణంగా యెహోవాకు సొలొమోనుపై కోపం వచ్చింది. ఆయన సొలొమోనుతో ‘నేను రాజ్యాన్ని నీ దగ్గరనుండి తీసివేసి మరొకరికి ఇస్తాను. అయితే నేను నీ జీవితకాలంలో అలా చేయను. నీ కుమారుని పరిపాలనా కాలంలో చేస్తాను. కానీ నీ కుమారుని చేతిలోనుండి రాజ్యంలోని ప్రజలందరిని తీసివేయను’ అని చెప్పాడు. అది ఎలా జరిగిందో మనం చూద్దాం.