కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

59వ కథ

దావీదు ఎందుకు పారిపోవలసి వచ్చింది

దావీదు ఎందుకు పారిపోవలసి వచ్చింది

దావీదు గొల్యాతును చంపిన తర్వాత, ఇశ్రాయేలు సేనాధిపతి అబ్నేరు ఆయనను సౌలు దగ్గరకు తీసుకొని వచ్చాడు. సౌలు దావీదును చూసి ఎంతో సంతోషించాడు. ఆయనను తన సైన్యంలో ప్రధానునిగా చేసి రాజగృహంలో నివసించడానికి తీసుకొనివెళ్ళాడు.

ఆ తర్వాత సైన్యం ఫిలిష్తీయులతో యుద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడు, ‘సౌలు వేలమందిని చంపితే దావీదు పదివేలమందిని చంపాడు’ అని స్త్రీలు పాడారు. ఇది సౌలుకు అసూయను కలిగించింది, ఎందుకంటే ప్రజలు సౌలుకంటే దావీదుకే ఎక్కువ ఘనతను ఇచ్చారు. అయితే సౌలు కుమారుడైన యోనాతాను అసూయపడలేదు. ఆయన దావీదును ఎంతో ప్రేమించాడు, దావీదు కూడా యోనాతానును ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి వాళ్ళిద్దరు తాము ఎప్పుడూ స్నేహితులుగానే ఉంటామని ఒకరికొకరు వాగ్దానం చేసుకున్నారు.

దావీదు వీణవంటి వాయిద్యం చాలా బాగా వాయించేవాడు, సౌలు ఆయన వాయించే సంగీతాన్ని ఇష్టపడేవాడు. అయితే ఒకరోజు సౌలు తనకున్న అసూయవల్ల ఒక ఘోరమైన పని చేశాడు. దావీదు వీణవంటి వాయిద్యం వాయిస్తున్నప్పుడు సౌలు ‘నేను దావీదును గోడకు బిగించేస్తాను!’ అంటూ తన ఈటెను విసిరాడు. కానీ దావీదు ముందుకు వంగి ఈటె తగలకుండా తప్పించుకున్నాడు. తర్వాత మరోసారి కూడా సౌలు తన ఈటెను దావీదుపై విసరటంలో గురితప్పాడు. కాబట్టి తాను ఇకనుండి చాలా జాగ్రత్తగా ఉండాలని దావీదుకు అర్థమయ్యింది.

సౌలు చేసిన వాగ్దానం మీకు గుర్తుందా? గొల్యాతును చంపిన వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేస్తానని ఆయన చెప్పాడు. ఆఖరికి సౌలు తన కుమార్తె మీకాలును దావీదు పెళ్ళి చేసుకోవచ్చు గానీ, దానికి ముందు దావీదు శత్రువులైన 100 మంది ఫిలిష్తీయులను చంపాలని అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి! ఫిలిష్తీయులు దావీదునే చంపాలని సౌలు నిజమైన ఆశ. కానీ ఫిలిష్తీయులు దావీదును చంపలేదు, కాబట్టి సౌలు తన కుమార్తెను దావీదుకు భార్యగా ఇచ్చాడు.

ఒకరోజు సౌలు యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ తాను దావీదును చంపాలనుకుంటున్నాను అని చెప్పాడు. అయితే యోనాతాను తన తండ్రితో, ‘దావీదుకు హాని చేయవద్దు. ఆయన నీపట్ల ఎన్నడూ ఏ తప్పూ చేయలేదు. బదులుగా ఆయన చేసిన ప్రతీది నీకు ఎంతో మేలు కలిగించింది. ఆయన తన ప్రాణానికి తెగించి, గొల్యాతును చంపాడు. దాన్ని చూసినప్పుడు నీవు సంతోషించావు’ అని చెప్పాడు.

సౌలు తన కుమారుని మాట విని, దావీదుకు హాని చేయనని ప్రమాణం చేశాడు. దావీదు తిరిగి వచ్చి, తాను ఇంతకుముందు చేసినట్లే సౌలు గృహంలో సేవ చేయడం ప్రారంభించాడు. అయితే ఒకరోజు దావీదు సంగీతం వాయిస్తున్నప్పుడు సౌలు మళ్ళీ తన ఈటెను ఆయనపైకి విసిరాడు. దావీదు తప్పించుకున్నప్పుడు ఈటె గోడకు తగిలింది. సౌలు అలా చేయడం అది మూడవసారి! తాను అక్కడనుండి పారిపోవాలని దావీదుకు అర్థమయ్యింది!

ఆ రాత్రికి దావీదు తన స్వంత ఇంటికి వెళ్ళాడు. కానీ సౌలు ఆయనను చంపడానికి కొందరు మనుష్యులను పంపించాడు. తన తండ్రి ఏమి చెయ్యాలనుకుంటున్నాడో మీకాలుకు తెలిసింది. అప్పుడామె తన భర్తతో, ‘ఈ రాత్రికి నీవు తప్పించుకోకపోతే, రేపటికి నీవు మరణిస్తావు’ అని చెప్పింది. ఆ రాత్రి మీకాలు దావీదు కిటికీగుండా తప్పించుకొని వెళ్ళడానికి సహాయపడింది. అలా దావీదు సౌలుకు కనపడకుండా ఏడు సంవత్సరాలు ఒకచోట తర్వాత మరో చోట దాక్కోవలసి వచ్చింది.