కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

56వ కథ

సౌలు—ఇశ్రాయేలు మొదటి రాజు

సౌలు—ఇశ్రాయేలు మొదటి రాజు

సమూయేలు ఆ వ్యక్తి తలపై తైలం పోయడాన్ని చూడండి. ఒక వ్యక్తి రాజుగా ఎంపిక చేయబడ్డాడని చూపించడానికి వాళ్ళు ఇలాగే చేసేవారు. సౌలు తలపై తైలం పోయమని సమూయేలుకు యెహోవా చెప్పాడు. అది ప్రత్యేకమైన సువాసనగల తైలం.

సౌలు తాను రాజయ్యేందుకు అర్హుడు కాదు అనుకున్నాడు. ఆయన సమూయేలుతో ‘నేను ఇశ్రాయేలులో చాలా చిన్న గోత్రమైన బెన్యామీను గోత్రానికి చెందినవాడను, నేను రాజునవుతానని నీవు ఎందుకు చెబుతున్నావు?’ అన్నాడు. సౌలు తాను గొప్పవాడినని, ప్రముఖమైనవాడినని తలంచలేదు కాబట్టే యెహోవా ఆయనను ఇష్టపడ్డాడు. అందుకే ఆయన అతనిని రాజుగా ఎంపిక చేసుకున్నాడు.

అయితే సౌలు పేదవాడూ లేదా తక్కువవాడూ కాదు. ఆయన సంపన్నమైన కుటుంబం నుండి వచ్చాడు, ఎంతో అందంగా పొడుగ్గా ఉండేవాడు. ఇశ్రాయేలులోని ప్రజలందరికంటే ఆయన ఒక అడుగు ఎత్తుగా ఉండేవాడు! సౌలు చాలా వేగంగా పరుగెత్తగలిగేవాడు, ఆయన ఎంతో బలమైన మనిషి కూడా. యెహోవా సౌలును రాజుగా ఎంపిక చేసుకొన్నందుకు ప్రజలు కూడా చాలా సంతోషించారు. వాళ్ళంతా ‘రాజు చిరంజీవియగును గాక!’ అని కేకలు వేశారు.

ఇశ్రాయేలీయుల శత్రువులు మునుపెన్నటికంటే బలంగా తయారయ్యారు. వాళ్ళు ఇశ్రాయేలీయులను ఎంతో బాధపెట్టేవారు. సౌలు రాజైన వెంటనే, అమ్మోనీయులు వాళ్ళపై యుద్ధానికి వచ్చారు. అయితే సౌలు పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని, అమ్మోనీయులపై విజయం సాధించాడు. ఆ కారణంగా సౌలు రాజైనందుకు ప్రజలు సంతోషించారు.

సంవత్సరాలు గడిచే కొలది ఇశ్రాయేలీయులు తమ శత్రువులపై అనేక విజయాలు పొందేలా సౌలు వాళ్ళను నడిపించాడు. సౌలుకు యోనాతాను అనే ధైర్యవంతుడైన కుమారుడు కూడా ఉండేవాడు. యోనాతాను ఇశ్రాయేలీయులు ఎన్నో యుద్ధాల్లో జయించడానికి సహాయపడ్డాడు. ఫిలిష్తీయులు అప్పటికి ఇంకా ఇశ్రాయేలీయులకు బద్ధ శత్రువులుగానే ఉండేవారు. ఒకరోజు వేలకువేలుగా ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చారు.

సమూయేలు తాను వచ్చి యెహోవాకు బలి అర్పించే వరకు వేచివుండమని సౌలుకు చెప్పాడు. కానీ సమూయేలు రావడం ఆలస్యమయ్యింది. అప్పుడు సౌలు ఫిలిష్తీయులు యుద్ధం ప్రారంభిస్తారేమోనని భయపడి తానే ముందుకు వెళ్ళి బలి అర్పించాడు. కానీ చివరకు సమూయేలు వచ్చి సౌలు అవిధేయత చూపించాడని అన్నాడు. ‘ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి యెహోవా మరొకరిని ఎంపిక చేసుకుంటాడు’ అని సమూయేలు చెప్పాడు.

తర్వాత సౌలు మళ్ళీ అవిధేయత చూపించాడు. అప్పుడు సమూయేలు ఆయనతో, ‘శ్రేష్ఠమైన గొర్రెలను బలిగా ఇవ్వడం కంటే యెహోవాకు విధేయులైయుండటం మంచిది. నీవు యెహోవాకు విధేయత చూపించలేదు కాబట్టి యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా ఉంచడు’ అని చెప్పాడు.

మనం దీనినుండి ఒక మంచి పాఠం నేర్చుకోవచ్చు. ఎల్లప్పుడూ యెహోవాకు విధేయత చూపించడం ఎంత ప్రాముఖ్యమో ఇది చూపిస్తోంది. అంతేకాకుండా సౌలులాంటి మంచి వ్యక్తులు కూడా మారి చెడ్డవాళ్ళు కావచ్చని అది చూపిస్తోంది. మనమెన్నటికి చెడ్డవాళ్ళం కావాలనుకోము, అనుకుంటామా?