కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

81వ కథ

దేవుని సహాయంపై నమ్మకం ఉంచడం

దేవుని సహాయంపై నమ్మకం ఉంచడం

వేలాదిమంది బబులోను నుండి యెరూషలేముకు సుదూర ప్రయాణం చేశారు. అయితే వాళ్ళు చేరుకునేసరికి యెరూషలేము పాడైన స్థలంగా మాత్రమే ఉంది. మనుష్యులెవరూ అక్కడ నివసించడంలేదు. ఇశ్రాయేలీయులు మొత్తం అంతటిని తిరిగి నిర్మించాల్సి వచ్చింది.

వాళ్ళు నిర్మించిన మొదటి వాటిలో బలిపీఠం ఒకటి. అది వాళ్ళు యెహోవాకు జంతు బలులను, అర్పణలను అర్పించే స్థలం. కొన్ని నెలల తర్వాత ఇశ్రాయేలీయులు ఆలయాన్ని కట్టడం ప్రారంభించారు. అయితే చుట్టుప్రక్కల దేశాల్లో నివసించే వాళ్ళ శత్రువులకు మాత్రం ఇశ్రాయేలీయులు ఆలయాన్ని నిర్మించడం ఇష్టంలేదు. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలీయులు ఆ పనిని ఆపేలా వాళ్ళను భయపెట్టడానికి ప్రయత్నించారు. చివరకు, ఆ శత్రువులు పారసీక దేశానికి చెందిన ఒక క్రొత్త రాజు ద్వారా ఆ నిర్మాణపు పనిని ఆపుచేయమనే శాసనాన్ని తయారు చేయించారు.

సంవత్సరాలు గడిచిపోయాయి. ఇశ్రాయేలీయులు బబులోనునుండి తిరిగివచ్చి అప్పటికి 17 సంవత్సరాలు గడిచాయి. ఆలయ పనిని తిరిగి ప్రారంభించమని ప్రజలకు చెప్పేందుకు యెహోవా తన ప్రవక్తలైన హగ్గయిని, జెకర్యాను పంపించాడు. ప్రజలు యెహోవా సహాయం చేస్తాడని నమ్మకముంచి, ప్రవక్తలు చెప్పినట్లు చేశారు. ఆలయాన్ని నిర్మించకూడదని శాసనము చెబుతున్నా వాళ్ళు నిర్మాణ పనిని మళ్ళీ ప్రారంభించారు.

అప్పుడు తత్తెనై అనే ఒక పారసీకుల అధికారి ఇశ్రాయేలీయుల దగ్గరకు వచ్చి ఆలయాన్ని కట్టేందుకు వాళ్ళకు ఏ హక్కు ఉందని అడిగాడు. అందుకు ఇశ్రాయేలీయులు తాము బబులోనులో ఉన్నప్పుడు రాజైన కోరెషు తమతో, ‘మీరు యెరూషలేముకు వెళ్ళి మీ దేవుడైన యెహోవా ఆలయాన్ని నిర్మించండి’ అని చెప్పాడని చెప్పారు.

కోరెషు అప్పటికి చనిపోయాడు, అయితే తత్తెనై బబులోనుకు ఉత్తరం వ్రాసి కోరెషు నిజంగానే అలా చెప్పాడా అని విచారించాడు. ఆ తర్వాత పారసీక దేశపు క్రొత్త రాజు నుండి ఆయనకు ఒక ఉత్తరం వచ్చింది. కోరెషు నిజంగానే అలా చెప్పాడని అది తెలియజేసింది. ఆ ఉత్తరంలో, ‘ఇశ్రాయేలీయులను వాళ్ళ దేవుని ఆలయాన్ని నిర్మించుకోనివ్వు. నువ్వు వాళ్ళకు సహాయం చెయ్యాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను’ అని రాజు వ్రాశాడు. దాదాపు నాలుగు సంవత్సరాలలో ఆలయం పూర్తయ్యింది, అప్పుడు ఇశ్రాయేలీయులు చాలా సంతోషించారు.

ఇంకా చాలా సంవత్సరాలు గడిచాయి. ఆలయం పూర్తి చేయబడి దాదాపు 48 సంవత్సరాలు గడిచాయి. యెరూషలేములోని ప్రజలు పేదవాళ్ళయ్యారు, పట్టణమూ దేవుని ఆలయమూ పాతబడిపోయాయి. బబులోనులోనే ఉన్న ఎజ్రాకు దేవుని ఆలయాన్ని మరమ్మతు చేయాల్సిన అవసరముందని తెలిసింది. కాబట్టి ఆయన ఏమి చేశాడో మీకు తెలుసా?

ఎజ్రా పారసీక దేశపు రాజైన అర్తహషస్తను కలుసుకోవడానికి వెళ్ళాడు. ఆ మంచి రాజు ఎజ్రా యెరూషలేముకు తీసుకెళ్ళడానికి చాలా బహుమానాలు ఇచ్చాడు. ఆ బహుమానాలను యెరూషలేముకు తీసుకెళ్ళడానికి తనకు సహాయం చేయమని ఎజ్రా బబులోనులోవున్న ఇశ్రాయేలీయులను అడిగాడు. దాదాపు 6,000 మంది ప్రజలు తాము సహాయం చేస్తామని చెప్పారు. వాళ్ళు తమతోపాటు చాలా బంగారాన్ని, వెండిని, ఇతర విలువైన వస్తువులను తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది.

మార్గంలో చాలామంది చెడ్డ మనుష్యులున్నారని ఎజ్రా భయపడ్డాడు. ఆ మనుష్యులు వాళ్ళ దగ్గరున్న వెండి, బంగారమును తీసుకొని వాళ్ళను చంపేయవచ్చు. కాబట్టి మీరు చిత్రంలో చూస్తున్నట్లు ఎజ్రా ప్రజలందరిని ఒకచోటకు రమ్మని కోరాడు. అప్పుడు వాళ్ళు యెరూషలేముకు తిరిగి వెళ్ళేటప్పుడు తమ సుదూర ప్రయాణంలో తమను కాపాడమని యెహోవాకు ప్రార్థించారు.

యెహోవా వాళ్ళను కాపాడాడు. నాలుగు నెలలు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు సురక్షితంగా యెరూషలేముకు చేరుకున్నారు. యెహోవాపై నమ్మకముంచే వారిని ఆయన కాపాడగలడని అది చూపించడం లేదా?

ఎజ్రా 2 నుండి 8 అధ్యాయాలు.