కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

78వ కథ

గోడమీద చేతివ్రాత

గోడమీద చేతివ్రాత

ఇక్కడ ఏమి జరుగుతోంది? ఇక్కడున్న ప్రజలు గొప్ప విందు చేసుకుంటున్నారు. బబులోను రాజు ప్రముఖులైన వెయ్యిమంది అతిథులను ఆహ్వానించాడు. వాళ్ళు యెరూషలేములోని యెహోవా ఆలయంనుండి తీసుకోబడిన బంగారు, వెండి పాత్రలను ఉపయోగిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా ఒక చెయ్యి ప్రత్యక్షమై గోడమీద వ్రాయటం మొదలు పెట్టింది. అందరూ భయకంపితులయ్యారు.

అలా జరిగినప్పుడు నెబుకద్నెజరు మనుమడైన బెల్షస్సరు రాజుగా ఉన్నాడు. ఆయన జ్ఞానులందరిని పిలిపించమని ఆజ్ఞాపించాడు. ‘ఈ వ్రాతను చదివి దీని భావమేమిటో నాకు చెప్పే వ్యక్తికి అనేక బహుమానాలు ఇచ్చి, అతనిని రాజ్యములో మూడవ అధిపతిగా చేస్తాను’ అని రాజు చెప్పాడు. అయితే జ్ఞానులలో ఎవరూ దానిని చదవలేకపోయారు, దాని భావం చెప్పలేకపోయారు.

రాజు తల్లి ఈ శబ్దము విని పెద్ద భోజనశాలలోకి వచ్చింది. ఆమె రాజుతో ‘ధైర్యంగా ఉండు. పరిశుద్ధ దేవుళ్ళ గురించి తెలిసిన వ్యక్తి ఒకతను నీ రాజ్యంలో ఉన్నాడు. మీ తాతగారైన నెబుకద్నెజరు రాజుగా ఉన్న కాలంలో ఆయనను జ్ఞానులందరికి అధిపతిగా నియమించాడు. ఆయన పేరు దానియేలు. ఆయనను పిలిపించు, ఆయన దీని భావమంతటిని నీకు తెలియజేస్తాడు’ అని చెప్పింది.

వెంటనే దానియేలు పిలిపించబడ్డాడు. ఆయన రాజు ఇస్తానన్న బహుమానాలు తనకు వద్దని చెప్పిన తర్వాత, బెల్షస్సరు తాతగారైన నెబుకద్నెజరును రాజుగా ఉండకుండా యెహోవా ఎందుకు తీసివేశాడో తెలియజేశాడు. ‘అతను ఎంతో గర్విష్ఠుడిగా ఉండేవాడు కాబట్టి యెహోవా అతనిని శిక్షించాడు’ అని దానియేలు చెప్పాడు.

ఆ తర్వాత దానియేలు బెల్షస్సరుతో ‘అతనికి ఏమి జరిగిందో నీకు తెలిసినా, నీవు కూడా నెబుకద్నెజరులాగే గర్విష్ఠుడిగా తయారయ్యావు. నీవు యెహోవా ఆలయం నుండి పాత్రలను తెప్పించి వాటిని ఉపయోగించావు. నీవు కర్రతోను రాతితోను చేయబడిన దేవుళ్ళను స్తుతించావుగాని, మన గొప్ప సృష్టికర్తను ఘనపరచలేదు. అందుకే దేవుడు ఈ మాటలను వ్రాయడానికి చెయ్యిని పంపించాడు.

‘అక్కడ మెనే, మెనే, టెకేల్‌, ఉఫార్సీన్‌ అని వ్రాయబడి ఉంది’ అని దానియేలు చెప్పాడు.

మెనే అంటే దేవుడు నీ రాజ్యం పరిపాలించే రోజులను లెక్కించి వాటిని ముగింపుకు తెచ్చాడు. టెకేల్‌ అంటే ఆయన నిన్ను త్రాసులో తూచినప్పుడు నీవు తక్కువగా కనబడ్డావు. ఉఫార్సీన్‌ అంటే నీ రాజ్యం మాదీయులకు పారసీకులకు ఇవ్వబడిందని అర్థం’ అని దానియేలు వివరించాడు.

దానియేలు ఇంకా మాట్లాడుతుండగానే, మాదీయులు, పారసీకులు బబులోనును ముట్టడించడం ప్రారంభించారు. వాళ్ళు పట్టణాన్ని ముట్టడిచేసి బెల్షస్సరును చంపారు. గోడమీద వ్రాయబడిన వ్రాత ఆ రాత్రే నిజమయ్యింది! అయితే ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు ఏమి జరిగింది? దాని గురించి మనం త్వరలోనే తెలుసుకుంటాం, అయితే ముందుగా దానియేలుకు ఏమి జరిగిందో మనం చూద్దాం.