కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

98వ కథ

ఒలీవ కొండమీద

ఒలీవ కొండమీద

యేసు ఒలీవ కొండమీద కూర్చొని ఉన్నాడు. ఆయనతోపాటు ఉన్న ఆ నలుగురు వ్యక్తులు ఆయన అపొస్తలులు. వాళ్ళలో అంద్రెయ, పేతురు సహోదరులు, యాకోబు, యోహాను కూడా సహోదరులే. అక్కడ దూరంలో కనిపిస్తున్నది యెరూషలేములోని దేవాలయం.

యేసు గాడిద పిల్లపై కూర్చొని యెరూషలేములోకి వెళ్ళి అప్పటికి రెండు రోజులయ్యింది. అది మంగళవారం. ఆ రోజు ఉదయాన్నే యేసు దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ యాజకులు ఆయనను పట్టుకొని చంపాలని ప్రయత్నించారు. కానీ ప్రజలకు యేసు అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు అలా చేయడానికి భయపడ్డారు.

యేసు ఆ మతనాయకులను ‘సర్పములారా, సర్ప సంతానమా!’ అని పిలిచాడు. వాళ్ళు చేసిన చెడు క్రియలన్నిటినిబట్టి దేవుడు వాళ్ళను శిక్షిస్తాడని యేసు చెప్పాడు. ఆ తర్వాత యేసు ఒలీవ కొండమీదకు వచ్చినప్పుడు ఆ నలుగురు అపొస్తలులు ఆయనను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. వాళ్ళు యేసును ఏమి అడిగారో మీకు తెలుసా?

ఆ అపొస్తలులు భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి అడిగారు. యేసు భూమిపై ఉన్న దుష్టత్వాన్ని అంతటిని నాశనం చేస్తాడని వాళ్ళకు తెలుసు. అయితే అది ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవాలని వాళ్ళు అనుకున్నారు. యేసు రాజుగా పరిపాలించడానికి మళ్ళీ ఎప్పుడు వస్తాడు?

తాను మళ్ళీ వచ్చినప్పుడు భూమిపైనున్న తన అనుచరులు తనను చూడలేరని యేసుకు తెలుసు. ఎందుకంటే ఆయన పరలోకంలో ఉంటాడు, అక్కడున్న తనను వాళ్ళు చూడలేరు. కాబట్టి యేసు తాను పరలోకంలో రాజుగా పరిపాలించేటప్పుడు భూమ్మీద జరిగే కొన్ని విషయాల గురించి తన అపొస్తలులకు చెప్పాడు. వాటిలో కొన్ని విషయాలు ఏమిటి?

గొప్ప యుద్ధాలు జరుగుతాయని, చాలామంది ప్రజలు వ్యాధిగ్రస్తులై ఆకలితో అలమటిస్తారని, నేరం అధికంగా ఉంటుందని, గొప్ప భూకంపాలు సంభవిస్తాయని యేసు చెప్పాడు. అంతేగాక దేవుని రాజ్య సువార్త భూమి అంతటా ప్రకటించబడుతుందని కూడా యేసు చెప్పాడు. ఈ సంగతులు మన కాలంలో జరుగుతున్నట్లు మనం చూశామా? అవును చూశాము! కాబట్టి ఇప్పుడు యేసు పరలోకంలో పరిపాలిస్తున్నాడని మనం నిశ్చయంగా చెప్పవచ్చు. త్వరలోనే ఆయన భూమ్మీద ఉన్న దుష్టత్వాన్ని అంతటినీ అంతం చేస్తాడు.