కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

86వ కథ

నక్షత్రం ద్వారా నడిపించబడిన మనుష్యులు

నక్షత్రం ద్వారా నడిపించబడిన మనుష్యులు

ఈ మనుష్యులలో ఒకరు వేలుపెట్టి చూపిస్తున్న ఆ ప్రకాశవంతమైన నక్షత్రం మీకు కనిపించిందా? వాళ్ళు యెరూషలేము నుండి బయలుదేరినప్పుడు ఆ నక్షత్రం కనిపించింది. తూర్పునుండి వచ్చిన ఈ మనుష్యులు నక్షత్రాలను అధ్యయనం చేసేవారు. ఈ క్రొత్త నక్షత్రం వాళ్ళను ఒక ప్రముఖ వ్యక్తి దగ్గరకు నడిపిస్తుందని వాళ్ళు నమ్మారు.

ఆ మనుష్యులు యెరూషలేముకు వచ్చినప్పుడు, ‘యూదులకు రాజు కాబోయే శిశువు ఎక్కడ?’ అని అడిగారు. “యూదులు” అన్నది ఇశ్రాయేలీయులకు మరో పేరు. ‘మేము తూర్పున ఉన్నప్పుడు ఆ శిశువు నక్షత్రం మాకు కనిపించింది, మేము ఆయనను ఆరాధించడానికి వచ్చాము’ అని వాళ్ళు అన్నారు.

యెరూషలేముకు రాజుగా ఉన్న హేరోదుకు ఆ విషయం తెలిసినప్పుడు ఆయన కలవరపడ్డాడు. తన స్థానాన్ని మరో రాజు తీసుకోవడం ఆయనకు ఇష్టంలేదు. అప్పుడు హేరోదు ప్రధాన యాజకులను పిలిపించి, ‘వాగ్దానం చేయబడిన రాజు ఎక్కడ పుడతాడు?’ అని అడిగాడు. ‘బేత్లెహేములో పుడతాడు అని బైబిలు చెబుతోంది’ అని వాళ్ళు సమాధానమిచ్చారు.

అప్పుడు హేరోదు తూర్పునుండి వచ్చిన మనుష్యులతో, ‘మీరు వెళ్ళి ఆ శిశువు కోసం వెతకండి. ఆయన కనిపిస్తే నాకు తెలియజేయండి. నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నాడు. అయితే, నిజానికి హేరోదు ఆ శిశువును వెతికి పట్టుకొని ఆయనను చంపాలనుకున్నాడు!

అప్పుడు ఆ నక్షత్రం ఆ మనుష్యులను బేత్లెహేముకు నడిపించి, ఆ శిశువు ఉన్నచోట వచ్చి ఆగింది. ఆ మనుష్యులు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ మరియతోపాటు శిశువైన యేసు కనిపించాడు. వాళ్ళు కానుకలు తెచ్చి యేసుకు ఇచ్చారు. అయితే తర్వాత యెహోవా ఆ మనుష్యులను తిరిగి హేరోదు దగ్గరకు వెళ్ళవద్దని స్వప్నంలో హెచ్చరించాడు. కాబట్టి వాళ్ళు మరో మార్గాన తమ స్వదేశానికి వెళ్ళిపోయారు.

తూర్పునుండి వచ్చిన మనుష్యులు తమ స్వదేశానికి వెళ్ళిపోయారని తెలుసుకున్నప్పుడు హేరోదుకు కోపం వచ్చింది. కాబట్టి అతను బేత్లెహేములో రెండు సంవత్సరాల వయసుగల పిల్లలను అంతకంటే చిన్న పిల్లలను చంపేయమని ఆజ్ఞాపించాడు. అయితే యెహోవా ముందుగానే యోసేపుకు ఈ విషయం గురించి స్వప్నంలో హెచ్చరించాడు కాబట్టి యోసేపు తన కుటుంబంతో ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హేరోదు చనిపోయాడని తెలిసినప్పుడు యోసేపు మరియను యేసును తీసుకొని నజరేతుకు వచ్చాడు. యేసు అక్కడే పెరిగాడు.

ఆ క్రొత్త నక్షత్రం ప్రకాశించేలా చేసింది ఎవరని మీరనుకుంటున్నారు? ఆ మనుష్యులు నక్షత్రాన్ని చూసిన వెంటనే మొదట యెరూషలేముకు వెళ్ళారనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. అపవాదియైన సాతాను దేవుని కుమారుణ్ణి చంపాలనుకున్నాడు. యెరూషలేములోని హేరోదు రాజు యేసును చంపడానికి ప్రయత్నిస్తాడని అతనికి తెలుసు. కాబట్టి ఈ నక్షత్రాన్ని ప్రకాశించేలా చేసింది సాతానే అయ్యుండాలి.