87వ కథ
దేవాలయంలో బాల యేసు
ఈ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్న బాలుణ్ణి చూడండి. వాళ్ళు యెరూషలేములోని దేవాలయంలో బోధకులు. ఆ బాలుడు యేసు. ఆయన కొంచెం పెద్దవాడయ్యాడు. అప్పుడు ఆయనకు 12 సంవత్సరాల వయస్సు.
యేసుకు దేవుని గురించి, బైబిలులో వ్రాయబడిన విషయాల గురించి ఎంతో తెలిసివుండడాన్ని చూసి ఆ బోధకులు ఆశ్చర్యపోయారు. కానీ అక్కడ యోసేపు, మరియలు ఎందుకు లేరు? వాళ్ళెక్కడ ఉన్నారు? చూద్దాం.
యోసేపు ప్రతి సంవత్సరం పస్కా అనబడే ప్రత్యేక ఆచరణకు తన కుటుంబాన్ని యెరూషలేముకు తీసుకొచ్చేవాడు. నజరేతునుండి యెరూషలేము రావడానికి దూరప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆ కాలంలో ఎవ్వరి దగ్గరా కారు ఉండేది కాదు, రైళ్ళు కూడా ఉండేవి కావు. చాలామంది ఎక్కడికైనా నడిచే వెళ్ళేవారు. యెరూషలేముకు చేరడానికి దాదాపు మూడురోజులు పట్టేది.
యోసేపు కుటుంబం పెరిగి పెద్దదయ్యింది. కాబట్టి వాళ్ళు యేసు తమ్ముళ్ళను చెల్లెళ్ళను కూడా చూసుకోవాలి. ఒక సంవత్సరం యోసేపు మరియలు తమ పిల్లలతోపాటు యెరూషలేమునుండి ఇంటికి వెళ్ళడానికి అంటే నజరేతుకు వెళ్ళడానికి దూరప్రయాణం ఆరంభించారు. యేసు కూడా ప్రయాణం చేస్తున్న ఇతరులతోపాటు ఉన్నాడని వాళ్ళనుకున్నారు. కానీ వాళ్ళు ఒక రోజు ప్రయాణం చేసిన తర్వాత చూస్తే యేసు కనపడలేదు. వాళ్ళు యేసు కోసం తమ బంధువుల మధ్య స్నేహితుల మధ్య వెదికారు, కానీ ఆయన వాళ్ళతో లేడు! కాబట్టి వాళ్ళు యేసును వెదకడానికి మళ్ళీ యెరూషలేముకు వచ్చారు.
చివరకు వాళ్ళకు యేసు బోధకుల దగ్గర కనిపించాడు. ఆయన వాళ్ళ మాటలు వింటూ, వాళ్ళను ప్రశ్నలు అడుగుతూ కనిపించాడు. యేసు జ్ఞానాన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అయితే మరియ ఆయనతో, ‘కుమారుడా, నువ్వు ఎందుకు ఇలా చేశావు? మీ నాన్న, నేను నీ కోసం వెదకుతూ ఎంతో కంగారుపడ్డాము’ అని అన్నది.
అయితే యేసు, ‘మీరు నా కోసం ఎందుకు వెదికారు? నేను నా తండ్రి ఇంటిలో ఉండాలని మీకు తెలియదా?’ అని అడిగాడు.
అవును, యేసు దేవుని గురించి ఎక్కడ నేర్చుకోగలడో అక్కడే ఉండడానికి ఇష్టపడేవాడు. మనం కూడా అలానే ఉండాలి కదా? నజరేతులో యేసు ప్రతివారం ఆరాధన కూటాలకు వెళ్ళేవాడు. ఆయన ఎప్పుడూ శ్రద్ధగా వినేవాడు కాబట్టి బైబిల్లోని అనేక విషయాలను ఆయన నేర్చుకున్నాడు. మనం కూడా యేసులాగే ఉండి ఆయన మాదిరిని అనుసరిద్దాం.