కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

97వ కథ

యేసు రాజుగా రావడం

యేసు రాజుగా రావడం

ఇద్దరు గ్రుడ్డివాళ్ళను బాగు చేసిన తర్వాత యేసు యెరూషలేముకు దగ్గర్లోవున్న ఒక చిన్న గ్రామానికి వచ్చాడు. ఆయన తన శిష్యులలో ఇద్దరితో, ‘మీరు ఊరిలోకి వెళ్ళండి, అక్కడ కట్టబడివున్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. దాని కట్లు విప్పి దానిని నా దగ్గరకు తోలుకొని రండి’ అని చెప్పాడు.

శిష్యులు ఆ గాడిద పిల్లను యేసు దగ్గరకు తోలుకొని వచ్చినప్పుడు ఆయన దానిపై కూర్చొని కొంత దూరంలోవున్న యెరూషలేముకు వెళ్ళాడు. ఆయన పట్టణం దగ్గరకు చేరుకోగానే పెద్ద ప్రజల గుంపు ఆయనను కలుసుకోవడానికి వచ్చింది. వాళ్ళలో చాలామంది తమ పైవస్త్రాలను విప్పి దారిలో పరిచారు. మరికొందరు ఖర్జూరపు మట్టలు నరికి, వాటిని కూడా దారిలో పరిచి, ‘యెహోవా పేరట వచ్చు రాజు స్తుతింపబడు గాక!’ అని కేకలు వేశారు.

పూర్వకాలంలో ఇశ్రాయేలులో క్రొత్తగా వచ్చిన రాజులు తమను తాము ప్రజలకు చూపించుకోవడానికి గాడిద పిల్లపై ఎక్కి యెరూషలేములోకి వచ్చేవారు. యేసుక్రీస్తు కూడా అలాగే చేశాడు. ప్రజలేమో యేసు తమకు రాజుగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చూపిస్తున్నారు. కానీ అందరూ ఆయనను ఇష్టపడలేదు. యేసు దేవాలయానికి వెళ్ళినప్పుడు జరిగినదానినిబట్టి మనం ఆ విషయం అర్థం చేసుకోవచ్చు.

దేవాలయం దగ్గర యేసు గ్రుడ్డివాళ్ళను అంగవిహీనులను స్వస్థపరిచాడు. చిన్నపిల్లలు యేసు అలా చేయడాన్ని చూసినప్పుడు వాళ్ళు కూడా ఆయనను స్తుతించారు. కానీ అది యాజకులకు కోపం తెప్పించింది, వాళ్ళు యేసుతో ‘చిన్నపిల్లలు ఏమంటున్నారో నువ్వు వింటున్నావా?’ అన్నారు.

అందుకు యేసు ‘వింటున్నాను’ అని సమాధానమిచ్చి, ‘“బాలుర నోటనుండి స్తోత్రం సిద్ధింపజేస్తాను” అని బైబిలులో వ్రాయబడిన దానిని మీరు ఎప్పుడూ చదవలేదా?’ అని అడిగాడు. కాబట్టి ఆ పిల్లలు దేవుని రాజును స్తుతించడంలో కొనసాగారు.

మనం కూడా ఆ పిల్లలవలే ఉండడానికి ఇష్టపడతాం, ఇష్టపడమా? మనం దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడకుండా ఆపుచేయాలని కొందరు ప్రయత్నించవచ్చు. కానీ మనం యేసు ప్రజల కోసం చేయబోయే అద్భుతమైన విషయాల గురించి ఇతరులకు చెబుతూనే ఉండాలి.

యేసు భూమిపై ఉన్నప్పుడు తాను రాజుగా పరిపాలనను ప్రారంభించవలసిన సమయం ఇంకా రాలేదు. ఆ సమయం ఎప్పుడు వస్తుంది? యేసు శిష్యులు దాని గురించి తెలుసుకోవాలని కోరుకున్నారు. దాని గురించి మనం తర్వాతి కథలో చదువుతాం.