99వ కథ
మేడ గదిలో
రెండు రోజులు గడిచాయి, అది గురువారం రాత్రి. యేసు, ఆయన 12 మంది అపొస్తలులు పస్కా భోజనం తినడానికి ఈ పెద్ద మేడగదికి వచ్చారు. గదినుండి బయటకు వెళ్తున్న వ్యక్తి యూదా ఇస్కరియోతు. యేసును ఎలా పట్టుకోవాలో యాజకులకు చెప్పడానికి అతను వెళ్తున్నాడు.
అంతకు ముందు రోజే యూదా యాజకుల దగ్గరకు వెళ్ళి ‘యేసును పట్టుకోవడానికి నేను మీకు సహాయం చేస్తే మీరు నాకేమిస్తారు?’ అని అడిగాడు. వాళ్ళు ‘30 వెండి నాణెములు ఇస్తాము’ అని చెప్పారు. అందుకే ఆ మనుష్యులను కలుసుకొని వాళ్ళను యేసు దగ్గరకు తీసుకురావడానికి యూదా వెళ్తున్నాడు. అది ఘోరమైన పని కదా?
పస్కా భోజనం ముగిసిన తర్వాత యేసు మరో ప్రత్యేక భోజనాన్ని ప్రారంభించాడు. ఆయన తన అపొస్తలుల చేతికి ఒక రొట్టె ఇచ్చి ‘దీనిని తినండి, ఇది మీ కోసం ఇవ్వబడే నా శరీరాన్ని సూచిస్తుంది’ అని చెప్పాడు. తర్వాత ఆయన వాళ్ళకు ఒక పాత్రతో ద్రాక్షారసం ఇచ్చి ‘దీనిలోనిది త్రాగండి, ఇది మీ కోసం చిందింపబడే నా రక్తాన్ని సూచిస్తుంది’ అని చెప్పాడు. బైబిలు దీనిని ‘ప్రభువు రాత్రి భోజనం’ అని ‘ప్రభువు భోజనం’ అని పిలుస్తుంది.
ఐగుప్తులో ఉన్నప్పుడు దేవదూత తమ ఇళ్ళను దాటివెళ్ళి కేవలం ఐగుప్తీయుల ఇళ్ళలోని పెద్ద కుమారులను చంపిన సంఘటనకు గుర్తుగా ఇశ్రాయేలీయులు పస్కాను తినేవారు. అయితే ఇప్పుడు యేసు తన అనుచరులు తనను, తాను వాళ్ళ కోసం తన జీవితాన్ని ఎలా ఇచ్చాడనే విషయాన్ని గుర్తుచేసుకోవాలని ఆశించాడు. అందుకే ఈ ప్రత్యేక భోజనాన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం ఆచరించాలని ఆయన వాళ్ళతో చెప్పాడు.
ప్రభువు రాత్రి భోజనం చేసిన తర్వాత, యేసు తన అపొస్తలులకు ధైర్యంగా ఉండమని, విశ్వాసంలో స్థిరంగా ఉండమని చెప్పాడు. చివరిగా వాళ్ళు దేవునికి కీర్తనలు పాడి అక్కడ నుండి వెళ్ళిపోయారు. అప్పటికి బాగా రాత్రి అయ్యింది, బహుశా మధ్యరాత్రి దాటి ఉంటుంది. వాళ్ళు ఎక్కడకు వెళ్ళారో మనం చూద్దాం.