కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

101వ కథ

యేసు చంపబడడం

యేసు చంపబడడం

ఇక్కడ జరుగుతున్న ఘోరాన్ని చూడండి! యేసు చంపబడుతున్నాడు. వాళ్ళు ఆయనను మ్రానుపై ఉంచారు. ఆయన చేతుల్లోకి, కాళ్ళలోకి మేకులు దిగగొట్టారు. ఎవరైనా, యేసును చంపాలని ఎందుకు అనుకున్నారు?

ఎందుకంటే కొంతమంది వ్యక్తులు యేసును ద్వేషించారు. వాళ్లెవరో మీకు తెలుసా? వాళ్ళల్లో ఒకడు దుష్ట దూతయైన అపవాదియగు సాతాను. ఆదాము హవ్వలు యెహోవాకు అవిధేయులయ్యేలా చేసింది అతడే. యేసు శత్రువులు ఈ ఘోరమైన పని చేసేలా పురికొల్పింది సాతానే.

యేసును ఈ మ్రానుపై వ్రేలాడదీయక ముందు కూడా ఆయన శత్రువులు ఆయనపట్ల నీచంగా ప్రవర్తించారు. వాళ్ళు గెత్సేమనే తోటకు వచ్చి ఆయనను ఎలా పట్టుకుపోయారో గుర్తుందా? ఆ శత్రువులు ఎవరు? అవును, వాళ్ళు మత నాయకులు. సరే, తర్వాత ఏమి జరిగిందో మనం చూద్దాం.

యేసును ఆ మతనాయకులు పట్టుకొని వెళ్తున్నప్పుడు, ఆయన అపొస్తలులు పారిపోయారు. వాళ్ళు భయపడ్డారు కాబట్టి యేసును ఒంటరిగా ఆయన శత్రువులతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే పేతురు, యోహాను మాత్రం ఎంతో దూరం వెళ్ళలేదు. యేసుకు ఏమి జరుగుతుందో చూడడానికి వాళ్ళు ఆయనను వెంబడించారు.

యాజకులు యేసును అంతకుముందు ప్రధాన యాజకునిగా ఉన్న అన్న దగ్గరకు తీసుకొని వెళ్ళారు. జనసమూహం అక్కడ ఎక్కువసేపు ఉండలేదు. ఆ తర్వాత వాళ్ళు యేసును ప్రధాన యాజకునిగా ఉన్న కయప దగ్గరకు తీసుకొని వెళ్ళారు. ఆయన ఇంటిదగ్గర చాలామంది మతనాయకులు సమకూడారు.

కయప ఇంటి దగ్గర వాళ్ళు విచారణ జరిపించారు. యేసు గురించి అబద్ధాలు చెప్పడానికి ప్రజలు తెప్పించబడ్డారు. మతనాయకులంతా, ‘యేసును చంపాలి’ అన్నారు. వాళ్ళు ఆయన ముఖంపై ఉమ్మివేసి, పిడికిళ్ళతో ఆయనను గుద్దారు.

అదంతా జరుగుతున్నప్పుడు, పేతురు ఆ ఇంటి ఆవరణలో ఉన్నాడు. ఆ రాత్రి చల్లగా ఉండడంవల్ల ప్రజలు చలిమంట వేసుకున్నారు. వాళ్ళు ఆ మంట చుట్టూ కూర్చొని చలి కాచుకుంటున్నప్పుడు దాసురాలైన ఒక బాలిక పేతురు వైపు చూసి ‘ఈ వ్యక్తి యేసుతోపాటు ఉండేవాడు’ అని చెప్పింది.

అందుకు పేతురు ‘లేదు, నేనుండలేదు!’ అని సమాధానమిచ్చాడు.

పేతురు యేసుతో ఉండేవాడని ప్రజలు మూడుసార్లు అన్నారు. కానీ ప్రతిసారీ పేతురు అది అబద్ధమని చెప్పాడు. మూడవసారి పేతురు అలా చెప్పినప్పుడు, యేసు తిరిగి పేతురువైపు చూశాడు. అలా అబద్ధాలు చెప్పినందుకు పేతురు ఎంతో బాధపడి, ప్రక్కకు వెళ్ళి ఏడ్చాడు.

శుక్రవారం ఉదయాన్నే ప్రొద్దు పొడుస్తుండగా, యాజకులు యేసును తమ సమావేశ స్థలమైన అధికార మందిరం దగ్గరకు తీసుకొని వెళ్ళారు. అక్కడ వాళ్ళు యేసును ఏమి చేయాలనే విషయం గురించి మాట్లాడుకున్నారు. తర్వాత వాళ్ళు ఆయనను యూదయ జిల్లా పాలకుడైన పొంతి పిలాతు దగ్గరకు తీసుకొని వెళ్ళారు.

ఆ యాజకులు పిలాతుతో ‘ఈ మనిషి చెడ్డవాడు’ ‘ఈయనను చంపెయ్యాలి’ అని చెప్పారు. పిలాతు యేసును ప్రశ్నించిన తర్వాత ‘ఈయనలో నాకే దోషము కనబడటం లేదు’ అన్నాడు. తర్వాత పిలాతు యేసును హేరోదు అంతిప దగ్గరకు పంపించాడు. హేరోదు గలిలయ పాలకుడు, అయితే ఆ సమయంలో ఆయన యెరూషలేములో ఉన్నాడు. హేరోదుకు కూడా యేసులో ఏ దోషమూ కనిపించలేదు, కాబట్టి ఆయన యేసును మళ్ళీ పిలాతు దగ్గరకు పంపేశాడు.

పిలాతు యేసును విడిచి పెట్టాలని అనుకున్నాడు. అయితే యేసు శత్రువులు యేసుకు బదులు మరో ఖైదీని విడిచిపెట్టమని అడిగారు. వాళ్ళు అలా విడిచిపెట్టమని అడిగిన వ్యక్తి బందిపోటు దొంగయైన బరబ్బ. పిలాతు యేసును బయటకు తెచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. ఆయన ప్రజలతో ‘ఇదిగో! మీ రాజును చూడండి!’ అన్నాడు. కానీ ప్రధాన యాజకులు, ‘అతనిని తీసుకొని వెళ్ళండి! అతనిని చంపండి! అతనిని చంపండి!’ అని అరిచారు. కాబట్టి పిలాతు బరబ్బను విడిచిపెట్టాడు, వాళ్ళు యేసును చంపడానికి తీసుకొని వెళ్ళారు.

శుక్రవారం మధ్యాహ్న సమయంలో వాళ్ళు యేసును మ్రానుకు మేకులతో కొట్టి వ్రేలాడదీశారు. అయితే యేసుకు ఇరువైపులా ఇద్దరు నేరస్థులు కూడా మ్రానులపై వ్రేలాడదీయబడ్డారు. కానీ వాళ్ళు చిత్రంలో మీకు కనిపించరు. యేసు చనిపోవడానికి కొంచెం ముందుగా ఆ నేరస్థులలో ఒకడు, ‘నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో’ అని అన్నాడు. అప్పుడు యేసు ‘నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని నిశ్చయంగా చెబుతున్నాను’ అని సమాధానమిచ్చాడు.

అది అద్భుతమైన వాగ్దానం కాదా? యేసు ఏ పరదైసు గురించి మాట్లాడుతున్నాడో మీకు తెలుసా? దేవుడు మొదట చేసిన పరదైసు ఎక్కడ ఉంది? అవును, భూమ్మీదనే. యేసు పరలోకంలో రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు భూమిపై ఉండే క్రొత్త పరదైసులో జీవితం అనుభవించేందుకు ఆ వ్యక్తిని తిరిగి జీవానికి తెస్తాడు. అది మనకు సంతోషం కలిగించడం లేదా?