కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

109వ కథ

పేతురు కొర్నేలిని దర్శించడం

పేతురు కొర్నేలిని దర్శించడం

అక్కడ నిలబడి ఉన్న వ్యక్తి అపొస్తలుడైన పేతురు, ఆయన వెనుక ఉన్నవాళ్ళు ఆయన స్నేహితులు. అయితే ఆ వ్యక్తి పేతురుకు ఎందుకు మ్రొక్కుతున్నాడు? ఆయన అలా చేయవచ్చా? ఆయన ఎవరో మీకు తెలుసా?

ఆ వ్యక్తి కొర్నేలి. ఆయన రోమా సైన్యాధికారి. కొర్నేలికి పేతురు తెలియదు, అయినా పేతురును ఆహ్వానించమని ఆయనకు చెప్పబడింది. ఇదంతా ఎలా జరిగిందో చూద్దాం.

యేసు మొదటి అనుచరులు యూదులు, అయితే కొర్నేలి యూదుడు కాదు. అయినా ఆయన దేవుణ్ణి ప్రేమించాడు, ఆయనకు ప్రార్థించేవాడు, ప్రజలకు ఎన్నో ధర్మకార్యాలు చేసేవాడు. అలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం ఒక దేవదూత ఆయనకు కనిపించి, ‘దేవుడు నిన్ను చూసి సంతోషించాడు, ఆయన నీ ప్రార్థనలకు సమాధానం ఇవ్వబోతున్నాడు. కొంతమంది మనుష్యులను పంపించి పేతురు అనే వ్యక్తిని పిలిపించు. ఆయన యొప్పేలో సముద్రపు ఒడ్డున సీమోను అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాడు’ అని చెప్పాడు.

వెంటనే కొర్నేలి పేతురును తీసుకొని రావడానికి కొంతమంది మనుష్యులను పంపించాడు. మరుసటి రోజు ఆ మనుష్యులు యొప్పేను సమీపించినప్పుడు, పేతురు సీమోను ఇంటి మిద్దెమీద ఉన్నాడు. అక్కడ దేవుడు, పరలోకంనుండి ఒక పెద్ద దుప్పటి దిగివస్తున్నట్లు పేతురు భావించేలా చేశాడు. ఆ దుప్పటిలో అన్ని రకాల జంతువులు కనిపించాయి. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ఆ జంతువులు ఆహారానికి అపవిత్రమైనవి. అయినా, ‘పేతురూ, నువ్వు లేచి వాటిని చంపి తిను’ అని ఒక స్వరం వినిపించింది.

‘లేదు! నేను అపవిత్రమైనవాటిని ఎన్నడూ తినలేదు’ అని పేతురు సమాధానమిచ్చాడు. కానీ ఆ స్వరం పేతురుతో, ‘దేవుడు పవిత్రమని చెబుతున్న వాటిని నువ్వు అపవిత్రమని అనవద్దు’ అని చెప్పింది. ఇలా మూడుసార్లు జరిగింది. దాని భావమేమిటని పేతురు ఆలోచిస్తున్నప్పుడు, కొర్నేలి పంపిన మనుష్యులు ఇంటి దగ్గరకు వచ్చి పేతురు కోసం అడిగారు.

పేతురు క్రిందికి దిగి వచ్చి, ‘మీరు వెదకుతున్న వ్యక్తిని నేనే. మీరు ఎందుకొచ్చారు?’ అని అడిగాడు. ఆ మనుష్యులు, కొర్నేలికి దేవదూత కనిపించి పేతురును ఆహ్వానించమని చెప్పాడని వివరించినప్పుడు పేతురు వాళ్ళతో వెళ్ళడానికి అంగీకరించాడు. మరుసటిరోజు పేతురు, ఆయన స్నేహితులు కొర్నేలిని దర్శించడానికి కైసరయకు బయలుదేరి వెళ్ళారు.

కొర్నేలి తన బంధువులను సన్నిహిత స్నేహితులను తన ఇంటికి పిలిపించాడు. పేతురు రాగానే, కొర్నేలి ఆయనను ఆహ్వానించాడు. మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా, ఆయన వంగి పేతురు పాదాలకు మ్రొక్కాడు. అయితే పేతురు, ‘లేచి నిలబడండి. నేను కూడా మీలాంటి మనిషినే’ అని అన్నాడు. అవును, ఒక మనిషికి మ్రొక్కి, అతనిని ఆరాధించడం తప్పు అని బైబిలు చెబుతోంది. మనం యెహోవాను మాత్రమే ఆరాధించాలి.

తర్వాత పేతురు అక్కడ సమకూడివున్న వారికి ప్రకటించాడు. ‘దేవుణ్ణి సేవించాలనుకొనే వారందరినీ ఆయన అంగీకరిస్తాడని నేను గ్రహించాను’ అని పేతురు చెప్పాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను పంపించాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ వివిధ భాషల్లో మాట్లాడడం ప్రారంభించారు. పేతురుతోపాటు వచ్చిన యూదులైన శిష్యులు దానిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దేవుడు కేవలం యూదులకు అనుగ్రహం చూపిస్తాడని వాళ్ళు అనుకున్నారు. అయితే దేవుడు ఒక జాతి ప్రజలను మరో జాతి ప్రజలకంటే శ్రేష్ఠమైనవారిగా లేదా ముఖ్యమైనవారిగా ఎంచడని అది వాళ్ళకు బోధించింది. అది మనందరం జ్ఞాపకముంచుకోవలసిన విషయం కదా?