కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

111వ కథ

నిద్రపోయిన బాలుడు

నిద్రపోయిన బాలుడు

అయ్యో! ఏమి జరిగింది? నేలమీద పడివున్న ఆ అబ్బాయి బాగా గాయపడ్డాడా? చూడండి! ఆ ఇంట్లోనుంచి బయటకొస్తున్న వ్యక్తులలో పౌలు ఉన్నాడు! అక్కడ తిమోతి కూడా ఉన్నాడు చూశారా? ఆ అబ్బాయి కిటికీలోనుండి పడ్డాడా?

అవును, అదే జరిగింది. ఆ సమయంలో త్రోయలో ఉన్న శిష్యులకు పౌలు ప్రసంగమిస్తున్నాడు. ఆయన మరుసటి రోజు ఓడలో వేరే ప్రాంతానికి వెళ్ళవలసి ఉంది కాబట్టి వాళ్ళను చాలా కాలం వరకు చూడడని ఆయనకు తెలుసు. అందుకే ఆయన మధ్యరాత్రి వరకూ వాళ్ళతో మాట్లాడాడు.

ఐతుకు అనే ఈ అబ్బాయి కిటికీ దగ్గర కూర్చొని నిద్రలోకి జారుకున్నాడు. తర్వాత ఆ అబ్బాయి మూడో అంతస్తులోని కిటికీ నుండి క్రింద పడ్డాడు! అక్కడున్న ప్రజలు ఎందుకు అంత కంగారు పడుతున్నారో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి చూసేసరికి వాళ్ళు అనుకున్నట్లే జరిగింది. ఆ అబ్బాయి చనిపోయాడు!

ఆ అబ్బాయి చనిపోయాడని పౌలు చూసినప్పుడు, ఆయన అతనిమీద పడి కౌగిలించుకున్నాడు. తర్వాత ఆయన ఇతరులతో ‘మీరు తొందరపడవద్దు. అబ్బాయి బాగానే ఉన్నాడు!’ అన్నాడు. వెంటనే ఆ అబ్బాయి నిజంగానే బాగున్నట్లు కనిపించాడు! అదొక అద్భుతం! పౌలు అతన్ని తిరిగి బ్రతికించాడు! ప్రజలందరిలో ఆనందం వెల్లివిరిసింది.

వాళ్ళంతా మళ్ళీ మేడపైకి వెళ్ళి భోజనం చేశారు. పౌలు తెల్లవారే వరకు మాట్లాడుతూ గడిపాడు. అయితే ఐతుకు మళ్లీ నిద్రపోలేదని మీరు నిశ్చయంగా ఉండవచ్చు!ఆ తర్వాత పౌలు, తిమోతి, వాళ్ళతో కూడా ప్రయాణం చేసే ఇతరులు ఓడ ఎక్కారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా?

పౌలు అప్పుడే తన మూడవ ప్రకటన యాత్రను ముగించి, తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఈ యాత్రలో పౌలు కేవలం ఎఫెసు పట్టణంలోనే మూడు సంవత్సరాలు ఉన్నాడు. అంటే అది ఆయన రెండవ యాత్రకంటే కూడా సుదీర్ఘమైనది.

త్రోయ నుండి బయలుదేరిన తరువాత, ఓడ మిలేతులో కొంతసేపు ఆగింది. ఎఫెసు అక్కడికి కేవలం కొద్ది మైళ్ళ దూరంలోనే ఉంది కాబట్టి చివరిసారిగా వారితో మాట్లాడడానికి పౌలు సంఘంలోని పెద్దలను అక్కడికి రమ్మని కోరాడు. తర్వాత ఓడ వెళ్ళిపోతున్నప్పుడు పౌలును విడిచిపెట్టడానికి వాళ్ళు ఎంతో దుఃఖించారు!

చివరకు ఓడ కైసరయకు వచ్చింది. అక్కడ పౌలు శిష్యుడైన ఫిలిప్పీ ఇంటిలో ఉండగా, ప్రవక్త అయిన అగబు పౌలుకు ఒక హెచ్చరిక చేశాడు. పౌలు యెరూషలేముకు వెళ్ళినప్పుడు బంధించబడతాడని అగబు చెప్పాడు. ఖచ్చితంగా అలాగే జరిగింది. పౌలు కైసరయలో రెండు సంవత్సరాలు ఖైదీగా ఉన్న తర్వాత రోమా పాలకుడైన కైసరు ముందు విచారణ కోసం రోమాకు పంపించబడ్డాడు. రోమాకు వెళ్ళే మార్గమధ్యంలో ఏమి జరిగిందో చూద్దాం.