కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

110వ కథ

తిమోతి—పౌలుకు క్రొత్త సహాయకుడు

తిమోతి—పౌలుకు క్రొత్త సహాయకుడు

ఇక్కడ అపొస్తలుడైన పౌలుతోపాటు కనిపిస్తున్న యువకుడి పేరు తిమోతి. తిమోతి తన కుటుంబంతోపాటు లుస్త్రలో నివసించేవాడు. ఆయన తల్లి పేరు యునీకే, అవ్వ పేరు లోయి.

పౌలు లుస్త్రను దర్శించడం అది మూడవసారి. ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువకాలం క్రితం పౌలు, బర్నబా ప్రకటన పర్యటన చేస్తూ మొదటసారిగా లుస్త్రకు వచ్చారు. ఇప్పుడు పౌలు తన స్నేహితుడైన సీలతో మళ్ళీ లుస్త్రకు వచ్చాడు.

పౌలు, తిమోతిని ఏమి అడిగాడో మీకు తెలుసా? ఆయనిలా అడిగాడు: ‘నువ్వు నాతోనూ, సీలతోనూ రావడానికి ఇష్టపడతావా? సుదూర ప్రాంతాలలోని ప్రజలకు ప్రకటించడానికి నువ్వు మాకు సహాయం చేయవచ్చు.’

అందుకు తిమోతి, ‘మీతో రావడం నాకు ఇష్టమే’ అని సమాధానమిచ్చాడు. కాబట్టి వెంటనే తిమోతి తన కుటుంబాన్ని విడిచిపెట్టి పౌలు, సీలలతో వెళ్ళాడు. మనం వాళ్ళ ప్రయాణం గురించి తెలుసుకునే ముందు పౌలుకు అప్పటివరకూ ఏమి జరిగిందో చూద్దాం. దమస్కుకు వెళ్ళే మార్గంలో ఆయనకు యేసు కనిపించి అప్పటికి దాదాపు 17 సంవత్సరాలు గడిచాయి.

యేసు శిష్యులను హింసించడానికి పౌలు దమస్కుకు వచ్చాడని జ్ఞాపకం చేసుకోండి, కానీ ఆ తర్వాత ఆయన కూడా శిష్యుడయ్యాడు! పౌలు యేసు గురించి బోధించడం ఇష్టంలేని కొంతమంది శత్రువులు పౌలును చంపడానికి పథకం వేశారు. అయితే శిష్యులు పౌలు తప్పించుకోవడానికి సహాయం చేశారు. వాళ్ళు ఆయనను ఒక గంపలో ఉంచి, పట్టణపు గోడకు అవతల దింపారు.

ఆ తర్వాత పౌలు అంతియొకయలో ప్రకటించడానికి వెళ్ళాడు. యేసు అనుచరులు క్రైస్తవులని మొట్టమొదట పిలువబడింది అక్కడే. ఆ తర్వాత పౌలు, బర్నబాలు అంతియొకయ నుండి దూరదేశాలలో ప్రకటించడానికి పంపించబడ్డారు. వాళ్ళు దర్శించిన పట్టణాలలో ఒకటి లుస్త్ర, అది తిమోతి స్వంత ఊరు.

ఒక సంవత్సరం తరువాత పౌలు మళ్ళీ తన రెండవ పర్యటనలో లుస్త్రకు వచ్చాడు. పౌలు, సీలల వెంట తిమోతి కూడా వెళ్ళినప్పుడు, వాళ్ళెక్కడకు వెళ్ళారో మీకు తెలుసా? ఇక్కడ ఇవ్వబడిన మ్యాప్‌ను చూడండి, మనం కొన్ని ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

మొదట వాళ్ళు దగ్గరున్న ఈకొనియకు, ఆ తరువాత అంతియొకయ అనే పేరుగల రెండవ పట్టణానికి వెళ్ళారు. తర్వాత వాళ్ళు త్రోయకు, ఆపై ఫిలిప్పీ, థెస్సలొనీక, బెరయలకు వెళ్ళారు. మీకు మ్యాప్‌లో ఏథెన్సు కనిపించిందా? పౌలు అక్కడ ప్రకటించాడు. తర్వాత వాళ్ళు ఒకటిన్నర సంవత్సరాలు కొరింథులో ప్రకటిస్తూ గడిపారు. చివరకు వాళ్ళు ఎఫెసులో కొంతకాలం ఆగారు. తర్వాత వాళ్ళు ఓడలో కైసరయకు వచ్చి పౌలు నివసించే అంతియొకయకు వెళ్ళారు.

కాబట్టి తిమోతి “సువార్తను” ప్రకటించడానికి, అనేక కొత్త క్రైస్తవ సంఘాలను స్థాపించడానికి పౌలుకు సహాయం చేస్తూ వందలకొలది మైళ్ళు ప్రయాణం చేశాడు. మీరు పెద్దవారైనప్పుడు, తిమోతిలాగే దేవునికి నమ్మకమైన దాసులుగా ఉంటారా?

అపొస్తలుల కార్యములు 9:19-30; 11:19-26; 13 నుండి 17 అధ్యాయాలు; 18:1-22.