కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

107వ కథ

స్తెఫను రాళ్లతో కొట్టబడడం

స్తెఫను రాళ్లతో కొట్టబడడం

ఇక్కడ మోకాళ్ళూనివున్న వ్యక్తి స్తెఫను. ఆయన యేసుకు నమ్మకమైన శిష్యుడు. కానీ ఇప్పుడాయనకు ఏమి జరుగుతుందో చూడండి! ఆ మనుష్యులు ఆయనమీదకు పెద్ద రాళ్ళు విసురుతున్నారు. వాళ్ళు ఇంత ఘోరమైన పని చేసేంతగా స్తెఫనును ఎందుకు ద్వేషిస్తున్నారు? మనం చూద్దాం.

స్తెఫను ఆశ్చర్యకరమైన అద్భుతకార్యాలు చేసేలా దేవుడు ఆయనకు సహాయం చేశాడు. ఈ మనుష్యులకు అది నచ్చలేదు, కాబట్టి వాళ్ళు ఆయన ప్రజలకు సత్యాన్ని బోధించే విషయం గురించి ఆయనతో వాదానికి దిగారు. అయితే దేవుడు స్తెఫనుకు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినందువల్ల ఈ మనుష్యులు అబద్ధాలను బోధిస్తున్నారని స్తెఫను చూపించాడు. అది వాళ్ళ కోపాన్ని మరింత పెంచింది. కాబట్టి వాళ్ళు ఆయనను బలవంతంగా పట్టుకొని, ప్రజలతో ఆయన గురించి అబద్ధాలు చెప్పించారు.

ప్రధాన యాజకుడు స్తెఫనును, ‘అవి నిజమేనా?’ అని అడిగాడు. స్తెఫను బైబిలు నుండి ఒక మంచి ప్రసంగం ఇస్తూ దానికి సమాధానమిచ్చాడు. ప్రసంగం ముగింపులో ఆయన చాలాకాలం క్రితం చెడ్డ మనుష్యులు యెహోవా ప్రవక్తలను ఎలా ద్వేషించారో చెప్పాడు. తర్వాత ఆయన ‘మీరు కూడా ఆ మనుష్యుల్లాంటి వారే. మీరు దేవుని సేవకుడైన యేసును చంపారు, మీరు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించలేదు’ అన్నాడు.

అది మతనాయకులకు తీవ్రమైన కోపం తెప్పించింది! వాళ్ళు మండిపడి పండ్లు కొరికారు. అయితే స్తెఫను తన తలను పైకెత్తి ‘ఇదిగో! యేసు పరలోకంలో దేవుని కుడి పక్కన నిలబడి ఉండడాన్ని నేను చూస్తున్నాను’ అన్నాడు. దానితో ఆ మనుష్యులు తమ చెవులు మూసుకొని స్తెఫనుపై విరుచుకుపడ్డారు. వాళ్ళు ఆయనను పట్టుకొని పట్టణం బయటకు ఈడ్చుకొని వెళ్లారు.

అక్కడ వాళ్ళు తమ పైవస్త్రాలను తీసి, వాటిని పట్టుకొమ్మని సౌలు అనే యువకునికి చెప్పారు. మీకు సౌలు కనిపించాడా? తర్వాత ఆ మనుష్యులలో కొంతమంది స్తెఫనుపై రాళ్ళు విసరడం మొదలుపెట్టారు. మీరు ఇక్కడ చూస్తున్నట్లు స్తెఫను మోకాళ్ళూని, ‘యెహోవా, ఈ పాపము చేసినందుకు వీళ్ళను శిక్షించవద్దు’ అని దేవునికి ప్రార్థించాడు. వాళ్ళలో కొంతమంది మతనాయకుల ప్రేరణ కారణంగా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారని ఆయనకు తెలుసు. ఆ తరువాత స్తెఫను చనిపోయాడు.

మీకు ఎవరైనా కీడు చేసినప్పుడు, మీరు తిరిగి వాళ్ళకు హాని చేయడానికి ప్రయత్నిస్తారా, లేక వాళ్ళకు కీడు చేయమని దేవుణ్ణి అడుగుతారా? స్తెఫను గాని, యేసు గాని అలా చేయలేదు. తమపట్ల నిర్దయగా ప్రవర్తించిన వారితో కూడా వారు దయగా ప్రవర్తించారు. మనం వాళ్ళ మాదిరిని అనుకరించడానికి ప్రయత్నిద్దాము.