కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

116వ కథ

మనమెలా నిరంతరం జీవించవచ్చు

మనమెలా నిరంతరం జీవించవచ్చు

ఆ చిన్నపాప, ఆమె స్నేహితులు ఏమి చదువుతున్నారో మీరు చెప్పగలరా? అవును, అది మీరు చదువుతున్న నా బైబిలు కథల పుస్తకము అనే ఈ పుస్తకమే. అంతేగాక మీరు ఇప్పుడు చదువుతున్న “మనమెలా నిరంతరం జీవించవచ్చు” అనే ఈ కథనే వాళ్ళు చదువుతున్నారు.

వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారో మీకు తెలుసా? మొదటిగా, మనం నిరంతరం జీవించాలంటే యెహోవా గురించి, ఆయన కుమారుడైన యేసు గురించి తెలుసుకోవాలి. బైబిలు ఇలా చెబుతోంది: ‘నిరంతరం జీవించడానికి మార్గం ఇదే. అద్వితీయ సత్య దేవుని గురించి, ఆయన భూమ్మీదికి పంపిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించి తెలుసుకోండి.’

మనం యెహోవా దేవుని గురించి, ఆయన కుమారుడైన యేసు గురించి ఎలా తెలుసుకోవచ్చు? ఒక మార్గమేమిటంటే నా బైబిలు కథల పుస్తకమును మొదటి నుంచి చివరివరకు చదవడం. అది యెహోవా గురించి, యేసు గురించి ఎన్నో విషయాలు చెబుతుంది, కాదంటారా? అంతేగాక అది వాళ్ళు ఇప్పటి వరకు చేసిన పనుల గురించి, ఇంకా చేయబోయే పనుల గురించి ఎంతో చెబుతుంది. అయితే మనం కేవలం ఈ పుస్తకాన్ని చదివేయడం కంటే ఎక్కువే చేయాలి.

నేలమీదవున్న మరో పుస్తకాన్ని మీరు చూస్తున్నారా? అది బైబిలు. ఈ పుస్తకంలోని కథలు తీసుకోబడిన బైబిలు భాగాలను మీకు చదివి వినిపించమని ఎవరినైనా అడగండి. మనమందరం యెహోవా దేవుణ్ణి సరైన విధంగా సేవించి, నిత్యజీవాన్ని పొందడానికి మనకు అవసరమైన పూర్తి సమాచారాన్ని బైబిలు ఇస్తుంది. కాబట్టి మనం బైబిలును తరచు అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలి.

అయితే యెహోవా దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. మనకు వాళ్ళ గురించి, వాళ్ళ బోధల గురించి ఎంతో జ్ఞానమున్నా మనం నిత్యజీవం పొందలేకపోవచ్చు. ఇంకా ఏమి అవసరమో మీకు తెలుసా?

మనం నేర్చుకున్నవాటి ప్రకారం జీవించవలసిన అవసరముంది. మీకు యూదా ఇస్కరియోతు జ్ఞాపకమున్నాడా? యేసు తన అపొస్తలులుగా ఉండటానికి ఎంపిక చేసుకొన్న 12 మందిలో ఆయన ఒకడు. యూదాకు యెహోవా గురించి, యేసు గురించి ఎంతో జ్ఞానమున్నది. కానీ ఆయనకి ఏమి జరిగింది? కొంతకాలానికి ఆయన స్వార్థపరుడిగా తయారయ్యాడు, ఆయన 30 వెండి నాణెముల కోసం యేసును ఆయన శత్రువులకు అప్పగించాడు. కాబట్టి యూదాకు నిత్యజీవము లభించదు.

మనం 69వ కథలో చదివిన గేహజీ మీకు జ్ఞాపకమున్నాడా? అతను తనవి కాని వస్త్రాలను డబ్బును కావాలని కోరుకున్నాడు. వాటిని పొందేందుకు అతను అబద్ధం చెప్పాడు. అందుకే యెహోవా అతన్ని శిక్షించాడు. అలాగే మనం ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించకపోతే ఆయన మనలను కూడా శిక్షిస్తాడు.

అయితే యెహోవాను ఎల్లప్పుడూ నమ్మకంగా సేవించిన మంచివాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం వాళ్ళలా ఉండడానికి ఇష్టపడతాం, కాదా? బాలుడైన సమూయేలు మనం అనుసరించడానికి ఒక మంచి మాదిరి. జ్ఞాపకం తెచ్చుకోండి, మనం 55వ కథలో చూసినట్లుగా, అతను గుడారంలో యెహోవాను సేవించడం ప్రారంభించినప్పుడు అతని వయస్సు కేవలం నాలుగు లేక అయిదు సంవత్సరాలు మాత్రమే. కాబట్టి మీరు ఎంత చిన్నవారైనా, యెహోవాను సేవించలేనంత చిన్నవారేమీ కాదు.

అయితే మనమందరం అనుసరించాలని కోరుకొనే వ్యక్తి యేసుక్రీస్తు. మనం 87వ కథలో చూసినట్లు, ఆయన బాలునిగా ఉన్నప్పుడే దేవాలయంలో తన పరలోకపు తండ్రి గురించి మాట్లాడాడు. మనం ఆయన మాదిరిని అనుసరిద్దాం. అద్భుతమైన మన దేవుడైన యెహోవా గురించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించి మనం చెప్పగలిగినంత మందికి చెబుదాం. మనం వీటిని చేస్తే, భూమిపై ఉండే దేవుని నూతన పరదైసులో నిరంతరం జీవించగలుగుతాము.