కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

114వ కథ

చెడుతనమంతా అంతం కావడం

చెడుతనమంతా అంతం కావడం

మీకు ఇక్కడ ఏమి కనిపిస్తోంది? అవును, తెల్లని గుర్రాలమీద ఉన్న సైన్యం కనిపిస్తోంది. అయితే ఆ సైన్యం ఎక్కడ నుండి వస్తుందో గమనించండి. ఆ గుర్రాలు పరలోకం నుండి మేఘాలపై వస్తున్నాయి! పరలోకంలో నిజంగానే గుర్రాలున్నాయా?

లేవు, ఇవి నిజమైన గుర్రాలు కావు. గుర్రాలు మేఘాల మీద పరుగెత్తలేవని మనకు తెలుసు, అవి పరుగెత్తగలవా? అయితే బైబిలు పరలోకంలో ఉన్న గుర్రాల గురించి మాట్లాడుతోంది. అది ఎందుకో మీకు తెలుసా?

ఎందుకంటే, ఒకప్పుడు గుర్రాలు యుద్ధం చేయడానికి ఎక్కువగా ఉపయోగించబడేవి. కాబట్టి భూమ్మీదున్న ప్రజలతో దేవుడు యుద్ధం చేయబోతున్నాడని చూపించడానికి బైబిలు పరలోకం నుండి గుర్రాలపై స్వారీచేస్తూ వచ్చే వ్యక్తుల గురించి చెబుతోంది. ఆ యుద్ధం జరిగే స్థలాన్ని ఏమని పిలుస్తారో మీకు తెలుసా? హార్‌మెగిద్దోను అని పిలుస్తారు. ఆ యుద్ధం భూమ్మీదున్న చెడుతనాన్నంతటినీ తీసివేయడానికి జరుగుతుంది.

హార్‌మెగిద్దోను దగ్గర జరిగే ఆ యుద్ధానికి యేసు నాయకత్వం వహిస్తాడు. దేవుడు తన ప్రభుత్వానికి రాజుగా ఉండేందుకు యేసును ఎన్నుకున్నాడని గుర్తు తెచ్చుకోండి. అందుకే యేసు తన తలమీద రాజకిరీటం ధరించుకొని ఉన్నాడు. ఆయన దేవుని శత్రువులనందరినీ నాశనం చేస్తాడని ఆయన చేతిలోని ఖడ్గం చూపిస్తోంది. దేవుడు చెడు ప్రజలందరిని నాశనం చేస్తాడంటే మనం ఆశ్చర్యపోవాలా?

పదవ కథను చూడండి. అక్కడ మీకు ఏమి కనిపిస్తోంది? అవును, చెడ్డ ప్రజలను నాశనం చేసిన గొప్ప జలప్రళయం కనిపిస్తోంది. ఆ జలప్రళయాన్ని ఎవరు రప్పించారు? యెహోవా దేవుడే. ఇప్పుడు 15వ కథను చూడండి. అక్కడేమి జరిగింది? యెహోవా పంపిన అగ్నితో సొదొమ గొమొఱ్ఱాలు నాశనం అవుతున్నాయి.

33వ కథకు త్రిప్పండి. ఐగుప్తీయుల గుర్రాలకు, వాళ్ళ యుద్ధరథాలకు ఏమి జరిగిందో చూడండి. నీళ్ళు వచ్చి వాళ్ళను ముంచేసేలా ఎవరు చేశారు? యెహోవా. ఆయన తన ప్రజలను రక్షించడానికి అలా చేశాడు. 76వ కథ చూడండి. అక్కడ యెహోవా తన స్వంత ప్రజలైన ఇశ్రాయేలీయులను కూడా వాళ్ళ చెడుతనం కారణంగా నాశనం చేస్తున్నాడు.

కాబట్టి భూమ్మీదనున్న దుష్టత్వాన్నంతటిని అంతం చేయడానికి యెహోవా తన పరలోకపు దూతలను పంపిస్తాడంటే దానికి మనం ఆశ్చర్యపోకూడదు. అయితే అలా జరిగితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఊహించండి! పేజీ త్రిప్పి చూద్దాం.