అనుబంధం
మెస్సీయ రావడాన్ని దానియేలు ప్రవచనం తెలియజేసిన విధానం
దానియేలు ప్రవక్త యేసు జన్మించడానికి 500 సంవత్సరాల పూర్వమే జీవించాడు. అయినప్పటికీ, యేసు మెస్సీయగా లేదా క్రీస్తుగా అభిషేకించబడే కాలాన్ని సరిగ్గా గ్రహించడానికి ఉపయోగపడే సమాచారాన్ని యెహోవా దానియేలుకు వెల్లడించాడు. దానియేలుకు ఇలా చెప్పబడింది: “యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు దానియేలు 9:25.
వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును.”—మెస్సీయ వచ్చే కాలాన్ని నిర్ధారించుకోవడానికి మొదట మనం ఆ మెస్సీయ వచ్చే కాలానికి నడిపే సమయం ఎప్పుడు ఆరంభమైందో తెలుసుకోవాలి. ఆ ప్రవచనం ప్రకారం అది “యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ” జారీ అయిన సమయంతో ఆరంభమవుతుంది. ఈ “ఆజ్ఞ” ఎప్పుడు జారీ అయింది? బైబిలు రచయిత నెహెమ్యా ప్రకారం, “అర్తహషస్త రాజు ఏలుబడికాలమున ఇరువదియవ సంవత్సరములో” యెరూషలేము చుట్టూ గోడలు మరల కట్టించవచ్చుననే ఆ ఆజ్ఞ జారీ అయింది. (నెహెమ్యా 2:1, 5-8) సా.శ.పూ. 474వ సంవత్సరంలో అర్తహషస్త పరిపాలన మొదటి సంవత్సరం పూర్తయిందని చరిత్రకారులు చెబుతున్నారు. కాబట్టి సా.శ.పూ. 455 ఆయన పరిపాలనలోని ఇరవయ్యవ సంవత్సరం. మనకిప్పుడు దానియేలు వ్రాసిన మెస్సీయ ప్రవచనపు ఆరంభ సంవత్సరం సా.శ.పూ. 455 అని తెలిసింది.
“అభిషిక్తుడగు అధిపతి” రావడానికి ఎంతకాలం పడుతుందో దానియేలు సూచిస్తున్నాడు. అది ‘ఏడు వారములు, అరువది రెండు వారములు’ అంటే 69 వారములు అని ఆ ప్రవచనం చెబుతోంది. ఆ కాల నిడివి ఎంత? అవి ఏడు రోజులుగల వారాలను సూచించడం లేదు గానీ, ఏడు వారాల సంవత్సరాలని సూచిస్తుందని అనేక బైబిలు అనువాదాలు వివరిస్తున్నాయి. అంటే ఒక్కో వారం ఏడు సంవత్సరాలను సూచిస్తుంది. వారాల సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాల భాగాలు ప్రాచీనకాల యూదులకు సుపరిచితమే. ఉదాహరణకు, వాళ్లు ప్రతీ ఏడవ సంవత్సరంలో సబ్బాతు సంవత్సరాన్ని జరుపుకునేవారు. (నిర్గమకాండము 23:10, 11) కాబట్టి ఆ ప్రవచనార్థక 69 వారాలు, అంటే ఒక్కొక్క భాగం ఏడు సంవత్సరాల నిడివిగల 69 భాగాలు లేదా 483 సంవత్సరాలు.
ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఆ సంవత్సరాల కాలాన్ని లెక్కించడమే. మనం సా.శ.పూ. 455 నుండి ఆ 483 సంవత్సరాలు లెక్కిస్తే మనం సా.శ. 29వ సంవత్సరానికి చేరుకుంటాము. ఆ సంవత్సరమే యేసు బాప్తిస్మం తీసుకొని మెస్సీయ అయ్యాడు. a (లూకా 3:1, 2, 21, 22) అది బైబిలు ప్రవచన అసాధారణ నెరవేర్పు కాదా?
a సా.శ.పూ. 455 నుండి సా.శ.పూ. 1 వరకు 454 సంవత్సరాలు. సా.శ.పూ. 1 నుండి సా.శ. 1 వరకు ఒక సంవత్సరం (శూన్య సంవత్సరం లేదు). సా.శ. 1 నుండి సా.శ. 29 వరకు 28 సంవత్సరాలు. ఈ మూడు సంఖ్యలను కూడితే 483 సంవత్సరాలు అవుతుంది. యేసు సా.శ. 33లో అంటే, 70వ వారపు సంవత్సరంలో మరణించడం ద్వారా “నిర్మూలము” చేయబడ్డాడు. (దానియేలు 9:24, 26) దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) 11వ అధ్యాయం, లేఖనాలపై అంతర్దృష్టి 2వ సంపుటి, 899-901 పేజీలు చూడండి. ఈ రెండూ యెహోవాసాక్షులు ప్రచురించినవే.