పదిహేనవ అధ్యాయం
దేవుడు ఆమోదించే ఆరాధన
-
మతాలన్నీ దేవునికి సంతోషం కలిగిస్తున్నాయా?
-
నిజమైన మతాన్ని మనం ఎలా గుర్తించవచ్చు?
-
నేడు ఈ భూమ్మీద దేవుని సత్యారాధకులు ఎవరు?
1. దేవుణ్ణి సరైన రీతిలో ఆరాధించినప్పుడు మనమెలా ప్రయోజనం పొందుతాం?
యెహోవాకు మనపై ప్రగాఢమైన శ్రద్ధ ఉండడమే కాక, ఆయనిచ్చే ప్రేమపూర్వక నిర్దేశం నుండి మనం ప్రయోజనం పొందాలని కూడా కోరుకుంటున్నాడు. మనం ఆయనను సరైన రీతిలో ఆరాధించినప్పుడు మనం జీవితంలో సంతోషంగా ఉంటూ అనేక సమస్యలను తప్పించుకుంటాం. మనకు ఆయన ఆశీర్వాదం, సహాయం కూడా ఉంటాయి. (యెషయా 48:17) అయితే దేవుని గురించిన సత్యాన్ని బోధిస్తున్నామని చెప్పుకునే మతాలు వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ అవి దేవుని గురించి, ఆయన మననుండి కోరేవాటి గురించి తెలిపే తమ బోధల్లో ఎంతో భిన్నంగా ఉన్నాయి.
2. యెహోవాను ఆరాధించడానికి సరైన రీతి ఏదో మనం ఎలా తెలుసుకోవచ్చు, దీనిని అర్థం చేసుకోవడానికి మనకు ఏ ఉదాహరణ సహాయం చేస్తుంది?
2 యెహోవాను ఆరాధించడానికి సరైన రీతి ఏదో మీరు ఎలా తెలుసుకోవచ్చు? మీరు అన్ని మతాల బోధలను అధ్యయనం చేసి, పోల్చి చూడవలసిన అవసరం లేదు. సత్యారాధన గురించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో తెలుసుకుంటే చాలు. ఉదాహరణకు, అనేక దేశాల్లో నకిలీ నోట్ల సమస్య ఉంది. అలాంటి నకీలి నోట్లను గుర్తించే పనిని మీకు అప్పగిస్తే, మీరు ఆ పనిని ఎలా చేస్తారు? ప్రతీ నకిలీ నోటును గుర్తుపెట్టుకోవడం ద్వారానా? కానేకాదు. బదులుగా అసలు నోట్లను పరిశీలనగా అధ్యయనం చేయడమే ఉత్తమ విధానం. అసలు నోట్లు ఎలా ఉంటాయో మీరు తెలుకున్న తర్వాత, నకిలీ నోట్లను మీరు సులభంగా గుర్తుపట్టవచ్చు. అదేవిధంగా, నిజమైన మతాన్ని ఎలా గుర్తించాలో మనం తెలుసుకుంటే, అబద్ధమతాలను సులభంగా గుర్తించవచ్చు.
3. యేసు చెప్పిన ప్రకారం, మనకు దేవుని ఆమోదం ఉండాలని కోరుకుంటే మనమేమి చేయాలి?
3 యెహోవా ఆమోదించే విధానంలో ఆయనను ఆరాధించడం ప్రాముఖ్యం. అన్ని మతాలూ దేవుణ్ణి సంతోషపెడుతున్నాయని చాలామంది నమ్ముతారు, అయితే బైబిలు అలా బోధించడం లేదు. కేవలం క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడం మాత్రమే సరిపోదు. యేసు ఇలా చెప్పాడు: “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.” కాబట్టి దేవుని ఆమోదం ఉండాలంటే, మననుండి దేవుడు కోరేదేమిటో తెలుసుకొని దాని ప్రకారం చేయాలి. దేవుని చిత్తం చేయనివారిని యేసు “అక్రమము చేయువారలారా” అని పిలిచాడు. (మత్తయి 7:21-23) నకిలీ నోట్లకు విలువలేనట్లే అబద్ధమతానికి ఎలాంటి విలువా లేదు. అంతకంటే ఘోరమైన విషయం ఏమిటంటే అలాంటి మతం నిజానికి హాని కలిగిస్తుంది.
4. రెండు ద్వారముల గురించి యేసు చెప్పింది దేన్ని సూచిస్తుంది, ప్రతీ ద్వారం దేనికి నడిపిస్తుంది?
4 యెహోవా భూమ్మీది ప్రతీ ఒక్కరికి నిత్యజీవం పొందే అవకాశాన్ని ఇస్తున్నాడు. అయితే భూమ్మీది పరదైసులో నిత్యజీవం పొందాలంటే, మనం దేవుణ్ణి సరైన రీతిలో ఆరాధిస్తూ, ఇప్పుడు ఆయనకు ఆమోదయోగ్యమైన విధంగా జీవించాలి. అయితే చాలామంది అలా చేయడానికి నిరాకరించడం విచారకరం. అందుకే యేసు ఇలా అన్నాడు: “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.” (మత్తయి 7:13-14) సత్యమతం నిత్యజీవానికి నడిపిస్తుంది. అబద్ధమతం నాశనానికి నడిపిస్తుంది. మానవుల్లో ఎవరూ నాశనం కాకూడదని యెహోవా కోరుతున్నాడు, అందుకే ఆయన తన గురించి తెలుసుకొనే అవకాశాన్ని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు ఇస్తున్నాడు. (2 పేతురు 3:9) కాబట్టి, మనం దేవుణ్ణి ఆరాధించే విధానం నిత్యజీవానికి లేదా మరణానికి దారితీస్తుంది.
సత్యమతాన్ని ఎలా గుర్తించవచ్చు?
5. మనం సత్యమతాన్ని అనుసరిస్తున్న వారిని ఎలా గుర్తించవచ్చు?
5 ‘జీవమునకు పోవు ద్వారాన్ని’ ఎలా కనుగొనవచ్చు? సత్యమతాన్ని అనుసరిస్తున్న ప్రజల జీవితాల్లో అది స్పష్టంగా కనిపిస్తుందని యేసు చెప్పాడు. “వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. . . . ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును” అని ఆయన చెప్పాడు. (మత్తయి 7:16, 17) మరొక విధంగా చెప్పాలంటే, సత్యమతాన్ని అనుసరించేవారిని వారి నమ్మకాలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి గుర్తించవచ్చు. సత్యారాధకులు అపరిపూర్ణులు కాబట్టి వారు కూడా తప్పులు చేస్తారు, అయినా ఒక గుంపుగా వారు దేవుని చిత్తం చేయడానికే శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇప్పుడు మనం సత్యమతాన్ని అనుసరిస్తున్నవారిని గుర్తించే ఆరు అంశాలను పరిశీలిద్దాం.
6, 7. దేవుని సేవకులు బైబిలును ఎలా దృష్టిస్తారు, ఈ విషయంలో యేసు ఎలాంటి మాదిరిని ఉంచాడు?
6 దేవుని సేవకులు బైబిలు ఆధారంగా బోధిస్తారు. బైబిలే ఇలా చెబుతోంది: “దైవజనుడు [లేదా దైవభక్తిగల స్త్రీ] సన్నద్ధుడై[రాలై] ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.” (2 తిమోతి 3:16-17) తోటి క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మీరు దేవునిగూర్చిన వర్తమానవాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి.” (1 థెస్సలొనీకయులు 2:13) కాబట్టి సత్యమతపు నమ్మకాలు, అభ్యాసాలు మానవ దృక్కోణాలమీద లేదా సాంప్రదాయంమీద ఆధారపడి ఉండవు. అవి దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలుమీదే ఆధారపడి ఉంటాయి.
7 దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని బోధించడం ద్వారా యేసుక్రీస్తు సరైన మాదిరి ఉంచాడు. ఆయన తన పరలోకపు తండ్రికి చేసిన ప్రార్థనలో ఇలా అన్నాడు: “నీ వాక్యమే సత్యము.” (యోహాను 17:17) యేసు దేవుని వాక్యాన్ని నమ్మాడు అంతేకాక, ఆయన ప్రతీ విషయాన్ని లేఖనాలకు అనుగుణంగానే బోధించాడు. యేసు తరచూ ఇలా అన్నాడు: “వ్రాయబడియున్నది.” (మత్తయి 4:4, 7, 10) అలా అనడానికి ముందు ఆయన ఒక లేఖనాన్ని ఉల్లేఖించేవాడు. అదేప్రకారంగా నేడు దేవుని ప్రజలు తమ సొంత అభిప్రాయాలను బోధించరు. బైబిలు దేవుని వాక్యమని వారు నమ్ముతారు, వారు ఖచ్చితంగా అది చెబుతున్న దాని ఆధారంగానే బోధిస్తారు.
8. యెహోవాను ఆరాధించడంలో ఏమి ఇమిడివుంది?
8 సత్యారాధనను అనుసరించేవారు యెహోవాను మాత్రమే ఆరాధిస్తూ ఆయన నామాన్ని ప్రకటిస్తారు. యేసు ఇలా అన్నాడు: “ప్రభువైన నీ దేవునికి [“యెహోవాకు” NW] మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను.” (మత్తయి 4:10) కాబట్టి దేవుని సేవకులు యెహోవాను తప్ప ఇంకెవరినీ ఆరాధించరు. ఈ ఆరాధనలో ప్రజలకు సత్య దేవుని పేరును, ఆయన ఎలాంటివాడు అనే విషయాలను తెలియజేయడం కూడా భాగమే. కీర్తన 83:18 ఇలా చెబుతోంది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు.” దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రజలకు సహాయం చేయడంలో యేసు ఆదర్శాన్ని ఉంచుతూ, ప్రార్థనలో ఇలా అన్నాడు: “లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని.” (యోహాను 17:6) ఆ ప్రకారమే నేడు సత్యారాధకులు దేవుని పేరు, ఆయన సంకల్పాలు, ఆయన లక్షణాల గురించి ఇతరులకు బోధిస్తారు.
9, 10. నిజ క్రైస్తవులు ఏయే విధాలుగా పరస్పరం ప్రేమను కనబరచుకుంటారు?
9 దేవుని ప్రజలు పరస్పరం యథార్థమైన, నిస్వార్థమైన ప్రేమను కనబరచుకుంటారు. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు” అని యేసు చెప్పాడు. (యోహాను 13:35) తొలి క్రైస్తవులు పరస్పరం అలాంటి ప్రేమనే కనబరచుకున్నారు. దైవిక ప్రేమ తెగ, సామాజిక, జాతీయ అడ్డంకులను అధిగమిస్తూ అఖండమైన నిజ సహోదరత్వ బంధానికి ప్రజలను ఆకర్షిస్తుంది. (కొలొస్సయులు 3:14 చదవండి.) అబద్ధమతాల సభ్యుల్లో అలాంటి ప్రేమపూర్వక సహోదరత్వం ఉండదు. అలాగని మనకెలా తెలుసు? జాతి లేదా తెగల భిన్నాభిప్రాయాల కారణంగా వారు ఒకరినొకరు చంపుకుంటున్నారు. నిజ క్రైస్తవులు తమ తోటి క్రైస్తవ సహోదరులను లేదా మరెవరినైనా చంపడానికి ఆయుధాలు చేపట్టరు. బైబిలు ఇలా చెబుతోంది: “దీనినిబట్టి దేవుని పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. . . . మనము కయీను వంటి వారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను.”—1 యోహాను 3:10-12; 4:20, 21.
10 యథార్థమైన ప్రేమ అంటే కేవలం ఇతరులను చంపకుండా ఉండడం మాత్రమే కాదు. నిజ క్రైస్తవులు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి, పురికొల్పుకోవడానికి నిస్వార్థంగా తమ సమయాన్ని, శక్తిని, వనరులను వెచ్చిస్తారు. (హెబ్రీయులు 10:24, 25) విపత్తులు సంభవించినప్పుడు వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, ఇతరులతో వారు నిజాయితీగా ప్రవర్తిస్తారు. వాస్తవానికి వారు ‘అందరియెడల మేలు చేయుము’ అనే బైబిలు ఉపదేశాన్ని తమ జీవితాల్లో అన్వయించుకుంటారు.—గలతీయులు 6:10.
11. దేవుడు ఏర్పాటుచేసిన రక్షణ మార్గంగా యేసుక్రీస్తును అంగీకరించడం ఎందుకు ప్రాముఖ్యం?
11 నిజ క్రైస్తవులు యేసుక్రీస్తును దేవుడు ఏర్పాటుచేసిన రక్షణ మార్గంగా అంగీకరిస్తారు. బైబిలు ఇలా చెబుతోంది: “మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.” (అపొస్తలుల కార్యములు 4:12) విధేయత చూపించే మానవుల కోసం యేసు తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా అర్పించాడని మనం 5వ అధ్యాయంలో చూశాం. (మత్తయి 20:28) అంతేకాక, యేసు ఈ యావత్ భూమిని పరిపాలించే పరలోక రాజ్యానికి దేవుని నియమిత రాజుగా ఉన్నాడు. మనకు నిత్యజీవం కావాలంటే మనం యేసుకు లోబడి ఆయన బోధలను అన్వయించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే బైబిలు ఇలా చెబుతోంది: “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు.”—యోహాను 3:36.
12. లోక సంబంధులు కాకుండా ఉండడం అంటే ఏమిటి?
12 సత్యారాధకులు లోకసంబంధులు కారు. యేసు రోమా పరిపాలకుడైన పిలాతు ఎదుట న్యాయ విచారణలో ఉన్నప్పుడు ఇలా అన్నాడు: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు.” (యోహాను 18:36) యేసు నిజ అనుచరులు ఏ దేశంలో జీవించినా ఆయన పరలోక రాజ్య ప్రజలుగానే ఉంటూ, లోక రాజకీయ వ్యవహారాల్లో స్థిరమైన తటస్థ వైఖరిని కాపాడుకుంటారు. ఈ లోక పోరాటాల్లో ఏ మాత్రం భాగం వహించరు. అయితే వారు రాజకీయ పార్టీలో చేరడం, అభ్యర్థిగా నిలబడడం లేదా ఓటు వేయడం వంటి విషయాల్లో ఇతరులు ఏమి చేయడానికి ఎంపిక చేసుకున్నా వారు దానిలో జోక్యం చేసుకోరు. దేవుని సత్యారాధకులు రాజకీయ వ్యవహారాల్లో తటస్థంగా ఉన్నా, వారు చట్టానికి లోబడే ఉంటారు. ఎందుకు? ఎందుకంటే ప్రభుత్వ “పై అధికారులకు లోబడియుండ వలెను” అని దేవుని వాక్యం వారిని ఆజ్ఞాపిస్తోంది. (రోమీయులు 13:1) అయితే దేవుడు కోరేదానికి భిన్నమైనది ఏదైనా రాజకీయ విధానం కోరినట్లయితే, అప్పుడు సత్యారాధకులు “మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా” అని చెప్పిన అపొస్తలుల మాదిరినే అనుసరిస్తారు.—అపొస్తలుల కార్యములు 5:29; మార్కు 12:17.
13. యేసు నిజ అనుచరులు దేవుని రాజ్యాన్ని ఎలా దృష్టిస్తారు, దానివల్ల వారు ఎలాంటి చర్య తీసుకుంటారు?
13 యేసు నిజ అనుచరులు దేవుని రాజ్యమే మానవాళి ఏకైక నిరీక్షణ అని ప్రకటిస్తారు. యేసు ముందుగానే ఇలా చెప్పాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) యేసుక్రీస్తు నిజ అనుచరులు, ప్రజల సమస్యల పరిష్కారానికి మానవ పరిపాలకుల వైపు చూడమని ప్రోత్సహించడానికి బదులు దేవుని పరలోక రాజ్యమే మానవాళి ఏకైక నిరీక్షణ అని ప్రకటిస్తారు. (కీర్తన 146:3) ఆ పరిపూర్ణ ప్రభుత్వం కోసం ప్రార్థించమని మనకు బోధిస్తూ యేసు ఇలా చెప్పాడు: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:9-10) ఈ పరలోక రాజ్యం “ముందు చెప్పిన [ఇప్పుడున్న] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును” అని దేవుని వాక్యం ముందే చెప్పింది.—దానియేలు 2:44; ప్రకటన 16:14, 19:19-21.
14. సత్యారాధనా ప్రమాణాలకు తగినట్లు ఏ మతం ఉందని మీరు నమ్ముతున్నారు?
14 మనం ఇప్పుడు పరిశీలించిన విషయాల ఆధారంగా మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘ఏ మతగుంపు అన్నింటినీ బైబిలు ఆధారంగా బోధిస్తూ, యెహోవా నామాన్ని ప్రకటిస్తోంది? యెహోవా బోధించిన విధంగా ప్రేమ చూపిస్తూ, యేసును విశ్వసిస్తూ, లోకంతో సంబంధం లేకుండా ఉంటూ, దేవుని రాజ్యమే మానవాళికి నిజమైన ఏకైక నిరీక్షణ అని ఏ మతగుంపు ప్రకటిస్తోంది? భూమ్మీది మతాలన్నింటిలో ఈ ప్రమాణాలకు తగ్గట్టు ఉన్న మతగుంపు ఏది?’ అలా చేస్తున్నది యెహోవాసాక్షులేనని వాస్తవాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.—యెషయా 43:10-12 చదవండి.
మీరేమి చేస్తారు?
15. దేవుడు ఉనికిలో ఉన్నాడని నమ్మడంతోపాటు మనం ఇంకా ఏమి చేయాలని ఆయన కోరుతున్నాడు?
15 దేవుడు ఉన్నాడని నమ్మినంత మాత్రాన అది దేవుణ్ణి సంతోషపర్చదు. వాస్తవానికి, దయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నట్లు బైబిలు చెబుతోంది. (యాకోబు 2:19) అయితే వాళ్లు దేవుని చిత్తం చేయడం లేదు కాబట్టి వాళ్లకు దేవుని ఆమోదం లేదు. దేవుని ఆమోదం మనకు ఉండాలంటే, మనం ఆయన ఉనికిలో ఉన్నాడని నమ్మడం మాత్రమే కాదు, మనం ఆయన చిత్తం కూడా చేయాలి. అలాగే మనం అబద్ధమతం నుండి తెగతెంపులు చేసుకొని సత్యారాధన పక్షాన స్థిరంగా నిలబడాలి.
16. అబద్ధమత ఆరాధనలో పాలుపంచుకునే విషయంలో ఏమి చేయాలి?
16 అబద్ధమత ఆరాధనలో మనం భాగం వహించకూడదని అపొస్తలుడైన పౌలు వివరించాడు. ఆయన ఇలా వ్రాశాడు: “మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.—మరియు నేను మిమ్మును చేర్చుకొందును.” (2 కొరింథీయులు 6:18; యెషయా 52:11) కాబట్టి నిజ క్రైస్తవులు అబద్ధ ఆరాధనకు సంబంధించిన ప్రతీ దానికి దూరంగా ఉంటారు.
17, 18. “మహా బబులోను” అంటే ఏమిటి, “దానిని విడిచి” రావడం ఎందుకు అత్యవసరం?
17 అన్నిరకాల అబద్ధ ఆరాధనలు “మహా బబులోను[లో]” భాగమే అని బైబిలు చూపిస్తోంది. a (ప్రకటన 17:5) ఆ పేరు నోవహు కాలపు జలప్రళయం తర్వాత అబద్ధ ఆరాధన ఆరంభమైన ప్రాచీన బబులోను నగరాన్ని గుర్తుచేస్తోంది. నేటి అబద్ధమతంలో సర్వసామాన్యంగా కనిపించే అనేక బోధలు, ఆచారాలు పూర్వమెప్పుడో ఆ బబులోనులో ఆరంభమయ్యాయి. ఉదాహరణకు, బబులోనీయులు త్రిత్వ దేవతలను లేదా త్రిమూర్తులను ఆరాధించేవారు. నేడు అనేక మతాలకు త్రిత్వం మూల సిద్ధాంతంగా ఉంది. అయితే ఒకే ఒక్క సత్య దేవుడు ఉన్నాడనీ, ఆయన యెహోవా అనీ, యేసుక్రీస్తు ఆయన కుమారుడనీ బైబిలు స్పష్టంగా బోధిస్తోంది. (యోహాను 17:3) మానవులకు అమర్త్యమైన ఆత్మ ఉందని, అది మరణం తర్వాత శరీరం నుండి తప్పించుకుంటుందని, యాతన స్థలంలో నరకం అనుభవిస్తుందని కూడా బబులోనీయులు నమ్మేవారు. నేడు కూడా అనేక మతాలు, నరకాగ్నిలో బాధించబడే అమర్త్యమైన ఆత్మ ఉందని బోధిస్తున్నాయి.
18 ప్రాచీన బబులోను ఆరాధన భూవ్యాప్తంగా విస్తరించింది కాబట్టి, ఆధునిక మహా బబులోనును ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యంగా గుర్తించడం సబబే. ఈ అబద్ధమత సామ్రాజ్యపు అంతం అకస్మాత్తుగా వస్తుందని దేవుడు ముందే చెప్పాడు. మహా బబులోను ప్రతీ భాగం నుండి మిమ్మల్ని మీరు వేరుపరచుకోవడం ఎందుకు అత్యంత ప్రాముఖ్యమో మీరు గమనిస్తున్నారా? సమయం మించిపోకముందే మీరు “దానిని విడిచి” రావాలని యెహోవా దేవుడు కోరుతున్నాడు.—ప్రకటన 18:4, 8 చదవండి.
19. యెహోవాను సేవించడం ద్వారా మీరు ఏమి సంపాదించుకుంటారు?
19 అబద్ధమతాన్ని విడిచిపెట్టాలనే మీ నిర్ణయం కారణంగా కొందరు మీ సహవాసం మానుకోవాలని నిర్ణయించుకోవచ్చు. అయితే యెహోవా ప్రజలతో కలిసి ఆయనను సేవించడం ద్వారా మీరు పోగొట్టుకోగల దానికన్నా ఇంకా ఎక్కువగా సంపాదించుకుంటారు. యేసును అనుకరించడానికి భౌతికపరమైన విషయాలను విడిచి వచ్చిన ఆయన తొలి శిష్యుల్లాగే మీరుకూడా అనేకమంది ఆధ్యాత్మిక సహోదరసహోదరీలను సంపాదించుకుంటారు. మీపట్ల నిజమైన ప్రేమ కనబరిచే లక్షలాదిమంది నిజ క్రైస్తవుల విస్తృతమైన ప్రపంచవ్యాప్త కుటుంబంలో మీరూ భాగమవుతారు. “రాబోవు లోకమందు” మీకు అద్భుతమైన నిత్యజీవ నిరీక్షణ ఉంటుంది. (మార్కు 10:28-30 చదవండి.) మీ నమ్మకాలను బట్టి మీకు దూరమైనవారు కాల గమనంలో బైబిలు బోధిస్తున్నది ఏమిటో పరిశీలించి యెహోవా ఆరాధకులు కావచ్చు.
20. సత్యారాధనను అనుసరించే వారికి ఎలాంటి భవిష్యత్తు నిరీక్షణ ఉంది?
20 దేవుడు ఈ దుష్ట విధానాన్ని త్వరలోనే అంతం చేసి, తన రాజ్య పరిపాలన క్రింద నీతియుక్తమైన నూతనలోకాన్ని తీసుకొస్తాడని బైబిలు బోధిస్తోంది. (2 పేతురు 3:9, 13) అది ఎంత అద్భుతమైన లోకంగా ఉంటుందో కదా! ఆ నీతియుక్త నూతనవిధానంలో, ఒకే మతం అంటే ఒకే నిజమైన ఆరాధనా విధానం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడే సత్యారాధకులతో సహసించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం జ్ఞానయుక్తం కాదా?
a మహా బబులోను ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యానికి ప్రతీక అని ఎందుకు అనవచ్చో తెలుసుకోవడానికి మరింత సమాచారం కోసం అనుబంధంలోని 219-220 పేజీలు చూడండి.