కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రెండవ అధ్యాయం

బైబిలు—దేవుడు ఇచ్చిన గ్రంథం

బైబిలు—దేవుడు ఇచ్చిన గ్రంథం
  • బైబిలు ఏయే విధాలుగా ఇతర పుస్తకాలకు భిన్నంగా ఉంది?

  • వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి బైబిలు మీకెలా సహాయం చేయగలదు?

  • బైబిల్లో వ్రాయబడిన ప్రవచనాలను మీరు ఎందుకు నమ్మవచ్చు?

1, 2. బైబిలు దేవుడిచ్చిన అద్భుతమైన బహుమతి అని ఏయే విధాలుగా చెప్పవచ్చు?

 మీ ప్రియ మిత్రుడు మీకొక చక్కని బహుమతి ఇచ్చిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకోగలరా? ఆ బహుమతిని అందుకోవడం మిమ్మల్ని ఉత్తేజపరచడమే కాక, మీకెంతో సంతోషాన్ని కలిగించి ఉంటుంది. ఆ బహుమతి, దానిని ఇచ్చిన వ్యక్తి గురించి ఒక విషయాన్ని వెల్లడి చేస్తుంది. అదేమిటంటే అతడు లేదా ఆమె మీ స్నేహాన్ని ఎంత విలువైనదిగా పరిగణిస్తున్నారో మీకు చెబుతుంది. ఆలోచనాపూర్వకమైన ఆ బహుమతిని ఇచ్చినందుకు మీ మిత్రునికి మీరు తప్పకుండా కృతజ్ఞతలు తెలిపి ఉంటారు.

2 బైబిలు దేవుడిచ్చిన బహుమతి, దానిని మనకు ఇచ్చినందుకు దేవునిపట్ల మనం నిజమైన కృతజ్ఞతతో ఉండవచ్చు. మనం మరో విధంగా ఎన్నటికీ తెలుసుకోలేని విషయాలను ఈ విశిష్ట గ్రంథం వెల్లడి చేస్తోంది. ఉదాహరణకు, అది నక్షత్రాలు నిండిన ఆకాశము, ఈ భూమి, మొదటి స్త్రీపురుషులు ఎలా సృష్టించబడ్డారో చెబుతుంది. జీవిత సమస్యలను, చింతలను అధిగమించేందుకు మనకు సహాయపడే నమ్మదగిన సూత్రాలు దానిలో ఉన్నాయి. దేవుడు తన చిత్తం నెరవేర్చి ఈ భూమిపై మెరుగైన పరిస్థితులు ఎలా తీసుకొస్తాడో అది వివరిస్తోంది. నిజంగానే బైబిలు ఎంత అద్భుతమైన బహుమతో కదా!

3. యెహోవా మనకు బైబిలును ఇచ్చాడన్న విషయం, ఆయన గురించి ఏమి వెల్లడి చేస్తోంది, అది ఎందుకు మనకు సంతోషాన్నిస్తుంది?

3 బైబిలు మనకు ఎంతో సంతోషం కలిగించే బహుమతి అని కూడా చెప్పవచ్చు, ఎందుకంటే దానిని మనకిచ్చిన యెహోవా దేవుని గురించి అది ఒక విషయాన్ని వెల్లడి చేస్తోంది. ఆయన అలాంటి గ్రంథాన్ని మనకిచ్చాడన్న విషయం, తన గురించి మనం తెలుసుకోవాలనేది ఆయన కోరిక అని రుజువు చేస్తోంది. నిజానికి, యెహోవాకు సన్నిహితమవడానికి బైబిలు మీకు సహాయం చేయగలదు.

4. బైబిళ్ళ పంపిణీకి సంబంధించిన ఏ విషయం మిమ్మల్ని ఆకట్టుకుంటోంది?

4 మీ దగ్గర బైబిలు ఉంటే, అలా బైబిలు ఉన్నది మీ ఒక్కరి దగ్గరే కాదు. బైబిలు కొంతభాగంగా లేదా పూర్తిగా, దాదాపు 2600 భాషల్లో ప్రచురించబడింది, అందుకే అది ప్రపంచ జనాభాలో 90 శాతం కన్నా ఎక్కువమందికి అందుబాటులో ఉంది. ప్రతీవారం సగటున 10 లక్షలకన్నా ఎక్కువ బైబిళ్లు పంపిణీ చేయబడుతున్నాయి! బైబిలు కొంతభాగంగా లేదా మొత్తంగా కోట్ల సంఖ్యలో ఉత్పత్తి చేయబడుతోంది. నిశ్చయంగా బైబిలు వంటి గ్రంథం మరొకటి లేదు.

“పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము” అనేక భాషల్లో అందుబాటులో ఉంది

5. బైబిలు ఏ విధంగా “దైవావేశమువలన” కలిగినది?

5 అంతేకాక, బైబిలు “దైవావేశమువలన” కలిగినది. (2 తిమోతి 3:16, 17 చదవండి.) ఏ విధంగా? బైబిలే దానికి ఇలా జవాబిస్తోంది: “మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.” (2 పేతురు 1:21) ఉదాహరణకు, ఒక వ్యాపారస్తుడు తన కార్యదర్శి చేత ఒక ఉత్తరం వ్రాయించాడు అనుకోండి. ఆ ఉత్తరంలో ఆ వ్యాపారస్తుని తలంపులు, ఆదేశాలే ఉంటాయి. కాబట్టి అది అతని ఉత్తరమే అవుతుంది గాని కార్యదర్శిది కాదు. అదేవిధంగా, బైబిల్లో దేవుని సందేశమే ఉంది గాని దానిని వ్రాసిన మనుష్యుల సందేశం లేదు. కాబట్టి బైబిలు నిజంగా ‘దేవుని వాక్యమే.’—1 థెస్సలొనీకయులు 2:13.

పొందికగా, ప్రామాణికంగా ఉంది

6, 7. బైబిల్లోని పొందిక ప్రత్యేకంగా ఎందుకు గమనార్హమైనది?

6 బైబిలు వ్రాయడానికి 1,600 సంవత్సరాల కాలం పట్టింది. దాని రచయితలు వేర్వేరు కాలాల్లో జీవించారు, వేర్వేరు జీవన నేపథ్యాల నుండి వచ్చారు. వారిలో రైతులు, జాలరులు, కాపరులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులు ఉన్నారు. సువార్త రచయితయైన లూకా ఒక వైద్యుడు. రచయితల నేపథ్యాలు వేరైనా, బైబిలు మొదటి నుండి చివరి వరకు పొందికగా ఉంది. a

7 మానవాళి సమస్యలు ఎలా మొదలయ్యాయో బైబిల్లోని మొదటి పుస్తకం మనకు చెబుతోంది. ఈ భూమి అంతా పరదైసుగా అంటే చక్కని ఉద్యానవనంగా మారుతుందని చివరి పుస్తకం చెబుతోంది. బైబిల్లోని వివిధ భాగాల్లో వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది, అంతేగాక అవి ఏదోక రీతిలో దేవుని సంకల్ప నెరవేర్పును కూడా వివరిస్తున్నాయి. బైబిల్లో గమనార్హమైన పొందిక ఉంది, దేవుడిచ్చిన గ్రంథం అలా ఉండాలనే మనం ఆశిస్తాము.

8. బైబిలు విజ్ఞానశాస్త్రం ప్రకారం ఖచ్చితంగా ఉందని నిరూపించే ఉదాహరణలు చెప్పండి.

8 బైబిలు విజ్ఞానశాస్త్రపరంగా కూడా ఖచ్చితమైనది. అది వ్రాయబడే సమయానికి సాధారణ ప్రజలకు ఇంకా తెలియని సమాచారం కూడా దానిలో ఉంది. ఉదాహరణకు లేవీయకాండములో, కడగా ఉంచడానికి సంబంధించి, ప్రాచీన ఇశ్రాయేలీయుల చుట్టుప్రక్కల జనాంగాలకు ఏ మాత్రం తెలియని ఆరోగ్యశాస్త్ర నియమాలు ఉన్నాయి. భూమి ఆకారానికి సంబంధించి తప్పుడు అభిప్రాయాలున్న ఆ కాలంలోనే, భూమి ఒక మండలముగా అంటే గోళముగా ఉందని బైబిలు సూచించింది. (యెషయా 40:22) భూమి ‘శూన్యంపై వ్రేలాడుతుందని’ బైబిలు ఖచ్చితంగా చెప్పింది. (యోబు 26:7) నిజానికి బైబిలు విజ్ఞానశాస్త్ర పాఠ్య పుస్తకమేమీ కాదు. అయితే అది విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉంది. దేవుడిచ్చిన గ్రంథం నుండి మనం ఆశించేది అదే కాదా?

9. (ఎ) చారిత్రకంగా ఖచ్చితంగా, నమ్మదగినదిగా ఉన్నట్లు బైబిలు ఏయే విధాలుగా చూపిస్తోంది? (బి) బైబిలు రచయితల నిజాయితీ, బైబిలు గురించి మీకేమి చెబుతోంది?

9 బైబిలు చారిత్రకంగా కూడా ఖచ్చితంగా, నమ్మదగినదిగా ఉంది. దానిలోని వృత్తాంతాలు ఖచ్చితమైన వివరాలతో ఉన్నాయి. ఆ వృత్తాంతాల్లో ప్రజల పేర్లు మాత్రమే కాదు వారివారి వంశావళులు కూడా చేర్చబడ్డాయి. b చరిత్రకారులు సాధారణంగా తమ దేశ ప్రజల ఓటమి గురించి ప్రస్తావించరు, దానికి భిన్నంగా బైబిలు రచయితలు తమ స్వంత వైఫల్యాలను, తమ జనాంగపు వైఫల్యాలను నిజాయితీగా వ్రాశారు. ఉదాహరణకు, బైబిలు పుస్తకమైన సంఖ్యాకాండమును వ్రాసిన మోషే తాను తీవ్రంగా గద్దించబడడానికి కారణమైన తన ఘోరాపరాధాన్ని ఒప్పుకున్నాడు. (సంఖ్యాకాండము 20:2-12) అలాంటి నిజాయితీ ఇతర చారిత్రక వృత్తాంతాల్లో అరుదుగా కనిపిస్తుంది, అయితే బైబిలు దేవుడు ఇచ్చిన గ్రంథం కాబట్టి దానిలో అది కనబడుతుంది.

ఆచరణాత్మక జ్ఞానమున్న గ్రంథం

10. బైబిలు ఆచరణాత్మక గ్రంథమై ఉండడం ఎందుకు ఆశ్చర్యకరమైన విషయం కాదు?

10 బైబిలు దైవావేశమువలన కలిగింది కాబట్టి అది ‘ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పు దిద్దడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.’ (2 తిమోతి 3:16) అవును, బైబిలు ఒక ఆచరణాత్మక గ్రంథం. మానవ స్వభావానికి సంబంధించిన క్షుణ్ణమైన అవగాహన దానిలో కనిపిస్తుంది. అది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు, ఎందుకంటే సృష్టికర్తయైన యెహోవా దేవుడే దాని గ్రంథకర్త. ఆయన మన ఆలోచనలను, భావోద్రేకాలను మనకంటే ఎక్కువగా అర్థం చేసుకుంటాడు. అంతేకాదు, సంతోషంగా ఉండడానికి మనకేమి అవసరమో కూడా యెహోవాకు తెలుసు. మనమెలాంటి జీవన విధానానికి దూరంగా ఉండాలో కూడా ఆయనకు తెలుసు.

11, 12. (ఎ) యేసు కొండమీద ఇచ్చిన ప్రసంగంలో ఏయే అంశాల గురించి మాట్లాడాడు? (బి) బైబిల్లో ఏ ఇతర ఆచరణాత్మక విషయాలు పరిశీలించబడ్డాయి, అందులోని ఉపదేశం ఎందుకు కాలాతీతమైనది?

11 కొండమీది ప్రసంగం అని పిలువబడే, యేసు ఇచ్చిన ప్రసంగం గురించి ఆలోచించండి. అది మత్తయి 5 నుండి 7 అధ్యాయాల్లో ఉంది. అత్యుత్తమమైన బోధనా పద్ధతులను ఉపయోగించి ఇచ్చిన ఈ ప్రసంగంలో, నిజమైన సంతోషాన్ని ఎలా కనుగొనాలి, వివాదాలు ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ప్రార్థించాలి, భౌతిక విషయాలకు సంబంధించి సరైన దృక్పథం ఎలా కలిగి ఉండాలి అనే విషయాలతోపాటు అనేక అంశాల గురించి యేసు మాట్లాడాడు. యేసు పలికిన ఆ మాటలు అప్పట్లో ఎంత శక్తిమంతంగా, ఆచరణాత్మకంగా ఉన్నాయో ఇప్పుడూ అంతే శక్తిమంతంగా, ఆచరణాత్మకంగా ఉన్నాయి.

12 బైబిల్లోని కొన్ని సూత్రాలు కుటుంబ జీవితం, పని అలవాట్లు, ఇతరులతో సంబంధాల గురించినవి. బైబిలు సూత్రాలు అందరికీ వర్తిస్తాయి, దాని ఉపదేశం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది. బైబిల్లోని జ్ఞానం, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటల్లో క్లుప్తంగా ఇలా వర్ణించబడింది: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును.”—యెషయా 48:17.

అదొక ప్రవచన గ్రంథం

బైబిలు రచయితయైన యెషయా బబులోను నాశనం గురించి ప్రవచించాడు

13. బబులోను గురించి ఎలాంటి వివరాలు వ్రాయడానికి యెహోవా యెషయా ప్రవక్తను ప్రేరేపించాడు?

13 బైబిల్లో అనేక ప్రవచనాలు ఉన్నాయి, వాటిలో చాలావరకు ఇప్పటికే నెరవేరాయి. ఒక ఉదాహరణను పరిశీలించండి. సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో జీవించిన యెషయా ప్రవక్త ద్వారా యెహోవా, బబులోను నగరం నాశనమవుతుందని ప్రవచించాడు. (యెషయా 13:19; 14:22, 23) ఆ పట్టణాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటారో చూపించడానికి వివరాలు ఇవ్వబడ్డాయి. ముట్టడించే సైన్యాలు బబులోను నదిలో నీరు లేకుండా చేసి యుద్ధం చేయకుండానే నగరంలోకి ప్రవేశిస్తారని చెప్పబడింది. అంతేకాదు, బబులోనును కోరెషు అనే రాజు జయిస్తాడని చెబుతూ ఆ రాజు పేరును కూడా యెషయా ప్రవచనం పేర్కొంది.యెషయా 44:27-45:2 చదవండి.

14, 15. బబులోనుకు సంబంధించి యెషయా వ్రాసిన ప్రవచనంలోని వివరాలు కొన్ని ఎలా నెరవేరాయి?

14 దాదాపు 200 సంవత్సరాల తర్వాత, సా.శ.పూ. 539 అక్టోబరు 5/6 రాత్రి ఒక సైన్యం బబులోనును ముట్టడించింది. ఆ సైన్యాధిపతి ఎవరు? పర్షియా రాజైన కోరెషు. అలా ఆశ్చర్యకరమైన ఆ ప్రవచన నెరవేర్పుకు రంగం సిద్ధమైంది. కానీ ప్రవచనం చెప్పినట్లుగానే కోరెషు సైన్యం యుద్ధం చేయకుండానే బబులోనును జయిస్తుందా?

15 ఆ రోజు రాత్రి బబులోనీయులు పండుగ చేసుకుంటూ, తమ నగర మహాప్రాకారాల మధ్య తాము సురక్షితంగానే ఉన్నట్లు భావించారు. అదే సమయంలో, కోరెషు తెలివిగా బబులోను మధ్యగా ప్రవహిస్తున్న నదీ జలాలను పక్కకు మళ్లించాడు. కొంతసేపటికే నదిలోని నీరు తగ్గిపోవడంతో అతని సైన్యాలు నది గుండా నగర ప్రాకారాల దగ్గరకు చేరుకున్నాయి. కానీ కోరెషు సైన్యం బబులోను ప్రాకారాలను దాటి ఎలా వెళుతుంది? ఎందుకో గానీ ఆ రాత్రి నగర ముఖద్వారాలు మూయబడకుండా నిర్లక్ష్యంగా అలాగే తెరిచి ఉంచబడ్డాయి.

16. (ఎ) చివరకు బబులోనుకు ఏమి జరుగుతుందని యెషయా ప్రవచించాడు? (బి) బబులోను నిర్జన ప్రదేశంగా మారుతుందని యెషయా చేసిన ప్రవచనం ఎలా నెరవేరింది?

16 బబులోను గురించి ఇలా ప్రవచింపబడింది: “అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు; అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు, గొఱ్ఱెలకాపరులు తమ మందలను అక్కడ పరుండనియ్యరు.” (యెషయా 13:20) ఈ ప్రవచనం ఆ నగర పతనాన్ని మాత్రమే ప్రవచించలేదు. బదులుగా బబులోను శాశ్వతంగా నిర్జన ప్రదేశంగా మారుతుందని కూడా వివరించింది. మీరు ఈ మాటల నెరవేర్పుకు రుజువును చూడవచ్చు. ప్రస్తుత ఇరాక్‌లో, బాగ్దాద్‌కు దక్షిణాన దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో నిర్జనంగా ఉన్న ఆ ప్రాచీన బబులోనును మీరు చూడవచ్చు. అది, “నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను” అని యెషయా ద్వారా యెహోవా పలికిన మాటల నెరవేర్పుకు రుజువుగా ఉంది.—యెషయా 14:22, 23. c

బబులోను శిథిలాలు

17. బైబిలు ప్రవచన నెరవేర్పు ఎలా విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉంది?

17 బైబిలు నమ్మదగిన ప్రవచన గ్రంథమై ఉందని పరిశీలించడం విశ్వాసాన్ని బలపరిచేదిగా లేదా? అవును, యెహోవా దేవుడు తన పూర్వకాలపు వాగ్దానాలు నెరవేర్చాడంటే, పరదైసు భూమికి సంబంధించిన తన వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాడని నమ్మేందుకు మనకు బలమైన ఆధారమే ఉంది. (సంఖ్యాకాండము 23:19 చదవండి.) అవును, “ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను.”—తీతు 1:1-2. d

‘దేవుని వాక్యము సజీవమైనది’

18. “దేవుని వాక్యము” గురించి క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ఎంత శక్తిమంతమైన వ్యాఖ్య చేశాడు?

18 ఈ అధ్యాయంలో మనం పరిశీలించిన దాన్నిబట్టి బైబిలు నిజంగా సాటిలేని గ్రంథమని స్పష్టమవుతోంది. అయితే దాని విలువ అంతర్గత పొందిక, విజ్ఞానశాస్త్ర మరియు చారిత్రక ఖచ్చితత్వం, ఆచరణాత్మక జ్ఞానం, నమ్మదగిన ప్రవచనాలకు మాత్రమే పరిమితం కాదు. క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.”—హెబ్రీయులు 4:12.

19, 20. (ఎ) మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి బైబిలు ఎలా సహాయం చేయగలదు? (బి) దేవుడు ఇచ్చిన సాటిలేని బహుమతి అయిన బైబిలుపట్ల మీ కృతజ్ఞతా భావాన్ని ఎలా చూపించవచ్చు?

19 దేవుని ‘వాక్యాన్ని’ లేదా బైబిల్లోని సందేశాన్ని చదవడం మన జీవితాన్నే మార్చగలదు. మనల్ని మనం నిశితంగా పరిశీలించుకోవడానికి అది సహాయం చేయగలదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనం చెప్పుకోవచ్చు, అయితే ఆయన ప్రేరేపిత వాక్యమైన బైబిలు బోధకు మనం స్పందించే తీరు, మన నిజ తలంపులను, మన హృదయాలోచనలను సైతం వెల్లడి చేస్తుంది.

20 బైబిలు నిజంగా దేవుడు అనుగ్రహించిన గ్రంథం. దానిని మనం చదవాలి, అధ్యయనం చేయాలి, ప్రేమించాలి. మీరు ఎల్లప్పుడూ దానిలోని విషయాలను పరిశీలించడం ద్వారా ఆ దైవిక బహుమతిపట్ల మీ కృతజ్ఞతా భావాన్ని చూపించండి. మీరలా చేసినప్పుడు, మానవాళి విషయంలో దేవుని సంకల్పంపట్ల మరింత ప్రగాఢమైన అవగాహన ఏర్పడుతుంది. ఆ సంకల్పం ఏమిటి, అదెలా నిజమవుతుంది అనే విషయాలు తర్వాతి అధ్యాయంలో పరిశీలించబడతాయి.

a బైబిల్లోని కొన్ని భాగాలు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉన్నాయని కొందరు ఆరోపించినా, అలాంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారమూ లేదు. యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) అనే పుస్తకంలో 7వ అధ్యాయాన్ని చూడండి.

b ఉదాహరణకు, లూకా 3:23-38⁠లో వివరణాత్మకంగా ఉన్న యేసు వంశావళిని గమనించండి.

c బైబిలు ప్రవచనాలకు సంబంధించి మరింత సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన సర్వమానవాళి కొరకైన గ్రంథము అనే బ్రోషుర్‌లో 27-29 పేజీలు చూడండి.

d బబులోను నాశనం, ఇప్పటికే నెరవేరిన బైబిలు ప్రవచనాలకు సంబంధించిన ఒక ఉదాహరణ మాత్రమే. తూరు, నీనెవె పట్టణాల నాశనం మరో ఉదాహరణ. (యెహెజ్కేలు 26:1-5; జెఫన్యా 2:13-15) అంతేకాదు, బబులోను తర్వాత వరుసగా అధికారానికి వచ్చే ప్రపంచ సామ్రాజ్యాల గురించి కూడా దానియేలు ముందుగానే ప్రవచించాడు. వీటిలో మాదీయ పారసీకుల సామ్రాజ్యం, గ్రీసు సామ్రాజ్యం ఉన్నాయి. (దానియేలు 8:5-7, 20-22) యేసుక్రీస్తులో నెరవేరిన మెస్సీయ సంబంధిత అనేక ప్రవచనాల చర్చ కోసం అనుబంధంలోని 200-201 పేజీలు చూడండి.