కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుబంధం

“మహా బబులోనును” గుర్తించడం

“మహా బబులోనును” గుర్తించడం

అక్షరార్థంగా అర్థం చేసుకోకూడని పదాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. (ప్రకటన 1:1) ఉదాహరణకు, నొసటి మీద “మహా బబులోను” అని వ్రాసి ఉన్న ఒక స్త్రీ గురించి అది ప్రస్తావిస్తోంది. ఆ స్త్రీ ‘జనసమూహముల మీద, జనముల మీద’ కూర్చున్నట్లుగా వర్ణించబడింది. (ప్రకటన 17:1, 5, 15) అయితే అక్షరార్థంగా ఏ స్త్రీ అలా కూర్చోలేదు కాబట్టి, మహా బబులోను తప్పకుండా సూచనార్థకమైనదే అయ్యుండాలి. అలాంటప్పుడు ఈ సూచనార్థక వేశ్య దేనికి ప్రతీకగా ఉంది?

ప్రకటన 17:18 లో ఆ అలంకారార్థ స్త్రీ “భూరాజులనేలు మహాపట్టణము” అని వర్ణించబడింది. ‘పట్టణం’ అనే మాట సంస్థీకృత ప్రజల గుంపును సూచిస్తోంది. ‘భూరాజులందరు ఆ మహాపట్టణం’ ఆధీనంలో ఉన్నారు కాబట్టి, మహాబబులోను అనే పేరుగల ఆ స్త్రీ అంతర్జాతీయంగా పలుకుబడిగల సంస్థయై ఉండాలి. దాన్ని ప్రపంచ సామ్రాజ్యం అని పిలవడం సమంజసమే. అది ఎలాంటి సామ్రాజ్యం? అది ఒక మత సామ్రాజ్యం. ఆ ముగింపుకు రావడానికి ప్రకటన పుస్తకంలో దానికి సంబంధించిన కొన్ని భాగాలు మనకెలా సహాయం చేస్తాయో గమనిద్దాం.

ఒక సామ్రాజ్యం రాజకీయ, వాణిజ్య, లేదా మత సంబంధమైనదిగా ఉండవచ్చు. మహాబబులోను అనే పేరుగల ఆ స్త్రీ రాజకీయ సామ్రాజ్యం కాదు ఎందుకంటే “భూరాజులు” లేదా ఈ ప్రపంచ రాజకీయ శక్తులు దానితో “వ్యభిచరించారు” అని దేవుని వాక్యం చెబుతోంది. ఆమె చేస్తున్న వ్యభిచారం భూలోకంలోని రాజులతో ఆమె పెట్టుకున్న సంబంధాన్ని సూచిస్తూ, “మహా వేశ్య” అని ఆమె ఎందుకు పిలవబడుతోందో వివరిస్తోంది.—ప్రకటన 17:1, 2; యాకోబు 4:4.

మహాబబులోను వాణిజ్య సామ్రాజ్యం కాదు, ఎందుకంటే వాణిజ్య శక్తులకు ప్రతీకగా ఉన్న “భూలోకమందలి వర్తకులు” ఆమె నశించినప్పుడు ఆమెను చూసి దుఃఖిస్తారు. నిజానికి ఇటు రాజులు, అటు వర్తకులు “దూరమున నిలువబడి” మహాబబులోనును చూస్తున్నట్లుగా బైబిలు వర్ణిస్తోంది. (ప్రకటన 18:3, 9, 10, 15-17) కాబట్టి, మహాబబులోను రాజకీయ లేదా వాణిజ్య సామ్రాజ్యం కాదు, మత సామ్రాజ్యం అనే ముగింపుకు రావడం సహేతుకమే.

అంతేకాక, ఆమె తన “మాయమంత్రములచేత” జనాంగములను మోసగిస్తోంది అనే వ్యాఖ్య మహాబబులోను మతసంబంధ గుర్తింపును మరింతగా ధృవీకరిస్తోంది. (ప్రకటన 18:22) ఎలాంటి అభిచారమైనా అది మతసంబంధమైనదీ, దయ్యములచేత ప్రేరేపితమైనదీ కాబట్టి, బైబిలు మహాబబులోనును “దయ్యములకు నివాసస్థలము” అని పిలవడంలో ఆశ్చర్యం లేదు. (ప్రకటన 18:2; ద్వితీయోపదేశకాండము 18:10-12) ఈ సామ్రాజ్యము నిజమైన మతాన్ని వ్యతిరేకించడంలో, ‘ప్రవక్తలను, పరిశుద్ధులను’ హింసించడంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నట్లు కూడా బైబిలు వర్ణించింది. (ప్రకటన 18:24) వాస్తవానికి, సత్యమతంపట్ల మహాబబులోనుకు ఎంత తీవ్రమైన ద్వేషం ఉందంటే అది ‘యేసు సాక్షులను’ తీవ్రంగా హింసిస్తూ, వారిని హత్య కూడా చేస్తోంది. (ప్రకటన 17:6) కాబట్టి, మహాబబులోను అనే పేరుగల ఈ స్త్రీ స్పష్టంగా యెహోవా దేవునికి విరుద్ధమైన అన్ని మతాలు ఇమిడివున్న ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యానికి ప్రతీకగా ఉంది.