అనుబంధం
యేసు డిసెంబరులో జన్మించాడా?
యేసు ఎప్పుడు జన్మించాడో బైబిలు మనకు చెప్పడం లేదు. అయితే ఆయన డిసెంబరులో జన్మించలేదు అనడానికి సరైన కారణాన్ని బైబిలు మనకు ఇస్తోంది.
యేసు జన్మించిన బేత్లెహేములో, సంవత్సరంలోని ఆ నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులను పరిశీలించండి. యూదా నెల అయిన కిస్లేవు (నవంబరు/డిసెంబరు మధ్య వచ్చే) నెలలో వాతావరణం చలి, వర్షాలతో ఉంటుంది. ఆ తర్వాతి నెల టెబేతు (డిసెంబరు/జనవరి మధ్య వస్తుంది). సంవత్సరంలోని ఆ నెలల్లో ఎత్తైన ప్రాంతాల్లో అప్పుడప్పుడూ మంచు కురుస్తూ, చాలా చలిగా ఉంటుంది. ఆ ప్రాంతపు వాతావరణం గురించి మనకు బైబిలు ఏమి చెబుతోందో చూద్దాం.
కిస్లేవు నెల చలిగా ఉండే, వర్షం కురిసే కాలమని బైబిలు రచయిత ఎజ్రా వివరిస్తున్నాడు. “అది [కిస్లేవు] తొమ్మిదవ నెల; ఆ నెల యిరువదియవ దినమున” ప్రజలు యెరూషలేములో సమకూడారని చెప్పిన తర్వాత వారు “గొప్ప వర్షాలచేత తడియుచు . . . వణకుచుండిరి” అని ఎజ్రా నివేదిస్తున్నాడు. ఎజ్రా 10:9, 13; యిర్మీయా 36:22) డిసెంబరు వచ్చేసరికి ఆ ప్రాంతంలోని గొర్రెల కాపరులు తాము గానీ తమ గొర్రెలు గానీ రాత్రిపూట ఆరుబయట ఉండకుండా జాగ్రత్త వహిస్తారనడంలో సందేహం లేదు.
సంవత్సరంలోని ఆ నెలలో సమావేశమైన ఆ ప్రజలు స్వయంగా ఇలా అన్నారు: “ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము.” (కానీ యేసు జన్మించిన రాత్రి, గొర్రెల కాపరులు పొలాల్లో తమ మందలకు కాపలా కాస్తూ ఉన్నారని బైబిలు నివేదిస్తోంది. వాస్తవానికి, బైబిలు రచయిత లూకా, ఆ సమయంలో బేత్లెహేము సమీపంలో గొర్రెల కాపరులు “పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచు[న్నారు]” అని వివరిస్తున్నాడు. (లూకా 2:8-12) పగటిపూట బయట తిరగడం మాత్రమే కాదుగానీ గొర్రెల కాపరులు పొలములోనే ఉండడాన్ని గమనించండి. వారి మందలు రాత్రిపూట పొలాల్లో ఉన్నాయి. అలా బయట ఉంటున్నారు అనే వర్ణన డిసెంబరు నెలలో బేత్లెహేములో చలి, వర్షాలతో ఉండే వాతావరణానికి పొందికగా ఉంటుందా? ఎంతమాత్రం ఉండదు. కాబట్టి యేసు జన్మించిన కాలంనాటి చుట్టుప్రక్కల పరిస్థితులు ఆయన డిసెంబరు నెలలో జన్మించలేదని సూచిస్తున్నాయి. a
యేసు ఖచ్చితంగా ఎప్పుడు మరణించాడో దేవుని వాక్యం మనకు చెబుతుందే గానీ, ఆయన ఎప్పుడు జన్మించాడనే విషయంలో సూటిగా ఏమీ చెప్పడం లేదు. ఇది రాజైన సొలొమోను మాటలను గుర్తు చేస్తోంది: “సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు.” (ప్రసంగి 7:1) అందుకే యేసు పరిచర్య, మరణం విషయంలో ఎన్నో వివరణలు ఇచ్చిన బైబిలు యేసు జననం విషయంలో చాలా తక్కువ వివరణలను ఇచ్చిందంటే అందుకు ఆశ్చర్యపోనవసరం లేదు.
a మరింత సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాల నుండి తర్కించడం (ఆంగ్లం) పుస్తకంలోని 176-179 పేజీలు చూడండి.