కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఐదవ అధ్యాయం

విమోచన క్రయధనం—దేవుడిచ్చిన అతిగొప్ప బహుమానం

విమోచన క్రయధనం—దేవుడిచ్చిన అతిగొప్ప బహుమానం
  • విమోచన క్రయధనం అంటే ఏమిటి?

  • అది ఎలా చెల్లించబడింది?

  • అది మీకు ఏ ప్రయోజనాలు చేకూర్చగలదు?

  • మీరు దాన్ని విలువైనదిగా పరిగణిస్తున్నారని ఎలా చూపించవచ్చు?

1, 2. (ఎ) మీరు ఒక బహుమానాన్ని ఎప్పుడు అత్యంత విలువైనదిగా పరిగణిస్తారు? (బి) మీరు పొందగల బహుమానాలన్నింటిలో విమోచన క్రయధనమే అత్యంత విలువైనదని ఎందుకు చెప్పవచ్చు?

 మీకు లభించిన అతిగొప్ప బహుమానం ఏమిటి? ఆ బహుమానం మీకు ముఖ్యమైనదిగా ఉండాలంటే అది ఖరీదైనదై ఉండనక్కర్లేదు. ఎందుకంటే బహుమానం ఖరీదునుబట్టి దాని నిజమైన విలువను నిర్ణయించలేము. బదులుగా, ఆ బహుమానం మిమ్మల్ని సంతోషపరిచి, మీ జీవితంలో నిజమైన అవసరాన్ని తీర్చినప్పుడు మీరు దానిని అమూల్యమైనదిగానే పరిగణిస్తారు.

2 మీరు కోరుకోగల బహుమానాలన్నింటిలో అత్యంత ఉన్నతమైనదిగా నిలిచే బహుమానం ఒకటుంది. అది మానవాళికి దేవుడిచ్చిన బహుమానం. యెహోవా మనకెన్నో అనుగ్రహించాడు, అయితే ఆయన మనకిచ్చిన అతిగొప్ప బహుమానం తన కుమారుడైన యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి. (మత్తయి 20:28 చదవండి.) ఈ అధ్యాయంలో మనం చూడబోతున్నట్లుగా, విమోచన క్రయధనం మీరు అందుకోగల అత్యంత విలువైన బహుమానం, ఎందుకంటే అది మీకు చెప్పలేనంత సంతోషాన్ని తీసుకురావడమే కాక, మీ అత్యంత ప్రాముఖ్యమైన అవసరాలను కూడా తీర్చగలదు. విమోచన క్రయధనం నిజానికి మీ మీద యెహోవాకు ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం.

విమోచన క్రయధనం అంటే ఏమిటి?

3. విమోచన క్రయధనం అంటే ఏమిటి, ఈ బహుమానం ఎందుకంత విలువైనదో గ్రహించడానికి మనం దేనిని అర్థం చేసుకోవాలి?

3 ఒక్క మాటలో చెప్పాలంటే, మానవాళిని పాపమరణాల నుండి విడుదల చేయడానికి లేదా రక్షించడానికి యెహోవా ఏర్పాటు చేసిన మార్గమే విమోచన క్రయధనం. (ఎఫెసీయులు 1:7) బైబిలు బోధించే ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి, మనం ఏదెను తోటలో జరిగిన దానిని మళ్లీ ఒకసారి పరిశీలించాలి. ఆదాము పాపం చేసినప్పుడు ఏమి పోగొట్టుకున్నాడో అర్థం చేసుకున్నప్పుడే, విమోచన క్రయధనం ఎందుకంత విలువైన బహుమానమో మనం గ్రహించగలుగుతాం.

4. ఆదాముకు పరిపూర్ణ మానవ జీవితం ఏమేమి ప్రయోజనాలు చేకూర్చి ఉండేది?

4 యెహోవా ఆదామును సృష్టించినప్పుడు, ఎంతో ప్రశస్తమైన పరిపూర్ణ మానవ జీవితాన్ని అతనికి ఇచ్చాడు. అది ఆదాముకు ఏమేమి ప్రయోజనాలు చేకూరుస్తుందో పరిశీలించండి. పరిపూర్ణ శరీరం, పరిపూర్ణ మేధస్సు ఉన్న కారణంగా అతను ఎన్నటికీ వ్యాధిగ్రస్తుడు కాడు, వృద్ధుడు కాడు లేదా మరణించడు. పరిపూర్ణ మానవునిగా అతనికి యెహోవాతో ఒక ప్రత్యేక సంబంధముంది. ఆదాము “దేవునికి కుమారుడు” అని బైబిలు చెబుతోంది. (లూకా 3:38) కాబట్టి ప్రేమగల తండ్రితో ఒక కుమారునికి ఎలాంటి సంబంధం ఉంటుందో, ఆదాము కూడా యెహోవా దేవునితో అలాంటి సన్నిహిత సంబంధాన్ని అనుభవించాడు. యెహోవా తన భూసంబంధ కుమారునికి సంతృప్తికరమైన పనులు అప్పగిస్తూ, తాను అతని నుండి ఏమి ఆశిస్తున్నాడో చెబుతూ అతనితో సంభాషించాడు.—ఆదికాండము 1:28-30; 2:16, 17.

5. ఆదామును “దేవుడు తన స్వరూపమందు” సృష్టించాడు అని బైబిలు చెప్పినప్పుడు దాని భావమేమిటి?

5 ఆదామును “దేవుడు తన స్వరూపమందు” సృష్టించాడు. (ఆదికాండము 1:27) అంటే ఆదాము దేవుని పోలికలతో ఉన్నాడని కాదు. ఈ పుస్తకం మొదటి అధ్యాయంలో మనం తెలుసుకున్నట్లుగా యెహోవా అదృశ్య ఆత్మ. (యోహాను 4:24) కాబట్టి యెహోవాకు రక్తమాంసాల శరీరం లేదు. ఆదామును దేవుడు తన స్వరూపంలో సృష్టించాడంటే, ప్రేమ, జ్ఞానం, న్యాయం, శక్తిలాంటి తన లక్షణాలతో సృష్టించాడని దాని భావం. ఆదాము మరో ప్రాముఖ్యమైన రీతిలో తన తండ్రిలా ఉన్నాడు, అదేమిటంటే, దేవుడు ఆయనకు స్వయంగా నిర్ణయించుకునే స్వేచ్ఛను లేదా స్వేచ్ఛాచిత్తాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆదాము, నిర్ణయించబడిన ప్రకారమే లేదా ప్రోగ్రాం చేయబడిన ప్రకారమే పనిచేసే ఒక యంత్రంలా లేడు. బదులుగా, అతను మంచి చెడులను ఎంచుకునే విషయంలో వ్యక్తిగత నిర్ణయాలు చేసుకోగలడు. అతను దేవునికి లోబడాలని ఎంచుకుని ఉంటే, పరదైసు భూమ్మీద నిత్యం జీవించి ఉండేవాడే.

6. ఆదాము దేవునికి అవిధేయుడైనప్పుడు ఏమి పోగొట్టుకున్నాడు, అది అతని సంతానంపై ఎలాంటి ప్రభావం చూపించింది?

6 కాబట్టి, ఆదాము దేవునికి అవిధేయుడై, మరణశిక్ష అనుభవించినప్పుడు ఎంతో విలువైన దానిని కోల్పోయాడు. అతని పాపంవల్ల అతనికి పరిపూర్ణ మానవ జీవితంతోపాటు దాని సమస్త ఆశీర్వాదాలు దక్కకుండా పోయాయి. (ఆదికాండము 3:17-19) ఆ అమూల్యమైన జీవితాన్ని ఆదాము తాను కోల్పోవడమే కాక తన భావి సంతానానికి కూడా దక్కకుండా చేశాడు. దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “ఒక మనుష్యుని [ఆదాము] ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) అవును, ఆదాము ద్వారానే మనందరికీ పాపమరణాలు వారసత్వంగా లభించాయి. అందుకే బైబిలు అతను తనను, తన సంతానాన్ని పాపమరణాల దాసత్వానికి ‘అమ్ముకున్నాడని’ చెబుతోంది. (రోమీయులు 7:14) ఆదాము హవ్వలు దేవునికి లోబడకూడదని ఉద్దేశపూర్వకంగా నిర్ణయించుకున్నారు కాబట్టి వారికి ఎలాంటి నిరీక్షణా లేదు. కానీ వారి సంతానమైన మన విషయమేమిటి?

7, 8. విమోచన క్రయధనంలో ప్రాథమికంగా ఏ రెండు అంశాలు ఇమిడివున్నాయి?

7 విమోచన క్రయధనం ద్వారా యెహోవా మానవాళిని రక్షించాడు. అసలు విమోచన క్రయధనం అంటే ఏమిటి? విమోచన క్రయధనంలో ప్రాథమికంగా రెండు అంశాలు ఉంటాయి. మొదటిది, విడుదల తీసుకురావడానికి లేదా ఏదైనా తిరిగి కొనడానికి చెల్లించే మూల్యాన్ని విమోచన క్రయధనం అంటారు. దీనిని యుద్ధ ఖైదీని విడుదల చేయడానికి చెల్లించే మూల్యంతో పోల్చవచ్చు. రెండవది, ఏదైనా ఒక వస్తువు ఖరీదుకు సరిపడేంత మూల్యాన్ని ఇవ్వడం లేదా చెల్లించడం. దీనిని హాని జరిగిన వ్యక్తికి తగిన నష్టపరిహారం చెల్లించడంతో పోల్చవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఏదైనా దుర్ఘటనకు కారకుడైతే, అతను జరిగిన నష్టానికి సరిసమానమైన మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది.

8 మనందరికీ కలిగిన అపారమైన నష్టాన్ని పూరించి పాపమరణాల దాస్యం నుండి మనలను విడిపించడం ఎలా సాధ్యమవుతుంది? మనమిప్పుడు యెహోవా అనుగ్రహించిన విమోచన క్రయధనాన్ని, అది మీకు చేకూర్చే ప్రయోజనాలను పరిశీలిద్దాం.

విమోచన క్రయధనాన్ని యెహోవా ఎలా చెల్లించాడు?

9. ఎలాంటి విమోచన క్రయధనం అవసరమైంది?

9 ఒక పరిపూర్ణ ప్రాణానికి నష్టం జరిగింది కాబట్టి, ఏ అపరిపూర్ణ మానవుడూ దానిని పూరించలేడు. (కీర్తన 49:7, 8) ఆ నష్టానికి సరిగ్గా సరిపోయే విమోచన క్రయధనం కావాలి. అది “ప్రాణమునకు ప్రాణము” అని దేవుని వాక్యంలో చెప్పబడిన పరిపూర్ణ న్యాయ సూత్రానికి అనుగుణంగా ఉంటుంది. (ద్వితీయోపదేశకాండము 19:21) మరి ఆదాము పోగొట్టుకున్న పరిపూర్ణ మానవ ప్రాణం లేదా జీవం విలువకు సమానంగా ఏమి చెల్లించబడాలి? దానికి సరిసమాన “విమోచన క్రయధనముగా” పరిపూర్ణ మానవ ప్రాణమే చెల్లించబడాలి.—1 తిమోతి 2:6.

10. యెహోవా విమోచన క్రయధనాన్ని ఎలా ఏర్పాటు చేశాడు?

10 యెహోవా ఆ విమోచన క్రయధనాన్ని ఎలా ఏర్పాటు చేశాడు? తన పరిపూర్ణ ఆత్మ సంబంధ కుమారుల్లో ఒకరిని ఈ భూమ్మీదికి పంపించాడు. అయితే యెహోవా తన ఆత్మ సంబంధ ప్రాణుల్లో ఎవరినో ఒకరిని పంపించలేదు. తనకు అతి ప్రియమైన తన అద్వితీయ కుమారుణ్ణి పంపించాడు. (1 యోహాను 4:9, 10 చదవండి.) ఆ కుమారుడు తన పరలోక గృహాన్ని ఇష్టపూర్వకంగా విడిచిపెట్టాడు. (ఫిలిప్పీయులు 2:7) ఈ పుస్తకంలోని ముందరి అధ్యాయంలో మనం తెలుసుకున్నట్లుగా, యెహోవా తన కుమారుని జీవాన్ని అద్భుతరీతిలో మరియ గర్భానికి మార్చాడు. దేవుని పరిశుద్ధాత్మ మూలంగా, యేసు పాపాన్ని వారసత్వంగా పొందని పరిపూర్ణ మానవునిగా జన్మించాడు.—లూకా 1:35.

యెహోవా తన అద్వితీయ కుమారుణ్ణి మనకోసం విమోచన క్రయధనంగా ఇచ్చాడు

11. ఒకే మానవుడు కోట్లాదిమందికి ప్రతిగా విమోచన క్రయధనాన్ని ఎలా చెల్లించగలడు?

11 ఒకే ఒక వ్యక్తి అనేకులకు, నిజానికి కోట్లాదిమందికి ప్రతిగా విమోచన క్రయధనాన్ని ఎలా చెల్లించగలడు? కోట్ల సంఖ్యలో మానవులు పాపులు ఎలా అయ్యారో గుర్తు చేసుకోండి. ఆదాము పాపం చేసి ప్రశస్తమైన పరిపూర్ణ మానవ జీవితాన్ని పోగొట్టుకోవడంవల్లనే కదా. ఆదాము ఆ జీవాన్ని తన సంతానానికి ఇవ్వలేకపోయాడు. వారికి పాపమరణాలను మాత్రమే ఇవ్వగలిగాడు. అయితే “కడపటి ఆదాము” అని బైబిలు పిలిచే యేసు పరిపూర్ణ మానవునిగా ఉండడమే కాక, ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. (1 కొరింథీయులు 15:45) ఒక విధంగా చెప్పాలంటే, మనలను రక్షించడానికి యేసు ఆదాము స్థానంలోకి వెళ్లాడు. దేవునికి నిష్కళంకమైన విధేయత చూపి తన పరిపూర్ణ ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా, యేసు ఆదాము పాపానికి తగిన మూల్యాన్ని చెల్లించాడు. అలా, ఆదాము సంతానానికి యేసు ఒక నిరీక్షణ అందించాడు.—రోమీయులు 5:19; 1 కొరింథీయులు 15:21, 22.

12. యేసు సహించిన బాధలు దేనిని నిరూపించాయి?

12 మరణానికి ముందు యేసు సహించిన బాధలను బైబిలు సవివరంగా వర్ణిస్తోంది. ఆయనను కొరడాలతో కొట్టారు, హింసాకొయ్యపై వేలాడదీశారు, ఆయన అత్యంత బాధాకరంగా మరణించాడు. (యోహాను 19:1, 16-18, 30; అనుబంధంలో 205-206 పేజీలు) యేసు అంతగా ఎందుకు బాధపడాల్సి వచ్చింది? ఈ పుస్తకంలోని మరో అధ్యాయంలో, యెహోవా సేవకులు పరీక్షలు ఎదురైనా నమ్మకంగా ఉంటారా అని సాతాను ప్రశ్నించాడు అని తెలుసుకుంటాం. యేసు తీవ్రమైన బాధలను నమ్మకంగా సహించడం ద్వారా, సాతాను సవాలుకు తిరుగులేని జవాబిచ్చాడు. స్వేచ్ఛాచిత్తంగల పరిపూర్ణ మానవులు, అపవాది ఏమి చేసినా దేవునిపట్ల తమ పరిపూర్ణ యథార్థతను నిలుపుకోగలరని యేసు నిరూపించాడు. తన ప్రియకుమారుని విశ్వసనీయతను చూసి యెహోవా ఎంత సంతోషించి ఉంటాడో కదా!—సామెతలు 27:11.

13. విమోచన క్రయధనం ఎలా చెల్లించబడింది?

13 విమోచన క్రయధనం ఎలా చెల్లించబడింది? సా.శ. 33లో యూదుల నెల అయిన నీసానులో 14వ రోజున పాపరహితుడు, పరిపూర్ణుడు అయిన తన కుమారుడు చంపబడడానికి యెహోవా అనుమతించాడు. ఆ విధంగా, యేసు “ఒక్కసారియే” తన పరిపూర్ణ మానవ జీవితాన్ని బలిగా అర్పించాడు. (హెబ్రీయులు 10:10) యేసు మరణించిన మూడవ రోజున, యెహోవా ఆయనను తిరిగి ఆత్మసంబంధ జీవానికి లేపాడు. అప్పుడు యేసు పరలోకంలో, ఆదాము సంతతి కోసం తాను విమోచన క్రయధనంగా అర్పించిన తన పరిపూర్ణ మానవ జీవిత బలి విలువను దేవునికి సమర్పించాడు. (హెబ్రీయులు 9:24) యేసు బలి విలువను యెహోవా, మానవాళిని పాపమరణాల దాసత్వం నుండి విడిపించే విమోచన క్రయధనంగా ఆమోదించాడు.రోమీయులు 3:23, 24 చదవండి.

విమోచన క్రయధనం మీకు ఏ ప్రయోజనాలు చేకూర్చగలదు?

14, 15. “పాపక్షమాపణ” పొందడానికి మనమేమి చేయాలి?

14 మనం పాపపు స్థితిలో ఉన్నా విమోచన క్రయధనం కారణంగా అమూల్యమైన ఆశీర్వాదాలను అనుభవించవచ్చు. దేవుడు అనుగ్రహించిన ఈ అతిగొప్ప బహుమతి ద్వారా ప్రస్తుతమూ, భవిష్యత్తులోనూ కలిగే ప్రయోజనాల్లో కొన్నింటిని మనం పరిశీలిద్దాం.

15 పాపక్షమాపణ. వారసత్వంగా లభించిన అపరిపూర్ణత కారణంగా, మనం సరైనది చేయడానికి ఎంతో పోరాడవలసి వస్తోంది. మాటల్లోను చేతల్లోను మనమందరం పాపం చేస్తాం. అయితే యేసు విమోచన క్రయధనం మూలంగా మనం “పాపక్షమాపణ” పొందవచ్చు. (కొలొస్సయులు 1:13, 14) కానీ ఆ పాపక్షమాపణ పొందడానికి మనం నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించాలి. అలాగే కుమారుని విమోచన క్రయధనం మీద మనకున్న విశ్వాసాన్ని బట్టి పాపక్షమాపణ కోసం యెహోవాను వినయంతో వేడుకోవాలి.1 యోహాను 1:8, 9 చదవండి.

16. నిర్మలమైన మనస్సాక్షితో దేవుణ్ణి ఆరాధించేందుకు మనకేది దోహదపడుతుంది, అలాంటి మనస్సాక్షి ఎంత విలువైనది?

16 దేవునియెదుట నిర్మలమైన మనస్సాక్షి. అపరాధభావంతో నలిగిపోతున్న మనస్సాక్షి మనలను నిరీక్షణలేని స్వభావానికి నడిపించి, మనం పనికిరాని వారమనే భావాన్ని కలిగిస్తుంది. అయితే విమోచన క్రయధనం ద్వారా సాధ్యపరచబడిన క్షమాపణవల్ల, మనం అపరిపూర్ణులమైనా నిర్మలమైన మనస్సాక్షితో తనను ఆరాధించేందుకు యెహోవా దయతో అనుమతిస్తున్నాడు. (హెబ్రీయులు 9:13, 14) నిర్మలమైన మనస్సాక్షి కారణంగా మనం యెహోవాతో నిరాటంకంగా మాట్లాడగలము. కాబట్టి, మనం ఆయనకు నిర్భయంగా ప్రార్థించవచ్చు. (హెబ్రీయులు 4:14-16) నిర్మలమైన మనస్సాక్షిని కాపాడుకోవడం మనకు మనశ్శాంతిని ఇవ్వడమే కాక, ఆత్మ గౌరవానికి తోడ్పడుతూ, సంతోషాన్ని కూడా ఇస్తుంది.

17. యేసు మనకోసం చనిపోయాడు కాబట్టి మనం ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవించగలుగుతాము?

17 పరదైసు భూమ్మీద నిత్యజీవ నిరీక్షణ. “పాపమువలన వచ్చు జీతము మరణము” అని రోమీయులు 6:23 చెబుతోంది. అదే వచనం ఇంకా ఇలా చెబుతోంది: “అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.” మనం ఈ పుస్తకంలోని 3వ అధ్యాయంలో, రాబోయే భూ పరదైసు ఆశీర్వాదాల గురించి చర్చించాం. (ప్రకటన 21:3, 4) యేసు మనకోసం చనిపోయాడు కాబట్టే మనం పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా నిరంతరం జీవిస్తూ ఆ భావి ఆశీర్వాదాలన్నింటిని అనుభవించగలుగుతాము. అయితే ఆ ఆశీర్వాదాలు అనుభవించాలంటే, విమోచన క్రయధనం విషయంలో మనకు కృతజ్ఞత ఉందని చూపించాలి.

మీ కృతజ్ఞతా భావాన్ని మీరెలా చూపించవచ్చు?

18. విమోచన క్రయధనం విషయంలో మనమెందుకు యెహోవాపట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి?

18 విమోచన క్రయధనం విషయంలో మనమెందుకు యెహోవాపట్ల లోతైన కృతజ్ఞతా భావంతో ఉండాలి? మనకు బహుమతి ఇచ్చిన వ్యక్తి దాని కోసం తన సమయాన్ని వెచ్చించి, ప్రయత్నం చేసి, వ్యయం చెల్లించినప్పుడు ఆ బహుమతి మనకు అమూల్యమైనదిగా ఉంటుంది. ఆ వ్యక్తికి మనపట్ల యథార్థమైన ప్రేమ ఉన్నందువల్లే ఆ బహుమతిని ఇచ్చాడు అని మనం తెలుసుకున్నప్పుడు మన హృదయం చలిస్తుంది. విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి దేవుడు గొప్ప త్యాగం చేశాడు కాబట్టి, అది అన్నిటికన్నా అమూల్యమైన బహుమానం. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయకుమారుని . . . అనుగ్రహించెను” అని యోహాను 3:16 చెబుతోంది. విమోచన క్రయధనం యెహోవా ప్రేమకు అత్యంత అసాధారణ రుజువు. అది యేసు ప్రేమకు కూడా రుజువే, ఎందుకంటే ఆయన మనకోసం తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా ఇచ్చాడు. (యోహాను 15:13 చదవండి.) కాబట్టి విమోచన క్రయధనం అనే బహుమానం యెహోవా, ఆయన కుమారుడు మనలను వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నారని మనలను ఒప్పించాలి.—గలతీయులు 2:20.

యెహోవా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడం, విమోచన క్రయధనం అనే బహుమానం విషయంలో దేవునిపట్ల మీకున్న కృతజ్ఞతను చూపించడానికి ఒక మార్గం

19, 20. దేవుని బహుమానమైన విమోచన క్రయధనం విషయంలో మీరు కృతజ్ఞతతో ఉన్నారని ఏయే విధాలుగా చూపించవచ్చు?

19 కాబట్టి, విమోచన క్రయధనం అనే బహుమానాన్ని ఇచ్చినందుకు మీరు దేవునిపట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నారని ఎలా ప్రదర్శించవచ్చు? మొట్టమొదట మీరు ఆ మహాదాత అయిన యెహోవా గురించి తెలుసుకోవాలి. (యోహాను 17:3) ఈ పుస్తకం సహాయంతో బైబిలు అధ్యయనం చేస్తే మీరు యెహోవా గురించి తెలుసుకుంటారు. యెహోవా గురించి తెలుసుకునేకొద్దీ, ఆయనపట్ల మీ ప్రేమ మరింత ప్రగాఢమవుతుంది. మీరు ఆయనను సంతోషపెట్టాలని కోరుకునేలా ఆ ప్రేమ మిమ్మల్ని పురికొల్పుతుంది.—1 యోహాను 5:3.

20 యేసు విమోచన క్రయధన బలిమీద విశ్వాసం ఉంచండి. యేసు గురించి ఇలా చెప్పబడింది: “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు.” (యోహాను 3:36) మనకు యేసుమీద విశ్వాసం ఉందని ఎలా చూపించవచ్చు? అలాంటి విశ్వాసాన్ని కేవలం మాటల ద్వారా చూపించడం కుదరదు. “క్రియలు లేని విశ్వాసము మృతము” అని యాకోబు 2:26 చెబుతోంది. అవును, నిజమైన విశ్వాసం మన “క్రియల” ద్వారా అంటే చర్యల ద్వారా నిరూపించబడుతుంది. యేసుమీద మనకు విశ్వాసముందని చూపించడానికి, మన మాటల్లోనే కాదుగానీ క్రియల్లో కూడా ఆయనను అనుకరించడానికి మన శాయశక్తులా ప్రయత్నించడమే అత్యుత్తమ మార్గం.—యోహాను 13:15.

21, 22. (ఎ) ప్రభువు రాత్రి భోజన వార్షిక ఆచరణకు మనమెందుకు హాజరవ్వాలి? (బి) 6, 7 అధ్యాయాల్లో ఏమి వివరించబడుతుంది?

21 ప్రభువు రాత్రి భోజనపు వార్షిక ఆచరణకు హాజరవండి. సా.శ. 33 నీసాను 14 సాయంకాలం యేసు, “ప్రభువు రాత్రి భోజనము” అని బైబిలు పిలిచే ఒక ప్రత్యేక ఆచరణను ప్రవేశపెట్టాడు. (1 కొరింథీయులు 11:20; మత్తయి 26:26-28) ఈ ఆచరణ క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ అని కూడా పిలువబడుతుంది. యేసు పరిపూర్ణ మానవునిగా మరణించడం ద్వారా తన ప్రాణాన్ని లేదా జీవాన్ని విమోచన క్రయధనంగా ఇచ్చాడని తన అపొస్తలులు, వారి తర్వాత నిజ క్రైస్తవులందరూ గుర్తుంచుకొనేందుకు సహాయం చేయడానికే ఆయన దానిని స్థాపించాడు. ఈ ఆచరణ గురించి యేసు ఇలా ఆజ్ఞాపించాడు: “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.” (లూకా 22:19) జ్ఞాపకార్థ ఆచరణ, విమోచన క్రయధనాన్ని చెల్లించడంలో యెహోవా, యేసుక్రీస్తు చూపిన గొప్ప ప్రేమను మనకు గుర్తుచేస్తుంది. యేసు మరణ జ్ఞాపకార్థ వార్షిక ఆచరణకు హాజరవడం ద్వారా విమోచన క్రయధనంపట్ల మన కృతజ్ఞతను చూపించవచ్చు. a

22 యెహోవా చేసిన విమోచన క్రయధన ఏర్పాటు నిజంగా ఒక అమూల్య బహుమానం. (2 కొరింథీయులు 9:14, 15) ఈ అమూల్య బహుమానం చనిపోయినవారికి సహితం ప్రయోజనాలు తీసుకురాగలదు. అదెలాగో 6, 7 అధ్యాయాలు వివరిస్తాయి.

a ప్రభువు రాత్రి భోజనపు అర్థానికి సంబంధించి మరింత సమాచారం కోసం అనుబంధంలోని 206-208 పేజీలు చూడండి.