కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1వ అధ్యాయం

దేవుడు ఎవరు?

దేవుడు ఎవరు?

1, 2. ప్రజలు ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఏంటి?

పిల్లలు చాలా ప్రశ్నలు అడుగుతారు. వాటి గురించి వివరించి చెప్పినప్పుడు ‘ఎందుకు?’ అని మళ్లీ అడుగుతారు. వాటికి జవాబు చెప్పగానే, ‘అలా ఎందుకు?’ అని అడుగుతూనే ఉంటారు.

2 చిన్నవాళ్లమైనా, పెద్దవాళ్లమైనా మనందరికీ ప్రశ్నలు ఉంటాయి. ఏమి తినాలి, ఏమి వేసుకోవాలి, ఏమి కొనుక్కోవాలి అనే ప్రశ్నలు మనకు ఉండవచ్చు. లేదా జీవితం గురించి, భవిష్యత్తు గురించి ముఖ్యమైన ప్రశ్నలు ఉండవచ్చు. వాటికి సరైన జవాబులు దొరకకపోతే, మనం బహుశా జవాబులు వెదకడం మానేస్తాం.

3. వాళ్లకున్న ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోలేరని చాలామంది ఎందుకు అనుకుంటారు?

3 మనకున్న ముఖ్యమైన ప్రశ్నలకు బైబిల్లో జవాబులు ఉన్నాయా? కొంతమంది ఉన్నాయనే అనుకుంటారు, కానీ బైబిల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని వాళ్ల అభిప్రాయం. బోధకులు, మత గురువులు దగ్గర మాత్రమే ఆ జవాబులు ఉంటాయని వాళ్లు అనుకోవచ్చు. ఇంకొంతమంది తమకు జవాబులు తెలియదు అని చెప్పడానికి సిగ్గు పడతారు. మరి మీరేమంటారు?

4, 5. మీకున్న ముఖ్యమైన ప్రశ్నలు ఏంటి? మీరు ఎందుకు జవాబుల కోసం వెతుకుతూ ఉండాలి?

4 మీకు కూడా ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలని ఉండవచ్చు: దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? చనిపోయాక నాకు ఏమవుతుంది? దేవుడు ఎలా ఉంటాడు? ప్రముఖ బోధకుడైన యేసు ఇలా అన్నాడు: “అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది; వెతుకుతూ ఉండండి, మీకు దొరుకుతుంది; తడుతూ ఉండండి, మీ కోసం తెరవబడుతుంది.” (మత్తయి 7:7) కాబట్టి మీకు నమ్మదగిన జవాబులు దొరికే వరకు వెదకడం ఆపకండి.

5 నిజమే, మీరు “వెతుకుతూ” ఉంటే మీకు బైబిల్లో జవాబులు దొరుకుతాయి. (సామెతలు 2:1-5) ఈ జవాబులు అర్థం చేసుకోవడానికి అంత కష్టమేమి కాదు. మీరు నేర్చుకునే విషయాలు ఇప్పుడు మీకు సంతోషంగా ఉండే జీవితాన్ని, భవిష్యత్తులో అద్భుతమైన నిరీక్షణను ఇస్తాయి. అయితే చాలామందికి అర్థంకాని ఒక ప్రశ్నని ఇప్పుడు చూద్దాం.

దేవుడు మనల్ని పట్టించుకుంటాడా? లేక దేవుడు జాలి లేనివాడా?

6. వాళ్లు పడే బాధను దేవుడు పట్టించుకోడని కొంతమంది ఎందుకు అనుకుంటారు?

6 దేవుడు మన గురించి పట్టించుకోడు అని చాలామంది అనుకుంటారు. దేవుడు నిజంగా పట్టించుకుంటే ఈ లోకం ఇలా ఉండదని వాళ్ల అభిప్రాయం. ఎక్కడ చూసినా యుద్ధాలు, ద్వేషం, కష్టాలు ఉన్నాయి. మనుషులు జబ్బులతో బాధపడి చనిపోతున్నారు. ‘దేవుడు మనల్ని పట్టించుకుంటే, ఈ బాధలన్నిటిని ఎందుకు తీసివేయడం లేదు?’ అని కొంతమంది ఆలోచిస్తుంటారు.

7. (ఎ) దేవుడు జాలిలేనివాడని మత గురువులు ప్రజలకు ఎలా నేర్పించారు? (బి) చెడు జరగడానికి దేవుడు కారణం కాదని మనం ఖచ్చితంగా ఎలా చెప్పవచ్చు?

7 మత గురువులు కొన్నిసార్లు దేవుడు జాలిలేనివాడని ప్రజలు నమ్మేలా చేస్తున్నారు. ఏదైనా ఘోరమైన విషయం జరిగినప్పుడు, అది దేవుని నిర్ణయం అని వాళ్లు అంటారు. అలా జరగాలని దేవుడు కోరుకున్నాడని అంటారు. ఆ మాట అన్నప్పుడు, వాళ్లు నిజానికి దేవున్ని నిందిస్తున్నారు. కానీ బైబిలు నేర్పిస్తున్నట్లు దేవుడు అస్సలు చెడుకు కారణం కాదు. యాకోబు 1:13 దేవుడు చెడు విషయాలతో ఎవర్నీ పరీక్షించడు అని చెప్తుంది. అక్కడ ఇలా ఉంది: “కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ, ‘దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు’ అని అనకూడదు. ఎందుకంటే, చెడ్డవాటితో ఎవ్వరూ దేవుణ్ణి పరీక్షించలేరు, దేవుడు కూడా అలా ఎవ్వర్నీ పరీక్షించడు.” అంటే ఇప్పుడు జరుగుతున్న చెడు సంఘటనలను దేవుడు ఆపకపోయినా, అవి జరిగేలా మాత్రం చేయడు. (యోబు 34:10-12 చదవండి.) ఒక ఉదాహరణ చూద్దాం.

8, 9. మన సమస్యలకు దేవున్ని నిందించడం ఎందుకు అన్యాయం? ఒక ఉదాహరణ చెప్పండి.

8 ఒక యువకుడు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు అనుకుందాం. వాళ్ల నాన్నకు అతనంటే చాలా ప్రేమ. మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో అతను కొడుకుకు నేర్పించాడు. తర్వాత ఆ యువకుడు నాన్నకు ఎదురుతిరిగి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. చెడు పనులు చేసి సమస్యల్లో చిక్కుకున్నాడు. జరిగినదానికి మీరు ఆ అబ్బాయి నాన్నను నిందిస్తారా? ఇల్లు వదిలి వెళ్లిపోకుండా కొడుకును ఆపలేదు కాబట్టి నాన్నదే తప్పు అని అంటారా? ఖచ్చితంగా అనరు! (లూకా 15:11-13) ఆ నాన్నలానే మనుషులు ఎదురుతిరిగి చెడు చేయాలని అనుకున్నప్పుడు దేవుడు వాళ్లను ఆపలేదు. కాబట్టి ఏదైనా చెడు జరిగినప్పుడు, దేవుడు దానిని చేయలేదని మనం గుర్తు పెట్టుకోవాలి. దేవున్ని నిందించడం చాలా అన్యాయం.

9 దేవుడు చెడు సంఘటనలు జరగకుండా ఆపకపోవడానికి చాలా మంచి కారణం ఉంది. 11వ అధ్యాయంలో బైబిలు దీని గురించి ఏమి చెప్తుందో మీరు నేర్చుకుంటారు. కానీ ఒక విషయంలో మాత్రం మీరు పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. దేవునికి మనమంటే చాలా ప్రేమ, మనకు వచ్చే సమస్యలకు ఆయన అస్సలు కారణం కాదు. నిజానికి ఆయన మాత్రమే వాటిని పరిష్కరించగలడు.—యెషయా 33:2.

10. చెడు ప్రజల వల్ల జరిగిన నష్టాన్ని దేవుడు పూర్తిగా తీసివేస్తాడని మనం ఖచ్చితంగా ఎందుకు నమ్మవచ్చు?

10 దేవుడు పవిత్రుడు. (యెషయా 6:3) ఆయన చేసే ప్రతీదీ పవిత్రమైనది, స్వచ్ఛమైనది, మంచిది. కాబట్టి మనం ఆయన్ను నమ్మవచ్చు. మనుషులు అలా కాదు. వాళ్లు కొన్నిసార్లు తప్పులు చేస్తారు. చాలా నిజాయితీ ఉన్న నాయకుడికి కూడా చెడు ప్రజలు చేసిన నష్టాన్ని పూర్తిగా తీసేసే శక్తి ఉండదు. దేవునికి ఉన్నంత శక్తి ఎవరికీ లేదు. ఆయన మాత్రమే చెడు ప్రజల వల్ల జరిగిన నష్టాన్ని తీసేయగలడు, తీసేస్తాడు కూడా. ఇంకెప్పటికీ ఉండకుండా ఆయన చెడు అంతటిని తీసివేస్తాడు.—కీర్తన 37:9-11 చదవండి.

ప్రజలు బాధపడుతుంటే దేవునికి ఎలా ఉంటుంది?

11. మీరు బాధపడుతుంటే దేవునికి ఎలా ఉంటుంది?

11 ఈ లోకంలో జరుగుతున్నదాన్ని, మీకు జరుగుతున్నదాన్ని చూసినప్పుడు దేవునికి ఎలా ఉంటుంది? దేవుడు “న్యాయాన్ని ప్రేమిస్తాడు” అని బైబిలు నేర్పిస్తుంది. (కీర్తన 37:28) కాబట్టి ఏది తప్పో ఏది ఒప్పో ఆయనకు చాలా ముఖ్యం. మనుషులు బాధపడడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. పూర్వం లోకమంతా చెడుతో నిండి ఉండడం చూసి ఆయన “హృదయంలో నొచ్చుకున్నాడు” అని బైబిలు చెప్తుంది. (ఆదికాండం 6:5, 6) దేవుడు మారలేదు. (మలాకీ 3:6) బైబిలు చెప్తున్నట్లు ఆయన నిజంగా మీ గురించి పట్టించుకుంటాడు.—1 పేతురు 5:7 చదవండి.

యెహోవా ఈ విశ్వమంతటినీ చేసిన ప్రేమగల సృష్టికర్త అని బైబిలు నేర్పిస్తుంది

12, 13. (ఎ) మనకు ఇతరుల మీద ప్రేమ, శ్రద్ధ ఎందుకు ఉన్నాయి? ఈ లోకంలో ఉన్న కష్టాలను చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది? (బి) దేవుడు కష్టాలన్నిటినీ, అన్యాయమంతటినీ తీసేస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చు?

12 మరొక విషయం ఏమిటంటే, దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో చేశాడని బైబిలు చెప్తుంది. (ఆదికాండం 1:26) అంటే దేవుడు ఆయనకున్న మంచి లక్షణాలను మనలో కూడా పెట్టాడు. కాబట్టి అమాయకులు బాధపడడం చూసి మీకు బాధగా ఉంటే, దేవునికి ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది. అలా అని ఎలా చెప్పవచ్చు?

13 “దేవుడు ప్రేమ” అని బైబిలు మనకు నేర్పిస్తుంది. (1 యోహాను 4:8) దేవుడు చేసే ప్రతిదానికి కారణం ప్రేమే. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టే మనమూ ప్రేమిస్తున్నాం. దీని గురించి ఆలోచించండి: మీకే శక్తి ఉంటే, ఈ లోకంలో ఉన్న కష్టాల్ని, అన్యాయాన్ని మీరు తీసివేయరా? ఖచ్చితంగా తీసేస్తారు, ఎందుకంటే మీకు అందరి మీద ప్రేమ ఉంది. మరి దేవునికి? ఆయనకు మనమీద ప్రేమ ఉంది, శక్తి కూడా ఉంది, కాబట్టి ఆయన కష్టాలన్నిటిని, అన్యాయమంతటినీ తీసేస్తాడు. ఈ పుస్తకం మొదట్లో చూసిన దేవుని వాగ్దానాలన్నీ ఖచ్చితంగా నిజమవుతాయని మీరు నమ్మకంతో ఉండవచ్చు. కానీ ఆ వాగ్దానాలను నమ్మాలంటే మీరు దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి.

మీరు దేవుని గురించి తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు

మీరు ఎవరికైనా స్నేహితులు అవ్వాలనుకుంటే, వాళ్లకు మీ పేరు చెప్తారు. దేవుడు తన పేరును మనకు బైబిల్లో చెప్పాడు

14. దేవుని పేరు ఏంటి? మనం ఆ పేరును ఉపయోగించాలని మనకు ఎలా తెలుసు?

14 మీరు ఎవరికైనా స్నేహితుడిగా అవ్వాలనుకుంటే, సాధారణంగా ముందు వాళ్లకు ఏమి చెప్తారు? మీ పేరు చెప్తారు. మరి దేవునికి పేరు ఉందా? చాలా మతాల్లో ఆయన పేరును దేవుడని, ప్రభువని చెప్తారు, కానీ ఇవి పేర్లు కావు. “రాజు”, “ప్రెసిడెంట్‌” లాంటి పదాల్లా అవి కేవలం బిరుదులు. ఆయన పేరు యెహోవా అని దేవుడు మనకు చెప్పాడు. కీర్తన 83:18 లో “యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే భూమంతటి పైన మహోన్నతుడివని ప్రజలు తెలుసుకోవాలి” అని ఉంది. బైబిల్ని రాసినవాళ్లు దేవుని పేరును వేలసార్లు ఉపయోగించారు. మీరు ఆయన పేరు తెలుసుకుని ఉపయోగించాలని యెహోవా కోరుకుంటున్నాడు. మీరు ఆయనకు స్నేహితులవ్వాలని తన పేరును మీకు చెప్తున్నాడు.

15. యెహోవా అనే పేరుకు అర్థం ఏంటి?

15 యెహోవా అనే దేవుని పేరుకు చాలా లోతైన అర్థం ఉంది. దేవుడు చేసిన ఏ వాగ్దానాన్నైనా నెరవేర్చగలడని, ఏ ఉద్దేశాన్నైనా సాధించగలడని అర్థం. ఆయనను ఏదీ ఆపలేదు. యెహోవా మాత్రమే ఆ పేరుకు అర్హుడు. *

16, 17. (ఎ) సర్వశక్తిమంతుడు (బి) “యుగయుగాలకు రాజా” (సి) సృష్టికర్త అనే మాటలకు అర్థం ఏంటి?

16 ముందు చదివినట్లు, కీర్తన 83:18 లో యెహోవా గురించి, “నువ్వు మాత్రమే భూమంతటి పైన మహోన్నతుడివని” ఉంది. ప్రకటన 15:3 లో “యెహోవా దేవా, సర్వశక్తిమంతుడా, నీ పనులు గొప్పవి, అద్భుతమైనవి. యుగయుగాలకు రాజా, నీ మార్గాలు న్యాయమైనవి, సత్యమైనవి” అని ఉంది. “సర్వశక్తిమంతుడా” అంటే ఏంటి? యెహోవాయే విశ్వంలో అందరికన్నా శక్తిమంతుడు అని అర్థం. “యుగయుగాలకు రాజా” అంటే ఆయన ఎప్పుడూ ఉన్నాడు అని అర్థం. ఆయన శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు ఉన్నాడని కీర్తన 90:2 వివరిస్తుంది. ఎంత గొప్ప విషయం!

17 యెహోవా మాత్రమే సృష్టికర్త. ప్రకటన 4:11 లో, “యెహోవా మా దేవా, నువ్వు అన్నిటినీ సృష్టించావు; నీ ఇష్టాన్ని బట్టే అవి ఉనికిలోకి వచ్చాయి, సృష్టించబడ్డాయి. కాబట్టి మహిమ, ఘనత, శక్తి పొందడానికి నువ్వు అర్హుడవు” అని ఉంది. అవును, పరలోకంలో ఉన్న దేవదూతలు మొదలుకుని, ఆకాశంలో నక్షత్రాలు, చెట్లకు కాసే కాయలు, సముద్రంలో ఉండే చేపలు వరకు, మీకు తెలిసిన ప్రతీదాన్ని యెహోవాయే చేశాడు.

మీరు యెహోవాకు స్నేహితులు కాగలరా?

18. కొంతమంది ఎప్పటికీ దేవునికి స్నేహితులు కాలేమని ఎందుకు అనుకుంటారు? దాని గురించి బైబిలు ఏమి చెప్తుంది?

18 కొంతమంది యెహోవాకున్న మంచి లక్షణాల గురించి చదివినప్పుడు భయంతో, ‘దేవుడు ఎంతో శక్తిమంతుడు, ఎంతో గొప్పవాడు, ఎంతో దూరంలో ఉన్నాడు, ఆయన నన్ను పట్టించుకోడు’ అని అనుకోవచ్చు. కానీ మనం అలా అనుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడా? అస్సలు కాదు. యెహోవా మనకు దగ్గరగా ఉండాలని అనుకుంటున్నాడు. దేవుడు “మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు” అని బైబిలు చెప్తుంది. (అపొస్తలుల కార్యాలు 17:27) మీరు ఆయనకు దగ్గరవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మీకు దగ్గరౌతానని కూడా మాట ఇస్తున్నాడు.—యాకోబు 4:8.

19. (ఎ) మీరు ఎలా దేవునికి స్నేహితులు కావచ్చు? (బి) యెహోవాకున్న ఏ లక్షణాలు మీకు బాగా ఇష్టం?

19 మీరు ఎలా దేవునికి స్నేహితులు అవ్వవచ్చు? యేసు ఇలా అన్నాడు: “ఒకేఒక్క సత్య దేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం.” (యోహాను 17:3) మీరు నేర్చుకుంటూ ఉండండి, అప్పుడు మీరు యెహోవా గురించి, యేసు గురించి తెలుసుకుంటారు. అప్పుడు మీరు శాశ్వత జీవితాన్ని పొందగలరు. ఉదాహరణకు, “దేవుడు ప్రేమ” అని మనం ముందే నేర్చుకున్నాం. (1 యోహాను 4:16) కానీ ఆయనకు ఇంకా ఎన్నో మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. యెహోవా “కరుణ, కనికరం గల దేవుడు; ఓర్పును, అపారమైన విశ్వసనీయ ప్రేమను చూపించే దేవుడు; ఎంతో సత్యవంతుడు” అని బైబిలు చెప్తుంది. (నిర్గమకాండం 34:6) యెహోవా మంచివాడు, క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. (కీర్తన 86:5) దేవుడు ఓర్పు గలవాడు, విశ్వసనీయుడు. (2 పేతురు 3:9; ప్రకటన 15:4) మీరు బైబిల్లో ఆయన గురించి చదువుతుండగా, ఆయనకున్న మంచి లక్షణాల గురించి చాలా నేర్చుకుంటారు.

20-22. (ఎ) మనం దేవున్ని చూడలేనప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్నట్లు ఎలా అనుకోగలం? (బి) మీరు బైబిలు స్టడీ ఆపేయాలని ఇతరులు కోరుకుంటే మీరు ఏమి చేయాలి?

20 మీరు దేవున్ని చూడలేకపోయినా ఆయనకు దగ్గరగా ఉన్నట్లు ఎలా భావించగలరు? (యోహాను 1:18; 4:24; 1 తిమోతి 1:17) మీరు బైబిల్లో యెహోవా గురించి చదివినప్పుడు, ఆయన ఎన్నో మంచి లక్షణాలున్న ఒక నిజమైన వ్యక్తి అని తెలుసుకోగలుగుతారు. (కీర్తన 27:4; రోమీయులు 1:20) యెహోవా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటుండగా మీరు ఆయన్ని ఇంకెక్కువగా ప్రేమిస్తారు, ఆయనకు ఎంతో దగ్గరగా ఉన్నట్లు భావిస్తారు.

తండ్రి తన పిల్లల్ని ప్రేమిస్తాడు, మన పరలోక తండ్రి మనల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు

21 యెహోవా మన తండ్రి అని మీరు అర్థం చేసుకుంటారు. (మత్తయి 6:9) ఆయనే మనందరికీ ప్రాణం ఇచ్చాడు, మనం మంచి జీవితాన్ని అనుభవించాలని కూడా కోరుకుంటున్నాడు. ఒక ప్రేమగల తండ్రి తన పిల్లల గురించి కోరుకునేది కూడా అదే కదా. (కీర్తన 36:9) మీరు దేవునికి స్నేహితులు అవ్వగలరని బైబిలు నేర్పిస్తుంది. (యాకోబు 2:23) ఊహించండి. ఈ విశ్వానికి సృష్టికర్త అయిన యెహోవా మీకు స్నేహితుడిగా ఉండాలని అనుకుంటున్నాడు!

22 కొంతమంది మీరు బైబిలు స్టడీ ఆపేయాలని కోరుకోవచ్చు. మీరు మీ మతాన్ని మార్చుకుంటారని వాళ్లు భయపడుతున్నారేమో. కానీ మీరు యెహోవాకి స్నేహితులు అవ్వకుండా ఆపే అవకాశం ఎవరికి ఇవ్వకండి. ఆయనకన్నా మంచి స్నేహితులు మీకు ఎవరూ ఉండరు.

23, 24. (ఎ) మీరు ఎందుకు ప్రశ్నలు అడుగుతూ ఉండాలి? (బి) మనం తర్వాత అధ్యాయంలో ఏమి నేర్చుకుంటాం?

23 మీరు బైబిలు స్టడీ చేస్తుండగా, మీకు కొన్ని విషయాలు అర్థం కావు. ప్రశ్నలు అడగడానికి, సహాయం తీసుకోవడానికి సిగ్గుపడకండి. పిల్లలు చాలా ప్రశ్నలు అడుగుతారు. మనం చిన్నపిల్లల్లా వినయంగా ఉండాలని యేసు చెప్పాడు. (మత్తయి 18:2-4) మీరు మీ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి బైబిల్ని జాగ్రత్తగా చదివి, మీరు నేర్చుకునేది నిజమో కాదో తెలుసుకోండి.—అపొస్తలుల కార్యాలు 17:11 చదవండి.

24 యెహోవా గురించి తెలుసుకోవడానికి మంచి మార్గం బైబిల్ని శ్రద్ధగా చదవడమే. తర్వాత అధ్యాయంలో బైబిలు ఎందుకు వేరే పుస్తకాల లాంటిది కాదో తెలుసుకుంటాము.

^ పేరా 15 మీ బైబిల్లో యెహోవా పేరు లేకపోతే, లేదా మీరు దేవుని పేరుకున్న అర్థం గురించి, దాన్ని పలికే విధానం గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే అదనపు సమాచారంలో 1వ పాయింట్‌ చూడండి.