కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

18వ అధ్యాయం

నేను దేవునికి సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవాలా?

నేను దేవునికి సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవాలా?

1. ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా స్టడీ చేసిన తర్వాత మీరు ఏమి చేయాలనుకోవచ్చు?

మీరు ఈ పుస్తకం స్టడీ చేస్తుండగా దేవుడు వాగ్దానం చేసిన శాశ్వత జీవితం, చనిపోయిన వాళ్ల పరిస్థితి, పునరుత్థాన నిరీక్షణ వంటి ఎన్నో బైబిలు సత్యాల గురించి నేర్చుకున్నారు. (ప్రసంగి 9:5; లూకా 23:43; యోహాను 5:28, 29; ప్రకటన 21:3, 4) మీరు యెహోవాసాక్షుల మీటింగ్స్‌కు వెళ్లడం మొదలుపెట్టి ఉంటారు, వాళ్లు నిజమైన ఆరాధన చేస్తున్నారని మీరు నమ్ముతుండవచ్చు. (యోహాను 13:35) మీరు యెహోవాతో మంచి స్నేహం పెంచుకోవడం మొదలుపెట్టి, ఆయనను సేవించాలని నిర్ణయించుకుని ఉంటారు. కాబట్టి మీరు ఇలా ఆలోచిస్తుండవచ్చు, ‘దేవున్ని సేవించడానికి నేను ఇప్పుడు ఏమి చేయాలి?’

2. ఒక ఇతియోపీయుడు బాప్తిస్మం తీసుకోవాలని ఎందుకు అనుకున్నాడు?

2 యేసు కాలంలో జీవించిన ఇతియోపీయుడు కూడా అలానే ఆలోచించాడు. యేసు పునరుత్థానం చేయబడిన కొంతకాలానికి, యేసు శిష్యుడైన ఫిలిప్పు అతనికి ప్రకటించాడు. యేసే మెస్సీయ అని ఫిలిప్పు అతనికి నిరూపించాడు. తాను నేర్చుకున్న విషయాలనుబట్టి ఆ ఇతియోపీయుడు ఎంతో కదిలించబడి వెంటనే ఇలా అన్నాడు: “ఇదిగో! ఇక్కడ నీళ్లు ఉన్నాయి; నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంటి?”—అపొస్తలుల కార్యాలు 8:26-36.

3. (ఎ) యేసు తన అనుచరులకు ఏ ఆజ్ఞను ఇచ్చాడు? (బి) బాప్తిస్మం ఎలా తీసుకోవాలి?

3 మీరు యెహోవాను సేవించాలనుకుంటే తప్పకుండా బాప్తిస్మం తీసుకోవాలని బైబిలు స్పష్టంగా చెప్తుంది. యేసు తన అనుచరులతో ఇలా చెప్పాడు: “అన్నిదేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయండి; . . . వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి.” (మత్తయి 28:19) స్వయంగా యేసు కూడా బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మాదిరి ఉంచాడు. ఆయన పూర్తిగా నీళ్లలో ముంచబడి బాప్తిస్మం పొందాడు కానీ, తలమీద నీళ్లు చిలకరించడం వల్ల కాదు. (మత్తయి 3:16) ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, నీళ్లల్లో పూర్తిగా ముంచబడాలి.

4. మీ బాప్తిస్మం ఇతరులకు ఏమి చూపిస్తుంది?

4 బాప్తిస్మం తీసుకున్నప్పుడు, మీరు దేవుని స్నేహితులుగా ఉండాలని, ఆయనను సేవించాలని నిజంగా కోరుకుంటున్నారని ఇతరులకు చూపిస్తారు. (కీర్తన 40:7, 8) కాబట్టి మీరు ఇలా అనుకోవచ్చు, ‘నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఏమి చేయాలి?’

జ్ఞానం, విశ్వాసం

5. (ఎ) బాప్తిస్మం తీసుకోవడానికి ముందు మీరు ఏమి చేయాలి? (బి) మీటింగ్స్‌ ఎందుకు ముఖ్యం?

5 మీరు బాప్తిస్మం తీసుకోకముందు, యెహోవా గురించి, యేసు గురించి తెలుసుకోవాలి. బైబిల్ని స్టడీ చేయడం ద్వారా మీరు ఇప్పటికే దీన్ని మొదలుపెట్టారు. (యోహాను 17:3 చదవండి.) అయితే అది మాత్రమే సరిపోదు. మీరు యెహోవా ఇష్టం గురించి “సరైన జ్ఞానంతో నిండివుండాలని” బైబిలు చెప్తుంది. (కొలొస్సయులు 1:9) యెహోవాకు సన్నిహితంగా ఉండడానికి మీకు యెహోవాసాక్షుల మీటింగ్స్‌ సహాయం చేస్తాయి. మీటింగ్స్‌కు మానకుండా వెళ్లడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం.—హెబ్రీయులు 10:24, 25.

బాప్తిస్మం తీసుకునే ముందు, మీరు బైబిల్ని అధ్యయనం చేయాలి

6. బాప్తిస్మం తీసుకునే ముందు మీరు బైబిలు గురించి ఎంత వరకు తెలుసుకోవాలి?

6 నిజమే, మీరు బాప్తిస్మం తీసుకోకముందే బైబిలు గురించి మొత్తం తెలుసుకోవాలని యెహోవా కోరడం లేదు. ఆ ఇతియోపీయుడు బాప్తిస్మం తీసుకునే ముందు మొత్తం తెలుసుకోవాలని దేవుడు కోరుకోలేదు. (అపొస్తలుల కార్యాలు 8:30, 31) మనం యెహోవా గురించి ఎల్లప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం. (ప్రసంగి 3:11) కానీ బాప్తిస్మం తీసుకోవడానికి మాత్రం, మీరు బైబిల్లో ప్రాథమిక విషయాలను తెలుసుకుని, వాటిని అంగీకరించడం అవసరం.—హెబ్రీయులు 5:12.

7. బైబిల్‌ స్టడీ మీకు ఎలా సహాయం చేసింది?

7 బైబిలు ఇలా చెప్తుంది: “విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం.” (హెబ్రీయులు 11:6) కాబట్టి బాప్తిస్మం తీసుకునే ముందు మీకు విశ్వాసం ఉండాలి. ప్రాచీన పట్టణమైన కొరింథులో ఉండేవాళ్లు యేసు అనుచరులు చెప్పిన విషయాలు విని “విశ్వాసముంచి, బాప్తిస్మం తీసుకోవడం మొదలుపెట్టారు” అని బైబిలు చెప్తుంది. (అపొస్తలుల కార్యాలు 18:8) అదేవిధంగా మీ బైబిలు స్టడీ, మీరు దేవుని వాగ్దానాల మీద, పాపమరణాల నుండి కాపాడే యేసు బలికి ఉన్న శక్తి మీద విశ్వాసం ఉంచడానికి మీకు సహాయం చేసింది.—యెహోషువ 23:14; అపొస్తలుల కార్యాలు 4:12; 2 తిమోతి 3:16, 17.

బైబిలు సత్యాలను ఇతరులకు చెప్పండి

8. మీరు నేర్చుకున్న విషయాల గురించి ఇతరులకు చెప్పడానికి మిమ్మల్ని ఏది కదిలిస్తుంది?

8 మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటుండగా, అది మీ జీవితంలో ఎలా సహాయం చేస్తుందో చూసినప్పుడు, మీ విశ్వాసం ఇంకా బలపడుతుంది. మీరు నేర్చుకున్న విషయాల గురించి ఇతరులకు చెప్పాలని మీకు అనిపిస్తుంది. (యిర్మీయా 20:9; 2 కొరింథీయులు 4:13) కానీ మీరు ఎవరికి చెప్పాలి?

మీరు నమ్ముతున్న విషయాలను ఇతరులకు చెప్పేలా విశ్వాసం మిమ్మల్ని కదిలించాలి

9, 10. (ఎ) మీరు నేర్చుకున్న విషయాల గురించి ఎవరితో మాట్లాడడం మొదలుపెట్టవచ్చు? (బి) సంఘంతో కలిసి పరిచర్య చేయాలనుకుంటే మీరేమి చేయాలి?

9 మీరు నేర్చుకుంటున్న విషయాల గురించి మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఇంటి పక్కనవాళ్లకు లేదా మీతో కలిసి పనిచేసేవాళ్లకు చెప్పాలని మీరు అనుకోవచ్చు. అది మంచిదే, కానీ ఎప్పుడూ దయగా, ప్రేమగా చెప్పండి. కొంతకాలానికి, మీరు సంఘంతో కలిసి పరిచర్య చేయడం మొదలు పెట్టగలుగుతారు. అలా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారని మీకు అనిపిస్తే, మీకు బైబిలు గురించి నేర్పించే సాక్షితో మాట్లాడి, మీరు సంఘంతో కలిసి పరిచర్య చేయాలని అనుకుంటున్నారని చెప్పండి. మీరు సిద్ధంగా ఉన్నారని, మీరు బైబిలు ప్రమాణాల ప్రకారం జీవిస్తున్నారని అతనికి అనిపిస్తే, మీరూ అతనూ కలిసి ఇద్దరు సంఘ పెద్దలను కలుస్తారు.

10 వాళ్లను కలిసినప్పుడు ఏమి జరుగుతుంది? బైబిల్లో ఉన్న ముఖ్యమైన సత్యాలను మీరు అర్థం చేసుకున్నారా, మీరు వాటిని నమ్ముతున్నారా, మీ రోజువారీ జీవితంలో బైబిలు చెప్పే విషయాలకు లోబడుతున్నారా, మీరు నిజంగా యెహోవాసాక్షుల్లో ఒకరిగా అవ్వడానికి ఇష్టపడుతున్నారా అనే విషయాల గురించి తెలుసుకోవడానికి సంఘ పెద్దలు మీతో మాట్లాడతారు. పెద్దలు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి, మీ గురించి కూడా శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి వాళ్లతో మాట్లాడడానికి భయపడకండి. (అపొస్తలుల కార్యాలు 20:28; 1 పేతురు 5:2, 3) మీతో మాట్లాడిన తర్వాత, మీరు సంఘంతో కలిసి పరిచర్యకు వెళ్లవచ్చో లేదో పెద్దలు మీకు చెప్తారు.

11. సంఘంతో కలిసి పరిచర్యకు వెళ్లే ముందు మీరు మార్పులు చేసుకోవడం ఎందుకు చాలా ముఖ్యం?

11 సంఘంతో కలిసి పరిచర్యకు వెళ్లే ముందు మీరు ఇంకా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని పెద్దలు మీకు చెప్పవచ్చు. ఆ మార్పులు చేసుకోవడం ఎందుకు చాలా ముఖ్యం? ఎందుకంటే, మనం దేవుని గురించి ఇతరులతో మాట్లాడినప్పుడు, మనం యెహోవా ప్రతినిధులుగా మాట్లాడుతున్నాం, కాబట్టి ఆయనకు ఘనత తీసుకొచ్చే విధంగా మనం జీవించాలి.—1 కొరింథీయులు 6:9, 10; గలతీయులు 5:19-21.

పశ్చాత్తాపపడి, పూర్తిగా మారండి

12. ప్రజలందరూ పశ్చాత్తాపపడడం ఎందుకు అవసరం?

12 బాప్తిస్మం తీసుకునే ముందు మీరు చేయాల్సింది ఇంకొకటి ఉంది. అపొస్తలుడైన పేతురు ఇలా చెప్తున్నాడు: “కాబట్టి మీరు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగండి. అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి.” (అపొస్తలుల కార్యాలు 3:19) పశ్చాత్తాపపడడం అంటే ఏమిటి? పశ్చాత్తాపం అంటే మనం చేసిన తప్పుల గురించి చాలా బాధపడడం. ఒకవేళ మీరు అనైతిక జీవితాన్ని జీవించి ఉంటే, మీరు పశ్చాత్తాపపడాలి. అయితే, మీరు మీ జీవితమంతా మంచిగా ఉండడానికి శాయశక్తులా ప్రయత్నించినా కూడా మీరు పశ్చాత్తాపపడాలి, ఎందుకంటే మనందరం పాపం చేస్తాం కాబట్టి మనం దేవున్ని క్షమించమని అడగాలి.—రోమీయులు 3:23; 5:12.

13. “దేవుని వైపు తిరగండి” అంటే ఏంటి?

13 మీరు చేసినవాటి గురించి బాధపడితే సరిపోతుందా? లేదు. పేతురు “దేవుని వైపు తిరగండి” అని కూడా చెప్పాడు. అంటే ఇంతకుముందు ఉన్న మీ తప్పుడు ప్రవర్తన అంతటినీ వదిలేసి, మంచిని చేయడం మొదలుపెట్టాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇలా ఊహించుకోండి, మీరు ఒక ప్రాంతానికి మొదటిసారి వెళ్తున్నారు. కొంతదూరం వెళ్లిన తర్వాత మీరు తప్పు దారిలో వెళ్తున్నారని తెలుసుకున్నారు. మీరు ఏమి చేస్తారు? మీరు వెంటనే స్పీడ్‌ తగ్గించి, ఆగి, వెనక్కి వచ్చి సరైన దారిలో వెళ్తారు. అదేవిధంగా, మీరు బైబిలును స్టడీ చేస్తున్నప్పుడు, మీ జీవితంలో మీరు మార్చుకోవాల్సిన కొన్ని అలవాట్లు లేదా విషయాలు ఉన్నాయని మీరు తెలుసుకోవచ్చు. అప్పుడు ‘దేవుని వైపు తిరగడానికి,’ అంటే అవసరమైన మార్పులు చేసుకుని, మంచి పనులు చేయడం మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉండండి.

మిమ్మల్ని మీరు సమర్పించుకోండి

మీరు యెహోవాను సేవిస్తానని ఆయనకు మాట ఇచ్చారా?

14. మిమ్మల్ని మీరు దేవునికి ఎలా సమర్పించుకుంటారు?

14 బాప్తిస్మం తీసుకునే ముందు మీరు చేయాల్సిన మరో ముఖ్యమైన పని, మిమ్మల్ని మీరు యెహోవాకు సమర్పించుకోవడం. యెహోవాకు సమర్పించుకోవడం అంటే ఆయనను మాత్రమే ఆరాధిస్తానని, మీ జీవితంలో ఆయన ఇష్టానికి అత్యంత ముఖ్యమైన స్థానం ఇస్తానని ప్రార్థనలో ఆయనకు మాట ఇవ్వడం.—ద్వితీయోపదేశకాండం 6:15.

15, 16. మీరు దేవునికి సమర్పించుకునేలా ఏది పురికొల్పుతుంది?

15 యెహోవాను మాత్రమే ఆరాధిస్తానని మాట ఇవ్వడం అనేది, మీరు ప్రేమించే వ్యక్తితో జీవితాంతం కలిసి ఉంటానని మాట ఇవ్వడం లాంటిది. ఒకతను, ఒకామె డేటింగ్‌ చేస్తున్నారు అనుకోండి. అతను ఆ అమ్మాయి గురించి ఎక్కువ తెలుసుకునే కొద్దీ ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు, ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాడు. ఇది చాలా పెద్ద నిర్ణయం అయినప్పటికీ, అతను ఆమెను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు.

16 మీరు యెహోవా గురించి తెలుసుకుంటుండగా, ఆయనను ప్రేమించడం మొదలుపెడతారు, ఆయనను సేవించడానికి పూర్తిగా కృషి చేస్తారు. అది మీరు యెహోవాను సేవిస్తానని మాటిస్తూ ఆయనకు ప్రార్థన చేసేలా మిమ్మల్ని పురికొల్పుతుంది. ఎవరైనా యేసును అనుసరించాలంటే “ఇక తన కోసం తాను జీవించకుండా” ఉండాలని బైబిలు చెప్తుంది. (మార్కు 8:34) అంటే ఏంటి? అంటే మీరు యెహోవాకు లోబడడానికే మీ జీవితంలో మొదటి స్థానం ఇస్తారు. మీ కోరికలు, మీ లక్ష్యాలు కంటే యెహోవా కోరుకునేదే మీ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనదిగా ఉంటుంది.—1 పేతురు 4:2 చదవండి.

తప్పిపోతామని భయపడకండి

17. కొంతమంది ఎందుకు యెహోవాకు సమర్పించుకోరు?

17 కొంతమంది దేవున్ని సేవిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేమనే భయంతో యెహోవాకు సమర్పించుకోరు. వాళ్లకు యెహోవాను నిరాశపర్చడం ఇష్టంలేదు లేదా వాళ్లు ఆయనకు సమర్పించుకోకపోతే వాళ్లు చేసే వాటి గురించి యెహోవా వాళ్లను లెక్క అడగడని వాళ్లు ఆలోచిస్తుండవచ్చు.

18. యెహోవాను నిరాశపరుస్తామనే భయాన్ని అధిగమించడానికి మీకు ఏమి సహాయం చేస్తుంది?

18 యెహోవా మీద మీకున్న ప్రేమ ఆయన్ని నిరాశపరుస్తామనే ఎలాంటి భయాన్నైనా అధిగమించడానికి మీకు సహాయం చేస్తుంది. మీరు ఆయనను ప్రేమిస్తున్నారు కాబట్టి, యెహోవాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మీరు శాయశక్తులా కృషి చేస్తారు. (ప్రసంగి 5:4; కొలొస్సయులు 1:10) యెహోవా కోరుకున్నది చేయడం చాలా కష్టమని మీరు అనుకోరు. అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “దేవుణ్ణి ప్రేమించడమంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడమే; అయితే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”—1 యోహాను 5:3.

19. యెహోవాకు సమర్పించుకోవడానికి మీరు ఎందుకు భయపడకూడదు?

19 మీరు యెహోవాకు సమర్పించుకోవాలంటే ఒక చిన్న పొరపాటు కూడా చేయకుండా అన్నీ చక్కగా చేయాలని కాదు. మనం చేయగలిగే దానికన్నా ఎక్కువ చేయాలని ఆయన అస్సలు ఆశించడు. (కీర్తన 103:14) సరైనది చేయడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు. (యెషయా 41:10) పూర్తి హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచండి, ఆయన మీ జీవితాన్ని సఫలం చేస్తాడు.—సామెతలు 3:5, 6.

రక్షణ పొందాలంటే బహిరంగంగా ఒప్పుకోవాలి

20. మిమ్మల్ని మీరు యెహోవాకు సమర్పించుకున్న తర్వాత చేయాల్సిన మరో పని ఏంటి?

20 మీరు యెహోవాకు సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మీకు అనిపిస్తుందా? మీరు యెహోవాకు సమర్పించుకున్న తర్వాత, మరో పని చేయడానికి మీరు సిద్ధం అవ్వాలి. మీరు బాప్తిస్మం తీసుకోవాలి.

21, 22. మీ విశ్వాసాన్ని “బహిరంగంగా” ఎలా ఒప్పుకుంటారు?

21 మీరు యెహోవాకు సమర్పించుకున్నారని, బాప్తిస్మం తీసుకోవాలని అనుకుంటున్నారని మీ సంఘంలో పెద్దల సభ సమన్వయకర్తకు తెలియజేయండి. అప్పుడు ఆయన, మీతో ప్రాథమిక బైబిలు బోధల్ని సమీక్షించడానికి కొంతమంది పెద్దల్ని ఏర్పాటు చేస్తాడు.మీరు సిద్ధంగా ఉన్నారని వాళ్లు ఒప్పుకుంటే, రాబోయే యెహోవాసాక్షుల అసెంబ్లీలో లేదా ప్రాదేశిక సమావేశంలో మీరు బాప్తిస్మం తీసుకోవచ్చని వాళ్లు మీకు చెప్తారు. సమావేశంలో, బాప్తిస్మం అంటే ఏమిటో వివరించే ఒక ప్రసంగం ఉంటుంది. బాప్తిస్మ ప్రసంగం ఇచ్చే ప్రసంగీకుడు, బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్లను రెండు చిన్న ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ద్వారా మీరు మీ విశ్వాసాన్ని “బహిరంగంగా” చెప్తారు.—రోమీయులు 10:10.

22 ఆ తర్వాత మీరు బాప్తిస్మం తీసుకుంటారు. మిమ్మల్ని పూర్తిగా నీటిలో ముంచుతారు. మిమ్మల్ని మీరు యెహోవాకు సమర్పించుకున్నారని, యెహోవాసాక్షుల్లో ఒకరు అయ్యారని ఆ బాప్తిస్మం అందరికీ చూపిస్తుంది.

మీ బాప్తిస్మం దేనికి గుర్తుగా ఉంటుంది?

23. “తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున” బాప్తిస్మం తీసుకోవడం అంటే అర్థం ఏంటి?

23 తన శిష్యులు “తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున” బాప్తిస్మం తీసుకుంటారని యేసు చెప్పాడు. (మత్తయి 28:19 చదవండి.) దాని అర్థం ఏంటి? మీరు యెహోవా అధికారాన్ని గుర్తిస్తున్నారని, దేవుని సంకల్పం విషయంలో యేసు పాత్రని గుర్తిస్తున్నారని, అంతేకాదు దేవుడు తన ఇష్టాన్ని జరిగించడానికి పవిత్రశక్తిని ఎలా ఉపయోగిస్తాడో గుర్తిస్తున్నారని అర్థం.—కీర్తన 83:18; మత్తయి 28:18; గలతీయులు 5:22, 23; 2 పేతురు 1:21.

బాప్తిస్మం తీసుకున్నప్పుడు, మీరు దేవుని ఇష్టాన్ని చేయాలనుకుంటున్నారని చూపిస్తారు

24, 25. (ఎ) బాప్తిస్మం దేనికి గుర్తుగా ఉంది? (బి) చివరి అధ్యాయంలో మనం ఏమి చర్చిస్తాం?

24 బాప్తిస్మం ఒక ముఖ్యమైన విషయానికి గుర్తుగా ఉంది. మీరు నీటిలో ముంచబడినప్పుడు, ఇంతకుముందు మీ జీవితం విషయంలో మీరు చనిపోయారని లేదా దాన్ని పూర్తిగా విడిచిపెట్టేశారని అర్థం. నీటిలో నుండి బయటకు వచ్చినప్పుడు, దేవుని ఇష్టాన్ని చేస్తూ మీరు కొత్త జీవితాన్ని మొదలుపెట్టారని అర్థం. అంటే ఇప్పటినుండి మీరు యెహోవాను సేవిస్తారని అది చూపిస్తుంది. మీరు ఏ మనిషికీ, ఏ సంస్థకూ, లేదా ఏ పనికీ మిమ్మల్ని సమర్పించుకోలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకున్నారు.

25 యెహోవాతో ఒక సన్నిహిత సంబంధాన్ని పెంచుకోవడానికి మీ సమర్పణ మీకు సహాయం చేస్తుంది. (కీర్తన 25:14) అయితే ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన రక్షించబడతాడని అర్థం కాదు. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “భయంతో, వణకుతో మీ సొంత రక్షణ కోసం కృషి చేస్తూ ఉండండి.” (ఫిలిప్పీయులు 2:12) బాప్తిస్మం ప్రారంభం మాత్రమే. కానీ మీరు యెహోవాకు సన్నిహితంగా ఎలా ఉండగలరు? ఈ పుస్తకంలో చివరి అధ్యాయం ఈ ప్రశ్నకు జవాబు ఇస్తుంది.