కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

3వ అధ్యాయం

దేవుడు ఏ ఉద్దేశంతో మనుషుల్ని చేశాడు?

దేవుడు ఏ ఉద్దేశంతో మనుషుల్ని చేశాడు?

1. దేవుడు మనుషుల్ని ఏ ఉద్దేశంతో చేశాడు?

దేవుడు మనుషుల్ని ఒక అద్భుతమైన ఉద్దేశంతో చేశాడు. ఆయన మొదటి పురుషుడు, స్త్రీ అయిన ఆదాముహవ్వను ఒక అందమైన తోటలో జీవించేలా చేశాడు. వాళ్లకు పిల్లలు పుట్టాలని, వాళ్లు భూమి అంతటినీ పరదైసుగా చేస్తూ జంతువులను చూసుకుంటూ ఉండాలనేది దేవుని ఉద్దేశం.—ఆదికాండం 1:28; 2:8, 9, 15; అదనపు సమాచారంలో 6వ పాయింట్‌ చూడండి.

2. (ఎ) దేవుని ఉద్దేశం నెరవేరుతుందని మనకు ఎలా తెలుసు? (బి) శాశ్వతంగా జీవించడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

2 మనం ఎప్పటికైనా పరదైసులో జీవిస్తామని మీకు అనిపిస్తుందా? యెహోవా ఇలా చెప్తున్నాడు: “నేను దాన్ని సంకల్పించాను, దాన్ని నెరవేరుస్తాను కూడా.” (యెషయా 46:9-11; 55:11) అవును, దేవుడు ఏమి అనుకున్నాడో దానిని చేస్తాడు. ఆయనను ఏదీ ఆపలేదు. యెహోవా ఒక కారణంతో భూమిని సృష్టించానని చెప్పాడు, “ఆయన భూమిని ఊరికే చేయలేదు.” (యెషయా 45:18) భూమి నిండా మనుషులు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఎలాంటి మనుషులు ఇక్కడ ఉండాలని, ఎంత కాలం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? బైబిల్లో ఇలా ఉంది: “నీతిమంతులు [లేదా, విధేయత చూపించేవాళ్లు] భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు దానిలో శాశ్వతంగా జీవిస్తారు.”కీర్తన 37:29; ప్రకటన 21:3, 4.

3. మనుషులు జబ్బుపడి చనిపోతున్నారు కాబట్టి మీకు ఏ ప్రశ్నలు రావచ్చు?

3 కానీ ఇప్పుడు మనుషులు జబ్బుపడి చనిపోతున్నారు. చాలాచోట్ల పోరాడుతూ ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. ఖచ్చితంగా దేవుడు కోరుకున్నదైతే ఇది కాదు. మరి ఏమి జరిగింది? ఎందుకలా జరిగింది? బైబిలు మాత్రమే దీనికి జవాబు చెప్పగలదు.

దేవుని శత్రువు

4, 5. (ఎ) ఏదెను తోటలో పాము ద్వారా హవ్వతో మాట్లాడింది ఎవరు? (బి) నిజాయితీగా ఉన్న ఎవరైనా దొంగగా ఎలా మారతారు?

4 దేవునికి ఒక శత్రువు ఉన్నాడని బైబిల్లో ఉంది. అతనే “అపవాది, సాతాను.” సాతాను ఏదెను తోటలో హవ్వతో మాట్లాడడానికి పామును ఉపయోగించాడు. (ప్రకటన 12:9; ఆదికాండం 3:1) నిజంగా పామే మాట్లాడుతుంది అని అనుకునేలా చేశాడు.—అదనపు సమాచారంలో 7వ పాయింట్‌ చూడండి.

5 దేవుడే అపవాదియైన సాతానుని చేశాడా? లేదు! దేవుడు ఆదాము, హవ్వ కోసం భూమిని సిద్ధం చేస్తున్నప్పుడు అతను పరలోకంలో ఒక దేవదూతగా ఉన్నాడు. తర్వాత మారిపోయి అపవాది అయ్యాడు. (యోబు 38:4, 7) అదెలా సాధ్యం? ఉదాహరణకు, నిజాయితీగా ఉండే ఒకతను దొంగగా ఎలా మారతాడు, పుట్టడమే అతను దొంగగా పుట్టలేదు కదా. అయితే, తనది కానిదాన్ని ఆశపడి, దాని గురించే ఆలోచిస్తూ ఉంటే, ఆ తప్పుడు కోరిక బలపడుతుంది. తర్వాత అవకాశం దొరికినప్పుడు దొంగతనం చేస్తాడు. అలా అతను తనంతట తానే దొంగగా మారాడు.యాకోబు 1:13-15 చదవండి; అదనపు సమాచారంలో 8వ పాయింట్‌ చూడండి.

6. ఒక దేవదూత ఎలా దేవుని శత్రువు అయ్యాడు?

6 ఆ దేవదూతకు జరిగింది కూడా అదే. యెహోవా, ఆదాము హవ్వను సృష్టించిన తర్వాత, పిల్లలను కని “భూమిని నింపండి” అని వాళ్లతో చెప్పాడు. (ఆదికాండం 1:27, 28) ఆ దేవదూత ఇలా అనుకుని ఉండవచ్చు: ‘ఈ మనుషులందరూ యెహోవాకు బదులు నన్ను ఆరాధిస్తే బాగుండు!’ అతను ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించే కొద్దీ, యెహోవాకు చెందిన దాన్ని ఎక్కువగా ఆశపడ్డాడు. మనుషులు తనను ఆరాధించాలని ఆ దేవదూత కోరుకున్నాడు. కాబట్టి హవ్వకు అబద్ధం చెప్పి మోసం చేశాడు. (ఆదికాండం 3:1-5 చదవండి.) అలా చేసి, అతను అపవాదియైన సాతానుగా, దేవుని శత్రువుగా మారాడు.

7. (ఎ) ఆదాము, హవ్వ ఎందుకు చనిపోయారు? (బి) మనం ఎందుకు ముసలివాళ్లమై చనిపోతున్నాం?

7 ఆదాము హవ్వ దేవునికి లోబడకుండా తినవద్దని చెప్పిన పండు తిన్నారు. (ఆదికాండం 2:17; 3:6) వాళ్లు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు, చివరికి యెహోవా చెప్పినట్లే కొంతకాలానికి చనిపోయారు. (ఆదికాండం 3:17-19) ఆదాము హవ్వకు పుట్టిన పిల్లలు కూడా పాపులే కాబట్టి వాళ్లూ చనిపోయారు. (రోమీయులు 5:12 చదవండి.) ఆదాముహవ్వల పిల్లలు ఎందుకు పాపులు అయ్యారో తెలుసుకోవడానికి ఈ ఉదాహరణ చూడండి. ఒక సొట్ట ఉన్న ఇడ్లీ ప్లేటులో ఇడ్లీలు చేస్తే ఏమవుతుందో ఊహించండి. ఇడ్లీలకు కూడా ఆ సొట్ట లేదా ఆ లోపం వస్తుంది. ఆదాము దేవుని మాట వినలేదు కాబట్టి అతనిలోకి లోపం లేదా పాపం వచ్చింది. మనమంతా ఆదాము పిల్లలం కాబట్టి ఆయనకున్న లోపమే మనకూ వచ్చింది, అలా మనమందరం పాపులం అయ్యాం. మనమంతా పాపులం కాబట్టి ముసలివాళ్లం అయ్యి చనిపోతున్నాం.—రోమీయులు 3:23; అదనపు సమాచారంలో 9వ పాయింట్‌ చూడండి.

8, 9. (ఎ) ఆదాము హవ్వను ఏమని నమ్మించాలని సాతాను అనుకున్నాడు? (బి) తిరుగుబాటు చేసినవాళ్లను యెహోవా వెంటనే ఎందుకు చంపేయలేదు?

8 ఆదాముహవ్వ దేవుని మాట వినకుండా ఉండేలా సాతాను చేశాడు. అలా చేసి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలుపెట్టాడు. యెహోవా అబద్ధికుడని, ఆయన వాళ్లకు మంచి జరగాలని కోరుకోని చెడ్డ పరిపాలకుడని సాతాను ఆదాము హవ్వను నమ్మించాడు. అంటే దేవుడు మనుషులకు ఏమి చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు, ఆదాముహవ్వే వాళ్లకు ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోవచ్చు అని సాతాను చెప్తున్నాడు. మరి యెహోవా ఏమి చేస్తాడు? ఆయన వెంటనే ఆ తిరుగుబాటుదారులను చంపేసి ఆ తిరుగుబాటును ఆపేయవచ్చు. కానీ దానివల్ల సాతాను అబద్ధికుడని రుజువు అయ్యేదా? లేదు, రుజువు అవ్వదు.

9 అందుకే, యెహోవా ఆ తిరుగుబాటుదారులను వెంటనే చంపలేదు. మనుషులు వాళ్లను వాళ్లు పరిపాలించుకునేందుకు సమయాన్ని ఇచ్చాడు. అప్పుడు సాతానే అబద్ధికుడని, మనుషులకు ఏది మంచిదో యెహోవాకే తెలుసని రుజువు అవుతుంది. మనం దీని గురించి 11వ అధ్యాయంలో చూస్తాం. కానీ ఆదాము హవ్వ తీసుకున్న నిర్ణయం గురించి మీకు ఏమి అనిపిస్తుంది? సాతానును నమ్మి దేవుని మాట వినకపోవడం న్యాయమేనా? ఆదాము, హవ్వకు ఉన్నవన్నీ యెహోవాయే ఇచ్చాడు. వాళ్లకు ఏ లోటు లేని ఒక మంచి జీవితాన్ని, ఉండడానికి ఒక అందమైన తోటని, వాళ్లు చక్కగా చేసుకోగలిగే పనిని ఇచ్చాడు. కానీ సాతాను వాళ్లకు ఎప్పుడూ ఏ మంచి చేయలేదు. మీరు అక్కడ ఉండి ఉంటే ఏమి చేసి ఉండేవాళ్లు?

10. మనమందరం ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది?

10 ఈ రోజుల్లో మనమందరం ఇలాంటి నిర్ణయాలనే తీసుకోవాల్సి ఉంటుంది. మన పరిపాలకునిగా దేవునికి లోబడాలని, సాతానుని అబద్ధికునిగా రుజువు చేయాలని మనం కోరుకోవచ్చు లేదా సాతానునే మన పరిపాలకునిగా చేసుకోవచ్చు. (కీర్తన 73:28; సామెతలు 27:11 చదవండి.) మనం తీసుకునే నిర్ణయంపైనే మన జీవితం ఆధారపడుతుంది. లోకంలో చాలా తక్కువమంది దేవునికి లోబడుతున్నారు. అంతేకాదు దేవుడు ఈ లోక పరిపాలకుడు కాదు. దేవుడు కాకపోతే మరి ఎవరు ఈ లోక పరిపాలకుడు?

లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు?

భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ సాతానువి కాకపోతే, యేసుకు ఇస్తానని అనగలిగేవాడా?

11, 12. (ఎ) సాతాను యేసుతో అన్న మాటలను బట్టి మనకు ఏమి తెలుస్తుంది? (బి) సాతాను లోకాన్ని పరిపాలిస్తున్నాడని ఏ వచనాలు చూపిస్తున్నాయి?

11 ఈ లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారో యేసుకు తెలుసు. ఒకసారి సాతాను, “లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమనూ ఆయనకు” చూపించాడు. తర్వాత సాతాను యేసుకు ఇలా మాటిచ్చాడు: “నువ్వు సాష్టాంగపడి ఒక్కసారి నన్ను పూజిస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను.” (మత్తయి 4:8, 9; లూకా 4:5, 6) మీరే ఆలోచించండి, ఒకవేళ ఆ రాజ్యాలన్నీ సాతాను చేతిలో లేకపోతే ఆయన వాటిని యేసుకు ఇవ్వగలడా? లేదు. అంటే ఆ ప్రభుత్వాలన్నీ సాతానుకు చెందినవే.

12 మీరు ఇలా అనుకోవచ్చు: ‘సాతాను ఎలా ఈ లోకానికి పరిపాలకుడు కాగలడు? సర్వశక్తిమంతుడైన యెహోవాయే కదా ఈ విశ్వాన్ని సృష్టించింది?’ (ప్రకటన 4:11) అవును, యెహోవాయే. కానీ యేసు స్పష్టంగా సాతానే ఈ “లోక పరిపాలకుడు” అని చెప్పాడు. (యోహాను 12:31; 14:30; 16:11) అపొస్తలుడైన పౌలు కూడా అపవాదియైన సాతానుని “ఈ లోక దేవుడు” అని పిలిచాడు. (2 కొరింథీయులు 4:3, 4) అపొస్తలుడైన యోహాను “లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది” అని రాశాడు.—1 యోహాను 5:19.

సాతాను లోకం ఎలా నాశనం అవుతుంది?

13. మనందరికీ ఒక కొత్తలోకం ఎందుకు అవసరం?

13 ఈ ప్రపంచం రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతుంది. యుద్ధాలను, అవినీతిని, దౌర్జన్యాన్ని, బయటకు నటించేవాళ్లను మన చుట్టూ చూస్తున్నాం. మనుషులు ఎంత ప్రయత్నించినా ఈ సమస్యలన్నిటి నుండి బయటపడలేరు. కానీ దేవుడు త్వరలో ఈ దుష్టలోకాన్ని అర్మగిద్దోను యుద్ధంలో నాశనం చేస్తాడు. ఆ స్థానంలో ఆయన నీతియుక్తమైన లోకాన్ని తెస్తాడు.—ప్రకటన 16:14-16; అదనపు సమాచారంలో 10వ పాయింట్‌ చూడండి.

14. తన రాజ్యానికి రాజుగా దేవుడు ఎవరిని పెట్టాడు? బైబిలు యేసు గురించి ముందే ఏమని చెప్పింది?

14 యెహోవా తన పరలోక ప్రభుత్వానికి లేదా రాజ్యానికి రాజుగా యేసుక్రీస్తును ఎన్నుకున్నాడు. యేసు శాంతికి అధిపతిగా పరిపాలిస్తాడని, ఆయన ప్రభుత్వానికి అస్సలు అంతం ఉండదని వేల సంవత్సరాల క్రితం బైబిలు చెప్పింది. (యెషయా 9:6, 7) యేసు తన అనుచరులకు “నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలి” అని చెప్పినప్పుడు ఆ ప్రభుత్వం కోసం ప్రార్థన చేయమని నేర్పించాడు. (మత్తయి 6:10) 8వ అధ్యాయంలో దేవుని రాజ్యం ఎలా లోక ప్రభుత్వాలన్నిటినీ తీసేస్తుందో తెలుసుకుంటాం. (దానియేలు 2:44 చదవండి.) తర్వాత దేవుని రాజ్యం భూమిని అందమైన పరదైసుగా మారుస్తుంది.—అదనపు సమాచారంలో 11వ పాయింట్‌ చూడండి.

ఒక కొత్త లోకం దగ్గర్లో ఉంది!

15. “కొత్త భూమి” అంటే ఏంటి?

15 బైబిలు ఇలా వాగ్దానం చేస్తుంది: “కొత్త ఆకాశం కోసం, కొత్త భూమి కోసం ఎదురుచూస్తున్నాం; వాటిలో ఎప్పుడూ నీతి ఉంటుంది.” (2 పేతురు 3:13; యెషయా 65:17) కొన్నిసార్లు బైబిల్లో ‘భూమి’ అని ఉన్నప్పుడు అది భూమి మీద ఉండే మనుషులని అర్థం. (ఆదికాండం 11:1) కాబట్టి నీతియుక్తమైన “కొత్త భూమి” అంటే దేవునికి లోబడే ప్రజలు, ఆయన చేత ఆశీర్వదించబడిన వాళ్లు అని అర్థం.

16. దేవుడు తీసుకొచ్చే కొత్త లోకంలో జీవించేవాళ్లకు ఆయన ఏ అద్భుతమైన బహుమానాన్ని ఇస్తాడు, ఆ బహుమానాన్ని పొందడానికి మనం ఏమి చేయాలి?

16 దేవుడు తీసుకొచ్చే కొత్త లోకంలో జీవించే వాళ్లందరూ “శాశ్వత జీవితాన్ని” పొందుతారని యేసు మాట ఇచ్చాడు. (మార్కు 10:30) ఆ బహుమతిని పొందాలంటే మనం ఏమి చేయాలి? దయచేసి యోహాను 3:16, 17:3 చదివి జవాబు తెలుసుకోండి. పరదైసులో జీవితం ఎలా ఉంటుందని బైబిలు చెప్తుందో ఇప్పుడు చూద్దాం.

17, 18. భూమి అంతా శాంతి ఉంటుందని మనం సురక్షితంగా ఉంటామని మనకు ఎలా తెలుసు?

17 దుష్టత్వం, యుద్ధం, నేరం, దౌర్జన్యం లేకుండా పోతాయి. భూమి మీద చెడ్డవాళ్లు ఎవరూ మిగిలి ఉండరు. (కీర్తన 37:10, 11) దేవుడు “భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు.” (కీర్తన 46:9; యెషయా 2:4) భూమి నిండా దేవున్ని ప్రేమించి ఆయనకు లోబడే ప్రజలే ఉంటారు. శాంతి ఎప్పటికీ ఉంటుంది.—కీర్తన 72:7.

18 యెహోవా ప్రజలు సురక్షితంగా ఉంటారు. బైబిలు కాలాల్లో ఇశ్రాయేలీయులు దేవునికి లోబడినప్పుడు, ఆయన వాళ్లను కాపాడాడు కాబట్టి వాళ్లు సురక్షితంగా ఉన్నారు. (లేవీయకాండం 25:18, 19) పరదైసులో మనం ఎవరికీ భయపడం, దేనికీ భయపడం. మనమెప్పుడూ ఏ భయం లేకుండా ఉంటాం!—యెషయా 32:18; మీకా 4:4 చదవండి.

19. దేవుడు తెచ్చే కొత్త లోకంలో చాలా ఆహారం ఉంటుందని ఎందుకు చెప్పవచ్చు?

19 చాలా ఆహారం ఉంటుంది. “భూమ్మీద సస్యసమృద్ధి ఉంటుంది; పర్వత శిఖరాల మీద ధాన్యం పొంగిపొర్లుతుంది.” (కీర్తన 72:16) యెహోవా, మన దేవుడు మనల్ని దీవిస్తాడు, “భూమి దాని పంటను ఇస్తుంది.”—కీర్తన 67:6.

20. భూమి పరదైసుగా మారుతుందని మనకు ఎలా తెలుసు?

20 భూమంతా పరదైసుగా మారుతుంది. ప్రజలకు అందమైన ఇళ్లు, తోటలు ఉంటాయి. (యెషయా 65:21-24; ప్రకటన 11:18 చదవండి.) భూమంతా ఏదెను తోటలా అందంగా ఉంటుంది. మనకు కావాల్సిన ప్రతీదాన్ని యెహోవా మనకు ఎప్పుడూ ఇస్తాడు. బైబిలు ఆయన గురించి ఇలా చెప్తుంది: “నువ్వు నీ గుప్పిలి విప్పి ప్రతీ జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు.”—కీర్తన 145:16.

21. మనుషులకు, జంతువులకు మధ్య శాంతి ఉంటుందని ఎలా చెప్పవచ్చు?

21 మనుషులకు, జంతువులకు మధ్య శాంతి ఉంటుంది. జంతువులు మనుషులకు ఇక హాని చేయవు. ఇప్పుడు మనకు హాని చేసే జంతువుల మధ్య కూడా చిన్న పిల్లలు అప్పుడు సురక్షితంగా ఉంటారు.—యెషయా 11:6-9; 65:25 చదవండి.

22. జబ్బుతో ఉన్నవాళ్ల కోసం యేసు ఏమి చేస్తాడు?

22 అందరూ ఆరోగ్యంగా ఉంటారు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు చాలామందిని బాగు చేశాడు. (మత్తయి 9:35; మార్కు 1:40-42; యోహాను 5:5-9) కానీ దేవుని రాజ్యానికి రాజుగా యేసు అందరినీ బాగు చేస్తాడు. అప్పుడు ఎవ్వరూ “నాకు ఒంట్లో బాలేదు” అని అనరు.—యెషయా 33:24; 35:5, 6.

23. చనిపోయినవాళ్లను దేవుడు ఏమి చేస్తాడు?

23 చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు. చనిపోయిన లక్షలమందిని మళ్లీ బ్రతికిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. “నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు తిరిగి” బ్రతికిస్తాడు.—యోహాను 5:28, 29 చదవండి; అపొస్తలుల కార్యాలు 24:15.

24. పరదైసులో జీవించడం గురించి మీరు ఎలా భావిస్తున్నారు?

24 మనందరి ముందు ఒక నిర్ణయం ఉంది. మనం యెహోవా గురించి నేర్చుకుని ఆయనను సేవించాలని నిర్ణయించుకోవచ్చు లేదా మనకు ఏది ఇష్టమో అది చేసుకోవచ్చు. యెహోవాను ఆరాధించాలని నిర్ణయించుకుంటే మాత్రం మనకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఒకతను నేను చనిపోయాక నన్ను గుర్తుచేసుకో అని యేసును అడిగినప్పుడు, “నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు” అని యేసు మాటిచ్చాడు. (లూకా 23:43) మనం యేసుక్రీస్తు గురించి, ఆయన దేవుని అద్భుతమైన వాగ్దానాలను ఎలా నెరవేరుస్తాడు అనే విషయాల గురించి ఎక్కువ నేర్చుకుందాం.