కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అవిశ్వసనీయతను గురించిన గుణపాఠాలు

అవిశ్వసనీయతను గురించిన గుణపాఠాలు

పద్దెనిమిదవ అధ్యాయం

అవిశ్వసనీయతను గురించిన గుణపాఠాలు

యెషయా 22:​1-25

1. ముట్టడి వేయబడిన ఒక ప్రాచీన నగరం లోపల ఉండడం ఎలా ఉంటుంది?

 ముట్టడి వేయబడిన ఒక ప్రాచీన నగరంలో ఉండడం ఎలా ఉంటుందో ఊహించండి. ప్రాకారముల వెలుపల బలవంతుడైన, క్రూరుడైన శత్రువు ఉన్నాడు. అతడు ఇప్పటికే ఇతర నగరాలను కూలదోసాడని మీకు తెలుసు. అతడు ఇప్పుడు మీ నగరాన్ని జయించి, దాన్ని కొల్లగొట్టి, దాని నివాసులను చెరచి, చంపాలని నిశ్చయించుకున్నాడు. పోరాటంలో సూటిగా ఎదుర్కోలేనంత శక్తివంతంగా శత్రు సైన్యాలున్నాయి; నగర ప్రాకారములు మాత్రమే వారిని దూరంగా ఉంచగలవని ఆశించడం మినహా మీరు చేయగలిగిందేం లేదు. మీరు ప్రాకారములపై నుండి బయటికి చూసినప్పుడు, శత్రువుల కోటలు మీకు కనిపిస్తాయి. మీ నగర రక్షణ వ్యవస్థను కూలదోసేందుకు పెద్ద పెద్ద రాళ్లను విసరగల ముట్టడి యంత్రాలు కూడా వారి దగ్గర ఉన్నాయి. కోటగోడలు పడగొట్టే యంత్రాలు, నిచ్చెనలు, రథములు, వారి సైనిక దళాలు మీకు కనిపిస్తాయి, వారి విలుకాండ్లు మీకు కనిపిస్తారు. ఎంత భయం గొలిపే దృశ్యం!

2. యెషయా 22 వ అధ్యాయంలో వివరించబడిన ముట్టడి ఎప్పుడు జరుగుతుంది?

2 యెషయా 22 వ అధ్యాయంలో, మనం అలాంటి ముట్టడి గురించే అంటే యెరూషలేముపై వేయబడిన ముట్టడి గురించి చదువుతాము. అదెప్పుడు జరుగుతుంది? వివరించబడిన అంశాలన్నీ ఫలాని ముట్టడిలో నెరవేరాయని ఏదైనా ఒక్క ముట్టడిని కచ్చితంగా పేర్కొనడం కష్టం. ఈ ప్రవచనం, యెరూషలేముపై వేయబడే వివిధ ముట్టడిలన్నింటికీ వర్తించే వివరణగా, రానున్నదాన్ని గురించి అందరికీ ఇవ్వబడుతున్న హెచ్చరికగా అర్థం చేసుకోవచ్చునని తెలుస్తుంది.

3. యెషయా వర్ణిస్తున్న ముట్టడికి యెరూషలేము నివాసులు ఎలా ప్రతిస్పందిస్తున్నారు?

3 యెషయా వర్ణిస్తున్న ముట్టడి సమయంలో, యెరూషలేము నివాసులు ఏమి చేస్తున్నారు? దేవుని నిబంధన ప్రజలుగా వారు, తమను రక్షించమని యెహోవాకు మొరపెడుతున్నారా? లేదు, దేవుడ్ని ఆరాధిస్తున్నామని చెప్పుకునే అనేకుల మధ్య నేడు కనిపించేటటువంటి చాలా మూర్ఖపు దృక్పథాన్ని వారు కనబరుస్తున్నారు.

ముట్టడి వేయబడిన ఒక నగరం

4. (ఎ) “దర్శనపులోయ” అంటే ఏమిటి, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? (బి) యెరూషలేము నివాసుల ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది?

4 యెషయా 21 వ అధ్యాయంలో, మూడు తీర్పు సందేశాల్లో ప్రతి ఒక్కటీ “దేవోక్తి” అనే పదంతో పరిచయం చేయబడింది. (యెషయా 21:​1, 11, 13) ఇరవై రెండవ అధ్యాయం కూడా అలాగే ప్రారంభమవుతుంది: “దర్శనపులోయను గూర్చిన దేవోక్తి: ఏమి వచ్చి నీలోనివారందరు మేడలమీది కెక్కియున్నారు?” (యెషయా 22:​1, 2ఎ) “దర్శనపులోయ” యెరూషలేమును సూచిస్తోంది. ఆ నగరం ఎత్తైన ప్రదేశంలో ఉన్నప్పటికీ, దాని చుట్టూ ఎత్తైన పర్వతాలు ఉన్నందువల్ల అది లోయ అని పిలువబడుతోంది. అది ‘దర్శనంతో’ సంబంధం కలిగివుంది ఎందుకంటే అనేక దైవిక దర్శనాలు, ప్రకటనలు అక్కడే ఇవ్వబడ్డాయి. కాబట్టే, ఆ నగర నివాసులు యెహోవా చెప్పేది వినాలి. కానీ, వారు ఆయనను నిర్లక్ష్యం చేసి, అబద్ధ ఆరాధనలో పడిపోయారు. ఆ నగరాన్ని ముట్టడిస్తున్న శత్రువు, దారితప్పిన తన ప్రజలకు తీర్పు తీర్చడానికి దేవుడు ఉపయోగించే ఉపకరణం.​—⁠ద్వితీయోపదేశకాండము 28:45, 49, 50, 52.

5. ప్రజలు తమ మేడల మీదికి ఎందుకు ఎక్కారు?

5 యెరూషలేము నివాసులు ‘మేడలమీదికి ఎక్కియున్నారని’ గమనించండి. ప్రాచీన కాలాల్లో, ఇశ్రాయేలీయుల ఇండ్ల పైకప్పులు బల్లపరుపుగా ఉండేవి, సాధారణంగా కుటుంబాలు అక్కడ సమకూడేవి. ఈ సందర్భంలో వారు ఎందుకలా చేశారనేది యెషయా చెప్పడం లేదు గానీ ఆయన మాటలు అనంగీకారాన్ని సూచిస్తున్నాయి. బహుశా వారు అబద్ధ దేవుళ్లను వేడుకోవడానికి మేడలమీదికి ఎక్కివుంటారు. సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనం చేయబడడానికి ముందటి సంవత్సరాల్లో ఇది వారి ఆచారంగా ఉండేది.​—⁠యిర్మీయా 19:13; జెఫన్యా 1:5.

6. (ఎ) యెరూషలేములో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? (బి) కొందరు ఎందుకు ఉల్లాసంగా ఉంటారు, కాని ఏమి సంభవించబోతోంది?

6 యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “అల్లరితో నిండి కేకలువేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలుపెట్టు దుర్గమా, నీలో హతులైనవారు ఖడ్గముచేత హతముకాలేదు యుద్ధములో వధింపబడలేదు.” (యెషయా 22:2) నగరంలోకి బహుళసంఖ్యలో జనం వచ్చారు, అది అల్లకల్లోలంగా ఉంది. వీధుల్లో ప్రజలు కేకలు వేస్తూ భయంతో ఉన్నారు. కొందరైతే ఉల్లాసంగా ఉన్నారు, బహుశా వారు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తుండవచ్చు లేక ప్రమాదం దాటిపోతుందని వారు నమ్ముతుండవచ్చు. * అయితే ఆ సమయంలో ఉల్లాసంగా ఉండడమన్నది మూర్ఖమైనపని. నగరంలోని అనేకులు ఖడ్గవాత కూలడం కంటే ఘోరమైన మరణాన్ని చవిచూడబోతున్నారు. ముట్టడి వేయబడిన నగరంలోకి బయటి నుండి ఆహారం వచ్చే మార్గాలన్ని మూసివేయబడతాయి. నగరంలో ఉన్న నిల్వలు తగ్గిపోతుంటాయి. ఆకలితో అలమటించే ప్రజలు, కిక్కిరిసిన పరిస్థితులు అంటువ్యాధులకు దారి తీస్తాయి. కాబట్టి యెరూషలేములోని అనేకులు కరవు మూలంగా, రోగాల మూలంగా మరణిస్తారు. సా.శ.పూ. 607 లోనూ, సా.శ. 70 లోనూ ఇది జరుగుతుంది.​—⁠2 రాజులు 25:3; విలాపవాక్యములు 4:9, 10. *

7. ముట్టడి సమయంలో యెరూషలేము పాలకులు ఏమి చేస్తారు, వారికి ఏమి జరుగుతుంది?

7 ఈ క్లిష్టపరిస్థితుల్లో, యెరూషలేము పాలకులు ఎటువంటి నడిపింపునిస్తారు? యెషయా ఇలా సమాధానమిస్తున్నాడు: “నీ అధిపతులందరు కూడి పారిపోగా విలుకాండ్లచేత కొట్టబడకుండ పట్టబడినవారైరి. మీలో దొరికినవారందరు పట్టబడి [“ఖైదీలుగా తీసుకువెళ్ళబడ్డారు,” NW] దూరమునకు పారిపోయిరి.” (యెషయా 22:3) పాలకులు, శూరులు పారిపోతారు కానీ ఆ తర్వాత దొరికిపోతారు! వారివైపు విల్లు ఎక్కుపెట్టబడకుండానే వారు పట్టబడతారు, ఖైదీలుగా తీసుకువెళ్లబడతారు. ఇది సా.శ.పూ. 607 లో జరుగుతుంది. యెరూషలేము ప్రాకారము పడగొట్టబడిన తర్వాత, సిద్కియా రాజు తన శూరులను తీసుకొని రాత్రివేళ పారిపోతాడు. శత్రువులు అది తెలుసుకొని వారిని తరిమి, యెరికో మైదానంలో వారిని కలుసుకొంటారు. శూరులు ఇటూ అటూ చెదరిపోతారు. సిద్కియాను పట్టుకుని, కన్నులు ఊడదీయించి ఇత్తడి సంకెళ్లతో బంధించి, బబులోనుకు తీసుకువెళతారు. (2 రాజులు 25:​2-7) అతని అవిశ్వసనీయత వల్ల ఎంతటి విషాదకరమైన పర్యవసానం!

విపత్తును బట్టి వ్యాకులత

8. (ఎ) యెరూషలేముపైకి వచ్చే విపత్తును తెలియజేసే ప్రవచనానికి యెషయా ఎలా ప్రతిస్పందిస్తాడు? (బి) యెరూషలేములో దృశ్యం ఎలా ఉంటుంది?

8 ఈ ప్రవచనం యెషయాను ఎంతో కదిలిస్తుంది. ఆయన ఇలా అంటాడు: “నేను సంతాపము కలిగి యేడ్చుచున్నాను నాకు విముఖులై యుండుడి నా జనమునకు కలిగిన నాశనమునుగూర్చి నన్ను ఓదార్చుటకు తీవరపడకుడి.” (యెషయా 22:4) మోయాబు, బబులోనులకు దుర్గతి పడుతుందని ప్రవచించబడిన దాన్ని బట్టి యెషయా దుఃఖిస్తాడు. (యెషయా 16:​11; 21:3) తన స్వంత ప్రజలపైకి రానున్న నాశనాన్ని గురించి ఆలోచించినప్పుడు ఆయన వ్యాకులత, దుఃఖం మరింత అధికమవుతాయి. ఆయన ఓదార్పు పొందలేకపోతున్నాడు. ఎందుకు? “దర్శనపు లోయలో సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా అల్లరిదినమొకటి నియమించి యున్నాడు. ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగజేయును. ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును.” (యెషయా 22:5) యెరూషలేము విపరీతమైన గందరగోళంతో నిండిపోతుంది. ప్రజలు భయాందోళనలతో వ్యర్థంగా అటూ ఇటూ తిరుగుతారు. శత్రువులు నగర ప్రాకారములను పడగొట్టడం మొదలు పెట్టగానే, “కొండవైపు ధ్వని వినబడును.” అంటే మోరీయా పర్వతంపైనున్న దేవుని పరిశుద్ధాలయంలో నగర వాసులు ఆయనకు మొరపెడతారని దీని భావమా? బహుశా కావచ్చు. అయితే, వారి అవిశ్వసనీయత దృష్ట్యా ఇది, వారు భీతితోపెట్టిన కేకలు పరిసర పర్వతాల్లో ప్రతిధ్వనించడం మాత్రమే కావచ్చు.

9. యెరూషలేముకు ముప్పు తెస్తున్న సైన్యాన్ని వర్ణించండి.

9 ఎటువంటి శత్రువు యెరూషలేముకు ముప్పు తెస్తోంది? యెషయా మనకు ఇలా చెబుతున్నాడు: “ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబులపొదిని వహించియున్నది. కీరు డాలు పై గవిసెన తీసెను.” (యెషయా 22:6) శత్రువులు పూర్తిగా సాయుధులై ఉన్నారు. వారి విలుకాండ్ల అంబులపొదిలు అంబులతో నిండివున్నాయి. యోధులు యుద్ధం కోసం తమ డాళ్ళను సిద్ధం చేసుకొంటున్నారు. రథాలు, యుద్ధ-శిక్షిత అశ్వాలు వారి వద్ద ఉన్నాయి. ఇప్పుడు పర్షియా సింధుశాఖగా ఉన్న ప్రాంతానికి ఉత్తరానున్న ఏలాము నుండీ, బహుశా ఏలాముకు దగ్గరలో ఉన్న కీరు నుండీ వచ్చిన సైనికులు ఆ సైన్యంలో ఉన్నారు. ఆ దేశాల ప్రస్తావన, దురాక్రమణదారులు ఎంతెంత దూరాల నుండి వస్తారో సూచిస్తోంది. ఏలాము విలుకాండ్లు, హిజ్కియా కాలంలో యెరూషలేముకు ముప్పు తెచ్చిన సైన్యంలో ఉండవచ్చునని కూడా అది సూచిస్తుంది.

రక్షణ ప్రయత్నాలు

10. నగరానికి చెడు సూచకంగా పరిస్థితులు ఎలా పరిణమించాయి?

10 పరిస్థితుల పరిణామాలను యెషయా ఇలా వర్ణిస్తున్నాడు: “అందమైన నీ లోయలనిండ రథములున్నవి. గుఱ్ఱపురౌతులు గవినియొద్ద వ్యూహమేర్పరచుకొనుచున్నారు. అప్పుడు యూదానుండి ఆయన ముసుకు తీసివేసెను.” (యెషయా 22:7, 8) రథములు, గుఱ్ఱములు యెరూషలేము నగరం వెలుపలి మైదానాల్లోకి వచ్చి, నగర గవునులపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. తీసివేయబడే ‘యూదా ముసుకు’ అంటే ఏమిటి? బహుశా అది నగర గవిని కావచ్చు, దాన్ని పట్టుకోవడం, నగరాన్ని రక్షించేవారికి చెడు సూచకం. * ఈ రక్షణ ముసుకు తీసివేయబడినప్పుడు, దాడి చేసేవారి కోసం నగరం తెరిచి ఉన్నట్లే.

11, 12. యెరూషలేము నివాసులు ఏ రక్షణ చర్యలను చేపడతారు?

11 యెషయా ఇప్పుడు, ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలపై తన అవధానాన్ని నిలుపుతున్నాడు. వారి మొదటి తలంపు​—⁠ఆయుధాలు! “ఆ దినమున నీవు అరణ్యగృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి. దావీదుపట్టణపు ప్రాకారము చాలామట్టుకు పడిపోయినదని తెలిసికొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి.” (యెషయా 22:​8బి, 9) ఆయుధాలు అరణ్య గృహములోని ఆయుధశాలలో నిలువచేయబడ్డాయి. ఆ ఆయుధశాలను సొలొమోను నిర్మించాడు. లెబానోను నుండి తెచ్చిన దేవదారు కలపతో అది నిర్మించబడింది గనుక “లెబానోను అరణ్యపు నగరు” అని పిలువబడేది. (1 రాజులు 7:​2-5) ప్రాకారము ఎంతమేరకు పడిపోయిందో పరిశీలించడం జరిగింది. తమను తాము కాపాడుకునేందుకు ఎంతో ఆవశ్యకమైన నీళ్లు సమకూర్చబడ్డాయి. ప్రజలు జీవించడానికి నీళ్లు అవసరం. నీళ్లు లేకుండా నగరం నిలవలేదు. అయితే, వారు విడుదల కోసం యెహోవా వైపు చూసినట్టుగా ఏమీ చెప్పబడలేదని గమనించండి. బదులుగా, వారు తమ స్వంత వనరులపై ఆధారపడుతున్నారు. మనం అలాంటి పొరపాటు ఎన్నడూ చేయకుండా ఉందాం!​—⁠కీర్తన 127:1.

12 పడిపోయిన పట్టణపుప్రాకారము గురించి ఏమి చేయవచ్చు? “యెరూషలేము యిండ్లను లెక్క పెట్టి, ప్రాకారమును గట్టిచేయుటకు ఇండ్లను పడగొట్టితిరి.” (యెషయా 22:​10) పడిపోయిన ప్రాకారమును బాగుచేయడానికి అవసరమైన వస్తుసామాగ్రి కోసం ఏ ఇండ్లను పడగొట్ట వచ్చునని మదింపు చేయడం జరుగుతుంది. శత్రువులు ప్రాకారములను పూర్తిగా లోబరచుకోకుండా నివారించేందుకు ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది.

విశ్వాసంలేని ప్రజలు

13. ప్రజలు నీళ్లు తగినన్ని ఉండేలా ఏర్పాట్లు చేసుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారు, కాని వారు ఎవరిని మరచిపోతారు?

13 “పాత కోనేటినీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి. అయినను దాని చేయించిన వానివైపు మీరు చూచిన వారు కారు, పూర్వకాలమున దాని నిర్మించినవానిని మీరు లక్ష్యపెట్టకపోతిరి.” (యెషయా 22:​11) ఈ వచనంలోనూ 9 వ వచనంలోనూ వర్ణించబడిన, నీళ్లను సమకూర్చడానికి చేయబడిన ప్రయత్నాలు, దాడి చేయబోతున్న అష్షూరీయుల నుండి నగరాన్ని కాపాడేందుకు హిజ్కియా చేపట్టిన చర్యలను మనకు గుర్తుకు తెస్తాయి. (2 దినవృత్తాంతములు 32:​2-5) అయితే, యెషయా చెప్పిన ఈ ప్రవచనంలోని నగర ప్రజలు పూర్తిగా విశ్వాసంలేని వారు. వారు నగర రక్షణ ఏర్పాట్లు చేస్తూ, సృష్టికర్త గురించి హిజ్కియా తలంచినట్లు, వారు ఏ మాత్రం తలంచరు.

14. యెహోవా హెచ్చరించినప్పటికీ, ప్రజలు ఎలాంటి మూర్ఖపు దృక్పథాన్ని కలిగివుంటారు?

14 యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసికొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి, యెడ్లను వధించుచు గొఱ్ఱెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు.” (యెషయా 22:​12, 13) యెరూషలేము నివాసులు తాము యెహోవాపై తిరుగుబాటు చేసినదానికి ఏమాత్రం పరితాపం చూపించరు. వారు పశ్చాత్తాపానికి సూచనగా ఏడవరు, వెంట్రుకలు కత్తిరించుకోరు, లేక గోనెపట్ట కట్టుకోరు. వారు అలా చేసినట్లయితే, బహుశా యెహోవా వారిని రానున్న భయంకరమైన సంఘటనల నుండి తప్పించేవాడే. కానీ, వాళ్లు శారీరక ఆనందాల్లో మునిగిపోయారు. నేడు దేవునిపై విశ్వాసం ఉంచని అనేకులలో అదే దృక్పథం ఉంది. వారికి అటు మృతుల పునరుత్థాన నిరీక్షణ, ఇటు భవిష్యద్‌ పరదైసు భూమిపై జీవితమనే నిరీక్షణ రెండూ లేవు గనుక వారు, “రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము” అని చెబుతూ తమ కోరికలు తీర్చుకోవడంలోనే నిమగ్నమయ్యే జీవిత విధానాలను అవలంబిస్తారు. (1 కొరింథీయులు 15:​32) ఎంత అవివేకం! వారు గనుక యెహోవాపై నమ్మకం ఉంచితే, వారికి నిరంతరం నిలిచే నిరీక్షణ లభించేదే!​—⁠కీర్తన 4:6-8; సామెతలు 1:33.

15. (ఎ) యెరూషలేముకు వ్యతిరేకంగా యెహోవా తీర్పు సందేశం ఏమిటి, ఆయన తీర్పును ఎవరు అమలు చేస్తారు? (బి) క్రైస్తవమత సామ్రాజ్యం యెరూషలేము అనుభవించినటువంటి దుర్గతినే ఎందుకు అనుభవిస్తుంది?

15 ముట్టడించబడిన యెరూషలేము నివాసులకు భద్రత లభించదు. యెషయా ఇలా చెబుతున్నాడు: “ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు​—⁠మీరు మరణము కాకుండ ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చుచున్నాడు.” (యెషయా 22:​14) ప్రజల హృదయ కాఠిన్యాన్ని బట్టి వారికి క్షమాపణ లభించదు. మరణం తప్పక వస్తుంది. అది ఖచ్చితం. ప్రభువు సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చాడు. యెషయా ప్రవచనార్థక మాటల నెరవేర్పుగా, అవిశ్వాస యెరూషలేముపైకి విపత్తు రెండుసార్లు వస్తుంది. బబులోను సైన్యాలు, ఆ తర్వాత రోము దాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి, దేవుడ్ని ఆరాధిస్తున్నామని చెప్పుకొంటూ తమ చర్యల ద్వారా ఆయనను ఎరుగమన్నట్లు చూపిస్తున్న సభ్యులుగల అవిశ్వాస క్రైస్తవమత సామ్రాజ్యంపైకి కూడా విపత్తు అలాగే వస్తుంది. (తీతు 1:​16) దేవుని నీతియుక్తమైన మార్గాలను పరిహసించే, ప్రపంచంలోని ఇతర మతాల పాపములతో సహా క్రైస్తవమత సామ్రాజ్యపు పాపములు “ఆకాశమునంటుచున్నవి.” మతభ్రష్ట యెరూషలేము దోషము వలెనే వారి దోషము కూడా ప్రాయశ్చిత్తము చేయబడలేనంత గొప్పది.​—⁠ప్రకటన 18:5, 8, 21.

ఒక స్వార్థపరుడైన గృహనిర్వాహకుడు

16, 17. (ఎ) ఇప్పుడు ఎవరు యెహోవా నుండి హెచ్చరిక సందేశాన్ని అందుకుంటారు, ఎందుకు? (బి) షెబ్నాకు అహంకారపూరితమైన అభిలాషలు ఉన్నందుకు, అతనికి ఏమవుతుంది?

16 ప్రవక్త ఇప్పుడు తన అవధానాన్ని అవిశ్వాసులైన ప్రజల నుండి అవిశ్వాసియైన ఒక వ్యక్తి వైపుకు మళ్ళిస్తున్నాడు. యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు​—⁠గృహనిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్తయొద్దకు పోయి అతనితో ఇట్లనుము​—⁠ఇక్కడ నీ కేమి పని? ఇక్కడ నీ కెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేల? ఎత్తయిన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు; శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు.”​—యెషయా 22:15, 16.

17 షెబ్నా బహుశా హిజ్కియా రాజు గృహంలో, ‘గృహనిర్వాహకుడు’ అయ్యుండవచ్చు. ఎలాగైనా ఆయనకు చాలా ప్రాబల్యంగల స్థానమే ఉంది, ఆయన రాజు తర్వాత రాజంతటి వాడు. ఆయన ఎంతో బాధ్యతాయుతమైన స్థానంలో ఉంటాడు. (1 కొరింథీయులు 4:2) అయినప్పటికీ, రాజ్య వ్యవహారాలకు ప్రాముఖ్యంగా అవధానం ఇవ్వవలసిన సమయంలో షెబ్నా తనకు మహిమ తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నాడు. ఆయన ఎత్తైన స్థలంలోవున్న శిలలో, రాజు సమాధితో పోల్చదగిన ఖరీదైన సమాధిని తొలిపించుకొంటున్నాడు. ఇది గమనించి యెహోవా విశ్వాసద్రోహి అయిన ఆ గృహనిర్వాహకుడ్ని ఇలా హెచ్చరించేలా యెషయాను ప్రేరేపిస్తాడు: “ఇదిగో బలాఢ్యుడొకని విసరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసరివేయును, ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును. ఆయన నిన్ను మడిచి యొకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములోనికి నిన్ను విసరివేయును. నీ యజమానుని ఇంటివారికి అవమానము తెచ్చినవాడా, అక్కడనే నీవు మృతిబొందెదవు, నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును. నీ స్థితినుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను; నీ ఉద్యోగమునుండి ఆయన నిన్ను త్రోసివేయును.” (యెషయా 22:​17-19) షెబ్నాకు తన స్వార్థం మూలంగా యెరూషలేములో కనీసం సామాన్యమైన సమాధి కూడా లభించదు. బదులుగా, అతడు దూరదేశంలో మరణించేందుకు చెండులా విసిరి వేయబడతాడు. దేవుని ప్రజల మధ్యన అధికారం అప్పగించబడిన వారందరికీ దీనిలో ఒక హెచ్చరిక ఉంది. అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఆ అధికారాన్ని కోల్పోవడానికి నడిపిస్తుంది, బహుశా వారు దేవుని ప్రజల మధ్య నుండి తొలగించబడవచ్చు కూడా.

18. షెబ్నా స్థానంలోకి ఎవరు వస్తారు, ఇతడు షెబ్నా అధికారిక వస్త్రాలను, దావీదు ఇంటి తాళపు చెవిని అందుకుంటాడంటే దాని భావమేమిటి?

18 అయితే, షెబ్నా తన స్థానం నుండి ఎలా తొలగించబడతాడు? యెషయా ద్వారా యెహోవా ఇలా వివరిస్తున్నాడు: “ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి, అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టుచేత అతని బలపరచి నీ అధికారమును అతనికిచ్చెదను; అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రియగును. నేను దావీదు ఇంటితాళపు [“ఇంటి తాళపుచెవిని,” NW] అధికారభారమును అతని భుజముమీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు.” (యెషయా 22:​20-22) షెబ్నా స్థానంలో ఎల్యాకీముకు దావీదు ఇంటితాళపు చెవితో పాటు గృహనిర్వాహకుని అధికారిక వస్త్రాలు కూడా ఇవ్వబడతాయి. ఆధిపత్యాన్ని, ప్రభుత్వాన్ని లేక అధికారాన్ని సూచించడానికి బైబిలు “తాళపుచెవి” అనే పదాన్ని ఉపయోగిస్తుంది. (మత్తయి 16:19 పోల్చండి.) ప్రాచీన కాలాల్లో, తాళపుచెవులు అప్పగించబడిన రాజు ఉపదేశకుడు, రాజవంశానికి చెందిన గదులను పర్యవేక్షించేవాడు, రాజు సేవలో ఎవరు ఉండవచ్చుననేది కూడా నిర్ణయించేవాడు. (ప్రకటన 3:7, 8 పోల్చండి.) కాబట్టి, గృహనిర్వాహకుని పని చాలా ప్రాముఖ్యమైనది, ఆ స్థానంలో ఉన్నవారు ఎంతో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నట్లే. (లూకా 12:48) షెబ్నా సమర్థుడే కావచ్చు, కానీ అతడు విశ్వాసంగా ఉండలేదు గనుక, యెహోవా అతడి స్థానంలోకి మరొకరిని తెస్తాడు.

రెండు సూచనార్థకమైన మేకులు

19, 20. (ఎ) ఎల్యాకీము తన ప్రజలకు ఎలా ఒక ఆశీర్వాదంగా నిరూపించబడతాడు? (బి) షెబ్నాపై ఆధారపడడంలో కొనసాగేవారికి ఏమి జరుగుతుంది?

19 చివరికి, అధికారం షెబ్నా నుండి ఎల్యాకీముకు మారుతుందని వర్ణించడానికి యెహోవా సూచనార్థక భాషను ఉపయోగిస్తాడు. ఆయనిలా అంటున్నాడు: “దిట్టమైనచోట మేకు కొట్టినట్టు నేను అతని [ఎల్యాకీమును] స్థిరపరచెదను, అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యతగల సింహాసనముగా నుండును. గిన్నెలవంటి పాత్రలను బుడ్లవంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులగు పిల్లజల్లలందరిని అతనిమీద వ్రేలాడించెదరు. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు [షెబ్నా] ఊడదీయబడి తెగవేయబడి పడును. దానిమీదనున్న భారము నాశనమగును. ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.”​—యెషయా 22:​23-25.

20 ఈ వచనాల్లో మొదటి మేకు ఎల్యాకీము. అతడు తన పితరుడైన హిల్కియా కుటుంబానికి “మాన్యతగల సింహాసనము” అవుతాడు. షెబ్నా వలె, ఇతడు తన తండ్రి ఇంటికి లేక పేరుకు అవమానం తీసుకురాడు. ఎల్యాకీము ఇంట్లోని పాత్రలన్నిటికీ అంటే రాజు సేవలో ఉన్న ఇతరులకు నిరంతరం నిలిచే మద్దతుగా ఉంటాడు. (2 తిమోతి 2:​20, 21) దీనికి భిన్నంగా, రెండవ మేకు షెబ్నాను సూచిస్తుంది. అతడు సురక్షితంగా ఉన్నట్లు అనిపించినా, అతడు తొలగించబడతాడు. అతనిపై ఆధారపడేవారు పడిపోతారు.

21. షెబ్నాలా, ఆధునిక కాలాల్లో ఎవరు, ఎందుకు తొలగించబడ్డారు, వారి స్థానంలోకి ఎవరు వచ్చారు?

21 దేవుని ఆరాధిస్తున్నామని చెప్పుకునేవారిలో, సేవాధిక్యతలను స్వీకరించేవారు ఇతరులకు సేవ చేయడానికీ, యెహోవాకు స్తుతిని తీసుకురావడానికీ వాటిని ఉపయోగించాలని షెబ్నా అనుభవం మనకు గుర్తు చేస్తోంది. వారు తమను తాము సంపన్నులను చేసుకోవడానికో లేక వ్యక్తిగతమైన ప్రాధాన్యతను సంపాదించుకోవడానికో తమ స్థానాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఉదాహరణకు, క్రైస్తవమత సామ్రాజ్యం ఎంతో కాలంగా తనను తాను నియమిత గృహనిర్వాహకునిగా, యేసు క్రీస్తుకు భూప్రతినిధిగా ఉన్నతపర్చుకొంది. అయితే, షెబ్నా తన స్వంత మహిమ కోసం వెంపర్లాడుతూ తన తండ్రికి అగౌరవాన్ని తెచ్చినట్లుగానే, క్రైస్తవమత సామ్రాజ్య నాయకులు తమకోసం తాము సంపదలను, అధికారాన్ని సంపాదించుకోవడం ద్వారా సృష్టికర్తకు అగౌరవాన్ని తెచ్చారు. కాబట్టి, 1918 లో “దేవుని ఇంటియొద్ద ఆరంభమగు” తీర్పు సమయం వచ్చినప్పుడు, యెహోవా క్రైస్తవమత సామ్రాజ్యాన్ని ఆ స్థానం నుండి తొలగించివేశాడు. మరో గృహనిర్వాహకుడ్ని అంటే ‘నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడ్ని’ గుర్తించడం జరిగింది, అతడు యేసు భూసంబంధమైన ఇంటివారిపై నియమించబడ్డాడు. (1 పేతురు 4:17; లూకా 12:​42-44) ఈ సంయుక్త తరగతి, దావీదు ఇంటి రాజరికపు “తాళపుచెవి” బాధ్యతను చేపట్టడానికి తాను అర్హమైనదని నిరూపించుకొంది. విశ్వాసయోగ్యమైన “మేకు”లా అది, ఆధ్యాత్మిక పోషణ కోసం దానిపై ఆధారపడే, వివిధ బాధ్యతలుగల అభిషిక్త క్రైస్తవులైన వివిధ పాత్రలన్నిటికీ నమ్మదగిన మద్దతుగా తనను తాను నిరూపించుకొంది. “వేరే గొఱ్ఱెలు” కూడా ప్రాచీన యెరూషలేము ‘యిండ్లలోనున్న పరదేశిలా’ ఆధునిక-దిన ఎల్యాకీము అయిన ఈ “మేకు”పైనే ఆధారపడతారు.​—⁠యోహాను 10:​16; ద్వితీయోపదేశకాండము 5:14.

22. (ఎ) గృహనిర్వాహకునిగా షెబ్నా స్థానంలో మరొకరిని నియమించడం ఎందుకు సమయోచితమైనది? (బి) ఆధునిక కాలాల్లో, ‘నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుని’ నియామకం ఎందుకు సమయోచితమైనది?

22 సన్హెరీబు, అతని సైన్యాలు యెరూషలేము పైకి ముప్పు తెస్తున్నప్పుడు షెబ్నా స్థానంలోకి ఎల్యాకీము వచ్చాడు. అలాగే, సాతాను అతని సైన్యాలు “దేవుని ఇశ్రాయేలు”పై, వారి వేరేగొఱ్ఱెల సహవాసులపై చివరి దాడి చేయబోయేటప్పుడు ముగింపుకు వచ్చే అంత్యకాలములో సేవచేసేందుకు ‘నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడు’ నియమించబడ్డాడు. (గలతీయులు 6:​16) హిజ్కియా కాలంలోవలెనే, ఆ దాడి నీతి శత్రువుల నాశనంతో ముగుస్తుంది. “దిట్టమైనచోట మేకు” అయిన నమ్మకమైన గృహనిర్వాహకునిపై ఆధారపడేవారు, యూదాపై అష్షూరు దాడి చేసినప్పుడు నమ్మకమైన యెరూషలేము నివాసులు తప్పించుకొని జీవించినట్లు తప్పించుకొని జీవిస్తారు. కాబట్టి అప్రతిష్ఠపాలైన క్రైస్తవమత సామ్రాజ్యపు “మేకు”పై ఆధారపడకుండా ఉండడం ఎంత జ్ఞానయుక్తం!

23. షెబ్నాకు చివరికి ఏమవుతుంది, దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

23 షెబ్నాకు ఏమవుతుంది? యెషయా 22:18 లో అతడి గురించి వ్రాయబడిన ప్రవచనం ఎలా నెరవేరిందనే దాని గురించి మనకు ఎటువంటి నివేదికా లేదు. అతడు తనను తాను ఉన్నతపరచుకొని, అవమానానికి గురైనప్పుడు అతడు క్రైస్తవమత సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నాడు, కానీ అతడు తనకు ఇవ్వబడిన క్రమశిక్షణ నుండి పాఠం నేర్చుకొని ఉండవచ్చు. ఈ విషయంలో, అతడు క్రైస్తవమత సామ్రాజ్యానికి పూర్తి భిన్నంగా ఉన్నాడు. అష్షూరీయుడైన రబ్షాకే యెరూషలేము తనకు లోబడాలని అధికారంతో అడిగినప్పుడు, అతడిని కలవడానికి వెళ్తున్న ప్రతినిధివర్గానికి హిజ్కియా క్రొత్త గృహనిర్వాహకుడైన ఎల్యాకీము నాయకత్వం వహిస్తాడు. అయితే, రాజు దగ్గర పని చేసే శాస్త్రిగా షెబ్నా ఎల్యాకీముతో ఉన్నాడు. షెబ్నా ఇంకా రాజు సేవలో ఉన్నాడని స్పష్టమవుతోంది. (యెషయా 36:​2, 22) దేవుని సంస్థలో సేవాధిక్యతలను కోల్పోయేవారికి ఎంత చక్కని పాఠం! వారు బాధను మనస్సులో పెట్టుకునే బదులు, క్షోభపడే బదులు, యెహోవా ఏ స్థానంలో ఉండడానికి అనుమతిస్తే ఆ స్థానంలో ఆయన సేవ చేస్తూ కొనసాగడం ఎంతో జ్ఞానయుక్తం. (హెబ్రీయులు 12:6) అలా చేయడం ద్వారా వారు క్రైస్తవమత సామ్రాజ్యంపైకి రానున్న నాశనాన్ని తప్పించుకుంటారు. వారు దేవుని అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని నిరంతరం పొందుతారు.

[అధస్సూచీలు]

^ సా.శ. 66 లో, యెరూషలేమును చుట్టుముట్టిన రోమా సైన్యం వెనక్కి వెళ్లిపోయినప్పుడు అనేకమంది యూదులు ఉల్లసించారు.

^ మొదటి శతాబ్దపు చరిత్రకారుడు జోసీఫస్‌ చెబుతున్న దాని ప్రకారం, సా.శ. 70 లో, యెరూషలేములో కరవు ఎంత తీవ్రంగా ఉందంటే ప్రజలు తోలు, పచ్చగడ్డి, ఎండుగడ్డి తిన్నారు. ఒక తల్లి తన స్వంత కుమారుడ్ని వేయించుకుని తిన్న ఒక ఉదంతం గురించి నివేదించబడుతుంది.

^ ప్రత్యామ్నాయంగా, ‘యూదా ముసుకు’ అనేది నగరాన్ని కాపాడే మరిదేన్నైనా అంటే ఆయుధాలు నిలువవుంచే, సైనికులు నివసించే కోటల వంటివాటిని సూచించవచ్చు.

[అధ్యయన ప్రశ్నలు]

[231 వ పేజీలోని చిత్రం]

సిద్కియా పారిపోతున్నప్పుడు ఆయన పట్టబడి, అంధునిగా చేయబడతాడు

[233 వ పేజీలోని చిత్రం]

యెరూషలేములో చిక్కుకుపోయిన యూదులకు పరిస్థితులు ఆశాజనకంగా లేవు

[239 వ పేజీలోని చిత్రం]

హిజ్కియాచే ఎల్యాకీము “దిట్టమైనచోట మేకు”గా చేయబడ్డాడు

[241 వ పేజీలోని చిత్రం]

షెబ్నా వలె, క్రైస్తవమత సామ్రాజ్య నాయకులు అనేకులు సంపదలను సమకూర్చుకోవడం ద్వారా సృష్టికర్తకు అవమానం తెచ్చారు

[242 వ పేజీలోని చిత్రాలు]

ఆధునిక కాలాల్లో యేసు ఇంటివారిపై ఒక నమ్మకమైన గృహనిర్వాహకుడు నియమించబడ్డాడు