కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అష్షూరీయునికి భయపడకండి

అష్షూరీయునికి భయపడకండి

పన్నెండవ అధ్యాయం

అష్షూరీయునికి భయపడకండి

యెషయా 10:​5-34

1, 2. (ఎ) అష్షూరీయులకు ప్రకటించమని తనకు ఇవ్వబడిన నియామకాన్ని అంగీకరించేందుకు యోనా విముఖంగా ఉండడానికి, మానవ దృక్కోణం నుండి చూస్తే, తగిన కారణమున్నట్లు ఎందుకు అనిపిస్తుంది? (బి) యోనా సందేశానికి నీనెవె నివాసులు ఎలా ప్రతిస్పందించారు?

 అష్షూరు సామ్రాజ్యానికి రాజధానియైన నీనెవెలోకి, సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో, అమిత్తయి కుమారుడు, హీబ్రూ ప్రవక్త అయిన యోనా సాహసించి ప్రవేశించాడు. ఆయన బరువైన ఒక సందేశాన్ని అందజేయవలసి ఉంది. యెహోవా ఆయనకిలా చెప్పాడు: “నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.”​—⁠యోనా 1:2, 3.

2 యోనా తాను మొదట తన నియామకాన్ని అందుకున్నప్పుడు, వ్యతిరేక దిశలో తర్షీషు వైపుకు పారిపోయాడు. మానవ దృక్కోణం నుండి చూస్తే యోనా అలా విముఖంగా ఉండడానికి తగిన కారణమే ఉంది. అష్షూరీయులు క్రూరమైన ప్రజలు. ఒక అష్షూరు సామ్రాట్టు తన శత్రువులతో ఎలా వ్యవహరించాడో గమనించండి: “నేను అధికారుల కాళ్లు చేతులు నరికేశాను . . . వారిలో చాలామంది బంధీలను నేను కాల్చేశాను, చాలామందిని నేను సజీవంగా బంధీలుగా తీసుకువెళ్లాను. కొంతమంది చేతులు, వేళ్లు నరికేశాను, మరితరుల ముక్కులు కోసేశాను.” అయినప్పటికీ, చివరికి యోనా యెహోవా సందేశాన్ని ప్రకటించినప్పుడు నీనెవె నివాసులు తమ పాపాలను బట్టి పశ్చాత్తాపపడడంతో యెహోవా ఆ కాలంలో ఆ నగరాన్ని నాశనం చేయకుండా విడిచిపెట్టాడు.​—⁠యోనా 3:3-10; మత్తయి 12:41.

యెహోవా “దండము” తీసుకుంటాడు

3. యెహోవా ప్రవక్తలు చేసిన హెచ్చరికలకు ప్రతిస్పందించడంలో నీనెవె వాసులకు, ఇశ్రాయేలీయులకు ఏమి తేడా ఉంది?

3 యోనా ఇశ్రాయేలీయులకు కూడా ప్రకటించాడు, మరి వారు ప్రతిస్పందిస్తారా? (2 రాజులు 14:​25) లేదు. వారు సత్యారాధన నుండి వైదొలగుతారు. వాస్తవానికి, వారు ‘ఆకాశసమూహమునకు నమస్కరించి బయలు దేవతను పూజించేంత’ వరకూ వెళ్తారు. అంతకంటే ఎక్కువగా, “తమ కుమారులను కుమార్తెలను అగ్ని గుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టించిరి.” (2 రాజులు 17:​16, 17) ఇశ్రాయేలువారిని హెచ్చరించడానికి యెహోవా ప్రవక్తలను పంపించినప్పుడు నీనెవె వాసుల్లా ఇశ్రాయేలు ప్రతిస్పందించదు. కాబట్టి యెహోవా మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి నిశ్చయించుకుంటాడు.

4, 5. (ఎ) ‘అష్షూరీయుడు’ అనే పదం దేన్ని సూచిస్తుంది, యెహోవా అతడిని ఒక “దండము”గా ఎలా ఉపయోగించుకుంటాడు? (బి) షోమ్రోను ఎప్పుడు పడిపోతుంది?

4 యోనా నీనెవెను సందర్శించిన కొంతకాలం తర్వాతి వరకూ అష్షూరీయుల దురాక్రమణ తగ్గుతుంది. * అయితే, సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దారంభంలో, అష్షూరు మళ్లీ తనను తాను సైనికశక్తిగా పునరుద్ధరించుకోవడంతో యెహోవా దాన్ని ఎంతో ఆశ్చర్యకరమైన విధంగా ఉపయోగించుకుంటాడు. ప్రవక్తయైన యెషయా ఇశ్రాయేలు ఉత్తర రాజ్యానికి యెహోవా హెచ్చరికను ఇలా తెలియజేస్తున్నాడు: “అష్షూరీయునికి శ్రమ అతడు నా కోపమునకు సాధనమైన దండము. నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత అతడి చేతిలో ఉన్నది. భక్తిహీనులగు జనములమీదికి నేను అతడిని పంపెదను, దోపుడుసొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి అతడికాజ్ఞాపించెదను.”​—యెషయా 10:​5, 6, NW.

5 ఇశ్రాయేలీయులకు ఎంత అవమానం! వారిని శిక్షించడానికి దేవుడు ఒక అన్య జనాంగాన్ని, అంటే “అష్షూరీయుని” “దండము”గా ఉపయోగిస్తున్నాడు. సా.శ.పూ. 742 లో, ఇశ్రాయేలు మతభ్రష్ట రాజ్యానికి రాజధానియైన షోమ్రోనుపై అష్షూరు రాజైన షల్మనసెర్‌ V దాడి చేస్తాడు. షోమ్రోను దాదాపు 300 అడుగుల ఎత్తున కొండమీద ఉన్నందుకు దాదాపు మూడు సంవత్సరాలపాటు ఏ శత్రువులూ దాని దరిదాపులకు కూడా వెళ్ళేవారు కాదు. కానీ ఏ మానవ తంత్రమూ దేవుని సంకల్పాన్ని ఆపలేదు. సా.శ.పూ. 740 లో షోమ్రోను పడిపోయి, అష్షూరీయుల పాదాల క్రింద నలిగిపోతుంది.​—⁠2 రాజులు 18:10.

6. అష్షూరీయుని గురించి యెహోవాకు ఏ తలంపు ఉందో దాన్ని మించిపోవాలని అతడెలా ప్రయత్నిస్తాడు?

6 యెహోవా తన ప్రజలకు గుణపాఠం నేర్పించడానికి అష్షూరీయులను ఉపయోగించుకున్నప్పటికీ, అష్షూరీయులు మాత్రం యెహోవాను గుర్తించరు. అందుకే ఆయనింకా ఇలా చెబుతున్నాడు: “అయితే అతడు [అష్షూరీయుడు] ఆలాగనుకొనడు అది అతని ఆలోచనకాదు; నాశనము చేయవలెననియు చాల జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన.” (యెషయా 10:7) అష్షూరీయుడు దైవిక హస్తాల్లో ఒక ఉపకరణంగా ఉండాలని యెహోవా ఉద్దేశిస్తాడు. కానీ ఆ అష్షూరీయుడు మరి దేనిగానో ఉండాలని ఇష్టపడతాడు. మరింత ఘనమైన దాని కోసం అంటే అప్పట్లో తెలిసిన ప్రపంచాన్ని జయించడం కోసం పథకాలు వేయమని అతని హృదయం అతడిని పురికొల్పుతుంది.

7. (ఎ) “నా యధిపతులందరు మహారాజులు కారా?” అనే పదబంధాన్ని వివరించండి. (బి) నేడు యెహోవాను విడిచిపెట్టే వారు దేన్ని గుర్తు చేసుకోవాలి?

7 అష్షూరీయుడు జయించిన అనేక ఇశ్రాయేలేతర నగరాలను మునుపు రాజులు పరిపాలించారు. ఈ మాజీ రాజులు ఇప్పుడు అష్షూరు రాజు క్రింద సామంత రాజులుగా ఉండాలి, కాబట్టి అతడు నిజంగానే ఇలా గొప్పలు చెప్పుకోగలడు: “నా యధిపతులందరు మహారాజులు కారా?” (యెషయా 10:8) అన్యజనాంగాలకు చెందిన ప్రముఖ నగరాల్లోని అబద్ధ దేవుళ్లు తమ ఆరాధకులను నాశనం నుండి కాపాడలేకపోయారు. షోమ్రోను నివాసులు ఆరాధించిన బయలు, మోలెకు, బంగారు దూడలు వంటి దేవుళ్లు ఆ నగరాన్ని కాపాడలేరు. షోమ్రోను యెహోవాను విడిచిపెట్టినందున, యెహోవా వచ్చి జోక్యం చేసుకోవాలని ఆశించే హక్కు దానికి లేదు. నేడు యెహోవాను విడిచిపెట్టేవారెవరైనా సరే షోమ్రోనుకు పట్టిన గతిని గుర్తు చేసుకోవాలి! అష్షూరీయుడు తాను జయించిన షోమ్రోను, మరితర నగరాల గురించి ఇలా గొప్పలు చెప్పుకోగలడు: “కల్నో కర్కెమీషువలె నుండలేదా? హమాతు అర్పాదువలె నుండలేదా? షోమ్రోను దమస్కువలె నుండలేదా?” (యెషయా 10:9) అవన్నీ అష్షూరీయునికి ఒకేలా అంటే తాను తీసుకువెళ్లగల దోపుడు సొమ్ములా ఉన్నాయి.

8, 9. అష్షూరీయుడు యెరూషలేమును జయించాలని సంకల్పించడం ఎందుకు హద్దులు మీరినట్లవుతుంది?

8 అయితే అష్షూరీయుడు గొప్పలు చెప్పుకోవడంలో హద్దులు మీరిపోతున్నాడు. అతడిలా అంటున్నాడు: “విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహములకంటె ఎక్కువైనవి గదా? షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా?” (యెషయా 10:​10, 11) అప్పటికే అష్షూరీయుడు జయించిన రాజ్యాల్లో, యెరూషలేములోనూ చివరికి షోమ్రోనులోనూ ఉన్న విగ్రహాల కన్నా ఎక్కువ విగ్రహాలున్నాయి. అతడిలా తర్కించుకుంటున్నాడు, ‘నేను షోమ్రోనుకు చేసిన దాన్ని యెరూషలేముకు చేయకుండా నన్నేది ఆపగలదు?’

9 ఎంత అహంకారం! అతడు యెరూషలేమును జయించడానికి యెహోవా అనుమతించడు. నిజమే, సత్యారాధనకు మద్దతునిచ్చిన మచ్చలేని చరిత్రేమీ యూదాకు లేదు. (2 రాజులు 16:7-9; 2 దినవృత్తాంతములు 28:​24) యూదా తన అవిశ్వాస్యత వల్ల అష్షూరు దాడి సమయంలో ఎంతో బాధింపబడుతుందని యెహోవా హెచ్చరించాడు. అయినా యెరూషలేము తప్పించుకుని నిలుస్తుంది. (యెషయా 1:​7, 8) అష్షూరు దాడి చేసినప్పుడు యెరూషలేములో హిజ్కియా రాజుగా ఉన్నాడు. హిజ్కియా తన తండ్రి ఆహాజు వంటివాడు కాదు. అంతెందుకు, ఆయన తన పరిపాలనలోని మొదటి నెలలోనే మందిరపు తలుపులను మళ్లీ తెరిచి, సత్యారాధనను పునఃస్థాపిస్తాడు.​—⁠2 దినవృత్తాంతములు 29:3-5.

10. అష్షూరీయుని గురించి యెహోవా ఏమి వాగ్దానం చేస్తున్నాడు?

10 కాబట్టి యెరూషలేముపై దాడి చేయాలన్న అష్షూరు సంకల్పానికి యెహోవా ఆమోదం లేదు. ఆ గర్విష్టి ప్రపంచ శక్తిని శిక్షిస్తానని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు: “సీయోను కొండమీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరురాజుయొక్క హృదయగర్వమువలని ఫలమునుబట్టియు అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు అతని శిక్షింతును.”​—యెషయా 10:12.

యూదా యెరూషలేములకు వెళ్లడం

11. యెరూషలేము సులభంగా దొరుకుతుందని అష్షూరీయుడు ఎందుకనుకుంటాడు?

11 సా.శ.పూ. 740 లో ఉత్తర రాజ్యం పడిపోయిన ఎనిమిది సంవత్సరాలకు, అష్షూరును పరిపాలిస్తున్న సన్హెరీబు అనే మరో క్రొత్త రాజు యెరూషలేము మీదికి వెళ్తాడు. సన్హెరీబు యొక్క అహంకారపూరిత పథకాన్ని యెషయా పద్యరూపంలో ఇలా వర్ణిస్తున్నాడు: “నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని, మహా బలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని. పక్షిగూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనునప్పుడు రెక్కను ఆడించునదియైనను నోరు తెరచునదియైనను కిచకిచలాడునదియైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నా[ను].” (యెషయా 10:​13, 14) ఇతర నగరాలు పడిపోయాయి, షోమ్రోను ఇక లేదు, కాబట్టి యెరూషలేము సులభంగా దొరుకుతుందని సన్హెరీబు తర్కించుకుంటాడు! ఆ నగరం అనాసక్తంగా కొంతమేరకు పోరాడుతుండవచ్చు, కానీ కిచకిచ శబ్దం కూడా వినిపించదు, దాని నివాసులు త్వరగా లొంగిపోతారు, వారి నిధులు విడువబడిన పక్షిగూటి నుండి గుడ్లను ఏరుకున్నట్లు తీసివేయబడతాయి.

12. అష్షూరీయుడు ప్రగల్భాలు పలుకుతున్న విషయాలను ఎలా దృష్టించడం సరైనదని యెహోవా చూపిస్తున్నాడు?

12 అయితే సన్హెరీబు ఒక విషయాన్ని మరచిపోతున్నాడు. మతభ్రష్ట షోమ్రోనుకు ఏ శిక్ష అయితే లభించిందో దానికి అది అర్హురాలే. అయితే, రాజైన హిజ్కియా క్రింద యెరూషలేము మరోసారి స్వచ్చారాధనకు స్థావరమయ్యింది. ఎవరైనా యెరూషలేమును తాకాలనుకుంటే యెహోవానే ఎదుర్కోవలసి ఉంటుంది! ఆగ్రహంతో యెషయా ఇలా అడుగుతున్నాడు: “గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువానిమీద పొగడుకొనునా? కోల తన్నెత్తువానిని ఆడించినట్లును దండము కఱ్ఱకానివానిని ఎత్తినట్లును ఉండును గదా?” (యెషయా 10:​15) కట్టెలు కొట్టేవాడు గానీ వడ్రంగి గానీ లేక గొఱ్ఱెలకాపరి గానీ గొడ్డలిని, రంపమును, కోలను, లేక దండమును ఎలా ఉపయోగిస్తాడో అలా అష్షూరు సామ్రాజ్యం యెహోవా చేతిలో కేవలం ఒక ఉపకరణం మాత్రమే. కాబట్టి దండము తనను ఉపయోగించే వానిపై తనను తాను హెచ్చించుకోవడానికి ఎంత ధైర్యం!

13. (ఎ) “బలిసిన” వారు, (బి) ‘బలురక్కసిచెట్లు, గచ్చపొదలు,’ (సి) ‘అతని అడవికి మహిమ’ అంటే ఎవరు, వారికి ఏమి జరుగుతుంది?

13 అష్షూరీయునికి ఏమవుతుంది? ‘ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరీయునిమీదికి క్షయరోగము పంపును, అతనిక్రింద అగ్నిజ్వాలలుగల కొరవికట్టె రాజును. ఇశ్రాయేలుయొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును; అది అష్షూరుయొక్క బలురక్కసిచెట్లకును గచ్చపొదలకును అంటుకొని ఒక్కదినమున వాటిని మ్రింగివేయును. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతోకూడ అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనముచేయును. అతని అడవిచెట్ల శేషము కొంచెమగును బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును.’ (యెషయా 10:​16-19) అవును యెహోవా ఆ అష్షూరు “దండము”ను నరికి కురచచేస్తాడు! అష్షూరీయుల సైన్యంలోని “బలిసిన” వారికి అంటే అతని బలిష్ఠులైన సైనికులకు “క్షయరోగము” సోకుతుంది. వాళ్ళిక బలిష్ఠులుగా కనిపించరు! అనేకానేక కలుపుమొక్కలు, ముళ్లపొదలలా అతని కాల్బలము ఇశ్రాయేలు వెలుగైన యెహోవా దేవునిచే దహించబడుతుంది. ‘అతని అడవికి మహిమ’ అయిన సైనికాధికారులు నాశనమవుతారు. యెహోవా అష్షూరీయుని అంతమొందించిన తర్వాత, ఎంత కొద్దిమంది అధికారులు మాత్రమే మిగిలి ఉంటారంటే వారిని బాలుడు సహితం వేళ్లమీద లెక్కపెట్టగలుగుతాడు.​—⁠యెషయా 10:33, 34 కూడా చూడండి.

14. యూదా నేలపై, సా.శ.పూ. 732 నాటికి అష్షూరీయుని దండయాత్రను వివరించండి.

14 అయినప్పటికీ, సా.శ.పూ. 732 లో యెరూషలేములో నివసిస్తున్న యూదులకు, అష్షూరీయుడు ఓడించబడతాడంటే నమ్మడం కష్టమవుతుంది. విస్తృతమైన అష్షూరు సైన్యం నిర్దయగా ముందుకు సాగుతోంది. యూదాలో పట్టబడిన నగరాల పట్టికను వినండి: “ఆయాతు . . . మిగ్రోను . . . మిక్మషు . . . రామా . . . గెబ . . . సౌలుగిబ్యా . . . గల్లీము . . . లాయిషా . . . అనాతోతు . . . మద్మేనా . . . గిబా . . . నోబు.” (యెషయా 10:​28-32) * దాడి చేస్తున్నవారు చివరికి యెరూషలేముకు కేవలం 30 మైళ్ల దూరంలో ఉన్న లాకీషును చేరుకుంటారు. త్వరలోనే అష్షూరీయుని విస్తారమైన సైన్యం నగరానికి ముప్పు తెస్తుంది. “ఈ దినమే సీయోను కుమారి పర్వతమను యెరూషలేము కొండమీద అతడు తన చెయ్యి ఆడించును.” (యెషయా 10:​32బి, NW) అష్షూరీయుడ్ని ఏది ఆపగలదు?

15, 16. (ఎ) హిజ్కియా రాజుకు బలమైన విశ్వాసం ఎందుకవసరం? (బి) యెహోవా తనకు సహాయం చేస్తాడని హిజ్కియా విశ్వసించడానికి ఏ ఆధారముంది?

15 హిజ్కియా రాజు తన నగరంలోని రాజభవనంలో కలవరపడుతుంటాడు. ఆయన తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుంటాడు. (యెషయా 37:1) యూదా పక్షాన యెహోవా యొద్ద విచారణ చేయమని ఆయన ప్రవక్తయైన యెషయా వద్దకు మనుష్యులను పంపిస్తాడు. వారు త్వరలోనే యెహోవా సమాధానంతో తిరిగి వస్తారు: “భయపడవద్దు. . . . నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.” (యెషయా 37:​6, 35) అప్పటికీ, అష్షూరీయులు ఇంకా బెదిరిస్తూ, ఎంతో ధైర్యంగా ఉంటారు.

16 ఈ సంక్షోభంలో రాజైన హిజ్కియాను బలపర్చేది విశ్వాసమే. విశ్వాసం, ‘అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువైయున్నది.’ (హెబ్రీయులు 11:1) స్పష్టంగా కనిపిస్తున్న దాన్ని మించి చూడడం అందులో ఇమిడివుంటుంది. అయితే విశ్వాసం జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. ఎంతో ముందుగానే యెహోవా ఈ ఓదార్పుకరమైన మాటలను పలికాడని బహుశా హిజ్కియాకు జ్ఞాపకం ఉండే ఉండవచ్చు: “సీయోనులో నివసించుచున్న నా జనులారా, . . . వానికి [అష్షూరీయునికి] భయపడకుము. ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును వారిని నాశనముచేయుటకు నా ఉగ్రత తిరుగును. ఓరేబు బండయొద్ద మిద్యానును హతముచేసినట్లు సైన్యములకధిపతియగు యెహోవా తన కొరడాలను వానిమీద ఆడించును. ఆయన దండము సముద్రమువరకు వచ్చును, ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాని నెత్తును.” (యెషయా 10:24-26) * అవును, దేవుని ప్రజలు మునుపు కూడా కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఎర్రసముద్రం దగ్గరి ఐగుప్తు సైన్యంతో పోలిస్తే హిజ్కియా పూర్వీకులు చాలా దుర్భలులుగానే అనిపించారు. శతాబ్దాల క్రితం, మిద్యానీయులూ అమాలేకీయులూ ఇశ్రాయేలుపై దాడి చేసినప్పుడు గిద్యోను వద్ద సైన్యం చాలాకొద్ది సంఖ్యలోనే ఉంది. అయినప్పటికీ, ఆ రెండు సందర్భాల్లోనూ యెహోవా తన ప్రజలను విమోచించాడు.​—⁠నిర్గమకాండము 14:7-9, 13, 28; న్యాయాధిపతులు 6:​33; 7:​21, 22.

17. అష్షూరు కాడి ఎలా “విరుగగొట్టబడును,” ఎందుకు?

17 యెహోవా ఆ పూర్వపు సందర్భాల్లో చేసినట్లుగా మళ్ళీ చేస్తాడా? చేస్తాడు. యెహోవా ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “ఆ దినమున నీ భుజముమీదనుండి అతని బరువు తీసివేయబడును నీ మెడమీదనుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున [“తైలము వలన,” NW] ఆ కాడి విరుగగొట్టబడును.” (యెషయా 10:​27) దేవుని నిబంధన ప్రజల భుజముమీది నుండి మెడమీది నుండి అష్షూరు కాడి తీసివేయబడుతుంది. వాస్తవానికి, కాడి “విరుగగొట్టబడును”​—⁠అది నిజంగానే విరుగగొట్టబడింది! ఒక్కరాత్రిలో, యెహోవా దూత యెరూషలేమును చుట్టుముట్టిన 1,85,000 మంది అష్షూరీయులను హతమారుస్తాడు. ముట్టడి తీసివేయబడుతుంది, అష్షూరీయులు శాశ్వతంగా యూదా దేశాన్ని విడిచివెళ్లిపోతారు. (2 రాజులు 19:​35, 36) ఎందుకు? “తైలము వలన.” హిజ్కియాను దావీదు వంశంలో రాజుగా అభిషేకించడానికి ఉపయోగించబడిన తైలమును ఇది సూచిస్తుండవచ్చు. అలా, యెహోవా, “నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును” అని తాను చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు.​—⁠2 రాజులు 19:34.

18. (ఎ) యెషయా ప్రవచనానికి ఒకటి కంటే ఎక్కువ నెరవేర్పులున్నాయా? వివరించండి. (బి) నేడు ఏ సంస్థ ప్రాచీన షోమ్రోనులా ఉంది?

18 ఈ అధ్యాయంలో చర్చించబడిన యెషయా వృత్తాంతానికి, 2,700 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం యూదాలో జరిగిన సంఘటనలతో సంబంధముంది. కానీ ఆ సంఘటనలకు నేడు అత్యధికమైన ప్రాముఖ్యత ఉంది. (రోమీయులు 15:4) అంటే, ఈ ఉత్తేజపూరితమైన వృత్తాంతంలోని ప్రధాన పాత్రధారులైన షోమ్రోను యెరూషలేముల నివాసులతోపాటు అష్షూరీయులకు ఆధునిక-దిన ప్రతిరూపాలున్నాయనా దాని భావం? అవును, ఉన్నాయి. విగ్రహారాధకురాలైన షోమ్రోనులా, క్రైస్తవమత సామ్రాజ్యం యెహోవాను ఆరాధిస్తున్నానని చెప్పుకుంటుంది గానీ అది పూర్తిగా భ్రష్టురాలు. ఏన్‌ ఎస్సే ఆన్‌ ది డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ క్రిస్టియన్‌ డాక్ట్రిన్‌ అనే తన పుస్తకంలో, రోమన్‌ క్యాథలిక్‌ కార్డినల్‌ జాన్‌ హెన్రీ న్యూమాన్‌, శతాబ్దాలుగా క్రైస్తవమత సామ్రాజ్యం ఉపయోగించిన ధూపం, కొవ్వొత్తులు, పవిత్ర జలం, ప్రీస్టుల వస్త్రాలు, విగ్రహాలు “అన్నీ అన్యమత మూలం నుండి వచ్చినవే” అని అంగీకరిస్తున్నాడు. యెహోవా షోమ్రోను విగ్రహారాధనను బట్టి ఎలాగైతే సంతోషించలేదో అలాగే క్రైస్తవమత సామ్రాజ్యపు అన్యమత ఆరాధనను బట్టి కూడా ఆయన ఏమాత్రం సంతోషించడం లేదు.

19. క్రైస్తవమత సామ్రాజ్యం దేని గురించి హెచ్చరించబడింది, ఎవరిచేత హెచ్చరించబడింది?

19 యెహోవాసాక్షులు యెహోవా అసమ్మతి గురించి క్రైస్తవమత సామ్రాజ్యాన్ని సంవత్సరాలపాటు హెచ్చరించారు. ఉదాహరణకు, 1955 లో, “క్రైస్తవమత సామ్రాజ్యమా లేక క్రైస్తవత్వమా​—⁠ఏది ‘లోకానికి వెలుగు’?” అనే బహిరంగ ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా ఇవ్వబడింది. క్రైస్తవమత సామ్రాజ్యం నిజక్రైస్తవ సిద్ధాంతం నుండి, ఆచారం నుండి వైదొలగిపోయిన వైనం గురించి ఆ ప్రసంగం సుస్పష్టంగా వివరించింది. ఆ తర్వాత, ఈ శక్తిమంతమైన ప్రసంగ ప్రతులు అనేక దేశాల్లోని మతనాయకులకు పోస్టు ద్వారా పంపించడం జరిగింది. క్రైస్తవమత సామ్రాజ్యం ఒక సంస్థగా హెచ్చరికను వినడంలో విఫలమైంది. అది యెహోవా తనను “దండము”తో శిక్షించకుండా తప్పని పరిస్థితి ఏర్పడేలా చేసుకుంది.

20. (ఎ) ఏది ఆధునిక-దిన అష్షూరీయునిగా పనిచేస్తుంది, అది ఒక దండముగా ఎలా ఉపయోగించుకోబడుతుంది? (బి) క్రైస్తవమత సామ్రాజ్యం ఎంతమేరకు దండించబడుతుంది?

20 తిరుగుబాటు చేసే క్రైస్తవమత సామ్రాజ్యానికి క్రమశిక్షణ నిచ్చేందుకు యెహోవా ఎవరిని ఉపయోగించుకుంటాడు? మనం దీనికి, ప్రకటన గ్రంథంలోని 17 వ అధ్యాయంలో సమాధానాన్ని కనుగొంటాము. అక్కడ మనకు, క్రైస్తవమత సామ్రాజ్యంతో సహా ప్రపంచ అబద్ధ మతాలన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తున్న “మహా బబులోను” అయిన వేశ్య పరిచయం చేయబడుతుంది. ఆ వేశ్య ఏడు తలలు, పది కొమ్ములుగల ఎఱ్ఱని క్రూరమృగం మీద కూర్చొని ఉంటుంది. (ప్రకటన 17:​3, 5, 7-12) ఆ క్రూరమృగం ఐక్యరాజ్య సమితికి ప్రాతినిధ్యం వహిస్తోంది. * ప్రాచీన అష్షూరీయుడు షోమ్రోనును నాశనం చేసినట్లుగానే, ఎఱ్ఱని క్రూరమృగం “ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివే[యును].” (ప్రకటన 17:​16) అలా ఆధునిక-దిన అష్షూరీయుడు (ఐక్యరాజ్య సమితితో సహవసిస్తున్న దేశాలు) క్రైస్తవమత సామ్రాజ్యాన్ని చావు దెబ్బకొట్టి, దానిని ఉనికిలో లేకుండా చేస్తాడు.

21, 22. దేవుని ప్రజలపై దాడి చేసేందుకు క్రూరమృగాన్ని ఎవరు పురికొల్పుతారు?

21 యెహోవా నమ్మకమైన సాక్షులు మహా బబులోనుతో పాటు నశించిపోతారా? లేదు. దేవుడు వారిని బట్టి అసంతృప్తి చెందడం లేదు. స్వచ్ఛారాధన నిలుస్తుంది. అయితే, మహా బబులోనును నాశనం చేసే క్రూర మృగం యెహోవా ప్రజల వైపు కూడా అత్యాశతో చూస్తుంది. అలా చేయడంలో, క్రూరమృగం దేవుని తలంపును కాదుగాని మరొకరి తలంపును నెరవేరుస్తుంది. ఎవరి తలంపును? అపవాదియైన సాతాను తలంపును.

22 సాతాను అహంకారపూరిత పథకాన్ని యెహోవా ఇలా బయలుపరుస్తాడు: “ఆ కాలమందు నీ [సాతాను] మనస్సులో అభిప్రాయములు పుట్టును, నీవు దురాలోచనచేసి ఇట్లనుకొందువు​—⁠నేను ప్రాకారములులేని గ్రామములుగల దేశముమీదికి పోయెదను . . . నిమ్మళముగాను నిర్భయముగాను నివసించువారి మీదికి పోయెదను. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొం[దును].” (యెహెజ్కేలు 38:​10-12) సాతాను ఇలా తర్కించుకుంటాడు, ‘అవును, యెహోవా సాక్షులపై దాడి చేసేలా దేశాలను ఎందుకు పురికొల్పకూడదు? యెహోవాసాక్షులు రాజకీయ పలుకుబడి లేకుండా ఏ కాపుదల లేకుండా బలహీనంగా ఉన్నారు. వారు ఎదిరించలేరు. భద్రతలేని పక్షిగూటి నుండి గ్రుడ్లను ఏరుకున్నట్లు వారిని ఏరుకోవడం ఎంత సులభం!’

23. ఆధునిక-దిన అష్షూరీయుడు తాను క్రైస్తవమత సామ్రాజ్యానికి ఏదైతే చేశాడో దాన్ని దేవుని ప్రజలకు ఎందుకు చేయలేడు?

23 కానీ దేశాల్లారా, జాగ్రత్త! యెహోవా ప్రజలను ముట్టుకుంటే, మీరు దేవుడ్నే ఎదుర్కోవలసి ఉంటుందని తెలుసుకోండి! యెహోవా తన ప్రజలను ప్రేమిస్తున్నాడు, ఆయన హిజ్కియా కాలంలో యెరూషలేము కోసం పోరాడాడన్నది ఎంత నిశ్చయమో నేడు తన ప్రజల కోసం పోరాడుతాడన్నది కూడా అంతే నిశ్చయము. ఆధునిక-దిన అష్షూరీయుడు యెహోవా సేవకులను నిర్మూలించడానికి ప్రయత్నించినప్పుడు, అతడు నిజంగా యెహోవా దేవునితోనూ, గొఱ్ఱెపిల్లయైన యేసు క్రీస్తుతోనూ యుద్ధం చేస్తున్నట్లే. ఆ యుద్ధంలో అష్షూరీయుడు ఎంతమాత్రం విజయం సాధించలేడు. “గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందున . . . ఆయన ఆ రాజులను జయించును” అని బైబిలు చెబుతుంది. (ప్రకటన 17:14; మత్తయి 25:40 పోల్చండి.) ప్రాచీన కాలానికి చెందిన అష్షూరీయునిలా, ఎఱ్ఱని క్రూరమృగం ‘నాశనమునకు పోతుంది.’ దాని గురించి ఇక భయపడవలసిన అవసరం ఉండదు.​—⁠ప్రకటన 17:11.

24. (ఎ) భవిష్యత్తు కోసం సిద్ధపడడానికి నిజక్రైస్తవులు ఏమి చేయడానికి నిశ్చయించుకుంటారు? (బి) యెషయా ఏ విధంగా మరింత ముందుకు చూస్తాడు? (155 పేజీలోగల బాక్సును చూడండి.)

24 నిజ క్రైస్తవులు యెహోవాతో తమ సంబంధాన్ని పటిష్ఠంగా ఉంచుకుని, ఆయన చిత్తాన్ని చేయడానికి తమ జీవితంలో ప్రధమస్థానం ఇచ్చినప్పుడు వారు భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. (మత్తయి 6:​33) అప్పుడు వారు “ఏ అపాయమునకు భయపడ” వలసిన అవసరం ఉండదు. (కీర్తన 23:4) దేవుని బలమైన హస్తం తమను శిక్షించడానికి కాదు గాని ఆయన శత్రువుల నుండి తమను కాపాడడానికి పైకెత్తబడి ఉండడాన్ని వారు తమ విశ్వాస నేత్రాలతో చూస్తారు. వారి చెవులు, “భయపడకుము” అనే ధైర్యాన్నిచ్చే మాటలను వింటాయి.​—⁠యెషయా 10:24.

[అధస్సూచీలు]

^ స్పష్టత కోసం యెషయా 10:20-27 వచనాల కన్నా ముందు యెషయా 10:28-32 వచనాలను చర్చించడం జరిగింది.

^ యెషయా 10:20-23 వచనాల చర్చ కోసం 155 వ పేజీలో ఉన్న “యెషయా మరింత ముందుకు చూస్తాడు” అన్న భాగం చూడండి.

^ వేశ్య మరియు ఎఱ్ఱని క్రూరమృగం యొక్క గుర్తింపులను గురించిన అదనపు సమాచారాన్ని, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన ప్రకటన​—⁠దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకంలోని 34, 35 అధ్యాయాలలో కనుగొనవచ్చు.

[అధ్యయన ప్రశ్నలు]

[155, 156 వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

యెషయా మరింత ముందుకు చూస్తాడు

యెషయా 10:​20-23

యెషయా గ్రంథం 10 వ అధ్యాయం ప్రాథమికంగా, ఇశ్రాయేలుకు తీర్పు తీర్చడానికి యెహోవా అష్షూరు దురాక్రమణను ఎలా ఉపయోగిస్తాడనే దానిమీద, యెరూషలేమును కాపాడతానన్న ఆయన వాగ్దానంమీద అవధానాన్ని నిలుపుతుంది. 20 నుండి 23 వరకున్న వచనాలు ఈ ప్రవచనం మధ్య భాగంలో ఉన్నాయి గనుక, అవి అదే కాలంలో సాధారణ నెరవేర్పును కలిగివున్నట్లు దృష్టించవచ్చు. (యెషయా 1:7-9 పోల్చండి.) అయితే ఈ వచనాలు, యెరూషలేము కూడా తన నివాసుల పాపాలకు జవాబు చెప్పవలసి వచ్చే తర్వాతి కాలాలకు ప్రాముఖ్యంగా వర్తిస్తాయని పదాల పొందిక సూచిస్తోంది.

ఆహాజు రాజు సహాయం కోసం అష్షూరువైపు తిరగడం ద్వారా భద్రతను పొందడానికి ప్రయత్నిస్తాడు. ఇశ్రాయేలు ఇంటివారిలో తప్పించుకున్న వారు భవిష్యత్తులో మళ్లీ ఎన్నడూ అలాంటి మూర్ఖపు చర్యను గైకొనరని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. వారు “ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు” అని యెషయా 10:20 చెబుతోంది. అయితే, కేవలం కొద్దిమంది మాత్రమే అలా చేస్తారనీ, అంటే “శేషము తిరుగును [“ఒక శేషము మాత్రమే తిరిగివచ్చును,” NW]” అని 21 వ వచనం చూపిస్తోంది. ఇది మనకు యెషయా కుమారుడైన షెయార్యాషూబును జ్ఞప్తికి తెస్తోంది, అతడు ఇశ్రాయేలులో ఒక సూచనగా ఉన్నాడు, అతని పేరుకు “శేషము మాత్రమే తిరిగి వచ్చును” అని భావం. (యెషయా 7:3) నిర్ణయించబడిన “సమూలనాశనము” రావడాన్ని గురించి 10 వ అధ్యాయం 22 వ వచనం హెచ్చరిస్తుంది. అలాంటి సమూలనాశనం నీతియుక్తమైనదై ఉంటుంది, ఎందుకంటే అది తిరుగుబాటు దారులైన ప్రజలపై న్యాయవంతమైన శిక్షయై ఉంటుంది. ఫలితంగా, “సముద్రపు ఇసుకవలె” అసంఖ్యాకంగా ఉన్న జనుల నుండి కేవలం ఒక శేషము మాత్రమే తిరిగివస్తుంది. రానున్న ఈ సమూలనాశనం మొత్తం దేశాన్ని ప్రభావితం చేస్తుందని 23 వ వచనం హెచ్చరిస్తుంది. ఈసారి యెరూషలేము తప్పించుకోలేదు.

ఈ వచనాలు సా.శ.పూ. 607 లో యెహోవా బబులోను సామ్రాజ్యాన్ని తన “దండము”గా ఉపయోగించుకున్నప్పుడు ఏమి జరిగిందో చక్కగా వివరిస్తాయి. యెరూషలేముతో సహా మొత్తం దేశమంతా దురాక్రమణదారునికి లొంగిపోయింది. యూదులు 70 సంవత్సరాలపాటు బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు. అయితే, దాని తర్వాత, కొందరు అంటే కేవలం “శేషము మాత్రమే” అయినప్పటికీ, యెరూషలేములో సత్యారాధనను పునఃస్థాపించడానికి తిరిగి వచ్చారు.

రోమీయులు 9:​27, 28 వచనాల్లో చూపించబడినట్లుగా, యెషయా 10:​20-23 వచనాల్లోని ప్రవచనం మొదటి శతాబ్దంలో మరొకసారి నెరవేరింది. (యెషయా 1:9; రోమీయులు 9:29 పోల్చండి.) ఆధ్యాత్మిక భావంలో, యూదుల ఒక “శేషము” సా. శ. మొదటి శతాబ్దంలో యెహోవా వద్దకు ‘తిరిగివచ్చిందనీ’ అంటే చాలాకొద్ది సంఖ్యలో నమ్మకమైన యూదులు యేసు క్రీస్తు అనుచరులై యెహోవాను “ఆత్మతో సత్యముతో” ఆరాధించడం మొదలుపెట్టారనీ పౌలు వివరిస్తున్నాడు. (యోహాను 4:​24) విశ్వసిస్తున్న అన్యులు తర్వాత వీరితో కలవడంతో, “దేవుని ఇశ్రాయేలు” అయిన ఆధ్యాత్మిక జనాంగం రూపొందింది. (గలతీయులు 6:​16) ఈ సందర్భంలో యెషయా 10:20 లోని మాటలు నెరవేరాయి: యెహోవాకు సమర్పించుకున్న జనాంగం, ఆయన నుండి వైదొలగి మద్దతు కోసం మానవ శక్తులను “ఇకను” ఆశ్రయింపదు.

[147 వ పేజీలోని చిత్రం]

జనాంగాలను సమకూర్చడం పక్షిగూటి నుండి గ్రుడ్లను ఏరుకోవడమంత సులభమని సన్హెరీబు అనుకుంటున్నాడు