కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అహంకారంగల ఒక నగరాన్ని యెహోవా అణచివేస్తాడు

అహంకారంగల ఒక నగరాన్ని యెహోవా అణచివేస్తాడు

పధ్నాలుగవ అధ్యాయం

అహంకారంగల ఒక నగరాన్ని యెహోవా అణచివేస్తాడు

యెషయా 13:​1–14:23

1. యెషయా గ్రంథం ఇప్పుడు ఎంత ముందటి కాలాన్ని గురించి తెలియజేస్తుంది?

 యెషయా ప్రవచనార్థక గ్రంథము, వాగ్దాన దేశాన్ని అష్షూరీయులు ఆక్రమించిన కాలంలో అంటే సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో వ్రాయబడింది. యెషయా గ్రంథంలోని మునుపటి అధ్యాయాల్లో చూసినట్లుగానే, సంఘటనలు చోటుచేసుకునే విధానాన్ని ఆయన విశేషమైన ఖచ్చితత్వంతో ప్రవచిస్తున్నాడు. అయితే, ఈ గ్రంథము అష్షూరీయులు ఆధిపత్యం వహించిన కాలంకంటే ముందటి కాలాన్ని గురించి తెలియజేస్తుంది. యెహోవా నిబంధన ప్రజలు షీనారుతో సహా అనేక దేశాల్లో నుండి చెరనుంచి విడిపించబడి తిరిగి వస్తారని అది ప్రవచిస్తుంది, ఈ షీనారు ప్రాంతంలోనే తర్వాత బబులోను ఏర్పడింది. (యెషయా 11:​11) యెషయా 13 వ అధ్యాయంలో మనం ఒక విశేషమైన ప్రవచనాన్ని కనుగొంటాము, ఆ ప్రవచన నెరవేర్పు వారలా తిరిగి రావడానికి మార్గాన్ని తెరుస్తుంది. ఆ ప్రవచనం ఈ మాటలతో ప్రారంభమవుతుంది: “ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోనుగూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి.”​—యెషయా 13:1.

“గర్వమును అణచివేసెదను”

2. (ఎ) హిజ్కియా బబులోనుతో ఎలా కలుస్తాడు? (బి) నిలబెట్టబడే “ధ్వజము” ఏది?

2 యెషయా జీవితకాలంలో యూదా బబులోనుతో కలుస్తుంది. హిజ్కియా రాజు తీవ్ర అస్వస్థతకు గురై తిరిగి స్వస్థత పొందుతాడు. ఆయన స్వస్థత పొందినందుకు ఆయనను అభినందించడానికి బబులోను నుండి ప్రతినిధులు వస్తారు, అయితే తాము అష్షూరుతో చేస్తున్న యుద్ధంలో హిజ్కియాను తమ మిత్రునిగా చేసుకోవాలనే రహస్య సంకల్పంతో వాళ్లు వచ్చివుండవచ్చు. మూర్ఖంగా, హిజ్కియా రాజు తన ధనసంపదలన్నీ వారికి చూపిస్తాడు. ఫలితంగా, రాజు మరణించిన తర్వాత ఆ సంపద అంతా బబులోనుకు తీసుకు వెళ్లబడుతుందని యెషయా హిజ్కియాకు చెబుతాడు. (యెషయా 39:​1-7) ఇది సా.శ.పూ. 607 లో అంటే యెరూషలేము నాశనం చేయబడి, జనాంగం చెరగా కొనిపోబడినప్పుడు నెరవేరింది. అయితే, దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలు నిత్యం బబులోనులోనే ఉండిపోరు. వారు స్వదేశానికి తిరిగి రావడానికి తాను మార్గాన్ని ఎలా తెరుస్తానన్నది యెహోవా ప్రవచిస్తున్నాడు. ఆయనిలా ప్రారంభిస్తున్నాడు: “జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లులేని కొండమీద ధ్వజము నిలువబెట్టుడి. ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి.” (యెషయా 13:2) ఆ “ధ్వజము,” బబులోనును దాని ఉన్నతస్థానం నుండి తొలగించే పైకివస్తున్న ప్రపంచ శక్తి. అది “చెట్లులేని కొండమీద” అంటే ఎంతో దూరం నుండి కూడా స్పష్టంగా కనిపించేలా నిలబెట్టబడుతుంది. బబులోనుపై దాడి చేయమని ఆదేశించబడిన ఆ క్రొత్త ప్రపంచ శక్తి “ప్రధానుల ద్వారములలో” అంటే ఆ గొప్ప నగరపు పురద్వారములలో ప్రవేశించి, దాన్ని జయిస్తుంది.

3. (ఎ) యెహోవా నిలబెట్టే ‘ప్రతిష్ఠితులు’ ఎవరు? (బి) అన్యుల సైన్యాలు ఏ భావంలో ‘ప్రతిష్ఠితమైనవి’?

3 యెహోవా ఇప్పుడిలా చెబుతున్నాడు: “నాకు ప్రతిష్ఠితులైనవారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను. నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలురను పిలిపించియున్నాను. నా ప్రభావమునుబట్టి హర్షించువారిని పిలిపించియున్నాను. బహు జనుల ఘోషవలె కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి! కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి! సైన్యముల కధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు.” (యెషయా 13:​3, 4) గర్విష్ఠి బబులోనును అణచివేసేందుకు నియమించబడిన ఈ ‘ప్రతిష్ఠితులు’ ఎవరు? వారు రాజ్యాల సంకీర్ణ సైన్యాలు అంటే ‘కూడుకొనిన రాజ్యములు.’ వారు దూరానున్న పర్వత ప్రాంతం నుండి బబులోనుకు వ్యతిరేకంగా దిగుతారు. వారు “దూరదేశమునుండి ఆకాశ దిగంతములనుండి . . . వచ్చుచున్నారు.” (యెషయా 13:5) వారు ఏ భావములో ప్రతిష్ఠితులు? పరిశుద్ధులై ఉండడమనే భావంలో మాత్రం కాదు. వారు యెహోవా సేవ చేయాలనే ఆసక్తేమీ లేని అన్యుల సైన్యాలు. అయితే, హీబ్రూ లేఖనాల్లో, ‘ప్రతిష్ఠితులు’ అంటే “దేవుడు ఉపయోగించుకునేందుకు ప్రత్యేకించబడినవారు” అని భావం. రాజ్యాల సైన్యాలను ప్రతిష్ఠపరిచి, యెహోవా తన ఆగ్రహాన్ని వెళ్లగ్రక్కడానికి వారి స్వార్థపూరిత ఆశయాలను ఉపయోగించుకోగలడు. ఆయన అష్షూరును ఆ విధంగానే ఉపయోగించుకున్నాడు. ఆయన బబులోనును కూడా అదేవిధంగా ఉపయోగించుకుంటాడు. (యెషయా 10:5; యిర్మీయా 25:9) అంతేగాక, బబులోనును శిక్షించేందుకు ఆయన ఇతర రాజ్యాలను ఉపయోగించుకుంటాడు.

4, 5. (ఎ) బబులోను గురించి యెహోవా ఏమి ప్రవచిస్తాడు? (బి) బబులోనుపై దాడి చేసేవారు వేటితో వ్యవహరించవలసి ఉంటుంది?

4 బబులోను అప్పటికి ప్రపంచ శక్తి కాలేదు. అయినప్పటికీ, యెహోవా యెషయా ద్వారా ఒక ప్రకటనను వెల్లడి చేస్తూ, బబులోను ఆ స్థానానికి చేరుకునే కాలాన్ని ముందే చూసి, దాని పతనం గురించి ప్రవచిస్తాడు. ఆయనిలా చెబుతున్నాడు: “యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి! అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.” (యెషయా 13:6) అవును, బబులోను ప్రగల్భాల స్థానంలో దుఃఖభరిత ఘోష ఉంటుంది. ఎందుకు? యెహోవా దానికి వ్యతిరేకంగా తీర్పు అమలు చేసే “యెహోవా దినము” దానికి కారణం.

5 అయితే, బబులోను నాశనం కావడం ఎలా సాధ్యమవుతుంది? యెహోవా దాన్ని నాశనం చేసే సమయం వచ్చినప్పుడు, ఆ నగరం సురక్షితంగా ఉన్నట్లు కనిపిస్తుంది. దాడి చేయడానికి వచ్చే సైన్యాలు మొదట, ఆ నగరానికి ప్రకృతిసిద్ధమైన భద్రతను చేకూరుస్తున్న యూఫ్రటీసు నదితో వ్యవహరించవలసి ఉంటుంది, ఆ నది నగరం మధ్యన ప్రవహిస్తుంది, నగరానికి భద్రతనిచ్చేందుకు నగరం చుట్టూ త్రవ్వబడిన కందకాన్ని నింపడానికీ, నగరానికి త్రాగేనీటిని సరఫరా చేయడానికీ ఆ నదీ ప్రవాహం తగినవిధంగా మళ్ళించబడుతుంది. ఇక ఆ తర్వాత బబులోను చుట్టూవున్న, దుర్భేద్యంగా కనిపించే రెండు వరుసల గోడలను దాటవలసి ఉంటుంది. అంతేగాక, ఆ నగరంలో ఆహారం సమృద్ధిగా నిలువచేయబడి ఉంటుంది. బబులోను చివరి రాజు నెబోనీడస్‌ “నగరంలో ఆహార పదార్థాలను నిలువ చేసేందుకు ఎంతో శ్రమ తీసుకున్నాడు, దాని నివాసులను ఇరవై సంవత్సరాల పాటు పోషించగలిగేంత [ఆహారం] ఆ నగరంలో ఉండేదని తలంచబడుతుంది” అని డైలీ బైబిల్‌ ఇల్లస్ట్రేషన్స్‌ అనే పుస్తకం చెబుతోంది.

6. బబులోనుపై ప్రవచించబడిన దురాక్రమణ జరిగినప్పుడు అనుకోకుండా ఏమి జరుగుతుంది?

6 అయితే, పైకి కనిపించేవి కళ్ళను మోసం చేయగలవు. యెషయా ఇలా చెబుతున్నాడు: “అందుచేత బాహువులన్నియు దుర్బలములగును, ప్రతివాని గుండె కరగిపోవును. జనులు విభ్రాంతినొందుదురు. వేదనలు దుఃఖములు వారికి కలుగును; ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు. ఒకరినొకరు తేరి చూతురు. వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.” (యెషయా 13:​7, 8) వశపర్చుకుంటున్న సైన్యాలు నగరంపై దాడి చేసినప్పుడు, ప్రసవిస్తున్న స్త్రీకి హఠాత్తుగా తీవ్రంగా నొప్పి కలిగినట్లు దాని నివాసుల నెమ్మది స్థానంలో వేదన కలుగుతుంది. భయంతో వారి గుండెలు కరిగిపోతాయి. తమను తాము రక్షించుకోలేక, పక్షవాతం వచ్చి వారి బాహువులు దుర్బలమవుతాయి. వారి ముఖాలు భయంతోనూ, క్షోభతోనూ “ఎఱ్ఱబారును.” తమ గొప్ప నగరం ఎలా కూలిపోగలదన్న ఆశ్చర్యంతో, విభ్రాంతితో వారు ఒకరినొకరు తేరి చూసుకుంటారు.

7. ఏ “యెహోవా దినము” వస్తుంది, బబులోనుపై దాని ప్రభావం ఎలా ఉంటుంది?

7 ఏది ఏమైనప్పటికీ, బబులోను మాత్రం తప్పక కూలుతుంది. బబులోను లెక్క అప్పజెప్పవలసిన దినాన్ని అంటే ఎంతో వేదనకరంగా ఉండే “యెహోవా దినము”ను ఎదుర్కోబోతోంది. సర్వోన్నత న్యాయాధిపతి తన ఆగ్రహాన్ని వెళ్లగ్రక్కుతూ పాపులైన బబులోను నివాసుల మీదికి, వారికి తగిన తీర్పును తీసుకువస్తాడు. ప్రవచనం ఇలా చెబుతోంది: “యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును.” (యెషయా 13:9) బబులోనుకు పరిస్థితులు ఆశాజనకంగా లేవు. సూర్యచంద్ర నక్షత్రాలు వెలుగునివ్వడం మానుకున్నట్లుగా ఉంది. ఎందుకంటే “ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు; ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.”​—యెషయా 13:10.

8. యెహోవా బబులోనుకు ఎందుకు వినాశనాన్ని కలుగజేస్తాడు?

8 ఈ అహంకారపూరిత నగరానికి ఎందుకలాంటి దుర్గతి? యెహోవా ఇలా చెబుతున్నాడు: “లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవుచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలాత్కారుల గర్వమును అణచివేసెదను.” (యెషయా 13:​11) యెహోవా ఉగ్రత కుమ్మరించబడడం దేవుని ప్రజలపట్ల బబులోను చూపించిన క్రూరత్వానికి శిక్షగా ఉంటుంది. బబులోనీయుల చెడుతనం మూలంగా మొత్తం దేశమంతా బాధననుభవిస్తుంది. అహంకారులైన ఈ నిరంకుశ పాలకులు యెహోవాను ఇక ఎంతమాత్రం బహిరంగంగా ప్రతిఘటించరు.

9. యెహోవా తీర్పు దినమున బబులోనుకు ఏమి సంభవిస్తుంది?

9 యెహోవా ఇలా చెబుతున్నాడు: “బంగారుకంటె మనుష్యులును ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును అరుదుగా ఉండజేసెదను.” (యెషయా 13:​12) అవును, నగరంలో జనశూన్యత ఏర్పడుతుంది, అది నిర్జనమవుతుంది. యెహోవా ఇలా కొనసాగిస్తున్నాడు: “సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసెదను.” (యెషయా 13:​13) బబులోను “ఆకాశము” అంటే బహుళ సంఖ్యలోవున్న దాని దేవుళ్లు దేవతలు, అవసరమైన సమయంలో నగరానికి సహాయం చేయలేక వణకిపోతారు. బబులోను సామ్రాజ్యమైన “భూమి” స్థానభ్రంశం చెందుతుంది, అంటే మరో నిర్జీవమైన సామ్రాజ్యంలా అది చరిత్ర పుటల్లోకి వెళ్లిపోతుంది. “అప్పుడు తరుమబడుచున్న జింకవలెను పోగుచేయని గొఱ్ఱెలవలెను జనులు తమ తమ స్వజనులతట్టు తిరుగుదురు; తమ తమ స్వదేశములకు పారిపోవుదురు.” (యెషయా 13:​14) బబులోనుకు మద్దతునిచ్చిన విదేశీయులందరూ, విజయం సాధిస్తున్న ప్రపంచ ఆధిపత్యంతో క్రొత్త సంబంధాలు ఏర్పరచుకోవాలని ఆశిస్తూ, బబులోనును విడిచి పారిపోతారు. చివరికి బబులోను స్వాధీనం చేసుకోబడిన నగరం అనుభవించే వేదనను అంటే తాను ఘనతవహించిన కాలంలో ఎన్నో ఇతర రాజ్యాలకు తాను కలిగించిన వేదనను అనుభవిస్తుంది: “పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును, తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును; వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగ గొట్టబడుదురు. వారి యిండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరుపబడుదురు.”​—యెషయా 13:15, 16.

నాశనం చేసేందుకు దేవుని ఉపకరణం

10. బబులోనును ఓడించడానికి యెహోవా ఎవరిని ఉపయోగించుకుంటాడు?

10 బబులోనును కూలద్రోయడానికి యెహోవా ఏ శక్తిని ఉపయోగిస్తాడు? దాదాపు 200 సంవత్సరాలు ముందుగా యెహోవా దానికి సమాధానాన్ని తెలియజేస్తున్నాడు: “వారిమీద పడుటకు నేను మాదీయులను రేపెదను, వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణముకూడ వారికి రమ్యమైనది కాదు. వారి విండ్లు యౌవనస్థులను నలుగగొట్టును. గర్భఫలమందు వారు జాలిపడరు; పిల్లలను చూచి కరుణింపరు. అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదమును మాహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలెనగును.” (యెషయా 13:​17-19) వైభవోపేతమైన బబులోను కూలిపోతుంది, దీన్ని సాధించేందుకు యెహోవా ఉపకరణం, దూరానున్న పర్వతప్రాంతమైన మాద్య దేశము నుండి వచ్చే సైన్యాలు. * చివరికి బబులోను ఘోరమైన అనైతికతకు పాల్పడిన నగరాలగు సొదొమ గొమొఱ్ఱాలవలె నిర్జనమవుతుంది.​—⁠ఆదికాండము 13:​13; 19:13, 24.

11, 12. (ఎ) మాద్యదేశం ప్రపంచ శక్తి ఎలా అయ్యింది? (బి) మాదీయ సైన్యాలకు సంబంధించి ప్రవచనం ఏ అసాధారణమైన లక్షణాన్ని తెలియజేస్తోంది?

11 యెషయా కాలంలో, మాద్యదేశము బబులోనుదేశము రెండూ అష్షూరీయుల అధికారం క్రిందనే ఉన్నాయి. దాదాపు ఒక శతాబ్దం తర్వాత అంటే సా.శ.పూ. 632 లో మాద్యదేశము బబులోనుదేశము తమ తమ సైన్యాలను ఏకం చేసుకుని అష్షూరు రాజధానియైన నీనెవెను కూలదోస్తాయి. దీనితో బబులోను ప్రధానమైన ప్రపంచ శక్తి కావడానికి మార్గం తెరుచుకుంటుంది. అది జరిగిన దాదాపు 100 సంవత్సరాల తర్వాత మాద్యదేశం తనను నాశనం చేస్తుందని బబులోనుకు ఏమాత్రం తెలియదు. జరుగబోయేదాన్ని యెహోవా దేవుడు గాక మరింకెవరు అంత ధైర్యంగా తెలియజేయగలరు?

12 యెహోవా నాశనం చేసేందుకు తాను ఎంపిక చేసుకున్న ఉపకరణం గురించి తెలియజేసేటప్పుడు, మాద్యదేశ సైన్యాలు “వెండిని లక్ష్యము చేయరు సువర్ణముకూడ వారికి రమ్యమైనది కాదు” అని చెబుతున్నాడు. అది యుద్ధంలో రాటుదేలిన యోధులు చూపించే ఎంత అసాధారణమైన లక్షణమో కదా! బైబిలు పండితుడైన ఆల్బర్ట్‌ బాన్స్‌ ఇలా చెబుతున్నాడు: “కొల్లసొమ్ము దొరుకుతుందనే ఆశకు ప్రభావితంకాని, దాడిచేసే సైన్యాలు నిజానికి చాలా తక్కువ.” ఈ విషయంలో మాదీయ సైన్యాలు యెహోవా చెప్పింది నిజమని నిరూపిస్తాయా? నిరూపిస్తాయి. జె. గ్లెంట్‌వర్త్‌ బట్లర్‌ కూర్చిన ద బైబిల్‌-వర్క్‌లో ఉన్న ఈ వ్యాఖ్యానాన్ని పరిశీలించండి: “యుద్ధం చేసే చాలా రాజ్యాల్లా, మాదీయులు ప్రాముఖ్యంగా పారసీకులు విజయం సాధించడానికీ కీర్తిని పొందడానికీ ఇచ్చినంత ప్రాధాన్యతను బంగారానికి ఇవ్వలేదు.” * దీని దృష్ట్యా, పారసీక పాలకుడైన కోరేషు ఇశ్రాయేలీయులను బబులోను చెర నుండి విడుదల చేస్తూ, యెరూషలేము ఆలయం నుండి నెబుకద్నెజరు దోచుకుని తెచ్చిన వేలాది వెండి బంగారు పాత్రలను వారికి తిరిగి ఇచ్చి పంపాడంటే అందులో ఆశ్చర్యం లేదు.​—⁠ఎజ్రా 1:7-11.

13, 14. (ఎ) దోపుడు సొమ్మంటే ఆసక్తిలేకపోయినప్పటికీ, మాదీయులకు పారసీకులకు ఏ దాహం ఉంది? (బి) బబులోను డాబుసరి భద్రతా ఏర్పాట్లను కోరేషు ఎలా అధిగమించాడు?

13 మాదీయులకు, పారసీకులకు దోపుడు సొమ్ము మీద అంత కోరిక లేకపోయినప్పటికీ, వారికి అధికారదాహం ఉంది. ప్రపంచ వేదికపై ఏ దేశం కంటే తక్కువగా ఉండడం వారికిష్టం లేదు. అంతేగాక, యెహోవా వారి హృదయాల్లో “నాశనం” అనే తలంపును పెడతాడు. (యెషయా 13:6) కాబట్టి, వారు తమ లోహపు విల్లులతో​—⁠వీటిని బాణములు వేయడానికే గాక బబులోను తల్లుల గర్భఫలమైన శత్రుసైనికులను కొట్టి నాశనం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు​—⁠బబులోనును జయించాలని దృఢనిశ్చయత కలిగివున్నారు.

14 మాదీయ-పారసీక సైన్యాలకు నాయకుడైన కోరేషు బబులోను దుర్గాలను చూసి భయపడిపోడు. సా.శ.పూ. 539, అక్టోబరు 5/6 నాటి రాత్రి ఆయన యూఫ్రటీసు నదీ జలాలను మళ్లించమని ఆజ్ఞలు జారీ చేస్తాడు. నీటి మట్టం తగ్గిపోతుండగా, దురాక్రమణదారులు తుంటిలోతు నీళ్ళున్న నదీగర్భం మీద నడిచివెళ్లి రహస్యంగా నగరంలోకి ప్రవేశిస్తారు. బబులోను నివాసులు హఠాత్తుగా దొరికిపోతారు, బబులోను కూలిపోతుంది. (దానియేలు 5:​30) విషయాలను యెహోవా దేవుడే నడిపిస్తున్నాడనే దానిలో ఏ సందేహానికీ తావులేకుండా చేస్తూ ఆయన ఈ సంఘటలను ప్రవచించేలా యెషయాను ప్రేరేపిస్తాడు.

15. బబులోనుకు ఎలాంటి భవిష్యత్తు వేచివుంది?

15 బబులోను ఎంత వరకు నాశనం చేయబడుతుంది? యెహోవా చేస్తున్న ప్రకటనలను వినండి: “అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు, తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు. అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు, గొఱ్ఱెలకాపరులు తమ మందలను అక్కడ పరుండనియ్యరు. నక్కలు అక్కడ పండుకొనును, గురుపోతులు వారి యిండ్లలో ఉండును. నిప్పుకోళ్లు అక్కడ నివసించును, కొండమేకలు అక్కడ గంతులు వేయును. వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాస మందిరములలో అడవికుక్కలును మొరలిడును [“పెద్ద పాములుండును,” NW] . ఆ దేశమునకు కాలము సమీపించియున్నది, దాని దినములు సంకుచితములు.” (యెషయా 13:​20-22) ఆ నగరానికి పట్టే గతి సర్వనాశనమే.

16. బబులోను ప్రస్తుత స్థితి మనకు ఏ నమ్మకాన్ని ఇస్తుంది?

16 ఇది వెంటనే సా.శ.పూ. 539 లో జరుగలేదు. అయినప్పటికీ, బబులోను గురించి యెషయా ప్రవచించిన ప్రతి విషయమూ నెరవేరిందని నేడు స్పష్టమవుతోంది. బబులోను “ఇప్పుడూ, శతాబ్దాలుగానూ, పూర్తి నాశనపు దృశ్యంగా, శిథిలాల కుప్పగా ఉంది” అని ఒక బైబిలు వ్యాఖ్యాత చెబుతున్నాడు. తర్వాత అతడిలా జతచేస్తున్నాడు: “ఈ దృశ్యాన్ని చూసి యెషయా, యిర్మీయాల ప్రవచనాలు ఎంత కచ్చితంగా నెరవేరాయన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోకుండా ఉండడం అసాధ్యం.” యెషయా కాలంలోని ఏ మానవుడూ బబులోను కూలిపోవడాన్ని, దాని తుది నాశనాన్ని ముందే చెప్పగలిగి ఉండేవాడు కాదని స్పష్టమవుతుంది. ఎంతైనా, బబులోను మాదీయుల పారసీకుల మూలంగా కూలిపోవడమన్నది, యెషయా తన గ్రంథాన్ని వ్రాసిన దాదాపు 200 సంవత్సరాల తర్వాత సంభవించింది! దాని తుదినాశనం శతాబ్దాల తర్వాత జరిగింది. బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమనే మన విశ్వాసాన్ని ఇది బలపరచడం లేదా? (2 తిమోతి 3:​16) అంతేగాక, గతకాలాల్లో యెహోవా తన ప్రవచనాలను నెరవేర్చాడు గనుక, ఇంత వరకూ నెరవేరని బైబిలు ప్రవచనాలు దేవుని నిర్ణీత కాలంలో నెరవేరుతాయని మనం సంపూర్ణ నమ్మకం కలిగివుండవచ్చు.

‘నీ బాధను కొట్టివేసి విశ్రమింపజేయును’

17, 18. బబులోను ఓటమి వల్ల ఇశ్రాయేలీయులకు ఏ ఆశీర్వాదాలు వస్తాయి?

17 బబులోను కూలిపోవడం ఇశ్రాయేలుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అది చెరనుండి విడుదలను, వాగ్దాన దేశానికి తిరిగి వచ్చే అవకాశాన్ని ఇస్తుంది. అందుకే, యెషయా ఇప్పుడిలా చెబుతున్నాడు: “యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును; వారిని స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలిసికొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు. జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు, ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచుకొందురు; వారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి తమ్మును బాధించినవారిని ఏలుదురు.” (యెషయా 14:​1, 2) “యాకోబు” ఇక్కడ మొత్తం ఇశ్రాయేలును అంటే 12 గోత్రాలను సూచిస్తోంది. జనాంగం స్వదేశానికి తిరిగి రావడానికి అనుమతించడం ద్వారా యెహోవా “యాకోబు” పట్ల కనికరం చూపిస్తాడు. వారితోపాటు వేలాదిమంది విదేశీయులు వస్తారు, వారిలో చాలామంది ఇశ్రాయేలీయులకు ఆలయ సేవకులుగా సేవచేస్తారు. కొంతమంది ఇశ్రాయేలీయులు, మునుపు తమను చెరపట్టి తీసుకువెళ్లిన వారిపై ఆధిపత్యం చెలాయిస్తారు కూడా. *

18 చెరలో బంధీలుగా జీవించే బాధ ఇక ఉండదు. బదులుగా, తన ప్రజల “బాధను [వారి] ప్రయాసమును [వారి] చేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా [వారిని] విశ్రమింపజేయు[ను].” (యెషయా 14:3) దాసత్వపు శారీరక భారాల నుండి విడిపించబడిన ఇశ్రాయేలీయులు, అబద్ధ దేవుళ్ల ఆరాధకుల మధ్య నివసించడం వల్ల కలిగే బాధను వేదనను ఇక అనుభవించరు. (ఎజ్రా 3:1; యెషయా 32:​17) దీని గురించి వ్యాఖ్యానిస్తూ, లాండ్స్‌ అండ్‌ పీపుల్స్‌ ఆఫ్‌ ద బైబిల్‌ అనే పుస్తకం ఇలా తెలియజేస్తోంది: “బబులోనీయుని దృష్టిలో అతని దేవుళ్లు కూడా అతని వంటివారే, అతనిలో ఉన్న అన్ని అవలక్షణాలూ వారిలోనూ ఉన్నాయి, ఆ దేవుళ్లు పిరికివారు, త్రాగుబోతులు, మానసికంగా దుర్బలులు.” అలాంటి నీచమైన మతవాతావరణం నుండి బయటపడడం ఎంత ఉపశమనాన్నిస్తుందో గదా!

19. ఇశ్రాయేలు యెహోవా క్షమాభిక్షను పొందాలంటే ఏమి చెయ్యాలి, దీని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

19 అయితే, యెహోవా చూపించే కనికరం ఏ షరతులూ లేనిది కాదు. ఆయన ప్రజలు, దేవుడు తమను అంత తీవ్రంగా శిక్షించేందుకు నడిపిన తమ దుష్టత్వాన్ని బట్టి పశ్చాత్తాపాన్ని వ్యక్తపర్చాలి. (యిర్మీయా 3:​25) యథార్థంగా, హృదయపూర్వకంగా తప్పు ఒప్పుకుంటే యెహోవా క్షమాభిక్ష లభిస్తుంది. (నెహెమ్యా 9:6-37; దానియేలు 9:6 చూడండి.) అదే సూత్రం నేడు కూడా వర్తిస్తుంది. “పాపము చేయనివాడెవడును లేడు” కాబట్టి, మనకందరికీ యెహోవా కనికరం అవసరం. (2 దినవృత్తాంతములు 6:​36) కనికరంగల దేవుడైన యెహోవా, మనం స్వస్థత పొందగలిగేలా తన ఎదుట మన పాపాలను ఒప్పుకొని, పశ్చాత్తాపపడి, తప్పుమార్గమేదైనా అనుసరిస్తుంటే దాన్ని విడిచిపెట్టమని మనల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. (ద్వితీయోపదేశకాండము 4:31; యెషయా 1:18; యాకోబు 5:​16) ఇది మనకు మళ్లీ ఆయన అనుగ్రహం లభించేలా చేయడమేగాక, మనకు ఓదార్పునిస్తుంది కూడా.​—⁠కీర్తన 51:1; సామెతలు 28:13; 2 కొరింథీయులు 2:7.

బబులోనుకు వ్యతిరేకంగా “అపహాస్యపు గీతము”

20, 21. బబులోను కూలిపోవడాన్ని బట్టి దాని పొరుగువారు ఎలా ఆనందిస్తారు?

20 బబులోను ప్రముఖ ప్రపంచ శక్తిగా ఎదగడానికి 100 సంవత్సరాల కంటే ముందే, అది కూలిపోయినప్పుడు లోకం ఎలా ప్రతిస్పందిస్తుందో యెషయా ప్రవచిస్తున్నాడు. దాని చెర నుండి విడిపించబడిన ఇశ్రాయేలీయులకు ఆయన ప్రవచనార్థకంగా ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు: “నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు: బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను? దుష్టుల దుడ్డుకఱ్ఱను, మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారముచేత జనములను లోపరచిరి.” (యెషయా 14:​3-6) బబులోను జయించేదానిగా, స్వతంత్ర ప్రజలను బానిసలుగా చేసే అణచివేసేదానిగా చాలా పేరు సంపాదించుకుంది. కాబట్టి, ఆ మహా నగరపు వైభవోపేతమైన దినాల్లో దానిపై అధ్యక్షత వహించిన బబులోను రాజవంశాన్ని​—⁠నెబకద్నెజరుతో ప్రారంభమై నెబొనీడస్‌ మరియు బెల్షస్సరులతో ముగిసింది​—⁠ప్రధానంగా ఉద్దేశించి చెప్పబడిన “అపహాస్యపు గీతము”తో దాని పతనాన్ని వేడుక చేసుకోవడం ఎంత సముచితమో కదా!

21 అది కూలిపోవడం వల్ల ఎంత తేడా ఏర్పడుతుందో! “భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది. జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటినుండి నరుకువాడెవడును మా మీదికి రాలేదని నిన్నుగూర్చి తమాలవృక్షములు లెబానోను దేవదారువృక్షములు హర్షించును.” (యెషయా 14:​7, 8) చుట్టుప్రక్కలనున్న దేశాల రాజులు బబులోను పరిపాలకుల దృష్టిలో, నరికివేసి తమ స్వంత ప్రయోజనార్థం వినియోగించుకోగల చెట్లుగా ఉన్నారు. ఇప్పుడు అదంతా ముగింపుకొచ్చింది. బబులోను పరిపాలనాధికారం ముగిసింది!

22. కావ్య భావంలో, బబులోను రాజవంశ పతనాన్ని బట్టి సమాధి ఎలా ప్రభావితమైంది?

22 బబులోను కూలిపోవడం ఎంత ఆశ్చర్యకరమైనదిగా ఉంటుందంటే, స్వయంగా సమాధియే ఇలా ప్రతిస్పందిస్తుంది: “నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజులనందరిని వారి వారి సింహాసనములమీదనుండి లేపుచున్నది. వారందరు నిన్ను చూచి​—⁠నీవును మావలె బలహీనుడవైతివా? నీవును మాబోటివాడవైతివా? అందురు. నీ మాహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును; కీటకములు నిన్ను కప్పును.” (యెషయా 14:​9-11) ఎంత శక్తివంతమైన కావ్యరూప వర్ణన! అదెలా ఉందంటే, మానవజాతి సామాన్య సమాధి (షియోల్‌) బబులోను రాజవంశం కంటే ముందు గతించిపోయిన రాజులందర్నీ, క్రొత్తగా వస్తున్న దీనికి స్వాగతం పలుకగలిగేలా మేల్కొల్పడంలా ఉంది. ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉండి, వెలగల పరుపుకు బదులుగా పురుగుల పడకపై పడుకుని, ఖరీదైన కంబళ్లకు బదులుగా కీటకాలు కప్పబడిన బబులోను పరిపాలక శక్తిని వారు అపహసిస్తారు.

“త్రొక్కబడిన పీనుగువలె”

23, 24. బబులోను రాజులు ఏ మితిమీరిన అహంకారాన్ని చూపించారు?

23 యెషయా అపహాస్యపు గీతాన్నిలా కొనసాగిస్తున్నాడు: “తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?” (యెషయా 14:​12) స్వార్థపూరితమైన అహంకారం బబులోను రాజులు తమ చుట్టూ ఉన్నవారిపై తమను తాము హెచ్చించుకునేలా చేస్తుంది. తొలి ఉదయకాల ఆకాశంలో ప్రకాశమానంగా వెలుగుతున్న నక్షత్రంలా, వారు అహంకారంగా అధికారాన్ని ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. అహంకారానికి ఒక మూలం, నెబుకద్నెజరు యెరూషలేముపై విజయం సాధించడం, అష్షూరు ఈ వీరకృత్యాన్ని సాధించలేక పోయింది. గర్విష్టి బబులోను రాజవంశం ఇలా చెబుతున్నట్లు అపహాస్యపు గీతం వర్ణిస్తుంది: “నేను ఆకాశమున కెక్కిపోయెదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును. మేఘమండలముమీది కెక్కుదును; మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును.” (యెషయా 14:​13, 14) ఇంతకన్నా విపరీతమైనదేదైనా ఉండగలదా?

24 బైబిలులో, దావీదు రాజవంశానికి చెందిన రాజులు నక్షత్రాలతో పోల్చబడ్డారు. (సంఖ్యాకాండము 24:​17) దావీదు మొదలుకొని, ఆ “నక్షత్రము”లు సీయోను పర్వతం నుండి పరిపాలించారు. సొలొమోను యెరూషలేములో ఆలయం నిర్మించిన తర్వాత, సీయోను అనే పేరు మొత్తం నగరానికి అన్వయించడం మొదలైంది. ధర్మశాస్త్ర నిబంధన క్రింద, ఇశ్రాయేలీయులైన పురుషులందరికీ సంవత్సరానికి మూడుసార్లు సీయోనుకు ప్రయాణించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి, అది “సభాపర్వతము”గా తయారైంది. యూదా రాజులను జయించి, వారిని ఆ పర్వతం పైనుండి తొలగించాలని నిశ్చయించుకుని, నెబుకద్నెజరు తనను తాను ఆ “నక్షత్రము”లకు పైగా హెచ్చించుకోవాలనే తన ఉద్దేశాన్ని బయల్పరుస్తున్నాడు. తాను జయించడానికి కారణం యెహోవా అని ఆయన అంగీకరించడం లేదు. బదులుగా, ఆయన అహంకారంగా తనను తాను యెహోవా స్థానంలో ఉంచుకుంటున్నాడు.

25, 26. బబులోను రాజవంశం అవమానకరంగా ఎలా అంతమవుతుంది?

25 గర్విష్టి బబులోను రాజవంశానికి ఎంత దుర్గతిపట్టనై ఉందో! బబులోను దేవుని నక్షత్రాలకన్నా ఎంతమాత్రమూ హెచ్చు స్థాయిలో లేదు. బదులుగా, యెహోవా ఇలా చెబుతున్నాడు: “నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు​—⁠భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా? లోకమును [“పంట భూములను,” NW] అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పోనియ్యనివాడు ఇతడేనా?” (యెషయా 14:​15-17) అధికారదాహంగల రాజవంశం అల్పమానవునిలా సమాధికి వెళ్తుంది.

26 రాజ్యాలను జయించిన, పంట భూములను నాశనం చేసిన, అసంఖ్యాకమైన నగరాలను కూలద్రోసిన శక్తి ఎక్కడుంటుంది? ప్రజలను చెరపట్టి వారిని తిరిగి తమ దేశానికి పోనియ్యని ప్రపంచ శక్తి ఎక్కడుంటుంది? అంతెందుకు బబులోను రాజవంశం సరైన విధంగా సమాధి కూడా చేయబడదు! యెహోవా ఇలా చెబుతున్నాడు: “జనముల రాజులందరు ఘనత వహించినవారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలె నున్నావు. నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితోకూడ కలిసియుండవు. దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు.” (యెషయా 14:​18-20) ప్రాచీన ప్రపంచంలో, రాజు గౌరవప్రదంగా సమాధి చేయబడకపోతే అది ఒక అవమానంగా పరిగణించబడేది. కాబట్టి, బబులోను రాజవంశం మాటేమిటి? విడిగా ఒక్కో రాజుకు బహుశా గౌరవం దక్కి ఉండవచ్చు, కానీ నెబుకద్నెజరు నుండి ఉద్భవించిన రాజుల రాజవంశం మాత్రం “పారవేయబడిన కొమ్మవలె” విసర్జించబడుతుంది. యుద్ధంలో చంపబడిన అల్ప పదాతి సైనికునిలా ఆ రాజవంశం ఏ పేరూ వ్రాయబడని సమాధిలోకి పడవేయబడినట్లుగా ఉంది. ఎంత అవమానం!

27. బబులోనీయుల భావి తరాలు తమ పితరుల దోషమును బట్టి ఏ విధంగా బాధను అనుభవిస్తాయి?

27 జయిస్తున్న మాదీయులకు, పారసీకులకు ఈ చివరి ఆజ్ఞలు ఇవ్వబడడంతో అపహాస్యపు గీతం ముగింపుకు వస్తుంది: “వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును [“పంట భూములను,” NW] నింపకుండునట్లు తమ పితరుల దోషమునుబట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి.” (యెషయా 14:​21) బబులోను శాశ్వతంగా కూలిపోతుంది. బబులోను రాజవంశం పెరికివేయబడుతుంది. ఇక పునరుద్ధరించబడే ప్రసక్తి లేదు. బబులోనీయుల భావి తరాలు “తమ పితరుల దోషమును” బట్టి బాధను అనుభవిస్తాయి.

28. బబులోను రాజుల పాపానికి మూలకారణం ఏమిటి, దాని నుండి మనమేమి నేర్చుకుంటాము?

28 బబులోను రాజవంశానికి వ్యతిరేకంగా ప్రకటించబడిన తీర్పు మనకు ఒక విలువైన పాఠాన్ని అందజేస్తుంది. బబులోను రాజుల పాపానికి మూలకారణం, అంతులేని వారి అధికారదాహమే. (దానియేలు 5:​22, 23) వారి హృదయాలు అధికారదాహంతో నిండిపోయాయి. ఇతరులపై ఆధిపత్యం చేయాలని వారు కోరుకున్నారు. (యెషయా 47:​5, 6) న్యాయంగా దేవునికి చెందవలసిన, మనుష్యులిచ్చే మహిమ తమకు కావాలని వారు వాంఛించారు. (ప్రకటన 4:​11) అధికారంలో ఉన్నవారికెవరికైనా, చివరికి క్రైస్తవ సంఘంలోని వారికి కూడా ఇదొక హెచ్చరిక. అటు వ్యక్తుల్లోగానీ ఇటు దేశాల్లోగానీ అధికారదాహం, స్వార్థపూరితమైన గర్వం వంటి లక్షణాలను యెహోవా సహించడు.

29. బబులోను పాలకుల గర్వము, అధికారదాహము దేన్ని ప్రతిబింబిస్తాయి?

29 బబులోను పాలకుల గర్వం, “ఈ యుగ సంబంధమైన దేవత” అయిన అపవాదియగు సాతాను స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. (2 కొరింథీయులు 4:4) అతడు కూడా అధికారాన్ని వాంఛిస్తూ, తనను తాను యెహోవా దేవునికిపైగా హెచ్చించుకోవాలని వాంఛిస్తాడు. బబులోను రాజుకు, అతడు లోబరచుకున్న ప్రజలకు జరిగినట్లుగానే, సాతాను అపరిశుద్ధమైన అధికారదాహం మానవజాతికంతటికీ దుఃఖకరమైన పరిస్థితికి, బాధకు కారణమైంది.

30. బైబిలులో ప్రస్తావించబడిన మరో బబులోను ఏది?

30 అంతేగాక, ప్రకటన గ్రంథంలో, మనం మరో బబులోను గురించి అంటే “మహా బబులోను” గురించి చదువుతాము. (ప్రకటన 18:2) ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమనే ఈ సంస్థ కూడా గర్వంతో కూడిన, అణచివేసే, క్రూరమైన స్ఫూర్తిని చూపించింది. ఫలితంగా, అది కూడా “యెహోవా దినము”ను ఎదుర్కోవాల్సి ఉంది, దేవుని నిర్ణీత కాలంలో అది నాశనం చేయబడుతుంది. (యెషయా 13:6) “మహాబబులోను కూలిపోయెను” అనే సందేశం 1919 నుండీ భూవ్యాప్తంగా ప్రకటించబడుతోంది. (ప్రకటన 14:8) అది తాను దేవుని ప్రజలను చెరలో బంధించి ఉంచలేకపోయినప్పుడు, కూలిపోయింది. త్వరలోనే అది సంపూర్ణంగా నాశనం చేయబడుతుంది. ప్రాచీన బబులోనుకు సంబంధించి యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “అది యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధునిమీద గర్వపడినది. . . . దాని క్రియలనుబట్టి దానికి ప్రతికారము చేయుడి. అది చేసిన పనియంతటినిబట్టి దానికి ప్రతికారము చేయుడి.” (యిర్మీయా 50:29; యాకోబు 2:​13) మహా బబులోను కూడా అలాంటి తీర్పునే పొందుతుంది.

31. మహా బబులోనుకు త్వరలోనే ఏమి సంభవిస్తుంది?

31 కాబట్టి, యెషయా గ్రంథంలోవున్న ఈ ప్రవచనంలోని, యెహోవా చేసిన చివరి వ్యాఖ్యానం ప్రాచీన బబులోనుకే కాదు మహా బబులోనుకు కూడా వర్తిస్తుంది: “నేను వారిమీదికి లేచి బబులోనునుండి నామమును శేషమును కుమారుని మనుమని కొట్టి వేసెద[ను] . . . నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయుదును. నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను.” (యెషయా 14:​22, 23) ప్రాచీన బబులోను యొక్క నిర్జనమైన శిథిలాలు, త్వరలోనే యెహోవా మహా బబులోనుకు ఏమి చేస్తాడో చూపిస్తాయి. సత్యారాధనను ప్రేమించేవారికి ఎంతటి ఓదార్పు! సాతాను లక్షణాలైన గర్వం, అహంకారం, లేక క్రూరత్వం మనలో వృద్ధికావడానికి అనుమతించకుండా ఉండేందుకు తీవ్రంగా కృషి చేయడానికి ఎంతటి ప్రోత్సాహమో కదా!

[అధస్సూచీలు]

^ యెషయా కేవలం మాదీయుల పేరును మాత్రమే ప్రస్తావిస్తున్నాడు, కానీ మాద్య, పారసీక, ఏలాము, మరితర చిన్న రాజ్యాలు వంటి అనేక రాజ్యాలు బబులోనుకు వ్యతిరేకంగా మిత్రపక్షాలుగా ఏర్పడతాయి. (యిర్మీయా 50:9; 51:​24, 27, 28) చుట్టుప్రక్కలనున్న రాజ్యాలు, మాదీయులను, పారసీకులను ఇరువురినీ ‘మాదీయులుగానే’ ప్రస్తావిస్తాయి. అంతేగాక, యెషయా కాలంలో మాద్యదేశము ప్రబలమైన ఆధిపత్యంగా ఉంది. కేవలం కోరేషు పరిపాలనలోనే పారసీక రాజ్యం ప్రబలమయ్యింది.

^ అయితే మాదీయులు, పారసీకులు ఆ తర్వాత విలాసాల పట్ల ఎంతో మక్కువను పెంచుకున్నట్లు అనిపిస్తుంది.​—⁠ఎస్తేరు 1:1-7.

^ ఉదాహరణకు, దానియేలు మాదీయుల పారసీకుల క్రింద బబులోనులో ఉన్నత అధికారిగా నియమించబడ్డాడు. దాదాపు 60 సంవత్సరాల తర్వాత, ఎస్తేరు పారసీక రాజైన అహష్వేరోషు భార్యగా రాణి అయ్యింది, మొర్దెకై మొత్తం పారసీక సామ్రాజ్యానికి ప్రధాన మంత్రి అయ్యాడు.

[అధ్యయన ప్రశ్నలు]

[178 వ పేజీలోని చిత్రం]

కూలిపోయిన బబులోను ఎడారి ప్రాణులకు నివాసస్థలం అవుతుంది

[186 వ పేజీలోని చిత్రాలు]

ప్రాచీన బబులోనులా, మహా బబులోను కూడా శిథిలాల కుప్పగా మిగులుతుంది