కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అహంకారులను యెహోవా సిగ్గుపరుస్తాడు

అహంకారులను యెహోవా సిగ్గుపరుస్తాడు

ఐదవ అధ్యాయం

అహంకారులను యెహోవా సిగ్గుపరుస్తాడు

యెషయా 2:​6–4:1

1, 2. యెషయా తన కాలంనాటి యూదులకిచ్చిన ప్రవచనార్థక సందేశం మనకెందుకు ఆసక్తికరమైనది?

 యూదా యెరూషలేముల పరిస్థితిని బట్టి ఏవగింపు కలిగిన యెషయా ప్రవక్త యెహోవా దేవుని వైపు తిరిగి ఇలా ప్రకటిస్తున్నాడు: ‘యాకోబు వంశమును నీవు విసర్జించి యున్నావు.’ (యెషయా 2:6) దేవుడు తన ‘స్వకీయజనముగా’ తానే స్వయంగా ఎంపిక చేసుకున్న ప్రజలను తిరస్కరించేందుకు ఆయనను ఏమి పురికొల్పింది?​—⁠ద్వితీయోపదేశకాండము 14:2.

2 యెషయా తన కాలంనాటి యూదులపై నిందారోపణ చేయడం మనకు ఎంతో ఆసక్తికరమైన విషయం. ఎందుకు? ఎందుకంటే నేడు క్రైస్తవమత సామ్రాజ్య పరిస్థితి కూడా యెషయా కాలంనాటి ప్రజల పరిస్థితి వలెనే ఉంది, అలాగే ఈ రెండింటిపై యెహోవా తీర్పు కూడా సారూప్యత కలిగివుంది. యెషయా ప్రకటనలను శ్రద్ధగా పరిశీలించడం దేవుడు ఖండించేవాటి గురించి మనకు స్పష్టమైన అవగాహననిస్తుంది, ఆయన అంగీకారంలేని ఆచారాలను విడిచిపెట్టడానికి మనకు సహాయం లభిస్తుంది. కాబట్టి, యెషయా 2:​6–4:1 వచనాల్లో వ్రాయబడిన యెహోవా ప్రవచనార్థక వాక్యాన్ని అత్యంతాసక్తితో పరిశీలిద్దాం.

వాళ్లు గర్వముతో నమస్కారము చేస్తారు

3. యెషయా తన ప్రజలు చేసిన ఏ తప్పిదమును ఒప్పుకుంటున్నాడు?

3 తన ప్రజల తప్పిదాన్ని ఒప్పుకుంటూ యెషయా ఇలా చెబుతున్నాడు: “ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు, వారు ఫిలిష్తీయులవలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు.” (యెషయా 2:6) దాదాపు 800 సంవత్సరాల పూర్వం, యెహోవా తాను ఎంపిక చేసుకున్న ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు: “వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి.” (లేవీయకాండము 18:​24) తన ప్రత్యేక సంపాద్యముగా ఉండడానికి ఆయన ఎంపిక చేసుకున్న వారి గురించి, ఇలా చెప్పడానికి యెహోవా బిలామును బలవంతపెట్టాడు: ‘మెట్టల శిఖరమునుండి వారిని చూస్తున్నాను, కొండలనుండి వారిని కనుగొంటున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు.’ (సంఖ్యాకాండము 23:​9, 12) అయినప్పటికీ, యెహోవా ఎంపిక చేసుకున్న ప్రజలు యెషయా కాలానికల్లా తమ చుట్టుపక్కలనున్న జనాంగాల హేయమైన ఆచారాలను స్వీకరించి, “తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు.” యెహోవాయందు ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచే బదులు, వారు “ఫిలిష్తీయులవలె మంత్ర ప్రయోగము” చేస్తున్నారు. అన్యజనాంగాల నుండి వేరుగా ఉండే బదులు, ఆ దేశం “అన్యులతో” నిండిపోతుంది. నిస్సందేహంగా ఈ అన్యులు దేవుని ప్రజలకు దైవభక్తిలేని ఆచారాలను పరిచయం చేస్తారు.

4. సంపదలూ, సైనిక శక్తీ యూదులు యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేసేలా చేయడానికి బదులు అవి వారిపై ఎలాంటి ప్రభావం చూపాయి?

4 ఉజ్జియా రాజు పరిపాలన క్రింద యూదా అనుభవిస్తున్న ప్రస్తుత ఆర్థిక సమృద్ధినీ, దానికున్న సైనిక శక్తినీ పేర్కొంటూ యెషయా ఇలా తెలియజేస్తున్నాడు: “వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది, వారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు. వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది, వారి రథములకు మితిలేదు.” (యెషయా 2:7) అలాంటి సంపదలనూ, సైనికశక్తినీ బట్టి ప్రజలు యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తారా? (2 దినవృత్తాంతములు 26:​1, 6-15) ఎంతమాత్రం తెలియజేయరు! వారు ఆ సంపదకు మూలమైన యెహోవా దేవుని నుండి వైదొలగిపోయి ఆ సంపదపైనే తమ నమ్మకాన్ని పెడతారు. ఫలితం? “వారి దేశము విగ్రహములతో నిండియున్నది. వారు తమ చేతిపనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. అల్పులు అణగద్రొక్కబడుదురు, ఘనులు తగ్గింపబడుదురు, కాబట్టి వారిని క్షమింపకుము.” (యెషయా 2:​8, 9) వారు సజీవుడైన దేవుని నుండి తమ ముఖములు త్రిప్పుకుని, నిర్జీవమైన విగ్రహములకు నమస్కరిస్తారు.

5. విగ్రహాలకు నమస్కారం చేయడం వినయపూర్వకమైన చర్య ఎందుకు కాదు?

5 నమస్కరించడం వినయానికి సూచన. కానీ నిర్జీవమైన వాటికి నమస్కరించడం వ్యర్థం, అది విగ్రహారాధకుడిని ‘తగ్గిస్తుంది,’ దిగజారుస్తుంది. అలాంటి పాపాన్ని యెహోవా ఎలా క్షమించగలడు? యెహోవా వారిని లెక్క అప్పజెప్పడానికి పిలిచినప్పుడు ఈ విగ్రహారాధకులు ఏమి చేస్తారు?

“అహంకారదృష్టి తగ్గింపబడును”

6, 7. (ఎ) యెహోవా తీర్పు దినాన అహంకారులకు ఏమి జరుగుతుంది? (బి) యెహోవా తన ఆగ్రహాన్ని దేనిపైన, ఎవరిపైన వ్యక్తపరుస్తాడు, ఎందుకు?

6 యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము.” (యెషయా 2:​10) కానీ సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి వారిని కాపాడగలిగేంత పెద్ద బండ ఏదీ లేదు, వారిని మరుగు చేసేంత మందమైన ఏ అచ్ఛాదనమూ లేదు. ఆయన తన తీర్పును అమలు చేయడానికి వచ్చినప్పుడు, “నరుల అహంకారదృష్టి తగ్గింపబడును, మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును; ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.”​—యెషయా 2:11.

7 ‘సైన్యములకధిపతియగు యెహోవా నియమించిన దినము’ వస్తోంది. అది, “ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సిందూర వృక్షములకన్నిటికిని; ఉన్నతపర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని ఉన్నతమైన ప్రతిగోపురమునకును; బురుజులుగల ప్రతికోటకును; తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికిని” దేవుడు తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచే సమయంగా ఉంటుంది. (యెషయా 2:​12-16) అవును, యెహోవా ఉగ్రత దినాన, మానవుడు తన గర్వానికి ప్రతీకగా నెలకొల్పుకొన్న ప్రతి సంస్థకు, దైవభక్తిలేని ప్రతి వ్యక్తికి అవధానం ఇవ్వబడుతుంది. కాబట్టి, “నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుష్యుల గర్వము తగ్గింపబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.”​—యెషయా 2:17.

8. ప్రవచింపబడిన తీర్పుదినం సా.శ.పూ. 607 లో యెరూషలేముపైకి ఎలా వస్తుంది?

8 బబులోను రాజు నెబుకద్నెజరు సా.శ.పూ. 607 లో యెరూషలేమును నాశనం చేసినప్పుడు, ప్రవచింపబడిన ఆ తీర్పు దినం యూదులపైకి వస్తుంది. దాని నివాసులు తమ ప్రియమైన నగరం దగ్ధమైపోవడాన్నీ, దాని దివ్యమైన భవనాలు కూలిపోవడాన్నీ, దాని దృఢమైన గోడ నలుగగొట్టబడడాన్నీ చూస్తారు. యెహోవా ఆలయం రాళ్లకుప్పగా మారుతుంది. ‘సైన్యములకధిపతియగు యెహోవా దినమున’ వారి సంపదలుగానీ, వారి రథములుగానీ ఎందుకూ పనికిరావు. మరి వారి విగ్రహాలు? సరిగ్గా యెషయా ప్రవచించినట్లుగానే “విగ్రహములు బొత్తిగా నశించిపోవును.” (యెషయా 2:​18) రాజకుమారులూ, బలాఢ్యులతోసహా యూదులందరూ బబులోనుకు చెరగా తీసుకొనిపోబడతారు. యెరూషలేము 70 సంవత్సరాలపాటు నిర్జన ప్రదేశమవుతుంది.

9. క్రైస్తవమత సామ్రాజ్య పరిస్థితి యెషయా కాలంలో యూదా యెరూషలేముల పరిస్థితితో ఏవిధంగా సారూప్యత కలిగివుంది?

9 యెషయా కాలంలో యూదా యెరూషలేముల పరిస్థితికీ క్రైస్తవమత సామ్రాజ్య పరిస్థితికీ ఎంత సారూప్యం ఉందోకదా! క్రైస్తవమత సామ్రాజ్యం నిశ్చయంగా ఈ లోక రాజ్యాలతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుంది. అది ఐక్యరాజ్య సమితికి ఉత్సాహంగా మద్దతునిస్తూ, తన ఇంటిని విగ్రహాలతోనూ, లేఖన విరుద్ధ ఆచారాలతోనూ నింపుకుంది. దాని అనుచరులు వస్తుసంబంధమైన ఆసక్తిగలవారు, వారు సైనిక శక్తిలో తమ నమ్మకాన్ని ఉంచుతారు. వారు తమ మతనాయకులకు బిరుదులు, సన్మానాలు కట్టబెడుతూ వారెంతో ప్రత్యేకమైనవారన్నట్లు దృష్టించడం లేదా? క్రైస్తవమత సామ్రాజ్యపు అహంకారం తప్పకుండా అణిచివేయబడుతుంది. కానీ ఎప్పుడు?

త్వరలో రానున్న ‘యెహోవా దినము’

10. అపొస్తలులైన పౌలు పేతురులు ఏ ‘యెహోవా దినమును’ సూచించారు?

10 ప్రాచీన యూదా యెరూషలేములపైకి వచ్చిన తీర్పు దినము కంటే ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత గల ‘యెహోవా దినము’ గురించి లేఖనాలు తెలియజేస్తున్నాయి. అపొస్తలుడైన పౌలు ప్రేరేపించబడినవాడై, రానున్న ‘యెహోవా దినమును’ సింహాసనాసీనుడైన రాజగు యేసుక్రీస్తు ప్రత్యక్షతతో జతచేశాడు. (2 థెస్సలొనీకయులు 2:​1, 2) పేతురు ఆ దినము గురించి, ‘నీతి నివసించే క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమిల’ స్థాపన సంబంధంగా మాట్లాడాడు. (2 పేతురు 3:​10-13) అది, క్రైస్తవమత సామ్రాజ్యంతో సహా మొత్తం దుష్టవిధానమంతటిపై యెహోవా తన తీర్పును అమలుచేసే దినము.

11. (ఎ) రానున్న ‘యెహోవా దినమును’ ఎవరు ‘తాళుకోగలుగుతారు’? (బి) మనం యెహోవాను మన ఆశ్రయంగా ఎలా చేసుకోగలము?

11 ప్రవక్తయైన యోవేలు ఇలా చెబుతున్నాడు: “ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.” ఆ “దినము” త్వరలో రాబోతోంది కాబట్టి, ఆ భీతిగొలిపే సమయంలో భద్రత గురించి ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగివుండవద్దా? “దానికి తాళగలవాడెవడు?” అని యోవేలు అడుగుతున్నాడు. “యెహోవా తన జనులకు ఆశ్రయమగును” అని ఆయనే సమాధానమిస్తున్నాడు. (యోవేలు 1:​15; 2:​11; 3:​16) అహంకార దృక్పథం కలిగి, ధనసంపదల్లోనూ, సైనిక శక్తిలోనూ, మానవనిర్మిత దేవుళ్లలోనూ నమ్మకం ఉంచేవారికి యెహోవా ఆశ్రయంగా ఉంటాడా? అసాధ్యం! ఈ విధంగా ప్రవర్తించినప్పుడు దేవుడు తాను ఎంపిక చేసుకున్న ప్రజలను సహితం విడిచిపెట్టాడు. కాబట్టి దేవుని సేవకులందరూ ‘వినయముగలవారై నీతిని అనుసరిస్తూ’ యెహోవా ఆరాధనకు తమ జీవితాల్లో తాము ఇస్తున్న స్థానాన్ని గంభీరంగా పరిశీలించుకోవడం ఎంత ప్రాముఖ్యమో కదా!​—⁠జెఫన్యా 2:2, 3.

“ఎలుకలకును గబ్బిలములకును”

12, 13. యెహోవా దినమున, విగ్రహారాధకులు తమ దేవుళ్లను “ఎలుకలకును గబ్బిలములకును” పారవేయడం ఎందుకు తగినది?

12 యెహోవా మహా దినమున విగ్రహారాధకులు తమ విగ్రహాలను ఎలా దృష్టిస్తారు? యెషయా ఇలా సమాధానమిస్తున్నాడు: “యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేలబొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు . . . వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?”​—యెషయా 2:19-22.

13 ఎలుకలు నేల బొరియలలోనూ, గబ్బిలములు చీకటిగా ఉండే నిర్జన గుహల్లోనూ నివసిస్తాయి. అంతేగాక, గబ్బిలములు పెద్ద సంఖ్యలో ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రదేశమంతా అసహ్యమైన దుర్వాసనతోనూ వాటి పెంటతోనూ నిండిపోతుంది. విగ్రహాలను అలాంటి స్థలాల్లో పడేయడం తగినది. చీకటిగల, అపరిశుభ్రమైన ప్రదేశాలే వాటికి తగిన స్థలాలు. ఇక ప్రజల విషయానికి వస్తే, వాళ్లు యెహోవా తీర్పు దినమున కొండ గుహలలోనూ, బండబీటలలోనూ ఆశ్రయం కోసం చూస్తారు. కాబట్టి విగ్రహాలకూ, వాటి ఆరాధకులకూ ఒకే గతి పడుతుంది. యెషయా ప్రవచనం చెప్పినట్లుగా, నిర్జీవమైన విగ్రహాలు సా.శ.పూ. 607 లో నెబుకద్నెజరు చేతుల్లో నుండి తమ ఆరాధకులనుగానీ, యెరూషలేమునుగానీ కాపాడలేకపోయాయి.

14. ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యంపైకి రానున్న యెహోవా తీర్పుదిన సమయంలో, లోకసంబంధమైన వ్యక్తులు ఏమి చేస్తారు?

14 క్రైస్తవమత సామ్రాజ్యంపైకి, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యంలోని ఇతర విభాగాలపైకి రాబోయే యెహోవా తీర్పుదినమున ప్రజలేమి చేస్తారు? భూవ్యాప్తంగా క్షీణించిపోతున్న పరిస్థితులతో, అనేకులు తమ విగ్రహాలు విలువలేనివని గ్రహిస్తుండవచ్చు. వాళ్లు ఈ విగ్రహాలకు బదులుగా, ప్రకటన గ్రంథం 17 వ అధ్యాయంలో “ఎఱ్ఱని మృగము” అని చెప్పబడిన ఐక్యరాజ్య సమితితో సహా ఆధ్యాత్మికేతర భూసంస్థలలో ఆశ్రయాన్ని, కాపుదలను పొందడానికి ప్రయత్నిస్తుండవచ్చు. ఆ సూచనార్థక మృగము యొక్క ‘పది కొమ్ములే’ ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహా బబులోనును నాశనం చేస్తాయి, దానిలో క్రైస్తవమత సామ్రాజ్యం ఒక ప్రధాన భాగముగా ఉంది.​—⁠ప్రకటన 17:3, 8-12, 16, 17.

15. యెహోవా తీర్పు దినమున యెహోవా మాత్రమే ఎలా “ఘనత వహించును”?

15 మహా బబులోనును నాశనం చేయడమూ, కాల్చివేయడమూ ఆ సూచనార్థక పది కొమ్ముల పనే అయినప్పటికీ, వాస్తవానికి అది యెహోవా ఇచ్చిన తీర్పును అమలు చేయడమే అవుతుంది. మహా బబులోను గురించి ప్రకటన 18:8 ఇలా చెబుతోంది: “అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పుతీర్చుచున్నది దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును.” కాబట్టి మానవజాతిని అబద్ధమత ఆధిపత్యం నుండి విడుదల చేసిన ఘనత సర్వశక్తిమంతుడైన యెహోవా దేవునికే చెందుతుంది. యెషయా చెబుతున్నట్లుగా, “ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును,” ఎందుకంటే అలాంటి “దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు.”​—⁠యెషయా 2:11బి, 12.

‘నాయకులు మిమ్మును త్రోవతప్పిస్తున్నారు’

16. (ఎ) మానవ సమాజ “పోషణమును పోషణాధారమును” వేటితో ఏర్పడతాయి? (బి) తమ సమాజ “పోషణమును పోషణాధారమును” నిర్మూలించబడటంతో యెషయా ప్రజలు ఎలా బాధింపబడతారు?

16 మానవ సమాజం సుస్థిరంగా ఉండాలంటే, ఆహారపానీయాలేగాక, అంతకంటే ముఖ్యంగా ప్రజలకు నడిపింపునిస్తూ సమాజ సామరస్యాన్ని కాపాడే నమ్మకమైన నాయకుల వంటి “పోషణమును పోషణాధారమును” ఎంతో అవసరం. అయితే ప్రాచీన ఇశ్రాయేలు గురించి యెషయా ఇలా ప్రవచిస్తున్నాడు: “ఆలకించుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదెకాండ్రను పెద్దలను పంచాదశాధిపతులను ఘనత వహించినవారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగినవారిని మాంత్రికులను యెరూషలేములోనుండియు యూదాదేశములో నుండియు తీసివేయును.” (యెషయా 3:​1-3) బాలురు అధిపతులై చపలచిత్తంగా పరిపాలిస్తారు. ఆ పరిపాలకులు ప్రజలను అణిచివేయడమే గాక, “ప్రజలలో . . . ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును.” (యెషయా 3:​4, 5) పిల్లలు పెద్దవారిని గౌరవించకుండా ‘గర్వించి తిరస్కారముగా నడుచుకుంటారు.’ జీవన పరిస్థితి ఎంతగా దిగజారిపోయి ఉంటుందంటే, పరిపాలించే అర్హత ఏమాత్రంలేని ఒకనితో మరొకడు: “నీకు వస్త్రము కలదు నీవు మామీద అధిపతివై యుందువు. ఈ పాడుస్థలము నీ వశముండనిమ్మనును.” (యెషయా 3:6) కానీ అలా ఆహ్వానింపబడినవారు, పాడైపోయిన దేశాన్ని బాగుచేసే సామర్థ్యం గానీ, బాధ్యతను చేపట్టేంత ధనంగానీ తమ వద్ద లేవని చెబుతూ నిరాకరిస్తారు. వారు, “నేను సంరక్షణ కర్తనుగా ఉండనొల్లను నాయింట ఆహారమేమియు లేదు వస్త్రమేమియు లేదు నన్ను జనాధిపతిగా నియమింపరాదనును.”​—యెషయా 3:7.

17. (ఎ) యూదా యెరూషలేముల పాపం ఏ భావంలో “సొదొమవారివలె” ఉంది? (బి) తన ప్రజల పరిస్థితికి యెషయా ఎవరిని నిందిస్తున్నాడు?

17 యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమాయెను, యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలును క్రియలును ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. వారి ముఖలక్షణమే వారిమీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగుచేయక సొదొమవారివలె దాని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడుచేసికొని యున్నారు, వారికి శ్రమ!” (యెషయా 3:​8, 9) దేవుని ప్రజలు సత్య దేవునికి వ్యతిరేకంగా తమ మాటల ద్వారా, క్రియల ద్వారా తిరుగుబాటు చేశారు. వారి ముఖాలపైనున్న సిగ్గుమాలిన, పశ్చాత్తాపంలేని భావాలు, సొదొమ పాపాలంత అసహ్యమైన వారి పాపాలను బయల్పరుస్తాయి. వారికి యెహోవా దేవునితో ఒక నిబంధన ఉన్నప్పటికీ, ఆయన వారి కోసం తన ప్రమాణాలను మార్చుకోడు. “మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. నా ప్రజల విషయమై నేనేమందును? బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు, వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు.”​—యెషయా 3:10-12.

18. (ఎ) యెషయా కాలంనాటి పెద్దలపై, అధిపతులపై యెహోవా ఏ తీర్పును ప్రకటించాడు? (బి) పెద్దలకూ, అధిపతులకూ యెహోవా తీర్చిన తీర్పు నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

18 యెహోవా యూదాలోని పెద్దలతోనూ అధిపతులతోనూ ‘వాదిస్తాడు,’ ‘విమర్శిస్తాడు’: “మీరే ద్రాక్షలతోటను తినివేసితిరి. మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ యిండ్లలోనే యున్నది. నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు?” (యెషయా 3:​13-15) నాయకులు ప్రజల క్షేమం కోసం పనిచేసే బదులు మోసకరమైన కార్యాల్లో నిమగ్నమౌతారు. తమను తాము సంపన్నులను చేసుకుంటూ, పేదలకూ అవసరంలో ఉన్నవారికీ ఏమీ ఇవ్వకుండా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. కానీ అలా దీనులను అణచివేసినందుకు ఈ నాయకులు సైన్యములకధిపతియగు యెహోవాకు జవాబు చెప్పాల్సి ఉంది. నేడు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారికి ఇది ఎంతటి హెచ్చరికనో కదా! వారు తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఎల్లప్పుడూ జాగ్రత్తపడుదురు గాక.

19. క్రైస్తవమత సామ్రాజ్యం ఏ అణచివేతకు, హింసకు బాధ్యురాలు?

19 క్రైస్తవమత సామ్రాజ్యం​—⁠ప్రాముఖ్యంగా దాని మతనాయకులు, దానిలోని ప్రముఖులైనవారు​—⁠తాను అణచివేసిన, ఇప్పటికీ అణచివేస్తున్న సామాన్య ప్రజలకు చెందవలసినదాన్ని మోసపూరితంగా చేజిక్కించుకుంది. అది దేవుని ప్రజలను కొట్టి, హింసించి, వారిపట్ల క్రూరంగా వ్యవహరించి, యెహోవా నామంపైకి గొప్ప అపనిందను తెచ్చింది. యెహోవా తగిన సమయంలో తప్పకుండా దానికి తీర్పుతీరుస్తాడు.

“అందమునకు ప్రతిగా వాత”

20. యెహోవా “సీయోను కుమార్తె”లను ఎందుకు నిందిస్తున్నాడు?

20 నాయకులు చేసిన తప్పిదములను నిందించిన తర్వాత, యెహోవా తన అవధానాన్ని సీయోను లేదా యెరూషలేము స్త్రీలవైపుకు మరలుస్తున్నాడు. బహుశా సొగసు కోసం, “సీయోను కుమార్తెలు” శ్రావ్యమైన శబ్దాన్ని చేసే “కాళ్ల గొలుసులను” తమ కాళ్లకు పెట్టుకుంటారు. ఆ స్త్రీలు చిన్న చిన్న అడుగులు వేస్తూ “కులుకుతో నడచుచు” వయ్యారమైన నడకను అలవర్చుకోవాలనుకుంటారు. అయితే దాంట్లో తప్పేమైనావుందా? తప్పు ఈ స్త్రీల దృక్పథంలో ఉంది. యెహోవా ఇలా చెబుతున్నాడు: ‘సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచున్నారు.’ (యెషయా 3:​16) అలాంటి గర్వం శిక్షను తప్పించుకోలేదు.

21. యెహోవా యెరూషలేముకు తీర్చే తీర్పు యూదా స్త్రీలను ఎలా ప్రభావితం చేస్తుంది?

21 కాబట్టి, యెహోవా తీర్పు ఆ దేశంపైకి వచ్చినప్పుడు, గర్విష్ఠురాండ్రైన ఈ “సీయోను కుమార్తె”లు తాము ఏ అందాన్ని బట్టి గర్విస్తున్నారో ఆ అందంతో సహా సమస్తాన్ని కోల్పోతారు. యెహోవా ఇలా ప్రవచిస్తున్నాడు: “కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడిచేయును యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను కర్ణభూషణములను కడియములను నాణెమైన ముసుకులను కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణెలను రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును.” (యెషయా 3:​17-23) ఎంత విషాదకరమైన మార్పు!

22. యెరూషలేము స్త్రీలు తమ ఆభరణములనే గాక ఇంకా దేన్ని కోల్పోతారు?

22 ప్రవచనార్థక సందేశం ఇలా కొనసాగుతుంది: “అప్పుడు పరిమళద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును; నడికట్టుకు ప్రతిగా త్రాడును; అల్లిన జడకు ప్రతిగా బోడితలయు; ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు; అందమునకు ప్రతిగా వాతయును ఉండును.” (యెషయా 3:​24) సా.శ.పూ. 607 లో, గర్విష్ఠురాండ్రైన యెరూషలేము స్త్రీలు సంపన్నస్థితి నుండి పేదరికానికి పడిపోతారు. వారు తమ స్వేచ్ఛను కోల్పోయి, దాసత్వపు “వాత”ను పొందుతారు.

‘ఆమె ఏమియు లేనిదౌతుంది’

23. యెరూషలేము గురించి యెహోవా ఏమి ప్రకటించాడు?

23 ఇప్పుడు యెరూషలేము నగరంతో మాట్లాడుతూ, యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమియు లేనిదై, నేల కూర్చుండును.” (యెషయా 3:​25, 26) దాని బలవంతులతో సహా యెరూషలేము పురుషులందరు యుద్ధంలో వధించబడతారు. పట్టణం నేలమట్టమవుతుంది. దాని “పట్టణపు గుమ్మముల”కు అది “బాధపడి దుఃఖించు” సమయమై ఉంటుంది. యెరూషలేము “ఏమియు లేనిదై” నిర్జనంగా విడువబడుతుంది.

24. పురుషులు ఖడ్గముచే కూలడం వల్ల యెరూషలేము స్త్రీలకు ఏ ఘోరమైన పర్యవసానాలు కలుగుతాయి?

24 పురుషులు ఖడ్గముచే కూలడం వల్ల యెరూషలేము స్త్రీలకు ఘోరమైన పర్యవసానాలు కలుగుతాయి. తన ప్రవచన పుస్తకంలోని ఈ భాగాన్ని ముగిస్తూ, యెషయా ఇలా ప్రవచిస్తున్నాడు: “ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని​—⁠మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయుమని చెప్పుదురు.” (యెషయా 4:1) వివాహం చేసుకోగల పురుషుల కొరత ఎంతగా ఉంటుందంటే, ఒక పురుషుని పేరు మీదుగా పిలువబడేందుకు అంటే బహిరంగంగా ఆయన భార్యలుగా గుర్తింపబడి, భర్తలేనిదన్న నిందను తప్పించుకునేందుకు చాలామంది స్త్రీలు ఒకే పురుషుడిని అంటిపెట్టుకుని ఉంటారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం భర్త తన భార్యకు ఆహారము, వస్త్రములు ఇవ్వాలి. (నిర్గమకాండము 21:​10) అయితే, ఈ స్త్రీలు ‘తమ అన్నమే తినడానికీ, తమ వస్త్రములనే కట్టుకోవడానికీ’ అంగీకరిస్తూ ఆ పురుషుడ్ని చట్టబద్ధమైన బాధ్యతల నుండి విముక్తుడిని చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు గర్విష్ఠురాండ్రైన “సీయోను కుమార్తె”లకు ఎంతటి దుఃస్థితి!

25. అహంకారులకు త్వరలోనే ఏమి జరుగబోతోంది?

25 అహంకారులను యెహోవా సిగ్గుపరుస్తాడు. ఆయన తాను ఎంపిక చేసుకున్న ప్రజల అహంకారం సా.శ.పూ. 607 లో, ‘అణగద్రొక్కబడేలా’ వారి “గర్వము” ‘తగ్గింపబడేలా’ చేశాడు, “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును” అని నిజ క్రైస్తవులు ఎన్నడూ మరువకుందురు గాక!​—⁠యాకోబు 4:6.

[అధ్యయన ప్రశ్నలు]

[50 వ పేజీలోని చిత్రం]

యెహోవా తీర్పు దినమున విగ్రహాలు, ధనసంపదలు, సైనిక శక్తులు యెరూషలేమును కాపాడలేవు

[55 వ పేజీలోని చిత్రం]

“యెహోవా దినమున” ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం నాశనం చేయబడుతుంది