ఆధునిక సందేశంతో ఒక ప్రాచీన ప్రవక్త
మొదటి అధ్యాయం
ఆధునిక సందేశంతో ఒక ప్రాచీన ప్రవక్త
1, 2. (ఎ) నేడు మనం ప్రపంచంలో ఎలాంటి విచారకరమైన పరిస్థితులను చూస్తున్నాము? (బి) సమాజం దిగజారిపోవడం గురించి అమెరికా సెనేట్ సభ్యుడు తన ఆందోళనను ఎలా వ్యక్తంచేశాడు?
మానవజాతి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించాలని నేడు ఎవరు మాత్రం ఆకాంక్షించరు? అయినా, ఎంత తరచుగా మన ఆకాంక్షలు నెరవేరకుండానే పోతున్నాయి! మనం సమాధానం కోసం కలలు కంటాం గానీ యుద్ధం మనల్ని పట్టిపీడిస్తోంది. శాంతిభద్రతలు నెలకొనాలని ఆశిస్తాం గాని దొంగతనాల, మానభంగాల, హత్యల ఎగసిపడుతున్న కెరటాన్ని ఎంతమాత్రం ఆపలేకపోతున్నాం. మన పొరుగువారిని నమ్మాలనే అనుకుంటాం గానీ భద్రత కోసం మన ఇండ్లకు తాళాలు వేసుకోక తప్పడం లేదు. మన పిల్లల్ని ప్రేమించి వారిలో సద్గుణాలను పెంపొందింపజేయడానికి ప్రయత్నిస్తాం, అయినా తరచుగా వాళ్లు తమ తోటివారి హానికరమైన ఒత్తిడికి లొంగిపోవడాన్ని నిస్సహాయంగా చూస్తుండిపోతాం.
2 మానవుని స్వల్పకాల జీవితం ‘మిక్కిలి బాధాకరమైనదని’ చెప్పిన యోబుతో మనం తప్పక ఏకీభవిస్తాం. (యోబు 14:1) ప్రాముఖ్యంగా నేడు పరిస్థితి అలాగే ఉన్నట్లు అనిపిస్తోంది, ఎందుకంటే సమాజం మునుపెన్నడూ ఎరుగని అధమస్థితికి దిగజారిపోతోంది. అమెరికా సెనేట్ సభ్యుడు ఒకాయన ఇలా పేర్కొన్నాడు: “ప్రచ్ఛన్న యుద్ధమైతే ముగిసింది కానీ విచారకరమైన విషయమేమిటంటే, ప్రపంచం ఇప్పుడు జాతి, వర్గ, మత విద్వేషాలకూ అమానుషత్వానికీ స్థావరంగా తయారైంది. మన యువత గందరగోళంలో పడిపోయి, నిరుత్సాహం చెంది, సమస్యల్లో లోతుగా కూరుకుపోయేంతగా మనం మన నైతిక విలువలను దిగజారగొట్టాం. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, విడాకులు, పిల్లలపై అత్యాచారం, చిన్నవయస్సులో గర్భధారణ, చదువు మానేయడం, చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలు, దౌర్జన్యంతో నిండిన వీధుల వంటివాటి ప్రతిఫలాలను కోస్తున్నాము. ప్రస్తుత పరిస్థితి, ప్రచ్ఛన్న యుద్ధమనే గొప్ప భూకంపాన్ని తట్టుకుని నిలిచిన మన ఇంటిని ఇప్పుడు చెదలు తినేస్తున్నట్లుగా ఉంది.”
3. ఏ బైబిలు పుస్తకం ప్రాముఖ్యంగా భవిష్యత్తును గురించిన నిరీక్షణనిస్తుంది?
3 అయితే, మనకు నిరీక్షణ లేకపోలేదు. మన కాలానికి ప్రత్యేక భావంగల ప్రవచనాల పరంపరను తెలియజేసేందుకు దేవుడు దాదాపు 2,700 సంవత్సరాల క్రితం మధ్యప్రాచ్యానికి చెందిన ఒక వ్యక్తిని ప్రేరేపించాడు. ఆయన పేరు యెషయా, ఆ ప్రవక్త పేరుతోనే ఉన్న బైబిలు పుస్తకంలో ఆ సందేశాలు వ్రాయబడ్డాయి. యెషయా ఎవరు, దాదాపు మూడు సహస్రాబ్దాల క్రితం ఆయన వ్రాసిన ప్రవచనం, నేడు సర్వమానవాళికీ వెలుగు ప్రసాదిస్తుందని ఎందుకు చెప్పవచ్చు?
కల్లోలభరిత కాలాల్లో నీతిమంతుడైన ఒక వ్యక్తి
4. యెషయా ఎవరు, ఆయన ఎప్పుడు యెహోవా ప్రవక్తగా సేవచేశాడు?
4 యెషయా తాను వ్రాసిన గ్రంథంలోని మొదటి వచనంలో, తనను తాను “ఆమోజు కుమారుడ”నని * పరిచయం చేసుకుంటూ, “ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో” తాను దేవుని ప్రవక్తగా సేవచేశానని చెబుతున్నాడు. (యెషయా 1:1) దీన్నిబట్టి యెషయా కనీసం 46 సంవత్సరాలపాటు యూదా జనాంగానికి దేవుని ప్రవక్తగా కొనసాగాడని అర్థమవుతోంది, ఆయనా పనిని బహుశా ఉజ్జియా పరిపాలనాంతంలో అంటే దాదాపు సా.శ.పూ. 778 వ సంవత్సరంలో ప్రారంభించి ఉంటాడు.
5, 6. యెషయా కుటుంబ జీవితానికి సంబంధించి ఏది వాస్తవమై ఉండవచ్చు, ఎందుకు?
5 కొంతమంది ప్రవక్తల గురించి మనకు తెలిసిన దానితో పోల్చిచూస్తే, యెషయా వ్యక్తిగత జీవితం గురించి మనకు తెలిసింది చాలా తక్కువే. ఆయన వివాహితుడనీ, ఆయన తన భార్యను “ప్రవక్త్రి” అని పేర్కొన్నాడనీ మనకు తెలుసు. (యెషయా 8:3) యెషయా వైవాహిక జీవితం, “ఆయన చేస్తున్న పనితో సంగతముగా ఉండడమే గాక, దానితో ఎంతో సన్నిహితంగా కలగలిసిపోయినట్లు” ఈ హోదా సూచిస్తోందని మాక్‌క్లింటాక్ మరియు స్ట్రాంగ్‌ల సైక్లోపీడియా ఆఫ్ బిబ్లికల్, థియోలాజికల్, అండ్ ఎక్లీసియాస్టికల్ లిటరేచర్ తెలియజేస్తోంది. ప్రాచీన ఇశ్రాయేలులోని దైవభక్తిగల కొంతమంది ఇతర స్త్రీలలాగే యెషయా భార్యకు కూడా ప్రవచించే నియామకం ఇవ్వబడి ఉండవచ్చు.—న్యాయాధిపతులు 4:4; 2 రాజులు 22:14.
6 యెషయా దంపతులకు కనీసం ఇద్దరు కుమారులు ఉన్నారు, ఇద్దరికీ ప్రవచనార్థకమైన ప్రాముఖ్యతగల పేర్లు ఇవ్వబడ్డాయి. దుష్టరాజైన ఆహాజుకు దేవుని సందేశాలను తెలియజేయడానికి యెషయా వెళ్లినప్పుడు, యెషయా మొదటి కుమారుడు షెయార్యాషూబు ఆయన వెంటవెళ్లాడు. (యెషయా 7:3) దీన్నిబట్టి యెషయా దంపతులు దేవుని ఆరాధనను తమ కుటుంబ ముఖ్య విషయంగా పరిగణించారని స్పష్టమవుతోంది—నేటి వివాహిత దంపతులకు ఇది ఎంత చక్కని ఉదాహరణ!
7. యెషయా కాలంలో, యూదాలోని పరిస్థితులను వివరించండి.
7 యెషయా, ఆయన కుటుంబమూ యూదా చరిత్రలో అత్యంత కల్లోలభరితమైన కాలంలో జీవించారు. రాజకీయ అస్థిరత సర్వసాధారణమైపోయింది, లంచాలు తీసుకోవడం వల్ల న్యాయస్థానాలు కళంకితమైపోయాయి, వేషధారణ సమాజపు మత వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. కొండశిఖరాలు అబద్ధ దేవుళ్ల బలిపీఠాలతో నిండిపోయాయి. కొంతమంది రాజులు సహితం అన్యమతారాధనకు మద్దతునిచ్చారు. ఉదాహరణకు, ఆహాజు తన ప్రజలు విగ్రహారాధన చేయడాన్ని సహించడమే గాక తానే స్వయంగా విగ్రహారాధన చేస్తూ తన స్వంత కుమారులను, కనానీయుల దేవుడైన మొలెకుకు ఆచారబద్ధమైన బలిగా ‘అగ్ని గుండమును దాటించాడు.’ * (2 రాజులు 16:3, 4; 2 దినవృత్తాంతములు 28:3, 4) ఇదంతా కూడా యెహోవాతో నిబంధనా సంబంధం కలిగివున్న ప్రజల మధ్యన జరిగింది!—నిర్గమకాండము 19:5-8.
8. (ఎ) ఉజ్జియా, యోతాము రాజులు ఏ మాదిరిని ఉంచారు, ప్రజలు వారి మాదిరిని అనుసరించారా? (బి) తిరుగుబాటు చేసే ప్రజల మధ్యన యెషయా ఎలా ధైర్యాన్ని చూపించాడు?
8 కొంతమంది పరిపాలకులతో సహా యెషయా సమకాలీనులు కొందరు సత్యారాధనను పెంపొందింపజేయడానికి ప్రయత్నించారన్నది ప్రశంసనీయం. వారిలో ఉజ్జియా రాజు కూడా ఉన్నాడు, ఆయన “యెహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను.” కానీ, ఆయన పరిపాలనలో ప్రజలు “ఉన్నత స్థలముల యందు . . . బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండిరి.” (2 రాజులు 15:3, 4) యోతాము రాజు కూడా “యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను.” అయితే, “జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి.” (2 దినవృత్తాంతములు 27:2) అవును, యెషయా ప్రవచించిన కాలంలోని అధికభాగంలో, యూదా రాజ్యం ఆధ్యాత్మికంగానూ, నైతికంగానూ చాలా శోచనీయమైన స్థితిలోనే ఉంది. మొత్తానికి, తమ రాజుల నుండి వచ్చిన అనుకూలమైన ప్రభావాలన్నింటినీ ప్రజలు నిర్లక్ష్యం చేశారు. ఈ మొండి ప్రజలకు దేవుని సందేశాలను తెలియజేయడం అంత సులభమైన పనికాదన్నది అర్థం చేసుకోదగిన విషయమే. అయినప్పటికీ, “నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవు[ను]” అని యెహోవా ప్రశ్నించినప్పుడు, యెషయా ఏమాత్రం సంకోచించలేదు. “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు”మని ఆయన సమాధానమిచ్చాడు.—యెషయా 6:8.
ఒక రక్షణ సందేశం
9. యెషయా పేరుకుగల భావమేమిటి, ఇది యెషయా గ్రంథంలోని ఇతివృత్తంతో ఎలాంటి సంబంధాన్ని కలిగివుంది?
9 యెషయా పేరుకు, “యెహోవా ఇచ్చే రక్షణ” అనే భావం ఉంది, ఇదే ఆయన సందేశ ఇతివృత్తమని చెప్పవచ్చు. అయితే, యెషయా ప్రవచనాల్లో కొన్ని తీర్పులకు సంబంధించినవన్నది నిజమే. అయినప్పటికీ, రక్షణ అనే ఇతివృత్తం ప్రముఖంగా కనిపిస్తుంది. బబులోనులో బందీలుగా ఉన్న ఇశ్రాయేలీయులను తగిన సమయంలో విడుదల చేసి, ఒక శేషము సీయోనుకు తిరిగి వచ్చి ఆ దేశాన్ని మరల దాని పూర్వ వైభవానికి తీసుకురావడానికి యెహోవా ఎలా అనుమతిస్తాడో యెషయా పదే పదే తెలియజేశాడు. తనకు ఎంతో ప్రియమైన యెరూషలేము పునఃస్థాపించబడటాన్ని గురించిన ప్రవచనాలను తెలియజేయడం, వాటిని వ్రాసిపెట్టడం యెషయాకు అత్యధిక ఆనందాన్ని కలిగించి ఉంటాయనడంలో సందేహం లేదు!
10, 11. (ఎ) యెషయా గ్రంథం నేడు మనకు ఎందుకు ఆసక్తిదాయకమైనది? (బి) యెషయా గ్రంథం మెస్సీయ వైపుకు అవధానాన్ని ఎలా మళ్ళిస్తుంది?
10 కానీ ఈ తీర్పు, రక్షణ సందేశాలకూ మనకూ సంబంధమేమిటి? యెషయా ప్రవచించింది కేవలం రెండు-గోత్రాల యూదా రాజ్య ప్రయోజనార్థం మాత్రమే కాదు గానీ ఆయనిచ్చిన సందేశాలు మన కాలానికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగివున్నాయన్నది సంతోషకరమైన విషయం. దేవుని రాజ్యం త్వరలోనే మన భూమికి గొప్ప ఆశీర్వాదాలను ఎలా తీసుకువస్తుందో యెషయా అద్భుతంగా వర్ణిస్తున్నాడు. ఈ విషయంలో, యెషయా వ్రాతల్లోని అధికభాగం, దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలించే ప్రవచించబడిన మెస్సీయపై అవధానం నిలుపుతుంది. (దానియేలు 9:25; యోహాను 12:41) యేసు పేరుకుగల భావం కూడా “యెహోవాయే రక్షణ” కాబట్టి, యేసు యెషయాల పేర్లు నిజానికి ఒకే తలంపును వ్యక్తంచేయడం కేవలం కాకతాళీయం కాదన్నది నిశ్చయం.
11 నిజమే, యెషయా కాలం తర్వాత మరో ఏడు శతాబ్దాలకుగానీ యేసు జన్మించలేదు. అయినప్పటికీ, యెషయా గ్రంథంలో ఉన్న మెస్సీయ సంబంధమైన ప్రవచనాలు ఎంత సవివరంగా ఎంత కచ్చితంగా ఉన్నాయంటే, అవి యేసు భూమిపై గడిపినప్పటి ప్రత్యక్షసాక్షులు చెప్పినవేమో అనిపిస్తాయి. దీని దృష్ట్యా, యెషయా గ్రంథం కొన్నిసార్లు “ఐదవ సువార్త” అని పిలువబడినట్లు ఒక గ్రంథమూలం పేర్కొంది. అందుకే, మెస్సీయను స్పష్టంగా సూచించేందుకు యేసూ ఆయన అపొస్తలులూ బైబిల్లోని ఇతర పుస్తకాల కంటే యెషయా గ్రంథాన్నే తరచుగా ఉదహరించారంటే అందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు.
12. మనం యెషయా గ్రంథాన్ని ఆతురతతో ఎందుకు అధ్యయనం చేస్తాము?
12 యెషయా ‘క్రొత్త ఆకాశములు క్రొత్త భూమిని’ గురించి అద్భుతంగా వివరించాడు, వాటిలో ‘రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేస్తాడు,’ అధికారులు న్యాయమును బట్టి ఏలుతారు. (యెషయా 32:1, 2; 65: 17, 18; 2 పేతురు 3:13) అలా యెషయా గ్రంథం, మెస్సీయ అయిన యేసు క్రీస్తు సింహాసనాసీనుడైన రాజుగా పరిపాలించే దేవుని రాజ్యాన్ని గురించి మనోరంజకమైన నిరీక్షణను ఇస్తుంది. ప్రతిరోజు ‘యెహోవా రక్షణ’ కోసం ఆనందంగా ఎదురుచూస్తూ జీవించడానికి మనకది ఎంతటి ప్రోత్సాహమో గదా! (యెషయా 25:9; 40:28-31) కాబట్టి మనం యెషయా గ్రంథంలోని అమూల్యమైన సందేశాన్ని ఆతురతతో పరిశీలిద్దాం. మనమలా పరిశీలిస్తుండగా, దేవుని వాగ్దానాలపై మనకున్న నమ్మకం ఎంతో బలపరచబడుతుంది. అంతేగాక, యెహోవా దేవుడు నిజంగా మన రక్షణకర్త అనే మన నమ్మకం దృఢపడడానికి సహాయం లభిస్తుంది.
[అధస్సూచీలు]
^ ఉజ్జియా పరిపాలనారంభంలో ప్రవచించిన, ఆమోసు అనే పేరుగల బైబిలు పుస్తకాన్ని వ్రాసిన ఆమోసు, యెషయా తండ్రియైన ఆమోజు ఒకరే అనుకుని పొరబడకూడదు.
^ ‘అగ్ని గుండమును దాటించడం’ అన్నది కేవలం శుద్ధీకరణ ఆచారకర్మనే సూచిస్తుందని కొందరంటారు. అయితే, ఈ సందర్భంలో ఈ పదబంధం అక్షరార్థమైన బలినే సూచిస్తున్నట్లుగా ఉంది. కనానీయులు, మతభ్రష్ట ఇశ్రాయేలీయులు పసిపిల్లలను బలి ఇచ్చేవారనడంలో ఎటువంటి సందేహమూ లేదు.—ద్వితీయోపదేశకాండము 12:31; కీర్తన 106:37, 38.
[అధ్యయన ప్రశ్నలు]
[7 వ పేజీలోని బాక్సు/చిత్రం]
యెషయా ఎవరు?
ఆ పేరుకు గల భావం: “యెహోవా ఇచ్చే రక్షణ”
కుటుంబం: వివాహితుడు, కనీసం ఇద్దరు కుమారులు
నివాసం: యెరూషలేము
సేవ చేసిన సంవత్సరాలు: కనీసం 46 సంవత్సరాలు, సుమారు సా.శ.పూ. 778 నుండి సా.శ.పూ. 732 తరువాత కొంతకాలం వరకు
సమకాలీన యూదా రాజులు: ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా
సమకాలీన ప్రవక్తలు: మీకా, హోషేయ, ఓదాదు
[6 వ పేజీలోని చిత్రం]
యెషయా దంపతులు దేవుని ఆరాధనను తమ కుటుంబ ముఖ్య విషయంగా చేసుకున్నారు