కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ లోకం నుండి ఎటువంటి సహాయమూ లభించదు

ఈ లోకం నుండి ఎటువంటి సహాయమూ లభించదు

ఇరవై-నాలుగవ అధ్యాయం

ఈ లోకం నుండి ఎటువంటి సహాయమూ లభించదు

యెషయా 31:1-9

1, 2. (ఎ) యెరూషలేము నివాసులు ఎందుకు భయకంపితులయ్యారు? (బి) యెరూషలేములోని దురవస్థ దృష్ట్యా, ఏ ప్రశ్నలు సముచితమైనవి?

 యెరూషలేము నివాసులు భయకంపితులయ్యారు​—⁠దానికి మంచి కారణమే ఉంది! ఆ కాలంలోని అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం అయిన అష్షూరు, ‘యూదా దేశమందున్న ప్రాకారములుగల పట్టణములన్నిటిపై దాడిచేసి వాటిని ఆక్రమించుకొంది.’ ఇప్పుడు, అష్షూరు సైన్య సమూహం యూదా రాజధాని నగరానికి ముప్పు తెస్తోంది. (2 రాజులు 18:​13, 17) హిజ్కియా రాజు, యెరూషలేములోని మిగతా నివాసులు ఏమి చేస్తారు?

2 తన రాజ్యంలోని ఇతర నగరాలు ఇప్పటికే ఆక్రమించుకోబడ్డాయి గనుక, అష్షూరు బలమైన సైన్యంతో తలపడి విజయం సాధించేంత దృఢంగా యెరూషలేము లేదని హిజ్కియాకు తెలుసు. అంతేగాక, అష్షూరీయులు అంతులేని క్రూరత్వానికి, దౌర్జన్యానికి పేరుగాంచారు. ఆ రాజ్యపు సైన్యం ఎంత భీతిగొలిపేదిగా ఉంటుందంటే, వ్యతిరేకులు కొన్నిసార్లు పోరాడకుండానే పారిపోయేవారు. యెరూషలేములో ఉన్న ఘోరమైన పరిస్థితుల దృష్ట్యా, దాని నివాసులు సహాయం కోసం ఎవరివైపు తిరుగగలరు? అష్షూరు సైన్యం నుండి తప్పించుకునే అవకాశం ఏదైనా ఉందా? దేవుని ప్రజలు అలాంటి స్థితిలోకి ఎలా వెళతారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం, మనం వెనక్కి వెళ్ళి, తొలికాలాల్లో యెహోవా తన నిబంధన జనముతో ఎలా వ్యవహరించాడో చూద్దాము.

ఇశ్రాయేలులో మతభ్రష్టత్వం

3, 4. (ఎ) ఇశ్రాయేలు జనాంగం రెండు రాజ్యాలుగా ఎప్పుడు, ఎలా విభాగించబడింది? (బి) ఉత్తరం వైపునున్న పది-గోత్రాల రాజ్యానికి యెరోబాము ఎలాంటి ప్రతికూలమైన ప్రారంభాన్ని ఇచ్చాడు?

3 ఇశ్రాయేలు ఐగుప్తును విడిచి వచ్చినప్పటి నుండి దావీదు కుమారుడైన సొలొమోను మరణం వరకు, అంటే కేవలం 500 కన్నా కొంచెం ఎక్కువ సంవత్సరాలపాటు, ఇశ్రాయేలు 12 గోత్రాలు ఒకే జనాంగంగా ఐక్యంగా ఉన్నాయి. సొలొమోను మరణం తర్వాత, ఉత్తరంవైపునున్న పది-గోత్రాలు దావీదు గృహానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా యెరోబాము నడిపించాడు, అప్పటి నుండి జనాంగం రెండు రాజ్యాలుగా విభాగించబడింది. ఇది సా.శ.పూ. 997 లో జరిగింది.

4 ఇశ్రాయేలు ఉత్తర రాజ్యానికి మొదటి రాజు యెరోబాము, అతడు, అహరోను యాజకత్వం స్థానంలో ధర్మవిరుద్ధమైన యాజకత్వాన్ని, న్యాయబద్ధమైన యెహోవా ఆరాధన స్థానంలో దూడ ఆరాధనా విధానాన్ని ప్రవేశపెట్టి తన ప్రజలను మత భ్రష్టత్వపు మార్గంపై నడిపించాడు. (1 రాజులు 12:​25-33) ఇది యెహోవాకు అసహ్యమైనది. (యిర్మీయా 32:​30, 35) దీన్ని బట్టి, ఇతర కారణాలను బట్టి, అష్షూరు ఇశ్రాయేలును లోబరచుకోవడానికి ఆయన అనుమతించాడు. (2 రాజులు 15:​29) హోషేయ రాజు ఐగుప్తుతో కుట్రపన్నడం ద్వారా అష్షూరు కాడిని విరువడానికి ప్రయత్నిస్తాడు, కానీ పథకం పారదు.​—⁠2 రాజులు 17:4.

ఇశ్రాయేలు బూటకపు ఆశ్రయం వైపుకు మరలుతుంది

5. ఇశ్రాయేలు సహాయం కోసం ఎవరి వైపు తిరుగుతుంది?

5 యెహోవా ఇశ్రాయేలీయులకు తిరిగి గ్రహింపు కలిగించాలని అనుకుంటున్నాడు. * కాబట్టి ఆయన యెషయా ప్రవక్తను ఈ హెచ్చరికతో పంపిస్తాడు: “ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ.” (యెషయా 31:1) ఎంత విచారకరం! ఇశ్రాయేలు, జీవముగల దేవుడైన యెహోవాను నమ్ముకోవడం కంటే ఎక్కువగా యుద్ధాలను, యుద్ధ రథాలను నమ్ముకుంటోంది. ఇశ్రాయేలు యొక్క అల్పమానవ ఆలోచనా విధానానికి, ఐగుప్తు గుఱ్ఱాలు అసంఖ్యాకమైనవిగా, బలమైనవిగా అనిపిస్తున్నాయి. ఐగుప్తు అష్షూరు సైన్యానికి వ్యతిరేకంగా, ఖచ్చితంగా విలువైన మిత్రరాజ్యంగా ఉంటుందని వారికి అనిపిస్తుంది! అయితే, ఐగుప్తుతో తాము చేసుకున్న అల్పమానవ సంధి నిష్ప్రయోజనమని వారు త్వరలోనే తెలుసుకుంటారు.

6. ఇశ్రాయేలు ఐగుప్తు వైపు తిరగడం, యెహోవాపట్ల స్పష్టమైన విశ్వాస లేమిని ఎలా చూపిస్తుంది?

6 ధర్మశాస్త్ర నిబంధన ద్వారా యూదా ఇశ్రాయేలుల నివాసులు యెహోవాతో సమర్పిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. (నిర్గమకాండము 24:3-8; 1 దినవృత్తాంతములు 16:​15-17) సహాయం కోసం ఐగుప్తు వైపు తిరగడం ద్వారా, ఇశ్రాయేలు యెహోవాయందు విశ్వాసలేమిని, ఆ పరిశుద్ధ నిబంధనలో భాగమైన నియమాల పట్ల నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే, తన ప్రజలు తనకు అనితర భక్తిని చెల్లిస్తేనే తాను వారికి కాపుదలను ఇస్తానన్న యెహోవా వాగ్దానం కూడా నిబంధన షరతుల్లో ఒకటి. (లేవీయకాండము 26:​3-8) ఆ వాగ్దానానికి తగినట్లుగానే, యెహోవా ఎన్నోసార్లు, ‘బాధ కలుగునప్పుడు వారికి ఆశ్రయ దుర్గముగా’ ఉన్నాడు. (కీర్తన 37:39; 2 దినవృత్తాంతములు 14:​2, 9-12; 17:​3-5, 10) అంతేగాక, గుఱ్ఱములను విస్తారముగా సంపాదించుకోవద్దని ధర్మశాస్త్ర నిబంధనకు మధ్యవర్తి అయిన మోషే ద్వారా ఇశ్రాయేలు కాబోయే రాజులకు యెహోవా చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 17:​16) ఈ ఆదేశానికి విధేయత చూపడం, ఈ రాజులు రక్షణ కోసం “ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని”పై అధారపడుతున్నారని చూపిస్తుంది. కానీ దుఃఖకరంగా, ఇశ్రాయేలు పరిపాలకులకు అలాంటి విశ్వాసం ఉండదు.

7. ఇశ్రాయేలు విశ్వాసలేమి నుండి క్రైస్తవులు నేడు ఏమి నేర్చుకోవచ్చు?

7 ఇందులో నేటి క్రైస్తవులకు ఒక పాఠం ఉంది. ఇశ్రాయేలు ఐగుప్తు యొక్క దృశ్యమైన మద్దతు కోసం చూసింది గానీ అంతకంటే ఎంతో శక్తిమంతమైన, యెహోవా అనుగ్రహించే మద్దతు కోసం చూడలేదు. అలాగే నేడు, క్రైస్తవులు యెహోవా కంటే బ్యాంకు అక్కౌంట్లు, సమాజంలో స్థానం, లోకంతో సంబంధాల వంటి భౌతిక భద్రతలపై తమ నమ్మకాన్ని ఉంచేలా శోధించబడవచ్చు. నిజమే, క్రైస్తవ కుటుంబ శిరస్సులు తమ కుటుంబాల వస్తుపరమైన అవసరాలను తీర్చాలనే తమ బాధ్యతను గంభీరంగా తీసుకుంటారు. (1 తిమోతి 5:8) కానీ వారు వస్తుసంబంధమైన వాటిపై తమ నమ్మకాన్ని పెట్టరు. వారు “ఏ విధమైన లోభమునకు” లొంగిపోకుండా ఉండేందుకు జాగ్రత్త వహిస్తారు. (లూకా 12:​13-21) “ఆపత్కాలములలో” ఏకైక ‘మహాదుర్గము’ యెహోవా దేవుడే.​—⁠కీర్తన 9:9; 54:7.

8, 9. (ఎ) ఇశ్రాయేలు పథకాలు యుద్ధతంత్ర సంబంధంగా సరైనవిగానే అనిపించినప్పటికీ, దాని ఫలితం ఏమై ఉంటుంది, ఎందుకు? (బి) మానవ వాగ్దానాలకు, యెహోవా వాగ్దానాలకు ఉన్న తేడా ఏమిటి?

8 ఒక విధంగా, యెషయా ఇలా చెబుతూ, ఐగుప్తుతో సంధి కుదుర్చుకున్న ఇశ్రాయేలు నాయకులను అపహసిస్తున్నాడు: “ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. [“విపత్తు రప్పించగలవాడు,” పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం] మాట తప్పక దుష్టుల యింటివారిమీదను కీడుచేయువారికి తోడ్పడువారిమీదను ఆయన లేచును.” (యెషయా 31:2) ఇశ్రాయేలు నాయకులు తాము జ్ఞానవంతులమని అనుకోవచ్చు. కానీ విశ్వ సృష్టికర్త సర్వశ్రేష్ఠమైన జ్ఞానవంతుడు కాదా? పైకి చూడ్డానికి, ఐగుప్తు నుండి సహాయం పొందాలని ఇశ్రాయేలు వేసిన పథకం యుద్ధతంత్ర సంబంధంగా సరైనదే అనిపిస్తుంది. కానీ, అలాంటి రాజకీయ సంధిని కుదుర్చుకోవడం యెహోవా దృష్టికి ఆధ్యాత్మిక జారత్వంతో సమానం. (యెహెజ్కేలు 23:​1-10) దాని ఫలితంగానే, యెహోవా ‘విపత్తు రప్పిస్తాడని’ యెషయా చెబుతున్నాడు.

9 మానవ వాగ్దానాలు అవిశ్వసనీయమైనవని సర్వలోక విధితమే, మానవులిచ్చే రక్షణ అనిశ్చయమైనది. అయితే మరో వైపున యెహోవా తన ‘మాట తప్పవలసిన’ అవసరం లేదు. ఆయన తాను చేసిన వాగ్దానం తప్పక నెరవేరుస్తాడు. ఆయన మాటలు నిష్ఫలముగా ఆయన యొద్దకు మరలవు.​—⁠యెషయా 55:​10, 11; 14:24.

10. ఐగుప్తుకు, ఇశ్రాయేలుకు ఏమి జరుగుతుంది?

10 ఐగుప్తీయులు ఇశ్రాయేలుకు నమ్మదగిన రక్షణగా ఉంటారా? లేదు. యెషయా ఇశ్రాయేలుకు ఇలా చెబుతాడు: “ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు; ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యిచాపగా సహాయము చేయువాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు.” (యెషయా 31:3) యెహోవా అష్షూరు ద్వారా తన తీర్పును అమలు చేయడానికి తన చెయ్యి చాపినప్పుడు, సహాయం చేసినవాడు (ఐగుప్తు) సహాయాన్ని పొందినవాడు (ఇశ్రాయేలు) ఇద్దరూ జోగి, పడి నాశనమవుతారు.

షోమ్రోను పతనం

11. ఇశ్రాయేలు ఎలాంటి పాపాల చరిత్రను సమకూర్చుకుంది, దాని తుది ఫలితం ఏమిటి?

11 ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడి, స్వచ్ఛారాధనకు తిరిగి వచ్చేలా ప్రోత్సహించడానికి యెహోవా దయతో ప్రవక్తలను పదే పదే పంపిస్తాడు. (2 రాజులు 17:​13) అలా చేసినప్పటికీ, ఇశ్రాయేలు దూడను ఆరాధించడమేగాక, సోదె, అవినీతికరమైన బయలు ఆరాధన, దేవతా స్తంభములను ఎత్తైన స్థలాలను ఉపయోగించడం వంటివాటిలో పాల్గొనడం ద్వారా మరింత పాపానికి ఒడిగడుతుంది. ఇశ్రాయేలీయులు తమ సంతానాన్ని దయ్యములకు బలి ఇస్తూ, చివరికి “తమ కుమారులను కుమార్తెలను అగ్ని గుండమును దాటించి[రి].” (2 రాజులు 17:14-17; కీర్తన 106:36-39; ఆమోసు 2:8) ఇశ్రాయేలు దుష్టత్వాన్ని అంతమొందించడానికి, యెహోవా ఇలా ఆజ్ఞాపిస్తాడు: “షోమ్రోను నాశమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకొనిపోవు నురుగుతో సమానమగును.” (హోషేయ 10:​1, 7) అష్షూరు సైన్యాలు సా.శ.పూ. 742 లో ఇశ్రాయేలు రాజధాని నగరమైన షోమ్రోనుపై దాడి చేస్తాయి. మూడు సంవత్సరాల ముట్టడి తర్వాత, షోమ్రోను పడిపోతుంది, సా.శ.పూ. 740 లో పది-గోత్రాల రాజ్యం ఉనికిలోనే లేకుండా పోతుంది.

12. యెహోవా నేడు ఏమి చేయమని ఆజ్ఞాపించాడు, ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేసేవారికి ఏమి జరుగుతుంది?

12 మన కాలంలో యెహోవా, “అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యుల[ను]” హెచ్చరించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రకటించమని ఆజ్ఞాపించాడు. (అపొస్తలుల కార్యములు 17:30; మత్తయి 24:​14) దేవుని రక్షణ ఏర్పాటును నిరాకరించేవారు, “కొట్టుకొనిపోవు నురుగు” వలె అవుతారు, మతభ్రష్ట ఇశ్రాయేలు రాజ్యము వలె నాశనం చేయబడతారు. మరోవైపున, యెహోవా కోసం నిరీక్షించేవారు “భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:​29) కాబట్టి, ప్రాచీన ఇశ్రాయేలు రాజ్యం చేసిన తప్పులను మనం చేయకుండా జాగ్రత్తపడడం ఎంత జ్ఞానయుక్తమైనదో కదా! రక్షణ కోసం మనం యెహోవాపై మన పూర్తి నమ్మకాన్ని ఉంచుదాము.

యెహోవా రక్షణ శక్తి

13, 14. సీయోను కోసం యెహోవా వద్ద ఎలాంటి ఓదార్పునిచ్చే మాటలు ఉన్నాయి?

13 యూదా రాజధాని నగరమైన యెరూషలేము, ఇశ్రాయేలు యొక్క దక్షిణ సరిహద్దు నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. షోమ్రోనుకు ఏమి జరిగిందో యెరూషలేము నివాసులకు బాగా తెలుసు. తమ ఉత్తరవైపు పొరుగు రాజ్యానికి అంతం తెచ్చిన భయంకరమైన శత్రువే తమకు కూడా ముప్పు తెస్తున్నట్లు వారు ఇప్పుడు తెలుసుకుంటారు. షోమ్రోనుకు సంభవించిన దాని నుండి వారు పాఠం నేర్చుకుంటారా?

14 యెషయా తర్వాతి మాటలు యెరూషలేము నివాసులకు ఓదార్పునిస్తాయి. యెహోవా ఇప్పటికీ తన నిబంధన ప్రజలను ప్రేమిస్తున్నాడని ఆయన వారికి హామీగా ఇలా చెబుతాడు: “యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు​—⁠తప్పించుటకై గొఱ్ఱెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికినదానిమీద గర్జించునట్లు, సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని దాని కొండమీదికిని దిగి వచ్చును.” (యెషయా 31:4) తనకు దొరికినదాన్ని కాపాడుకొనే కొదమ సింహంలా, యెహోవా తన పరిశుద్ధ నగరమైన సీయోనును అత్యాసక్తితో కాపాడతాడు. అష్షూరు సైన్యాల ప్రగల్భాలుగానీ, బెదిరింపులుగానీ, ఇతర ఏ అలజడిగానీ యెహోవాను ఆయన సంకల్పం నెరవేర్చకుండా ప్రక్కకు మరల్చలేవు.

15. యెహోవా యెరూషలేము నివాసులతో ప్రేమపూర్వకంగా, వాత్సల్యపూరితంగా ఎలా వ్యవహరిస్తాడు?

15 యెహోవా ఇప్పుడు ఇశ్రాయేలు నివాసులతో ప్రేమా వాత్సల్యాలతో వ్యవహరించే విధానాన్ని గమనించండి: “పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాని కాపాడుచు విడిపించుచునుండును. దానికి హానిచేయక తప్పించుచునుండును.” (యెషయా 31:5) తల్లి పక్షి తన పిల్లలను కాపాడుకోవడానికి ఎల్లవేళలా జాగరూకతతో ఉంటుంది. రెక్కలు చాపుకొని తన పిల్లల గుంపుపైనే ఎగురుతూ ఉంటుంది, ఏదైనా ప్రమాద సూచన ఉందా అని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది. పరభక్షి ఏదైనా దగ్గరికి వస్తే, తన పిల్లలను కాపాడడానికి అది వెంటనే క్రిందికి దిగుతుంది. అదేవిధంగా, యెహోవా దాడి చేస్తున్న అష్షూరీయుల నుండి యెరూషలేము నివాసులను కాపాడడానికి ప్రేమపూర్వకంగా శ్రద్ధ తీసుకుంటాడు.

‘ఇశ్రాయేలీయులారా, తిరుగుడి’

16. (ఎ) యెహోవా తన ప్రజలకు ఎలాంటి ప్రేమపూర్వకమైన విజ్ఞప్తిని చేస్తున్నాడు? (బి) యూదా ప్రజల తిరుగుబాటు ఎప్పుడు ప్రాముఖ్యంగా స్పష్టం అవుతుంది? వివరించండి.

16 యెహోవా ఇప్పుడు, తన ప్రజలు పాపం చేశారని వారికి గుర్తుచేసి, తమ తప్పు మార్గాలను విడనాడమని వారినిలా ప్రోత్సహిస్తాడు: “ఇశ్రాయేలీయులారా, మీరు ఎవనిమీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయనవైపు తిరుగుడి.” (యెషయా 31:6) తిరుగుబాటు చేసింది, ఇశ్రాయేలు పది-గోత్రాల రాజ్యం మాత్రమే కాదు. యూదా ప్రజలు, ‘ఇశ్రాయేలీయులు’ కూడా ‘విశేషముగా తిరుగుబాటు చేశారు.’ ప్రాముఖ్యంగా, యెషయా తన ప్రవచన సందేశాన్ని ముగించిన కొంతకాలానికి హిజ్కియా కుమారుడైన మనష్షే రాజు అయినప్పుడు, ఇది స్పష్టం అవుతుంది. బైబిలు వృత్తాంతం ప్రకారం, “మనష్షే యూదావారిని యెరూషలేము కాపురస్థులను మోసపుచ్చినవాడై, . . . యెహోవా నశింపజేసిన అన్యజనులకంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించునట్లు చేయుటకు కారకుడాయెను.” (2 దినవృత్తాంతములు 33:9) దాన్ని ఒకసారి ఊహించండి! అన్య రాజ్యాలు రోతపుట్టించేంతగా మలినమై ఉన్నాయి గనుక యెహోవా వాటిని నిర్మూలిస్తాడు, అయితే యెహోవాతో నిబంధనా సంబంధాన్ని కలిగివున్న యూదా నివాసులు ఆ రాజ్యాల ప్రజలకంటే ఘోరంగా ఉన్నారు.

17. నేటి పరిస్థితులు, మనష్షే పరిపాలనలోని యూదాలోనున్న పరిస్థితులను ఏ విధంగా పోలి ఉన్నాయి?

17 ఇరవై ఒకటవ శతాబ్దారంభంలో, చాలా విషయాల్లో పరిస్థితులు మనష్షే కాలంలోని యూదాలో ఉన్నట్లుగానే ఉన్నాయి. ప్రపంచం మత, జాతి, వర్గ విద్వేషాలతో ముక్కముక్కలుగా విభాగించబడింది. హత్యలకు, హింసలకు, మానభంగాలకు, జాతి ప్రక్షాళన అనబడిన క్రూరమైన అకృత్యాలకు లక్షలాదిమంది బలైపోయారు. నిస్సందేహంగా, ప్రజలు, దేశాలు, ప్రాముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్య దేశాలు, ‘విశేషముగా తిరుగుబాటు’ చేస్తున్నారు, చేస్తున్నాయి. అయితే, దుష్టత్వం అనిర్దిష్టంగా కొనసాగడానికి యెహోవా అనుమతించడని మనం నిశ్చయత కలిగివుండవచ్చు. ఎందుకు? యెషయా కాలంలో జరిగినదాన్ని బట్టి మనం అలా నిశ్చయత కలిగివుండవచ్చు.

యెరూషలేము విడుదల చేయబడింది

18. రబ్షాకే హిజ్కియాకు ఏమి హెచ్చరికనిస్తాడు?

18 అష్షూరు రాజులు రణభూమిలో తాము సాధించిన విజయానికి ఘనతను తమ దేవుళ్లకు ఆపాదించారు. “ఒక పెద్ద యుద్ధంలో . . . యుద్ధ (అనుభవంగల) సైనికులను [తాను] ఓడించినప్పుడు, అష్షురు, బేలు, నెబో వంటి గొప్ప దేవుళ్లు, [అతని] ప్రక్కన (ఎల్లవేళలా) నడిచే [అతని] ప్రభువులు” నడిపింపునిచ్చారని చెప్పుకున్న ఒక అష్షూరు సామ్రాట్టు ఆస్నప్పరు వ్రాతలు ఏన్షియంట్‌ నియర్‌ ఈస్టర్న్‌ టెక్స్‌ట్స్‌ అనే పుస్తకంలో ఉన్నాయి. యెషయా కాలంలో, అష్షూరు రాజు అయిన సన్హెరీబుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రబ్షాకే, హిజ్కియా రాజును ఉద్దేశించి మాట్లాడినప్పుడు, మానవుల యుద్ధాల్లో దేవుళ్లు జోక్యం చేసుకోవడంలో అలాంటి నమ్మకాన్నే చూపిస్తాడు. రక్షణ కోసం యెహోవాపై ఆధారపడడాన్ని గురించి అతడు యూదా రాజును హెచ్చరించి, శక్తివంతమైన అష్షూరు యుద్ధ యంత్రానికి వ్యతిరేకంగా తమ ప్రజలను కాపాడడంలో ఇతర రాజ్యాల దేవుళ్ళు అసమర్థులయ్యారని ఎత్తిచూపిస్తాడు.​—⁠2 రాజులు 18:33-35.

19. హిజ్కియా రబ్షాకే ఎత్తిపొడుపులకు ఎలా ప్రతిస్పందిస్తాడు?

19 హిజ్కియా రాజు ఎలా ప్రతిస్పందిస్తాడు? బైబిలు వృత్తాంతం ఇలా చెబుతోంది: “హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పో[యెను].” (2 రాజులు 19:1) ఈ భయంకరమైన పరిస్థితిలో కేవలం ఒకే ఒక్కరు తనకు సహాయం చేయగలరని హిజ్కియా గుర్తిస్తాడు. అతడు తనను తాను తగ్గించుకుని నడిపింపు కోసం యెహోవాను ఆశ్రయిస్తాడు.

20. యూదా నివాసుల పక్షాన యెహోవా ఎలా చర్య తీసుకుంటాడు, దీని నుండి వారు ఏమి నేర్చుకోవాలి?

20 కోరుకున్న నడిపింపును యెహోవా ఇస్తాడు. యెషయా ప్రవక్త ద్వారా ఆయన ఇలా చెప్పాడు: “మీకు మీరు పాపము కలుగజేసికొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును.” (యెషయా 31:7) యెహోవా తన ప్రజల కోసం పోరాడినప్పుడు, సన్హెరీబు దేవుళ్లు ఎంత నిరర్థకమైన వారన్నది వెల్లడిచేయబడుతుంది. ఇది యూదా నివాసులు నేర్చుకోవలసిన పాఠం. హిజ్కియా రాజు నమ్మకంగా ఉన్నప్పటికీ, ఇశ్రాయేలులా యూదా దేశం విగ్రహాలతో నిండిపోయింది. (యెషయా 2:​5-8) యూదా నివాసులు యెహోవాతో తమ సంబంధాన్ని పునఃనిర్మించుకోవాలంటే, వారు తమ పాపాల విషయమై పశ్చాత్తాపపడి, ‘వారిలో ప్రతివాడు తమ విగ్రహములను పారవేయాలి.’​—⁠నిర్గమకాండము 34:14 చూడండి.

21. అష్షూరుకు వ్యతిరేకంగా యెహోవా అమలు చేసే శిక్షలను యెషయా ప్రవచనార్థకంగా ఎలా వర్ణిస్తున్నాడు?

21 యెషయా ఇప్పుడు, యూదాకుగల భయంకరమైన శత్రువుకు వ్యతిరేకంగా యెహోవా అమలు చేసే శిక్షలను ప్రవచనార్థకంగా వర్ణిస్తున్నాడు: “నరునిది కాని ఖడ్గమువలన అష్షూరీయులు కూలుదురు మనుష్యునిది కాని కత్తిపాలగుదురు. ఖడ్గమెదుటనుండి వారు పారిపోవుదురు. వారి పడుచువారు దాసులగుదురు.” (యెషయా 31:8) చరమాంకానికి చేరుకున్నప్పుడు, యెరూషలేము నివాసులు తమ ఖడ్గములను ఒరలో నుండి బయటికి తీయవలసిన అవసరం కూడా ఉండదు. అష్షూరు సైన్యాల్లోని శ్రేష్ఠమైన భాగాన్ని నరుల ఖడ్గములు కాదు గానీ యెహోవా ఖడ్గం మింగివేస్తుంది. ఇక అష్షూరు రాజు అయిన సన్హెరీబు విషయానికి వస్తే, ‘అతడు ఖడ్గమెదుట నుండి పారిపోవును.’ అతడు యెహోవా దూత చేతుల్లో తన 1,85,000 మంది యోధులను పోగొట్టుకున్న తర్వాత, ఇంటికి తిరిగి వస్తాడు. ఆ తర్వాత, తన దేవుడైన నిస్రోకుకు మ్రొక్కుతున్నప్పుడు అతని కుమారులే అతడిని హత్య చేస్తారు.​—⁠2 రాజులు 19:35-37.

22. హిజ్కియా, అష్షూరు సైన్యం ఇమిడివున్న సంఘటనల నుండి క్రైస్తవులు నేడు ఏమి నేర్చుకోవచ్చు?

22 యెహోవా యెరూషలేమును అష్షూరు సైన్యం నుండి ఎలా విమోచిస్తాడనేది హిజ్కియాతో సహా ఎవ్వరూ ముందుగా గ్రహించలేకపోతారు. అయితే, ఈ క్లిష్ట పరిస్థితిలో హిజ్కియా వ్యవహరించిన విధానం, నేడు శ్రమలు అనుభవిస్తున్న వారికి చక్కని మాదిరి. (2 కొరింథీయులు 4:​16-18) యెరూషలేముకు ముప్పు తీసుకువస్తున్న అష్షూరీయులు క్రూరత్వం విషయంలో సంపాదించుకున్న పేరు దృష్ట్యా, హిజ్కియా పడుతున్న భయం అర్థం చేసుకోదగినదే. (2 రాజులు 19:3) అయినా, ఆయనకు యెహోవాపై నమ్మకం ఉంది, ఆయన మానవుల నడిపింపును కాదుగానీ యెహోవా నడిపింపును కోరాడు! ఆయన చేసింది యెరూషలేముకు ఎంతటి ఆశీర్వాదమో! నేడు దైవభయం గల క్రైస్తవులు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు తీవ్రమైన భావోద్వేగాలను అనుభవించవచ్చు. అనేక పరిస్థితుల్లో, భయం కలుగడం, అర్థం చేసుకోదగినదే. అయినా, మనం ‘మన చింత యావత్తు యెహోవా మీద వేస్తే,’ ఆయన మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు. (1 పేతురు 5:7) భయాన్ని అధిగమించడానికి ఆయన మనకు సహాయం చేసి, మనకు ఒత్తిడి కలుగజేస్తున్న పరిస్థితిని ఎదుర్కోవడానికి మనల్ని బలపరుస్తాడు.

23. హిజ్కియా కాదుగానీ సన్హెరీబు ఏ విధంగా భయకంపితుడవుతాడు?

23 చివరికి భయకంపితుడయ్యేది సన్హెరీబే గానీ హిజ్కియా కాదు. సన్హెరీబు ఎవరి వైపు తిరగవచ్చు? యెషయా ఇలా ప్రవచిస్తున్నాడు: “భీతిచేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతినొంది వెనుకదీయుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సీయోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి.” (యెషయా 31:9) సన్హెరీబు దేవుళ్ళు, అతని “ఆశ్రయదుర్గము,” అతడు నమ్ముకున్న ఆశ్రయం అతడిని మోసగిస్తారు. ఒకవిధంగా చెప్పాలంటే, వారు ‘భీతిచేత సమసిపోతారు.’ అంతేగాక, సన్హెరీబు అధిపతులు సహితం సహాయం చేయలేకపోతారు. వారు కూడా భయకంపితులవుతారు.

24. అష్షూరీయునికి జరిగినదాని నుండి ఏ స్పష్టమైన సందేశాన్ని నేర్చుకోవచ్చు?

24 యెషయా ప్రవచనంలోని ఈ భాగం, దేవుని వ్యతిరేకించాలనుకునే వారెవరికైనా ఒక స్పష్టమైన సందేశాన్ని అందజేస్తుంది. యెహోవా సంకల్పాలు నెరవేరకుండా చేయగల ఆయుధముగానీ, శక్తిగానీ, యుక్తిగానీ ఏదీలేదు. (యెషయా 41:​11, 12) అదే సమయంలో, దేవుని సేవచేస్తున్నామని చెప్పుకుంటూ కూడా అల్పమానవుల నుండి భద్రతను పొందడానికి ప్రయత్నిస్తూ ఆయన నుండి దూరమైపోయే వారు నిరాశ చెందుతారు. “ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని లక్ష్యపెట్ట”ని వారు ఎవరైనా యెహోవా ‘విపత్తు రప్పించడాన్ని’ చూస్తారు. (యెషయా 31:​1, 2) నిజంగా, నిరంతరం నిలిచే నిజమైన, ఏకైక ఆశ్రయం యెహోవా దేవుడే.​—⁠కీర్తన 37:5.

[అధస్సూచి]

^ యెషయా 31 వ అధ్యాయంలోని మొదటి మూడు వచనాలు ప్రాముఖ్యంగా ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్పబడి ఉండవచ్చు. చివరి ఆరు యూదాకు అన్వయిస్తున్నట్లుగా అనిపిస్తుంది.

[అధ్యయన ప్రశ్నలు]

[319 వ పేజీలోని చిత్రం]

వస్తుపరమైన వాటిని నమ్ముకునేవారు నిరాశ చెందుతారు

[322 వ పేజీలోని చిత్రం]

తను పట్టుకొన్న ఆహారాన్ని కాపాడుకునే సింహంలా, యెహోవా తన పరిశుద్ధ నగరాన్ని కాపాడతాడు

[324 వ పేజీలోని చిత్రాలు]

మత, జాతి, వర్గ విద్వేషాల మూలంగా ప్రపంచం ముక్కముక్కలుగా విభాగించబడింది

[326 వ పేజీలోని చిత్రం]

హిజ్కియా సహాయం కోసం యెహోవా మందిరానికి వెళ్లాడు