కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక తండ్రి, తిరుగుబాటుదారులైన ఆయన కుమారులు

ఒక తండ్రి, తిరుగుబాటుదారులైన ఆయన కుమారులు

రెండవ అధ్యాయం

ఒక తండ్రి, తిరుగుబాటుదారులైన ఆయన కుమారులు

యెషయా 1:​2-9

1, 2. యెహోవాకు తిరుగుబాటుదారులైన కుమారులు ఎలా కలిగారో వివరించండి.

 ప్రేమగల తలిదండ్రులందరిలాగే ఆయన తన పిల్లలకు కావలసినవన్నీ సమకూర్చాడు. ఎన్నో సంవత్సరాలపాటు వాళ్లకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, తలదాచుకోవడానికి ఆశ్రయం ఇచ్చాడు. అవసరమైనప్పుడు వాళ్లను క్రమశిక్షణలో పెట్టాడు. కానీ వాళ్లను ఎన్నడూ అతిగా శిక్షించలేదు; ఎప్పుడూ “మితముగా”నే శిక్షించాడు. (యిర్మీయా 30:11) అటువంటి ప్రేమగల తండ్రి “నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు” అని చెప్పవలసిన దుస్థితి వచ్చినప్పుడు ఎంత వ్యధననుభవిస్తాడో మనం ఊహించవచ్చు.​యెషయా 1:2బి.

2 ఇక్కడ ప్రస్తావించబడిన తిరుగుబాటుదారులైన కుమారులు యూదా జనాంగము, వ్యధననుభవిస్తున్న తండ్రి యెహోవా దేవుడు. ఎంత విచారకరం! యెహోవా యూదావారిని పెంచి పోషించి, ఇతర జనాంగాల మధ్య వారిని ఉన్నత స్థానానికి లేవనెత్తాడు. “విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేసితిని, సన్నమైన యెఱ్ఱని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని, సన్నపు అవిసెనారబట్ట నీకు వేయించితిని, నీకు పట్టుబట్ట ధరింపజేసితిని” అని ఆయన ఆ తర్వాత యెహెజ్కేలు ప్రవక్త ద్వారా వారికి గుర్తు చేస్తున్నాడు. (యెహెజ్కేలు 16:10) అయినప్పటికీ, యూదావారిలో ఎక్కువమంది, యెహోవా తమకోసం చేసిన దానిపట్ల మెప్పును కనబరచరు. అంతేగాక, వారాయనకు ఎదురు తిరుగుతారు లేదా తిరుగుబాటు చేస్తారు.

3. యూదా చేస్తున్న తిరుగుబాటుకు సాక్షులుగా ఉండమని యెహోవా ఆకాశమును, భూమిని ఎందుకు పిలుస్తున్నాడు?

3 యెహోవా తిరుగుబాటుదారులైన తన కుమారులను గురించి సరైన కారణంతోనే ఇలా అంటున్నాడు: “యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము.” (యెషయా 1:2) సూచనార్థకంగా చెప్పాలంటే, శతాబ్దాల క్రితం ఇశ్రాయేలీయులకు అవిధేయతా పరిణామాల గురించి సుస్పష్టమైన హెచ్చరికలు ఇవ్వబడినప్పుడు భూమీ ఆకాశమూ విన్నాయి. మోషే ఇలా చెప్పాడు: “మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను.” (ద్వితీయోపదేశకాండము 4:26) ఇప్పుడు యెషయా కాలంలో, యూదా చేస్తున్న తిరుగుబాటుకు సాక్షులుగా ఉండమని యెహోవా అదృశ్య ఆకాశమును, దృశ్య భూమిని పిలుస్తున్నాడు.

4. యెహోవా యూదాతో ఎలా వ్యవహరించాలని ఎంపిక చేసుకున్నాడు?

4 పరిస్థితి తీవ్రతను బట్టి కచ్చితమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. అయితే, ఈ అత్యవసరమైన పరిస్థితుల్లో సహితం యెహోవా యూదాతో, వారిని కొన్న యజమానిగా కాక ప్రేమగల తండ్రిగా వ్యవహరించడం గమనార్హమైన విషయం, అది మన హృదయాలను ఎంతో ఉత్తేజపరుస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే, దారితప్పిన తన కుమారుల గురించి వ్యధననుభవిస్తున్న తండ్రి దృక్కోణం నుండి విషయాన్ని పరిశీలించమని యెహోవా తన ప్రజలను వేడుకుంటున్నాడు. యూదాలోని కొంతమంది తల్లిదండ్రులు వ్యక్తిగతంగా అలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఉండవచ్చు గనుక వారు ఆ ఉపమానానికి ఎంతగానో కదిలింపబడి ఉంటారు. ఏదేమైనప్పటికీ, యెహోవా యూదాకు వ్యతిరేకంగా తన వాదనను వినిపించబోతున్నాడు.

వివేచనలేని పశువులు మేలు

5. ఇశ్రాయేలుకు భిన్నంగా, ఎద్దు గాడిద ఏ విధంగా నమ్మకంగా ఉంటాయి?

5 యెషయా ద్వారా యెహోవా ఇలా చెబుతున్నాడు: “ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును; ఇశ్రాయేలుకు తెలివిలేదు, నా జనులు యోచింపరు.” (యెషయా 1:3) * మధ్య ప్రాచ్యంలో నివసించే ప్రజలకు ఎద్దు, గాడిద బరువులు మోసే జంతువులుగా బాగా తెలుసు. అల్పమైన ఈ పశువులు సహితం నమ్మకంగా ఉండడమే కాదు తాము ఒక యజమానికి చెందుతామని గ్రహిస్తాయన్న విషయాన్ని యూదావారు కాదనలేరు. దీనికి సంబంధించి, మధ్య ప్రాచ్యంలోని ఒక నగరంలో సాయంవేళ ఒక బైబిలు పరిశోధకుడు ఏమి గమనించాడో చూడండి: “మంద నగరి నాలుగు గోడల లోపలికి ప్రవేశించిన వెంటనే పశువులన్నీ వేర్వేరు దిశల్లోకి వెళ్ళడం మొదలుపెట్టాయి. ప్రతి ఎద్దుకూ తన స్వంత యజమాని ఎవరో, ఆయన ఇంటికి దారి ఏదో బాగా తెలుసు, ఇరుకుగా వంకరటింకరగా ఉన్న చిక్కుత్రోవలలోనూ అవి ఒక్కక్షణమైనా తికమకపడలేదు. గాడిదైతే నేరుగా తలుపు దగ్గరికే, ‘తన యజమాని పశువుల దొడ్డిలోకే’ నడిచి వెళ్లింది.”

6. యూదావారు యోచింపడంలో ఎలా విఫలమయ్యారు?

6 అలాంటి దృశ్యాలు యెషయా కాలంలో సర్వసాధారణమైనవే గనుక, యెహోవా ఇస్తున్న సందేశం సుస్పష్టంగా ఉంది: వివేచనలేని పశువు తన యజమానినీ తన స్వంత దొడ్డినీ గుర్తించగలిగితే, యెహోవాను విడిచిపెట్టినందుకు యూదావారు ఏ సాకు చెప్పగలరు? నిజంగానే, వారు ‘యోచింపలేదు.’ ఒక విధంగా చెప్పాలంటే, తమ సమృద్ధి, చివరికి తమ ఉనికి కూడా యెహోవాపై ఆధారపడి ఉందన్న వాస్తవాన్ని గురించిన స్పృహ వారికి లేనట్లుంది. అప్పటికీ యెహోవా యూదావారిని “నా జనులు” అని సంబోధించడం, నిజానికి దయకు నిదర్శనంగా ఉంది!

7. యెహోవా చేస్తున్న ఏర్పాట్ల ఎడల మనకున్న మెప్పును వ్యక్తపర్చగల కొన్ని మార్గాలు ఏవి?

7 మనమెన్నడూ, యెహోవా మనకోసం చేసిన వాటన్నిటిపట్ల మెప్పును చూపించడంలో విఫలమై యోచింపని విధంగా ప్రవర్తించకుండా ఉందాము! బదులుగా మనం, “నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను” అని చెప్పిన కీర్తనకర్తయైన దావీదును అనుకరించాలి. (కీర్తన 9:⁠1) యెహోవాను గూర్చిన జ్ఞానాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండడం ఈ విషయంలో మనల్ని ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే “పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము” అని బైబిలు తెలియజేస్తోంది. (సామెతలు 9:10) యెహోవా అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాల గురించి ప్రతిరోజు ధ్యానించడం, మనం కృతజ్ఞత కలిగివుండడానికీ, మన పరలోక తండ్రిని నిర్లక్ష్యం చేయకుండా ఉండడానికీ మనకు సహాయం చేస్తుంది. (కొలొస్సయులు 3:15) యెహోవా ఇలా చెబుతున్నాడు: “స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.”​—⁠కీర్తన 50:23.

‘ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవునికి’ ఘోరమైన అవమానం

8. యూదా ప్రజలను ‘పాపిష్టి జనమని’ ఎందుకు పిలువవచ్చు?

8 యెషయా శక్తివంతమైన మాటలనుపయోగిస్తూ యూదా జనాంగానికి తన సందేశాన్నిలా కొనసాగిస్తున్నాడు: “పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.” (యెషయా 1:4) దుష్టచర్యలు మోయలేని భారంలా తయారయ్యేంతగా పోగుకాగలవు. సొదొమ గొమొఱ్ఱాల పాపం “బహు భారమైనది” అని అబ్రాహాము దినాల్లో యెహోవా వర్ణించాడు. (ఆదికాండము 18:20) ఇప్పుడు యూదా ప్రజల్లో అటువంటిదే కనిపిస్తోంది, ఎందుకంటే వారు “దోషభరితమైన” ప్రజలని యెషయా చెబుతున్నాడు. అంతేగాక ఆయన వారిని “దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా” అని పిలుస్తున్నాడు. అవును, యూదావారు దారితప్పిన పిల్లలవంటివారు. వారు ‘ఆయనను విడిచి తొలగిపోయారు’ లేదా న్యూ రివైజ్డ్‌ స్టాండర్డ్‌ వర్షన్‌ చెబుతున్నట్లుగా, వారు తమ తండ్రి నుండి “పూర్తిగా వేరైపోయారు.”

9. ‘ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు’ అనే పదబంధం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

9 యూదావారు దారితప్పి ప్రవర్తిస్తూ “ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని” పట్ల ఘోరమైన అగౌరవాన్ని చూపిస్తున్నారు. యెషయా గ్రంథంలో కాస్త తేడాలతో 25 సార్లు కనిపించే ఈ పదబంధం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? పరిశుద్ధంగా ఉండడమంటే శుభ్రంగా, స్వచ్ఛంగా ఉండడమని భావం. యెహోవా సర్వోన్నత స్థాయిలో పరిశుద్ధుడు. (ప్రకటన 4:8) ప్రధాన యాజకుని తలపాగా మీద ఉండే బంగారు రేకుపై ముద్రవేయబడిన “యెహోవా పరిశుద్ధుడు” అనే పదాలను చూసినప్పుడల్లా ఇశ్రాయేలీయులకు ఈ వాస్తవం జ్ఞాపకం చేయబడేది. (నిర్గమకాండము 39:30) కాబట్టి, యెషయా యెహోవాను “ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని”గా పేర్కొనడం ద్వారా యూదా పాపపు గంభీరతను నొక్కిచెబుతున్నాడు. అంతెందుకు, ఈ తిరుగుబాటుదారులు, “నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను” అని తమ పితరులకు ఇవ్వబడిన ఆజ్ఞను సూటిగా అతిక్రమిస్తున్నారు!​—⁠లేవీయకాండము 11:44.

10. “ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని” మనమెలా అగౌరవపరచకుండా ఉండవచ్చు?

10 యూదావారు “ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని” అగౌరవపరిచిన మాదిరిని క్రైస్తవులు నేడు ఎంతమాత్రం అనుసరించకూడదు. వారు యెహోవా పరిశుద్ధతను అనుకరించాలి. (1 పేతురు 1:14) వారు ‘చెడుతనమును అసహ్యించుకోవాలి.’ (కీర్తన 97:10) లైంగిక అవినీతి, విగ్రహారాధన, దొంగతనం, విపరీతమైన త్రాగుడు వంటివి క్రైస్తవ సంఘాన్ని కలుషితం చేయగలవు. అందుకే వీటిని మానుకోవడానికి నిరాకరించేవారు సంఘం నుండి బహిష్కరించబడతారు. చివరికి, పశ్చాత్తాపపడకుండా చెడు ప్రవర్తనలో కొనసాగేవారు దేవుని రాజ్య ప్రభుత్వ ఆశీర్వాదాలను కూడా పొందలేరు. నిజంగా, అలాంటి దుష్టకార్యాలకు పాల్పడడమంటే, “ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని” ఘోరంగా అవమానించడమే.​—⁠రోమీయులు 1:26, 27; 1 కొరింథీయులు 5:6-11; 6:9, 10.

తలనుండి పాదాలవరకు వ్యాధిగ్రస్తమే

11, 12. (ఎ) యూదాలోని చెడు పరిస్థితిని వివరించండి. (బి) మనం యూదాను గురించి ఎందుకు జాలిపడకూడదు?

11 తర్వాత యెషయా, యూదావారున్న వ్యాధిగ్రస్త స్థితిని చూపిస్తూ వారితో తర్కించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు?” ఒక విధంగా చెప్పాలంటే, యెషయా వారినిలా అడుగుతున్నాడు: ‘మీరు పడిన బాధలు చాలవా? తిరుగుబాటు చేసి ఇంకా మీకు మీరు హాని చేసుకోవడం దేనికి?’ యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యెను. అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు.” (యెషయా 1:5, 6) యూదా అసహ్యకరమైన, వ్యాధిగ్రస్త స్థితిలో ఉంది, ఆధ్యాత్మికంగా తలనుండి పాదాల వరకూ రోగంతో ఉంది. నిజంగా, చాలా భయంకరమైన రోగావస్థ!

12 మనం యూదాను చూసి జాలిపడాలా? ఎంత మాత్రం అవసరం లేదు! శతాబ్దాల క్రితం, అవిధేయతకు చెల్లించవలసిన మూల్యం గురించి మొత్తం ఇశ్రాయేలు జనాంగమంతా తగినరీతిలో హెచ్చరించబడింది. పాక్షికంగా, వారికిలా చెప్పబడింది: “యెహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తివరకు మోకాళ్లమీదను తొడల మీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును.” (ద్వితీయోపదేశకాండము 28:35) సూచనార్థక భావంలో, యూదా ఇప్పుడు తన మొండి వైఖరికి పర్యవసానాలను అనుభవిస్తోంది. యూదావారు యెహోవాకు విధేయత చూపించి ఉంటే దీన్నంతటినీ తప్పించుకోవడం సాధ్యమై ఉండేది.

13, 14. (ఎ) యూదాకు ఏ గాయాలయ్యాయి? (బి) యూదా అనుభవిస్తున్న బాధలు అది తన తిరుగుబాటు విధానాన్ని మార్చుకునేలా చేస్తాయా?

13 యెషయా యూదా దయనీయ స్థితిని ఇంకా ఇలా వర్ణిస్తున్నాడు: “ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.” (యెషయా 1:6బి) ఇక్కడ ప్రవక్త మూడు రకాల చెరుపులను గురించి చెబుతున్నాడు: గాయములు (ఖడ్గం లేదా కత్తి వంటివాటితో వేయబడిన గాట్లు), దెబ్బలు (కొట్టడం మూలంగా ఏర్పడిన వాతలు), పచ్చిపుండ్లు (ఈమధ్యనే వచ్చిన మానని కురుపులు). ఊహించదగిన అన్ని విధాల్లోనూ కఠినంగా శిక్షించబడి, శరీరంలోని ప్రతి అవయవానికీ గాయాలైన వ్యక్తి గురించి ఇక్కడ చెప్పబడుతోంది. యూదా నిజంగా చాలా దుర్భరమైన స్థితిలో ఉంది.

14 యూదా అనుభవిస్తున్న దయనీయ స్థితి తిరిగి అది యెహోవా వద్దకు వచ్చేలా చేస్తుందా? లేదు! యూదా, “ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును” అని సామెతలు 29:1 నందు వర్ణించబడిన తిరుగుబాటుదారుడిలా ఉంది. ఆ జనాంగం స్వస్థత పొందలేని దానిలా ఉంది. యెషయా చెబుతున్నట్లుగా, దాని గాయములు “పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.” * ఒక విధంగా, యూదా తెరచుకొనివున్న, కట్టుకట్టబడని, అంతటా వ్యాపిస్తున్న పుండులా ఉంది.

15. ఆధ్యాత్మికంగా వ్యాధిగ్రస్తం కాకుండా మనల్ని మనం ఏ యే విధాలుగా కాపాడుకోగలం?

15 యూదా నుండి ఒక పాఠాన్ని నేర్చుకుని, మనం ఆధ్యాత్మికంగా వ్యాధిగ్రస్తులం కాకుండా జాగ్రత్త వహించాలి. శారీరక అనారోగ్యంలాగే, అది మనలో ఎవరికైనా రావచ్చు. ఎంతైనా, మనలో ఎవరం మాత్రం శారీరక కోరికలకు లొంగిపోయే స్థితిలోలేము? అత్యాశ లేక అధికానందం పొందాలనే కోరిక మన హృదయంలో వేళ్లూనవచ్చు. కాబట్టి, “చెడ్డదాని నసహ్యించు”కునేందుకు మనకు మనం తర్ఫీదునిచ్చుకుని, “మంచిదానిని హత్తుకొని” ఉండాల్సిన అవసరముంది. (రోమీయులు 12:9) అంతేగాక మనం మన అనుదిన జీవితాల్లో దేవుని ఆత్మ ఫలాలను ప్రతిఫలింపజేయాల్సిన అవసరం ఉంది. (గలతీయులు 5:22, 23) అలా చేయడం ద్వారా, యూదాను పట్టిపీడించిన స్థితిని అంటే తల నుండి పాదాల వరకు ఆధ్యాత్మికంగా వ్యాధిగ్రస్తమయ్యే స్థితిని తప్పించుకోగలుగుతాము.

పాడైపోయిన ఒక దేశం

16. (ఎ) యూదా భూప్రాంత స్థితిని యెషయా ఇప్పుడు ఎలా వివరిస్తున్నాడు? (బి) ఈ మాటలు ఆహాజు పరిపాలనలో చెప్పబడి ఉండవచ్చునని కొందరు ఎందుకంటారు, కానీ వాటిని మనమెలా అర్థం చేసుకోవచ్చు?

16 యెషయా ఇప్పుడు తన వైద్య సాదృశ్యాన్ని వదిలి, యూదా భూప్రాంత స్థితివైపుకు మరలుతున్నాడు. ఆయనిప్పుడు యుద్ధ భీభత్సానికి గురైన మైదానం వైపు చూస్తున్నట్లుగా ఇలా అంటున్నాడు: “మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను; మీ యెదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు, అన్యులకు తటస్థించు నాశనమువలె అది పాడైపోయెను.” (యెషయా 1:7) ఈ మాటలు యెషయా గ్రంథ తొలిభాగంలోనే ఉన్నప్పటికీ, ప్రవక్త ఆ మాటలను ఆ తర్వాత అంటే దుష్టరాజైన ఆహాజు పరిపాలనా కాలంలో పలికి ఉంటాడని కొంతమంది పండితులు అంటారు. ఉజ్జియా పరిపాలన ఎంతగానో వర్ధిల్లింది కాబట్టి అలాంటి విషాదభరితమైన వివరణ దానికి సరిపోదని వాళ్లంటారు. నిజమే, యెషయా గ్రంథం కాలక్రమానుసారంగా సంపుటీకరించబడిందా లేదా అన్నది ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే, నాశనాన్ని గూర్చిన యెషయా మాటలు బహుశా ప్రవచనార్థకమైనవే కావచ్చు. పైవ్యాఖ్యానాన్ని చేయడంలో యెషయా, బైబిలునందు మరోచోట కనిపించే పద్ధతిని ఉపయోగిస్తున్నాడు. అదేమిటంటే భవిష్యత్తులో జరుగబోయే సంఘటనను ఇప్పటికే జరిగిపోయినట్లుగా వివరించడం, అలా చేయడం ద్వారా ప్రవచన నేరవేర్పు యొక్క ఖచ్చితత్వాన్ని నొక్కిచెప్పవచ్చు.​—⁠ప్రకటన 11:15 పోల్చండి.

17. నాశనాన్ని గూర్చిన ప్రవచనార్థక వివరణ యూదావారికి ఎందుకు ఆశ్చర్యం కలిగించకూడదు?

17 ఏదేమైనప్పటికీ, యూదా నాశనాన్ని గూర్చిన ప్రవచనార్థక వివరణ, ఈ మొండి అవిధేయులైన ప్రజలకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించవలసిన అవసరం లేదు. తిరుగుబాటు చేస్తే ఏమి జరుగుతుందో శతాబ్దాల క్రితమే యెహోవా వారిని హెచ్చరించాడు. ఆయనిలా అన్నాడు: “నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు. జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను; మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును.”​—⁠లేవీయకాండము 26:32, 33; 1 రాజులు 9:6-8.

18-20. యెషయా 1:7, 8 లోని మాటలు ఎప్పుడు నెరవేరాయి, ఈసారి యెహోవా ఏ విధంగా “బహుకొద్దిపాటి శేషము”ను నిలుపుతాడు?

18 ఇశ్రాయేలు నిర్మూలనకూ, యూదాలో విస్తృతమైన నాశనానికీ బాధకూ దారితీసిన అష్షూరు దురాక్రమణల సమయంలో యెషయా 1:7, 8 వచనాల్లోని మాటలు నెరవేరి ఉంటాయని స్పష్టమౌతుంది. (2 రాజులు 17:5, 18; 18:11, 13; 2 దినవృత్తాంతములు 29:8, 9) అయితే యూదా పూర్తిగా నిర్మూలించబడలేదు. యెషయా ఇలా చెబుతున్నాడు: “ద్రాక్షతోటలోని గుడిసెవలెను దోసపాదులలోని పాకవలెను ముట్టడి వేయబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడి యున్నది.”​—యెషయా 1:8.

19 నాశనమంతటి మధ్యన, “సీయోను కుమార్తె” అంటే యెరూషలేము నిలువబడే ఉంటుంది. కానీ ఆమె చాలా దుర్బలంగా అంటే ద్రాక్షతోటలోని గుడిసెలా లేక దోసపాదులలోని కావలివాని మంచెలా కనిపిస్తుంది. నైలునది మీదగా ప్రయాణిస్తూ 19 వ శతాబ్దానికి చెందిన ఒక పండితుడు అలాంటి గుడిసెలనే చూసినప్పుడు ఆయనకు యెషయా మాటలు జ్ఞాపకం వచ్చాయి. అవి, “ఉత్తరపుగాలి నుండి అంతంత మాత్రంగా దాపునిచ్చే కంచెతో సమానమైనవని” ఆయన వివరిస్తున్నాడు. యూదాలో కోత ముగిసిన తర్వాత ఈ గుడిసెలను అలాగే వదిలేస్తే అవి కూలిపడిపోతాయి. అయితే, అన్నిటినీ జయిస్తున్న అష్షూరు సైన్యాల ఎదుట యెరూషలేము ఎంత దుర్బలంగా కనిపించినా, అది నిలుస్తుంది.

20 యెషయా ఈ ప్రవచనార్థక వ్యాఖ్యానాన్ని ఇలా ముగిస్తున్నాడు: “సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని యెడల మనము సొదొమవలె నుందుము, గొమొఱ్ఱాతో సమానముగా ఉందుము.” (యిషయా 1:9) * చివరికి యెహోవా అష్షూరు శక్తికి వ్యతిరేకంగా యూదాకు సహాయం చేసేందుకు వస్తాడు. సొదొమ గొమొఱ్ఱాలవలె యూదా నిర్మూలించబడదు. అది ఉనికిలోనే ఉంటుంది.

21. బబులోను యెరూషలేమును నాశనం చేసిన తర్వాత, యెహోవా ఎందుకు ‘బహుకొద్దిపాటి శేషమును నిలిపాడు’?

21 వందకంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత యూదా మళ్లీ ప్రమాదంలో ఉంది. అష్షూరు ద్వారా ఇవ్వబడిన క్రమశిక్షణ నుండి ప్రజలు పాఠం నేర్చుకోలేదు. “వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు” వచ్చిరి. ఫలితంగా, “నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.” (2 దినవృత్తాంతములు 36:16) బబులోను చక్రవర్తియైన నెబుకద్నెజరు యూదాను జయించాడు, ఈ సారి, ‘ద్రాక్షతోటలోని గుడిసెవలె’ ఇక ఏదీ మిగలలేదు. చివరికి యెరూషలేము కూడా నాశనం చేయబడింది. (2 దినవృత్తాంతములు 36:17-21) అయినా, యెహోవా ‘బహుకొద్దిపాటి శేషమును నిలిపాడు.’ యూదా70 సంవత్సరాలపాటు చెరలో ఉన్నప్పటికీ యెహోవా ఆ జనాంగం, ప్రాముఖ్యంగా వాగ్దానం చేయబడిన మెస్సీయను ఉత్పన్నం చేసే దావీదు వంశం కొనసాగేలా చూశాడు.

22, 23. మొదటి శతాబ్దంలో, యెహోవా ‘బహుకొద్దిపాటి శేషమును’ ఎందుకు ‘నిలిపాడు’?

22 మొదటి శతాబ్దంలో, దేవుని నిబంధన ప్రజలుగా ఇశ్రాయేలు వారు చివరి సంక్షోభ స్థితిని ఎదుర్కొన్నారు. యేసు తనను తాను వాగ్దానం చేయబడిన మెస్సీయగా వెల్లడిపర్చుకున్నప్పుడు, ఆ జనాంగం ఆయనను తిరస్కరించింది, ఫలితంగా, యెహోవా వారిని తిరస్కరించాడు. (మత్తయి 21:43; 23:37-39; యోహాను 1:11) యెహోవా భూమిపై ప్రత్యేకమైన జనాంగాన్ని కలిగివుండడం ఇక అంతటితో ముగిసిందా? లేదు. యెషయా 1:9 కి మరో నెరవేర్పు ఉందని అపొస్తలుడైన పౌలు చూపించాడు. సెప్టాజింట్‌ వర్షన్‌ నుండి ఎత్తిచెబుతూ ఆయనిలా వ్రాశాడు: “యెషయా ముందు చెప్పిన ప్రకారము​—⁠సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింపచేయకపోయినయెడల సొదొమవలె నగుదుము, గొమొఱ్ఱాను పోలియుందుము.”​—⁠రోమీయులు 9:29.

23 ఈసారి తప్పించబడేవారు, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచే అభిషిక్త క్రైస్తవులు. మొదటగా వీరు, విశ్వసించిన యూదులు. తర్వాత, విశ్వసించిన అన్యులు వారితో కలిశారు. వారంతా కలిసి క్రొత్త ఇశ్రాయేలుగా అంటే “దేవుని ఇశ్రాయేలు”గా రూపొందారు. (గలతీయులు 6:16; రోమీయులు 2:29) ఈ “సంతానము” సా. శ. 70 లో జరిగిన యూదా విధాన నాశనాన్ని తప్పించుకుని నిలిచింది. నిజానికి “దేవుని ఇశ్రాయేలు” ఈనాటికీ మనతో ఉంది. విశ్వసించే లక్షలాదిమంది ఇప్పుడు దానితో కలుస్తున్నారు. వారు “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము”గా రూపొందుతారు.​—⁠ప్రకటన 7:9.

24. మానవజాతి ఎదుర్కొనే అతిగొప్ప సంక్షోభం నుండి తప్పించబడాలంటే అందరూ దేన్ని గుర్తించాలి?

24 త్వరలోనే ఈ లోకం అర్మగిద్దోను యుద్ధాన్ని ఎదుర్కొంటుంది. (ప్రకటన 16:14, 16) అది, అష్షూరుగానీ బబులోనుగానీ యూదాను ఆక్రమించడంకన్నా, సా. శ. 70 లో యూదాను రోము నాశనం చేయడంకన్నా కూడా పెద్ద సంక్షోభమే. అయినప్పటికీ, తప్పించబడేవారు ఉంటారు. (ప్రకటన 7:14) కాబట్టి యెషయా యూదాకు చెప్పిన మాటలను అందరూ జాగ్రత్తగా పరిశీలించడం ఎంత ఆవశ్యకమో కదా! అప్పట్లో, నమ్మినవారికి ఆ మాటలు తప్పించబడే అవకాశాన్నిచ్చాయి. నేడు కూడా నమ్మేవారికి అవి తప్పించబడే అవకాశాన్ని ఇవ్వగలవు.

[అధస్సూచీలు]

^ ఈ సందర్భంలో, “ఇశ్రాయేలు” రెండు-గోత్రాల యూదా రాజ్యాన్ని సూచిస్తోంది.

^ యెషయా మాటలు ఆయన కాలం నాటి వైద్య విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. బైబిలు పరిశోధకుడైన ఇ. హెచ్‌. ప్లంట్రే ఇలా పేర్కొంటున్నాడు: “చీము పట్టిన పుండును ‘మూయడానికి’ లేక ‘ఒత్తడానికి’ మొదటగా చీము పిండబడుతుంది; తర్వాత, హిజ్కియాకు చేసినట్లుగానే, (అధ్యా. 38:21) దానికి ఔషధకట్టు ‘కట్టబడేది,’ ఆ తర్వాత ఆ పుండు ఏదైనా తైలముతో లేక లేపనంతో, బహుశా లూకా 10:34 లో చెప్పబడినట్లు నూనె, ద్రాక్షారసంతో శుభ్రం చేయబడుతుంది.”

^ సి. ఎఫ్‌. కైల్‌ మరియు ఎఫ్‌. డెలిట్ష్‌ వ్రాసిన కామెంటరీ ఆన్‌ ది ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ ఇలా చెబుతోంది: “ప్రవక్త ప్రసంగం ఇక్కడ ముగింపుకు చేరుకుంటుంది. ఇక్కడ అది రెండు భాగాలుగా విభాగించబడడమనే వాస్తవం, 9 మరియు 10 వచనాల మధ్యన ఉంచబడిన స్థలాన్ని బట్టి సూచించబడుతుంది. ఇలా స్థలాన్ని ఉంచడం ద్వారా లేక వాక్యాన్ని విడగొట్టడం ద్వారా పెద్ద పెద్ద లేక చిన్న చిన్న విభాగాలుగా వేరుచేసే విధానం, అచ్చుగుర్తులకన్నా ఉచ్చారణలకన్నా ప్రాచీనమైనది, అది అత్యున్నతమైన ప్రాచీన సాంప్రదాయంపై ఆధారపడి ఉంది.”

[అధ్యయన ప్రశ్నలు]

[20 వ పేజీలోని చిత్రం]

సొదొమ గొమొఱ్ఱాలలా యూదా నిరంతరం నిర్మానుష్యంగా విడువబడదు