కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక రాజు విశ్వాసానికి ప్రతిఫలం ఇవ్వబడింది

ఒక రాజు విశ్వాసానికి ప్రతిఫలం ఇవ్వబడింది

ఇరవై-తొమ్మిదవ అధ్యాయం

ఒక రాజు విశ్వాసానికి ప్రతిఫలం ఇవ్వబడింది

యెషయా 36:​1–39:8

1, 2. హిజ్కియా, ఆహాజు కంటే మంచి రాజునని ఎలా నిరూపించుకున్నాడు?

 హిజ్కియా యూదాకు రాజైనప్పుడు ఆయనకు 25 సంవత్సరాలు. ఆయన ఎలాంటి పరిపాలకుడవుతాడు? ఆయన తన తండ్రి ఆహాజు రాజు అడుగుజాడల్లో నడుస్తూ, అబద్ధ దేవుళ్లను అనుసరించమని తన అనుచరులను ప్రేరేపిస్తాడా? లేక ఆయన తన పితరుడైన దావీదు రాజు చేసినట్లుగా, ప్రజలను యెహోవా ఆరాధన వైపుగా నడిపిస్తాడా?​—⁠2 రాజులు 16:2.

2 హిజ్కియా సింహాసనాసీనుడైన వెంటనే, ఆయన “యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిననుసరిం[చాలని]” కోరుకుంటున్నాడని స్పష్టమైంది. (2 రాజులు 18:​2, 3) ఆయన తన పరిపాలన మొదటి సంవత్సరంలో, యెహోవా ఆలయాన్ని బాగుచేసి, ఆలయ సేవలు పునఃప్రారంభించమని ఆజ్ఞ జారీ చేశాడు. (2 దినవృత్తాంతములు 29:​3, 7, 11) ఆయన గొప్ప పస్కాపండుగ ఆచరణను ఏర్పాటు చేసి, దానికి ఉత్తరానున్న ఇశ్రాయేలు పది-గోత్రాలతో సహా మొత్తం జనాంగాన్ని ఆహ్వానించాడు. అది ఎంతటి చిరస్మరణీయమైన పండుగ! సొలొమోను రాజు కాలం తర్వాత అటువంటిది మరొకటి జరుగలేదు.​—⁠2 దినవృత్తాంతములు 30:1, 25, 26.

3. (ఎ) హిజ్కియా ఏర్పాటు చేసిన పస్కా పండుగకు హాజరైన ఇశ్రాయేలు యూదా నివాసులు ఏ చర్య తీసుకున్నారు? (బి) ఆ పస్కా పండుగకు హాజరైన వారు తీసుకున్న నిర్ణాయకమైన చర్య నుండి నేటి క్రైస్తవులు ఏమి నేర్చుకోవచ్చు?

3 పస్కా ఆచరణ ముగింపులో, దానికి హాజరైనవారంతా దేవతాస్తంభములను ముక్కలుగా నరికి, విగ్రహములను నిర్మూలము చేసి, అబద్ధ దేవుళ్ళ ఉన్నతస్థలములను, బలిపీఠములను పడగొట్టేలా కదిలించబడ్డారు, ఆ తర్వాత వారు సత్య దేవుని సేవ చేయాలని దృఢనిశ్చయం చేసుకొని తమ పట్టణములకు తిరిగి వెళ్ళిపోయారు. (2 దినవృత్తాంతములు 31:1) మునుపు వారికున్న మతపరమైన దృక్పథానికి ఇదెంత భిన్నం! నేటి నిజ క్రైస్తవులు దీని నుండి, ‘సమాజంగా కూడడాన్ని మానకుండా’ ఉండాల్సిన ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చు. స్థానిక సంఘాల్లో లేక సమావేశాల్లో పెద్ద ఎత్తున అలా సమకూడడం, వారు ప్రోత్సాహాన్ని పొందడంలోనూ, ‘ప్రేమచూపడానికి సత్కార్యములు చేయడానికి పురికొల్పుకునేందుకు’ సహోదరత్వం చేత, అలాగే దేవుని ఆత్మచేత కదిలింపబడడంలోనూ ఆవశ్యకమైన పాత్రను నిర్వహిస్తుంది.​—⁠హెబ్రీయులు 10:23-25.

విశ్వాసం పరీక్షించబడింది

4, 5. (ఎ) అష్షూరుపై తాను ఆధారపడిలేనని హిజ్కియా ఎలా చూపించాడు? (బి) యూదాకు వ్యతిరేకంగా సన్హెరీబు ఏ సైనిక చర్య తీసుకున్నాడు, యెరూషలేముపై వెంటనే జరుగనున్న దాడిని నివారించడానికి హిజ్కియా ఏ చర్యలు తీసుకున్నాడు? (సి) అష్షూరీయుల నుండి యెరూషలేమును కాపాడడానికి హిజ్కియా ఎలా సిద్ధమవుతాడు?

4 యెరూషలేముకు తీవ్రమైన శ్రమలు ముందున్నాయి. విశ్వాసంలేని తన తండ్రి ఆహాజు, అష్షూరీయులతో చేసుకున్న సంధిని హిజ్కియా రద్దు చేశాడు. ఆయన చివరికి, అష్షూరు మిత్రరాజ్యాల వారైన ఫిలిష్తీయులను కూడా లోబరచుకున్నాడు. (2 రాజులు 18:​7, 8) అది అష్షూరు రాజుకు ఆగ్రహం కలిగించింది. దాని గురించి మనమిలా చదువుతాము: “హిజ్కియా రాజుయొక్క పదునాలుగవ సంవత్సరమున అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనెను.” (యెషయా 36:1) క్రూరమైన అష్షూరు సైన్యం వెంటనే చేయనున్న దాడి నుండి యెరూషలేమును కాపాడాలని ఆశిస్తూ కావచ్చు, హిజ్కియా సన్హెరీబుకు అతి పెద్ద మొత్తంలో కప్పం చెల్లించడానికి, అంటే 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారం చెల్లించడానికి అంగీకరిస్తాడు. *​—⁠2 రాజులు 18:14.

5 కప్పం చెల్లించడానికి రాజరిక కోశాగారంలో తగినంత బంగారం, వెండి లేదు గనుక, హిజ్కియా తాను ఆలయంలో నుండి తీసుకోగలిగినంత మేరకు, అమూల్యమైన లోహాలను తీసుకుంటాడు. ఆయన దేవాలయపు తలుపులకున్న బంగారమును కూడా తీయించి సన్హెరీబుకు పంపిస్తాడు. ఇది అష్షూరీయుడ్ని తృప్తిపరుస్తుంది, అయితే అది కొంతకాలం వరకే. (2 రాజులు 18:​15, 16) అయితే అష్షూరీయులు యెరూషలేమును ఎంతోకాలం పాటు అలా విడిచిపెట్టరనే విషయాన్ని హిజ్కియా గుర్తిస్తాడని స్పష్టమవుతుంది. కాబట్టి, అందుకు తగిన విధంగా సిద్ధపడాల్సి ఉంది. దాడిచేస్తున్న అష్షూరీయులకు నీటిని సరఫరా చేయగల నీటి మూలాలను ప్రజలు అడ్డగిస్తారు. హిజ్కియా యెరూషలేము ప్రాకారములను కూడా పటిష్ఠపరచి, “ఈటెలను డాళ్ళను విస్తారముగా” చేయించి, ఆయుధాగారాన్ని నిర్మిస్తాడు.​—⁠2 దినవృత్తాంతములు 32:4, 5.

6. హిజ్కియా ఎవరిపై నమ్మకం పెట్టుకుంటాడు?

6 అయితే, హిజ్కియా యుక్తితో కూడిన యుద్ధతంత్రాలపై లేక ప్రాకారములపై గాక సైన్యములకధిపతియగు యెహోవాపై నమ్మకం పెట్టుకుంటాడు. ఆయన తన సైన్యాధిపతులకు ఇలా ఆదేశిస్తాడు: “మీరు దిగులుపడకుడి, ధైర్యము విడువకుడి; అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు. మాంససంబంధమైన బాహువే అతనికి అండ; మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నా[డు].” దానికి ప్రతిస్పందనగా ప్రజలు, “యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మిక” ఉంచడం మొదలుపెడతారు. (2 దినవృత్తాంతములు 32:​7, 8) యెషయా ప్రవచనంలోని 36 నుండి 39 అధ్యాయాలు సమీక్షించబడుతుండగా, జరుగబోయే ఉత్తేజభరితమైన సంఘటనలను మనోఫలకంపై చిత్రించుకోండి.

రబ్షాకే తన వాదనను వినిపిస్తాడు

7. రబ్షాకే ఎవరు, అతడు యెరూషలేముకు ఎందుకు పంపబడ్డాడు?

7 లొంగిపొమ్మని ఆజ్ఞాపించడానికి సన్హెరీబు ఇద్దరు ఉన్నతాధికారులతో పాటు రబ్షాకేను (ఇది సైనిక హోదాను సూచిస్తుంది గానీ పేరు కాదు) యెరూషలేముకు పంపిస్తాడు. (2 రాజులు 18:​17) నగర ప్రాకారముల వెలుపల వీరిని హిజ్కియా ప్రతినిధులు ముగ్గురు కలుస్తారు, వారు హిజ్కియా గృహనిర్వాహకుడైన ఎల్యాకీము, శాస్త్రియైన షెబ్నా, దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహు.​—⁠యెషయా 36:2, 3.

8. రబ్షాకే యెరూషలేము లొంగిపోయేలా చేయడానికి ఎలా ప్రయత్నిస్తాడు?

8 రబ్షాకే లక్ష్యం చాలా సరళమైనది​—⁠పోరాడకుండా యెరూషలేము లొంగిపోయేలా దాన్ని ఒప్పించడమే. హీబ్రూ భాషలో మాట్లాడుతూ, ఆయన బిగ్గరగా మొదట ఇలా అంటాడు: “నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి? . . . ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు?” (యెషయా 36:​4, 5) ఆ తర్వాత రబ్షాకే, వారు పూర్తిగా ఒంటరివారని భయకంపితులైయున్న యూదులకు గుర్తుచేస్తూ, వారిని దూషిస్తాడు. వారు మద్దతు కోసం ఎవరి వైపు తిరుగగలరు? “నలిగిన రెల్లు” అయిన ఐగుప్తు వైపుకా? (యెషయా 36:6) ఈ సమయంలో, ఐగుప్తు నలిగిన రెల్లు వలెనే ఉంటుంది; వాస్తవానికి, ఆ మాజీ ప్రపంచ శక్తిని ఇతియోపియా తాత్కాలికంగా జయించింది, ఐగుప్తు ప్రస్తుత ఫరో అయిన తిర్హాకా ఐగుప్తీయుడు కాదు గానీ ఇతియోపియావాడు. అష్షూరు అతడిని జయించబోతోంది. (2 రాజులు 19:​8, 9) ఐగుప్తు తనను తాను రక్షించుకోలేదు గనుక అది యూదాకు కూడా ఏ సహాయాన్ని ఇవ్వలేదు.

9. రబ్షాకే, యెహోవా తన ప్రజలను విడనాడతాడనే ముగింపుకు రావడానికి ఏది కారణమని స్పష్టమవుతుంది, కానీ వాస్తవాలు ఏమిటి?

9 రబ్షాకే ఇప్పుడు, యెహోవా తన ప్రజలను బట్టి సంతోషించడం లేదు గనుక ఆయన వారి పక్షాన యుద్ధం చేయడని వాదిస్తాడు. రబ్షాకే ఇలా అంటాడు: “మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో, సరే; . . . హిజ్కియా యెవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా.” (యెషయా 36:7) అయితే, యూదులు దేశంలోని ఉన్నత స్థలములను, బలిపీఠములను పడగొట్టడం ద్వారా యెహోవాను నిరాకరించే బదులు, వారు వాస్తవానికి యెహోవా వద్దకు తిరిగి వచ్చారు.

10. యూదాను రక్షించేవారు ఎక్కువమందైనా కొద్దిమందైనా ఎందుకు ఏమీ తేడా ఉండదు?

10 యూదులు సైనికపరంగా ఎందుకూ పనికిరాని స్థితిలో ఉన్నారని ఆ తర్వాత రబ్షాకే వారికి గుర్తుచేస్తాడు. అతడు ఈ అహంకారపూరిత సవాలును చేస్తాడు: “రెండు వేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి యున్నయెడల నేను వాటిని నీకిచ్చెదను.” (యెషయా 36:8) అయితే వాస్తవానికి, యూదాకున్న తర్ఫీదు పొందిన అశ్వదళం పెద్దదైనా చిన్నదైనా ఏమైనా తేడా ఉంటుందా? ఉండదు, ఎందుకంటే యూదా రక్షణ శ్రేష్ఠమైన సైనిక శక్తిపై ఆధారపడి ఉండదు. సామెతలు 21:31 విషయాలను ఇలా వివరిస్తుంది: “యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము.” యెహోవా ఆశీర్వాదం అష్షూరీయులపైనే ఉందిగానీ యూదులపై లేదని రబ్షాకే ఆరోపిస్తాడు. లేకపోతే, అష్షూరీయులు యూదా ప్రాంతంలోకి అంత లోపలికి చొచ్చుకొనిపోయి ఉండగలిగేవారు కాదని అతడు వాదిస్తాడు.​—⁠యెషయా 36:​9, 10.

11, 12. (ఎ) రబ్షాకే “యూదుల భాష”లో మాట్లాడడానికే ఎందుకు పట్టుబట్టుతాడు, వింటున్న యూదులను అతడు ఎలా శోధించడానికి ప్రయత్నిస్తాడు? (బి) రబ్షాకే మాటలు యూదులపై ఎలాంటి ప్రభావాన్ని చూపించగలవు?

11 నగర ప్రాకారముల పైనుండి రబ్షాకే వాదనలను వినేవారిపై అవి చూపించగల ప్రభావం గురించి హిజ్కియా ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ఈ యూదా అధికారులు ఇలా విజ్ఞప్తి చేస్తారు: “చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము, ప్రాకారముమీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకు[ము].” (యెషయా 36:​11) కానీ రబ్షాకేకు సిరియా భాషలో మాట్లాడే ఉద్దేశమేమీ లేదు. యుద్ధం చేయకుండానే యూదులు లొంగిపోయేలా, యెరూషలేమును జయించగలిగేలా యూదుల్లో అనుమానపు భీజాలను, భయాన్ని నాటాలని అతడు అనుకుంటున్నాడు. (యెషయా 36:​12) కాబట్టి అష్షూరీయుడు మళ్లీ “యూదుల భాష”లో మాట్లాడతాడు. ఆయన యెరూషలేము నివాసులను ఇలా హెచ్చరిస్తాడు: “హిజ్కియాచేత మోసపోకుడి; మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు.” దీని తర్వాత, అష్షూరు పరిపాలన క్రింద యూదులకు జీవితం ఎలా ఉండగలదనే దాన్ని వర్ణించడం ద్వారా అతడు తన శ్రోతలను ఇలా శోధించడానికి ప్రయత్నిస్తాడు: “నాతో సంధి చేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్షచెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచునుండును. . . . నేను వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును మిమ్మును తీసికొనిపోదును.”​—యెషయా 36:13-17.

12 అష్షూరీయల దురాక్రమణ మూలంగా యూదులు పంటలు వేయలేదు గనుక ఈ సంవత్సరం వారికి కోత ఉండదు. ప్రాకారముపై నుండి వింటున్న వారికి, రసమయమైన ద్రాక్షపండ్లు తినడం, చల్లని నీళ్లు త్రాగడం అనే ఊహ ఎంతో మరులుగొలిపేదిగా అనిపించవచ్చు. అయితే రబ్షాకే యూదులను బలహీనపరిచే ప్రయత్నాలు అంతటితో ముగియలేదు.

13, 14. రబ్షాకే పలురకాల వాదనలు చేసినప్పటికీ, షోమ్రోనుకు జరిగినది, యూదాపై ఎందుకు ప్రభావాన్ని చూపలేదు?

13 అతడు తన వాదనల ఆయుధాగారం నుండి మరో మౌఖిక ఆయుధాన్ని తీస్తాడు. “యెహోవా మనలను విడిపించును” అని హిజ్కియా చెబితే ఆయన మాటలను నమ్మవద్దని అతడు యూదులను హెచ్చరిస్తాడు. అష్షూరీయులకు లొంగిపోకుండా షోమ్రోను దేవతలు పది గోత్రాలను ఆపలేకపోయాయని రబ్షాకే యూదులకు గుర్తు చేస్తాడు. అష్షూరు జయించిన ఇతర రాజ్యాల దేవుళ్ళ మాటేమిటి? అతడిలా అడుగుతాడు: “హమాతు దేవతలేమాయెను? అర్పాదు దేవతలేమాయెను? సెపర్వయీము దేవతలేమాయెను? షోమ్రోను దేశపు దేవత నా చేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా?”​—యెషయా 36:18-20.

14 నిజమే, మతభ్రష్ట షోమ్రోనుకు, హిజ్కియా అధికారం క్రింద ఉన్న యెరూషలేముకు మధ్య ఎంతో పెద్ద తేడా ఉందని, అబద్ధ దేవుళ్ళ ఆరాధకుడైన రబ్షాకేకు అర్థంకాదు. షోమ్రోను అబద్ధ దేవుళ్ళకు పది-గోత్రాల రాజ్యాన్ని రక్షించే శక్తిలేదు. (2 రాజులు 17:​7, 17, 18) మరో వైపున, హిజ్కియా పరిపాలన క్రింద ఉన్న యెరూషలేము అబద్ధ దేవుళ్ళను నిరాకరించి తిరిగి యెహోవా సేవ చేయడం మొదలుపెట్టింది. అయితే, యూదా ప్రతినిధులు ముగ్గురు ఈ విషయాన్ని రబ్షాకేకు వివరించడానికి ప్రయత్నించరు. “అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చియుండుటచేత వారెంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకొనిరి.” (యెషయా 36:​21) ఎల్యాకీము, షెబ్నా, యోవాహు హిజ్కియా వద్దకు తిరిగి వచ్చి, రబ్షాకే పలికిన మాటలను నివేదిస్తారు.​—⁠యెషయా 36:22.

హిజ్కియా ఒక నిర్ణయం తీసుకుంటాడు

15. (ఎ) హిజ్కియా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవలసి ఉంది? (బి) యెహోవా హిజ్కియాను ఎలా ధైర్యపరుస్తాడు?

15 హిజ్కియా రాజు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది. యెరూషలేము అష్షూరీయులకు లొంగిపోతుందా? ఐగుప్తు శక్తులతో చేతులు కలుపుతుందా? లేక ధైర్యంగా నిలబడి యుద్ధం చేస్తుందా? హిజ్కియా విపరీతమైన ఒత్తిడికి లోనవుతాడు. యెషయా ప్రవక్త ద్వారా యెహోవా దగ్గర విచారణ చేయమని ఎల్యాకీము, షెబ్నాలతో పాటు యాజకులలోని పెద్దలను పంపించి, ఆయన యెహోవా ఆలయానికి వెళ్తాడు. (యెషయా 37:​1, 2) రాజు దూతలు గోనెపట్ట కట్టుకొని యెషయా దగ్గరికి వచ్చి, ఇలా చెబుతారు: “ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, . . . జీవముగల దేవుని దూషించుటకై అష్షూరురాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో.” (యెషయా 37:​3-5) అవును, అష్షూరీయులు జీవంగల దేవుని సవాలు చేస్తున్నారు! యెహోవా వారి దూషణలకు అవధానం ఇస్తాడా? యెషయా ద్వారా యెహోవా హిజ్కియాను ఇలా ధైర్యపరుస్తాడు: “అష్షూరురాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును; వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును. అతని దేశమందు ఖడ్గముచేత అతనిని కూలజేయుదును.”​—యెషయా 37:6, 7.

16. సన్హెరీబు ఎలాంటి ఉత్తరములు పంపిస్తాడు?

16 ఈమధ్యలో, సన్హెరీబు రాజు లిబ్నాతో యుద్ధం చేస్తుండగా అతడి దగ్గర ఉండడానికి రబ్షాకే పిలువబడతాడు. సన్హెరీబు యెరూషలేముతో తర్వాత వ్యవహరిస్తాడు. (యిషయా 37:8) అయితే, రబ్షాకే వెళ్ళిపోవడం హిజ్కియా అనుభవిస్తున్న ఒత్తిడినేమీ తగ్గించదు. యెరూషలేము నివాసులు లొంగిపోకపోతే వారికి ఏమి జరుగుతుందో వివరించే బెదిరింపు ఉత్తరములను సన్హెరీబు పంపిస్తాడు: “అష్షూరురాజులు సకలదేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా; నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలముచేసిన . . . దేవతల సహాయమువలన తప్పించుకొనిరా? హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి?” (యెషయా 37:​9-13) ముఖ్యంగా, ఎదిరించడం మూర్ఖత్వం, ఎదిరిస్తే కష్టాలు ఇంకా ఎక్కువ అవుతాయి అని అష్షూరీయుడు అంటున్నాడు!

17, 18. (ఎ) యెహోవా కాపుదల కోసం కోరడంలో హిజ్కియా ఉద్దేశం ఏమిటి? (బి) యెహోవా యెషయా ద్వారా అష్షూరీయుడికి ఎలా సమాధానం ఇస్తాడు?

17 హిజ్కియా తాను తీసుకునే నిర్ణయం వల్ల వచ్చే పర్యవసానాల గురించి ఎంతో ఆందోళన చెందుతూ, సన్హెరీబు వ్రాసిన ఉత్తరములను విప్పి మందిరంలో యెహోవా సన్నిధిని వాటిని పరుస్తాడు. (యెషయా 37:​14) ఆయన హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, అష్షూరీయుడి బెదిరింపులను వినమని యెహోవాను వేడుకుంటాడు, ఆయన ఈ మాటలతో తన ప్రార్థన ముగిస్తాడు: “యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలిసికొనునట్లు అతని చేతిలోనుండి మమ్మును రక్షించుము.” (యెషయా 37:​15-20) హిజ్కియా ప్రధానంగా తన విడుదల గురించి చింతించడం లేదు గానీ అష్షూరు యెరూషలేమును జయిస్తే అది యెహోవా నామముపైకి తీసుకురాగల అపనింద గురించి చింతిస్తున్నాడని దీని వల్ల స్పష్టమవుతోంది.

18 హిజ్కియా ప్రార్థనకు యెహోవా ఇచ్చే సమాధానం యెషయా ద్వారా వస్తుంది. యెరూషలేము అష్షూరుకు లొంగిపోనవసరం లేదు; అది ధైర్యంగా నిలబడాలి. సన్హెరీబుతో మాట్లాడుతున్నట్లుగా, యెహోవా అష్షూరీయుడికి ఇచ్చే సందేశాన్ని యెషయా ధైర్యంగా ఇలా ప్రకటిస్తాడు: “సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది. ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది యెరూషలేము కుమారి నిన్ను చూచి [ఎగతాళిగా] తల ఊచుచున్నది.” (యిషయా 37:​21, 22) ఒక విధంగా చెప్పాలంటే, యెహోవా ఇలా అంటాడు: ‘ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుని దూషించడానికి నీవెవరవు? నీ చర్యలు నాకు తెలుసు. నీకు చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి; నీవు మహా ప్రగల్భాలు పలుకుతున్నావు. నీవు నీ సైనిక శక్తిని నమ్ముకుని దేశంలో చాలా భాగాన్ని జయించావు. కానీ నీవు అజేయమైనదానివేమీ కాదు. నేను నీ పథకాలను తారుమారు చేస్తాను. నేను నిన్ను జయిస్తాను. నీవు ఇతరులకు చేసినట్లు నేను నీకు చేస్తాను. నేను నీ ముక్కుకు గాలంవేసి అష్షూరుకు లాక్కునివెళతాను!’​యెషయా 37:23-29.

“నీకిదే సూచనయగును”

19. యెహోవా హిజ్కియాకు ఏమి సూచన ఇస్తాడు, దాని భావం ఏమిటి?

19 యెషయా ప్రవచనం నెరవేరుతుంది అనడానికి హిజ్కియాకు ఏ హామీ ఉంది? యెహోవా ఇలా సమాధానం ఇస్తున్నాడు: “నీకిదే సూచనయగును: ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము ననుభవించుదురు.” (యెషయా 37:​30) చిక్కుకుపోయివున్న యూదులకు యెహోవాయే ఆహారాన్ని అనుగ్రహిస్తాడు. అష్షూరీయుల దురాక్రమణ మూలంగా విత్తనాలు విత్తలేకపోయినప్పటికీ, మునుపటి సంవత్సరం కోత కోసిన తర్వాత మిగిలిపోయిన పరిగె నుండి ఉత్పన్నమైన ఆహారాన్ని వారు తినగలుగుతారు. తర్వాతి సంవత్సరం సబ్బాతు సంవత్సరం, వారు అంత దుర్భరమైన స్థితిలో ఉన్నప్పటికీ, తమ పొలాలను బీడుగా విడవాలి. (నిర్గమకాండము 23:​11) ప్రజలు తన మాట వింటే వారికి సరిపడేటంత ధాన్యం పండుతుందని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. ఇక తర్వాతి సంవత్సరం వారు మామూలుగానే విత్తనాలు విత్తి, తమ కష్ట ఫలాన్ని అనుభవిస్తారు.

20. అష్షూరు దాడిని తప్పించుకునే వారు ఏ విధంగా ‘క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తారు’?

20 యెహోవా ఇప్పుడు తన ప్రజలను, సులభంగా పెరికివేయబడలేని ఒక చెట్టుతో పోలుస్తాడు: “యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.” (యెషయా 37:​31, 32) అవును, యెహోవాపై నమ్మకం ఉంచేవారు దేనికీ భయపడనవసరం లేదు. వారు, వారి సంతానము దేశంలో సుస్థిరంగా స్థాపించబడి ఉంటారు.

21, 22. (ఎ) సన్హెరీబు గురించి ఏమి ప్రవచించబడింది? (బి) సన్హెరీబును గురించి యెహోవా పలికిన మాటలు ఎలా, ఎప్పుడు నెరవేరాయి?

21 యెరూషలేము గురించి అష్షూరీయుడు చేసిన బెదిరింపుల మాటేమిటి? యెహోవా ఇలా సమాధానమిస్తున్నాడు: “అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును.” (యెషయా 37:​33, 34) అష్షూరు యెరూషలేముల మధ్య యుద్ధం జరుగదు. ఆశ్చర్యకరంగా, యుద్ధం లేకుండానే ఓడిపోయేది, యూదులు కాదు గానీ అష్షూరీయులే.

22 యెహోవా తాను చెప్పినట్లుగానే, ఒక దూతను పంపించడంతో ఆ దూత సన్హెరీబు సైన్యాల్లోని శ్రేష్ఠమైన భాగాన్ని అంటే 1,85,000 మందిని హతమారుస్తాడు. ఇది లిబ్నా వద్ద జరిగి ఉండవచ్చు, సన్హెరీబు మేల్కొని తన సైన్యంలోని నాయకులు, అధిపతులు, బలవంతులు చనిపోయారని తెలుసుకుంటాడు. అవమానభారంతో అతడు నీనెవెకు తిరిగి వస్తాడు, కానీ అతడు ఘోరంగా ఓడింపబడినప్పటికీ మొండిగా తన అబద్ధ దేవత అయిన నిస్రోకుపట్ల భక్తి కలిగివుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, సన్హెరీబు నిస్రోకు మందిరంలో ఆరాధిస్తుండగా, అతని ఇద్దరు కుమారులు అతడ్ని హతమారుస్తారు. మళ్ళీ ఒకసారి, నిర్జీవ నిస్రోకు కాపాడడానికి అశక్తుడవుతాడు.​—⁠యెషయా 37:35-38.

హిజ్కియా విశ్వాసం మరింత బలపరచబడుతుంది

23. సన్హెరీబు మొదటిసారి యూదాపైకి వచ్చినప్పుడు, హిజ్కియా ఎలాంటి సంక్షోభావస్థలో ఉంటాడు, ఈ సంక్షోభ పరిస్థితి వల్ల ఎలాంటి చిక్కులు తలెత్తుతాయి?

23 మొదటిసారి సన్హెరీబు యూదాపైకి వచ్చినప్పుడు, హిజ్కియా తీవ్రంగా అస్వస్థతకు గురవుతాడు. ఆయన చనిపోబోతున్నాడని యెషయా ఆయనకు చెబుతాడు. (యెషయా 38:1) 39 సంవత్సరాల రాజు కృంగిపోతాడు. ఆయన ఆందోళన పడుతున్నది తన క్షేమం గురించే కాక ప్రజల భవిష్యత్తు గురించి కూడా. యెరూషలేము యూదాలు అష్షూరీయుల దురాక్రమణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. హిజ్కియా మరణిస్తే, యుద్ధంలో ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆ సమయంలో, పరిపాలనను చేపట్టడానికి హిజ్కియాకు కుమారుడు కూడా లేడు. హిజ్కియా తీవ్రంగా ప్రార్థిస్తూ, కనికరం చూపించమని యెహోవాను వేడుకొంటాడు.​—⁠యెషయా 38:2, 3.

24, 25. (ఎ) యెహోవా హిజ్కియా ప్రార్థనకు దయగా ఎలా సమాధానం ఇస్తాడు? (బి) యెషయా 38:7, 8 వచనాల్లో వర్ణించబడినట్లుగా, యెహోవా ఏ అద్భుతం చేస్తాడు?

24 యెషయా రాజభవన ప్రాంగణాన్ని దాటి వెళ్ళకముందే, యెహోవా మరో సందేశంతో ఆయనను రోగగ్రస్థుడైన రాజు పడక దగ్గరికి మళ్ళీ పంపిస్తాడు: “నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను; ఇంక పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరురాజు చేతిలో పడకుండ విడిపించెదను.” (యెషయా 38:​4-6; 2 రాజులు 20:4, 5) యెహోవా తన వాగ్దానాన్ని ఒక అసాధారణమైన సూచనతో ధ్రువీకరిస్తాడు: “ఆహాజు ఎండ గడియారముమీద సూర్యుని కాంతిచేత దిగిన నీడ మరల పదిమెట్లు ఎక్క జేసెదను.”​—యెషయా 38:7, 8ఎ.

25 యూదా చరిత్రకారుడైన జోసీఫస్‌ చెబుతున్న దాని ప్రకారం, రాజ భవనం లోపల మెట్లు ఉండేవి, బహుశా వాటికి దగ్గరలో ఒక స్తంభం ఉండి ఉండవచ్చు. సూర్య కిరణాలు ఆ స్తంభంపై పడినప్పుడు, మెట్ల మీద దాని నీడ పడుతుంది. మెట్ల మీద నీడ గమనాన్ని గమనించడం ద్వారా సమయాన్ని కొలవవచ్చు. ఇప్పుడు యెహోవా ఒక అద్భుతం చేస్తాడు. సాధారణ రీతిలో నీడ మెట్ల మీదుగా క్రిందికి దిగిన తర్వాత, అది పది మెట్లు మళ్ళీ వెనక్కి వెళుతుంది. అలాంటి విషయాన్ని ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? బైబిలు ఇలా చెబుతోంది: “సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కెను.” (యిషయా 38:8బి) ఆ తర్వాత కొద్ది కాలానికి, హిజ్కియా కోలుకుంటాడు. ఈ వార్త బబులోను వరకు వెళుతుంది. బబులోను రాజు దాని గురించి విన్నప్పుడు, వాస్తవాలను తెలుసుకునేందుకు ఆయన యెరూషలేముకు దూతలను పంపిస్తాడు.

26. హిజ్కియా జీవితం పొడిగించబడడం యొక్క ఒక ఫలితం ఏమిటి?

26 హిజ్కియా అద్భుతరీతిగా కోలుకున్న తర్వాత దాదాపు మూడు సంవత్సరాలకు, ఆయన మొదటి కుమారుడు మనష్షే జన్మిస్తాడు. మనష్షే పెరిగి పెద్దవాడైన తర్వాత, తాను జన్మించడాన్ని సాధ్యం చేసిన యెహోవా కనికరం పట్ల ఏమాత్రం మెప్పును చూపించడు! బదులుగా, మనష్షే తన జీవిత కాలంలోని అధిక భాగంలో, ఎక్కువగా యెహోవా దృష్టికి చెడు నడతనే నడుస్తాడు.​—⁠2 దినవృత్తాంతములు 32:​24; 33:​1-6.

పొరపాటు నిర్ణయం

27. హిజ్కియా యెహోవా పట్ల మెప్పును ఏ యే విధాలుగా చూపిస్తాడు?

27 తన పితరుడైన దావీదు వలె హిజ్కియా విశ్వాసంగల వ్యక్తి. ఆయన దేవుని వాక్యాన్ని అమూల్యమైనదిగా ఎంచుతాడు. సామెతలు 25:1 ప్రకారం, ఇప్పుడు సామెతలు 25 నుండి 29 వరకున్న అధ్యాయాల్లో ఉన్న సమాచారాన్ని సంపుటీకరించడానికి ఏర్పాట్లు చేసింది ఆయనే. ఆయన 119 కీర్తనను రచించాడని కూడా కొందరు విశ్వసిస్తారు. అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత హిజ్కియా రచించిన, గాఢానుభూతిని కలిగించే కృతజ్ఞతా గీతం ఆయన ఎంతో కృతజ్ఞతగల వ్యక్తి అని చూపిస్తుంది. “మన జీవితదినములన్ని” యెహోవాను ఆయన ఆలయంలో స్తుతించగలగడమే జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయమని హిజ్కియా తెలియజేస్తున్నాడు. (యెషయా 38:​9-20) స్వచ్ఛారాధన గురించి మనమందరం అలాగే భావించుదము గాక!

28. హిజ్కియా అద్భుతరీతిగా స్వస్థపరచబడిన కొంతకాలం తర్వాత, ఎలాంటి పొరపాటు చేస్తాడు?

28 హిజ్కియా నమ్మకమైనవాడే అయినప్పటికీ అపరిపూర్ణుడు. యెహోవా తనను స్వస్థపరచిన కొంతకాలం తర్వాత, ఆయన ఒక గంభీరమైన పొరపాటు చేస్తాడు. యెషయా ఇలా వివరిస్తున్నాడు: “ఆ కాలమందు బబులోనురాజును బలదాను కుమారుడునైన మెరోదక్బలదాను హిజ్కియా రోగియై బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన యింటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములుగల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించెను.”​—యెషయా 39:1, 2. *

29. (ఎ) హిజ్కియా బబులోను ప్రతినిధులకు తన సంపదను చూపించినప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటి? (బి) హిజ్కియా చేసిన పొరపాటు యొక్క పర్యవసానాలు ఏమిటి?

29 యెహోవా దూత నాశనకరమైన ఓటమిని కలిగించినప్పటికీ, అష్షూరు బబులోనుతో సహా అనేక రాజ్యాలకు ముప్పు తీసుకువస్తూనే ఉంటుంది. హిజ్కియా, తనకు భవిష్యత్తులో మిత్ర రాజ్యం కాగల బబులోను రాజును ప్రభావితం చేయాలని అనుకొని ఉండవచ్చు. అయితే, యూదా నివాసులు తమ శత్రువులతో సహవసించడం యెహోవాకు ఇష్టం లేదు; వారు తనపై నమ్మకం ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు! యెషయా ప్రవక్త ద్వారా యెహోవా హిజ్కియాకు భవిష్యత్తును ఇలా తెలియజేస్తాడు: “రాబోవు దినములలో ఏమియు మిగులకుండ నీ యింటనున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోవుదు[రు] . . . నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోనురాజు నగరునందు నపుంసకుల[ను]గా చేయుటకై వారు తీసికొనిపోవుదురు.” (యెషయా 39:​3-7) అవును, హిజ్కియా ఏ రాజ్యాన్నైతే ప్రభావితం చేయాలని చూశాడో అదే చివరికి యెరూషలేము సంపదలను దోచుకుపోయి, దాని పౌరులను దాసత్వానికి తీసుకెళుతుంది. హిజ్కియా బబులోనీయులకు తన సంపదలను చూపించడం, వారి దురాశను ప్రేరేపిస్తుంది అంతే.

30. హిజ్కియా మంచి దృక్పథాన్ని ఎలా చూపించాడు?

30 హిజ్కియా తన సంపదలను బబులోనీయులకు చూపించిన సంఘటనను సూచిస్తూ కావచ్చు, 2 దినవృత్తాంతములు 32:26 ఇలా పేర్కొంటుంది: “హిజ్కియా హృదయగర్వము విడచి, తానును యెరూషలేము కాపురస్థులును తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనులమీదికి రాలేదు.”

31. హిజ్కియాకు పరిస్థితులు ఎలా పరిణమిస్తాయి, ఇది మనకు ఏమి బోధిస్తుంది?

31 హిజ్కియా అపరిపూర్ణుడే అయినప్పటికీ విశ్వాసం గలవాడు. తన దేవుడైన యెహోవా భావోద్వేగాలు గల నిజమైన వ్యక్తియని ఆయనకు తెలుసు. హిజ్కియా ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు యెహోవాకు ఎడతెగక ప్రార్థించాడు, యెహోవా ఆయనకు సమాధానం ఇచ్చాడు. యెహోవా దేవుడు హిజ్కియాకు ఆయన తర్వాతి దినాలన్నిటిలో సమాధానాన్ని అనుగ్రహించాడు, దానికి ఆయన కృతజ్ఞత కలిగివున్నాడు. (యెషయా 39:8) యెహోవా నేడు మనకు కూడా అంతే నిజమైన వ్యక్తి అయివుండాలి. హిజ్కియా వలె, సమస్యలు తలెత్తినప్పుడు మనం జ్ఞానం కోసం, పరిష్కారం కోసం యెహోవా వైపు చూద్దాము, “ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.” (యాకోబు 1:5) మనం సహిస్తూ, యెహోవాపై విశ్వాసం కలిగి ఉంటే, ఆయన మనకు ఇప్పుడూ, భవిష్యత్తులోనూ “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడ”వుతాడని మనం నిశ్చయత కలిగివుండగలము.​—⁠హెబ్రీయులు 11:6.

[అధస్సూచీలు]

^ ప్రస్తుత విలువల ప్రకారం 95 లక్షల (అమెరికా) డాలర్లకంటే ఎక్కువే.

^ సన్హెరీబు ఓడిపోయిన తర్వాత, చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలు బంగారు, వెండి, ఇతర వెలగల వస్తువులను హిజ్కియాకు కానుకగా తెచ్చారు. రెండవ దినవృత్తాంతములు 32:22, 23, 27 వచనాల్లో, “హిజ్కియాకు అతివిస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను,” ఆయన “సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను” అని మనం చదువుతాము. ఈ కానుకలు, ఆయన అష్షూరీయులకు కప్పం చెల్లించడానికి ఖాళీ చేసిన తన కోశాగారాన్ని తిరిగి నింపుకోవడానికి దోహదపడి ఉండవచ్చు.

[అధ్యయన ప్రశ్నలు]

[383 వ పేజీలోని చిత్రం]

హిజ్కియా రాజు అష్షూరు బలాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు యెహోవాపై విశ్వాసం ఉంచుతాడు

[384 వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]

[389 వ పేజీలోని చిత్రం]

యెహోవా ఇచ్చే ఉపదేశాన్ని వినడానికి రాజు దూతలను యెషయా వద్దకు పంపిస్తాడు

[390 వ పేజీలోని చిత్రం]

అష్షూరు ఓటమి ద్వారా యెహోవా నామం శ్లాఘించబడాలని హిజ్కియా ప్రార్థిస్తాడు

[393 వ పేజీలోని చిత్రం]

యెహోవా దూత 1,85,000 మంది అష్షూరీయులను హతమారుస్తాడు