జనముల గురించి యెహోవా ఆలోచన
పదిహేనవ అధ్యాయం
జనముల గురించి యెహోవా ఆలోచన
1. అష్షూరుకు వ్యతిరేకంగా ఏ తీర్పు ప్రకటనను యెషయా వ్రాసిపెట్టాడు?
తన ప్రజల దుష్టత్వాన్నిబట్టి వారిని క్రమశిక్షణలో పెట్టడానికి యెహోవా జనములను ఉపయోగించుకోగలడు. అయినప్పటికీ, ఆ జనముల అనవసరమైన క్రూరత్వాన్ని, గర్వాన్ని, సత్యారాధన పట్ల చూపిస్తున్న శత్రుభావాన్ని ఆయన క్షమించడు. కాబట్టి, ఎంతో కాలం ముందుగానే ఆయన, ‘బబులోనును గూర్చిన దేవోక్తిని’ వ్రాసిపెట్టడానికి యెషయాను ప్రేరేపించాడు. (యెషయా 13:1) అయితే, భవిష్యత్తులో, బబులోను ముప్పు తీసుకురాబోతోంది. యెషయా కాలంలో, అష్షూరు దేవుని నిబంధన ప్రజలను అణిచివేస్తోంది. అష్షూరు ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని నాశనం చేసి, యూదాలో అధికభాగాన్ని నిర్మూలిస్తుంది. అయితే, అష్షూరు విజయం పరిమితమైనది. యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును . . . నా దేశములో అష్షూరును సంహరించెదను; నా పర్వతములమీద వాని నలుగద్రొక్కెదను; వాని కాడి నా జనులమీదనుండి తొలగిపోవును వాని భారము వారి భుజముమీదనుండి తొలగింపబడును.” (యెషయా 14:24, 25) యెషయా ఈ ప్రవచనం ప్రవచించిన కొంతకాలానికి, యూదాకు అష్షూరు నుండి వచ్చే ఆపద తొలగించబడుతుంది.
2, 3. (ఎ) ప్రాచీన కాలాల్లో, యెహోవా ఎవరికి వ్యతిరేకంగా తన బాహువును చాపాడు? (బి) యెహోవా తన బాహువును “జనములందరి” పైకి చాపుతాడంటే దాని భావమేమిటి?
2 అయితే దేవుని నిబంధన ప్రజలకు శత్రువులైన ఇతర రాజ్యాల మాటేమిటి? వాటికి కూడా తీర్పుతీర్చబడుతుంది. యెషయా ఇలా ప్రకటిస్తున్నాడు: “సర్వలోకమునుగూర్చి నేను చేసిన ఆలోచన ఇదే. జనములందరిమీద చాపబడిన బాహువు ఇదే. సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించియున్నాడు రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడెవడు?” (యెషయా 14:26, 27) యెహోవా “ఆలోచన” కేవలం సలహా కంటే ఎక్కువే. అది ఆయన దృఢనిశ్చయం, ఆయన ఆజ్ఞ. (యిర్మీయా 49:20, 30) దేవుని “బాహువు” ఆయన ఉపయోగించిన శక్తి. యెషయా 14 వ అధ్యాయంలోని చివరి వచనాల్లోనూ, 15 నుండి 19 అధ్యాయాల్లోనూ యెహోవా ఆలోచన ఫిలిష్తియ, మోయాబు, దమస్కు, ఐతియోపియా, ఐగుప్తులకు వ్యతిరేకంగా ఉంది.
3 అయితే, యెహోవా బాహువు “జనములందరిమీద” చాపబడి ఉందని యెషయా చెబుతున్నాడు. కాబట్టి, యెషయా యొక్క ఈ ప్రవచనాలు మొదట ప్రాచీన కాలాల్లో నెరవేరినప్పటికీ, “అంత్యకాలము”లో యెహోవా తన బాహువును భూరాజ్యములన్నిటికి వ్యతిరేకంగా చాపినప్పుడు కూడా అవి సూత్రప్రాయంగా అన్వయించబడతాయి. (దానియేలు 2:44; 12:9; రోమీయులు 15:4; ప్రకటన 19:11, 19-21) సర్వశక్తిమంతుడైన యెహోవా తన ఆలోచనను ఎంతో ముందుగానే ధైర్యంగా బయల్పరుస్తాడు. ఆయన చాపిన బాహువును ఎవరూ వెనక్కు మళ్ళించలేరు.—కీర్తన 33:11; యెషయా 46:10.
ఫిలిష్తియకు వ్యతిరేకంగా “ఎగురు సర్పము”
4. ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా యెహోవా ప్రకటనలను గూర్చిన కొన్ని వివరాలు ఏవి?
4 ఫిలిష్తీయులు మొదట అవధానం చూరగొంటారు. “రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి—ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరువబడెనని అంతగా సంతోషింపకుము సర్పబీజమునుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము.”—యెషయా 14:28, 29.
5, 6. (ఎ) ఉజ్జియా ఏ భావంలో ఫిలిష్తీయులకు సర్పములా ఉన్నాడు? (బి) హిజ్కియా ఫిలిష్తియకు వ్యతిరేకంగా దేనిగా నిరూపించబడతాడు?
5 ఉజ్జియా రాజుకు ఫిలిష్తీయుల నుండి వచ్చే ముప్పును తట్టుకోగలిగేంత బలం ఉంది. (2 దినవృత్తాంతములు 26:6-8) వారికి అతడు సర్పములా ఉన్నాడు, అతని దండము విరోధభావంగల ఆ పొరుగుదేశాన్ని కొడుతూనే ఉంది. ఉజ్జియా మరణించాక, ‘అతని దండము తుత్తునియలుగా విరువబడిన’ తర్వాత నమ్మకమైన యోతాము పరిపాలన చేశాడు, గానీ “జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి.” తర్వాత, ఆహాజు రాజయ్యాడు. పరిస్థితి మారింది, ఫిలిష్తీయులు యూదాపై విజయవంతంగా సైనిక దాడులు జరిపారు. (2 దినవృత్తాంతములు 27:2; 28:17, 18) అయితే, ఇప్పుడు, మళ్లీ పరిస్థితులు మారుతున్నాయి. సా.శ.పూ. 746 లో ఆహాజు రాజు మరణిస్తాడు, యౌవనుడైన హిజ్కియా సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. పరిస్థితులు తమకు అనుకూలంగానే కొనసాగుతాయని ఫిలిష్తీయులు భావిస్తే, వాళ్లు పూర్తిగా పొరబడినట్లే. హిజ్కియా ప్రాణాంతకమైన విరోధిగా నిరూపించబడతాడు. ఉజ్జియా (“భీజము” నుండి వచ్చిన “ఫలము”) సంతానమైన హిజ్కియా, తాను దాడి చేస్తున్న వారికి విషం ఎక్కిస్తున్నట్లుగా చురుక్కుమని మంట పుట్టించేలా చేస్తూ మెరుపువేగంతో అకస్మాత్తుగా దాడి చేయడానికి దూసుకువెళ్తూ “ఎగురు సర్పము”లా ఉన్నాడు.
6 ఇది క్రొత్త రాజుకు సరిగ్గా సరిపోయే వర్ణన. “గాజా పట్టణమువరకు దాని సరిహద్దులవరకు . . . [హిజ్కియా] ఫిలిష్తీయులను ఓడించెను.” (2 రాజులు 18:8) అష్షూరు రాజైన సన్హెరీబును గురించిన చారిత్రక వృత్తాంతాలు తెలియజేస్తున్నదాని ప్రకారం, ఫిలిష్తీయులు హిజ్కియాకు లోబడతారు. “అతిబీదలైనవారు” అంటే బలహీనమైన యూదా రాజ్యం భద్రతను, వస్తుపరమైన సమృద్ధిని అనుభవిస్తుండగా ఫిలిష్తియ కరవుకు గురవుతుంది.—యెషయా 14:30, 31 చదవండి.
7. యెరూషలేముకు వచ్చిన రాయబారులకు హిజ్కియా ఏ విశ్వాస ప్రకటన చేయాలి?
7 బహుశా అష్షూరుకు వ్యతిరేకంగా మైత్రిని కోరడానికి కావచ్చు రాయబారులు యూదాకు వచ్చినట్లు అనిపిస్తుంది. వారికేమి చెప్పబడాలి? “జనముల దూత కియ్యవలసిన ప్రత్యుత్తరమేది?” విదేశీ మిత్రపక్షాల నుండి హిజ్కియా భద్రతను కోరాలా? అవసరంలేదు! ఆ దూతలకు ఆయనిలా చెప్పాలి: “యెహోవా సీయోనును స్థాపించియున్నాడు, ఆయన జనులలో శ్రమనొందినవారు దాని ఆశ్రయింతురు.” (యెషయా 14:32) రాజుకు యెహోవాయందు సంపూర్ణ నమ్మకం ఉండాలి. సీయోను పునాది స్థిరంగా ఉంది. అష్షూరు బెదిరింపు నుండి నగరం సురక్షితమైన ఆశ్రయంగా తప్పించుకుని నిలుస్తుంది.—కీర్తన 46:1-7.
8. (ఎ) నేడు కొన్ని దేశాలు ఏ విధంగా ఫిలిష్తియలా ఉన్నాయి? (బి) యెహోవా ప్రాచీన కాలాల్లో చేసినట్లుగానే, నేడు తన ప్రజలకు మద్దతునిచ్చేందుకు ఏమి చేశాడు?
8 ఫిలిష్తియ వలే, నేడు కొన్ని దేశాలు దేవుని ఆరాధకులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. క్రైస్తవ యెహోవాసాక్షులు జైళ్లలోనూ కాన్సన్‌ట్రేషన్ క్యాంపుల్లోనూ వేయబడ్డారు. వారు నిషేధించబడ్డారు. చాలామంది చంపబడ్డారు. వ్యతిరేకులు ‘నీతిమంతుల ప్రాణము తీయుటకై వారిమీద పడుతూనే’ ఉన్నారు. (కీర్తన 94:21) ఈ క్రైస్తవ గుంపు, వారి శత్రువులకు “అతిబీదలైనవారు”గా, “దరిద్రులు”గా కనిపించవచ్చు. అయితే, యెహోవా మద్దతుతో, వాళ్లు ఆధ్యాత్మిక సమృద్ధిని అనుభవిస్తుండగా, వారి శత్రువులు కరవుకు గురవుతారు. (యెషయా 65:13, 14; ఆమోసు 8:11) యెహోవా ఆధునిక దిన ఫిలిష్తీయులపైకి తన బాహువు చాపినప్పుడు, ఈ “అతిబీదలైనవారు” సురక్షితంగా ఉంటారు. ఎక్కడ? యేసు నిశ్చయమైన ముఖ్యమైన మూలరాయిగా ఉన్న “దేవుని యింటి”వారి సహవాసంలో వారు సురక్షితంగా ఉంటారు. (ఎఫెసీయులు 2:19, 20) అంతేగాక వారు, యేసు క్రీస్తు రాజుగా గల, యెహోవా పరలోక రాజ్యమైన “పరలోకపు యెరూషలేము” కాపుదల క్రింద ఉంటారు.—హెబ్రీయులు 12:22; ప్రకటన 14:1.
మోయాబు నశించింది
9. తర్వాతి ప్రకటన ఎవరిని ఉద్దేశించి చేయబడుతుంది, ఈ ప్రజలు తాము దేవుని ప్రజల శత్రువులమని ఎలా నిరూపించుకున్నారు?
9 మృత సముద్రానికి తూర్పువైపున ఇశ్రాయేలు మరో పొరుగు దేశమైన మోయాబు ఉంది. మోయాబీయులు అబ్రాహాము అన్న కుమారుడైన లోతు సంతానం గనుక వారు ఇశ్రాయేలీయులకు బంధువులు, అయితే ఫిలిష్తీయులు బంధువులు కాదు. (ఆదికాండము 19:37) అలా సంబంధం ఉన్నప్పటికీ, మోయాబుకు ఇశ్రాయేలుతో దీర్ఘకాలంగా శత్రుత్వం ఉంది. ఉదాహరణకు, పూర్వం మోషే కాలంలో, ఇశ్రాయేలీయులను శపిస్తాడని ఆశిస్తూ మోయాబు రాజు ప్రవక్తయైన బిలామును కూలికి తెచ్చుకున్నాడు. అది విఫలమైనప్పుడు, ఇశ్రాయేలును చిక్కించుకోవడానికి మోయాబు అనైతికతను, బయలు ఆరాధనను ఉపయోగించింది. (సంఖ్యాకాండము 22:4-6; 25:1-5) కాబట్టి యెహోవా ఇప్పుడు “మోయాబును గూర్చిన దేవోక్తి”ని వ్రాసేందుకు యెషయాను పురికొల్పుతున్నాడంటే అందులో ఆశ్చర్యం లేదు!—యెషయా 15:1 ఎ.
10, 11. మోయాబుకు ఏమి జరుగుతుంది?
10 యెషయా ప్రవచనం ఆర్మోయాబు, కీర్మోయాబు (లేక కీర్హరెశెతు), దీబోను వంటి అనేకానేక నగరాలను, ప్రాంతాలను ఉద్దేశించి చెప్పబడింది. (యెషయా 15:1 బి, 2 ఎ) మోయాబీయులు కీర్హరెశెతు ద్రాక్షపండ్ల అడల కోసం దుఃఖిస్తారు, అవి బహుశా ఆ నగరపు ప్రధాన ఉత్పత్తి అయ్యుండవచ్చు. (యెషయా 16:6, 7) ద్రాక్షపంటకు పేరుపొందిన సిబ్మా, యాజరులు అణగద్రొక్కబడతాయి. (యెషయా 16:8-10) “మూడేండ్ల తరిపి దూడ” అనే భావంగల ఎగ్లాత్షాలిషా, బాధతో జాలిగొలిపేలా రంకెలు వేసే బలిష్ఠమైన పెయ్యలా ఉంటుంది. (యెషయా 15:5) దేశంలోని గడ్డి ఎండిపోతుంది, మోయాబీయుల వధ మూలంగా “దీమోను జలములు” రక్తసిక్తమవుతాయి. “నిమ్రీము నీటి తావులు” అలంకారిక భావంలో లేక అక్షరార్థంగా “ఎడారు”లు అవుతాయి, దీనికి కారణం శత్రు సైన్యాలు వారి నీటి ప్రవాహాలను అడ్డగించడం కావచ్చు.—యెషయా 15:6-9.
11 మోయాబీయులు అంగలార్పు వస్త్రమైన గోనెపట్ట కట్టుకుంటారు. తలవంపుకు, విలాపానికి గుర్తుగా వారు తమ తలలు బోడి చేసుకుంటారు. విపరీతమైన బాధను అవమానాన్ని చూపిస్తూ, వారి గడ్డములు ‘గొరిగించబడతాయి.’ (యెషయా 15:2 బి-4) ఈ తీర్పులు తప్పక నెరవేరుతాయని నిశ్చయత కలిగి యెషయా కూడా ఎంతో భావోద్వేగానికి లోనవుతాడు. మోయాబుకు రాబోతున్న శ్రమను గూర్చిన సందేశాన్ని బట్టి, జాలితో ఆయన గుండె కొట్టుకుంటోంది, ఆంత్రములు సితారా తీగల్లా కంపిస్తున్నాయి.—యిషయా 16:11, 12.
12. మోయాబు గురించి యెషయా చెప్పినది ఎలా నెరవేరింది?
12 ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది? త్వరలోనే. “పూర్వకాలమున యెహోవా మోయాబునుగూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే. అయితే యెహోవా ఇప్పుడీలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు—కూలివాని లెక్కప్రకారము మూడేండ్లలోగా మోయుబీయులయొక్క ప్రభావమును వారి గొప్ప వారి సమూహమును అవమానపరచబడును, శేషము బహు కొద్దిగా మిగులును అది అతి స్వల్పముగా నుండును.” (యెషయా 16:13, 14) దీనికి అనుగుణంగా, సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో మోయాబు తీవ్రమైన బాధను అనుభవించిందనీ, దాని అనేక ప్రాంతాలు నిర్జనమయ్యాయనీ పురావస్తుశాస్త్ర రుజువుంది. తిగ్లత్పిలేసెరు III తనకు కప్పం చెల్లించిన పరిపాలకుల్లో మోయాబుకు చెందిన సలమను ఉన్నట్లు పేర్కొన్నాడు. సన్హెరీబు మోయాబు రాజైన కమ్ముసునద్బీ నుండి కప్పం తీసుకున్నాడు. మోయాబు రాజులైన ముసురి, కమషల్టు తమకు ఆధీనులైనట్లు అష్షూరు సామ్రాట్టులైన ఏసర్హద్దోను, ఆస్నప్పరు పేర్కొన్నారు. శతాబ్దాల క్రితం, మోయాబీయులు ఒక ప్రజగా ఉనికిలో లేకుండా పోయారు. మోయాబీయులవని తలంచబడుతున్న నగరాల శిథిలాలను కనుగొనడం జరిగింది, కాని ఒకప్పుడు ఇశ్రాయేలుకు శక్తివంతమైన శత్రువైన దీని గురించిన భౌతిక సాక్ష్యాధారం అంతగా వెలికితీయబడలేదు.
ఆధునిక-దిన “మోయాబు” నశిస్తుంది
13. నేడు ఏ సంస్థను మోయాబుతో పోల్చవచ్చు?
13 నేడు ప్రాచీన మోయాబు వంటి ఒక ప్రపంచవ్యాప్త సంస్థ ఉంది. అది “మహా బబులోను”లో ప్రధాన భాగమైన క్రైస్తవమత సామ్రాజ్యం. (ప్రకటన 17:5) మోయాబు, ఇశ్రాయేలు ఇద్దరూ కూడా అబ్రాహాము తండ్రియైన తెరహు వంశంవారే. అలాగే, నేటి అభిషిక్త క్రైస్తవుల సంఘంలా క్రైస్తవమత సామ్రాజ్యం తానూ మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో వేళ్ళూని ఉన్నట్లు చెప్పుకుంటుంది. (గలతీయులు 6:16) అయితే, మోయాబులా క్రైస్తవమత సామ్రాజ్యం భ్రష్టురాలు, అది ఆధ్యాత్మిక అనైతికతను పెంపొందింపజేస్తుంది, ఏకైక సత్య దేవుడైన యెహోవాను ఆరాధించక ఇతర దేవుళ్ల ఆరాధనను పెంపొందింపజేస్తుంది. (యాకోబు 4:4; 1 యోహాను 5:21) ఒక తరగతిగా, క్రైస్తవమత సామ్రాజ్య నాయకులు దేవుని రాజ్య సువార్తను ప్రకటించేవారిని వ్యతిరేకిస్తున్నారు.—మత్తయి 24:9, 14.
14. యెహోవా ఆలోచన ఆధునిక-దిన “మోయాబు”కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఆ సంస్థలోని సభ్యులకు ఏ నిరీక్షణ ఉంది?
14 మోయాబు చివరికి నాశనం చేయబడింది. క్రైస్తవమత సామ్రాజ్యానికి కూడా అదే జరుగుతుంది. అష్షూరుకు ఆధునిక-దిన సమానమైనదాన్ని ఉపయోగిస్తూ యెహోవా దాన్ని నిర్జనం చేస్తాడు. (ప్రకటన 17:16, 17) అయితే, ఈ ఆధునిక-దిన “మోయాబు”లో ఉన్న ప్రజలకు నిరీక్షణ ఉంది. మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచిస్తూ, యెషయా మధ్యలో ఇలా చెబుతున్నాడు: “కృపవలన సింహాసనము స్థాపింపబడును; సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు, దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును.” (యెషయా 16:5) యెహోవా 1914 లో, దావీదు రాజు వంశానికి చెందిన పరిపాలకుడు యేసు సింహాసనాన్ని సుస్థిరంగా స్థాపించాడు. యేసు రాజరికం, యెహోవా కృప యొక్క వ్యక్తీకరణయై ఉంది, దావీదు రాజుతో దేవుడు చేసిన నిబంధన నెరవేర్పుగా ఆ రాజరికం నిరంతరం నిలుస్తుంది. (కీర్తన 72:2; 85:10, 11; 89:3, 4; లూకా 1:32) సాత్వికులైన అనేకులు ఆధునిక-దిన “మోయాబు”ను విడిచివచ్చి, జీవాన్ని పొందగలిగేలా యేసుకు విధేయులయ్యారు. (ప్రకటన 18:4) యేసు “అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము” చేస్తాడని తెలుసుకోవడం వీరికి ఎంత ఓదార్పునిస్తుందో కదా!—మత్తయి 12:18; యిర్మీయా 33:15.
దమస్కు పాడైపోవును
15, 16. (ఎ) యూదాకు వ్యతిరేకంగా దమస్కు, ఇశ్రాయేలు ఏ ప్రతికూలమైన చర్యలు తీసుకుంటాయి, దమస్కుకు దాని పర్యవసానం ఎలా ఉంటుంది? (బి) దమస్కుకు వ్యతిరేకంగా చేయబడిన ప్రకటనలో ఇంకా ఎవరు చేర్చబడ్డారు? (సి) ఇశ్రాయేలు ఉదాహరణ నుండి నేడు క్రైస్తవులు ఏమి నేర్చుకోవచ్చు?
15 తర్వాత, యెషయా వ్రాస్తున్నది “దమస్కును గూర్చిన దేవోక్తి.” (యెషయా 17:1-6 చదవండి.) ఇశ్రాయేలుకు ఉత్తరానున్న దమస్కు “సిరియాకు రాజధాని.” (యెషయా 7:8) యూదా రాజు ఆహాజు పరిపాలనా కాలంలో, దమస్కు రాజు రెజీను ఇశ్రాయేలు రాజు పెకహుతో కలిసి యూదాపై దాడి చేస్తాడు. అయితే, అహాజు విజ్ఞాపన మేరకు, అష్షూరు రాజు తిగ్లత్పిలేసెరు III దమస్కుతో యుద్ధం చేసి, దాన్ని జయించి దాని నివాసులనేకులను చెరగొనిపోతాడు. ఆ తర్వాత, దమస్కు ఇశ్రాయేలుకు ఇక ఒక ముప్పుగా ఉండదు.—2 రాజులు 16:5-9; 2 దినవృత్తాంతములు 28:5, 17.
16 ఇశ్రాయేలు దమస్కుతో పొత్తు కలిసినందుకు కావచ్చు, యెహోవా దమస్కుకు వ్యతిరేకంగా చేసిన ప్రకటనలలో, అవిశ్వాసురాలైన ఉత్తర రాజ్యానికి వ్యతిరేకంగా చెప్పబడిన తీర్పులు కూడా ఉన్నాయి. (యెషయా 17:3-6) ఇశ్రాయేలు, కోతకాలంలో చాలాతక్కువ వెన్నులున్న చేనులా లేక కొమ్మల నుండి ఓలీవ పండ్లు చాలామేరకు దులిపివేయబడిన ఓలీవ చెట్టులా తయారవుతుంది. (యెషయా 17:4-6) యెహోవాకు సమర్పించుకున్న వారికి ఎంత గంభీరమైన ఉదాహరణ! ఆయన సంపూర్ణ భక్తిని కోరుతాడు, కేవలం హృదయపూర్వకమైన పవిత్ర సేవనే అంగీకరిస్తాడు. తమ సహోదరులకే వ్యతిరేకంగా తిరిగే వారిని ఆయన ద్వేషిస్తాడు.—నిర్గమకాండము 20:5; యెషయా 17:10, 11; మత్తయి 24:48-50.
యెహోవాయందు సంపూర్ణ నమ్మకం
17, 18. (ఎ) యెహోవా ప్రకటనలకు ఇశ్రాయేలులోని కొంతమంది ఎలా ప్రతిస్పందించారు, కాని అత్యధికులు ఎలా ప్రతిస్పందించారు? (బి) ఈనాటి పరిస్థితులు హిజ్కియా కాలంనాటి పరిస్థితులను ఎలా పోలివున్నాయి?
17 యెషయా ఇప్పుడిలా చెబుతున్నాడు: “ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు; దేవతాస్తంభమునైనను సూర్య దేవతా ప్రతిమలనైనను తమ చేతులుచేసిన దేనినైనను లక్ష్యము చేయరు. మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును.” (యెషయా 17:7, 8) అవును, ఇశ్రాయేలులోని కొందరు యెహోవా చేసిన హెచ్చరిక ప్రకటనను లక్ష్యపెడతారు. ఉదాహరణకు, పస్కాపండుగ ఆచరించడంలో యూదాతో చేరవలెనని హిజ్కియా ఇశ్రాయేలు వాసులకు ఆహ్వానం పంపినప్పుడు, కొంతమంది ఇశ్రాయేలీయులు ప్రతిస్పందించి స్వచ్ఛారాధనలో తమ సహోదరులతో కలిసేందుకు దక్షిణదిశగా ప్రయాణిస్తారు. (2 దినవృత్తాంతములు 30:1-12) అయినప్పటికీ, ఇశ్రాయేలు నివాసుల్లో అనేకులు ఆహ్వానం తీసుకువచ్చిన సందేశకులను ఎగతాళి చేస్తారు. దేశం బాగుచేయబడలేని విధంగా భ్రష్టుపట్టింది. కాబట్టి, దానికి వ్యతిరేకంగా యెహోవా ఆలోచన నెరవేరింది. అష్షూరు ఇశ్రాయేలు నగరాలను నాశనం చేస్తుంది, దేశం పాడవుతుంది, పచ్చిక బయళ్లు నిష్ఫలమైనవవుతాయి.—యెషయా 17:9-11, చదవండి.
18 నేటి విషయమేమిటి? ఇశ్రాయేలు మతభ్రష్ట జనాంగమయ్యింది. కాబట్టి, ఆ జనాంగంలోని వ్యక్తులు సత్యారాధన వైపుకు తిరిగేందుకు వారికి సహాయం చేయడానికి హిజ్కియా ప్రయత్నంచేసిన విధానం, నేడు నిజ క్రైస్తవులు మతభ్రష్ట క్రైస్తవమత సామ్రాజ్య సంస్థలోని వ్యక్తులకు సహాయం చేయడానికి ఎలా ప్రయత్నిస్తారో మనకు గుర్తుచేస్తుంది. “దేవుని ఇశ్రాయేలు”కు చెందిన సందేశకులు, 1919 నుండి, స్వచ్ఛారాధనలో భాగం వహించడానికి రమ్మని ప్రజలను ఆహ్వానిస్తూ క్రైస్తవమత సామ్రాజ్యమంతటికీ వెళ్లారు. (గలతీయులు 6:16) అనేకులు తిరస్కరించారు. చాలామంది సందేశకులను ఎగతాళి చేశారు. అయితే కొంతమంది ప్రతిస్పందించారు. వారిప్పుడు లక్షల సంఖ్యలో ఉన్నారు, వారు “ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని”చే బోధించబడుతూ, ఆయనవైపు చూడడంలో ఆనందాన్ని పొందుతారు. (యెషయా 54:13) వారు అపరిశుద్ధమైన బలిపీఠముల వద్ద ఆరాధించడాన్ని అంటే మానవ-నిర్మిత దేవుళ్ల ఎడల భక్తినీ వారిని నమ్ముకోవడాన్నీ మానుకుని ఆతురతతో యెహోవావైపు తిరుగుతారు. (కీర్తన 146:3, 4) యెషయా సమకాలీనుడైన మీకా వలె వారిలో ప్రతి ఒక్కరూ ఇలా చెబుతారు: “యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును.”—మీకా 7:7.
19. యెహోవా ఎవరిని గద్దిస్తాడు, వారికి దాని భావమేమిటి?
19 నరమాత్రులను నమ్ముకునే వారికి ఎంత భిన్నం! హింస, తిరుగుబాటు అనే సంక్షోభిత తరంగాలు ఈ అంత్య దినాల్లో మానవజాతిని అతలకుతలం చేస్తున్నాయి. తిరుగుబాటు చేసే అవిశ్రాంత మానవజాతి అనే “సముద్రము” అసంతృప్తిని, విప్లవాన్ని రేపుతోంది. (యెషయా 57:20; ప్రకటన 8:8, 9; 13:1) విప్లవ ఘోషను చేసే ఈ సమూహాన్ని యెహోవా “బెదిరించును [“గద్దిస్తాడు,” NW].” సమస్యల్ని సృష్టించే ప్రతి సంస్థనూ, ప్రతి వ్యక్తినీ ఆయన పరలోక రాజ్యం నాశనం చేస్తుంది, “వారు దూరముగా పారిపోవుదురు . . . తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు.”—యెషయా 17:12, 13; ప్రకటన 16:14-16.
20. జనములచే ‘దోచుకొన’బడుతున్నప్పటికీ, నిజ క్రైస్తవులకు ఎటువంటి నమ్మకం ఉంది?
20 ఫలితం? యెషయా ఇలా చెబుతున్నాడు: “సాయంకాలమున తల్లడిల్లుదురు, ఉదయము కాకమునుపు లేకపోవుదురు. ఇదే మమ్మును దోచుకొనువారి భాగము, మా సొమ్ము దొంగిలు వారికి పట్టు గతి యిదే.” (యెషయా 17:14) చాలామంది యెహోవా ప్రజలతో కఠినంగా, అమర్యాదకరంగా వ్యవహరిస్తూ వారిని దోచుకొనుచున్నారు. నిజ క్రైస్తవులు లోకంలోని ప్రధాన మతాల్లో ఒక భాగం కాదు గనుక—అలా భాగస్థులు కావాలని వారు కోరుకొనరు కూడా—పక్షపాతంగల విమర్శకులు, మతోన్మాదులైన వ్యతిరేకులు వారిని సులభంగా దొరికే ఎరగా దృష్టిస్తారు. కానీ తమ శ్రమలు ముగిసే “ఉదయము” త్వరగా రాబోతోందని దేవుని ప్రజలు దృఢనిశ్చయత కలిగివున్నారు.—2 థెస్సలొనీకయులు 1:6-9; 1 పేతురు 5:6-11.
ఇతియోపియా యెహోవాకు అర్పణము తెస్తుంది
21, 22. తర్వాత ఏ రాజ్యం తీర్పు దేవోక్తిని పొందుతుంది, యెషయా ప్రేరేపిత వచనాలు ఎలా నెరవేరాయి?
21 ఐగుప్తుకు దక్షిణాన ఉన్న ఇతియోపియా, కనీసం రెండు సందర్భాల్లో యూదాకు వ్యతిరేకంగా యుద్ధం చేయడంలో భాగం వహించింది. (2 దినవృత్తాంతములు 12:2, 3; 14:1, 9-15; 16:8) ఇప్పుడు యెషయా ఆ రాజ్యంపై తీర్పును ప్రవచిస్తున్నాడు: “ఓహో కూషు [“ఇతియోపియా,” NW] నదుల అవతల తటతట కొట్టుకొనుచున్న రెక్కలుగల [“కీటకాలున్న,” NW] దేశమా!” (యెషయా 18:1-6 చదవండి.) * ఇతియోపియా ‘నరికి వేయబడి, కోసివేయబడుతుందని’ యెహోవా ప్రకటిస్తున్నాడు.
22 ఇతియోపియా సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దం చివరి సగభాగంలో ఐగుప్తును జయించి, దాదాపు 60 సంవత్సరాలపాటు దాన్ని పరిపాలించిందని లౌకిక చరిత్ర తెలియజేస్తోంది. అష్షూరు చక్రవర్తులైన ఏసర్హద్దోను, ఆస్నప్పరు తిరిగి దాడి చేశారు. ఆస్నప్పరు తీబ్జ్‌ను నాశనం చేయడంతో, అష్షూరు ఐగుప్తును లోబరచుకుని నైలు లోయపై ఇతియోపియా ఆధిపత్యాన్ని ముగింపుకు తెచ్చింది. (యెషయా 20:3-6 కూడా చూడండి.) ఆధునిక కాలాల్లోని మాటేమిటి?
23. ఆధునిక-దిన “ఇతియోపియా” ఏ పాత్ర నిర్వహిస్తుంది, అది ఎందుకు అంతమౌతుంది?
23 ‘అంత్యకాలమును’ గూర్చిన దానియేలు ప్రవచనంలో, దురాక్రమణ చేసే “ఉత్తరదేశపు రాజు” ఇతియోపియాను, లిబియాను “తనకు పాదసేవకులుగా” చేసుకున్నట్లు, అంటే తన నిర్దేశాన్ని అనుసరించేలా చేసుకున్నట్లు వివరించబడింది. (దానియేలు 11:40-43) ఇతియోపియా, “మాగోగు దేశపువాడగు గోగు” యొక్క సైనిక శక్తిలో భాగమైయున్నట్లు కూడా పేర్కొనబడింది. (యెహెజ్కేలు 38:2-5, 8) ఉత్తరదేశపు రాజుతో సహా గోగు సైన్యాలు, యెహోవా పరిశుద్ధ జనముపై దాడి చేసినప్పుడు అంతమౌతాయి. కాబట్టి, యెహోవా సర్వాధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నందున ఆధునిక-దిన “ఇతియోపియా”కు వ్యతిరేకంగా కూడా ఆయన బాహువు చాపబడుతుంది.—యెహెజ్కేలు 38:21-23; దానియేలు 11:45.
24. యెహోవా దేశాల నుండి ఏ యే విధాలుగా “కానుకలు” అందుకున్నాడు?
24 అయినప్పటికీ, ప్రవచనం ఇలా కూడా చెబుతుంది: “ఆ కాలమున ఎత్తయినవారును నునుపైన చర్మముగలవారును దూరములోనున్న భీకరమైనవారును . . . సైన్యములకధిపతియగు యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాసస్థలముగానుండు సీయోను పర్వతమునకు తేబడుదురు.” (యెషయా 18:7) జనములు యెహోవా సర్వోన్నతాధిపత్యాన్ని గుర్తించకపోయినప్పటికీ, వారు కొన్నిసార్లు యెహోవా ప్రజలకు ప్రయోజనం చేకూరేవిధంగా చర్య తీసుకున్నారు. కొన్ని దేశాల్లో అధికారులు, యెహోవా నమ్మకమైన ఆరాధకులకు చట్టబద్ధమైన హక్కులను ఇస్తూ చట్టాలను రూపొందించారు, కోర్టు నిర్ణయాలను చేశారు. (అపొస్తలుల కార్యములు 5:29; ప్రకటన 12:15, 16) వేరే కానుకలు కూడా ఉన్నాయి. “రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. . . . ఐగుప్తులోనుండి ప్రధానులు వచ్చెదరు; కూషీయులు [ఇతియోపియావారు] దేవునితట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తివచ్చెదరు.” (కీర్తన 68:29-31) నేడు, యెహోవాకు భయపడే లక్షలాదిమంది “ఇతియోపియా”వారు ఆరాధన రూపంలో “అర్పణము” తెస్తున్నారు. (మలాకీ 1:11) రాజ్య సువార్తను భూమ్యంతటా ప్రకటించడమనే బృహత్ కార్యంలో వారు భాగం వహిస్తున్నారు. (మత్తయి 24:14; ప్రకటన 14:6, 7) యెహోవాకు అర్పించడానికి ఎంత చక్కని అర్పణము!—హెబ్రీయులు 13:15.
ఐగుప్తు గుండె కరుగుతుంది
25. యెషయా 19:1-11 నెరవేర్పుగా, ప్రాచీన ఐగుప్తుకు ఏమి జరుగుతుంది?
25 యూదాకు దక్షిణవైపున దగ్గరలోవున్న పొరుగుదేశం ఐగుప్తు, దేవుని నిబంధన ప్రజలకు ఎంతో కాలంగా శత్రువు. యెషయా జీవితకాలంలో ఐగుప్తులోని అస్తవ్యస్త పరిస్థితుల గురించి యెషయా గ్రంథం 19 వ అధ్యాయం తెలియజేస్తుంది. ‘పట్టణముతో పట్టణము యుద్ధము చేస్తూ, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేస్తూ’ ఐగుప్తులో పౌరయుద్ధం జరుగుతోంది. (యెషయా 19:2, 13, 14) ప్రతిద్వంద రాజవంశాలు ఒకే సమయంలో దేశంలోని వివిధ భాగాల్లో పరిపాలన చేశాయన్నదానికి చరిత్రకారులు సాక్ష్యాధారాన్ని చూపిస్తున్నారు. ఐగుప్తు డంబపు జ్ఞానము, తన ‘విగ్రహములతో, గొణుగువారితో’ దాన్ని “క్రూరమైన అధికారి” చేతిలో నుండి రక్షించదు. (యెషయా 19:3, 4) ఐగుప్తును అష్షూరు, బబులోను, పారసీక దేశం, గ్రీసు, రోము విజయవంతంగా జయిస్తాయి. ఈ సంఘటనలన్నీ యెషయా 19:1-11 వచనాల్లోని ప్రవచనాలను నెరవేరుస్తాయి.
26. విస్తృతమైన నెరవేర్పులో, ఆధునిక-దిన ‘ఐగుప్తు’ నివాసులు యెహోవా తీర్పు చర్యలకు ఎలా ప్రతిస్పందిస్తారు?
26 అయితే, బైబిలులో ఐగుప్తు తరచూ సాతాను ప్రపంచాన్ని సూచిస్తుంది. (యెహెజ్కేలు 29:3; యోవేలు 3:19; ప్రకటన 11:8) కాబట్టి, యెషయా వ్రాసిన “ఐగుప్తునుగూర్చిన దేవోక్తి” విస్తృతమైన విధంగా నెరవేరుతుందా? అవును, ఖచ్చితంగా నెరవేరుతుంది! ఈ ప్రవచనం యొక్క ప్రారంభ పదాలు ఈ విషయాన్ని గమనించడానికి ప్రతి ఒక్కరికి కారణాన్నివ్వాలి: “యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును, ఐగుప్తీయుల గుండె కరగుచున్నది.” (యెషయా 19:1) యెహోవా త్వరలోనే సాతాను సంస్థకు వ్యతిరేకంగా చర్య తీసుకుంటాడు. ఆ సమయంలో, ఈ విధానపు దేవతలు విలువలేనివారిగా పరిగణించబడతారు. (కీర్తన 96:5; 97:7) భయంతో ‘ఐగుప్తు గుండె కరిగిపోతుంది.’ ఆ సమయాన్ని గురించి యేసు ఇలా ప్రవచించాడు: “భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. . . . లోకము మీదికి రాబోవుచున్న వాటివిషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.”—లూకా 21:25, 26.
27. “ఐగుప్తు”లో ఏ విధమైన అంతర్గత విభజనలు జరుగుతాయని ప్రవచించబడింది, ఇది నేడు ఎలా నెరవేరుతోంది?
27 ఆయన తీర్పు అమలు చేయడానికి దారితీసే సమయాన్ని గురించి యెహోవా ప్రవచనార్థకంగా ఇలా చెబుతున్నాడు: “నేను ఐగుప్తీయులమీదికి ఐగుప్తీయులను రేపెదను. సహోదరులమీదికి సహోదరులు పొరుగువారిమీదికి పొరుగువారు లేచుదురు. పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును.” (యెషయా 19:2) దేవుని రాజ్యం 1914 లో స్థాపించబడినప్పటి నుండి, జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేవడం ‘యేసు ప్రత్యక్షత సూచనకు’ గుర్తుగా ఉంది. తెగల సంబంధమైన సామూహిక హత్యలు, క్రూరమైన జాతినిర్మూలనలు, జాతి ప్రక్షాళన అని పిలువబడేవి ఈ అంత్యదినాల్లో లక్షలాదిమంది జీవితాలను బలిగొన్నాయి. అంతం సమీపిస్తుండగా అలాంటి ‘వేదనలు’ అధికమవుతాయి.—మత్తయి 24:3, 7, 8.
28. తీర్పు దినాన, అబద్ధమతం ఏమి చేయలేకపోతుంది?
28 “ఐగుప్తీయులయొక్క శౌర్యము నశించును, వారి ఆలోచనశక్తిని నేను మాన్పివేసెదను. కావున వారు విగ్రహములయొద్దకును గొణుగువారి యొద్దకును కర్ణపిశాచిగలవారియొద్దకును సోదెగాండ్రయొద్దకును విచారింప వెళ్లుదురు.” (యెషయా 19:3) మోషే ఫరో ఎదుటకి వెళ్లినప్పుడు ఐగుప్తు శకునగాండ్రు యెహోవా శక్తికి సరిసమానమైన శక్తిని ప్రదర్శించలేక అవమానం పాలయ్యారు. (నిర్గమకాండము 8:18, 19; అపొస్తలుల కార్యములు 13:8; 2 తిమోతి 3:8) అలాగే, తీర్పు దినాన, అబద్ధమతం ఈ భ్రష్ట విధానాన్ని రక్షించలేకపోతుంది. (యెషయా 47:1, 11-13, పోల్చండి.) చివరికి ఐగుప్తు “క్రూరమైన అధికారి” అయిన అష్షూరు క్రిందికి వచ్చింది. (యెషయా 19:4) ఇది, ఈ విధానం కోసం వేచివున్న నిస్తేజమైన భవిష్యత్తుకు ముంగుర్తుగా ఉంది.
29. యెహోవా దినము వచ్చినప్పుడు, రాజకీయ నాయకులు దేనికి ఉపయోగపడతారు?
29 అయితే, రాజకీయ నాయకుల మాటేమిటి? వారు సహాయం చేయగలరా? “ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచనశక్తి పశుప్రాయమాయెను.” (యెషయా 19:5-11 చదవండి.) తీర్పు దినాన మానవులైన ఆలోచనకర్తలు ఏమైనా ఉపయోగపడతారని ఆశించడం ఎంత నిర్హేతుకమో కదా! లోకంలోని పరిజ్ఞానమునంతటినీ వారు ఉపయోగించుకున్నప్పటికీ వారికి దైవిక జ్ఞానము మాత్రం కొరవడుతుంది. (1 కొరింథీయులు 3:19) వారు యెహోవాను తిరస్కరించి, విజ్ఞానశాస్త్రాన్ని, తత్త్వశాస్త్రాన్ని, డబ్బును, సుఖానుభూతిని, మరితర ప్రత్యామ్నాయ దేవుళ్లను ఆశ్రయించారు. ఫలితంగా, వారికి దేవుని సంకల్పాలను గురించిన జ్ఞానము లేదు. వారు మోసగించబడ్డారు, అయోమయంలో పడిపోయారు. వారి పనులన్నీ వ్యర్థమే. (యెషయా 19:12-15 చదవండి.) “జ్ఞానులు అవమానము నొందినవారైరి, వారు విస్మయమొంది చిక్కున పడియున్నారు, వారు యెహోవా వాక్యమును నిరాకరించినవారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు?”—యిర్మీయా 8:9.
యెహోవాకు ఒక సూచన, ఒక సాక్ష్యము
30. ‘యూదా దేశము ఐగుప్తునకు’ ఏ విధంగా ‘భయంకరం’ అవుతుంది?
30 అయితే, “ఐగుప్తు” నాయకులు ‘స్త్రీలవలె’ బలహీనులు, అయితే దైవిక జ్ఞానము కోసం చూసేవారు కొంతమంది ఉన్నారు. యెహోవా అభిషిక్తులు, వారి సహవాసులు ‘దేవుని గుణాతిశయములను ప్రచురము చేస్తారు.’ (యెషయా 19:16; 1 పేతురు 2:9) సాతాను సంస్థకు రానున్న వినాశనాన్ని గురించి ప్రజలను హెచ్చరించడంలో వారు తాము చేయగలిగినదంతా చేస్తున్నారు. ఈ పరిస్థితి కోసం ఎదురుచూస్తూ, యెషయా ఇలా చెబుతున్నాడు: “యూదాదేశము ఐగుప్తునకు భయంకరమగును. తమకు విరోధముగా సైన్యములకధిపతియగు యెహోవా ఉద్దేశించినదానినిబట్టి ఒకడు ప్రస్తాపించినయెడల ఐగుప్తీయులు వణకుదురు.” (యెషయా 19:17) యెహోవా నమ్మకమైన సందేశకులు, యెహోవా ప్రవచించిన తెగుళ్ళను గురించిన ప్రకటనతో సహా సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. (ప్రకటన 8:7-12; 16:2-12) ఇది ప్రపంచ మత నాయకులను కలతపరుస్తుంది.
31. ఐగుప్తు నగరాల్లో “కనాను భాష” మాట్లాడడం (ఎ) ప్రాచీన కాలాల్లో ఎలా జరిగింది? (బి) ఆధునిక కాలాల్లో ఎలా జరుగుతోంది?
31 ఈ ప్రకటన పనికి ఆశ్చర్యకరమైన ఫలితం ఏమై ఉంటుంది? “ఆ దినమున కనానుభాషతో మాటలాడుచు యెహోవా వారమని ప్రమాణముచేయు అయిదు పట్టణములు ఐగుప్తుదేశములో ఉండును. వాటిలో ఒకటి నాశనపురము.” (యెషయా 19:18) ప్రాచీన కాలాల్లో ఈ ప్రవచనం, ఐగుప్తుకు పారిపోయి అక్కడి నగరాల్లో నివాసం ఏర్పరచుకున్న యూదులు హీబ్రూ భాషను మాట్లాడినప్పుడు నెరవేరి ఉండవచ్చు. (యిర్మీయా 24:1, 8-10; 41:1-3; 42:9–43:7) నేడు, ఆధునిక-దిన “ఐగుప్తు” ప్రాంతంలో, బైబిలు సత్యపు “స్వచ్ఛమైన భాషను” మాట్లాడడం నేర్చుకున్న ప్రజలు ఉన్నారు. (జెఫన్యా 3:9, NW) “స్వచ్ఛమైన భాష”లో కొంత భాగం, సాతాను సంస్థను బయల్పర్చడంతోనూ దాన్ని ‘నాశనం’ చేయడంతోనూ సంబంధం కలిగివుందని సూచిస్తూ, ఐదు సూచనార్థక నగరాల్లో ఒకటి “నాశనపురము” అని పిలువబడుతుంది.
32. (ఎ) ఐగుప్తు దేశము మధ్యన ఏ “బలిపీఠము” ఉంది? (బి) అభిషిక్తులు ఐగుప్తు సరిహద్దునొద్ద “ఒక స్తంభము” వలె ఎలా ఉన్నారు?
32 యెహోవా ప్రజల ప్రకటనా పని మూలంగా, ఆయన గొప్ప నామం ఈ వ్యవస్థలో నిశ్చయంగా ప్రసిద్దమవుతుంది. “ఆ దినమున ఐగుప్తుదేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక స్తంభమును ఉండును.” (యెషయా 19:19) ఈ మాటలు, దేవునితో నిబంధన సంబంధాన్ని కలిగివున్న అభిషిక్త క్రైస్తవుల స్థానాన్ని సూచిస్తాయి. (కీర్తన 50:5) వారు “ఒక బలిపీఠము” వలె తమ బలులను అర్పిస్తున్నారు; ‘సత్యమునకు స్తంభము, ఆధారము’ వలె యెహోవాను గూర్చి సాక్ష్యమిస్తున్నారు. (1 తిమోతి 3:15; రోమీయులు 12:1; ) వారు “దేశము మధ్యను” ఉన్నారు, అంటే వారిని తమ “వేరే గొర్రెల” సహవాసులతో 230 కన్నా ఎక్కువ దేశాల్లోనూ, సముద్రపు ద్వీపాల్లోనూ కనుగొనవచ్చు. కానీ వారు “లోకసంబంధులు” కారు. ( హెబ్రీయులు 13:15, 16యోహాను 10:16; 17:15, 16) సూచనార్థకంగా చెప్పాలంటే, ఈ లోకానికి దేవుని రాజ్యానికి మధ్యనున్న సరిహద్దును దాటి తమ పరలోక బహుమానాన్ని అందుకోవడానికి సిద్ధంగా, వారు ఆ సరిహద్దుపై నిలబడి ఉన్నారు.
33. అభిషిక్తులు ఏ యే విధాలుగా “ఐగుప్తు”లో “సూచనగా,” “సాక్ష్యార్థముగా” ఉన్నారు?
33 యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును.” (యెషయా 19:20) “సూచనగా,” “సాక్ష్యార్థముగా” అభిషిక్తులు ప్రకటనా పనిలో నాయకత్వం వహిస్తారు, ఈ విధానంలో యెహోవా నామమును ఉన్నతపరుస్తారు. (యెషయా 8:18; హెబ్రీయులు 2:13) ప్రపంచమంతటా అణచివేయబడిన ప్రజల కేకలు వినిపిస్తున్నాయి కాని మొత్తానికి మానవ ప్రభుత్వాలు మాత్రం వారికి సహాయం చేయలేకపోతున్నాయి. అయితే, సాత్వికులనందరిని విమోచించడానికి యెహోవా గొప్ప రక్షకుడ్ని అంటే రాజైన యేసు క్రీస్తును పంపిస్తాడు. అర్మగిద్దోను యుద్ధంలో ఈ అంత్యదినాలు చరమాంకాన్ని చేరుకున్నప్పుడు ఆయన, దేవునికి భయపడే మానవులకు ఉపశమనాన్ని, నిత్య ఆశీర్వాదాలను తీసుకువస్తాడు.—కీర్తన 72:2, 4, 7, 12-14.
34. (ఎ) “ఐగుప్తీయులు” యెహోవాను ఎలా తెలుసుకుంటారు, వారు ఆయనకు ఏవిధమైన బలినైవేద్యములను అర్పిస్తారు? (బి) యెహోవా “ఐగుప్తు”ను ఎప్పుడు కొడతాడు, తర్వాత ఏ స్వస్థత జరుగుతుంది?
34 ఈ మధ్య కాలంలో, ప్రజలందరూ ఖచ్చితమైన జ్ఞానమును సంపాదించుకుని, రక్షించబడాలన్నది దేవుని చిత్తము. (1 తిమోతి 2:4) కాబట్టి, యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును; ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసికొందురు, వారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు యెహోవాకు మ్రొక్కుకొనెదరు, తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును; వారు యెహోవావైపు తిరుగగా, ఆయన వారి ప్రార్థననంగీకరించి వారిని స్వస్థపరచును.” (యెషయా 19:21, 22) “ఐగుప్తీయులు” అంటే సాతాను లోకానికి చెందిన అన్ని దేశాల ప్రజలు యెహోవాను తెలుసుకుని, “ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించు[చు]” ఆయనకు బలి అర్పిస్తున్నారు. (హెబ్రీయులు 13:15) వారు యెహోవాకు తమను తాము సమర్పించుకోవడం ద్వారా మ్రొక్కుకుంటారు, యథార్థ సేవా జీవితాన్ని గడపడం ద్వారా తమ మ్రొక్కుబడిని చెల్లిస్తారు. అర్మగిద్దోను సమయంలో యెహోవా ఈ విధానాన్ని ‘కొట్టిన తర్వాత’ మానవజాతిని స్వస్థపర్చడానికి ఆయన తన రాజ్యాన్ని ఉపయోగిస్తాడు. యేసు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో, మానవజాతి ఆధ్యాత్మికంగా, మానసికంగా, నైతికంగా, శారీరకంగా పరిపూర్ణతకు తీసుకురాబడుతుంది, నిజంగా స్వస్థపర్చబడుతుంది!—ప్రకటన 22:1, 2.
‘నా జనము ఆశీర్వదింపబడును’
35, 36. యెషయా 19:23-25 నెరవేర్పుగా, ప్రాచీన కాలాల్లో ఐగుప్తు, అష్షూరు, ఇశ్రాయేలుల మధ్యన ఏ సంబంధాలు ఏర్పడ్డాయి?
35 ప్రవక్త తర్వాత ఒక విశేషమైన అభివృద్ధిని చూస్తాడు: “ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గమేర్పడును, అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవుచునుందురు; ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగ నుండును. సైన్యములకధిపతియగు యెహోవా—నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును.” (యెషయా 19:23-25) అవును, ఒక రోజున ఐగుప్తు అష్షూరుల మధ్య స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఎలా?
36 గతకాలాల్లో యెహోవా తన ప్రజలను జనాంగముల నుండి కాపాడినప్పుడు, ఒక విధంగా చెప్పాలంటే, ఆయన వారి కోసం స్వేచ్ఛకు నడిపే రాజమార్గములను వేశాడు. (యెషయా 11:16; 35:8, 9; 49:11-13; యిర్మీయా 31:21) బబులోను ఓడిపోయిన తర్వాత అష్షూరు, ఐగుప్తుల నుండి, అలాగే బబులోను నుండి బంధీలు వాగ్దాన దేశానికి తీసుకు రాబడినప్పుడు ఈ ప్రవచనం పరిమితంగా నెరవేరింది. (యెషయా 11:11) అయితే ఆధునిక కాలాల మాటేమిటి?
37. లక్షలాదిమంది నేడు “అష్షూరు”కు, “ఐగుప్తు”కు మధ్య రాజమార్గం ఉన్నట్లుగా ఎలా జీవిస్తున్నారు?
37 నేడు, అభిషిక్త ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయుల శేషము “భూమిమీద ఆశీర్వాద కారణముగ” ఉంది. వారు సత్యారాధనను పెంపొందింపజేసి, అన్ని దేశాల ప్రజలకు రాజ్య సందేశాన్ని ప్రకటిస్తున్నారు. ఈ దేశాల్లో కొన్ని విపరీతమైన సైనికశక్తితో అష్షూరు వలె ఉన్నాయి. ఇతర దేశాలు, బహుశా దానియేలు ప్రవచనంలోని ఒకప్పటి “దక్షిణదేశపు రాజు” అయిన ఐగుప్తు వలె ఎక్కువ స్వేచ్ఛనిచ్చేవిగా ఉన్నాయి. (దానియేలు 11:5, 8) సైనిక శక్తిగల దేశాల్లోని, మరింత స్వేచ్ఛనిచ్చే దేశాల్లోని లక్షలాదిమంది వ్యక్తులు సత్యారాధనా మార్గాన్ని చేపట్టారు. అలా, ‘యెహోవాను సేవించడంలో’ అన్ని దేశాల ప్రజలు ఐక్యమయ్యారు. వీరి మధ్యన జాతీయ విభజనలు లేవు. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ‘అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరునకును వస్తూ పోతూ’ ఉంటారని నిజంగా చెప్పవచ్చు. వాటి మధ్యన ఒకదాని నుండి మరో దానికి రాజమార్గం ఉన్నట్లుగా ఉంది.—1 పేతురు 2:17.
38. (ఎ) ‘ఐగుప్తు, అష్షూరులతోకూడ’ ఇశ్రాయేలు ఎలా ‘మూడవ జనమవుతుంది’? (బి) యెహోవా ‘నా జనము ఆశీర్వదింపబడును’ అని ఎందుకు చెబుతున్నాడు?
38 అయితే ఇశ్రాయేలు ఏవిధంగా, ‘ఐగుప్తు, అష్షూరులతోకూడ మూడవ జనమై’ ఉంటుంది? “అంత్యకాల” ఆరంభములో, భూమిపై యెహోవా సేవ చేస్తున్నవారిలో అత్యధికులు “దేవుని ఇశ్రాయేలు” సభ్యులే. (దానియేలు 12:9; గలతీయులు 6:16) భూనిరీక్షణగల “వేరే గొఱ్ఱెల” ఒక గొప్ప సమూహము 1930ల నుండి కనిపించింది. (యోహాను 10:16ఎ; ప్రకటన 7:9) ఐగుప్తు, అష్షూరులచే ముందుగా సూచించబడిన రాజ్యాల నుండి బయటికి వచ్చిన వీరు యెహోవా ఆరాధనా స్థలానికి ప్రవాహము వలె వస్తూ, తమతో కలవమని ఇతరులను ఆహ్వానిస్తున్నారు. (యెషయా 2:2-4) వారు తమ అభిషిక్త సహోదరులవలెనే అదే ప్రకటనా పనిచేస్తూ, అటువంటి పరీక్షలనే సహిస్తారు, అదే విధమైన విశ్వాస్యతను యథార్థతను చూపిస్తారు, ఒకే ఆధ్యాత్మిక బల్ల యొద్ద భోజనం చేస్తారు. నిజంగా, అభిషిక్తులు మరియు “వేరే గొఱ్ఱెలు” ‘ఒక్క మంద, వారి కాపరి ఒక్కడు.’ (యోహాను 10:16బి) వారి ఆసక్తిని, సహనాన్ని చూస్తూ వారి కార్యకలాపాన్ని బట్టి యెహోవా సంతోషిస్తున్నాడనేదాన్ని ఎవరైనా సందేహించగలరా? ‘నా జనము ఆశీర్వదింపబడును’ అని చెబుతూ ఆయన వారికి ఆశీర్వచనాన్ని ప్రకటిస్తున్నాడంటే అందులో ఆశ్చర్యంలేదు!
[అధస్సూచి]
^ ‘తటతట కొట్టుకొనుచున్న రెక్కలుగల కీటకాలున్న దేశం’ అనే వ్యక్తీకరణ ఇతియోపియాకు అప్పుడప్పుడూ గుంపులు గుంపులుగా వచ్చే మిడుతలను సూచిస్తుందని కొంతమంది పండితులు అంటారు. ట్సలాట్సాల అనే హీబ్రూ పదం ‘తటతట కొట్టుకొనుచున్న’ అని అనువదించబడింది, ఆ పదం ఆధునిక ఇతియోపియాలో నివసిస్తున్న గల్ల అనే జాతి ప్రజలు సెట్‌సీ ఈగకు ఇచ్చిన పేరైన ట్సాల్‌ట్సాల్యా అనే పదోచ్చరణను పోలివుందని ఇతరులు చెబుతారు.
[అధ్యయన ప్రశ్నలు]
[191 వ పేజీలోని చిత్రం]
తమ శత్రువులపై దాడి చేస్తున్న ఫిలిష్తీయ యోధులు (సా.శ.పూ. 12 వ శతాబ్దానికి చెందిన ఐగుప్తు చెక్కడం)
[192 వ పేజీలోని చిత్రం]
మోయాబు యోధుని లేక దేవుని రాతి ఉబ్బెత్తు శిల్పం (సా.శ.పూ. 11 నుండి 8 శతాబ్దాల మధ్యకాలం)
[196 వ పేజీలోని చిత్రం]
ఒంటెపై స్వారీ చేస్తున్న సిరియా యోధుడు (సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దం)
[198 వ పేజీలోని చిత్రం]
తిరుగుబాటు చేసే మానవజాతి అనే “సముద్రము” అసంతృప్తిని, విప్లవాన్ని రేకెత్తిస్తుంది
[203 వ పేజీలోని చిత్రం]
ఐగుప్తు శకునగాండ్రు యెహోవా శక్తికి సరిసమానమైన శక్తిని ప్రదర్శించలేకపోయారు