తిరుగుబాటుదారులకు శ్రమ!
పదకొండవ అధ్యాయం
తిరుగుబాటుదారులకు శ్రమ!
1. యెరొబాము ఎటువంటి ఘోరమైన తప్పు చేశాడు?
యెహోవా నిబంధన ప్రజలు రెండు రాజ్యాలుగా విభజించబడినప్పుడు, పది-గోత్రాల ఉత్తర రాజ్యం యెరొబాము పరిపాలన క్రిందకు వచ్చింది. క్రొత్త రాజు శక్తిసామర్థ్యాలు గల పరిపాలకుడు. కానీ ఆయనకు యెహోవాపై నిజమైన విశ్వాసం లేదు. అందుకే ఆయన ఒక ఘోరమైన తప్పు చేశాడు, అది ఉత్తర రాజ్య చరిత్రంతటిపై విధ్వంసకరమైన ప్రభావాన్ని చూపింది. ఇశ్రాయేలీయులు సంవత్సరానికి మూడుసార్లు యెరూషలేములోని ఆలయాన్ని సందర్శించాలని మోషే ధర్మశాస్త్రం ప్రకారం వారికి ఆజ్ఞాపించబడింది, అయితే ఆ ఆలయం ఇప్పుడు దక్షిణ రాజ్యమైన యూదాలో ఉంది. (ద్వితీయోపదేశకాండము 16:16) అలా క్రమంగా వెళ్ళిరావడం వల్ల తన పౌరులు తమ దక్షిణ రాజ్య సహోదరులతో తిరిగి ఏకం కావాలని ఆలోచిస్తారేమోనని భయపడి, యెరొబాము “రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచి—యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము; ఇశ్రాయేలువారలారా, ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను.”—1 రాజులు 12:28, 29.
2, 3. యెరొబాము చేసిన తప్పు ఇశ్రాయేలుపై ఏ ప్రభావాన్ని చూపింది?
2 కొంతకాలంపాటు యెరొబాము పథకం పారినట్లే కనిపించింది. ప్రజలు క్రమంగా యెరూషలేముకు వెళ్లడం మానుకుని ఆ రెండు దూడలను ఆరాధించడం మొదలుపెట్టారు. (1 రాజులు 12:30) అయితే ఈ భ్రష్ట మతాచరణ పది-గోత్రాల రాజ్యాన్ని కలుషితం చేసింది. తర్వాతి సంవత్సరాల్లో, ఇశ్రాయేలులో నుండి బయలు ఆరాధనను నిర్మూలించడానికి ప్రశంసాత్మకమైన ఆసక్తి చూపించిన యెహూ కూడా బంగారు దూడలకు మ్రొక్కడం ప్రారంభించాడు. (2 రాజులు 10:28, 29) యెరొబాము తీసుకున్న విషాదకరమైన తప్పుడు నిర్ణయం వల్ల ఇంకా ఏమి జరిగింది? రాజకీయ అస్థిరత ఏర్పడింది, ప్రజలు వేదనకు గురయ్యారు.
3 యెరొబాము మతభ్రష్టుడయ్యాడు గనుక, అతని సంతానం దేశాన్ని పరిపాలించదనీ, ఉత్తర రాజ్యం ఘోరమైన నాశనాన్ని అనుభవిస్తుందనీ యెహోవా చెప్పాడు. (1 రాజులు 14:14, 15) యెహోవా మాట నిజమయ్యింది. ఇశ్రాయేలుకు చెందిన ఏడుగురు రాజులూ రెండు సంవత్సరాలకంటే ఎక్కువ పరిపాలించలేదు, కొందరైతే కేవలం కొన్ని రోజులపాటు మాత్రమే పరిపాలించారు. ఒక రాజు ఆత్మహత్య చేసుకున్నాడు, సింహాసనాన్ని చేజిక్కించుకున్న అత్యాశాపరులు మరో ఆరుగురిని హతమార్చారు. ప్రాముఖ్యంగా యెరొబాము II పరిపాలన సా.శ.పూ. 804 లో ముగిసిన తర్వాత, యూదాలో ఉజ్జియా పరిపాలిస్తున్న కాలంలో, ఇశ్రాయేలును అశాంతి, దౌర్జన్యం, హత్యలు పట్టిపీడించాయి. ఈ నేపథ్యంలో యెహోవా ఉత్తర రాజ్యానికి యెషయా ద్వారా సూటిగా ఒక హెచ్చరిక లేక “వర్తమానము” పంపిస్తాడు. “ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలువరకు దిగివచ్చియున్నది.”—యెషయా 9:8. *
అతిశయము, గర్వము దేవుని ఉగ్రతకు గురి చేస్తాయి
4. యెహోవా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఏ “వర్తమానము” పంపించాడు, ఎందుకు?
4 యెహోవా “వర్తమానము” అలక్ష్యం చేయబడదు. “అది ఎఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును ప్రజల కందరికి తెలియవలసియున్నది. . . . [వారు] అతిశయపడి గర్వముతో [ఉన్నారు].” (యెషయా 9:9, 10) “యాకోబు,” “ఇశ్రాయేలు,” “ఎఫ్రాయిము,” “షోమ్రోను” ఇవన్నీ ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్నే సూచిస్తున్నాయి, వాటిలో ఎఫ్రాయిము ప్రధాన గోత్రము, షోమ్రోను రాజధాని. ఆ రాజ్యానికి వ్యతిరేకంగా వచ్చే యెహోవా వర్తమానము శక్తివంతమైన తీర్పు ప్రకటన, ఎందుకంటే ఎఫ్రాయిము మతభ్రష్టత్వంతో రాటుదేలి, యెహోవాపట్ల తిరస్కారపూర్వకమైన గర్వాన్ని చూపించింది. దేవుడు ప్రజలను వారి దుష్టమార్గాల వల్ల వచ్చే పర్యవసానాల నుండి కాపాడడు. వారు దేవుని వర్తమానాన్ని వినేలా లేక దానికి అవధానం ఇచ్చేలా బలవంతం చేయబడతారు.—గలతీయులు 6:7.
5. యెహోవా తీర్పు చర్యలకు తామేమీ చెక్కుచెదరనట్లు ఇశ్రాయేలీయులు ఎలా చూపించారు?
5 పరిస్థితులు క్షీణించిపోతుండగా, ప్రజలు సాధారణంగా మట్టి ఇటికలతోనూ చవకబారు కఱ్ఱతోనూ కట్టిన తమ ఇళ్లను కోల్పోవడంతో సహా తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటారు. ఫలితంగా వారి హృదయాలు మెత్తబడతాయా? వారు యెహోవా ప్రవక్తలు చెప్పేది విని, సత్య దేవునివైపుకు తిరుగుతారా? * ప్రజల గర్వంతోకూడిన ప్రతిస్పందనను యెషయా ఇలా నివేదిస్తున్నాడు: “ఇటికలతో కట్టినది పడిపోయెను చెక్కిన రాళ్లతో కట్టుదము రండి; రావికఱ్ఱతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కఱ్ఱను వేయుదము రం[డి].” (యెషయా 9:10) ఇశ్రాయేలీయులు యెహోవాను ప్రతిఘటిస్తూ, అలాంటి బాధలను వారెందుకు అనుభవిస్తున్నారో చెబుతున్న ఆయన ప్రవక్తలను తిరస్కరిస్తారు. ఒక విధంగా ప్రజలిలా అంటారు: ‘పాడైపోయే మట్టి ఇటుకలతోనూ చవకబారు కఱ్ఱతోనూ కట్టుకున్న ఇళ్లను మనం కోల్పోయినా, నాణ్యమైన వస్తువులతో అంటే చెక్కిన రాళ్లతో, దేవదారు కఱ్ఱతో మన ఇళ్లను పునర్నిర్మించుకోవడం ద్వారా నష్టాన్ని భర్తీచేసుకోవడంకంటే ఎక్కువే చేసుకుందాం!’ (యోబు 4:19 పోల్చండి.) యెహోవా తమను మరింతగా శిక్షించాల్సిన పరిస్థితిని వారు చేతులారా కల్పించుకున్నారు.—యెషయా 48:22 పోల్చండి.
6. యూదాకు వ్యతిరేకంగా సిరియా-ఇశ్రాయేలు పన్నిన పన్నాగాన్ని యెహోవా ఎలా నిష్ఫలం చేశాడు?
6 యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “యెహోవా వానిమీదికి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించు[ను].” (యెషయా 9:11 ఎ) ఇశ్రాయేలు రాజైన పెకహు, సిరియా రాజైన రెజీను మిత్రులు. వారు రెండు గోత్రాల యూదా రాజ్యాన్ని జయించి, యెరూషలేములోని యెహోవా సింహాసనం మీద తోలుబొమ్మలాంటి ఒక రాజును అంటే “టాబెయేలనువాని కుమారుని” కూర్చోబెట్టాలని చూస్తున్నారు. (యెషయా 7:6) కానీ వారి పన్నాగం పారలేదు. రెజీనుకు శక్తివంతమైన శత్రువులున్నారు, యెహోవా ఈ శత్రువులను ‘వానికి’ వ్యతిరేకంగా అంటే ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ‘హెచ్చిస్తాడు.’ ‘హెచ్చిస్తాడు’ అనే పదం, రాజ్యకూటమిని వాటి లక్ష్యాలనూ అంతమొందించే యుద్ధాన్ని చేసేలా వారిని అనుమతించడమనే భావాన్ని కలిగివుంది.
7, 8. అష్షూరు సిరియాను జయించడం ఇశ్రాయేలుకు ఏ ఫలితాన్ని తెచ్చింది?
7 అష్షూరు సిరియాపై దాడి చేయడంతో ఈ రాజ్యకూటమి విచ్ఛేదన ప్రారంభమౌతుంది. “అష్షూరు రాజు అతనిమాట అంగీకరించి, దమస్కు [సిరియా రాజధాని] పట్టణముమీదికి వచ్చి దాని పట్టుకొని, రెజీనును హతముచేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసికొని పోయెను.” (2 రాజులు 16:9) పెకహు తన శక్తిమంతమైన మిత్రరాజ్యాన్ని కోల్పోయి, యూదాకు వ్యతిరేకంగా తాను పన్నిన దుష్టపన్నాగాలు భంగమైపోయాయని గ్రహిస్తాడు. వాస్తవానికి, రెజీను మరణించిన కొంతకాలానికి, హోషేయ పెకహును హత్యచేస్తాడు, ఆ తర్వాత ఈ హోషేయనే షోమ్రోను సింహాసనాన్ని చేజిక్కించుకుంటాడు.—2 రాజులు 15:23-25, 30.
8 ఇశ్రాయేలు మాజీ మిత్ర రాజ్యమైన సిరియా, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆధిపత్యంగల అష్షూరుకు సామంత రాజ్యంగా ఉంది. ఈ క్రొత్త రాజకీయ పొత్తును యెహోవా ఎలా ఉపయోగించుకుంటాడనే దాని గురించి యెషయా ఇలా ప్రవచిస్తున్నాడు: “యెహోవా వాని [ఇశ్రాయేలు] మీదికి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు. తూర్పున సిరియాయు పడమట ఫిలిష్తీయులును నోరు తెరచి ఇశ్రాయేలును మ్రింగివేయవలెనని యున్నారు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.” (యెషయా 9:11, 12) అవును, సిరియా ఇప్పుడు ఇశ్రాయేలుకు శత్రువు, కాబట్టి ఇశ్రాయేలు ఇప్పుడు అష్షూరు నుండి మరియు సిరియా నుండి వచ్చే దాడిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. దురాక్రమణ విజయవంతమవుతుంది. సింహాసనాన్ని అక్రమంగా చేజిక్కించుకున్న హోషేయను అష్షూరు తన సేవకునిగా చేసుకుని పెద్ద మొత్తంలో కప్పం చెల్లించమంటుంది. (దశాబ్దాల క్రితం అష్షూరు ఇశ్రాయేలు రాజైన మెనహేము నుండి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంది.) “అన్యులు అతని [ఎఫ్రాయిము] బలమును మ్రింగివేసి”రని చెబుతున్న హోషేయ ప్రవక్త మాటలు ఎంత నిజమో కదా!—హోషేయ 7:9; 2 రాజులు 15:19, 20; 17:1-3.
9. యెషయా 9:12 లో ప్రస్తావించబడిన “ఇశ్రాయేలు”లో బహుశా ఎవరు చేరి ఉండవచ్చు, ఎందుకు?
9 ఫిలిష్తీయులు “పడమట” నుండి దాడి చేస్తారని కూడా యెషయా చెబుతున్నాడు. యెషయా 9:12 నందు ప్రస్తావించబడిన “ఇశ్రాయేలు”లో ఈ సందర్భంలో యూదా కూడా చేరి ఉండవచ్చు, ఎందుకంటే పెకహు సమకాలీనుడైన ఆహాజు పరిపాలనాకాలంలో ఫిలిష్తీయులు అనేక యూదా నగరాలను, ఆశ్రయస్థానాలను స్వాధీనం చేసుకుంటూ, ఆక్రమిస్తూ యూదాను ముట్టడించారు. ఉత్తరాన ఉన్న ఎఫ్రాయిములానే, యూదాకు కూడా యెహోవా నుండి వచ్చిన ఈ శిక్ష తగినదే, ఎందుకంటే అది కూడా మతభ్రష్టత్వంతో నిండిపోయింది.—2 దినవృత్తాంతములు 28:1-4, 18, 19.
‘తలనుండి తోక వరకు’—తిరుగుబాటుదారుల రాజ్యం
10, 11. ఇశ్రాయేలీయులు పదే పదే తిరుగుబాటు చేస్తున్నందుకు యెహోవా వారిపైకి ఏ శిక్షను తెస్తాడు?
10 ఉత్తర రాజ్యం ఎన్నో బాధలు అనుభవించినప్పటికీ, యెహోవా ప్రవక్తలు శక్తిమంతమైన ప్రకటనలు చేసినప్పటికీ, అది యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం మానుకోలేదు. “అయినను జనులు తమ్ము కొట్టినవానితట్టు తిరుగుట లేదు. సైన్యములకధిపతియగు యెహోవాను వెదకరు.” (యెషయా 9:13) తత్ఫలితంగా ప్రవక్త ఇలా చెబుతున్నాడు: “కావున యెహోవా ఇశ్రాయేలులోనుండి తలను తోకను, తాటికమ్మను రెల్లును, ఒక్క దినమున కొట్టివేయును. పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారిచేత మ్రింగివేయబడుదురు.”—యెషయా 9:14-16.
11 “తల,” “తాటికమ్మ” ‘పెద్దలను ఘనులను’ అంటే ఆ రాజ్యంలోని నాయకులను సూచిస్తాయి. “తోక” “రెల్లు” తమ నాయకులకు ప్రీతికరమైన మాటలను పలికే అబద్ధ ప్రవక్తలను సూచిస్తాయి. ఒక బైబిలు పండితుడు ఇలా వ్రాస్తున్నాడు: “అబద్ధ ప్రవక్తలు తోక అని పిలువబడ్డారు, ఎందుకంటే వారు నైతికంగా అందరికన్నా అధమమైనవారు, వేషధారులైన సేవకులు, దుష్ట పరిపాలకులకు మద్దతునిచ్చేవారు.” ఈ అబద్ధ ప్రవక్తల గురించి, ప్రొఫెసర్ ఎడ్వర్డ్ జె. యంగ్ ఇలా చెబుతున్నాడు: “వాళ్లెంతమాత్రం నాయకులు కాదు, తమ నాయకులు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నడుస్తూ, కుక్కతోక ఆడించినట్లు వారు ముఖస్తుతి చేస్తూ నక్కవినయాలు చూపించేవారు.”—2 తిమోతి 4:3 పోల్చండి.
‘తల్లిదండ్రులు లేనివారు, విధవరాండ్రు’ కూడా తిరుగుబాటుదారులే
12. ఇశ్రాయేలు సమాజంలోకి భ్రష్టత్వం ఎంత లోతుగా చొచ్చుకుపోయింది?
12 యెహోవా విధవరాండ్ర, అనాధల సహాయకుడు. (నిర్గమకాండము 22:22, 23) అయినా, యెషయా ఇప్పుడేమి చెబుతున్నాడో వినండి: “వారందరును భక్తిహీనులును దుర్మార్గులునై యున్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి యౌవనులను చూచి సంతోషింపడు వారిలో తలిదండ్రులు లేనివారియందైనను వారి విధవరాండ్రయందైనను జాలిపడడు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.” (యెషయా 9:17) విధవరాండ్రు తల్లిదండ్రులులేని పిల్లలతో సహా సమాజంలోని అన్ని స్థాయిల వారిని మతభ్రష్టత్వం కలుషితం చేసింది! ప్రజలు తమ మార్గాలను మార్చుకుంటారని ఆశిస్తూ యెహోవా సహనంతో తన ప్రవక్తలను పంపుతూనే ఉన్నాడు. ఉదాహరణకు, “ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము” అని హోషేయ విజ్ఞప్తి చేస్తున్నాడు. (హోషేయ 14:1) విధవరాండ్రకు, తల్లిదండ్రులులేనివారికి కూడా శిక్ష అమలు చేయవలసి రావడంతో వారి సహాయకుడికి ఎంత బాధ కలుగుతుందో కదా!
13. యెషయా కాలంలోని పరిస్థితి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
13 యెషయావలె మనం, దుష్టులపైకి రానున్న యెహోవా తీర్పు దినానికి ముందున్న అపాయకరమైన కాలములలో జీవిస్తున్నాం. (2 తిమోతి 3:1-5) కాబట్టి నిజక్రైస్తవులు జీవితంలో తమ పరిస్థితి ఏదైనప్పటికీ దేవుని అనుగ్రహాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఆధ్యాత్మికంగా, నైతికంగా, మానసికంగా పరిశుభ్రంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా. ప్రతి ఒక్కరు యెహోవాతో తమకున్న సంబంధాన్ని అత్యాసక్తితో కాపాడుకుందురు గాక. “మహా బబులోను” నుండి తప్పించుకున్న వారెవరూ తిరిగి “దాని పాపములలో పాలివారు” కాకుందురు గాక.—ప్రకటన 18:2, 4.
అబద్ధ ఆరాధన బలాత్కారాన్ని అధికంచేస్తుంది
14, 15. (ఎ) దయ్యాల ఆరాధన ఫలితమేమిటి? (బి) ఇశ్రాయేలు అధికమయ్యే ఏ బాధను అనుభవిస్తుందని యెషయా ప్రవచిస్తున్నాడు?
14 అబద్ధ ఆరాధన ఒక విధంగా దయ్యాల ఆరాధనే. (1 కొరింథీయులు 10:20) జలప్రళయానికి ముందు స్పష్టమైనట్లుగా, దయ్యాల ప్రభావం బలాత్కారానికి దారితీస్తుంది. (ఆదికాండము 6:11, 12) కాబట్టి ఇశ్రాయేలు మతభ్రష్టురాలై దయ్యాలను ఆరాధించడం ప్రారంభించినప్పుడు దేశం బలాత్కారంతోనూ, దుష్టత్వంతోనూ నిండిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.—ద్వితీయోపదేశకాండము 32:17; కీర్తన 106:35-38.
15 ఇశ్రాయేలులో దుష్టత్వం, బలాత్కారం విస్తరించడాన్ని యెషయా సుస్పష్టంగా ఇలా వర్ణిస్తున్నాడు: “భక్తిహీనత అగ్నివలె మండుచున్నది; అది గచ్చపొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును, అవి దట్టమైన పొగవలె చుట్టుకొనుచు పైకి ఎగయును. సైన్యముల కధిపతియగు యెహోవా ఉగ్రతవలన దేశము కాలిపోయెను, జనులును అగ్నికి కట్టెలవలె నున్నారు. వారిలో ఒకనినొకడు కరుణింపడు. కుడిప్రక్కన ఉన్నదాని పట్టుకొందురు గాని ఇంకను ఆకలిగొని యుందురు; ఎడమప్రక్కన ఉన్నదాని భక్షించుదురు గాని ఇంకను తృప్తిపొందక యుందురు. వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును, మనష్షే ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనష్షేను భక్షించును. వీరిద్దరు ఏకీభవించి యూదామీద పడుదురు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.”—యెషయా 9:18-21.
16. యెషయా 9:18-21 వచనాల్లోని మాటలు ఎలా నెరవేరాయి?
16 ఒక ముండ్లపొద నుండి మరో ముండ్లపొదకు ప్రాకే మంటల్లా బలాత్కారం అదుపుతప్పి త్వరలోనే “అడవి పొదల”ను చేరి, భగభగమండుతున్న బలాత్కారపు కార్చిచ్చు రగిలిస్తుంది. బైబిలు వ్యాఖ్యాతలు కెయిల్ మరియు డెలిట్ష్ బలాత్కారపు స్థాయిని ఇలా వర్ణిస్తున్నారు, “అరాచకత్వపు పౌరయుద్ధం జరుగుతున్నప్పుడు అత్యంత అమానుషమైన స్వనాశనమది. ఏమాత్రం మృదువైన భావాలులేని వారు, సంతృప్తి అనేది లేకుండా వారు ఒకరినొకరు దిగమ్రింగారు.” ఇక్కడ ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలు మాత్రమే ప్రస్తావించబడడానికి కారణం, వారు ఉత్తర రాజ్యపు ప్రధాన ప్రతినిధులు కావడం కావచ్చు, యోసేపు ఇద్దరు కుమారుల సంతానంగా వారు పది గోత్రాల్లో పరస్పరం చాలా సన్నిహిత సంబంధంగలవారు కావడం కావచ్చు. అయితే, విషయం ఇదైనప్పటికీ, వారు దక్షిణాన యూదాతో యుద్ధం చేస్తున్నప్పుడు మాత్రమే తమ స్వంత సహోదరులను చంపే బలాత్కారాన్ని ఆపుతారు.—2 దినవృత్తాంతములు 28:1-8.
భ్రష్ట న్యాయాధిపతులు తమ న్యాయాధిపతిని ఎదుర్కొంటారు
17, 18. ఇశ్రాయేలు చట్టపరమైన, కార్యనిర్వహణపరమైన విధానంలో ఎలాంటి అవినీతి ఉంది?
17 యెహోవా తర్వాత తన న్యాయవిచారణ దృష్టిని ఇశ్రాయేలు భ్రష్ట న్యాయాధిపతుల వైపు, ఇతర అధికారుల వైపు మరలుస్తున్నాడు. వీరు న్యాయం కోసం తమ వద్దకు వచ్చే పేదలను, బాధితులను దోచుకోవడం ద్వారా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. యెషయా ఇలా చెబుతున్నాడు: “విధవరాండ్రు తమకు దోపుడుసొమ్ముగా ఉండవలెననియు తలిదండ్రులులేనివారిని కొల్లపెట్టుకొనవలెననియు కోరి న్యాయవిమర్శ జరిగింపకుండ దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించువారికిని బాధకరమైన శాసనములను వ్రాయించువారికిని శ్రమ.”—యెషయా 10:1, 2.
18 యెహోవా ధర్మశాస్త్రం అన్ని విధాలైన అన్యాయాలను నిషేధిస్తుంది: “అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు.” (లేవీయకాండము 19:15) ఆ చట్టాన్ని అలక్ష్యం చేస్తూ, ఈ అధికారులు నిజంగా చాలా క్రూరమైన దోపిడీగా పరిగణించబడగల దాన్ని—విధవరాండ్రు, తల్లిదండ్రులులేనివారు కలిగివున్న అతితక్కువ సంపదలను కూడా తీసుకోవడాన్ని—చట్టబద్ధం చేయడానికి “అన్యాయపు విధులను” స్వయంగా తయారు చేస్తారు. అయితే ఇశ్రాయేలు అబద్ధ దేవుళ్లు ఈ అన్యాయాన్ని చూడలేరు కానీ యెహోవా చూడగలడు. యెషయా ద్వారా యెహోవా ఇప్పుడు తన అవధానాన్ని ఈ దుష్ట న్యాయాధిపతులవైపుకు మళ్లిస్తున్నాడు.
19, 20. భ్రష్టులైన ఇశ్రాయేలు న్యాయాధిపతుల పరిస్థితి ఎలా మారుతుంది, వారి ‘ఐశ్వర్యానికి’ ఏమౌతుంది?
19 “దర్శనదినమున దూరమునుండి వచ్చు ప్రళయదినమున మీరేమి చేయుదురు? సహాయమునొందుటకు ఎవరియొద్దకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు? వారు చెరపట్టబడినవారి క్రింద దాగుకొనుచున్నారు, హతులైనవారి క్రింద కూలుచున్నారు.” (యెషయా 10:3, 4 ఎ) విధవరాండ్రు, తల్లిదండ్రులులేనివారు వెళ్లి న్యాయాన్ని అర్థించడానికి నిజాయితీగల న్యాయాధిపతులెవరూ లేరు. ఇప్పుడు యెహోవాయే భ్రష్టులైన ఆ ఇశ్రాయేలు న్యాయాధిపతులను జవాబు అడుగుతున్నాడు గనుక వాళ్లిప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? కాబట్టి, యెహోవా వారినిలా అడగడం ఎంత సముచితమో కదా! అవును, “జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము” అని వాళ్లు తెలుసుకోబోతున్నారు.—హెబ్రీయులు 10:31.
20 ఈ దుష్ట న్యాయాధిపతుల “ఐశ్వర్యము,” అంటే వారికున్న ధనసంపదలతోనూ, స్థానంతోనూ వచ్చే లౌకికపరమైన ప్రతిష్ఠ, కీర్తి, అధికారం శాశ్వతం కాదు. కొంతమంది, యుద్ధంలో చెరపట్టబడినవారై, తమలాగే చెరపట్టబడిన ఇతరుల చాటున ‘దాగుకొంటారు’ లేక అణగి ఉంటారు, మరితరులు హతమార్చబడతారు, వారి శవాలు యుద్ధంలో మరణించినవారి కళేబరాలతో కప్పివేయబడతాయి. అన్యాయంగా సంపాదించుకున్న ధనసంపదలు కూడా వారి “ఐశ్వర్యము”లో ఒక భాగమే, వాటిని శత్రువులు దోచుకుపోతారు.
21. ఇశ్రాయేలు అనుభవించిన శిక్షల దృష్ట్యా, వారి మీద యెహోవాకున్న ఆగ్రహం చల్లారిందా?
21 యెహోవా ఈ చివరి చరణాన్ని ఒక కఠినమైన హెచ్చరికతో ముగిస్తున్నాడు: “ఈలాగు జరిగినను [దేశం ఇంతవరకు ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ] యెహోవా కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.” (యెషయా 10:4 బి) అవును, యెహోవా ఇశ్రాయేలుకు చెప్పవలసింది ఇంకా ఉంది. తిరుగుబాటుచేసే ఉత్తర రాజ్యంపై నాశనకరమైన తుది దెబ్బవేసే వరకూ చాపబడివున్న యెహోవా బాహువు వెనక్కు తీసుకోబడదు.
అబద్ధానికి, స్వీయాసక్తికి ఎన్నడూ బలి కాకండి
22. ఇశ్రాయేలుకు సంభవించినదాని నుండి మనం ఏ గుణపాఠం నేర్చుకోవచ్చు?
22 యెషయా ద్వారా యెహోవా ఇచ్చిన వర్తమానము ఇశ్రాయేలుపై భారంగా పడి, ‘నిష్ఫలముగా ఆయన యొద్దకు మరలలేదు.’ (యెషయా 55:10, 11) ఇశ్రాయేలు ఉత్తర రాజ్యపు దుఃఖకరమైన అంతం చరిత్రలో లిఖితమై ఉంది, దాని నివాసులు సహించవలసి వచ్చిన బాధలను మనం కేవలం ఊహించగలమంతే. ప్రస్తుత విధానంపై ప్రాముఖ్యంగా మతభ్రష్ట క్రైస్తవ మతసామ్రాజ్యంపై దేవుని వర్తమానం అంతే ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి క్రైస్తవులు అబద్ధమైన, దేవుని వ్యతిరేక ప్రచారానికి అవధానం ఇవ్వకపోవడం ఎంత ప్రాముఖ్యం! ప్రాచీన ఇశ్రాయేలులోని ప్రజల్లా మనం కూడా యుక్తితో కూడిన సాతాను తంత్రాలకు బలైపోకుండా ఉండేందుకు, దేవుని వాక్యం మూలంగా, అవి మనకు చాలా కాలంగా బయల్పర్చబడుతున్నాయి. (2 కొరింథీయులు 2:11) మనమందరం యెహోవాను “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించడాన్ని ఎన్నడూ మానకుండా ఉందాము. (యోహాను 4:24) అలాగైతే, తిరుగుబాటు చేసిన ఎఫ్రాయిమును కొట్టినట్టుగా చాపిన ఆయన బాహువు ఆయన ఆరాధకులను కొట్టకుండా ఉంటుంది; ఆయన బాహువులు ప్రేమగా వారిని హత్తుకుంటాయి, పరదైసు భూమిమీద నిత్యజీవానికి నడిపే మార్గంపై నడిచేందుకు ఆయన వారికి సహాయం చేస్తాడు.—యాకోబు 4:8.
[అధస్సూచీలు]
^ యెషయా 9:8–10:4 వరకున్న వచనాలను నాలుగు చరణాలుగా (లయబద్ధంగానున్న చరణాలుగా) విభజించవచ్చు, ప్రతి చరణమూ, “ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది” అనే అశుభకరమైన పల్లవితో ముగుస్తుంది. (యెషయా 9:12, 17, 21; 10:4) ఈ సాహితీ శైలి యెషయా 9:8–10:4 వరకున్న వచనాలను ఒకే సంకీర్ణ “వర్తమానము”గా జతచేస్తుంది. (యెషయా 9:8) యెహోవా “బాహువు ఇంకను చాపబడియున్నది,” తిరిగి సమాధానపడదామని ప్రతిపాదించేందుకు కాదనీ తీర్పు తీర్చడానికనీ కూడా గమనించండి.—యెషయా 9:13.
^ యెహోవా ఇశ్రాయేలు ఉత్తర రాజ్యానికి పంపిన ప్రవక్తల్లో యెహూ (రాజు కాదు), ఏలీయా, మీకాయా, ఎలీషా, యోనా, ఓదేదు, హోషేయ, ఆమోసు, మీకా ఉన్నారు.
[అధ్యయన ప్రశ్నలు]
[139 వ పేజీలోని చిత్రం]
ఇశ్రాయేలులో దుష్టత్వం, బలాత్కారం కార్చిచ్చులా వ్యాపించాయి
[141 వ పేజీలోని చిత్రం]
ఇతరులను దోచుకునేవారిని యెహోవా జవాబు అడుగుతాడు