కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నడిపింపుకోసం, కాపుదలకోసం యెహోవాపై నమ్మకం ఉంచండి

నడిపింపుకోసం, కాపుదలకోసం యెహోవాపై నమ్మకం ఉంచండి

పదహారవ అధ్యాయం

నడిపింపుకోసం, కాపుదలకోసం యెహోవాపై నమ్మకం ఉంచండి

యెషయా 20:​1-6

1, 2. దేవుని ప్రజలు సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో ఏ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు, కాపుదల కోసం వారిలో అనేకులు ఎవరివైపు తిరగడానికి ఇష్టపడతారు?

 ఈ పుస్తకంలోని పూర్వపు అధ్యాయాల్లో చూసినట్లుగా, దేవుని ప్రజలు సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో భీతిగొలిపే ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. రక్తదాహంగల అష్షూరీయులు ఒక రాజ్యం తర్వాత మరో రాజ్యాన్ని నాశనం చేస్తున్నారు, వారు యూదా దక్షిణ రాజ్యంపై దాడి చేయడానికి ఇక ఎంతో సమయం లేదు. ఆ దేశనివాసులు కాపుదల కోసం ఎవరివైపు తిరుగుతారు? వారు యెహోవాతో నిబంధనా సంబంధాన్ని కలిగివున్నారు గనుక వారు సహాయం కోసం ఆయనపైనే ఆధారపడాలి. (నిర్గమకాండము 19:​5, 6) దావీదు రాజు అదే చేశాడు. “యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు” అని ఆయన అంగీకరించాడు. (2 సమూయేలు 22:2) అయితే, సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో అనేకులు తమ ఆశ్రయదుర్గముగా యెహోవాపై నమ్మకం ఉంచరని స్పష్టమవుతుంది. అష్షూరు చేయబోయే దాడినుండి ఐగుప్తు ఇతియోపియాలు తమకు రక్షణ కలుగజేస్తాయని ఆశిస్తూ వారు ఆ రెండు రాజ్యాలవైపు చూడడానికే ఎక్కువ ఇష్టపడతారు. వారు పొరపాటు చేశారు.

2 ఐగుప్తులోగానీ ఇతియోపియాలోగానీ ఆశ్రయం కోసంచూడడం నాశనకరం కాగలదని యెహోవా తన ప్రవక్తయైన యెషయా ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రవక్త ప్రేరేపిత పలుకులు ఆయన సమకాలీనులకు ప్రయోజనకరమైన పాఠాన్ని బోధిస్తూ, యెహోవాపై నమ్మకం ఉంచడం యొక్క ప్రాముఖ్యతను గురించి మనకు విలువైన పాఠాన్ని కలిగివున్నాయి.

రక్తపాత దేశం

3. అష్షూరు, సైనిక శక్తికి ఇచ్చిన ప్రాధాన్యతను వివరించండి.

3 అష్షూరీయులు తమ సైనిక బలానికి పేరుగాంచారు. ప్రాచీన నగరాలు అనే పుస్తకం ఇలా పేర్కొంటుంది: “వారు బలాన్ని పూజించేవారు, వారు సింహాలు ఎద్దుల భారీ రాతి విగ్రహాలకు మాత్రమే ప్రార్థించేవారు, వాటి బలమైన కాళ్ళు, డేగ రెక్కలు, మానవ తలలు బలానికి, ధైర్యానికి, విజయానికి ప్రతీకలుగా ఉండేవి. యుద్ధం చేయడమే ఆ దేశం పని, వారి మతగురువులు నిరంతరం యుద్ధాన్ని ప్రేరేపించేవారు.” బైబిలు ప్రవక్త నహూము సహేతుకంగానే, అష్షూరు రాజధాని నీనెవెను ‘నరహత్య చేసిన పట్టణం’ అని వర్ణించాడు.​—⁠నహూము 3:1.

4. అష్షూరీయులు ఇతర రాజ్యాల హృదయాల్లో ఎలా భీతి పుట్టించారు?

4 అష్షూరీయుల యుద్ధ వ్యూహాలు విశేషంగా క్రూరమైనవి. అష్షూరు యోధులు తమ బంధీల ముక్కులగుండా లేక వారి పెదవులగుండా కొక్కేలు వేసి, వాటితో వారిని లాక్కువెళ్లేవారని ఆ కాలంనాటి ఉబ్బెత్తు శిల్పాలు చూపిస్తున్నాయి. కొంతమంది బంధీలను ఈటెలతో అంధులను చేసేవారు. అష్షూరీయుల సైన్యం దాని బంధీల అవయవాలను ఖండించి వేరుచేసి నగరం వెలుపల రెండు గుట్టలుగా అంటే తలలు ఒక గుట్టగా, కాళ్లు చేతులు ఒక గుట్టగా వేసినప్పటి ఒక విజయం గురించి ఒక పైవ్రాత తెలియజేస్తుంది. స్వాధీనం చేసుకోబడిన రాజ్యాల పిల్లలు కాల్చివేయబడేవారు. అలాంటి క్రూరత్వం వల్ల కలిగిన భయం, అష్షూరు సైన్యాల మార్గాన్ని అడ్డగించేవారు తిరుగుబాటు చేయడాన్ని నిరుత్సాహపరుస్తూ అష్షూరీయులకు సైనికపరంగా ప్రయోజనాన్ని చేకూర్చి ఉండవచ్చు.

అష్డోదుతో యుద్ధం

5. యెషయా కాలంలో శక్తివంతమైన అష్షూరు పరిపాలకుడు ఎవరు, ఆయన గురించిన బైబిలు వృత్తాంతం ఎలా సత్యమని నిరూపించబడింది?

5 యెషయా కాలంలో, సర్గోను రాజు పరిపాలన క్రింద అష్షూరు సామ్రాజ్యం అధికారం విషయంలో మునుపెన్నడూ చేరుకోని స్థాయిని చేరుకుంది. * అనేక సంవత్సరాలపాటు, విమర్శకులు ఈ పాలకుని ఉనికిని సందేహించారు, ఎందుకంటే లౌకిక గ్రంథమూలాల్లో అతని గురించిన ప్రస్తావన ఉన్నట్లు వాళ్లకు తెలియలేదు. అయితే, కొంతకాలానికి, పురావస్తుశాస్త్రవేత్తలు సర్గోను రాజభవన శిధిలాలను వెలికి తీశారు, దానితో బైబిలు వృత్తాంతం సత్యమని నిరూపించబడింది.

6, 7. (ఎ) బహుశా ఏ కారణాలను బట్టి సర్గోను అష్డోదుపై దాడి చేయమని ఆజ్ఞాపించి ఉండవచ్చు? (బి) అష్డోదు పడిపోవడం ఫిలిష్తియ పొరుగు రాజ్యాలను ఎలా ప్రభావితం చేస్తుంది?

6 సర్గోను సైనిక దండయాత్రలను యెషయా క్లుప్తంగా ఇలా వివరిస్తున్నాడు: “అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చి . . . అష్డోదీయులతో యుద్ధముచేసి వారిని పట్టుకొనెను.” (యెషయా 20:1) * సర్గోను ఫిలిష్తియ నగరమైన అష్డోదుపై దాడిచేయమని ఎందుకు ఆజ్ఞాపించాడు? ఒక కారణం ఏమిటంటే, ఫిలిష్తియ ఐగుప్తుకు మిత్రరాజ్యం, దాగోను ఆలయంవున్న అష్డోదు, ఐగుప్తు నుండి పాలస్తీనాగుండా తీరం వెంబడి వెళ్లే మార్గంపై ఉంది. కాబట్టి ఆ నగరం యుద్ధవ్యూహానికి కీలకమైన ప్రాంతంలో ఉంది. దాన్ని స్వాధీనం చేసుకోవడం ఐగుప్తును జయించడానికి ప్రారంభ చర్యగా దృష్టించవచ్చు. అంతేగాక, అష్డోదు రాజు అజురి అష్షూరుకు వ్యతిరేకంగా కుట్రపన్నాడని అష్షూరీయుల నివేదికలు తెలియజేస్తున్నాయి. కాబట్టి, సర్గోను తిరుగుబాటుదారుడైన రాజును తొలగించి ఆ రాజు తమ్ముడు అహిమితిని సింహాసనం అధిష్ఠింపజేశాడు. అయినప్పటికీ, దానితో సమస్య పరిష్కారం కాదు. మరో తిరుగుబాటు జరుగుతుంది, ఈసారి సర్గోను మరింత శక్తివంతమైన చర్య తీసుకుంటాడు. ఆయన అష్డోదుపై దాడి చేయమని ఆజ్ఞాపిస్తాడు, అది ముట్టడించబడి, జయించబడుతుంది. బహుశా యెషయా 20:1 ఈ సంఘటనను సూచిస్తుండవచ్చు.

7 అష్డోదు పడిపోవడం దాని పొరుగు రాజ్యాలకు, ప్రాముఖ్యంగా యూదాకు ప్రమాదాన్ని తెస్తుంది. తన ప్రజలు ఐగుప్తు లేక దక్షిణానవున్న ఇతియోపియా వంటి ‘మాంససంబంధమైన బాహువు’ వైపే చూడడానికి ఇష్టపడతారని యెహోవాకు తెలుసు. కాబట్టి, విపత్కరమైన హెచ్చరికను చర్య ద్వారా చేసిచూపించమని ఆయన యెషయాకు ఆజ్ఞాపిస్తాడు.​—⁠2 దినవృత్తాంతములు 32:7, 8.

‘దిగంబరియై, జోళ్లులేకుండా’

8. యెషయా ఏ ప్రేరేపిత ప్రవచనార్థక చర్యను చేసి చూపించాడు?

8 యెహోవా యెషయాకు ఇలా చెబుతున్నాడు: “నీవు పోయి నీ నడుముమీది గోనెపట్ట విప్పి నీ పాదములనుండి జోళ్లు తీసివేయుము.” యెషయా యెహోవా ఇచ్చిన ఆజ్ఞానుసారంగా చేస్తాడు. “అతడాలాగు చేసి దిగంబరియై జోళ్లు లేకయే నడచుచుం[డును].” (యెషయా 20:2) గోనెపట్ట ప్రవక్తలు ధరించే సాధారణ వస్త్రం, కొన్నిసార్లు హెచ్చరిక సందేశానికి అనుబంధంగా కూడా ధరించడం జరుగుతుంది. సంక్షోభ సమయాల్లో లేక దుఃఖకరమైన వార్తలు విన్నప్పుడు కూడా దాన్ని ధరించేవారు. (2 రాజులు 19:​2, 3; కీర్తన 35:​13; దానియేలు 9:3) యెషయా నిజంగానే ఏ విధమైన అచ్ఛాదనా లేకుండా దిగంబరిగానే సంచరించాడా? అలా అనుకోనవసరంలేదు. “దిగంబరి” అని అనువదించబడిన హీబ్రూ పదం, ఒకరు పాక్షికంగా లేక అంతంత మాత్రంగా వస్త్రాలు ధరించడాన్ని కూడా సూచించగలదు. (1 సమూయేలు 19:​24) కాబట్టి యెషయా కేవలం తన పైబట్టను మాత్రం తీసివేసి, సాధారణంగా అందరూ ధరించే మోకాళ్ళవరకుండే బిగుతైన లోదుస్తులను ధరించి ఉంటాడు. చెరగొనిపోబడిన పురుషులు అష్షూరు శిల్పాల్లో తరచూ అలాగే చూపించబడ్డారు.

9. యెషయా చర్యకు ప్రవచనార్థక భావం ఏమిటి?

9 యెషయా అసాధారణమైన చర్యకుగల భావం సందేహాత్మకంగా విడిచిపెట్టబడలేదు: “యెహోవా​—⁠నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును [“ఇతియోపియాను,” NW] గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములు దిగంబరియై జోడు లేకయే నడచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశమునుండి కొనిపోబడిన కూషీయులను, పిన్నలను పెద్దలను, దిగంబరులనుగాను చెప్పులు లేనివారినిగాను పట్టుకొని పోవును, ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదులమీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును.” (యెషయా 20:​3, 4) అవును, ఐగుప్తీయులు, ఇతియోపియావారు త్వరలోనే చెరగా కొనిపోబడతారు. ఎవ్వరూ విడిచిపెట్టబడరు. చివరికి ‘పిన్నలు, పెద్దలు’ అంటే పిల్లలు, పెద్దవయస్సువారు కూడా తమవద్ద ఉన్నవన్నీ తొలగించబడి చెరగా కొనిపోబడతారు. ఐగుప్తు, ఇతియోపియాలలో నమ్మకం ఉంచడం వ్యర్థమని యెహోవా ఈ నిస్తేజమైన అలంకారిక దృష్టాంతం ద్వారా యూదా నివాసులను హెచ్చరిస్తున్నాడు. ఈ రాజ్యాల పతనం వారి ‘అవమానానికి’ దారితీస్తుంది!

నమ్మకం వమ్మవుతుంది, అతిశయకారణం క్షీణించిపోతుంది

10, 11. (ఎ) ఐగుప్తు ఇతియోపియాలు అష్షూరు ఎదుట శక్తిహీనమైనవని గుర్తించినప్పుడు యూదా ఎలా ప్రతిస్పందిస్తుంది? (బి) యూదా నివాసులు ఐగుప్తు ఇతియోపియాలపై నమ్మకం ఉంచడానికి ఎందుకు ఇష్టపడవచ్చు?

10 తర్వాత, తాము ఆశ్రయమని భావించిన ఐగుప్తు ఇతియోపియాలు అష్షూరీయుల ఎదుట శక్తిహీనమైనవిగా నిరూపించబడ్డాయని గుర్తించినప్పుడు తన ప్రజలకు కలిగే ప్రతిస్పందనను యెహోవా ప్రవచనార్థకంగా వర్ణిస్తున్నాడు. “వారు తాము నమ్ముకొనిన కూషీయులను గూర్చియు, తాము అతిశయకారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులను గూర్చియు విస్మయమొంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్రతీర నివాసులు​—⁠అష్షూరు రాజు చేతిలోనుండి విడిపింపబడవలెనని సహాయముకొరకు మనము పారిపోయి ఆశ్రయించినవారికి ఈలాగు సంభవించినదే, మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు.”​—యెషయా 20:5, 6.

11 ఐగుప్తు ఇతియోపియాల శక్తులతో పోల్చినప్పుడు యూదా కేవలం సముద్రతీరంలోని పొడుగైన సన్నని భూభాగంలా ఉంటుంది. ఈ “సముద్రతీర” ప్రాంతపు నివాసులు కొందరు, ఐగుప్తు అతిశయకారణాన్ని బట్టి, అంటే దాని అమోఘమైన పిరమిడ్లను, దాని సమున్నతమైన ఆలయాలను, చుట్టూ పూలతోటలూ పండ్లతోటలూ కొలనులూ గల విశాలమైన భవనాలను బట్టి మరులుగొల్పబడుతుండవచ్చు. ఐగుప్తు యొక్క వైభవోపేతమైన భవన నిర్మాణశైలి సుస్థిరతకు, మన్నికకు నిదర్శనంగా అనిపించవచ్చు. ఖచ్చితంగా ఈ దేశాన్ని నాశనం చేయడం అసాధ్యం అనిపిస్తుంది! బహుశా యూదులు ఇతియోపియా విలుకాండ్లను, రథాలను, రౌతులను చూసి కూడా ప్రభావితమై ఉంటారు.

12. యూదా ఎవరిపై నమ్మకం ఉంచాలి?

12 యెషయా తన చర్య ద్వారా హెచ్చరించినదాని దృష్ట్యా, యెహోవా ప్రవచనార్థక మాటల దృష్ట్యా, దేవుని ప్రజలమని చెప్పుకుంటూ, ఐగుప్తు ఇతియోపియాలపై నమ్మకం ఉంచడానికి ఇష్టపడేవారెవరైనా గంభీరంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. వారు మానవమాత్రులపై కంటే యెహోవాపై నమ్మకం ఉంచడం ఎంత మంచిదో కదా! (కీర్తన 25:2; 40:4) పరిస్థితులు మారుతుండగా, యూదా అష్షూరు రాజు చేతిలో ఘోరంగా బాధపడుతుంది, ఆ తర్వాత తన ఆలయాన్నీ రాజధాని నగరాన్నీ బబులోను నాశనం చేయడాన్ని చూస్తుంది. అయినప్పటికీ, ఒక పెద్ద వృక్షపు మొద్దువలె “పదియవ భాగము,” “పరిశుద్ధమైన చిగురు” మిగిలి ఉంటుంది. (యెషయా 6:​13) సమయం ఆసన్నమైనప్పుడు, యెహోవాపై నమ్మకం ఉంచడంలో కొనసాగే ఆ చిన్న గుంపుకున్న విశ్వాసాన్ని యెషయా సందేశం గొప్పగా బలపరుస్తుంది!

యెహోవాపై మీ నమ్మకాన్ని ఉంచండి

13. నేడు విశ్వాసులపై, అవిశ్వాసులపై ఎలాంటి ఒత్తిళ్లు ప్రభావం చూపిస్తున్నాయి?

13 ఐగుప్తు ఇతియోపియాలపై నమ్మకం ఉంచడంలోని వ్యర్థత గురించి యెషయా గ్రంథంలో ఉన్న హెచ్చరిక ఏ ప్రాధాన్యతా లేని చరిత్ర మాత్రమే కాదు. అది మన కాలానికి ఆచరణాత్మకమైన విలువను కలిగివుంది. మనం “అపాయకరమైన కాలముల”లో జీవిస్తున్నాము. (2 తిమోతి 3:1) ఆర్థిక విపత్తులు, సర్వత్రా వ్యాపించివున్న పేదరికం, రాజకీయ అస్థిరత, పౌరసంబంధమైన సంక్షోభం, చిన్న లేక పెద్ద యుద్ధాలు వంటివన్నీ దేవుని పరిపాలనను తిరస్కరించేవారిపైనే గాక యెహోవాను ఆరాధించేవారిపై కూడా నాశనకరమైన ప్రభావాలను చూపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి ఎదుట ఉన్న ప్రశ్నేమిటంటే, ‘సహాయం కోసం నేనెవరివైపు చూస్తాను?’

14. మనం కేవలం యెహోవాపై మాత్రమే ఎందుకు నమ్మకం ఉంచాలి?

14 మానవ మేధను, సాంకేతికతను ఉపయోగించి మానవుని సమస్యలను పరిష్కరించడం గురించి మాట్లాడే నేటి ఆర్థిక నిపుణులను, రాజకీయవేత్తలను, శాస్త్రజ్ఞులను బట్టి కొందరు ప్రభావితం కావచ్చు. అయితే, బైబిలు స్పష్టంగా ఇలా చెబుతోంది: “రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.” (కీర్తన 118:9) శాంతిభద్రతల కోసం మానవుడు వేసే పథకాలన్నీ, ప్రవక్తయైన యిర్మీయా సముచితంగా పేర్కొన్న ఈ కారణాన్ని బట్టి నిర్వీర్యమవుతాయి: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.”​—⁠యిర్మీయా 10:23.

15. దుఃఖభరితమైన మానవజాతికి ఏకైక నిరీక్షణ ఎక్కడ ఉంది?

15 కాబట్టి, దేవుని సేవకులు ఈ లోకానికున్నట్లు అనిపించే శక్తిని లేక జ్ఞానాన్ని బట్టి అనుచితంగా ప్రభావితం కాకుండా ఉండడం తప్పనిసరి. (కీర్తన 33:10; 1 కొరింథీయులు 3:​19, 20) దుఃఖభరితమైన మానవజాతికి ఏకైక నిరీక్షణ సృష్టికర్తయైన యెహోవా వద్దనే ఉంది. ఆయనపై నమ్మకం ఉంచేవారు రక్షించబడతారు. ప్రేరేపించబడిన అపొస్తలుడైన యోహాను వ్రాసినట్లుగా, “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”​—⁠1 యోహాను 2:17.

[అధస్సూచీలు]

^ చరిత్రకారులు ఈ రాజును సర్గోను II అని సూచిస్తారు. అష్షూరుకు కాదుగానీ బబులోనుకు చెందిన మునుపటి ఒక రాజు “సర్గోను I”గా పేర్కొనబడ్డాడు.

^ “తర్తాను” అన్నది పేరు కాదుగానీ, అష్షూరు ప్రధాన సైన్యాధికారి హోదాను సూచిస్తుంది, ఈ హోదా బహుశా సామ్రాజ్యంలో రాజు తర్వాతి స్థానం కావచ్చు.

[అధ్యయన ప్రశ్నలు]

[209 వ పేజీలోని చిత్రం]

అష్షూరీయులు తమ బంధీలను కొంతమందిని అంధులుగా చేసేవారు

[213 వ పేజీలోని చిత్రాలు]

కొందరు మానవుడు సాధించినవాటిని బట్టి ప్రభావితం కావచ్చు, కానీ యెహోవాపై నమ్మకం ఉంచడం మంచిది