కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు”

“నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు”

ఇరవై-ఆరవ అధ్యాయం

“నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు”

యెషయా 33:​1-24

1. యెషయా 33:24 లోని మాటలు ఎందుకు ఓదార్పుకరమైనవి?

 “సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నదని” అపొస్తలుడైన పౌలు అన్నాడు. (రోమీయులు 8:​22) వైద్య విజ్ఞానం ఎంతో పురోభివృద్ధి సాధించినప్పటికీ, రోగమరణాలు మానవజాతిని పట్టిపీడిస్తూనే ఉన్నాయి. కాబట్టి, యెషయా ప్రవచనంలోని ఈ భాగాన్ని ముగింపుకు తెచ్చే వాగ్దానం ఎంత అద్భుతమైనదో కదా! “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అన[ని]” సమయం గురించి ఊహించండి! (యెషయా 33:​24) ఈ వాగ్దానం ఎప్పుడు, ఎలా నెరవేరుతుంది?

2, 3. (ఎ) ఇశ్రాయేలు జనాంగం ఏ విధంగా వ్యాధిగ్రస్తమై ఉంది? (బి) దేవుడు క్రమశిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే “దండము”గా అష్షూరు ఎలా పనిచేస్తుంది?

2 దేవుని నిబంధన ప్రజలు ఆధ్యాత్మికంగా వ్యాధిగ్రస్తులై ఉన్న కాలంలో యెషయా వ్రాస్తున్నాడు. (యెషయా 1:​5, 6) వారు మతభ్రష్టత్వంలో, లైంగిక దుర్నీతిలో ఎంత లోతుగా కూరుకుపోయి ఉన్నారంటే, వారికి యెహోవా దేవుని నుండి తీవ్రమైన క్రమశిక్షణ అవసరం. ఆ క్రమశిక్షణను ఇవ్వడానికి అష్షూరు యెహోవా “దండము”గా పనిచేస్తుంది. (యెషయా 7:​17; 10:​5, 15) మొదటిగా, పది-గోత్రాల ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు సా.శ.పూ. 740 లో అష్షూరీయుల చేతుల్లో కూలుతుంది. (2 రాజులు 17:​1-18; 18:​9-11) కొన్ని సంవత్సరాల తర్వాత, అష్షూరు రాజు సన్హెరీబు, దక్షిణ రాజ్యమైన యూదాపై పూర్తిస్థాయి దాడి జరుపుతాడు. (2 రాజులు 18:13; యెషయా 36:1) అష్షూరు మహాసైన్యం దేశమంతటా స్వైరవిహారం చేస్తున్నప్పుడు, యూదా పూర్తిగా నిర్మూలించబడడం అనివార్యమేమో అనిపిస్తుంది.

3 కానీ అష్షూరు దేవుని ప్రజలకు క్రమశిక్షణను ఇవ్వడమనే ఆదేశాన్ని మీరి, ప్రపంచ ఆధిపత్యం కోసం దురాశతో ప్రాకులాడుతోంది. (యెషయా 10:​7-11) తన ప్రజలతో క్రూరంగా వ్యవహరించినందుకు యెహోవా దాన్ని శిక్షించకుండా విడిచిపెడతాడా? జనాంగపు ఆధ్యాత్మిక రుగ్మత స్వస్థపరచబడుతుందా? యెషయా 33 వ అధ్యాయంలో మనం ఈ ప్రశ్నలకు యెహోవా సమాధానాలను చదువుతాము.

దోచుకొనుచున్నదాన్ని దోచుకోవడం

4, 5. (ఎ) అష్షూరు ఏ విపరీత పరిస్థితిని అనుభవిస్తుంది? (బి) యెహోవా ప్రజల పక్షాన యెషయా ఏమని ప్రార్థిస్తాడు?

4 ప్రవచనం ఇలా ప్రారంభమవుతుంది: “దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ! నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడెదవు. నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచించెదరు.” (యెషయా 33:1) యెషయా దోచుకొనే అష్షూరుతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ శక్తిమంతమైన రాజ్యం, ఆధిపత్యపు అత్యుచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు, అజేయమైనదిగా అనిపిస్తుంది. అది యూదా నగరాలను కొల్లగొడుతూ, చివరికి యెహోవా ఆలయంలో నుండి కూడా సంపదలను కైవసం చేసుకొంటూ, ‘దోచుకొనబడకపోయినా దోచుకుంది,’ అయినా దానిపైకి ఏ శిక్ష రానట్లు అనిపిస్తుంది! (2 రాజులు 18:14-16; 2 దినవృత్తాంతములు 28:​21) అయితే ఇప్పుడు, పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి. “నీవు దోచుకొనబడెదవు” అని యెషయా ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. నమ్మకమైన వారికి ఈ ప్రవచనం ఎంత ఓదార్పునిస్తుందో కదా!

5 భయం గొలిపే ఆ సమయంలో, యథార్థవంతులైన యెహోవా ఆరాధకులు సహాయం కోసం ఆయనవైపుకు తిరగవలసిన అవసరం ఉంది. కాబట్టి యెషయా ఇలా ప్రార్థిస్తున్నాడు: “యెహోవా, నీకొరకు కనిపెట్టుచున్నాము. మాయందు కరుణించుము. ఉదయకాలమున వారికి [బలము, మద్దతుల] బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారము గాను ఉండుము. మహాఘోషణ విని జనములు పారిపోవును. నీవు లేచుటతోనే అన్యజనులు చెదరిపోవుదురు.” (యెషయా 33:​2, 3) తగిన విధంగానే, యెహోవా గతంలో అనేకసార్లు చేసినట్లు ఇప్పుడు కూడా తన ప్రజలను కాపాడాలని యెషయా ప్రార్థిస్తున్నాడు. (కీర్తన 44:3; 68:1) యెషయా ఈ ప్రార్థన చేసినవెంటనే, దానికి యెహోవా ఇచ్చే సమాధానాన్ని ఆయన ప్రవచిస్తాడు!

6. అష్షూరుకు ఏమి సంభవిస్తుంది, అది ఎందుకు తగినది?

6 “చీడపురుగులు కొట్టివేయునట్లు మీ [అష్షూరీయుల] సొమ్ము దోచబడును, మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడుదురు.” (యెషయా 33:4) పంటలను నాశనం చేసే కీటకాల దాడులు యూదాకు సుపరిచితమే. అయితే, ఈసారి నాశనం చేయబడేది యూదా శత్రువులు. అష్షూరు అవమానకరమైన అపజయాన్ని పొందుతుంది, యూదా నివాసులు సమకూర్చుకొన గలిగేలా, అష్షూరు సైనికులు పెద్ద మొత్తంలో కొల్లసొమ్ము వదిలేసి పారిపోయేలా బలవంతం చేయబడతారు! క్రూరత్వానికి పేరుపొందిన అష్షూరు దోచుకోబడుతుందంటే, అది దానికి తగినదే.​—⁠యెషయా 37:36.

ఆధునిక-దిన అష్షూరీయుడు

7. (ఎ) ఆధ్యాత్మికంగా వ్యాధిగ్రస్తమైవున్న ఇశ్రాయేలు జనాంగంతో ఈనాడు దేన్ని పోల్చవచ్చు? (బి) క్రైస్తవమత సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి యెహోవా “దండము”గా ఏవి ఉపకరిస్తాయి?

7 యెషయా ప్రవచనం మనకాలానికి ఎలా వర్తిస్తుంది? ఆధ్యాత్మికంగా వ్యాధిగ్రస్తమైవున్న ఇశ్రాయేలు జనాంగాన్ని అవిశ్వసనీయ క్రైస్తవమత సామ్రాజ్యంతో పోల్చవచ్చు. యెహోవా ఇశ్రాయేలును శిక్షించడానికి అష్షూరును “దండము”గా ఉపయోగించుకున్నట్లుగానే, క్రైస్తవమత సామ్రాజ్యాన్ని, అలాగే ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహాబబులోను”లోని మిగతా భాగాన్ని శిక్షించడానికి కూడా ఆయన ఒక “దండము”ను ఉపయోగిస్తాడు. (యెషయా 10:5; ప్రకటన 18:​2-8) ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలే ఆ “దండము,” ఈ సమితి ప్రకటన గ్రంథములో ఏడు తలలు, పది కొమ్ములు గల ఎఱ్ఱని క్రూరమృగముగా చిత్రించబడింది.​—⁠ప్రకటన 17:3, 15-17.

8. (ఎ) నేడు ఎవరిని సన్హెరీబుతో పోల్చవచ్చు? (బి) ఆధునిక-దిన సన్హెరీబు ఎవరిపై దాడి చేయడానికి ధైర్యం చేస్తాడు, దాని ఫలితం ఎలావుంటుంది?

8 ఆధునిక-దిన అష్షూరీయుడు అబద్ధమత క్షేత్రమంతటిలోనూ స్వైరవిహారం చేస్తున్నప్పుడు, అతడిని ఆపడం అశక్యమైనదిగా కనిపిస్తుంది. సన్హెరీబు వంటి దృక్పథంతో, అపవాదియగు సాతాను, శిక్షార్హమైన అబద్ధమత సంస్థలనే కాకుండా నిజ క్రైస్తవులను కూడా కొట్టడానికి ధైర్యం చేస్తాడు. యెహోవా అభిషిక్త అధ్యాత్మిక కుమారుల్లో మిగిలివున్నవారితో పాటు, మహా బబులోను కూడా భాగమైయున్న సాతాను లోకంలో నుండి బయటికి వచ్చిన లక్షలాదిమంది యెహోవా రాజ్యం పక్షాన నిలబడతారు. “యుగ సంబంధమైన దేవత” అయిన సాతాను, నిజ క్రైస్తవులు తనకు భక్తి చూపడానికి నిరాకరించడంతో ఆగ్రహం తెచ్చుకొని, వారిని నిర్మూలించేందుకు పూర్తిస్థాయి దాడి ప్రారంభిస్తాడు. (2 కొరింథీయులు 4:4; యెహెజ్కేలు 38:​10-16) నిస్సందేహంగా ఈ దాడి ఎంత భీతిగొలిపేదిగా ఉన్నప్పటికీ, యెహోవా ప్రజలు భయంతో కృంగిపోనవసరం లేదు. (యెషయా 10:​24, 25) ‘ఆపత్కాలమున రక్షణాధారముగా’ ఉంటానని దేవుడు వారికి హామీ ఇచ్చాడు. ఆయన జోక్యం చేసుకుని సాతానుపైకి, అతని సమూహంపైకి నాశనాన్ని తీసుకువస్తాడు. (యెహెజ్కేలు 38:​18-23) ప్రాచీన కాలాల్లోలాగే, దేవుని ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నవారు, తామే దోచుకోబడతారు! (సామెతలు 13:22 బి పోల్చండి.) యెహోవా నామం పరిశుద్ధపరచబడుతుంది, ప్రాణాలతో తప్పించుకొనేవారు, “బుద్ధిజ్ఞానముల”ను, “యెహోవా భయము”ను వెదకినందుకు ప్రతిఫలాన్ని పొందుతారు.​—⁠యెషయా 33:5, 6 చదవండి.

విశ్వాసంలేనివారికి ఒక హెచ్చరిక

9. (ఎ) యూదా “శూరులు,” “సమాధాన రాయబారులు” ఏమి చేస్తారు? (బి) యూదా సమాధాన సంప్రదింపులకు అష్షూరీయుడు ఎలా ప్రతిస్పందిస్తాడు?

9 యూదాలో విశ్వాసం లేనివారి గతి ఎలా ఉంటుంది? అష్షూరు చేతిలో వారికి రానున్న నాశనాన్ని గురించి యెషయా నిరాశాపూరితమైన వివరాలను ఇస్తున్నాడు. (యెషయా 33:7 చదవండి.) అష్షూరీయుని పురోగమనాన్ని చూసి యూదా సైనిక “శూరులు” భయంతో కేకలు వేస్తారు. యుద్ధ పిపాసగల అష్షూరీయులతో సమాధాన సంప్రదింపుల కోసం పంపబడిన “సమాధాన రాయబారులు” అపహాస్యాన్ని, అవమానాన్ని ఎదుర్కొంటారు. తమ వైఫల్యాన్ని బట్టి వారు తీవ్రంగా రోదిస్తారు. (యిర్మీయా 8:15 పోల్చండి.) పశుప్రాయుడైన అష్షూరీయుడు వారిపై జాలి చూపించడు. (యెషయా 33:8, 9 చదవండి.) యూదా నివాసులతో తాను చేసిన ఒప్పందాలను అతడు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తాడు. (2 రాజులు 18:​14-16) అష్షూరీయుడు మనుష్యుల ప్రాణాల పట్ల ఏమాత్రం పట్టింపు లేకుండా వారిని తిరస్కారంగా, తృణీకారంగా చూస్తూ, యూదా ‘పట్టణములను అవమానపరుస్తాడు.’ పరిస్థితి ఎంత నాశనకరంగా ఉంటుందంటే, స్వయంగా దేశమే దుఃఖిస్తున్నట్లుంటుంది. నాశనాన్ని బట్టి లెబానోను, షారోను, బాషాను, కర్మెలు కూడా అలాగే దుఃఖిస్తాయి.

10. (ఎ) క్రైస్తవమత సామ్రాజ్య “శూరులు” అసమర్థులుగా ఎలా నిరూపించబడతారు? (బి) క్రైస్తవమత సామ్రాజ్యపు దుర్దినాన నిజ క్రైస్తవులను ఎవరు కాపాడతారు?

10 సమీప భవిష్యత్తులో దేశాలు మతంపై దాడి చేయడం ప్రారంభించినప్పుడు, నిస్సందేహంగా అలాంటి పరిస్థితులే తలెత్తుతాయి. హిజ్కియా కాలంలో వలె, ఈ నాశనకరమైన శక్తులను భౌతికంగా ఎదిరించడం వ్యర్థమే. క్రైస్తవమత సామ్రాజ్య “శూరులు” అంటే దాని రాజకీయవేత్తలు, ఆర్థిక పెట్టుబడిదారులు, ఇతర ప్రముఖ వ్యక్తులు ఎవరూ దానికి సహాయాన్ని అందించలేకపోతారు. క్రైస్తవమత సామ్రాజ్య ఆసక్తులను కాపాడడానికి రూపొందించబడిన రాజకీయ, ఆర్థిక ‘నిబంధనలు’ లేక ఒప్పందాలు ఉల్లంఘించబడతాయి. (యెషయా 28:​15-18) సంప్రదింపుల ద్వారా నాశనాన్ని తప్పించుకోవడానికి చేసే వెఱ్ఱి ప్రయత్నాలు విఫలమవుతాయి. క్రైస్తవమత సామ్రాజ్య ఆస్తులు, పెట్టుబడులు జప్తు చేయబడడంతో లేక నాశనం చేయబడడంతో వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోతాయి. ఇప్పటికీ క్రైస్తవమత సామ్రాజ్యం పట్ల స్నేహభావాలు గలవారెవరైనా, ప్రమాదం రానంత దూరంలో నిలబడి, అది గతించిపోతుండగా చూసి దుఃఖించడం కంటే ఎక్కువేమీ చేయలేకపోతారు. (ప్రకటన 18:​9-19) అబద్ధమైనదానితో పాటు నిజ క్రైస్తవత్వం కూడా గతించిపోతుందా? లేదు, ఎందుకంటే యెహోవాయే ఈ హామీ ఇస్తున్నాడు: “యెహోవా ఇట్లనుకొనుచున్నాడు​—⁠ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్పచేసికొనెదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనెదను.” (యెషయా 33:​10) చివరికి యెహోవా, హిజ్కియా వంటి నమ్మకమైన వారి పక్షాన జోక్యంచేసుకొని, అష్షూరీయుని పురోగమనాన్ని ఆపుతాడు.​—⁠కీర్తన 12:5.

11, 12. (ఎ) యెషయా 33:11-14 లోని మాటలు ఎప్పుడు, ఎలా నెరవేరతాయి? (బి) యెహోవా మాటలు నేటి కోసం ఏ హెచ్చరికను ఇస్తున్నాయి?

11 అవిశ్వసనీయులు అలాంటి కాపుదలపై ఆధారపడలేరు. యెహోవా ఇలా చెబుతున్నాడు: “మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు. మీ ఊపిరియే అగ్నియైనట్టు మిమ్మును దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపుబట్టీలవలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్లవలెను అగును. దూరస్థులారా, ఆలకించుడి నేను చేసినదాని చూడుడి సమీపస్థులారా, నా పరాక్రమమును తెలిసికొనుడి. సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు; వణకు భక్తిహీనులను పట్టెను, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్నవాటితో నివసించును?” (యెషయా 33:​11-14) ఈ మాటలు, యూదా మరో క్రొత్త శత్రువు బబులోనును ఎదుర్కొనే సమయానికి వర్తిస్తాయని స్పష్టమవుతోంది. హిజ్కియా మరణం తర్వాత యూదా తిరిగి తన దుష్ట మార్గాల వైపుకు మళ్ళుతుంది. తర్వాతి కొద్ది దశాబ్దాల్లోనే, మొత్తం జనాంగమంతా దేవుని ఉగ్రతాగ్నికి గురయ్యేంతగా యూదాలో పరిస్థితులు దిగజారిపోతాయి.​—⁠ద్వితీయోపదేశకాండము 32:22.

12 దేవుని తీర్పును తప్పించుకోవడానికి అవిధేయులు పన్నే దుష్ట పన్నాగాలు, పథకాలు కొయ్యకాలు కంటే ఎక్కువ ప్రయోజనకరమైనవి కావని నిరూపించబడుతుంది. నిజానికి, ఆ జనాంగం చూపించే గర్వం, తిరుగుబాటు దృక్పథం, వాస్తవానికి దాని నాశనానికి నడిపే సంఘటనలను రేకెత్తిస్తాయి. (యిర్మీయా 52:​3-11) దుష్టులు “కాలుచున్న సున్నపుబట్టీలవలె” అవుతారు, పూర్తిగా నాశనం చేయబడతారు! తిరుగుబాటుదారులైన యూదా నివాసులు రానున్న ఈ నాశనం గురించి ఆలోచిస్తూ, మహా భీతితో వణికిపోతారు. అవిశ్వసనీయ యూదాకు యెహోవా చెప్పే మాటలు, నేటి క్రైస్తవమత సామ్రాజ్య సభ్యుల స్థితిని ఉదహరిస్తున్నాయి. వారు దేవుని హెచ్చరికను లక్ష్యపెట్టకపోతే వారి కోసం విషాదకరమైన భవిష్యత్తు వేచివుంటుంది.

“నీతిని అనుసరించి నడచుచు” ఉండడం

13. “నీతిని అనుసరించి నడచుచు” ఉండేవారికి ఏ వాగ్దానం చేయబడింది, యిర్మీయా విషయంలో అదెలా నెరవేరింది?

13 వ్యత్యాసాన్ని చూపిస్తూ, యెహోవా తర్వాత ఇలా చెబుతున్నాడు: “నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధనవలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని హత్య యను మాట వినకుండ చెవులు మూసికొని చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు ఉన్నతస్థలమున నివసించును. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును. తప్పక అతనికి ఆహారము దొరకును; అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును.” (యెషయా 33:​15, 16) అపొస్తలుడైన పేతురు ఆ తర్వాత వ్యక్తపరుస్తున్నట్లుగా, ‘భక్తులను శోధనలోనుండి తప్పించుటకు, దుర్ణీతిపరులను తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకు, యెహోవా సమర్థుడు.’ (2 పేతురు 2:9) యిర్మీయా అలా తప్పించబడ్డాడు. బబులోను ముట్టడి సమయంలో, ప్రజలు “తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజిం[చ]” వలసి వచ్చింది. (యెహెజ్కేలు 4:​16) కొందరు స్త్రీలు తమ స్వంత పిల్లల మాంసమును కూడా తిన్నారు. (విలాపవాక్యములు 2:​20) అయినప్పటికీ, యిర్మీయా క్షేమంగా ఉండేలా యెహోవా చూశాడు.

14. క్రైస్తవులు నేడు “నీతిని అనుసరించి నడుచుచు” ఉండడంలో ఎలా కొనసాగగలరు?

14 అలాగే నేడు క్రైస్తవులు, అనుదినము యెహోవా ప్రమాణాలను అనుసరిస్తూ, ‘నీతిని అనుసరించి నడుచుకోవాలి.’ (కీర్తన 15:​1-5) వారు ‘యథార్థముగా మాటలాడుతూ’ అబద్ధాన్ని, అసత్యాన్ని నిరాకరించాలి. (సామెతలు 3:​32) మోసం చేయడం, లంచం తీసుకోవడం అనేక దేశాల్లో సర్వసాధారణం అయివుండవచ్చు, కానీ ‘నీతిని అనుసరించి నడుచుకునేవారు’ వాటిని ఏవగించుకొంటారు. క్రైస్తవులు వ్యాపార వ్యవహారాల్లో నిజాయితీలేని లేక మోసకరమైన పథకాలను చిత్తశుద్ధితో నివారిస్తూ, “మంచి మనస్సాక్షి”ని కూడా కాపాడుకోవాలి. (హెబ్రీయులు 13:18; 1 తిమోతి 6:​9, 10) ‘హత్య అనే మాట వినకుండ చెవులు మూసికొనే, చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనే’ వ్యక్తి సంగీతాన్ని, వినోదాన్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటాడు. (కీర్తన 119:​37) అలాంటి ప్రమాణాల ప్రకారం జీవించే తన ఆరాధకులను యెహోవా తన తీర్పు దినాన కాపాడి, సంరక్షిస్తాడు.​—⁠జెఫన్యా 2:3.

తమ రాజును చూడడం

15. నమ్మకమైన యూదా పరవాసులను ఏ వాగ్దానం బలపరుస్తుంది?

15 తర్వాత, యెషయా భవిష్యత్తును గురించిన ప్రకాశమానమైన దృశ్యాన్ని ఇలా వర్ణిస్తున్నాడు: “అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచెదవు; బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. నీ హృదయము భయంకరమైన వాటినిబట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు? నాగరికములోని ఆ జనమును గ్రహింపలేని గంభీరభాషయు నీకు తెలియని అన్యభాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు.” (యెషయా 33:​17-19) భవిష్యత్తులోని మెస్సీయ రాజును గురించిన ఆయన రాజ్యాన్ని గురించిన వాగ్దానం, నమ్మకమైన యూదులు ఆ రాజ్యాన్ని కేవలం దూరము నుండి మాత్రమే చూడగలిగినప్పటికీ, వారు బబులోనులో పరవాసులుగా ఉండే సుదీర్ఘ దశాబ్దాల కాలంలో వారిని బలపరుస్తుంది. (హెబ్రీయులు 11:​13) మెస్సీయ పరిపాలన చివరికి వాస్తవం అయినప్పుడు, బబులోను నిరంకుశత్వం గతించిన జ్ఞాపకం అవుతుంది. అష్షూరీయుల దాడిని తప్పించుకుని మనుగడ సాగించేవారు సంతోషంగా ఇలా అడుగుతారు: “మాపై పన్నులు విధించిన, మా నుండి డబ్బు వసూలు చేసిన, మాతో కప్పం కట్టించుకున్న నిరంకుశులైన అధికారులు ఎక్కడ?”​—⁠యెషయా 33:​18, మొఫెట్‌.

16. దేవుని ప్రజలు ఎప్పటి నుండి మెస్సీయ రాజును ‘చూడ’ గలుగుతున్నారు, దాని ఫలితం ఏమిటి?

16 యెషయా మాటలు బబులోను చెరనుండి విడిపించబడడాన్ని గురించి హామీ ఇచ్చినప్పటికీ, పరవాసులుగా ఉన్న యూదులు, ప్రవచనంలోని ఈ భాగపు సంపూర్ణ నెరవేర్పును ఆనందించడానికి పునరుత్థానం కోసం వేచివుండవలసిందే. నేటి దేవుని సేవకుల మాటేమిటి? యెహోవా ప్రజలు 1914 నుండి మెస్సీయ రాజైన యేసు క్రీస్తును ఆయన ఆధ్యాత్మిక సౌందర్యమంతటిలో ‘చూడ’ గలుగుతున్నారు లేక గ్రహించగలుగుతున్నారు. (కీర్తన 45:2; 118:​22-26) ఫలితంగా, వారు సాతాను దుష్ట విధాన అణచివేత నుండి, నియంత్రణ నుండి విడుదల పొందారు. దేవుని రాజ్యానికి పీఠమైన సీయోను క్రింద, వారు నిజమైన ఆధ్యాత్మిక భద్రతను అనుభవిస్తారు.

17. (ఎ) సీయోను గురించి ఏ వాగ్దానాలు చేయబడ్డాయి? (బి) సీయోనును గురించిన యెహోవా వాగ్దానాలు మెస్సీయ రాజ్యంపై, భూమిపైనున్న దాని మద్దతుదారులపై ఎలా నెరవేరుతున్నాయి?

17 యెషయా ఇంకా ఇలా అంటున్నాడు: “ఉత్సవకాలములలో మనము కూడుకొనుచున్న సీయోను పట్టణమును చూడుము! నిమ్మళమైన కాపురముగాను తియ్యబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులెన్నడును ఊడదీయబడవు, దాని త్రాళ్లలో ఒక్కటియైనను తెగదు. అచ్చట యెహోవా ప్రభావముగలవాడై మన పక్షముననుండును, అది విశాలమైన నదులును కాలువలును ఉన్న స్థలముగా ఉండును. అందులో తెడ్ల ఓడ యేదియు నడువదు, గొప్ప ఓడ అక్కడికి రాదు.” (యెషయా 33:​20, 21) దేవుని మెస్సీయ రాజ్యం పెకిలించివేయబడలేదని లేక నిర్మూలించబడలేదని యెషయా మనకు హామీ ఇస్తున్నాడు. అంతేగాక, అలాంటి కాపుదల నేడు భూమిపైనున్న నమ్మకమైన రాజ్య మద్దతుదారులకు స్పష్టంగా ఇవ్వబడుతోంది. చాలామంది వ్యక్తులు తీవ్రమైన పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, ఒక సంఘంగా వారిని నాశనం చేయడానికి చేసే ప్రయత్నాలేవీ సఫలం కాలేవని దేవుని రాజ్య పౌరులకు హామీ ఇవ్వబడుతోంది. (యెషయా 54:​17) చుట్టూవున్న కందకం లేక కాలువ ఒక నగరాన్ని కాపాడేలా యెహోవా తన ప్రజలను కాపాడతాడు. వారిపైకి వచ్చే ఏ శత్రువైనా, చివరికి “తెడ్ల ఓడ” లేక “గొప్ప ఓడ” అంత శక్తిమంతమైనదైనా సరే నాశనాన్ని ఎదుర్కొంటుంది!

18. యెహోవా ఏ బాధ్యతను స్వీకరిస్తాడు?

18 దేవుని రాజ్య ప్రేమికులు దైవిక కాపుదల గురించి అంత నమ్మకాన్ని ఎందుకు కలిగివుండవచ్చు? యెషయా ఇలా వివరిస్తున్నాడు: “యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు; ఆయన మనలను రక్షించును.” (యెషయా 33:​22) సర్వోత్తమ సర్వాధిపతిగా తన స్థానాన్ని గుర్తించే తన ప్రజలను కాపాడే బాధ్యతను, వారికి నడిపింపునిచ్చే బాధ్యతను యెహోవా స్వీకరిస్తాడు. వీరు, నియమాలను రూపొందించే అధికారమే గాక వాటిని అమలులో పెట్టేలా చూసే అధికారం కూడా యెహోవాకు ఉందని గుర్తిస్తూ, మెస్సీయ రాజు ద్వారా ఆయన చేసే పరిపాలనకు ఇష్టపూర్వకంగా లోబడతారు. అయితే, యెహోవా నీతిని, న్యాయమును ప్రేమిస్తాడు గనుక, ఆయన తన కుమారుని ద్వారా చేసే పరిపాలన ఆయన ఆరాధకులకు ఒక భారం కాదు. బదులుగా, ఆయన అధికారానికి లోబడడం ద్వారా వారు ‘తమకు తాము ప్రయోజనం చేకూర్చుకుంటారు.’ (యెషయా 48:​17) ఆయన ఎన్నడూ తన యథార్థవంతులను విడనాడడు.​—⁠కీర్తన 37:28.

19. యెహోవా నమ్మకమైన ప్రజల శత్రువుల అసమర్థతను యెషయా ఎలా వర్ణిస్తున్నాడు?

19 యెహోవా నమ్మకమైన ప్రజల శత్రువులకు యెషయా ఇలా చెబుతున్నాడు: “నీ ఓడత్రాళ్లు వదలిపోయెను; ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు; చాపను విప్పి పట్టరు. కాగా విస్తారమైన దోపుడుసొమ్ము విభాగింపబడును; కుంటివారే దోపుడుసొమ్ము పంచుకొందురు.” (యెషయా 33:​23) సమీపిస్తున్న ఏ శత్రువులయినా యెహోవా ఎదుట, ఓడత్రాళ్లు బిగించని, కొయ్య దిట్టపరచని, తెరచాప కట్టబడని ఓడ వలె అసమర్థంగా, నిస్సహాయంగా ఉంటారు. దేవుని శత్రువుల నాశనం ఫలితంగా దోపుడు సొమ్ము ఎంత ఎక్కువగా ఉంటుందంటే, వికలాంగులు సహితం కొల్లసొమ్ము తీసుకోగలుగుతారు. కాబట్టి, రానున్న “మహాశ్రమల”లో, రాజైన యేసు క్రీస్తు ద్వారా యెహోవా తన శత్రువులపై విజయం సాధిస్తాడని మనం దృఢనిశ్చయత కలిగివుండవచ్చు.​—⁠ప్రకటన 7:14.

స్వస్థత

20. దేవుని ప్రజలు ఏ విధమైన స్వస్థతను పొందుతారు, ఎప్పుడు?

20 యెషయా ప్రవచనంలోని ఈ భాగం ఒక హృదయోత్తేజకరమైన వాగ్దానంతో ముగుస్తుంది: “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.” (యెషయా 33:​24) యెషయా మాట్లాడుతున్న రుగ్మత ప్రాథమికంగా ఆధ్యాత్మికమైనది, ఎందుకంటే అది పాపంతో లేక “దోషము”తో సంబంధం కలిగి ఉంది. ఈ మాటల తొలి అన్వయింపులో, బబులోను చెరనుండి విడుదల చేయబడిన తర్వాత జనాంగం ఆధ్యాత్మికంగా స్వస్థపరచబడుతుందని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. (యెషయా 35:5, 6; యిర్మీయా 33:6; కీర్తన 103:​1-5 పోల్చండి.) తిరిగి వచ్చే యూదులు, తమ గత పాపాల విషయమై క్షమించబడినవారై, యెరూషలేములో స్వచ్ఛారాధనను పునఃస్థాపిస్తారు.

21. యెహోవా ఆరాధకులు నేడు ఏ యే విధాల్లో ఆధ్యాత్మిక స్వస్థతను పొందుతున్నారు?

21 అయితే, యెషయా ప్రవచనానికి ఒక ఆధునిక నెరవేర్పు ఉంది. నేడు యెహోవా ప్రజలు ఆధ్యాత్మిక స్వస్థతను కూడా పొందుతున్నారు. వారు ఆత్మ అమర్త్యత, త్రిత్వం, నరకాగ్ని వంటి అబద్ధ బోధల నుండి విడుదల పొందారు. లైంగిక దురభ్యాసాల నుండి స్వతంత్రులను చేసి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేసే నైతిక నిర్దేశాన్ని వారు పొందుతారు. యేసు క్రీస్తు విమోచన క్రయధనబలి మూలంగా, వారు దేవుని ఎదుట పరిశుభ్రమైన స్థానాన్ని కలిగివుండడమే గాక, మంచి మనస్సాక్షిని కూడా కలిగివుంటారు. (కొలొస్సయులు 1:13, 14; 1 పేతురు 2:24; 1 యోహాను 4:​10) ఈ ఆధ్యాత్మిక స్వస్థత మూలంగా శారీరక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఉదాహరణకు, లైంగిక దుర్నీతికి, పొగాకు ఉత్పాదనలకు దూరంగా ఉండడం, క్రైస్తవులను సుఖరోగాలనుండి, కొన్ని రకాలైన క్యాన్సర్‌ల నుండి కాపాడుతుంది.​—⁠1 కొరింథీయులు 6:18; 2 కొరింథీయులు 7:1.

22, 23. (ఎ) యెషయా 33:24 భవిష్యత్తులో మరింత గొప్పగా ఎలా నెరవేరుతుంది? (బి) నేడు సత్యారాధకుల నిశ్చయత ఏమిటి?

22 అంతేగాక, అర్మగిద్దోను తర్వాత దేవుని నూతన లోకంలో యెషయా 33:24 మరింత గొప్పగా నెరవేరుతుంది. మెస్సీయ రాజ్య పరిపాలన క్రింద, మానవులు ఆధ్యాత్మిక స్వస్థతతో పాటు గొప్ప శారీరక స్వస్థతను కూడా పొందుతారు. (ప్రకటన 21:​3, 4) సాతాను విధానం నాశనం చేయబడిన వెంటనే, యేసు భూమిపై ఉన్నప్పుడు చేసినటువంటి అద్భుతాలు నిస్సందేహంగా భూగోళవ్యాప్త పరిధిలో జరుగుతాయి. గ్రుడ్డివారు చూస్తారు, చెవిటివారు వింటారు, కుంటివారు నడుస్తారు! (యెషయా 35:​5, 6) ఇది, మహా శ్రమలను ప్రాణాలతో తప్పించుకొనే వారందరూ భూమిని పరదైసు పరిస్థితిలోకి తీసుకువచ్చే గొప్ప పనిలో భాగం వహించడాన్ని అనుమతిస్తుంది.

23 ఆ తర్వాత, పునరుత్థానం ప్రారంభమైనప్పుడు, తిరిగి జీవానికి వచ్చేవారు మంచి ఆరోగ్యంతో లేపబడతారన్నదానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే, విమోచన క్రయధన బలి విలువ అత్యధిక పరిధిలో అన్వయించబడుతుండగా, మానవజాతి పరిపూర్ణతకు తీసుకురాబడే వరకు మరిన్ని శారీరకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అప్పుడు, నీతిమంతులు సంపూర్ణ భావంలో, ‘బ్రతుకుతారు.’ (ప్రకటన 20:​5, 6) ఆ సమయంలో, ఆధ్యాత్మికంగానూ, శారీరకంగానూ, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” ఎంత ఉత్తేజకరమైన వాగ్దానం! నేడు సత్యారాధకులందరూ, దాని నెరవేర్పును అనుభవించేవారిలో ఒకరై ఉండేందుకు నిశ్చయించుకుందురు గాక!

[అధ్యయన ప్రశ్నలు]

[344 వ పేజీలోని చిత్రాలు]

యెషయా నమ్మకంగా యెహోవాకు ప్రార్థిస్తాడు

[353 వ పేజీలోని చిత్రాలు]

విమోచన క్రయధన బలి మూలంగా, యెహోవా ప్రజలు ఆయన ఎదుట పరిశుభ్రమైన స్థానాన్ని కలిగివున్నారు

[354 వ పేజీలోని చిత్రాలు]

నూతన లోకంలో, గొప్ప శారీరక స్వస్థత జరుగుతుంది