“నా జనులను ఓదార్చుడి”
ముప్పైయవ అధ్యాయం
“నా జనులను ఓదార్చుడి”
1. యెహోవా మనలను ఓదార్చే ఒక మార్గం ఏది?
యెహోవా ‘ఆదరణకు కర్తయగు దేవుడు.’ ఆయన తన వాక్యంలో వ్రాయించి ఉంచిన వాగ్దానాల ద్వారా కూడా మనలను ఓదారుస్తాడు. (రోమీయులు 15:4, 5) ఉదాహరణకు, మీకు ప్రియమైన వారెవరైనా చనిపోతే, వారు దేవుని నూతన లోకంలో పునరుత్థానం చేయబడతారనే నిరీక్షణ గాక మరింకేది మీకు ఎక్కువ ఓదార్పును ఇవ్వగలదు? (యోహాను 5:28, 29) త్వరలోనే దుష్టత్వాన్ని అంతమొందించి, ఈ భూమిని పరదైసుగా మారుస్తానని యెహోవా చేసిన వాగ్దానం మాటేమిటి? రాబోతున్న పరదైసులోకి ప్రవేశించి, మరెన్నడూ మరణించకుండా జీవించగల నిరీక్షణ కలిగివుండడం ఓదార్పునివ్వదా?—కీర్తన 37:9-11, 29; ప్రకటన 21:3-5.
2. మనం దేవుని వాగ్దానాలను ఎందుకు నమ్మవచ్చు?
2 మనం నిజంగా దేవుని వాగ్దానాలను నమ్మవచ్చా? అవును, నమ్మవచ్చు! ఆ వాగ్దాలను చేస్తున్నవాడు పూర్తిగా నమ్మదగినవాడు. ఆయనకు తన వచనమును నేరవేర్చే సామర్థ్యమూ, నెరవేర్చాలనే ఇష్టమూ రెండూ ఉన్నాయి. (యెషయా 55:10, 11) ఈ విషయం, యెరూషలేములో సత్యారాధనను పునఃస్థాపిస్తానని యెహోవా యెషయా ప్రవక్త ద్వారా చేసిన వ్యాఖ్యానానికి సంబంధించి శక్తివంతంగా స్పష్టం చేయబడింది. యెషయా 40 వ అధ్యాయంలో కనిపించే, ఆ ప్రవచనాన్ని మనం పరిశీలిద్దాం, అలా చేయడం వాగ్దానాలను నెరవేర్చే యెహోవాపై మన విశ్వాసాన్ని బలపరుస్తుంది.
ఓదార్పుకరమైన వాగ్దానం
3, 4. (ఎ) దేవుని ప్రజలకు ఆ తర్వాత కాలాల్లో అవసరమయ్యే ఏ ఓదార్పుకరమైన మాటలను యెషయా వ్రాసివుంచుతాడు? (బి) యూదా యెరూషలేముల నివాసులు బబులోనుకు ఎందుకు చెరగా కొనిపోబడతారు, వారు ఎంతకాలంపాటు దాసత్వంలో ఉంటారు?
3 యెహోవా ప్రజలకు ఆ తర్వాతి కాలాల్లో అవసరమయ్యే ఓదార్పుకరమైన మాటలను యెషయా ప్రవక్త సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో వ్రాసి ఉంచుతాడు. సమీపిస్తున్న యెరూషలేము నాశనం గురించి, యూదా ప్రజలు బబులోనుకు కొనిపోబడడం గురించి హిజ్కియా రాజుకు చెప్పిన వెంటనే, పునఃస్థాపనను వాగ్దానం చేసే యెహోవా మాటలను యెషయా ఇలా తెలియజేస్తాడు: “మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా—నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.”—యెషయా 40:1, 2.
4 యెషయా 40 వ అధ్యాయం ప్రారంభంలో ఉన్న “ఓదార్చుడి” అనే మాట, యెషయా గ్రంథంలోని మిగతా భాగంలో ఉన్న వెలుగు మరియు నిరీక్షణల సందేశాన్ని చక్కగా వర్ణిస్తుంది. యూదా యెరూషలేముల నివాసులు మతభ్రష్టులుగా మారినందుకు వారు సా.శ.పూ. 607 లో బబులోనుకు చెరగా కొనిపోబడతారు. కానీ ఆ యూదా పరవాసులు బబులోనీయులకు ఎల్లకాలం దాసులై ఉండరు. వారి దోషరుణము ‘తీర్చబడే’ వరకు మాత్రమే వారు దాసత్వంలో ఉంటారు. అది ఎంత కాలం? యిర్మీయా ప్రవక్త చెబుతున్న దాని ప్రకారం, 70 సంవత్సరాలు. (యిర్మీయా 25:11, 12) దాని తర్వాత, పశ్చాత్తాపపడుతున్న శేషించినవారిని యెహోవా బబులోను నుండి యెరూషలేముకు తిరిగి తీసుకువస్తాడు. యూదా నిర్జనంగా విడువబడిన 70 వ సంవత్సరంలో, వాగ్దానం చేయబడిన తమ విడుదల సమీపించిందని గ్రహించడం పరవాసులుగా ఉన్నవారికి ఎంత ఓదార్పునిస్తుందో కదా!—దానియేలు 9:1, 2.
5, 6. (ఎ) బబులోను నుండి యెరూషలేముకు చేసే సుదీర్ఘమైన ప్రయాణం, దేవుని వాగ్దాన నెరవేర్పును ఎందుకు ఆటంకపరచదు? (బి) యూదులను వారి స్వదేశానికి తిరిగి తీసుకురావడం ఇతర రాజ్యాలపై ఏవిధమైన ప్రభావాన్ని చూపిస్తుంది?
5 ఎంపిక చేసుకున్న మార్గాన్ని బట్టి, బబులోను నుండి యెరూషలేముకు రావడానికి 800 నుండి 1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. సుదీర్ఘమైన ఆ ప్రయాణం దేవుని వాగ్దానం నెరవేరడానికి ఆటంకం కలిగిస్తుందా? ఎంతమాత్రం కలిగించదు! యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా—అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు, ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.”—యెషయా 40:3-5.
6 ప్రాచ్య పరిపాలకులు ఏదైనా ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, పెద్ద పెద్ద రాళ్లను తొలగించి, చివరికి కొండలను చదును చేసి బాటలువేసి మార్గాన్ని సిద్ధం చేయడానికి తరచూ మనుష్యులను పంపిస్తారు. తిరిగి వచ్చే యూదుల విషయంలో, ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని తొలగిస్తూ దేవుడే వారికి ముందు నడుస్తున్నట్లుగా ఉంటుంది. ఎంతైనా వీరు యెహోవా నామము పెట్టబడిన ప్రజలు, వారిని వారి స్వదేశానికి తిరిగి తీసుకువెళ్తానన్న వాగ్దాన నెరవేర్పు, రాజ్యాలన్నిటి ఎదుట ఆయన మహిమ ప్రదర్శించబడేలా చేస్తుంది. ఆ రాజ్యాలు ఏ విధమైన దృక్పథాన్ని చూపించినప్పటికీ, యెహోవా తన వాగ్దానాలను నెరవేర్చేవాడని అవి గ్రహించక తప్పదు.
7, 8. (ఎ) యెషయా 40:3 లోని మాటలు సా.శ. మొదటి శతాబ్దంలో ఎలా నెరవేరాయి? (బి) యెషయా ప్రవచనం 1919 లో మరి విస్తృతంగా ఎలా నెరవేరింది?
7 ఈ ప్రవచనం నెరవేరింది సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో జరిగిన పునఃస్థాపన సమయంలో మాత్రమే కాదు. సా.శ. మొదటి శతాబ్దంలో కూడా అది నెరవేరింది. యెషయా 40:3 నెరవేర్పుగా “అరణ్యములో కేకలువేయుచున్న” ఒకరి శబ్దం, బాప్తిస్మమిచ్చు యోహానే. (లూకా 3:1-6) ప్రేరేపించబడినవాడై యోహాను యెషయా మాటలను తనకు అన్వయించుకున్నాడు. (యోహాను 1:19-23) యోహాను సా.శ. 29 నుండి యేసు క్రీస్తు కోసం మార్గం సిద్ధపరచడం మొదలుపెట్టాడు. * యోహాను ముందుగా చేసిన ప్రకటన, ప్రజలు వాగ్దానం చేయబడిన మెస్సీయ చెప్పేది విని, ఆయనను అనుసరించగలిగేలా ఆయన కోసం ఎదురుచూడడానికి వారిని పురికొలిపింది. (లూకా 1:13-17, 76) పశ్చాత్తాపపడే వారిని కేవలం దేవుని రాజ్యం మాత్రమే ఇవ్వగల స్వేచ్ఛలోకి అంటే పాప మరణాల దాసత్వం నుండి విడుదలకు, యేసు ద్వారా యెహోవా నడిపిస్తాడు. (యోహాను 1:29; 8:32) ఆధ్యాత్మిక ఇశ్రాయేలు శేషమును 1919 లో మహాబబులోను నుండి విడుదల చేసి వారిని సత్యారాధనకు తిరిగి తీసుకురావడంలో యెషయా మాటలు మరి విస్తృతంగా నెరవేరాయి.
8 అయితే, వాగ్దాన తొలి నెరవేర్పు నుండి ప్రయోజనం పొందబోయే వారి అంటే, బబులోనులో ఉన్న యూదా పరవాసుల మాటేమిటి? తమ ప్రియమైన స్వదేశానికి తమను తీసుకురావడాన్ని గురించి యెహోవా చేసిన వాగ్దానాన్ని వారు నిజంగా నమ్మవచ్చా? అవును, నమ్మవచ్చు! యెహోవా తన మాట నిలబెట్టుకుంటాడని వారు సంపూర్ణ నమ్మకాన్ని కలిగివుండడానికి, యెషయా ఇప్పుడు, అనుదిన జీవితంలో నుండి తీసుకోబడిన స్పష్టమైన పదాలతో, ఉపమానాలతో శక్తివంతమైన కారణాలను ఇస్తున్నాడు.
దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది
9, 10. యెషయా, మానవ జీవితపు క్షణభంగురత్వాన్ని, దేవుని “వాక్యము” యొక్క శాశ్వతత్వంతో పోల్చి వ్యత్యాసాన్ని ఎలా చూపిస్తున్నాడు?
9 మొదటగా, పునఃస్థాపనను వాగ్దానం చేస్తున్న దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది. యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు—నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు, వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డియెండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డివంటివారే. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును; మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.”—యెషయా 40:6-8.
10 గడ్డి నిత్యం నిలువదని ఇశ్రాయేలీయులకు బాగా తెలుసు. ఎండాకాలంలో, సూర్యుని తీవ్రమైన వేడి వల్ల పచ్చని గడ్డి ఎండిపోయి గోధుమ వర్ణంలోకి మారుతుంది. కొన్ని విషయాల్లో, మానవుని జీవితం గడ్డి లాంటిది, తాత్కాలికమైనది. (కీర్తన 103:15, 16; యాకోబు 1:10, 11) యెషయా, మానవ జీవితపు క్షణభంగురత్వాన్ని, దేవుని “వాక్యము” యొక్క లేక ప్రకటిత సంకల్పము యొక్క శాశ్వతత్వంతో పోల్చి వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. అవును, “మన దేవుని వాక్యము” నిరంతరం నిలుస్తుంది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏదీ ఆయన మాటలను నిరర్థకం చేయలేదు లేక అవి నెరవేరకుండా చేయలేదు.—యెహోషువ 23:14.
11. యెహోవా తన లిఖిత వాక్యంలో ఉన్న వాగ్దానాలను నెరవేరుస్తాడని మనం ఎందుకు నమ్మకం కలిగి ఉండవచ్చు?
11 నేడు యెహోవా సంకల్పం యొక్క వాంగ్మూలం బైబిలులో లిఖిత రూపంలో ఉంది. గడచిన శతాబ్దాల్లో బైబిలు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంది, నిర్భయులైన అనువాదకులు మరితరులు దాన్ని కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టారు. అయినప్పటికీ, అది ఎందుకు మనగలిగింది అనే విషయాన్ని వారి ప్రయాసలు మాత్రమే వివరించవు. అది మనగలిగినందుకు, ఘనత అంతా “శాశ్వతమగు జీవముగల దేవు[డు],” తన వాక్యాన్ని కాపాడేవాడు అయిన యెహోవాకే చెందాలి. (1 పేతురు 1:22-25) దీని గురించి ఆలోచించండి: యెహోవా తన లిఖిత వాక్యమును భద్రంగా కాపాడాడు గనుక, దానిలో ఉన్న వాగ్దానాలను ఆయన నెరవేరుస్తాడని మనం నమ్మకం కలిగి ఉండలేమా?
తన గొఱ్ఱెలను ప్రేమపూర్వకంగా చూసుకునే శక్తివంతుడైన దేవుడు
12, 13. (ఎ) పునఃస్థాపన వాగ్దానాన్ని ఎందుకు నమ్మవచ్చు? (బి) యూదా పరవాసుల కోసం ఏ సువార్త ఉంది, వారు ఎందుకు నమ్మకం కలిగి ఉండవచ్చు?
12 పునఃస్థాపన వాగ్దానాన్ని ఎందుకు నమ్మవచ్చుననే దానికి యెషయా రెండవ కారణాన్ని ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చేస్తున్నది తన ప్రజల గురించి ప్రేమపూర్వకంగా శ్రద్ధ తీసుకునే శక్తివంతుడైన దేవుడు. యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “సీయోనూ, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము. యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము. భయపడక ప్రకటింపుమి—ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్ద నున్నది, ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడచుచున్నది. గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.”—యెషయా 40:9-11.
13 బైబిలు కాలాల్లో, గెలిచిన యుద్ధాలను గురించిన లేక రాబోతున్న ఉపశమనాన్ని గురించిన సువార్తను స్త్రీలు ఎలుగెత్తి చెబుతూ లేక పాడుతూ విజయాలను పండుగగా చేసుకోవడం ఆనవాయితీగా ఉండేది. (1 సమూయేలు 18:6, 7; కీర్తన 68:11) యూదా పరవాసుల కోసం ఒక సువార్త అంటే చివరికి పర్వతాగ్రాలపై నుండి నిర్భయంగా ఎలుగెత్తి చెప్పగల వార్త ఉందని యెషయా ప్రవచనార్థకంగా సూచిస్తున్నాడు. యెహోవా తన ప్రజలను తమ ప్రియమైన యెరూషలేముకు తిరిగి తీసుకువెళతాడన్నదే ఆ సువార్త! వారు నమ్మకం కలిగివుండవచ్చు, ఎందుకంటే యెహోవా “శక్తిసంపన్నుడై” వస్తాడు. కాబట్టి, ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఏదీ ఆయనను ఆపలేదు.
14. (ఎ) యెహోవా తన ప్రజలను నడిపించే ప్రేమపూర్వకమైన విధానాన్ని యెషయా ఉపమానంతో ఎలా వివరిస్తున్నాడు? (బి) గొఱ్ఱెలకాపరులు తమ గొఱ్ఱెల గురించి ప్రేమపూర్వకంగా శ్రద్ధ తీసుకోవడాన్ని ఏ ఉదాహరణ వివరిస్తుంది? (405 వ పేజీలోని బాక్సును చూడండి.)
14 అయితే, ఈ శక్తివంతుడైన దేవునికి మృదువైన పార్శ్వం కూడా ఉంది. యెహోవా తన ప్రజలను వారి స్వదేశానికి ఎలా తిరిగి తీసుకువెళతాడో యెషయా వాత్సల్యపూరితంగా వర్ణిస్తున్నాడు. యెహోవా, తన గొఱ్ఱెపిల్లలను కూర్చి వాటిని తన “రొమ్మున” ఆనించుకొని మోసే ప్రేమగల గొఱ్ఱెలకాపరి వలె ఉన్నాడు. ఇక్కడ “రొమ్మున” అనే పదం, వస్త్రాల పైభాగపు మడతలను సూచిస్తుందని స్పష్టమవుతుంది. మందతోపాటు నడువలేని చిన్న గొఱ్ఱెపిల్లలను గొఱ్ఱెలకాపరులు కొన్నిసార్లు అలాగే మోసుకువెళతారు. (2 సమూయేలు 12:3) పశువులను కాసే జీవితానికి సంబంధించిన, అటువంటి కదిలింపజేసే దృశ్యం, తమపట్ల యెహోవాకుగల ప్రేమపూర్వక శ్రద్ధను గురించి, పరవాసులైన ఆయన ప్రజలకు హామీ ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. శక్తివంతుడే అయినప్పటికీ ప్రేమగలవాడైన అలాంటి దేవుడు, వారికి వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తాడని ఖచ్చితంగా నమ్మవచ్చు!
15. (ఎ) యెహోవా “శక్తిసంపన్నుడై” ఎప్పుడు వచ్చాడు, ‘ఆయన పక్షమున ఏలుచున్న బాహువు’ ఎవరు? (బి) ఏ సువార్త నిర్భయంగా ప్రకటించబడాలి?
15 యెషయా మాటలు, మన కాలం కోసం ప్రవచనార్థక భావంతో నిండివున్నాయి. యెహోవా 1914 లో, “శక్తిసంపన్నుడై” వచ్చి, పరలోకంలో తన రాజ్యాన్ని స్థాపించాడు. ‘ఆయన పక్షమున ఏలుచున్న బాహువు’ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు, ఆయనను యెహోవా తన పరలోక సింహాసనంపై అధిష్ఠింపజేశాడు. యెహోవా 1919 లో, భూమిపైనున్న తన అభిషిక్త సేవకులను మహాబబులోను దాసత్వం నుండి విడిపించి, జీవముగల సత్య దేవుడైన తన స్వచ్ఛారాధనను పూర్తిగా పునఃస్థాపించడానికి పూనుకున్నాడు. ఇది, చేయబడుతున్న ప్రకటన దూరతీరాలకు చేరగలిగేలా పర్వతాగ్రాలపై నుండి ఎలుగెత్తి ప్రకటిస్తున్నట్లుగా, నిర్భయంగా ప్రకటించవలసిన సువార్త. కాబట్టి మనం మన స్వరములెత్తి, యెహోవా దేవుడు ఈ భూమిపై తన స్వచ్ఛారాధనను పునఃస్థాపించాడని ఇతరులకు ధైర్యంగా తెలియజేద్దాము!
16. యెహోవా తన ప్రజలను నేడు ఏ విధంగా నడిపిస్తున్నాడు, ఇది ఏ మాదిరిని ఉంచుతుంది?
16 యెషయా 40:10, 11 వచనాల్లోని మాటలు నేడు మన కోసం ఇంకా ఆచరణాత్మకమైన విలువను కలిగివున్నాయి. యెహోవా తన ప్రజలను నడిపించే ప్రేమపూర్వకమైన విధానాన్ని గమనించడం ఓదార్పునిస్తుంది. మందలోని మిగతా వాటితోపాటుగా నడువలేని చిన్న గొఱ్ఱెపిల్లలతో సహా తన గొఱ్ఱెల్లో ఒక్కోదాని అవసరతలను అర్థం చేసుకునే గొఱ్ఱెలకాపరి వలె, యెహోవా తన నమ్మకమైన సేవకుల్లో ప్రతి ఒక్కరి పరిమితులను అర్థం చేసుకుంటాడు. అంతేగాక, ప్రేమగల గొఱ్ఱెలకాపరిగా యెహోవా, క్రైస్తవ కాపరులకు ఒక మాదిరిగా ఉన్నాడు. పెద్దలు యెహోవా చూపించే ప్రేమపూర్వక శ్రద్ధను అనుకరిస్తూ మందతో సున్నితంగా వ్యవహరించాలి. “తన స్వరక్తమిచ్చి [“స్వంత కుమారుని రక్తమిచ్చి,” NW] సంపాదించిన” మందలో ప్రతి ఒక్కరి గురించి యెహోవా ఎలా భావిస్తాడనేదాని గురించి వారు ఎల్లప్పుడూ ఆలోచనకలిగి ఉండాలి.—అపొస్తలుల కార్యములు 20:28.
సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని
17, 18. (ఎ) పరవాసులుగా ఉన్న యూదులు పునఃస్థాపన వాగ్దానంలో ఎందుకు నమ్మకం కలిగివుండవచ్చు? (బి) భక్తిపూర్వకమైన భయాన్ని ఉత్పన్నం చేసే ఏ ప్రశ్నలను యెషయా వేస్తున్నాడు?
17 దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని గనుక, పరవాసులుగా ఉన్న యూదులు పునఃస్థాపన వాగ్దానంలో నమ్మకం కలిగి ఉండవచ్చు. యెషయా ఇలా చెబుతున్నాడు: “తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచిన వాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు? న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసినవాడెవడు? ఆయనకు బుద్ధిమార్గము బోధించినవాడెవడు?”—యెషయా 40:12-14.
18 ఇవి, పరవాసులుగా ఉన్న యూదులు ధ్యానించవలసిన, భక్తిపూర్వకమైన భయాన్ని ఉత్పన్నం చేసే ప్రశ్నలు. మానవమాత్రులు శక్తివంతమైన సముద్ర కెరటాలను ఆపగలరా? ఎంతమాత్రం ఆపలేరు! అయితే, భూమిపై వ్యాపించివున్న సముద్రాలు యెహోవాకు, తన పుడిసిటిలోవున్న ఒక నీటి బిందువులా ఉన్నాయి. * అల్పమానవుడు సువిశాలమైన, నక్షత్రాలతో నిండివున్న ఆకాశములను కొలవగలడా లేక భూమిపైనున్న పర్వతాలు, కొండల బరువు తూచగలడా? లేదు. అయితే, మానవుడు ఒక వస్తువు ఎన్ని జేనలు ఉందో కొలచినంత సులభంగా యెహోవా ఆకాశములను కొలవగలడు, జేన అంటే చేతి బొటనవేలి అగ్రంనుంచి చాచినప్పుడు చిటికెన వేలి అగ్రంవరకు గల గరిష్ఠ ప్రమాణం. ఒక విధంగా, దేవుడు పర్వతాలను కొండలను త్రాసుతో తూచగలడు. అత్యంత జ్ఞానవంతుడైన మానవుడు సహితం, ప్రస్తుత పరిస్థితుల్లో ఏమి చేయాలో దేవునికి సలహా ఇవ్వగలడా లేక భవిష్యత్తులో ఏమి చేయాలో ఆయనకు చెప్పగలడా? ఎంతమాత్రం చెప్పలేడు!
19, 20. యెహోవా గొప్పతనాన్ని నొక్కి చెప్పడానికి, యెషయా ఏ స్పష్టమైన ఉపమానాలను ఉపయోగిస్తున్నాడు?
19 భూమిపైనున్న శక్తివంతమైన జనముల మాటేమిటి, దేవుడు తన వాగ్దాన వాక్యమును నెరవేరుస్తుండగా అవి నిరోధించగలవా? జనములను ఇలా వర్ణించడం ద్వారా యెషయా సమాధానం ఇస్తున్నాడు: “జనములు చేదనుండి జారు బిందువులవంటివి; జనులు త్రాసుమీది ధూళివంటివారు. ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి. సమిధలకు లెబానోను చాలకపోవును, దహనబలికి దాని పశువులు చాలవు. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును; ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును.”—యెషయా 40:15-17.
20 యెహోవా దృష్టికి, మొత్తం జనములన్నీ చేద నుండి జారే ఒక నీటి బిందువులా ఉన్నాయి. అవి, ఏ ప్రభావం చూపించని, త్రాసు మీద పేరుకున్న ధూళికంటే ఎక్కువేమీ కాదు. * ఒకవేళ ఎవరైనా ఒక పెద్ద బలిపీఠము కట్టించి, లెబానోను పర్వతాలపై పరుచుకుని ఉన్న చెట్లన్నిటినీ బలిపీఠము మీద దహించడానికి కట్టెలుగా ఉపయోగించాలనుకున్నాడనుకోండి. తర్వాత అతడు, ఆ పర్వాతాలపై తిరుగాడే జంతువులన్నిటినీ బలిగా అర్పించాలనుకున్నాడనుకోండి. చివరికి అలాంటి అర్పణకు కూడా యెహోవా దృష్టిలో ఎటువంటి విలువా ఉండదు. ఇంతవరకూ ఉపయోగించిన అలంకారిక దృష్టాంతం చాలదన్నట్లు, యెషయా మరింత శక్తివంతమైన వాక్యాన్ని ఉపయోగిస్తున్నాడు—సమస్త జనములు యెహోవా దృష్టికి “శూన్యంకంటే తక్కువగానే ఉన్నాయి.”—యెషయా 40:17, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.
21, 22. (ఎ) యెహోవా సాటిలేనివాడని యెషయా ఎలా నొక్కిచెబుతున్నాడు? (బి) యెషయా ఇస్తున్న స్పష్టమైన వివరణలు మనం ఏ ముగింపుకు చేరుకోవడానికి నడిపిస్తాయి? (సి) యెషయా ప్రవక్త, వైజ్ఞానికపరంగా సరైనదైన ఏ వ్యాఖ్యానాన్ని వ్రాశాడు? (412 వ పేజీలో ఉన్న బాక్సు చూడండి.)
21 యెహోవా సాటిలేనివాడనే విషయాన్ని మరింతగా నొక్కి చెప్పడానికి యెషయా, బంగారు, వెండి, లేక కఱ్ఱతో విగ్రహాలు చేసేవారి మూర్ఖత్వాన్ని చూపించడం మొదలుపెడతాడు. అలాంటి విగ్రహమేదైనా, “భూమండలముమీద ఆసీనుడై” ఉండి, దాని నివాసులపై అధికారం కలిగివున్న దేవునికి తగిన ప్రతిరూపమని భావించడం ఎంత అవివేకం!—యెషయా 40:18-24.
22 ఈ స్పష్టమైన వివరణలన్నీ మనం ఒకే ముగింపుకు చేరుకోవడానికి నడిపిస్తాయి, అదేమిటంటే, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సాటిలేనివాడు అయిన యెహోవా తన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఏది ఆపలేదన్నదే. యెషయా మాటలు, తమ స్వదేశానికి తిరిగి రావాలని ఎంతో ఆకాంక్షిస్తున్న, బబులోనులో ఉన్న యూదా పరవాసులను ఎంతగా ఓదార్చి బలపరచి ఉంటాయో గదా! మన భవిష్యత్తు గురించి యెహోవా చేసిన వాగ్దానాలు నిజమవుతాయని నేడు మనం కూడా నమ్మకం కలిగివుండవచ్చు.
“వీటిని ఎవడు సృజించెను?”
23. యూదా పరవాసులు ఏ కారణాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవచ్చు, యెహోవా ఇప్పుడు తన గురించి తాను ఏమి నొక్కి తెలియజేస్తున్నాడు?
23 యూదా పరవాసులు ధైర్యం తెచ్చుకోవడానికి ఇంకా మరో కారణం ఉంది. విడుదలను వాగ్దానం చేస్తున్నది అన్నిటిని సృష్టించిన, సమస్త అధికశక్తికీ మూలమైన దేవుడు. యెహోవా తనకున్న అద్భుతమైన సామర్థ్యాన్ని నొక్కి తెలియజేయడానికి, సృష్టిలో కనిపిస్తున్న తన సామర్థ్యంవైపుకు అవధానాన్ని మళ్ళిస్తున్నాడు: “నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటిచేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.”—యెషయా 40:25, 26.
24. తన కోసం తాను మాట్లాడుకుంటూ, తాను సాటిలేని వాడనని యెహోవా ఎలా చూపిస్తున్నాడు?
24 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు తన కోసం తాను మాట్లాడుకుంటున్నాడు. యెహోవా తనకు సాటి అయిన వారెవరూ లేరని చూపించడానికి, ఆకాశ నక్షత్రాల వైపుకు అవధానం మళ్ళిస్తున్నాడు. తన సైన్యాలను ఉచితక్రమంలో ఉంచగల సైనికాధికారిలా యెహోవా నక్షత్రాలను అదుపు చేయగలడు. ఆయన వాటిని ఒకదగ్గర సమకూర్చాలనుకుంటే, ‘యొక్కటియైనను విడిచిపెట్టబడదు.’ నక్షత్రాలు ఎంతో అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, ఆయన ప్రతి దాన్ని, దాని స్వంత పేరుతో గానీ లేక పేరువంటి పదవిపేరుతో గానీ పిలుస్తాడు. విధేయులైన సైనికుల్లా, అవి తమ స్థానాల్లో ఉండి, సరైన క్రమాన్ని అనుసరిస్తాయి, ఎందుకంటే వాటి నాయకుడికి “అధికశక్తి” ఉంది, ఆయన “బలాతిశయము” గలవాడు. కాబట్టి, యూదా పరవాసులు నమ్మకం కలిగివుండడానికి కారణం ఉంది. నక్షత్రాలను శాసించే సృష్టికర్తకు తన సేవకులకు మద్దతునిచ్చే శక్తి ఉంది.
25. యెషయా 40:26 లో వ్రాయబడి ఉన్న దైవిక ఆహ్వానానికి మనం ఎలా ప్రతిస్పందించవచ్చు, దాని ప్రభావం ఎలా ఉండాలి?
25 “మీ కన్నులు పైకెత్తి చూడుడి” అని యెషయా 40:26 లో వ్రాయబడివున్న దైవిక ఆహ్వానాన్ని ఎవరు తిరస్కరించగలరు? నక్షత్రాలతో నిండిన ఆకాశములు యెషయా కాలంలో కనిపించినదానికంటే మరెంతో సంభ్రమాశ్చర్యాలను గొలిపేలా కనిపిస్తున్నాయని ఆధునిక-దిన ఖగోళశాస్త్రజ్ఞుల ఆవిష్కరణలు చూపించాయి. తమ శక్తివంతమైన దుర్భిణులతో ఆకాశములోకి తేరిచూసే ఖగోళశాస్త్రజ్ఞులు, వీక్షించగల విశ్వంలో దాదాపు 12,500 కోట్ల నక్షత్రవీధులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంతెందుకు, కొన్ని అంచనాల ప్రకారం, కేవలం వీటిలో ఒకదానిలో అంటే పాలపుంత నక్షత్ర వీధిలో 10,000 కోట్లకంటే ఎక్కువ నక్షత్రాలు ఉన్నాయి! అలాంటి జ్ఞానం, మన సృష్టికర్త పట్ల మన హృదయాల్లో భక్తినీ, ఆయన వాగ్దాన వాక్యంలో సంపూర్ణ నమ్మకాన్నీ కలిగించాలి.
26, 27. బబులోనులో పరవాసులుగా ఉన్నవారి భావాలు ఎలా వర్ణించబడ్డాయి, వారు ఏ విషయాలను తెలుసుకోవాలి?
26 చెరలో ఉన్న సంవత్సరాలు యూదా పరవాసుల మానసిక స్థితిని బలహీనపరుస్తాయని గ్రహించి, యెహోవా ధైర్యాన్నిచ్చే ఈ మాటలను ముందుగానే వ్రాసి ఉంచడానికి యెషయాను ప్రేరేపిస్తాడు: “యాకోబూ—నా మార్గము యెహోవాకు మరుగైయున్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.”—యెషయా 40:27, 28.
27 తమ స్వదేశం నుండి వందల కిలోమీటర్లు దూరంగా, బబులోనులో పరవాసులుగా ఉన్నవారి భావాలను వర్ణించే యెహోవా మాటలను యెషయా వ్రాస్తున్నాడు. కాబట్టి కొందరు, తమ “మార్గము” అంటే కష్టభరితమైన తమ జీవన విధానం, తమ దేవుడు చూడలేడు లేక ఆయనకు తెలియదు అనుకుంటారు. తాము అనుభవిస్తున్న అన్యాయాలపట్ల యెహోవా ఉదాసీనంగా ఉన్నాడని వారు అనుకుంటారు. తమ వ్యక్తిగత అనుభవం నుండి కాకపోయినా కనీసం తమకు అందజేయబడిన సమాచారం నుండైనా, వారు తెలుసుకోవలసిన విషయాల గురించి వారికి గుర్తుచేయబడుతుంది. యెహోవా తన ప్రజలను విడుదల చేయడానికి సమర్థుడు, వారిని విడుదల చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నిత్యుడగు దేవుడు, యావత్ భూమికి సృష్టికర్త. కాబట్టి సృష్టి సమయంలో ఆయన ప్రదర్శించిన శక్తి ఆయనకు ఇప్పటికీ ఉంది, చివరికి శక్తివంతమైన బబులోను కూడా ఆయన అందుకోలేని స్థితిలో లేదు. అలాంటి దేవుడు సొమ్మసిల్లడు, తన ప్రజలను విఫలం చేయడు. యెహోవా చేస్తున్నవాటిని పూర్తిగా గ్రహించాలని వారు ఎదురు చూడకూడదు, ఎందుకంటే ఆయన జ్ఞానము—లేక అంతర్దృష్టి, వివేచన, గ్రహణశక్తి—వారు ఆకళింపు చేసుకోగలదాన్ని మించినది.
28, 29. (ఎ) అలసిన వారికి తాను సహాయం చేస్తానని యెహోవా తన ప్రజలకు ఎలా గుర్తు చేస్తున్నాడు? (బి) యెహోవా తన సేవకులకు ఎలా శక్తినిస్తాడనే విషయాన్ని చూపించడానికి ఏ ఉదాహరణ ఉపయోగించబడింది?
28 నిరాశానిస్పృహలతో ఉన్న పరవాసులను యెహోవా యెషయా ద్వారా ఇంకా ఇలా ప్రోత్సహిస్తున్నాడు: “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు, యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు; సొమ్మసిల్లక నడిచిపోవుదురు.”—యెషయా 40:29-31.
29 సొమ్మసిల్లినవారికి బలమివ్వవలసిన అవసరం గురించి మాట్లాడేటప్పుడు, స్వదేశానికి తిరిగి రావడానికి పరవాసులు చేయవలసిన శ్రమతోకూడిన ప్రయాణం యెహోవా మనస్సులో ఉండివుండవచ్చు. మద్దతు కోసం తనవైపు చూసే అలసినవారికి సహాయం చేయడం తన సహజ స్వభావమని యెహోవా తన ప్రజలకు గుర్తుచేస్తున్నాడు. మానవుల్లో అత్యంత శక్తివంతులైన “బాలురు” మరియు “యౌవనస్థులు” కూడా అలసటతో నీరసపడవచ్చు, నిస్త్రాణులై తొట్రిల్లవచ్చు. అయినప్పటికీ, యెహోవా తనపై నమ్మకం ఉంచేవారికి శక్తిని అంటే అలుపెరుగకుండా పరుగెత్తడానికి, నడిచిపోవడానికి కాలసినంత శక్తిని ఇస్తాడు. యెహోవా తన సేవకులకు ఎలా శక్తినిస్తాడనే విషయాన్ని సోదాహరణంగా వివరించడానికి, ఏమాత్రం శ్రమపడకుండా ఎగురుతున్నట్లు అనిపించే పక్షిరాజు పయనాన్ని ఉపయోగించడం జరిగింది, ఎంతో శక్తిగల ఈ పక్షి గంటల తరబడి గాలిలో అలాగే ఎగురుతూ ఉండగలదు. * అలాంటి దైవిక మద్దతు నిరీక్షణతో, యూదా పరవాసులు నిరాశ చెందడానికి కారణమేమీ లేదు.
30. యెషయా 40 వ అధ్యాయం చివరి వచనాల నుండి నిజ క్రైస్తవులు నేడు ఎలా ఓదార్పును పొందవచ్చు?
30 యెషయా 40 వ అధ్యాయంలోని ఈ ముగింపు వచనాల్లో, ఈ దుష్ట విధానపు అంత్య దినాల్లో జీవిస్తున్న నిజ క్రైస్తవులకు ఓదార్పు ఉంది. ధైర్యాన్ని కూలదోసే అనేకానేక ఒత్తిడులు, సమస్యలు ఉన్నందున, మనం సహించే కష్టాలను, మనం అనుభవించే అన్యాయాలను దేవుడు గమనించకపోడని తెలుసుకోవడం ధైర్యాన్నిస్తుంది. అన్నిటిని సృష్టించిన, ‘మితిలేని జ్ఞానము’ గల దేవుడు, తన స్వంత సమయంలో, తన స్వంత విధానంలో అన్ని అన్యాయాలను సరిచేస్తాడని మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు. (కీర్తన 147:5, 6) ఈ మధ్యలో మనం మన స్వంత బలంతో సహించవలసిన అవసరం లేదు. అపరిమితమైన శక్తివనరులుగల యెహోవా, శ్రమల సమయంలో తన సేవకులకు శక్తినేకాదు “బలాధిక్యము”ను కూడా ఇవ్వగలడు.—2 కొరింథీయులు 4:7.
31. బబులోనులో ఉన్న యూదా పరవాసులకు యెషయా ప్రవచనంలో వెలుగులాంటి ఏ వాగ్దానం ఉంది, మనం దేనిపై సంపూర్ణ నమ్మకాన్ని కలిగివుండవచ్చు?
31 సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో బబులోనులో పరవాసులుగా ఉన్న యూదుల గురించి ఆలోచించండి. వందల కిలోమీటర్ల దూరంలో వారి ప్రియమైన యెరూషలేము నిర్జనంగా ఉంది, దాని ఆలయం శిథిలావస్థలో ఉంది. వారి కోసం యెషయా ప్రవచనంలో వెలుగు మరియు నిరీక్షణల ఓదార్పుకరమైన వాగ్దానం ఉంది, యెహోవా వారిని తమ స్వదేశానికి తిరిగి తీసుకువస్తాడు! సా.శ.పూ. 537 లో యెహోవా తన ప్రజలను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చి, తాను వాగ్దానాలను నెరవేర్చేవాడినని నిరూపించుకున్నాడు. మనం కూడా యెహోవాపై సంపూర్ణ నమ్మకాన్ని కలిగివుండవచ్చు. యెషయా ప్రవచనంలో ఎంతో రమ్యంగా వ్యక్తపరచబడిన ఆయన రాజ్య వాగ్దానాలు నిజమవుతాయి. అది నిజంగా సువార్త—సర్వమానవాళికీ వెలుగు సందేశం!
[అధస్సూచీలు]
^ యెహోవా కోసం మార్గాన్ని సిద్ధపరచడం గురించి యెషయా ప్రవచిస్తున్నాడు. (యెషయా 40:3) అయితే సువార్తలు, యేసు క్రీస్తు కోసం మార్గాన్ని సిద్ధంచేయడంలో బాప్తస్మమిచ్చు యోహాను చేసినదానికి ఆ ప్రవచనాన్ని అన్వయిస్తాయి. క్రైస్తవ గ్రీకు లేఖనాలను వ్రాసిన ప్రేరేపిత రచయితలు అలాంటి అన్వయింపును చేయడానికి కారణమేమిటంటే, యేసు తన తండ్రికి ప్రాతినిధ్యం వహించాడు, తన తండ్రి నామమున వచ్చాడు.—యోహాను 5:43; 8:29.
^ “మహా సముద్రాల పదార్థపరిమాణం ఇంచుమించుగా 1.35 క్వింటిలియన్ (1.35 X 1018) మెట్రిక్ టన్నులు లేక భూమి మొత్తం పదార్థపరిమాణంలో దాదాపు 1/4400 వంతులు ఉంటుంది” అని లెక్కించబడింది.—ఎన్‌కార్టా 97 ఎన్‌సైక్లోపీడియా.
^ ది ఎక్స్‌పోజిటర్స్ బైబిల్ కామెంటరీ ఇలా పేర్కొంటుంది: “మధ్య ప్రాచ్య వ్యాపారప్రాంతంలో జరిగే వర్తకం, మాంసం గానీ పండ్లు గానీ తూకం వేసేటప్పుడు త్రాసులో ఉన్న అతిచిన్న నీటి బిందువును లేక కాస్తంత ధూళిని అసలు లెక్కలోకే తీసుకోదు.”
^ పక్షిరాజు అతి తక్కువ శక్తిని ఉపయోగించుకుంటూ చాలా ఎత్తున ఎగురుతూ ఉండిపోగలదు. అది, ఉష్ణవాయువులను అంటే నిటారుగా పైకి ఎగసే వేడి గాలులను నైపుణ్యంగా ఉపయోగించుకుంటూ అలా ఎగురుతూ ఉండిపోగలదు.
[అధ్యయన ప్రశ్నలు]
[404, 405 వ పేజీలోని బాక్సు/చిత్రం]
యెహోవా ప్రేమగల గొఱ్ఱెలకాపరి
యెషయా యెహోవాను, తన గొఱ్ఱెపిల్లలను రొమ్మున ఆనించుకుని మోసుకువెళ్లే ప్రేమగల గొఱ్ఱెలకాపరితో పోలుస్తున్నాడు. (యెషయా 40:10, 11) యెషయా ఈ వాత్సల్యపూరితమైన ఉపమానాన్ని గొఱ్ఱెలకాపరుల నిజ-జీవిత అలవాట్ల ఆధారంగా చెబుతున్నాడని స్పష్టమవుతోంది. మధ్య ప్రాచ్యంలోని హెర్మోను పర్వతపు ఏటవాలు ప్రాంతాల్లో గొఱ్ఱెలకాపరులను గమనించి చూసిన ఒక ఆధునిక-దిన పరిశీలకుడు ఇలా నివేదిస్తున్నాడు: “ప్రతి గొఱ్ఱెలకాపరి తన మంద ఎలా ఉందో చూడడానికి దాన్ని నిశితంగా గమనించి చూశాడు. అతడు ఒక చిన్న గొఱ్ఱెపిల్లను చూసినప్పుడు, అది తన తల్లిని అనుసరించి నడవలేనంత బలహీనంగా ఉంది కాబట్టి అతడు దాన్ని తన కంబళి . . . మడతల్లో పెట్టుకున్నాడు. అతడు తన రొమ్మున ఇంకా వేరేవాటిని ఆనించుకుని ఉన్నప్పుడు, గొఱ్ఱెపిల్లలను తన భుజాలపై వేసుకుని వాటి కాళ్లను పట్టుకున్నాడు, లేదా ఒక సంచిలో గానీ బుట్టలోగానీ వేసి దాన్ని గాడిద వీపుమీద పెట్టాడు, చిన్న గొఱ్ఱెపిల్లలు తమ తల్లులను అనుసరించి నడవగలిగేంత వరకు అతడు ఇలాగే చేశాడు.” మనం, తన ప్రజలపట్ల అలాంటి ప్రేమపూర్వకమైన శ్రద్ధగల దేవుని సేవచేస్తున్నామని తెలుసుకోవడం ఓదార్పును ఇవ్వదా?
[412 వ పేజీలోని బాక్సు/చిత్రం]
భూమి ఆకారం ఎలా ఉంది?
భూమి బల్లపరుపుగా ఉందని మానవులు ప్రాచీన కాలంలో విశ్వసించారు. అయితే భూమి గోళంలా ఉండవచ్చని సా.శ.పూ. ఆరవ శతాబ్దపు తొలికాలాల్లోనే గ్రీకు తత్త్వవేత్త పైథాగరస్ సిద్ధాంతీకరించాడు. అయితే, పైథాగరస్ ఈ సిద్ధాంతాన్ని సూత్రీకరించడానికి రెండు శతాబ్దాల ముందే, యెషయా ప్రవక్త అసాధారణమైన స్పష్టతతోనూ, ఖచ్చితత్వంతోనూ ఇలా పేర్కొన్నాడు: “ఆయన భూమండలము మీద ఆసీనుడై యున్నాడు.” (యెషయా 40:22) ఇక్కడ “మండలము” అని అనువదించబడిన కుగ్ అనే హీబ్రూ పదాన్ని “గోళం” అని అనువదించవచ్చు. ఆసక్తికరంగా, గోళాకార వస్తువు మాత్రమే అన్ని కోణాల నుండి మండలములా కనిపిస్తుంది. * కాబట్టి, యెషయా ప్రవక్త ఎంతో కాలం ముందే వైజ్ఞానికపరంగా సరైన, ప్రాచీన పురాణగాథలతో ఎటువంటి సంబంధం లేని వ్యాఖ్యానాన్ని వ్రాశాడు.
[అధస్సూచి]
^ సాంకేతికపరంగా చెప్పాలంటే, భూమి ఒత్తబడిన గోళంలా ఉంటుంది. అది దాని ధ్రువాల దగ్గర స్వల్పంగా ఒత్తబడివుంది.
[403 వ పేజీలోని చిత్రాలు]
బాప్తిస్మమిచ్చు యోహానే ‘అరణ్యములో కేకలువేయుచున్న” ఒక శబ్దం