కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రతికూల పరిస్థితుల్లో యెహోవాపై నమ్మకం ఉంచండి

ప్రతికూల పరిస్థితుల్లో యెహోవాపై నమ్మకం ఉంచండి

తొమ్మిదవ అధ్యాయం

ప్రతికూల పరిస్థితుల్లో యెహోవాపై నమ్మకం ఉంచండి

యెషయా 7:​1-8:18

1. క్రైస్తవులు నేడు యెషయా 7, 8 అధ్యాయాలను పరిశీలించడం ద్వారా ఎందుకు ప్రయోజనం పొందుతారు?

 యెషయా 78 అధ్యాయాలు పరస్పర విరుద్ధమైన ప్రతిస్పందనలను తెలియజేస్తున్నాయి. యెషయా ఆహాజు ఇద్దరూ యెహోవా సమర్పిత జనాంగానికి చెందిన వారే; ఒకరికి ప్రవక్తగా, మరొకరికి యూదా రాజుగా, ఇద్దరికీ దేవుడిచ్చిన నియామకాలున్నాయి; ఇద్దరికీ ఒకే ప్రమాదం పొంచివుంది, అదేమిటంటే, తమకన్నా శక్తిమంతులైన శత్రుసైన్యాలు యూదాపై దాడి చేయడమనే ప్రమాదం. అయితే, యెషయా యెహోవాపై నమ్మకంతో ప్రమాదాన్ని ఎదుర్కొంటే, ఆహాజు భయానికి లొంగిపోయాడు. ఎందుకు విభిన్నమైన ప్రతిస్పందనలు? నేడు క్రైస్తవులు కూడా అలాగే శత్రుసైన్యాలచే చుట్టుముట్టబడి ఉన్నారు గనుక, యెషయా గ్రంథంలోని ఈ రెండు అధ్యాయాల్లోనూ ఏ పాఠాలు ఉన్నాయో తెలుసుకోవడానికి వీటిని పరిశీలించడం మంచిది.

ఒక నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి

2, 3. యెషయా తన ప్రారంభ మాటల్లో క్లుప్తంగా ఏ సారాంశాన్ని చెబుతున్నాడు?

2 కుంచెతో అలవోకగా కొన్ని గీతలు గీసి ఒక క్రొత్త చిత్రానికి బాహ్యరేఖను తయారుచేసే చిత్రకారుడిలాగే, యెషయా తాను చెప్పబోయే సంఘటనల ప్రారంభాన్నీ ముగింపునూ సూచించే కొన్ని స్పష్టమైన వ్యాఖ్యానాలతో తన వృత్తాంతాన్నిలా ప్రారంభిస్తున్నాడు: “యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేముమీదికి వచ్చిరి గాని అది వారివలన కాకపోయెను.”​—యెషయా 7:1.

3 అది సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దం. ఆహాజు తన తండ్రి యోతాము తర్వాత యూదాకు రాజయ్యాడు. సిరియా రాజు రెజీను, ఇశ్రాయేలు ఉత్తర రాజ్యానికి రాజు పెకహు యూదాను ముట్టడిస్తారు, వారి సైన్యాలు తీవ్రంగా దాడిచేస్తాయి. చివరికి వారు యెరూషలేమునే చుట్టుముడతారు. అయితే, ముట్టడి విఫలమవుతుంది. (2 రాజులు 16:5, 6; 2 దినవృత్తాంతములు 28:​5-8) ఎందుకు? దాని గురించి మనం తర్వాత తెలుసుకుంటాము.

4. ఆహాజు, అతని ప్రజల హృదయాలు ఎందుకు భీతితో నిండిపోతాయి?

4 మునుపు యుద్ధంలో, “సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసికొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను.” (యెషయా 7:2) అవును, సిరియనులు, ఇశ్రాయేలీయులు కుమ్ముక్కయ్యారనీ, వారి సైన్యాలు ఈ క్షణంలో ఎఫ్రాయీము (ఇశ్రాయేలు) నేలపై బసచేసి ఉన్నాయనీ తెలుసుకోవడం ఆహాజుకు ఆయన ప్రజలకు భీతి కలిగిస్తుంది. వారు రెండు లేదా మూడు రోజులు ప్రయాణిస్తే చాలు యెరూషలేములోకి ప్రవేశిస్తారు!

5. దేవుని ప్రజలు నేడు ఏ విధంగా యెషయాను పోలివున్నారు?

5 యెహోవా యెషయాకిలా చెబుతున్నాడు: “ఆహాజు నెదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయార్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువకడకు [వెళ్ళవలెను].” (యెషయా 7:3) ఒక్కసారి ఆలోచించండి! రాజు యెహోవా ప్రవక్త కోసం చూస్తూ నడిపింపు కోసం అడగవలసిన సమయంలో, ప్రవక్తే స్వయంగా వెళ్లి రాజును కలవాలి! అయినా, యెషయా ఇష్టపూర్వకంగా యెహోవాకు విధేయత చూపిస్తాడు. అలాగే, నేడు ఈ ప్రపంచ ఒత్తిళ్ళను బట్టి భయపడుతున్న ప్రజలను కనుగొనడానికి దేవుని ప్రజలు తామే ఇష్టపూర్వకంగా వెళ్తారు. (మత్తయి 24:​6, 14) ఈ సువార్త ప్రచారకుల సందర్శనాలకు ప్రతి సంవత్సరం లక్షలాదిమంది ప్రతిస్పందించి, భద్రతనిచ్చే యెహోవా హస్తాన్ని పట్టుకోవడం ఎంత తృప్తినిస్తుందో కదా!

6. (ఎ) ప్రవక్త ఆహాజు రాజుకు ధైర్యాన్నిచ్చే ఏ సందేశాన్ని తెలిపాడు? (బి) నేటి పరిస్థితి ఎలా ఉంది?

6 యెషయా యెరూషలేము గోడల వెలుపల ఆహాజు రాజును కనుగొంటాడు, రానున్న ముట్టడిని ఎదుర్కొనేందుకు సిద్ధపాటుగా అక్కడాయన నగర నీటి సరఫరాను తనిఖీ చేస్తున్నాడు. యెషయా ఆయనకు యెహోవా సందేశాన్నిలా తెలియజేస్తాడు: “భద్రముసుమీ, నిమ్మళించుము; పొగరాజుచున్న యీ రెండు కొరకంచు కొనలకు, అనగా రెజీనును, సిరియనులు, రెమల్యా కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము.” (యెషయా 7:4) దురాక్రమణదారులు మునుపు యూదాను నాశనం చేసినప్పుడు, వారి ఆగ్రహం అగ్ని జ్వాలలంత తీవ్రంగా ఉంది. ఇప్పుడు వాళ్లు కేవలం ‘పొగరాజుచున్న రెండు కొరకంచు కొనలు’ మాత్రమే. ఆహాజు సిరియా రాజైన రెజీనుకు గానీ రెమల్యా కుమారుడూ ఇశ్రాయేలు రాజూ అయిన పెకహుకు గానీ భయపడవలసిన అవసరం లేదు. నేడు కూడా పరిస్థితి అలాగే ఉంది. శతాబ్దాలపాటు, క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు నిజ క్రైస్తవులను తీవ్రంగా హింసించారు. అయితే ఇప్పుడు మాత్రం క్రైస్తవమత సామ్రాజ్యం దాదాపు కాలిపోయిన కొరకంచులా ఉంది. దాని అంతం సమీపించింది.

7. యెషయా పేరు, ఆయన కుమారుని పేరు నిరీక్షణకు ఎందుకు కారణాన్నిస్తాయి?

7 ఆహాజు దినాల్లో, యెషయా సందేశమే కాదు ఆయన పేరుకు, ఆయన కుమారుని పేరుకు ఉన్న భావం కూడా యెహోవాపై నమ్మకముంచే వారికి నిరీక్షణనిచ్చింది. నిజమే, యూదా ప్రమాదంలో ఉంది, కానీ “యెహోవా ఇచ్చే రక్షణ” అనే భావం గల యెషయా పేరు, యెహోవా విడుదలను అనుగ్రహిస్తాడని సూచిస్తోంది. “శేషము మాత్రమే తిరిగి వచ్చును” అనే భావమున్న పేరుగల ఆయన కుమారుడైన షెయార్యాషూబును ఆయనతోపాటు తీసుకువెళ్లమని యెహోవా యెషయాకు చెప్తాడు. చివరికి యూదా రాజ్యం కూలిపోయినప్పుడు, దేవుడు కనికరంతో ఒక శేషమును దేశానికి తిరిగి తీసుకువస్తాడు.

కేవలం దేశాల మధ్య యుద్ధం కాదు

8. యెరూషలేముపై జరిగిన దాడి, కేవలం దేశాల మధ్య జరిగే యుద్ధంకంటే ఎందుకు ఎక్కువ?

8 యెహోవా యెషయా ద్వారా యూదా శత్రువుల యుద్ధతంత్రాన్ని బయల్పరుస్తాడు. వాళ్లిలా పథకం వేస్తున్నారు: “మనము యూదాదేశముమీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబెయేలనువాని కుమారుని దానికి రాజుగా నియమించెదము.” (యెషయా 7:​5, 6) సిరియా-ఇశ్రాయేలు కూటమి యూదాను జయించి, దావీదు కుమారుడైన ఆహాజు స్థానంలో తమ మనిషిని ఉంచాలని కుట్ర పన్నుతుంది. కాబట్టి ఇప్పుడు యెరూషలేముపై దాడి చేయడమన్నది కేవలం దేశాల మధ్య యుద్ధం కంటే ఎక్కువేనని స్పష్టమవుతోంది. అది సాతానుకు యెహోవాకు మధ్య పోరాటంగా మారింది. ఎందుకు? ఎందుకంటే యెహోవా దేవుడు దావీదు రాజుతో ఒక నిబంధన చేసి, నీ కుమారులు నా ప్రజలను పరిపాలిస్తారని ఆయనకు హామీ ఇచ్చాడు. (2 సమూయేలు 7:​11, 16) అయితే సాతాను, యెరూషలేములోని సింహాసనంపై మరో ఇతర రాజవంశాన్ని అధిష్ఠింపజేయగలిగాడంటే అతనికి అదెంతటి విజయమవుతుందో కదా! దావీదు వంశావళి నుండి “సమాధానకర్తయగు అధిపతి” అయిన శాశ్వత వారసుడు రావాలనే యెహోవా సంకల్పాన్ని కూడా అతడు తారుమారు చేసినవాడవుతాడు.​—⁠యెషయా 9:6, 7.

యెహోవా ప్రేమపూర్వక హామీలు

9. ఆహాజుకూ, నేటి క్రైస్తవులకూ ఎటువంటి హామీలు ధైర్యాన్నివ్వాలి?

9 సిరియా, ఇశ్రాయేలుల పథకం సఫలమవుతుందా? లేదు. యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆ మాట నిలువదు, జరుగదు.” (యెషయా 7:7) యెరూషలేము ముట్టడి విఫలం కావడమే గాక “అరువదియయిదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండ నాశనమగును” అని యెహోవా యెషయా ద్వారా తెలియజేస్తున్నాడు. (యెషయా 7:8) అవును, 65 సంవత్సరాల్లో ఇశ్రాయేలు ఇక ఎంతమాత్రం ఒక జనాంగముగా మిగిలి ఉండదు. * నిర్దిష్టమైన కాలపట్టికతో ఇవ్వబడిన ఈ హామీ ఆహాజుకు ధైర్యాన్నివ్వాలి. అదేవిధంగా, సాతాను లోకం కోసం మిగిలివున్న సమయం గడిచిపోతోందని తెలుసుకుని దేవుని ప్రజలు నేడు బలపర్చబడతారు.

10. (ఎ) నిజ క్రైస్తవులు నేడు యెహోవాను ఎలా అనుకరించవచ్చు? (బి) యెహోవా ఆహాజుకు ఏమి ప్రతిపాదిస్తున్నాడు?

10 బహుశా ఆహాజు ముఖంపై అపనమ్మకం కనిపిస్తుండవచ్చు, ఎందుకంటే యెహోవా యెషయా ద్వారా ఇలా చెబుతున్నాడు: “మీరు నమ్మకుండినయెడల స్థిరపడక యుందురు.” యెహోవా సహనంతో, “ఆహాజుతో ఇంకా ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు.” (యెషయా 7:​9, 10, NW) ఎంత చక్కని మాదిరి! నేడు, చాలామంది రాజ్య సందేశానికి వెంటనే ప్రతిస్పందించకపోయినప్పటికీ, మనం వారిని పదే పదే సందర్శిస్తూ వారితో “మాట్లాడుతూనే” ఉండడం ద్వారా మనం యెహోవాను అనుకరించడం మంచిది. యెహోవా ఆ తర్వాత ఆహాజుకు ఇలా చెబుతున్నాడు: “నీ దేవుడైన యెహోవావలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే.” (యెషయా 7:​11) ఆహాజు ఒక సూచన కోసం అడుగవచ్చు, తాను దావీదు వంశాన్ని కాపాడతానన్నదానికి హామీగా యెహోవా దాన్ని చేస్తాడు.

11. ‘నీ దేవుడు’ అని యెహోవా అన్న మాటల్లో ఏ హామీ కనిపిస్తుంది?

11నీ దేవుడ్ని సూచన నడుగుము’ అని యెహోవా చెప్పడాన్ని గమనించండి. యెహోవా నిజంగా దయ గలవాడు. ఆహాజు అప్పటికే అబద్ధ దేవుళ్లను ఆరాధిస్తూ అసహ్యకరమైన అన్య ఆచారాలను అనుసరిస్తున్నట్లు నివేదించబడుతుంది. (2 రాజులు 16:​3, 4) ఆహాజు అలా చేసినప్పటికీ, అతడు అంతగా భయపడిపోతున్నప్పటికీ, యెహోవా అప్పటికీ తనను తాను ఆహాజు దేవునిగా చెప్పుకుంటున్నాడు. యెహోవా మానవులను తొందరపడి నిరాకరించడని ఇది మనకు హామీ ఇస్తోంది. తప్పు చేసేవారికి లేక విశ్వాసం బలహీనమైన వారికి సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని ప్రేమను గూర్చిన ఈ హామీ ఆహాజు యెహోవా హస్తాన్ని పట్టుకునేలా కదలిస్తుందా?

అనుమానం నుండి అవిధేయతకు

12. (ఎ) ఆహాజు ఏ అహంకారపూరిత దృక్పథాన్ని అలవర్చుకుంటాడు? (బి) ఆహాజు యెహోవా వైపు తిరిగే బదులు, సహాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్తాడు?

12 “నేను అడుగను యెహోవాను శోధింపనని” ఆహాజు ధిక్కారంగా సమాధానమిస్తాడు. (యెషయా 7:​12) ఇక్కడ ఆహాజు, ‘మీరు మీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు’ అని చెబుతున్న ధర్మశాస్త్ర మాటలనేమీ ఆచరణలో పెట్టడం లేదు. (ద్వితీయోపదేశకాండము 6:​16) శతాబ్దాల తర్వాత, సాతాను తనను శోధించినప్పుడు యేసు అదే సూత్రాన్ని ఎత్తిచెబుతాడు. (మత్తయి 4:7) అయితే, యెహోవా ఆహాజును సత్యారాధన వైపుకు మరలమని ఆహ్వానిస్తూ, ఒక సూచన చేయడం ద్వారా అతని విశ్వాసాన్ని బలపరుస్తానని చెబుతున్నాడు. అయితే ఆహాజు మరోచోట శరణు కోసం వెతకడానికి ఎంచుకుంటాడు. రాజు తన ఉత్తరప్రాంతపు శత్రువుల బారి నుండి శరణు కోరుతూ అష్షూరుకు పెద్ద మొత్తంలో డబ్బు పంపించేది బహుశా ఈ సమయంలోనే కావచ్చు. (2 రాజులు 16:​7, 8) అయితే ఈలోగా, సిరియా-ఇశ్రాయేలు సైన్యం యెరుషలేమును చుట్టుముట్టడంతో దాడి ప్రారంభమవుతుంది.

13. పదమూడవ వచనంలో మనం ఏ మార్పును గమనిస్తాము, అది దేన్ని సూచిస్తుంది?

13 రాజు అవిశ్వాసాన్ని మనస్సులో ఉంచుకుని యెషయా ఇలా అంటున్నాడు: “దావీదు వంశస్థులారా, వినుడి; మనుష్యులను విసికించుట చాలదనుకొని నా దేవునికూడ విసికింతురా?” (యెషయా 7:​13) అవును, పదేపదే అవిధేయత చూపిస్తే యెహోవా విసిగిపోగలడు. ఇప్పుడు ప్రవక్త ‘నీ దేవుడు’ అనకుండా ‘నా దేవుడు’ అనడాన్ని కూడా గమనించండి. ఎంత విషాదకరమైన మార్పు! ఆహాజు యెహోవాను తిరస్కరించి అష్షూరు వైపు తిరిగినప్పుడు, అతడు దేవునితో తనకున్న సంబంధాన్ని పునఃస్థాపించుకునే చక్కని అవకాశాన్ని జారవిడుచుకుంటాడు. తాత్కాలికమైన ప్రయోజనాల కోసం మన లేఖనాధార నమ్మకాల విషయంలో రాజీపడకుండా దేవునితో మనకున్న సంబంధాన్ని దృఢంగా ఉంచుకుందాం.

ఇమ్మానుయేలు సూచన

14. యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన విషయంలో ఎలా నమ్మకంగా ఉంటాడు?

14 యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన విషయంలో నమ్మకంగా ఉంటాడు. ఒక సూచన ప్రతిపాదించబడింది, ఒక సూచన ఇవ్వబడుతుంది! యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయబడును.”​—యెషయా 7:14-16.

15. ఇమ్మానుయేలును గురించిన ప్రవచనం ఏ రెండు ప్రశ్నలకు సమాధానమిస్తుంది?

15 దురాక్రమణదారులు దావీదు రాజవంశాన్ని అంతమొందిస్తారేమోనని భయపడేవారికి ఇక్కడొక సువార్త ఉంది. ‘ఇమ్మానుయేలు’ అంటే “దేవుడు మనకు తోడై యున్నాడు” అని భావం. దేవుడు యూదాకు తోడై ఉన్నాడు, దావీదుతో తాను చేసిన నిబంధన నిష్ఫలం కావడానికి ఆయన అనుమతించడు. అంతేగాక, యెహోవా ఏమి చేస్తాడనేదేగాక, ఆయన ఎప్పుడు చేస్తాడనేది కూడా ఆహాజుకు అతని ప్రజలకు చెప్పబడింది. బాలుడైన ఇమ్మానుయేలు మంచి చెడుల మధ్య తేడాను గ్రహించేంత పెద్దవాడు కాకముందే, శత్రు దేశాలు నాశనం చేయబడతాయి. అది నిజమవుతుంది!

16. యెహోవా ఇమ్మానుయేలు గుర్తింపును ఆహాజు కాలంలో ఎందుకు అస్పష్టంగా విడిచిపెట్టి ఉండవచ్చు?

16 ఇమ్మానుయేలు ఎవరి కుమారుడనేది బైబిలు తెలియజేయడం లేదు. బాలుడైన ఇమ్మానుయేలు ఒక సూచనగా ఉండాలి గనుక, తాను తన పిల్లలు “సూచనలు”గా ఉన్నామని ఆ తర్వాత యెషయా చెబుతున్నాడు గనుక, ఇమ్మానుయేలు ప్రవక్త యొక్క ఒక కుమారుడై ఉండవచ్చు. (యెషయా 8:​18) ఆహాజు కాలంలో ఇమ్మానుయేలు గుర్తింపును యెహోవా బహుశా అస్పష్టంగా విడిచిపెట్టడానికి కారణం, తర్వాతి తరాల అవధానాన్ని గొప్ప ఇమ్మానుయేలు నుండి ప్రక్కకు మళ్లించకుండా ఉండడానికి కావచ్చు. ఆ గొప్ప ఇమ్మానుయేలు ఎవరు?

17. (ఎ) గొప్ప ఇమ్మానుయేలు ఎవరు, ఆయన జననం దేన్ని సూచించింది? (బి) నేడు దేవుని ప్రజలు “దేవుడు మనకు తోడై యున్నాడు” అని బిగ్గరగా ఎందుకు చెప్పగలరు?

17 యెషయా పుస్తకంలో కాకుండా, బైబిలంతటిలోనూ కేవలం మత్తయి 1:23 లో మాత్రమే ఇమ్మానుయేలు అనే పేరు కనిపిస్తుంది. ఇమ్మానుయేలు జననం గురించిన ప్రవచనాన్ని దావీదు సింహాసనానికి వారసుడయ్యే హక్కుగల యేసు జననానికి అన్వయించేలా యెహోవా మత్తయిని ప్రేరేపించాడు. (మత్తయి 1:​18-23) మొదటి ఇమ్మానుయేలు జననం దేవుడు దావీదు ఇంటిని విడిచిపెట్టలేదన్నదానికి సూచనగా పనిచేసింది. అలాగే, గొప్ప ఇమ్మానుయేలైన యేసు జననం, దేవుడు మానవజాతిని గానీ దావీదు కుటుంబంతో తాను చేసిన రాజ్య నిబంధనను గానీ మరిచిపోలేదనడానికి సూచన. (లూకా 1:​31-33) అప్పుడు యెహోవా ప్రధాన ప్రతినిధి మానవజాతి మధ్య ఉండగా, మత్తయి నిజంగానే “దేవుడు మనకు తోడై యున్నాడు” అని చెప్పగలిగాడు. ఇప్పుడు, యేసు పరలోక రాజుగా పరిపాలిస్తున్నాడు, ఆయన భూమిపైనున్న తన సంఘంతో ఉన్నాడు. (మత్తయి 28:​20) నిజంగా, “దేవుడు మనకు తోడై యున్నాడు” అని ధైర్యంగా బిగ్గరగా చెప్పడానికి దేవుని ప్రజలకు బలమైన కారణం ఉంది!

అవిశ్వసనీయతకు మరిన్ని పర్యవసానాలు

18. (ఎ) యెషయా చెబుతున్న తర్వాతి మాటలు ఆయన శ్రోతలకు ఎందుకు మహాభీతిని కలిగిస్తాయి? (బి) త్వరలోనే పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాబోతోంది?

18 యెషయా ప్రస్తుత మాటలు ఎంత ఓదార్పుకరంగా ఉన్నప్పటికీ, ఆయన తర్వాతి వ్యాఖ్యానం ఆయన శ్రోతలకు మహాభీతి పుట్టిస్తుంది: “యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపువారి మీదికిని శ్రమ దినములను, ఎఫ్రాయిము యూదానుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును; ఆయన అష్షూరు రాజును నీమీదికి రప్పించును.” (యెషయా 7:​17) అవును, అష్షూరు రాజు నుండి నాశనం వస్తోంది. క్రూరులని పేరుగాంచిన అష్షూరీయులు తమను ఏలబోతున్నారన్న విషయాన్ని బట్టి ఆహాజుకు అతని ప్రజలకు ఎన్నో రాత్రులు నిద్రపట్టకపోయి ఉండవచ్చు. అష్షూరుతో స్నేహం చేస్తే ఇశ్రాయేలు, సిరియాల నుండి తనకు విముక్తి కలుగవచ్చునని ఆహాజు ఆలోచించుకున్నాడు. వాస్తవానికి, ఆహాజు విన్నపానికి ప్రతిస్పందనగా అష్షూరు రాజు చివరికి ఇశ్రాయేలు సిరియాలపై దాడి చేస్తాడు. (2 రాజులు 16:9) అందుకే కావచ్చు పెకహు, రెజీను యెరూషలేము నుండి తమ సైన్యాలను తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తీసుకువెళ్ళవలసి వస్తుంది. అలా, సిరియా-ఇశ్రాయేలు కూటమి యెరూషలేమును స్వాధీనం చేసుకోవడంలో విఫలమవుతుంది. (యెషయా 7:1) అయితే, తమ రక్షకుడని తాము నిరీక్షించిన అష్షూరు రాజే తమను అణగద్రొక్కేవాడవుతాడని యెషయా ఇప్పుడు, దిగ్భ్రమ చెందిన తన ప్రేక్షకులకు చెబుతాడు.​—⁠సామెతలు 29:25 పోల్చండి.

19. ఈ చారిత్రక నాటకంలో నేటి క్రైస్తవుల కోసం ఏ హెచ్చరిక ఉంది?

19 ఈ నిజమైన చారిత్రక వృత్తాంతంలో నేటి క్రైస్తవులకు ఒక హెచ్చరిక ఉంది. మనం ఒత్తిడి క్రింద ఉన్నప్పుడు క్రైస్తవ సూత్రాల విషయంలో రాజీపడిపోయి, యెహోవా కాపుదలను తిరస్కరించే అవకాశం ఉంది. ఇది ముందుచూపు లేని పని, అంతకంటే ఎక్కువగా ఇది ప్రాణాంతకమైనది, ఆ విషయం యెషయా తర్వాతి మాటల్లో స్పష్టమవుతుంది. ఆ తర్వాత ప్రవక్త, అష్షూరీయుల దురాక్రమణ ఆ దేశానికీ దాని ప్రజలకూ ఏమి చేస్తుందో వివరించడం కొనసాగిస్తాడు.

20. ‘జోరీగలు, కందిరీగలు’ ఎవరు, వారేమి చేస్తారు?

20 యెషయా తన ప్రకటనలను నాలుగు భాగాలుగా విభజిస్తున్నాడు, ప్రతి భాగమూ “ఆ దినమున” అంటే అష్షూరు యూదాపై దాడి చేసిన దినమున ఏమి జరుగుతుందో ప్రవచిస్తుంది. “ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరుదేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును. అవి అన్నియు వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోను గడ్డి బీళ్లన్నిటిలోను దిగి నిలుచును.” (యెషయా 7:​18, 19) జోరీగలు, కందిరీగల సైన్యంలా ఐగుప్తు అష్షూరు సైన్యాలు తమ అవధానాన్ని వాగ్దాన దేశంవైపుకు మళ్ళిస్తాయి. ఇది స్వల్పకాలిక దాడి కాదు. ‘జోరీగలు, కందిరీగలు’ దేశ నలుమూలలనూ ఆక్రమిస్తూ అక్కడే ఉంటాయి.

21. అష్షూరు రాజు ఏ విధంగా మంగలకత్తి వలె ఉంటాడు?

21 యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “ఆ దినమున యెహోవా నది (యూఫ్రటీసు) అద్దరినుండి కూలికి వచ్చు మంగలకత్తిచేతను, అనగా అష్షూరు రాజు చేతను తలవెండ్రుకలను కాళ్లవెండ్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డముకూడను గీచివేయును.” (యెషయా 7:​20) ఇప్పుడు ప్రధానంగా ప్రమాదాన్ని తీసుకువచ్చేది, అంటే అష్షూరు మాత్రమే ప్రస్తావించబడింది. ఆహాజు సిరియా ఇశ్రాయేలులకు “క్షౌరము” చేయించడానికి అష్షూరు రాజును కూలికి తెచ్చుకుంటాడు. అయితే, యూఫ్రటీసు ప్రాంతం నుండి ‘కూలికి వచ్చిన ఈ మంగలకత్తి’ యూదా “తల” మీదికి వెళ్లి దాన్ని శుభ్రంగా క్షౌరము చేసేసి, గడ్డము కూడా గీసేస్తుంది.

22. త్వరలో రానున్న అష్షూరు దాడి వల్ల వచ్చే పర్యవసానాలను చూపించడానికి యెషయా ఏ ఉదాహరణలను ఉపయోగించాడు?

22 దాని ఫలితమేమై ఉంటుంది? “ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొఱ్ఱెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును; ఏలయనగా ఈ దేశములో విడువబడిన వారందరును పెరుగు తేనెలను తిందురు.” (యెషయా 7:​21, 22) అష్షూరీయులు దేశాన్ని ‘క్షౌరము’ చేసే సమయానికల్లా, ఎంత కొద్దిమంది ప్రజలు మిగిలి ఉంటారంటే వారికి ఆహారం సమకూర్చడానికి కేవలం కొన్ని జంతువులే చాలు. “పెరుగు తేనెలను” తింటారు అంటే ద్రాక్షారసం గానీ, రొట్టెగానీ మరే ఇతర ముఖ్యాహారం గానీ ఉండవు. భూమి ఎంతమేరకు వ్యర్థంగా వదిలివేయబడుతుందనే దాని స్థాయిని నొక్కి చెప్పడానికన్నట్లుగా, ఒకప్పుడు విలువైన ఫలవంతమైన నేల ఉన్న చోట ఇప్పుడు ముండ్లపొదలు, బలురక్కసి చెట్లు ఉంటాయని యెషయా మూడుసార్లు చెబుతాడు. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లేవారికి, ముండ్లపొదల మాటున దాగివుండే క్రూరమృగాల నుండి కాపుదల కోసం ‘బాణములు, విండ్లు’ అవసరమవుతాయి. పారచేత త్రవ్వబడిన నేలలు ఎద్దులు, గొఱ్రెలు త్రొక్కడానికి ఉపయోగపడతాయి. (యెషయా 7:​23-25) ఈ ప్రవచనం ఆహాజు కాలంలోనే నెరవేరడం మొదలవుతుంది.​—⁠2 దినవృత్తాంతములు 28:20.

కచ్చితమైన ప్రవచనాలు

23. (ఎ) యెషయాకు ఇప్పుడు ఏమి చేయమని ఆజ్ఞాపించబడింది? (బి) పలకమీది సూచన ఎలా ధృవీకరించబడింది?

23 యెషయా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి వైపుకు అవధానాన్ని మళ్ళిస్తున్నాడు. యెరూషలేము ఇంకా సిరియా-ఇశ్రాయేలు కూటమి స్వాధీనంలోనే ఉండగా, యెషయా ఇలా నివేదిస్తున్నాడు: “మరియు యెహోవా​—⁠నీవు గొప్పపలక తీసికొని మహేరు షాలాల్‌ హాష్‌ బజ్‌, అను మాటలు సామాన్యమైన అక్షరములతో దానిమీద వ్రాయుము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను యెబెరెక్యాయు కుమారుడైన జెకర్యాను సాక్షులనుగా పెట్టెదనని నాతో [చెప్పెను.]” (యెషయా 8:​1, 2) మహేరు షాలాల్‌ హాష్‌ బజ్‌ అనే పేరుకు “త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్లపెట్టబడును” అని భావం. యెషయా తాను ఈ పేరును ఒక గొప్పపలకపై వ్రాస్తున్నదానికి సాక్షులుగా సంతకాలు చేయమని సమాజంలోని గౌరవనీయులైన ఇద్దరు వ్యక్తులను అడుగుతాడు, అది ఆ తర్వాత వారు ఆ దస్తావేజు ప్రామాణికతను స్థిరపర్చడాన్ని సాధ్యం చేస్తుంది. అయితే ఈ సంతకాన్ని ధృవీకరించడానికి రెండవ సంతకం కూడా అవసరం.

24. మహేరు షాలాల్‌ హాష్‌ బజ్‌ సూచన యూదా ప్రజలపై ఏ ప్రభావాన్ని చూపించాలి?

24 యెషయా ఇలా చెబుతున్నాడు: “నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని; ఆమె గర్భవతియై కుమారుని కనగా యెహోవా​—⁠అతనికి మహేరు షాలాల్‌ హాష్‌ బజ్‌ అను పేరు పెట్టుము. ఈ బాలుడు​—⁠నాయనా అమ్మా అని అననేరకమునుపు అష్షూరురాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తికొని పోవుదురనెను.” (యెషయా 8:​3, 4) అష్షూరు యూదాను అణగద్రొక్కే సిరియా ఇశ్రాయేలులను త్వరలోనే దోచుకుంటుందనడానికి గొప్పపలక మరియు క్రొత్తగా జన్మించిన బాలుడు సూచనలు. ఎంత త్వరగా దోచుకుంటుంది? ఆ బాలుడు చాలామంది పసివాళ్ళు పలికే తొలిపలుకులైన “నాయనా, అమ్మా” అనే పదాలను పలకడం నేర్చుకోవడానికి ముందే. అలాంటి ఖచ్చితమైన ప్రవచనం ప్రజలకు యెహోవాపై నమ్మకాన్ని పెంచాలి. లేదా అది కొందరు యెషయాను, ఆయన కుమారులను అపహసించేలా చేయగలదు. విషయం ఏదైనప్పటికీ, యెషయా ప్రవచనార్థక మాటలు నిజమవుతాయి.​—⁠2 రాజులు 17:1-6.

25. యెషయా కాలానికి, ప్రస్తుత సమయానికి మధ్య ఎటువంటి పోలికలు ఉన్నాయి?

25 క్రైస్తవులు యెషయా పదే పదే చేసిన హెచ్చరికల నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ఈ చారిత్రక నాటకంలో యెషయా యేసుక్రీస్తుకు, యెషయా కుమారులు యేసు అభిషిక్త శిష్యులకు ముంగుర్తుగా ఉన్నారని అపొస్తలుడైన పౌలు స్పష్టపరిచాడు. (హెబ్రీయులు 2:​10-13) యేసు భూమిపైనున్న తన అభిషిక్త అనుచరుల ద్వారా, ఈ క్లిష్ట సమయాల్లో “మెలకువగా ఉండ”వలసిన అవసరతను నిజ క్రైస్తవులకు గుర్తు చేస్తున్నాడు. (లూకా 21:​34-36) అదే సమయంలో, పశ్చాత్తాపపడని వ్యతిరేకులు రానున్న తమ నాశనాన్ని గూర్చి హెచ్చరింపబడ్డారు, అయితే అలా హెచ్చరించినవారు తరచూ అపహాస్యం చేయబడ్డారు. (2 పేతురు 3:​3, 4) యెషయా కాలంలో కాల-సంబంధిత ప్రవచనాల నెరవేర్పు, మన కాలం కోసమైన దేవుని కాలపట్టిక “తప్పక జరుగును, జాగుచేయక వచ్చును” అనడానికి ఒక హామీగా ఉన్నాయి.​—⁠హబక్కూకు 2:3.

నాశనకరమైన “నీళ్లు”

26, 27. (ఎ) యెషయా ఏ సంఘటనల గురించి ప్రవచించాడు? (బి) యెషయా మాటలు నేడు యెహోవా సేవకులకు ఏమి సూచిస్తాయి?

26 యెషయా తన హెచ్చరికలను ఇలా కొనసాగిస్తున్నాడు: “ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనునుబట్టియు రెమల్యా కుమారునిబట్టియు సంతోషించుచున్నారు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును. అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటిమీదను పొర్లి పారును అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును.”​—యెషయా 8:5-8.

27 “ఈ జనులు” అంటే ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం, యెహోవా దావీదుతో చేసిన నిబంధనను నిరాకరిస్తుంది. (2 రాజులు 17:​16-18) అది వారికి, యెరూషలేముకు నీరు సరఫరా చేసే షిలోహు సన్నని ధారంత బలహీనంగా కనిపిస్తుంది. యూదాపై తాము చేస్తున్న యుద్ధాన్ని బట్టి వారు గర్విస్తారు. కానీ ఈ తిరస్కారం శిక్షించబడకుండా పోదు. అష్షూరీయులు సిరియా-ఇశ్రాయేలులపై “పొర్లిపార”డానికి యెహోవా అనుమతిస్తాడు, ఈ లోకపు ప్రస్తుత రాజకీయ విధానం అబద్ధమత సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి కూడా యెహోవా అలాగే అనుమతిస్తాడు. (ప్రకటన 17:16; దానియేలు 9:​26 పోల్చండి.) తర్వాత, అధికమవుతున్న “నీళ్లు,” ‘యూదా దేశములోనికి పొర్లి ప్రవహించి, కుతికల లోతు’ చేరుతాయి అంటే యూదా శిరస్సు (రాజు) పరిపాలన చేసే యెరూషలేము వరకు వ్యాపిస్తాయి. * అబద్ధమతాన్ని శిక్షించే రాజకీయ తలారీలు మన కాలంలో, యెహోవా సేవకుల ‘కుతికల లోతు’ వరకు వారిని చుట్టుముట్టి వారిపై దాడిచేస్తారు. (యెహెజ్కేలు 38:​2, 10-16) దాని పర్యవసానమేమిటి? యెషయా కాలంలో ఏమి జరుగుతుంది? అష్షూరీయులు నగర గోడలను దాటివచ్చి దేవుని ప్రజలను ముంచివేస్తారా? లేదు. దేవుడు వారికి తోడుగా ఉంటాడు.

భయపడవద్దు​—⁠“దేవుడు మాతోనున్నాడు!”

28. వారి శత్రువులు ఎంత తీవ్రమైన కృషి చేసినప్పటికీ, యెహోవా యూదాకు దేని గురించి హామీ ఇస్తున్నాడు?

28 యెషయా ఇలా హెచ్చరిస్తున్నాడు: “[దేవుని నిబంధన ప్రజలకు వ్యతిరేకులైన] జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. ఆలోచన చేసికొనినను [మేధాశక్తిని ఉపయోగించినా] అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు.” (యెషయా 8:​9, 10) కొన్ని సంవత్సరాల తర్వాత, ఆహాజు నమ్మకమైన కుమారుడు హిజ్కియా పరిపాలనలో ఈ మాటలు నెరవేరుతాయి. అష్షూరీయులు యెరూషలేముకు ప్రమాదాన్ని తెచ్చినప్పుడు, యెహోవా దూత వారిలో 1,85,000 మందిని హతమారుస్తాడు. దేవుడు తన ప్రజలతోనూ దావీదు రాజవంశముతోనూ ఉన్నాడని స్పష్టమవుతుంది. (యెషయా 37:​33-37) రానున్న అర్మగిద్దోను యుద్ధ సమయంలో, తన శత్రువులను ముక్కచెక్కలుగా పగులగొట్టడానికే కాదు తనపై నమ్మకముంచే వారందరినీ కాపాడడానికి కూడా యెహోవా గొప్ప ఇమ్మానుయేలును పంపిస్తాడు.​—⁠కీర్తన 2:2, 9, 12.

29. (ఎ) ఆహాజు కాలంనాటి యూదులకూ, హిజ్కియా కాలంనాటి యూదులకూ ఉన్న తేడా ఏమిటి? (బి) యెహోవా సేవకులు నేడు మతపరమైన రాజకీయపరమైన సంధి కుదుర్చుకోవడాన్ని ఎందుకు నివారిస్తారు?

29 హిజ్కియా కాలంలోని యూదుల్లా, ఆహాజు సమకాలీనులకు యెహోవా కాపుదలయందు విశ్వాసం లేదు. వారు సిరియా-ఇశ్రాయేలు కూటమికి వ్యతిరేకంగా ఒక కోటగోడలా అష్షూరీయులతో సంధి లేక “బందుకట్టు” కుదుర్చుకోవాలనుకుంటారు. అయితే, “ఈ జనుల మార్గము”కు వ్యతిరేకంగా లేక సామాన్య ప్రజాధోరణికి వ్యతిరేకంగా మాట్లాడేలా యెహోవా “బహుబలముగా” యెషయాను పురికొల్పుతాడు. ఆయనిలా హెచ్చరిస్తున్నాడు: “వారు భయపడుదానికి భయపడకుడి దానివలన దిగులుపడకుడి. సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులుపడవలెను.” (యెషయా 8:​11-13) దీన్ని మనస్సులో ఉంచుకొని యెహోవా సేవకులు నేడు, మత సమితులతో రాజకీయ కూటమిలతో బందుకట్టు కుదుర్చుకోకుండా లేక వాటిపై తమ నమ్మకాన్ని పెట్టకుండా జాగ్రత్త వహిస్తారు. యెహోవా సేవకులకు, దేవుని రక్షణశక్తిపై సంపూర్ణ నమ్మకం ఉంది. ఎంతైనా, ‘యెహోవా మన పక్షమున ఉంటే, నరులు మనకేమి చేయగలరు?’​—⁠కీర్తన 118:6.

30. యెహోవాపై నమ్మకముంచని వారి గతి ఎలా ఉంటుంది?

30 యెహోవా తనపై నమ్మకం ఉంచేవారికి “తగులురాయిగా,” రక్షణగా ఉంటాడని యెషయా పదే పదే చెబుతున్నాడు. దానికి భిన్నంగా, ఆయనను తిరస్కరించేవారు “తొట్రిల్లుచు పడి కాళ్లు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు”​—⁠ఈ ఐదు క్రియాపదాలు యెహోవాపై నమ్మకముంచని వారి గతిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. (యెషయా 8:​14, 15) మొదటి శతాబ్దంలో, యేసును నిరాకరించినవారు అలాగే తొట్రిల్లి పడిపోయారు. (లూకా 20:​17, 18) సింహాసనాసీనుడైన పరలోక రాజైన యేసుపట్ల నమ్మకంగా ఉండనివారి కోసం అటువంటి పర్యవసానమే వేచివుంది.​—⁠కీర్తన 2:5-9.

31. నిజక్రైస్తవులు నేడు యెషయా మాదిరిని, ఆయన బోధను వినేవారి మాదిరిని ఎలా అనుసరించవచ్చు?

31 యెషయా కాలంలో అందరూ తొట్రుపడలేదు. యెషయా ఇలా చెబుతున్నాడు: “ఈ ప్రమాణవాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యుల కప్పగింపుము. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసికొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచుచున్నాను ఆయనకొరకు నేను కనిపెట్టుచున్నాను.” (యెషయా 8:​16, 17) యెషయాగానీ, ఆయన బోధను వినేవారుగానీ దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టరు. అపరాధులైన జనులు యెహోవాపై నమ్మకముంచడానికి నిరాకరించి, యెహోవా తమవైపు నుండి ముఖం మరుగుచేసుకొనేలా చేసుకొన్నప్పటికీ వారు మాత్రం యెహోవాపై నమ్మకముంచుతారు. యెహోవాపై నమ్మకముంచేవారి ఉదాహరణను అనుసరిస్తూ, స్వచ్ఛారాధనను హత్తుకొని ఉండాలనే నిశ్చయాన్ని మనం కలిగివుందాం!​—⁠దానియేలు 12:4, 9; మత్తయి 24:45; హెబ్రీయులు 6:11, 12 పోల్చండి.

“సూచనలు,” “మహత్కార్యములు”

32. (ఎ) నేడు ఎవరు “సూచనలుగాను, మహత్కార్యములుగాను” ఉన్నారు? (బి) క్రైస్తవులు లోకం నుండి భిన్నంగా ఎందుకుండాలి?

32 యెషయా ఇప్పుడిలా ప్రకటిస్తున్నాడు: “ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యముల కధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.” (యెషయా 8:​18) అవును, యెషయా, షెయార్యాషూబు, మహేరు షాలాల్‌ హాష్‌ బజ్‌ ఈ ముగ్గురూ యూదాపట్ల యెహోవాకుగల సంకల్పాలకు సూచనలుగా ఉన్నారు. నేడు, యేసు, ఆయన అభిషిక్త సహోదరులు అలాగే సూచనలుగా ఉన్నారు. (హెబ్రీయులు 2:​11-13) వారి పనిలో వారితోపాటు “వేరే గొఱ్ఱెల” “ఒక గొప్ప సమూహము” కూడా కలుస్తుంది. (ప్రకటన 7:9, 14; యోహాను 10:​16) సూచన అనేది దాని పరిసరాల నుండి ప్రత్యేకంగా కనబడితేనే దానికి విలువుంటుంది. అలాగే, క్రైస్తవులు యెహోవాపై పూర్తి నమ్మకం ఉంచి, ఆయన సంకల్పాలను ధైర్యంగా ప్రకటిస్తూ ఈ లోకం నుండి భిన్నంగా కనిపిస్తేనే వారు సూచనలుగా తమ నియామకాన్ని నెరవేర్చినవారవుతారు.

33. (ఎ) నిజ క్రైస్తవులు ఏమి చేయాలని నిశ్చయించుకున్నారు? (బి) నిజ క్రైస్తవులు ఎందుకు దృఢంగా నిలబడగలుగుతారు?

33 కాబట్టి మనమందరం ఈ లోక ప్రమాణాలను కాదుగానీ దేవుని ప్రమాణాలను అనుసరిద్దాం. “హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు” గొప్ప యెషయా అయిన యేసుక్రీస్తుకు ఇవ్వబడిన నియామకాన్ని నెరవేరుస్తూ, సూచనలుగా ధైర్యంగా భిన్నంగా నిలబడడంలో కొనసాగుదాం. (యెషయా 61:1, 2; లూకా 4:​17-21) నిజానికి, అష్షూరు వరదలు భూమి అంతటా ప్రవహించినప్పుడు, అది మన కుతికల వరకు వచ్చినా నిజ క్రైస్తవులు కొట్టుకొనిపోరు. ‘దేవుడు మనతో ఉన్నాడు’ గనుక మనం దృఢంగా నిలబడతాము.

[అధస్సూచీలు]

^ ఈ ప్రవచన నేర్పుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 1, 62 మరియు 758 పేజీలను చూడండి.

^ ‘నీ దేశవైశాల్యమంతటను వ్యాపించేలా’ రెక్కలు చాపిన పక్షితో కూడా అష్షూరు పోల్చబడింది. కాబట్టి, దేశం ఎటువైపు విస్తరించినా, అష్షూరు సైన్యాలు దాన్ని ఆక్రమిస్తాయి.

[అధ్యయన ప్రశ్నలు]

[103 వ పేజీలోని చిత్రం]

యెషయా ఆహాజుకు యెహోవా సందేశాన్ని అందజేయడానికి వెళ్లినప్పుడు షెయార్యాషూబును తనతో తీసుకువెళ్లాడు

[111 వ పేజీలోని చిత్రం]

యెషయా గొప్పపలక మీద “మహేరు షాలాల్‌ హాష్‌ బజ్‌” అని ఎందుకు వ్రాశాడు?