కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“బబులోను కూలెను!”

“బబులోను కూలెను!”

పదిహేడవ అధ్యాయం

“బబులోను కూలెను!”

యెషయా 21:1-17

1, 2. (ఎ) బైబిల్లోని సమగ్రమైన ఇతివృత్తం ఏమిటి, కానీ యెషయా గ్రంథములో ఏ ప్రాముఖ్యమైన సహాయక ఇతివృత్తం కనిపిస్తుంది? (బి) బబులోను కూలిపోవడం గురించిన ఇతివృత్తాన్ని బైబిలు ఎలా అంచెలంచెలుగా తెలియజేస్తుంది?

 బైబిలు ఒక ప్రధాన ఇతివృత్తంగల పాటలాంటిది, అందులో పల్లవితో పాటు పలు చరణాలున్నప్పటికీ ఈ పల్లవీ, చరణాలూ పాటలోని ప్రధాన ఇతివృతాన్ని ఉన్నతపరుస్తాయి. అదేవిధంగా బైబిలులో కూడా ఒక ప్రధాన ఇతివృత్తం ఉంది, అది మెస్సీయ రాజ్య ప్రభుత్వం ద్వారా యెహోవా సర్వోన్నతాధిపత్యాన్ని నిరూపించడమే. అలాగే దానిలో పదేపదే ప్రస్తావనకు వచ్చే ఇతర ఇతివృత్తాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒక ఇతివృత్తం బబులోను కూలిపోవడం.

2 ఈ ఇతివృత్తం యెషయా 13, 14 అధ్యాయాల్లో పరిచయం చేయబడింది. అది 21 వ అధ్యాయంలోనూ, మళ్లీ 44, 45 అధ్యాయాల్లోనూ పునరావృతమవుతుంది. ఒక శతాబ్దం తర్వాత, యిర్మీయా అదే ఇతివృత్తాన్ని మరింత విపులంగా తెలియజేస్తాడు, ఇక ప్రకటన గ్రంథము ఆ ఇతివృత్తాన్ని మహాద్భుతమైన ముగింపుకు తెస్తుంది. (యిర్మీయా 51:60-64; ప్రకటన 18:1–19:4) యథార్థవంతుడైన ప్రతి బైబిలు విద్యార్థీ దేవుని వాక్యంలోని ఈ ప్రాముఖ్యమైన సహాయక ఇతివృత్తం పట్ల శ్రద్ధ కలిగివుండవలసిన అవసరం ఉంది. యెషయా 21 వ అధ్యాయం ఈ విషయంలో సహాయం చేస్తుంది, ఎందుకంటే ప్రవచింపబడిన విధంగా ఆ గొప్ప ప్రపంచశక్తి కూలిపోవడం గురించి అత్యంత ఆసక్తికరమైన వివరాలను ఆ అధ్యాయం అందజేస్తుంది. తర్వాత, యెషయా 21 వ అధ్యాయం మరొక ప్రాముఖ్యమైన బైబిలు ఇతివృత్తాన్ని అంటే నేడు క్రైస్తవులుగా మనమెంత జాగ్రత్తగా ఉన్నామన్న విషయాన్ని మదింపు చేసుకునేందుకు సహాయంచేసే ఇతివృత్తాన్ని నొక్కిచెప్పడం మనం చూస్తాం.

“కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము”

3. బబులోను “సముద్రతీరముననున్న అడవి” అని ఎందుకు పేర్కొనబడింది, దాని భవిష్యత్తుకు సంబంధించి ఆ పేరు ఏమి సూచిస్తోంది?

3 యెషయా 21 వ అధ్యాయం ఈ అశుభసూచక వ్యాఖ్యతో ప్రారంభమవుతుంది: “సముద్రతీరముననున్న అడవిదేశమును గూర్చిన దేవోక్తి​—⁠దక్షిణదిక్కున సుడిగాలి విసరునట్లు, అరణ్యమునుండి భీకరదేశమునుండి అది వచ్చుచున్నది.” (యెషయా 21:1) బబులోను యూఫ్రటీసు నదికి ఇరువైపులా వ్యాపించివుంది, దాని ప్రాచ్య అర్థభాగం యూఫ్రటీసు, టైగ్రీస్‌ అనే రెండు పెద్ద నదుల మధ్యనున్న ప్రాంతంలో ఉంది. అది అసలు సముద్రం నుండి కాస్త దూరంలో ఉంది. మరి అది “సముద్రతీరముననున్న అడవి” అని ఎందుకు పిలువబడింది? ఎందుకంటే, బబులోను ప్రాంతం ప్రతి సంవత్సరం వరదలకు గురయ్యేది, తత్ఫలితంగా విస్తృతమైన, బురదమయమైన ‘సముద్రము’ ఏర్పడేది. అయితే బబులోనీయులు కందకాలు, నీటితూములు, కాలవలతో కూడిన సంకీర్ణమైన విధానాన్ని రూపొందించుకోవడం ద్వారా ఈ బురదమయమైన అడవిని అదుపుచేయ గలిగారు. వారు నేర్పుగా ఈ నీటిని నగరానికి భద్రత చేకూర్చుకొనేందుకు ఉపయోగించుకొన్నారు. అయినప్పటికీ, ఏ మానవ ప్రయత్నాలూ బబులోనును దైవిక తీర్పు నుండి రక్షించలేవు. అది అడవిగానే ఉండింది​—⁠మళ్లీ అది అడవిగానే మారుతుంది. ఇశ్రాయేలుకు దక్షిణానవున్న భయంకరమైన అడవి నుండి కొన్నిసార్లు ఇశ్రాయేలుపైకి వీచే తీవ్రమైన తుఫాను గాలుల్లా చెలరేగుతూ విపత్తు ముంచుకొస్తోంది.​—⁠జెకర్యా 9:14 పోల్చండి.

4. ప్రకటన గ్రంథములోని “మహా బబులోను”ను గురించిన దర్శనంలో “జలము”లు, “అరణ్యము” ఎలా ఇమిడివున్నాయి, “జలము”లంటే ఏమిటి?

4 మనం ఈ పుస్తకంలోని 14 వ అధ్యాయంలో తెలుసుకున్నట్లుగా, ప్రాచీన బబులోనుకు ఒక ఆధునిక ప్రతిరూపం ఉంది, అది ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహా బబులోను.” ప్రకటన గ్రంథములో, మహా బబులోను కూడా అలాగే “అరణ్యము,” “జలముల” సంబంధంగా వర్ణించబడింది. మహా బబులోనును చూపించేందుకు అపొస్తలుడైన యోహానును ఒక అరణ్యానికి కొనిపోవడం జరిగింది. “ప్రజలను, జనసమూహములను, జనములను ఆ యా భాషలు మాటలాడువారిని” సూచిస్తున్న “విస్తార జలములమీద” ఆమె ‘కూర్చుంటుందని’ ఆయనకు చెప్పబడింది. (ప్రకటన 17:​1-3, 5, 15) అబద్ధమతం మనుగడ సాగించడానికి ప్రజా మద్దతే ఎప్పుడూ కీలకంగా పనిచేసింది, కానీ అలాంటి “జలము”లు అంతంలో దాన్ని కాపాడవు. తన ప్రాచీన ప్రతిరూపంలాగే అది ఖాళీ అయిపోతుంది, నిర్లక్ష్యం చేయబడుతుంది, నిర్జనమవుతుంది.

5. బబులోను “మోసము చేయు” దానిగా, “దోచుకొను” దానిగా ఎలా పేరు పొందుతుంది?

5 యెషయా కాలంలో బబులోను అప్పటికింకా ప్రబలమైన ప్రపంచ శక్తి కాలేదు, కానీ దాని సమయం వచ్చినప్పుడు అది తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని యెహోవా ముందే చూస్తాడు. యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడియున్నది. మోసము చేయువారు మోసముచేయుదురు దోచుకొనువారు దోచుకొందురు.” (యెషయా 21:2) నిజంగానే బబులోను యూదాతో సహా, తాను జయించిన రాజ్యాలను దోచుకొని, వాటిని మోసం చేస్తుంది. బబులోనీయులు యెరూషలేమును లూటీ చేసి, దాని ఆలయాన్ని కొల్లగొట్టి, దాని నివాసులను బబులోనుకు బంధీలుగా తీసుకువెళతారు. అక్కడ, నిస్సహాయులైన ఈ బంధీలతో మోసంగా వ్యవహరించడం జరుగుతుంది, వారు తమ విశ్వాసాన్ని బట్టి అపహాస్యం చేయబడతారు, తమ స్వదేశానికి తిరిగి వచ్చే ఏ ఆశా వారికి ఇవ్వబడదు.​—⁠2 దినవృత్తాంతములు 36:17-21; కీర్తన 137:1-4.

6. (ఎ) యెహోవా ఏ నిట్టూర్పు మాన్పుతాడు? (బి) బబులోనుపై ఏ రాజ్యాలు దాడిచేస్తాయని ప్రవచించబడింది, ఇది ఎలా నెరవేరింది?

6 అవును, బబులోనుకు కష్టకాలాలు వస్తాయని సూచించే ఈ “కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము” దానికి పూర్తిగా తగినది. యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “ఏలామూ, బయలుదేరుము! మాద్యా, ముట్టడివేయుము! వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను.” (యెషయా 21:2బి) ఈ మోసకరమైన సామ్రాజ్యంచే అణచివేయబడినవారికి ఉపశమనం లభిస్తుంది. చివరికి, వారి నిట్టూర్పు ఆగుతుంది! (కీర్తన 79:​11, 12) ఈ ఉపశమనం ఏ మూలం నుండి వస్తుంది? బబులోనుపై దాడి చేసే రెండు రాజ్యాల పేర్లు యెషయా చెబుతున్నాడు: ఏలాము, మాద్య. రెండు శతాబ్దాల తర్వాత, అంటే సా.శ.పూ. 539 లో, పారసీక దేశస్థుడైన కోరేషు తన నాయకత్వం క్రింద మాదీయ పారసీక సంకీర్ణ సైన్యాలను బబులోను మీదికి తీసుకువస్తాడు. ఏలాము విషయానికి వస్తే, పారసీక చక్రవర్తులు సా.శ.పూ. 539కు ముందే ఆ రాజ్యంలోని కనీసం కొంత భాగాన్ని జయించి ఉంటారు. * కాబట్టి పారసీక సైన్యాల్లో ఏలామీయులు కూడా ఉన్నారు.

7. యెషయా చూసిన దర్శనం ఆయనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, అది దేన్ని సూచిస్తుంది?

7 ఈ దర్శనం తనపై చూపిన ప్రభావాన్ని యెషయా ఎలా వర్ణిస్తున్నాడో గమనించండి: “కావున నా నడుము బహు నొప్పిగానున్నది. ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టియున్నది. బాధచేత నేను వినలేకుండ నున్నాను; విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది; మహా భయము నన్ను కలవరపరచుచున్నది. నా కిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను.” (యెషయా 21:​3, 4) ప్రవక్తకు బహుశా ప్రశాంతమైన ధ్యానానికి ఎంతో చక్కని సమయమైన సంధ్యవేళ ఇష్టమున్నట్టుంది. కానీ మునిమాపువేళ ఇప్పుడు తన అందం కోల్పోయి, కేవలం భయం, బాధ, తీవ్రాందోళన కలిగిస్తోంది. ఆయన ప్రసవించే స్త్రీలా వేదనపడుతున్నాడు, ఆయన గుండె “తటతట కొట్టుకొనుచున్నది.” ఒక పండితుడు, ఈ వ్యక్తీకరణ, “జ్వరతీవ్రతతో, నాడి క్రమరహితంగా కొట్టుకోవడాన్ని” సూచిస్తుందని పేర్కొంటూ, ఈ పదబంధాన్ని “నా గుండె వేగంగా కొట్టుకుంటోంది” అని అనువదిస్తున్నాడు. ఎందుకంత చింత? యెషయా భావాలు ప్రవచనార్థకమైనవని తెలుస్తోంది. బబులోనీయులు సా.శ.పూ. 539 అక్టోబరు 5/6 రాత్రి అలాంటి మహాభీతినే అనుభవిస్తారు.

8. ప్రవచింపబడినట్లుగా, తమ శత్రువులు గోడల వెలుపల ఉన్నప్పటికీ బబులోనీయులు ఎలా ప్రవర్తిస్తారు?

8 ఆ అశుభకరమైన రాత్రి చీకటి కమ్ముతుండగా, మహాభీతిని గురించిన తలంపు కూడా బబులోనీయుల మనస్సుల్లోకి రాదు. దాదాపు రెండు శతాబ్దాలు ముందుగానే, యెషయా ఇలా ప్రవచిస్తున్నాడు: “వారు భోజనపు బల్లను సిద్ధము చేయుదురు, తివాసీలు పరతురు [“ఆసనములు వేయుదురు,” NW] అన్నపానములు పుచ్చుకొందురు.” (యిషయా 21:5) అవును, అహంభావియైన బెల్షస్సరు రాజు ఒక విందు ఏర్పాటు చేస్తున్నాడు. అతని అధిపతుల్లో వెయ్యిమంది, అతని అనేకమంది భార్యలు, అతని ఉపపత్నులు ఆసీనులయ్యేందుకు ఆసనములు వేయబడ్డాయి. గోడల వెలుపల సైన్యం ఉందని విందు చేసుకుంటున్నవారికి తెలుసు, అయినా తమ నగరం దుర్భేద్యమైనదని వాళ్ల నమ్మకం. దాని భారీ గోడలు, లోతైన కందకము దాన్ని స్వాధీనం చేసుకోవడం అసాధ్యం అనిపించేలా చేస్తాయి; అనేకమైన దాని దేవుళ్లు కనీసం ఆ తలంపు కూడా అసాధ్యం అనిపించేలా చేస్తారు. కాబట్టి “అన్నపానములు పుచ్చుకొందురు.” బెల్షస్సరు త్రాగి మత్తుడవుతాడు, అలా మత్తుడయ్యేది బహుశా అతడొక్కడే కాదు. ఉన్నతాధికారులు ఒళ్లుతెలియని స్థితిలో ఉన్నారన్న విషయం, వారిని మేల్కొల్పవలసిన పరిస్థితి ఏర్పడడాన్ని బట్టి తెలుస్తుంది, యెషయా తర్వాతి మాటలు ప్రవచనార్థకంగా ఈ విషయాన్ని చూపిస్తున్నాయి.

9. ‘కేడెముకు చమురు రాయవలసిన’ అవసరత ఎందుకు ఏర్పడుతుంది?

9 “అధిపతులారా, లేచి కేడెములకు చమురురాయుడి.” (యెషయా 21:5) హఠాత్తుగా విందు ఆగిపోయింది. అధిపతులు మత్తు వదిలించుకోవాలి! వృద్ధ ప్రవక్తయైన దానియేలు అక్కడికి పిలిపించబడ్డాడు. ఆయన, యెషయా వర్ణించినలాంటి మహాభీతి స్థితిలోకి బబులోను రాజైన బెల్షస్సరును యెహోవా ఎలా పడేస్తాడో చూస్తాడు. మాదీయ, పారసీక, ఏలాముల సంకీర్ణ సైన్యాలు నగర భద్రతా ఏర్పాట్లను ఛేదించుకొని లోపలికి రావడం చూసి రాజు అధిపతులు అయోమయంలో పడిపోతారు. బబులోను వెంటనే కూలిపోతుంది! అయితే, ‘కేడెముకు చమురు రాయడం’ అంటే ఏమిటి? ఒక రాజ్యానికి రాజే రక్షకుడు, ఆయనే దేశాన్ని పరిరక్షిస్తాడు గనుక బైబిలు కొన్నిసార్లు రాజును కేడెముగా పేర్కొంటుంది. * (కీర్తన 89:​18) కాబట్టి యెషయా గ్రంథములోని ఈ వచనం, బహుశా ఒక క్రొత్త రాజు అవసరతను ప్రవచిస్తుండవచ్చు. ఎందుకు? ఎందుకంటే బెల్షస్సరు “ఆ రాత్రియందే” చంపబడ్డాడు. కాబట్టి, ‘కేడెముకు చమురు రాయవలసిన’ లేక క్రొత్త రాజును నియుక్తుడ్ని చేయవలసిన అవసరం ఉంది.​—⁠దానియేలు 5:1-9, 30.

10. మోసకారిని గురించిన యెషయా ప్రవచన నెరవేర్పు నుండి యెహోవా ఆరాధకులు ఏ ఓదార్పును పొందవచ్చు?

10 సత్యారాధనను ప్రేమించేవారందరూ ఈ వృత్తాంతం నుండి ఓదార్పును పొందుతారు. ఆధునిక-దిన బబులోను అయిన మహా బబులోను తన ప్రాచీన ప్రతిరూపమంత మోసకరమైనదే, దోచుకునేదే. ఈనాటికీ మతనాయకులు యెహోవాసాక్షులను నిషేధించడానికీ, హింసించడానికీ, లేక వారిపై శిక్షాత్మక పన్నులు విధించడానికీ కుట్ర పన్నుతున్నారు. కానీ ఈ ప్రవచనం మనకు గుర్తు చేస్తున్నట్లుగా, యెహోవా అలాంటి మోసకరమైన వ్యవహారాలన్నింటినీ చూస్తాడు, ఆయన దానికి తగిన శిక్ష విధించక మానడు. ఆయనకు తప్పుగా ప్రాతినిధ్యం వహిస్తూ, ఆయన ప్రజలతో చెడుగా వ్యవహరిస్తున్న అన్ని మతాలనూ ఆయన అంతమొందిస్తాడు. (ప్రకటన 18:8) అలాంటిది సాధ్యమేనా? మన విశ్వాసం బలపడాలంటే, ప్రాచీన బబులోను దాని ఆధునిక-దిన ప్రతిరూపము కూలిపోవడం గురించిన ఆయన హెచ్చరికలు ఇప్పటికే ఎలా నెరవేరుతున్నాయో మనం చూడవలసిందే.

“బబులోను కూలెను!”

11. (ఎ) కావలివాని బాధ్యత ఏమిటి, నేడు ఎవరు కావలివానిలా చురుగ్గా ఉన్నారు? (బి) గాడిదలు ఒంటెల వరుసలు వేటిని సూచిస్తున్నాయి?

11 యెహోవా ఇప్పుడు ప్రవక్తతో మాట్లాడతాడు. యెషయా ఇలా నివేదిస్తున్నాడు: “ప్రభువు నాతో ఇట్లనెను​—⁠నీవు వెళ్లి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను.” (యెషయా 21:6) ఈ మాటలు ఈ అధ్యాయంలోని మరో ప్రాముఖ్యమైన, కావలివాని గురించిన ఇతివృత్తాన్ని పరిచయం చేస్తున్నాయి. ఇది నేటి నిజ క్రైస్తవులందరికీ ఆసక్తిగల విషయం, ఎందుకంటే “మెలకువగా నుండుడి” అని యేసు తన అనుచరులకు ఉద్బోధించాడు. దేవుని తీర్పుదినం సమీపించడాన్ని గురించీ, ఈ భ్రష్ట లోకపు ప్రమాదాల గురించీ ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ తనకు కనిపిస్తున్నదాన్ని తెలియజేయడం ఎన్నడూ మానలేదు. (మత్తయి 24:​42, 45-47) యెషయా దర్శనంలోని కావలివాడు ఏమి చూస్తాడు? “జతజతలుగా వచ్చు రౌతులును వరుసలుగా వచ్చు గాడిదలును వరుసలుగా వచ్చు ఒంటెలును అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి చూచును.” (యిషయా 21:7) ఈ రౌతులు బహుశా సుశిక్షిత అశ్వాల వేగంతో యుద్ధసన్నద్ధమై ముందుకు సాగుతున్న రథముల బారులను సూచిస్తుండవచ్చు. గాడిదలు ఒంటెల వరుసలు, ఈ దాడి చేయడానికి ఐక్యమయ్యే రెండు శక్తులను అంటే మాద్య పారసీక రాజ్యాలను సముచితంగానే సూచిస్తుండవచ్చు. అంతేగాక, పారసీక సైన్యం యుద్ధంలో గాడిదలను, ఒంటెలను ఉపయోగించేదని చరిత్ర ధృవీకరిస్తోంది.

12. యెషయా దర్శనంలోని కావలివాడు ఏ లక్షణాలను చూపిస్తాడు, నేడు ఈ లక్షణాలు ఎవరికి అవసరం?

12 ఇప్పుడు, కావలివాడు ఒక నివేదిక ఇచ్చేలా పురికొల్పబడ్డాడు. “సింహము గర్జించునట్టు కేకలు వేసి​—⁠నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయుచున్నాను. ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను.” (యిషయా 21:8, 9) దర్శనంలోని కావలివాడు ధైర్యంగా “సింహము గర్జించునట్టు” కేకలు వేస్తాడు. బబులోనంతటి అజేయమైన ప్రబలమైన రాజ్యానికి వ్యతిరేకంగా తీర్పు సందేశాన్ని ప్రకటించడానికి ఎంతో ధైర్యం అవసరం. అంతేగాక మరొకటి కూడా అవసరం, అదే సహనం. కావలివాడు రాత్రింబగళ్లు తన కావలి బురుజుపైనే ఉండి, ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటాడు. అలాగే, ఈ అంత్యదినాల్లో కావలివాని తరగతికి ధైర్యం, సహనం అవసరమయ్యాయి. (ప్రకటన 14:​12) నిజక్రైస్తవులందరికీ ఈ లక్షణాలు అవసరం.

13, 14. (ఎ) ప్రాచీన బబులోను ఏమి అనుభవించింది, దాని విగ్రహాలు ఏ భావంలో విరుగగొట్టబడ్డాయి? (బి) మహా బబులోను కూడా అదేవిధంగా ఎలా, ఎప్పుడు కూలిపోయింది?

13 యెషయా దర్శనంలోని కావలివాడు ముందుకు సాగుతున్న రౌతులను చూస్తాడు. విషయం ఏమిటి? అతడు, “బబులోను కూలెను కూలెను, దాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలను పడవేసియున్నాడు, ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అని చెప్పుచు వచ్చెను.” (యిషయా 21:9బి) ఎంత ఉత్తేజకరమైన సమాచారం! చివరికి, దేవుని ప్రజలను దోచుకునే ఈ మోసకారి కూలెను! * అయితే బబులోను విగ్రహములు, ప్రతిమలు ఏ భావంలో విరుగగొట్టబడ్డాయి? మాదీయ పారసీక ఆక్రమణదారులు బబులోను ఆలయాల్లోకి ప్రవేశించి, అసంఖ్యాకమైన విగ్రహాలను పగులగొడతారా? లేదు, అటువంటిదేమీ అవసరం లేదు. బబులోను విగ్రహ దేవుళ్లు నగరాన్ని కాపాడలేకపోయినప్పుడు వాటి అశక్తత బయటపడడంతో అవి విరుగగొట్టబడినట్లే అవుతుంది. బబులోను దేవుని ప్రజలను అణచివేయడంలో కొనసాగలేకపోయినప్పుడు, అది కూలుతుంది.

14 మహా బబులోను విషయం ఏమిటి? మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దేవుని ప్రజలను అణచివేయడానికి కుట్ర పన్నడం ద్వారా, అది వారిని కొంతకాలంపాటు చెరలో ఉంచగలిగింది. వారి ప్రకటనా పని దాదాపుగా ఆగిపోయింది. వాచ్‌టవర్‌ సంస్థ అధ్యక్షుడు, మరితర ప్రముఖ అధికారులు అబద్ధ ఆరోపణలతో జైల్లో వేయబడ్డారు. కానీ 1919 వ సంవత్సరం విభ్రాంతి కలిగించే మార్పును చూసింది. అధికారులు జైలు నుండి విడుదల చేయబడ్డారు, ప్రధాన కార్యాలయం తిరిగి తెరువబడింది, ప్రకటనా పని పునఃప్రారంభించబడింది. కాబట్టి, మహా బబులోను కూలిపోయింది, అంటే దేవుని ప్రజలపై దాని పట్టు సడలించబడింది. * ఈ కూలిపోవడాన్ని గురించి ప్రకటన గ్రంథంలో ఒక దూత, యెషయా 21:9 వ వచనంలో ఉన్న ప్రకటనలోని మాటలను ఉపయోగిస్తూ రెండుసార్లు ప్రకటించాడు.​—⁠ప్రకటన 14:8; 18:2.

15, 16. యెషయా సొంత ప్రజలు ఏ భావంలో ‘నూర్చిన ధాన్యము’ అవుతారు, యెషయాకు వారిపట్లగల దృక్పథం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

15 యెషయా ఈ ప్రవచన సందేశాన్ని, తన సొంత ప్రజలపట్ల కనికరంతో కూడిన ఒక చిన్న వ్యాఖ్యతో ఇలా ముగిస్తున్నాడు: “నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చబడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పియున్నాను.” (యెషయా 21:​10) బైబిలులో, నూర్చడమన్నది తరచుగా దేవుని ప్రజలను క్రమశిక్షణలోపెట్టడాన్నీ, వారిని శుద్ధీకరించడాన్నీ సూచిస్తుంది. దేవుని నిబంధన ప్రజలు, గోధుమల నుండి పొట్టు బలవంతంగా వేరుచేయబడి కేవలం శుద్ధిచేయబడిన లేక అవసరమైన ధాన్యం మాత్రమే మిగిలే ‘కళ్లములో నూర్చబడినవారవుతారు.’ ఇలా ఇవ్వబడే క్రమశిక్షణను బట్టి యెషయా ఏమీ సంతోషించడం లేదు. బదులుగా, ఈయనకు భవిష్యత్తులో ‘కళ్లములో నూర్చబడెడి’ వీరిపట్ల కనికరం ఉంది, వీరిలో కొందరు వారి మొత్తం జీవితాలను పరాయిదేశంలో బంధీలుగా గడుపుతారు.

16 ఇది మనకందరికీ ఒక ఉపయోగకరమైన జ్ఞాపికగా పనిచేయవచ్చు. నేడు క్రైస్తవ సంఘంలో, కొందరు తప్పిదస్థులపట్ల కనికరం లేనివారిగా తయారయ్యేందుకు మొగ్గుచూపవచ్చు. క్రమశిక్షణలోపెట్టబడేవారు తరచూ దాన్ని అయిష్టపడేందుకు మొగ్గుచూపవచ్చు. అయితే, యెహోవా తన ప్రజలను శుద్ధిచేయడానికే వారిని క్రమశిక్షణలోపెడతాడని మనస్సులో ఉంచుకుంటే మనం క్రమశిక్షణనూ, వినయంగా దాన్ని పొందుతున్నవారినీ చిన్నచూపుచూడము, అంతేగాక మనకు క్రమశిక్షణ ఇవ్వబడుతున్నప్పుడు దాన్ని ఎదిరించము. దైవిక క్రమశిక్షణను మనం దేవుని ప్రేమకు వ్యక్తీకరణగా అంగీకరిద్దాం.​—⁠హెబ్రీయులు 12:4-6.

కావలివానిని విచారించడం

17. ఏదోము “దూమా” అని ఎందుకు తగినవిధంగానే పిలువబడింది?

17 యెషయా 21 వ అధ్యాయంలోని రెండవ ప్రవచన సందేశం కావలివాని వైపు అవధానాన్ని మళ్ళిస్తుంది. అదిలా ప్రారంభమవుతుంది: “దూమానుగూర్చిన దేవోక్తి​—⁠కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు.” (యెషయా 21:​11) ఈ దూమా ఎక్కడుంది? బైబిలు కాలాల్లో ఈ పేరుతో అనేక పట్టణాలు ఉన్నట్లు తెలుస్తుంది, కానీ ఇక్కడ చెప్పబడినది వాటిలో ఏదీ కాదు. దూమా శేయీరులో లేదు, శేయీరు, ఏదోముకు మరో పేరు. అయితే, “దూమా” అంటే ‘మౌనం’ అని భావం. కాబట్టి, మునుపటి దేవోక్తిలోలాగే, ఈ ప్రాంతానికి కూడా దాని భవిష్యత్తును సూచించే పేరు ఇవ్వబడినట్లు అనిపిస్తుంది. ఎంతోకాలంగా దేవుని ప్రజలపట్ల వైరిభావంగల శత్రువుగా ఉన్న ఏదోము మౌనస్థితిలోకి అంటే మరణస్థితిలోకి వెళ్లిపోతుంది. అయితే అది జరగడానికి ముందు, కొందరు వ్యాకులతతో భవిష్యత్తు గురించి విచారిస్తారు.

18. “ఉదయమునగును రాత్రియునగును” అనే దేవోక్తి ప్రాచీన ఏదోముపై ఎలా నెరవేరింది?

18 యెషయా గ్రంథం వ్రాయబడుతున్న సమయంలో, శక్తివంతమైన అష్షూరు సైన్యం ఆక్రమిస్తూ వెళ్లాలని నిశ్చయించుకున్న మార్గంలో ఏదోము ఉంది. ఏదోములోని కొందరు అణచివేత అనే రాత్రి తమ విషయంలో ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకోవాలని పరితపిస్తారు. సమాధానం? “కావలివాడు​—⁠ఉదయమునగును రాత్రియునగును . . . అనుచున్నాడు.” (యెషయా 21:12) ఏదోముకు పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. క్షితిజరేఖపై ఉదయకాంతి మినుకుమినుకుమంటుంది గానీ, అది కొద్దిసేపే ఉంటుంది, అది భ్రాంతి మాత్రమే. ఉదయమైన వెంటనే మళ్లీ రాత్రి వస్తుంది, అంటే అణచివేత అనే మరో అంధకార సమయం తరుముకువస్తుంది. ఏదోము భవిష్యత్తును గురించిన ఎంత సముచితమైన వర్ణన. అష్షూరీయుల అణచివేత ముగుస్తుంది, కానీ అష్షూరు తర్వాత బబులోను ప్రపంచ శక్తియై, ఏదోమును అధికశాతం నిర్మూలిస్తుంది. (యిర్మీయా 25:​17, 21; 27:​2-8) ఇది ఇలాగే పునరావృతమౌతుంది. బబులోనీయుల తర్వాత, పారసీకులు ఆ తర్వాత గ్రీకులు అణచివేస్తారు. రోమన్ల కాలాల్లో అంటే, ఏదోము వంశీయులైన హేరోదులు యెరూషలేములో ఆధిపత్యం చేస్తున్నప్పుడు స్పల్పకాలంపాటు “ఉదయము” అవుతుంది. కానీ ఆ “ఉదయము” ఎంతోకాలం పాటు నిలవదు. చివరికి, ఏదోము శాశ్వతంగా మౌనస్థితిలోకి వెళ్లిపోతుంది, చరిత్రలో నుండి కనుమరుగవుతుంది. చివరికి దూమా అనే పేరు దాన్ని తగినవిధంగా వర్ణిస్తుంది.

19. కావలివాడు, “మీరు విచారింపగోరినయెడల విచారించుడి. మరల రండి” అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటి?

19 కావలివాడు తన క్లుప్త సందేశాన్ని ఈ మాటలతో ముగిస్తున్నాడు: “మీరు విచారింపగోరినయెడల విచారించుడి. మరల రండి!” (యిషయా 21:12బి) “మరల రండి!” అనే పదబంధం ఏదోముపైకి రానున్న ‘రాత్రుల’ అంతంలేని పరంపరను సూచిస్తుండవచ్చు. లేదా ఆ పదబంధాన్ని ‘తిరిగిరావడం’ అని కూడా అనువదించవచ్చు గనుక, రాజ్యంపైకి వచ్చే నాశనాన్ని తప్పించుకోవాలనుకునే ఏదోమీయులెవరైనా పశ్చాత్తాపపడి యెహోవా దగ్గరకు ‘తిరిగిరావాలని’ ప్రవక్త సూచిస్తుండవచ్చు. విషయం ఈ రెండిటిలో ఏదైనప్పటికీ, ఇంకా అదనపు విచారణలు చేయమని కావలివాడు ఆహ్వానిస్తున్నాడు.

20. యెషయా 21:11, 12 వచనాల్లో వ్రాయబడివున్న దేవోక్తి నేడు యెహోవా ప్రజలకు ఎందుకు ప్రాముఖ్యమైనది?

20 ఈ చిన్న దేవోక్తి ఆధునిక కాలాల్లో యెహోవా ప్రజలకు ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా పరిణమించింది. * మానవజాతి ఆధ్యాత్మిక అంధకారం మరియు దేవుని నుండి దూరమైపోవడం అనే చీకటి రాత్రిలో మునిగిపోయి ఉందని మనం అర్థంచేసుకోవచ్చు. (రోమీయులు 13:12; 2 కొరింథీయులు 4:4) ఈ విధాన నాశనానికి నడిపే ఈ రాత్రి సమయంలో, మానవజాతి ఎలాగైనా శాంతి భద్రతలను తీసుకురాగలదనే మినుకుమినుకుమనే నిరీక్షణా కిరణాలు, మరింత అంధకార కాలాలకు ముందు వచ్చే భ్రాంతి కలిగించే ఉదయకాల తళతళల వంటివి మాత్రమే. ఒక నిజమైన సూర్యోదయం​—⁠భూమిపై క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా సూర్యోదయం సమీపిస్తోంది. కానీ రాత్రి ఉన్నంత వరకూ, మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉంటూ, ఈ భ్రష్ట వ్యవస్థకు సమీపిస్తున్న అంతాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ, కావలివాని తరగతి ఇస్తున్న నడిపింపును అనుసరించాలి.​—⁠1 థెస్సలొనీకయులు 5:6.

ఎడారి భూమిపై రాత్రి అవుతుంది

21. (ఎ) “అరేబియాను గూర్చిన దేవోక్తి” అనే పదబంధం ఏ మాటల చతురతను ఉద్దేశిస్తుండవచ్చు? (బి) దెదానీయులైన సార్థవాహులు అంటే ఏమిటి?

21 యెషయా 21 వ అధ్యాయంలోని చివరి దేవోక్తి “ఎడారి భూమి”ని ఉద్దేశించి చేయబడుతుంది. అదిలా ప్రారంభమవుతుంది: “అరేబియాను గూర్చిన దేవోక్తి—దెదానీయులైన సార్థవాహులారా, సాయంకాలమున మీరు అరబి యెడారిలో దిగవలెను.” (యిషయా 21:​13) “అరేబియా” అంటే అక్షరార్థంగా “ఎడారి భూమి” అని భావం, కానీ ఈ దేవోక్తి అనేక అరేబియా తెగలను ఉద్దేశించి చేయబడిందని స్పష్టమవుతోంది. అంతేగాక “ఎడారి భూమి” అనేదాని కోసమైన హీబ్రూ పదం కొన్నిసార్లు “సాయంకాలం” అని అనువదించబడుతుంది. కష్టసమయమైన చీకటి సాయంకాలం ఈ ప్రాంతంపైకి రాబోతున్నట్లుగా, ఇది మాటల చతురత అని కొంతమంది అంటారు. ఆ దేవోక్తి రాత్రిపూట దృశ్యంతో ప్రారంభమౌతుంది, అందులో ఒక ప్రముఖ అరబు తెగవారు అంటే దెదానీయులైన సార్థవాహులు ఒక భాగం. అలాంటి సార్థవాహులు మసాలాదినుసులు, ముత్యాలు, ఇతర విలువైన వస్తువులు తీసుకుని ఎడారిలో ఒక నీటిచెలమ నుండి మరో నీటిచెలమకు వ్యాపార మార్గాలపై ప్రయాణిస్తారు. కానీ ఇక్కడ, వారు ఎక్కువగా ప్రయాణించే మార్గాలను వదిలి రాత్రులు దాక్కుని గడిపేలా బలవంతపెట్టబడడాన్ని మనం చూస్తాం. ఎందుకు?

22, 23. (ఎ) అరబు తెగల వారిపై అణచివేసే ఏ భారం పడుతుంది, అది వారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? (బి) ఈ నాశనం ఎంత త్వరగా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది?

22 యెషయా ఇలా వివరిస్తున్నాడు: “తేమాదేశనివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి, పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని రండి. ఖడ్గ భయముచేతను దూసిన ఖడ్గ భయముచేతను ఎక్కు పెట్టబడిన ధనుస్సుల భయముచేతను క్రూరయుద్ధ భయముచేతను వారు పారిపోవుచున్నారు.” (యెషయా 21:​14, 15) అవును, ఈ అరబ్బు తెగలవారిపై అణచివేసే యుద్ధభారం పడుతుంది. ఆ ప్రాంతంలోకెల్లా సమృద్ధిగా నీరున్న నీటిచెలమల్లో ఒకదానిపై నెలకొనివున్న తేమా, దురదృష్టవంతులైన యుద్ధ శరణార్థులకు నీళ్ళు, ఆహారం తెమ్మని బలవంతపెట్టబడుతుంది. ఈ శ్రమ ఎప్పుడు వస్తుంది?

23 యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “ప్రభువు నాకీలాగు సెలవిచ్చియున్నాడు​—⁠కూలివారు ఎంచునట్లుగా ఒక యేడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును. కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు. ఈలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు.” (యెషయా 21:​16, 17) కేదారు ఎంత ప్రాముఖ్యమైన తెగ అంటే కొన్నిసార్లు మొత్తం అరేబియాను సూచించడానికి అది ఉపయోగించబడేది. ఈ తెగకు చెందిన విలుకాండ్లు, బలాఢ్యులు కేవలం కొద్ది శేషముగా తగ్గించబడాలని యెహోవా నిశ్చయించాడు. ఎప్పుడు జరుగుతుంది? కూలికి వచ్చిన పనివాడు తనకు జీతం ఇవ్వబడిన కాలంకంటే ఎక్కువ ఎలా పనిచేయడో అలాగే, “యేడాదిలోగానే,” అంతకన్నా ఎక్కువ మాత్రం కాదు. కచ్చితంగా ఇదంతా ఎలా నెరవేరిందన్నది నిశ్చయంగా తెలియదు. సార్గోన్‌ II మరియు సన్హెరీబులనే ఇద్దరు అష్షూరు పరిపాలకులు అరేబియాను తాము లోబరచుకున్నట్లుగా చెప్పుకున్నారు. ప్రవచించబడినట్లుగా, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు గర్విష్ఠులైన అరబు తెగలవారిని అధికశాతం నిర్మూలించి ఉంటారు.

24. అరేబియాకు వ్యతిరేకంగా చెప్పబడిన యెషయా ప్రవచనం నెరవేరిందని మనం ఎలా నిశ్చయత కలిగి ఉండవచ్చు?

24 అయితే, ఈ ప్రవచనం ఖచ్చితంగా నెరవేరిందని మనం నిశ్చయత కలిగివుండవచ్చు. ఆ విషయాన్ని, దేవోక్తిలోని “ఈలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు” అనే చివరి మాటలు తప్ప మరేవీ అంత శక్తివంతంగా తెలియజేయలేవు. బబులోను అష్షూరుకంటే పైకెత్తబడి ఆ తర్వాత లైంగిక దుష్ప్రవర్తనలో మునిగిన ఒక్క రాత్రిలోనే అధికారం నుండి పడవేయబడడం సాధ్యమని యెషయా కాలంనాటి ప్రజలకు అనిపించి ఉండకపోవచ్చు. శక్తివంతమైన ఏదోము మరణపు మౌనస్థితిలోకి వెళ్లిపోవడం లేక సంపన్నులైన అరబ్బు తెగలవారిపైకి శ్రమా లేమిల రాత్రి రావడం కూడా అంతే అసాధ్యమని అనిపించవచ్చు. కానీ అలా జరుగుతుందని యెహోవా చెబుతున్నాడు, కాబట్టి అలాగే జరిగి తీరుతుంది. ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం నాశనమౌతుందని నేడు యెహోవా మనకు చెబుతున్నాడు. ఇది కేవలం సంభావ్యత మాత్రమే కాదు; ఖచ్చితంగా జరిగి తీరుతుంది. యెహోవా తానే సెలవిచ్చియున్నాడు!

25. కావలివాని మాదిరిని మనం ఎలా అనుకరించవచ్చు?

25 కాబట్టి, మనం కావలివాని వలె ఉందాం. సమున్నతమైన కావలి బురుజుపై నియమింపబడినట్లుగా, ప్రమాదం ముంచుకువచ్చే సూచన ఏదైనా ఉందా అని క్షితిజరేఖను నిశితంగా పరిశీలిస్తూ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉందాం. నేడు భూమిపై మిగిలివున్న అభిషిక్త క్రైస్తవుల నమ్మకమైన కావలివాని తరగతితో సన్నిహిత మైత్రిని ఏర్పరచుకుందాం. మనకు కనిపిస్తున్నదాన్ని, అంటే క్రీస్తు పరలోకం నుండి పరిపాలిస్తున్నాడనీ, మానవజాతి దేవుని నుండి దూరమైపోవడం అనే సుదీర్ఘమైన చీకటి రాత్రికి త్వరలోనే ఆయన ముగింపు తెస్తాడనీ, ఆ తర్వాత ఆయన పరదైసు భూమిపై వెయ్యేండ్ల పరిపాలన అనే నిజమైన సూర్యోదయం తీసుకువస్తాడనీ నమ్మడానికి గల విస్తృతమైన సాక్ష్యాధారాన్ని ధైర్యంగా తెలియజేయడంలో వారితో కలుద్దాం!

[అధస్సూచీలు]

^ పారసీక రాజు కోరేషు కొన్నిసార్లు “ఆన్షాన్‌ రాజు”గా పేర్కొనబడ్డాడు, ఆన్షాన్‌ ఏలాములో ఒక ప్రాంతం లేక నగరం. యెషయా కాలంనాటికి అంటే సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దపు ఇశ్రాయేలీయులకు పారసీక దేశము తెలిసి ఉండకపోవచ్చు, అయితే వారికి ఏలాము తెలిసి ఉండవచ్చు. యెషయా ఇక్కడ పారసీక దేశానికి బదులుగా ఏలాము అనే పేరును ఎందుకు ఉపయోగిస్తున్నాడో ఇది వివరించవచ్చు.

^ “కేడెములకు చమురురాయుడి” అనే పదాలు, దెబ్బలు తగులకుండా చాలామేరకు ప్రక్కకు జారిపోయేలా, యుద్ధానికి వెళ్ళే ముందు తోలు కేడెములకు నూనె రాయడమనే ప్రాచీన సైనిక అలవాటును సూచిస్తాయని చాలామంది బైబిలు వ్యాఖ్యాతలు భావిస్తారు. ఇది సానుకూల భావవివరణే అయినప్పటికీ, ఒక విషయం గమనించాలి, ఆ నగరం కూలిన రాత్రి బబులోనీయులకు పోరాడడానికి తగినంత సమయమే లేకపోతే ఇక కేడెములకు చమురు రాసుకుని యుద్ధానికి సన్నద్ధమయ్యే మాటెక్కడ!

^ బబులోను కూలిపోవడాన్ని గురించిన యెషయా ప్రవచనం ఎంత ఖచ్చితమైనదిగా ఉందంటే, బహుశా ఆ సంఘటన జరిగిన తర్వాతే అది వ్రాయబడి ఉండవచ్చునని కొందరు బైబిలు విమర్శకులు ఊహాకల్పన చేశారు. కానీ హీబ్రూ పండితుడైన ఎఫ్‌. డెలిట్ష్‌ పేర్కొంటున్నట్లుగా, ఒక ప్రవక్త వందల సంవత్సరాలు ముందుగానే జరుగబోయే సంఘటనలను ప్రవచించేందుకు ప్రేరేపించబడగలడని మనం అంగీకరిస్తే అటువంటి ఊహాకల్పనలు అనవసరం.

^ కావలికోట ప్రచురించడం మొదలు పెట్టబడిన మొదటి 59 సంవత్సరాల్లో, దాని ముఖపత్రంపై యెషయా 21:11 వ వచనం ముద్రించబడేది. అదే లేఖనం, వాచ్‌టవర్‌ సంస్థ మొదటి అధ్యక్షుడైన చార్లెస్‌ టి. రస్సెల్‌ వ్రాసిన చివరి ప్రసంగానికి మూలాంశాన్ని ఇచ్చింది. (ప్రక్క పేజీలోని చిత్రాన్ని చూడండి.)

[అధ్యయన ప్రశ్నలు]

[219 వ పేజీలోని చిత్రం]

“అన్నపానములు పుచ్చుకొందురు”

[220 వ పేజీలోని చిత్రం]

కావలివాడు “సింహము గర్జించునట్టు కేకలు” వేసాడు

[222 వ పేజీలోని చిత్రం]

“పగటివేళ నేను నిత్యమును . . . రాత్రి అంతయు కావలి కాయుచున్నాను”