కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మన వివాదము తీర్చుకొందము”

“మన వివాదము తీర్చుకొందము”

మూడవ అధ్యాయం

“మన వివాదము తీర్చుకొందము”

యెషయా 1:10-31

1, 2. యూదా యెరూషలేముల పాలకులనూ, ప్రజలనూ యెహోవా ఎవరితో పోలుస్తున్నాడు, ఇది ఎందుకు తగినది?

 యెషయా 1:1-9 వచనాల్లోని అధిక్షేపణను విన్న తర్వాత యెరూషలేము నివాసులు తమను తాము సమర్థించుకోవాలనుకోవచ్చు. తాము యెహోవాకు అర్పించే బలులన్నిటి గురించీ గర్వంగా చెప్పుకోవాలని వారు నిస్సందేహంగా ఇష్టపడతారు. అయితే, అలాంటి దృక్పథాలకు యెహోవా ఇస్తున్న చిన్నబుచ్చే సమాధానం 10 నుండి 15 వరకున్న వచనాల్లో ఉంది. ఆ వచనాలిలా ప్రారంభమౌతున్నాయి: “సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆలకించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గుడి.”​—యెషయా 1:10.

2 సొదొమ గొమొఱ్ఱాలు విశృంఖలమైన తమ లైంగిక దురాచారాల మూలంగానే గాక తమ హృదయ కాఠిన్యాన్ని, అహంకారపూరిత దృక్పథాలను బట్టి కూడా నాశనం చేయబడ్డాయి. (ఆదికాండము 18:​20, 21; 19:​4, 5, 23-25; యెహెజ్కేలు 16:​49, 50) శపించబడిన ఆ పట్టణాల ప్రజలతో తమను పోల్చడం విని యెషయా శ్రోతలు దిగ్భ్రాంతి చెందివుండవచ్చు. * యెహోవా తన ప్రజలు ఎలా ఉన్నారో వారిని అలాగే దృష్టిస్తాడు, యెషయా వారి ‘దురద చెవులకు’ తగిన విధంగా దేవుని సందేశాన్ని మెత్తపరచడం లేదు.​—⁠2 తిమోతి 4:2-4.

3. ప్రజలర్పించిన బలులను బట్టి తనకు ‘వెక్కసమైందని’ యెహోవా చెప్పినప్పుడు ఆయన ఉద్దేశమేమిటి, పరిస్థితి ఎందుకలా ఉంది?

3 తన ప్రజలు చేస్తున్న లాంఛనప్రాయమైన ఆరాధన గురించి యెహోవా ఎలా భావిస్తున్నాడో గమనించండి. “యెహోవా సెలవిచ్చిన మాట ఇదే​—⁠విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను; కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకిష్టములేదు.” (యెషయా 1:​11) యెహోవా తమ బలులపై ఆధారపడడని ప్రజలు మరచిపోయారు. (కీర్తన 50:​8-13) మానవులు అర్పించేవేవైనా సరే ఆయనకు అవసరం లేదు. కాబట్టి ప్రజలు అర్ధహృదయంతో తాము అర్పించే అర్పణల ద్వారా యెహోవాకు తామేదో మేలు చేస్తున్నట్లు భావిస్తే వారు పొరబడుతున్నట్లే. ఇక్కడ యెహోవా శక్తివంతమైన ఆలంకారిక భాషను ఉపయోగిస్తున్నాడు. “నాకు వెక్కసమాయెను” అని ఆయన చెబుతున్నాడు. పూర్తిగా కడుపు నిండిపోయి ఇక ఆహారంవైపు చూస్తేనే వెగటు పుట్టే భావన మీకు తెలుసా? ఆ అర్పణల విషయంలో యెహోవా అలాగే భావించాడు​—⁠ఆయనకు అంతగా వెగటు పుట్టింది!

4. ప్రజలు యెరూషలేములోని ఆలయానికి రావడంలోని వ్యర్థతను యెషయా 1:12 ఎలా వెల్లడిచేస్తుంది?

4 యెహోవా ఇలా కొనసాగిస్తున్నాడు: “నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మను వాడెవడు?” (యెషయా 1:​12) ప్రజలు యెహోవా ‘సన్నిధిని కనబడాలని,’ అంటే యెరూషలేములోని ఆయన ఆలయానికి రావాలని యెహోవా ధర్మశాస్త్రమే కదా కోరుతోంది? (నిర్గమకాండము 34:​23, 24) నిజమే, కానీ కేవలం లాంఛనప్రాయంగా, సదుద్దేశాలు లేకుండానే యాంత్రికంగా స్వచ్ఛారాధన చేయడానికి వారక్కడికి వస్తున్నారు. వారు అనేకసార్లు ఆయన ఆవరణములకు రావడం యెహోవా దృష్టిలో, కేవలం దాన్ని ‘తొక్కడానికే’ అంటే ఏమీ సాధించకుండా నేలను అరగదీయడానికే వస్తున్నట్లుగా ఉంది.

5. యూదులు చేసే కొన్ని ఆరాధనా చర్యలు ఏవి, అవి యెహోవాకు “బాధకరము”గా ఎందుకు తయారయ్యాయి?

5 యెహోవా ఇప్పుడు మరింత కఠినమైన పదజాలాన్ని ఉపయోగించడంలో ఆశ్చర్యం లేదు! “మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దాని నికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి​—⁠పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నేనోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలములును నాకు హేయములు. అవి నాకు బాధకరములు; వాటిని సహింపలేక విసికియున్నాను.” (యెషయా 1:​13, 14) నైవేద్యములు, ధూపార్పణములు, విశ్రాంతిదినములు, ఉత్సవసమాజములు ఇవన్నీ దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రములోనివే. “అమావాస్య” గురించి ధర్మశాస్త్రం కేవలం వాటిని ఆచరించాలని చెబుతుంది కానీ ఈ ఆచరణచుట్టూ క్రమంగా ఆరోగ్యదాయకమైన సాంప్రదాయాలు స్థాపించబడ్డాయి. (సంఖ్యాకాండము 10:​10; 28:​11) అమావాస్య సాధారణంగా నెలసరి సబ్బాతుగా పరిగణించబడుతుంది, అప్పుడు ప్రజలు పనులేమీ చేయకుండా ప్రవక్తల నుండి యాజకుల నుండి ఉపదేశాన్ని పొందడానికి సమకూడుతారు. (2 రాజులు 4:​23; యెహెజ్కేలు 46:3; ఆమోసు 8:5) అలాంటి ఆచరణలు తప్పుకాదు. కాని వాటిని కేవలం నలుగురికి చూపించడం కోసమే చేయడంలో ఉంది సమస్య. అంతేగాక, యూదులు లాంఛనప్రాయంగా దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ అదే సమయంలో ‘పాపులగుంపుతో కూడుతున్నారు,’ అంటే దయ్యాల సంబంధిత ఆచారాలను ఆశ్రయిస్తున్నారు. * అందుకే వారి ఆరాధనా చర్యలు యెహోవాకు “బాధకరములు.”

6. యెహోవా ఏ భావంలో “విసికి” పోయాడు?

6 అయితే, యెహోవా ఎలా “విసికి” పోగలడు? ఎంతైనా ఆయనకు “అధికశక్తి” ఉంది, “ఆయన సొమ్మసిల్లడు అలయడు.” (యెషయా 40:​26, 28) మనం ఆయన భావాలను అర్థం చేసుకోవడానికి సహాయం చేసేందుకు యెహోవా స్పష్టమైన ఆలంకారిక భాషను ఉపయోగిస్తున్నాడు. మీరు ఏదైనా పెద్ద బరువును చాలాసేపు మోసి ఇక పూర్తిగా అలసిపోయాక దాన్ని కింద పడేయాలన్న భావం మీకెప్పుడైనా కలిగిందా? తన ప్రజల వేషధారణతోకూడిన ఆరాధనా చర్యల గురించి యెహోవా అలాగే భావిస్తున్నాడు.

7. యెహోవా తన ప్రజల ప్రార్థనలను వినడం ఎందుకు మానుకున్నాడు?

7 ఆరాధనా చర్యల్లోకెల్లా అత్యంత వ్యక్తిగతమైన దాని గురించి యెహోవా ఇప్పుడు ప్రస్తావిస్తున్నాడు. “మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను; మీ చేతులు రక్తముతో నిండియున్నవి.” (యెషయా 1:​15) చేతులు చాపడం, ఆకాశం వైపు చేతులు ఎత్తడం వేడుకోవడాన్ని సూచిస్తాయి. ఈ భంగిమ యెహోవాకు అర్థరహితమైనదైపోయింది, ఎందుకంటే ఈ ప్రజల చేతులు రక్తముతో నిండివున్నాయి. దేశంలో దౌర్జన్యం పెచ్చుపెరిగిపోయింది. బలహీనులను అణిచివేయడం సర్వసాధారణమైపోయింది. అలాంటి దుర్జనులైన స్వార్థపరులు యెహోవాకు ప్రార్థించడం, ఆయన ఆశీర్వాదాల కోసం వేడుకోవడం అసహ్యకరమైనది. యెహోవా “నేను వినను” అని చెబుతున్నాడంటే అందులో ఆశ్చర్యం లేదు!

8. నేడు క్రైస్తవమత సామ్రాజ్యం ఏ తప్పు చేస్తోంది, కొంతమంది క్రైస్తవులు అలాంటి ఉరిలో ఎలా చిక్కుకుంటారు?

8 మన కాలంలో, క్రైస్తవమత సామ్రాజ్యం కూడా అలాగే తాను పదే పదే చేసే తన వ్యర్థమైన ప్రార్థనల ద్వారా, మతపరమైన తన ఇతర “అద్భుతముల” ద్వారా దేవుని అనుగ్రహాన్ని పొందలేకపోయింది. (మత్తయి 7:21-23 పోల్చండి.) మనం కూడా అదే ఉరిలో చిక్కుకుపోకుండా ఉండడం ఎంతో ప్రాముఖ్యం. అప్పుడప్పుడూ, ఒక క్రైస్తవుడు ఏదైనా గంభీరమైన పాపాన్ని చేస్తూ, తాను చేస్తున్న దాన్ని దాచిపెట్టి, క్రైస్తవ సంఘంలో తన కార్యకలాపాలను అధికం చేస్తే, తన చర్యలు ఏదో విధంగా తన పాపాన్ని కప్పిపుచ్చుతాయని అనుకుంటాడు. అలాంటి లాంఛనప్రాయమైన కార్యాలు యెహోవాకు ప్రీతికరమైనవి కావు. యెషయా తర్వాతి వచనాలు చూపిస్తున్నట్లుగా ఆధ్యాత్మిక అనారోగ్యానికి కేవలం ఒకే ఒక్క చికిత్స ఉంది.

ఆధ్యాత్మిక అనారోగ్యానికి చికిత్స

9, 10. మనం యెహోవాకు చేసే ఆరాధనలో పరిశుభ్రత ఎంత ప్రాముఖ్యమైనది?

9 కనికరంగల దేవుడైన యెహోవా ఇప్పుడు వాత్సల్యపూరితంగా, అభ్యర్థిస్తున్న స్వరంతో మాట్లాడుతున్నాడు. “మిమ్మును కడుగుకొనుడి; శుద్ధి చేసికొనుడి; మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి; కీడుచేయుట మానుడి. మేలు చేయ నేర్చుకొనుడి; న్యాయము జాగ్రత్తగా విచారించుడి; హింసించబడు వానిని విడిపించుడి; తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి; విధవరాలి పక్షముగా వాదించుడి.” (యెషయా 1:​16, 17) ఇక్కడ మనం, తప్పకుండా చెయ్యవలసిన తొమ్మిదింటిని లేక తొమ్మిది ఆజ్ఞలను కనుగొంటాము. మొదటి నాలుగు ప్రతికూలమైనవి ఎందుకంటే అవి పాపాన్ని నిర్మూలించడానికి సంబంధించినవి; చివరి ఐదు యెహోవా ఆశీర్వాదాలను పొందడానికి నడిపించే అనుకూలమైన చర్యలు.

10 శుచి, శుభ్రత స్వచ్ఛారాధనలో ఎప్పుడూ ప్రముఖ భాగంగానే ఉన్నాయి. (నిర్గమకాండము 19:10, 11; 30:​20; 2 కొరింథీయులు 7:1) కాని పరిశుభ్రత, తన ఆరాధకుల హృదయాలను చేరేంత లోతుకు వెళ్లాలని యెహోవా కోరుకుంటున్నాడు. నైతిక, ఆధ్యాత్మిక పరిశుభ్రత మరింత ప్రాముఖ్యమైనది, యెహోవా సూచిస్తున్నది దాని గురించే. 16 వ వచనంలోని మొదటి రెండు ఆజ్ఞలు కేవలం పునరుక్తి కాదు. “మిమ్మును కడుగుకొనుడి” అనే మొదటిది శుభ్రపర్చుకోవడంలోని ప్రారంభ చర్యను సూచిస్తుందనీ, అయితే “శుద్ధి చేసికొనుడి” అనే రెండవది ఆ పరిశుభ్రతను అలాగే కాపాడుకునేందుకు కొనసాగించే ప్రయత్నాలను సూచిస్తుందనీ ఒక హీబ్రూ వ్యాకరణ పండితుడు చెబుతున్నాడు.

11. పాపంతో పోరాడేందుకు మనమేమి చేయాలి, మనం ఎన్నడూ చేయకూడనిది ఏమిటి?

11 మనం యెహోవా నుండి ఏదీ దాచలేము. (యోబు 34:22; సామెతలు 15:3; హెబ్రీయులు 4:​13) కాబట్టి, “మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి” అని ఆయనిచ్చిన ఆజ్ఞ భావం, చెడు చేయడాన్ని మానుకోండి అని మాత్రమే అయి ఉంటుంది. అంటే గంభీరమైన పాపాలను దాచడానికి ప్రయత్నించకూడదని దాని భావం, ఎందుకంటే అలా చేయడం కూడా ఒక పాపమే. సామెతలు 28:13 ఇలా హెచ్చరిస్తుంది: “అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.”

12. (ఎ) ‘మేలు చేయ నేర్చుకోవడం’ ఎందుకు ప్రాముఖ్యం? (బి) ‘న్యాయము జాగ్రత్తగా విచారించమని,’ ‘హింసించబడు వానిని విడిపించుడని’ ఇవ్వబడిన నిర్దేశాలను ప్రాముఖ్యంగా పెద్దలు ఎలా అన్వయించుకోవాలి?

12 యెషయా 1:17 వ వచనంలో యెహోవా ఆజ్ఞాపిస్తున్న అనుకూలమైన చర్యల నుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఆయన కేవలం “మేలు చేయుడి” అని చెప్పడం లేదుగానీ “మేలు చేయ నేర్చుకొనుడి” అని చెబుతున్నాడని గమనించండి. దేవుని దృష్టిలో ఏది మేలైనదో అర్థం చేసుకోవడానికీ, దాన్ని చేయాలనుకోవడానికీ దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా అధ్యయనం చేయడం అవసరం. అంతేగాక, యెహోవా కేవలం “న్యాయము చేయుడి” అని చెప్పడం లేదు గానీ “న్యాయము జాగ్రత్తగా విచారించుడి” అని చెబుతున్నాడు. కొన్ని సంక్లిష్టమైన విషయాల్లో న్యాయమైన చర్యను చేపట్టేందుకు, అనుభవంగల పెద్దలు సహితం దేవుని వాక్యాన్ని సమగ్రంగా పరిశోధించవలసిన అవసరం ఉంది. యెహోవా తర్వాత ఆజ్ఞాపిస్తున్నట్లుగా, ‘హింసించబడు వానిని విడిపించడం’ కూడా వారి బాధ్యతనే. ఈ నిర్దేశాలు నేడు క్రైస్తవ కాపరులకు ప్రాముఖ్యమైనవి, ఎందుకంటే వారు మందను “క్రూరమైన తోడేళ్ల” నుండి కాపాడాలని కోరుకుంటారు.​—⁠అపొస్తలుల కార్యములు 20:28-30.

13. విధవరాలి గురించి, తండ్రిలేని పిల్లవాడిని గురించి ఇవ్వబడిన ఆజ్ఞలను మనం నేడు ఎలా అన్వయించుకోవచ్చు?

13 చివరి రెండు ఆజ్ఞలు దేవుని ప్రజల్లోని అత్యంత దుర్భలులైన కొందరికి అంటే అనాథలకు విధవరాండ్రకు సంబంధించినవి. అలాంటి వారిని మోసం చేసి లాభం పొందడానికి లోకం కాచుకుని ఉంటుంది; అయితే దేవుని ప్రజల మధ్యన అలా జరుగకూడదు. తండ్రిలేని పిల్లలను మోసం చేసి లాభం పొందాలనీ వారిని భ్రష్టుపట్టించాలనీ చూసే లోకంలో వారు న్యాయాన్నీ భద్రతనూ పొందడానికి ప్రేమగల పెద్దలు సహాయం చేస్తూ వారికి ‘న్యాయము తీరుస్తారు.’ పెద్దలు విధవరాలి ‘పక్షముగా వాదిస్తారు,’ లేదా అక్కడ ఉపయోగించబడిన హీబ్రూ పదానికున్న మరో భావం చెబుతున్నట్లుగా, వారు ఆమె పక్షాన “పోరాడుతారు.” నిజంగా, మన మధ్యనున్న, అవసరంలో ఉన్నవారు యెహోవా దృష్టిలో అమూల్యమైనవారు గనుక క్రైస్తవులందరూ వారికి ఆశ్రయాన్ని, ఓదార్పును, న్యాయాన్ని చేకూర్చేవారిగా ఉండాలని కోరుకుంటారు.​—⁠మీకా 6:8; యాకోబు 1:27.

14. యెషయా 1:16, 17 వచనాల్లో ఏ అనుకూలమైన సందేశం అందజేయబడుతుంది?

14 ఈ తొమ్మిది ఆజ్ఞల ద్వారా యెహోవా ఎంత దృఢమైన, అనుకూలమైన సందేశాన్ని అందజేస్తున్నాడో కదా! కొన్నిసార్లు, పాపం చేసినవారు సరైనది చేయడం తమ శక్తికి మించినదని భావిస్తారు. అలాంటి తలంపులు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. అంతేగాక, అవి సరైన తలంపులు కాదు. తన సహాయంతో ఏ పాపియైనా తన పాపపు విధానాన్ని మార్చుకుని పశ్చాత్తాపపడి సరైనది చేయగలడని యెహోవాకు తెలుసు, మనం ఆ విషయాన్ని తెలుసుకోవాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు.

సానుభూతితోకూడిన, న్యాయమైన అభ్యర్థన

15. “మన వివాదము తీర్చుకొందము” అనే పదబంధం కొన్నిసార్లు ఎలా అపార్థం చేసుకోబడుతుంది, వాస్తవానికి దాని భావమేమిటి?

15 యెహోవా స్వరం ఇప్పుడు మరింత వాత్సల్యపూరితంగా, సానుభూతితోకూడినదిగా మారుతుంది. “యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు​—⁠రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును; కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లనివగును.” (యెషయా 1:​18) మనోహరమైన ఈ వచనారంభంలోని ఈ ఆహ్వానం తరచూ అపార్థం చేసుకోబడుతుంది. ఉదాహరణకు ది న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌, ఒక ఒప్పందానికి చేరుకునేందుకు ఇరువర్గాల వారూ తమ తప్పును ఒప్పుకోవలసిన అవసరం ఉన్నట్లుగా “మనం విశదంగా చర్చించుకుందాం” అని చెబుతుంది. అయితే విషయం అది కాదు! తిరుగుబాటుదారులైన, వేషధారులైన తన ప్రజలతో వ్యవహరించిన తీరులో యెహోవాది ఏమాత్రం తప్పు లేదు. (ద్వితీయోపదేశకాండము 32:​4, 5) ఆ వచనం, సమానులైన ఇద్దరు వ్యక్తులు రాజీపడడానికి చేసే చర్చ గురించి కాదు గానీ న్యాయం చేకూర్చేందుకైన న్యాయస్థానం గురించి మాట్లాడుతోంది. ఇక్కడ యెహోవా ఇశ్రాయేలును కోర్టు విచారణ కోసం పిలుస్తున్నట్లుగా ఉంది.

16, 17. యెహోవా గంభీరమైన పాపాలను కూడా క్షమించడానికి ఇష్టపడుతున్నాడని మనకెలా తెలుసు?

16 అది భీతిగొల్పేదిగా అనిపించవచ్చు, కానీ యెహోవా ఎంతో కనికరంగల సానుభూతిగల న్యాయాధిపతి. ఆయన అపారమైన క్షమా గుణం గలవాడు. (కీర్తన 86:5) ఆయన మాత్రమే “రక్తమువలె” ఉన్న ఇశ్రాయేలు పాపాలను శుభ్రపరచి “హిమమువలె తెల్ల”గా చేయగలడు. ఏ మానవ ప్రయత్నమూ, ఏ అద్భుతాలూ, ఏ బలులూ లేక ప్రార్థనలూ పాపపు మరకలను తొలగించలేవు. కేవలం యెహోవా దయచేసే క్షమాభిక్ష మాత్రమే పాపాన్ని కడిగివేయగలదు. దేవుడు తాను పెట్టిన అవధులకు అనుగుణంగానే పాపాలను క్షమిస్తాడు, ఆ అవధుల్లో ఒకటి నిజమైన, హృదయపూర్వకమైన పశ్చాత్తాపాన్ని చూపించడం.

17 ఇది ఎంత ప్రాముఖ్యమైన సత్యమంటే, యెహోవా దీన్ని పద్యరూపంలో మళ్లీ చెబుతున్నాడు​—⁠“కెంపు” వంటి పాపాలు నూతనమైన, రంగువేయని, తెల్లని గొఱ్ఱెబొచ్చులా అవుతాయి. మన పాపాలు ఎంత గంభీరమైనవైనప్పటికీ, మనం నిజంగా పశ్చాత్తాపపడుతున్నట్లు యెహోవా కనుగొంటే వాటిని ఆయన తప్పక క్షమిస్తాడని మనం తెలుసుకోవాలని కోరుతున్నాడు. ఇది తమ విషయంలోనూ నిజమవుతుందని నమ్మలేని వారు మనష్షే వంటి ఉదాహరణలను పరిశీలించడం మంచిది. ఆయన ఎన్నో సంవత్సరాలపాటు ఘోరంగా పాపం చేశాడు. అయినా, ఆయన పశ్చాత్తాపపడినప్పుడు క్షమించబడ్డాడు. (2 దినవృత్తాంతములు 33:​9-16) గంభీరమైన పాపాలు చేసిన వారితో సహా మనమందరం కూడా, ఆయనతో “వివాదము తీర్చు”కోవడానికి మరీ ఆలస్యం కాలేదని తెలుసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు.

18. తిరుగుబాటుదారులైన తన ప్రజల ఎదుట యెహోవా ఏ ఎంపికను ఉంచాడు?

18 ఎంపిక చేసుకునే అవకాశం ఉందని యెహోవా తన ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. “మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు; యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.” (యెషయా 1:​19, 20) యెహోవా ఇక్కడ దృక్పథాలను నొక్కిచెబుతూ, తాను చెబుతున్న విషయాన్ని రూఢిపరచడానికి మరో స్పష్టమైన ఆలంకారిక భాషను ఉపయోగిస్తున్నాడు. యూదాకున్న ఎంపిక ఇది: మంచి పదార్థములను అనుభవించడం లేదా ఖడ్గవాతకు గురికావడం. యెహోవా చెప్పేది విని ఆయనకు విధేయత చూపించాలనే దృక్పథం వారికుంటే, వాళ్లు నేల ఇచ్చే మంచి ఫలాలను అనుభవిస్తారు. అయితే వారు తిరుగుబాటు ధోరణిలోనే కొనసాగితే శత్రువుల ఖడ్గవాతకు గురవుతారు! క్షమించే దేవుని కనికరాన్ని, ఆయనిచ్చే సమృద్ధిని ఎంపిక చేసుకునే బదులు తమ శత్రువుల ఖడ్గాన్నే ప్రజలు ఎంపిక చేసుకుంటారన్నది ఊహించలేని విషయంగా అనిపించవచ్చు. అయినప్పటికీ, యెషయా తర్వాతి వచనాలు చూపిస్తున్నట్లుగా యెరూషలేము చేసిందదే.

ప్రియమైన నగరాన్ని గురించిన విలాపగీతం

19, 20. (ఎ) వంచింపబడ్డాననే సంవేదనను యెహోవా ఎలా తెలియజేశాడు? (బి) ఏ విధంగా ‘నీతి యెరూషలేములో నివసించింది’?

19 ఈ సమయంలో యెరూషలేము దుష్టత్వపు పూర్తి విస్తృతిని యెషయా 1:21-23 వచనాల్లో మనం చూస్తాము. యెషయా ఇప్పుడు విలాపగీతం లేదా శోకగీతం శైలిలో ఒక ప్రేరేపిత పద్యాన్ని ప్రారంభిస్తున్నాడు: “అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను; నీతి దానిలో నివసించెను, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.”​—యెషయా 1:​21.

20 యెరూషలేము నగరం ఎలా దిగజారిపోయింది! ఒకప్పుడు నమ్మకమైన భార్యలా ఉన్నది ఇప్పుడొక వేశ్య అయ్యింది. వంచింపబడ్డాననే యెహోవా సంవేదనను, నిరుత్సాహాన్ని ఇంత గట్టిగా మరేది తెలుపగలదు? ఈ నగరంలో ‘నీతి నివసించేది.’ ఎప్పుడు? ఇశ్రాయేలు ఉనికిలోకి కూడా రాకముందు, పూర్వం అబ్రాహాము దినాల్లో ఈ నగరం షాలేము అని పిలువబడేది. దాన్ని రాజూ యాజకుడూ అయిన ఒక వ్యక్తి పరిపాలించేవాడు. ఆయన పేరు మెల్కీసెదెకు, ‘నీతికి రాజు’ అని దాని భావం, ఆ పేరు ఆయనకు చక్కగా సరిపోయిందని స్పష్టమౌతుంది. (హెబ్రీయులు 7:​1-3; ఆదికాండము 14:​18-20) మెల్కీసెదెకు తర్వాత దాదాపు 1,000 సంవత్సరాలకు, దావీదు సొలొమోనుల రాచరికంలో యెరూషలేము దాని ఉచ్ఛస్థాయిని చేరుకుంది. ప్రాముఖ్యంగా దాని రాజులు యెహోవా మార్గాల్లో నడవడం ద్వారా ప్రజలకు మాదిరిని ఉంచినప్పుడు “నీతి దానిలో నివసించెను.” అయితే యెషయా దినానికల్లా అలాంటి కాలాలు గత జ్ఞాపకాలైపోయాయి.

21, 22. మష్టూ, నీళ్లతో కలిసిన ద్రాక్షారసమూ దేన్ని సూచిస్తాయి, అలాంటి వర్ణన యూదా నాయకులకు ఎందుకు తగినది?

21 ప్రజల నాయకులే ఎక్కువమేరకు సమస్యకు కారణం అనిపిస్తుంది. యెషయా తన విలాపాన్ని ఇలా కొనసాగిస్తున్నాడు: “నీ వెండి మష్టాయెను. నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను. నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు. వారందరు లంచము కోరుదురు బహుమానములకొరకు కనిపెట్టుదురు. తండ్రిలేనివారి పక్షమున న్యాయము తీర్చరు; విధవరాండ్ర వ్యాజ్యెము విచారించరు.” (యెషయా 1:​22, 23) వెంటవెంటనే చెప్పబడిన రెండు స్పష్టమైన దృష్టాంతాలు, తర్వాత రాబోయేదానికి ప్రేక్షకుల మనస్సులను సిద్ధం చేస్తున్నాయి. కంసాలి తన కొలిమిలో కరిగించిన వెండి నుండి మష్టును తీసి పారేస్తాడు. ఇశ్రాయేలు అధికారులు, న్యాయాధిపతులు వెండిలా కాదుగానీ, మష్టులా ఉన్నారు. వారిని తీసి పారెయ్యాలి. నీటితో పలుచన చేయబడి రుచిని కోల్పోయిన ద్రాక్షారసము కంటే వారు ఎక్కువ ఉపయోగరమైనవారు కాదు. అలాంటి పానీయం కాలవలో పారబోయడానికే పనికి వస్తుంది.

22 నాయకులు అలాంటి వర్ణనకు ఎందుకు తగినవారో 23 వ వచనం చూపిస్తుంది. మోషే ధర్మశాస్త్రం దేవుని ప్రజలను ఇతర జనాంగాల నుండి వేరుచేసి వారిని ఉన్నతులుగా చేసింది. ఉదాహరణకు, విధవరాండ్రకు, దిక్కులేనిపిల్లలకు భద్రతనివ్వాలని ఆదేశించడం ద్వారా అది వారిని ఉన్నతులుగా చేసింది. (నిర్గమకాండము 22:​22-24) అయితే యెషయా కాలంలో, తండ్రిలేని పిల్లవాడికి అనుకూలమైన తీర్పుపొందుతానన్న ఆశ ఏమాత్రం లేదు. విధవరాలి విషయానికి వస్తే, ఆమె పక్షాన వాదించడం కాదు గానీ కనీసం ఆమె చెప్పుకునేదాన్ని వినేవారు కూడా కరువయ్యారు. ఈ న్యాయాధిపతులూ నాయకులూ తమ స్వంత ఆశలను నెరవేర్చుకోవడంలో అంటే లంచాలు తీసుకోవడం, బహుమానాలు కోరడం, బహుశా అపరాధులను కాపాడుతూ బాధితులు వేదనపడడానికి అనుమతిస్తూ దొంగలతో భాగస్థులుకావడం వంటివాటిలో నిమగ్నమై ఉన్నారు. అంతకంటే ఘోరం, వారు “ద్రోహులు” లేదా తప్పు చేయడంలో ఆరితేరినవారు. ఎంత విచారకరమైన పరిస్థితి!

యెహోవా తన ప్రజలను శుద్ధీకరిస్తాడు

23. యెహోవా తన శత్రువులపట్ల ఎలాంటి భావాలను వ్యక్తపరిచాడు?

23 అధికారాన్ని అలా దుర్వినియోగం చేయడాన్ని యెహోవా నిరంతరం సహించడు. యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “కావున ప్రభువును ఇశ్రాయేలుయొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగున అనుకొనుచున్నాడు​—⁠ఆహా, నా శత్రువులనుగూర్చి నేనికను ఆయాసపడను నా విరోధులమీద నేను పగ తీర్చుకొందును.” (యెషయా 1:​24) ప్రభువుగా యెహోవాకున్న అధికారం చూపే హక్కును, ఆయనకున్న విస్తారమైన శక్తిని నొక్కిచెబుతూ ఆయనకు ఇక్కడ మూడు బిరుదులు ఇవ్వబడ్డాయి. “ఆహా” అనే ఆశ్చర్యార్థకం, యెహోవాకున్న జాలి ఇప్పుడు, ఉగ్రతను వెళ్లగ్రక్కాలనే నిశ్చయతతో మిళితం కావడాన్ని సూచిస్తుండవచ్చు. దీనికి కచ్చితంగా కారణం ఉంది.

24. యెహోవా తన ప్రజల కోసం ఎలాంటి శుద్ధీకరణ ప్రక్రియను ఉపయోగిస్తాడు?

24 యెహోవా స్వంత ప్రజలు తమను తాము ఆయన శత్రువులుగా చేసుకున్నారు. వారు దైవిక ప్రతీకారాన్ని పొందడానికి పూర్తిగా అర్హులు. యెహోవా వారి గురించి ‘ఆయాసపడడు.’ అంటే దాని భావం ఆయన పేరుగల ప్రజలు సంపూర్ణంగా, శాశ్వతంగా నిర్మూలించబడతారనా? లేదు, ఎందుకంటే యెహోవా ఇంకా ఇలా చెబుతున్నాడు: “నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసెదను.” (యెషయా 1:​25) యెహోవా ఇప్పుడు శుద్ధీకరణ ప్రక్రియను ఒక ఉపమానంగా ఉపయోగిస్తున్నాడు. ప్రాచీన కాలంలో, శుద్ధిచేసే వ్యక్తి అమూల్యమైన లోహాల నుండి మష్టును వేరు చేసేందుకు క్షారమును కలిపేవాడు. అదే విధంగా, తన ప్రజలను పూర్తి దుష్టులుగా పరిగణించని యెహోవా ‘న్యాయమునుబట్టి వారిని శిక్షిస్తాడు.’ ఆయన వారి నుండి కేవలం ‘తగరమును’ మాత్రమే, అంటే నేర్చుకోవడానికి, విధేయత చూపడానికి నిరాకరిస్తూ మొండిగావుండే అనవసరమైన వారిని తీసివేస్తాడు. * (యిర్మీయా 46:​28) ఈ మాటలతో, చరిత్రను ముందుగా వ్రాసిపెట్టే ఆధిక్యత యెషయాకు లభించింది.

25. (ఎ) సా.శ.పూ. 607 లో యెహోవా తన ప్రజలను ఎలా శుద్ధీకరించాడు? (బి) ఆధునిక కాలాల్లో యెహోవా తన ప్రజలను ఎప్పుడు శుద్ధీకరించాడు?

25 భ్రష్ట నాయకులు, ఇతర తిరుగుబాటుదారులు అనే మష్టును తొలగించడం ద్వారా యెహోవా నిజంగానే తన ప్రజలను శుద్ధీకరించాడు. సా.శ.పూ. 607 లో అంటే యెషయా దినాల తర్వాత చాలా కాలానికి, యెరూషలేము నాశనం చేయబడింది, దాని నివాసులు 70 సంవత్సరాలపాటు బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు. కొన్ని విషయాల్లో ఇది, చాలాకాలం తర్వాత దేవుడు తీసుకున్న ఒక చర్యకు సదృశంగా ఉంది. బబులోనుకు చెరగొనిపోబడిన చాలాకాలానికి వ్రాయబడిన మలాకీ 3:1-5 వచనాల్లోని ప్రవచనం, దేవుడు మళ్లీ శుద్ధీకరణ పని చేపడతాడని చూపించింది. యెహోవా దేవుడు తన “నిబంధన దూత” అయిన యేసు క్రీస్తుతో కలిసి తన ఆధ్యాత్మిక ఆలయానికి వచ్చే సమయాన్ని అది సూచించింది. ఇది మొదటి ప్రపంచ యుద్ధ ముగింపులో సంభవించిందని స్పష్టమౌతుంది. క్రైస్తవులమని చెప్పుకునే వారినందరినీ యెహోవా తనిఖీ చేస్తూ, అబద్ధ క్రైస్తవుల నుండి నిజ క్రైస్తవులను వేరుచేశాడు. ఫలితమేమిటి?

26-28. (ఎ) యెషయా 1:26 మొదట ఎలా నెరవేరింది? (బి) మన కాలంలో ఈ ప్రవచనం ఎలా నెరవేరింది? (సి) నేడు ఈ ప్రవచనం పెద్దలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?

26 యెహోవా ఇలా సమాధానం ఇస్తున్నాడు: “మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను, ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. సీయోనుకు న్యాయముచేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును.” (యెషయా 1:​26, 27) ప్రాచీన యెరూషలేము ఈ ప్రవచనపు తొలి నెరవేర్పును అనుభవించింది. బంధీలుగా వెళ్లినవారు సా.శ.పూ. 537 లో తమ ప్రియమైన పట్టణానికి తిరిగి వచ్చిన తర్వాత, గతంలోలాగే మళ్లీ నమ్మకమైన న్యాయాధిపతులు, ఆలోచనకర్తలు నియమింపబడ్డారు. ప్రవక్తలైన హగ్గయి, జెకర్యా, యాజకుడైన యెహోషువ, శాస్త్రియైన ఎజ్రా, అధికారియైన జెరుబ్బాబెలు వీరంతా, తిరిగి వచ్చిన నమ్మకమైన శేషింపబడినవారు దేవుని మార్గాల్లో నడవడానికి కావలసిన నిర్దేశాన్నీ నడిపింపునూ ఇచ్చారు. అయితే, 20 వ శతాబ్దంలో మరింత ప్రాముఖ్యమైన నెరవేర్పు జరిగింది.

27 యెహోవా ఆధునిక దిన ప్రజలు 1919 లో పరీక్షా సమయం నుండి బయటికి వచ్చారు. వారు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను యొక్క ఆధ్యాత్మిక చెర నుండి విడిపించబడ్డారు. ఆ నమ్మకమైన అభిషిక్త శేషముకు, క్రైస్తవమత సామ్రాజ్య మతభ్రష్ట మతనాయకులకు మధ్య తేడా సుస్పష్టమైంది. దేవుని ప్రజలకు మానవ సాంప్రదాయాల ప్రకారం కాక ఆయన వాక్య ప్రకారం ఉపదేశాన్నిచ్చే ‘న్యాయాధిపతులను, ఆలోచనకర్తలను తిరిగి తీసుకురావడం ద్వారా’ దేవుడు మళ్లీ తన ప్రజలను ఆశీర్వదించాడు. నేడు సంఖ్యలో తగ్గిపోతున్న “చిన్నమంద” మధ్యన, అధికమౌతున్న వారి “వేరే గొఱ్ఱెల” సహవాసుల మధ్యన అలాంటి పురుషులు వేలాదిమంది ఉన్నారు.​—⁠లూకా 12:32; యోహాను 10:16; యెషయా 32:​1, 2; 60:​17; 61:​3, 4.

28 సంఘాన్ని నైతికంగా, ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉంచేందుకు, తప్పిదస్థులను సరిదిద్దేందుకు తాము కొన్నిసార్లు సంఘంలో “న్యాయాధిపతుల”వలె చర్య తీసుకోవలసి ఉంటుందని పెద్దలు మనస్సులో ఉంచుకుంటారు. న్యాయంపట్ల దేవునికిగల కనికరంతో కూడిన సమతుల్య భావాన్ని అనుకరిస్తూ దేవుని విధానంలో చర్యలు తీసుకోవాలని వాళ్లు ప్రగాఢంగా కోరుకుంటారు. అయితే, అనేక విషయాల్లో వారు “ఆలోచనకర్తలు”గా సేవ చేస్తారు. అయితే, అధికారులుగా లేక క్రూర పరిపాలకులుగా ఉండడానికి ఇది ఎంతో భిన్నం. ‘తమకు అప్పగింపబడిన దేవుని మందపైన తాము ప్రభువులైనట్టు’ ఎన్నడూ ప్రవర్తించకుండా ఉండేందుకు వారు ఎంతో కృషి చేస్తారు.​—⁠1 పేతురు 5:3.

29, 30. (ఎ) శుద్ధీకరణ ప్రక్రియ నుండి ప్రయోజనం పొందడానికి నిరాకరించేవారికి ఏమి జరుగుతుందని యెహోవా ప్రకటించాడు? (బి) తమ చెట్లు, తోటలను బట్టి ఏ భావంలో ప్రజలు ‘సిగ్గుపడతారు’?

29 యెషయా ప్రవచనంలో ప్రస్తావించబడిన “మష్టు” మాటేమిటి? దేవుడు చేపట్టిన శుద్ధీకరణ ప్రక్రియ నుండి ప్రయోజనం పొందడానికి నిరాకరించే వారికి ఏమి జరుగుతుంది? యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించువారు లయమగుదురు. మీరు ఇచ్ఛయించిన మస్తకివృక్షమునుగూర్చి వారు సిగ్గుపడుదురు, మీకు సంతోషకరములైన తోటలనుగూర్చి మీ ముఖములు ఎఱ్ఱబారును.” (యెషయా 1:​28, 29) యెహోవా ప్రవక్తలు ఇస్తున్న హెచ్చరికా సందేశాలను మితిమీరి అలక్ష్యం చేస్తూ, ఆయనపై తిరుగుబాటు చేసి పాపం చేసేవారు నిజంగానే “నిశ్శేషముగా నాశనమగుదురు,” “లయమగుదురు.” సా.శ.పూ. 607 లో ఇది జరుగుతుంది. వృక్షాలను, తోటలను గురించిన ప్రస్తావనలు దేన్ని సూచిస్తున్నాయి?

30 యూదావారు పదే పదే విగ్రహారాధనలో పడిపోయారు. వృక్షాలు, తోటలు, తోపులు తరచూ వారి నీచమైన ఆచారాల్లో భాగమైవుండేవి. ఉదాహరణకు, బయలు అతని భార్య అష్టారోతు అనావృష్టి కాలంలో చనిపోయి పాతిపెట్టబడతారని ఆ దేవతలను ఆరాధించేవారు విశ్వసిస్తారు. భూమికి ఫలసామర్థ్యం వచ్చేలా వాళ్లు మేల్కొని జతకూడేందుకు వారిని పురికొల్పడానికి విగ్రహారాధకులు తోటల్లోని లేక తోపుల్లోని “పవిత్ర” వృక్షాల క్రింద అసహ్యకరమైన లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనేందుకు సమకూడుతారు. వర్షాలు కురిసి, భూమికి ఫలసామర్థ్యం తిరిగివచ్చినప్పుడు, వాళ్ళు ఆ ఘనతను అబద్ధ దేవుళ్లకు ఇచ్చేవారు; ఆ విగ్రహారాధకులు తమ మూఢనమ్మకాలు మరింత రూఢిపరచబడినట్లు భావించేవారు. కానీ తిరుగుబాటుదారులైన ఆ విగ్రహారాధకులను యెహోవా నాశనం చేసి లయం చేసినప్పుడు, ఏ విగ్రహ-దేవుళ్లూ వారిని కాపాడలేరు. సహాయం చేయలేని ఆ చెట్లను, తోటలను బట్టి తిరుగుబాటుదారులు ‘సిగ్గుపడతారు.’

31. విగ్రహారాధకులు ఎదుర్కొనే, సిగ్గుపడడంకన్నా ఘోరమైన విషయమేమిటి?

31 అయితే విగ్రహారాధకులైన యూదావారు సిగ్గుపడాల్సిన పరిస్థితికంటే ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. ఉపమానాన్ని మారుస్తూ, యెహోవా ఇప్పుడు విగ్రహారాధకుడినే ఒక చెట్టుతో పోలుస్తున్నాడు. “మీరు ఆకులు వాడు మస్తకివృక్షమువలెను, నీరులేని తోటవలెను అగుదురు.” (యెషయా 1:​30) మధ్యప్రాచ్యానికి చెందిన అధిక ఉష్ణోగ్రతగల, తేమలేని వాతావరణానికి ఈ ఉపమానం సరిగ్గా సరిపోతుంది. క్రమంగా నీరు పెట్టకపోతే ఏ చెట్టూ లేదా తోటా ఎక్కువ కాలంపాటు బ్రతకలేదు. ప్రాముఖ్యంగా, ఎండిపోయిన అలాంటి చెట్లు త్వరగా కాలిపోతాయి. కాబట్టి, 31 వ వచనంలోని ఉపమానం చాలా సహజంగా ఉంది.

32. (ఎ) ముప్పై ఒకటవ వచనంలో ప్రస్తావించబడిన “బలవంతులు” ఎవరు? (బి) వాళ్లు ఏ భావంలో “నారపీచు” వలె అవుతారు, వాళ్లను ఏ “అగ్ని కణము” మండేలా చేస్తుంది, దాని ఫలితమెలా ఉంటుంది?

32 “బలవంతులు నారపీచువలె నుందురు, వారి పని అగ్ని కణమువలె నుండును; ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును.” (యెషయా 1:​31) ఈ “బలవంతులు” ఎవరు? ఇక్కడ ఉపయోగించబడిన హీబ్రూ పదం బలం, ధనం అనే భావాలను ఇస్తుంది. బహుశా అది ధనికులైన, స్వాతిశయులైన, అబద్ధ దేవుళ్ల అనుచరులను సూచిస్తుండవచ్చు. మన కాలంలోలాగే యెషయా కాలంలోనూ, యెహోవాను ఆయన స్వచ్ఛారాధనను తిరస్కరించేవారు తక్కువేమీ లేరు. కొందరు విజయవంతులైనట్లుగా కూడా అనిపిస్తుంది. అయితే అలాంటి వారు, ఒక విధంగా చెప్పాలంటే, అగ్ని సెగ తగిలినంతనే చిరిగిపోయే బలహీనమైన, ఎండిపోయిన “నారపీచు” వలె ఉంటారని యెహోవా హెచ్చరిస్తున్నాడు. (న్యాయాధిపతులు 16:​8, 9) విగ్రహారాధకుల పని, అంటే వాళ్ల విగ్రహ దేవుళ్లయినా, సంపదలైనా, లేక యెహోవాకు మారుగా వాళ్లు ఆరాధించేదేదైనా అది మంటను రాజేసే “అగ్ని కణము” వలె ఉంటుంది. అగ్ని కణము, నారపీచు రెండూ దహించుకుపోతాయి, ఎవరూ ఆర్పలేని మంటలో ఆహుతైపోతాయి. న్యాయవంతమైన యెహోవా తీర్పులను విశ్వంలోని ఏ శక్తీ తారు మారు చేయలేదు.

33. (ఎ) రాబోయే తీర్పును గురించిన దేవుని హెచ్చరికలు ఆయన కనికరాన్ని కూడా ఎలా సూచిస్తున్నాయి? (బి) మానవజాతికి ఇప్పుడు యెహోవా ఏ అవకాశాన్ని ఇస్తున్నాడు, అది మనలో ప్రతి ఒక్కరినీ ఎలా ప్రభావితం చేస్తుంది?

33 ఈ చివరి సందేశం, 18 వ వచనంలోని కనికరము, క్షమాభిక్షల సందేశంతో పొందిక కలిగివుందా? ఖచ్చితంగా ఉంది! యెహోవా కనికరం గలవాడు గనుకనే తన సేవకులు అలాంటి హెచ్చరికలను వ్రాసి ఉంచి, ఇతరులకు అందజేసేలా చేశాడు. ఎంతైనా ఆయన ‘యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచున్నాడు.’ (2 పేతురు 3:9) పశ్చాత్తాపపడేవారు ఆయన అనుగ్రహించే ఉదారమైన క్షమాభిక్ష నుండి ప్రయోజనం పొంది, నిరంతరం జీవించగలిగేలా మానవజాతికి దేవుని హెచ్చరిక సందేశాలను ప్రకటించడమనేది నేడు ప్రతి క్రైస్తవునికీ ఉన్న ఆధిక్యత. సమయం మించిపోకముందే “వివాదము తీర్చు”కునేందుకు యెహోవా మానవజాతికి ఒక అవకాశాన్ని ఇవ్వడం ఆయన తరపునుంచి అది ఎంత దయతోకూడిన పనో కదా!

[అధస్సూచీలు]

^ దుష్టరాజైన మనష్షే, యెషయా రంపములతో కోయబడి మరణించేలా చేశాడని యూదుల ప్రాచీన సాంప్రదాయాన్ని బట్టి తెలుస్తుంది. (హెబ్రీయులు 11:37 పోల్చండి.) ఈ మరణశిక్షను విధింపజేయడానికి ఒక అబద్ధ ప్రవక్త ఈ నిందారోపణ చేశాడని ఒక గ్రంథమూలం తెలియజేస్తోంది, యెషయా “యెరూషలేమును సొదొమ అని పిలిచాడు, యూదా యెరూషలేముల రాకుమారులను గొమొఱ్ఱా ప్రజలని ప్రకటించాడు.”

^ “పాపులగుంపు” అని అనువదించబడిన హీబ్రూ పదం, “హానికరమైనది,” “సహజాతీతమైనది,” “తప్పైనది” అని కూడా అనువదించబడుతుంది. థియొలాజికల్‌ డిక్షనరీ ఆఫ్‌ ది ఓల్డ్‌ టెస్టమెంట్‌ ప్రకారం, “శక్తిని దుర్వినియోగం చేయడం వల్ల కలిగే కీడును” తెలియజేసేందుకు హీబ్రూ ప్రవక్తలు ఆ పదాన్ని ఉపయోగించారు.

^ “నా హస్తము నీమీద పెట్టి” అనే వాక్యం, యెహోవా తన ప్రజలకు మద్దతునివ్వడం మానుకుని వారిని శిక్షించడం మొదలుపెడతాడని సూచిస్తుంది.

[అధ్యయన ప్రశ్నలు]