కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మెస్సీయ పరిపాలన క్రింద రక్షణ, ఆనందం

మెస్సీయ పరిపాలన క్రింద రక్షణ, ఆనందం

పదమూడవ అధ్యాయం

మెస్సీయ పరిపాలన క్రింద రక్షణ, ఆనందం

యెషయా 11:​1–12:6

1. యెషయా కాలంలోని దేవుని నిబంధన ప్రజల ఆధ్యాత్మిక పరిస్థితిని వివరించండి.

 యెషయా కాలంలో, దేవుని నిబంధన ప్రజల ఆధ్యాత్మిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఉజ్జియా, యోతాము వంటి నమ్మకమైన రాజుల పరిపాలన క్రింద కూడా చాలామంది ప్రజలు ఉన్నత స్థలాల్లో ఆరాధించారు. (2 రాజులు 15:1-4, 34, 35; 2 దినవృత్తాంతములు 26:​1, 4) హిజ్కియా రాజైనప్పుడు, రాజ్యంలో నుండి బయలు ఆరాధనా సంబంధిత వస్తువులను, ఆచారాలను నిర్మూలించవలసి వచ్చింది. (2 దినవృత్తాంతములు 31:1) తన వద్దకు తిరిగి రమ్మని యెహోవా తన ప్రజలను కోరడంలోనూ, తానివ్వబోయే క్రమశిక్షణను గురించి వారిని హెచ్చరించడంలోనూ ఆశ్చర్యమేమీ లేదు!

2, 3. అవిశ్వాస్యత విస్తృతంగా వ్యాపించివున్నప్పటికీ యెహోవా సేవ చేయాలని కోరుకునేవారికి ఆయన ఎలాంటి ప్రోత్సాహాన్ని అనుగ్రహిస్తాడు?

2 అయినా, అందరూ పూర్తిగా తిరుగుబాటుదారులు కాదు. యెహోవాకు నమ్మకమైన ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పేది బహుశా కొంతమంది యూదులు వినివుండవచ్చు. యెహోవా వీరికి ఓదార్పుకరమైన మాటలను తెలియజేశాడు. అష్షూరీయులు దాడి చేసినప్పుడు యూదా అనుభవించే భయంకరమైన విపత్తులను వివరించిన తర్వాత, బైబిలంతటిలోకి అత్యంత అందమైన భాగాల్లో ఒకదాన్ని వ్రాసేందుకు ప్రవక్తయైన యెషయా ప్రేరేపించబడ్డాడు, అది మెస్సీయ పరిపాలన క్రింద రానున్న ఆశీర్వాదాలను గురించిన వర్ణన. * ఈ ఆశీర్వాదాల్లోని కొన్ని అంశాలు యూదులు బబులోను చెర నుండి తిరిగివచ్చినప్పుడు స్వల్పపరిమాణంలో నెరవేరాయి. కానీ ఆ ప్రవచనం మొత్తంగా నేడు అధికపరిమాణంలో నెరవేరుతోంది. నిజమే, యెషయా, ఆయన కాలంనాటి మరితర నమ్మకమైన యూదులు ఈ ఆశీర్వాదాలను చూడడానికి జీవించివుండలేదు. కానీ వారు విశ్వాసంతో వాటికోసం ఎదురు చూశారు, పునరుత్థానం తర్వాత వారు యెషయా మాటల నెరవేర్పును చూస్తారు.​—⁠హెబ్రీయులు 11:35.

3 యెహోవా ఆధునిక-దిన ప్రజలకు కూడా ప్రోత్సాహం అవసరం. ప్రపంచంలో రోజురోజుకూ క్షీణించిపోతున్న నైతిక విలువలు, రాజ్య సందేశానికి ఎదురవుతున్న హానికరమైన వ్యతిరేకత, వ్యక్తిగత బలహీనతలు అన్నీ వారికి సవాలుదాయకమైనవే. దేవుని ప్రజలు ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు, మెస్సీయ గురించి ఆయన పరిపాలన గురించి యెషయా చెబుతున్న అద్భుతమైన మాటలు వారిని బలపర్చి వారికి సహాయం చేస్తాయి.

మెస్సీయ​—⁠సమర్థవంతమైన నాయకుడు

4, 5. మెస్సీయ రాక గురించి యెషయా ఏమి ప్రవచించాడు, యెషయా ఉపయోగించిన పదాలను మత్తయి ఎలా అన్వయించి ఉండవచ్చు?

4 యెషయా కాలానికి శతాబ్దాల పూర్వం, ఇతర హీబ్రూ బైబిలు రచయితలు యెహోవా ఇశ్రాయేలుకు పంపించే నిజమైన నాయకుడైన మెస్సీయ రాకను సూచించారు. (ఆదికాండము 49:10; ద్వితీయోపదేశకాండము 18:18; కీర్తన 118:​22, 26) ఇప్పుడు యెషయా ద్వారా యెహోవా మరిన్ని వివరాలను అందజేస్తున్నాడు. యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును; వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును.” (యెషయా 11:1; కీర్తన 132:11 పోల్చండి.) “చిగురు,” “అంకురము,” ఈ రెండూ కూడా మెస్సీయ, ఇశ్రాయేలుకు రాజుగా తైలముతో అభిషేకించబడిన దావీదు ద్వారా వచ్చే, యెష్షయి వంశీయుడై ఉంటాడని సూచిస్తున్నాయి. (1 సమూయేలు 16:13; యిర్మీయా 23:5; ప్రకటన 22:​16) నిజమైన మెస్సీయ వచ్చినప్పుడు, దావీదు కుటుంబానికి చెందిన ఈ “అంకురము” మంచి ఫలాలను ఫలిస్తుంది.

5 వాగ్దానం చేయబడిన మెస్సీయ యేసు. ఆయన ‘నజరేయుడు’ అని పిలువబడడం ప్రవక్తలు చెప్పినదాన్ని నెరవేర్చిందని సువార్త రచయిత మత్తయి చెప్పినప్పుడు ఆయన యెషయా 11:1 లోని పదాలనే పరోక్షంగా సూచించాడు. యేసు నజరేతనే పట్టణంలో పెరిగాడు గనుక ఆయన నజరేయుడని పిలువబడ్డాడు, ఆ పేరు యెషయా 11:1 లోని “అంకురము” అనేదాని కోసం ఉపయోగించబడిన హీబ్రూ పదానికి సంబంధించినదై ఉండవచ్చు. *​—⁠మత్తయి 2:​22, 23; లూకా 2:39, 40.

6. మెస్సీయ ఎలాంటి పరిపాలకుడిగా ఉంటాడని ప్రవచించబడింది?

6 మెస్సీయ ఎలాంటి పరిపాలకుడిగా ఉంటాడు? ఇశ్రాయేలు పది-గోత్రాల ఉత్తర రాజ్యాన్ని నాశనం చేసే క్రూరమైన, స్వీయాభీష్టంగల అష్షూరీయునిలా ఉంటాడా? అలా ఎంతమాత్రం ఉండడు. మెస్సీయ గురించి యెషయా ఇలా చెబుతున్నాడు: “యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును; యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.” (యెషయా 11:​2, 3) మెస్సీయ తైలముతో కాదుగానీ దేవుని పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు. ఇది, యేసు బాప్తిస్మం సమయంలో, దేవుని పరిశుద్ధాత్మ పావురము రూపంలో యేసుపైకి దిగిరావడాన్ని బాప్తిస్మమిచ్చే యోహాను చూస్తుండగా జరుగుతుంది. (లూకా 3:​22) యెహోవా ఆత్మ యేసుమీదికి ‘దిగివచ్చి నిలుస్తుంది,’ ఆ విషయాన్ని ఆయన జ్ఞానవివేకములు, ఆలోచన, బలం, తెలివితో వ్యవహరించి రుజువు చేస్తాడు. పరిపాలకునికి ఉండవలసిన ఎంత శ్రేష్ఠమైన లక్షణాలు!

7. యేసు తన నమ్మకమైన అనుచరులకు ఏ వాగ్దానం చేశాడు?

7 యేసు అనుచరులు కూడా పరిశుద్ధాత్మను పొందవచ్చు. యేసు తానిచ్చిన ప్రసంగాల్లో ఒక దానిలో ఇలా ప్రకటించాడు: “మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు[ను].” (లూకా 11:​12, 13) కాబట్టి, మనం పరిశుద్ధాత్మనివ్వమని దేవుడ్ని అడగడానికి ఎన్నడూ వెనుకాడకూడదు, అంతేగాక దాని శ్రేష్ఠమైన ఫలాలైన “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” వంటి వాటిని వృద్ధి చేసుకోవడాన్ని ఎన్నడూ మానకూడదు. (గలతీయులు 5:​22, 23) జీవిత సమస్యలను విజయవంతంగా ఎదుర్కోవడానికి సహాయం చేసే “పైనుండివచ్చు జ్ఞానము” కోసం యేసు అనుచరులు చేసే విన్నపానికి సమాధానం ఇస్తానని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు.​—⁠యాకోబు 1:5; 3:17.

8. యెహోవాపట్ల భయం కలిగివుండడంలో యేసు ఆనందాన్ని ఎలా కనుగొంటాడు?

8 మెస్సీయ కనబరిచే యెహోవా భయం ఎటువంటిది? దేవుడు తనను నిందిస్తాడేమోనని భయపడుతూ యేసు వణికిపోవడం లేదు. బదులుగా, మెస్సీయకు దేవుడంటే గౌరవపూర్వకమైన భక్తిపూర్వకమైన భయం ఉంది, ఆయన పట్ల ప్రేమపూర్వకమైన పూజ్యభావం ఉంది. దైవభయంగల వ్యక్తి, యేసు చేసినట్లుగా ఎల్లవేళలా ‘దేవునికిష్టమైన కార్యములు చేయాలని’ కోరుకుంటాడు. (యోహాను 8:​29) ప్రతిరోజు యెహోవాపట్ల ఆరోగ్యదాయకమైన భయంతో నడుచుకోవడం కన్నా గొప్ప ఆనందం మరొకటేదీ లేదని యేసు మాట ద్వారా, మాదిరి ద్వారా బోధిస్తున్నాడు.

నీతిమంతుడైన, కనికరంగల న్యాయాధిపతి

9. క్రైస్తవ సంఘంలో న్యాయవిచారణ చేయవలసిన బాధ్యతవున్న వారికి యేసు ఎలాంటి మాదిరిని ఉంచాడు?

9 మెస్సీయ లక్షణాల గురించి యెషయా మరింతగా ఇలా తెలియజేస్తున్నాడు: “కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు.” (యెషయా 11:3బి) మీరు న్యాయస్థానం ఎదుట నిలబడవలసిన పరిస్థితి ఏర్పడితే, అలాంటి న్యాయాధిపతి ఉంటే మీరు కృతజ్ఞులై ఉండరా? మానవజాతికంతటికీ న్యాయాధిపతిగా మెస్సీయ అబద్ధ వాదనలకు, కుయుక్తితో కూడిన న్యాయసభాగది ఎత్తుగడలకు, వదంతులకు, లేక ధనసంపదల వంటి పైపై అంశాలకు ప్రభావితం కాడు. ఆయన మోసాన్ని కనిపెట్టి, సాధారణ పైరూపాన్ని మించి చూస్తాడు, “హృదయపు అంతరంగ స్వభావము”ను, ‘అంతరంగపురుషుడ్ని’ గ్రహిస్తాడు. (1 పేతురు 3:​4, అధస్సూచి) యేసు సర్వోత్కృష్టమైన ఉదాహరణ, క్రైస్తవ సంఘంలో న్యాయవిచారణ చేయవలసిన బాధ్యతవున్న వారికందరికి చక్కని మాదిరిగా పనిచేస్తుంది.​—1 కొరింథీయులు 6:1-4.

10, 11. (ఎ) యేసు తన అనుచరులను ఏ విధంగా సరిదిద్దుతాడు? (బి) దుష్టులకు యేసు ఎలాంటి తీర్పు తీరుస్తాడు?

10 మెస్సీయ సర్వోత్కృష్టమైన లక్షణాలు ఆయన చేసే న్యాయ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయి? యెషయా ఇలా వివరిస్తున్నాడు: “నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును, భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండముచేత లోకమును కొట్టును; తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.”​—యెషయా 11:3-5.

11 తన అనుచరులకు దిద్దుబాటు అవసరమైనప్పుడు, యేసు వారికి ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా వారిని సరిదిద్దుతాడు​—⁠క్రైస్తవ పెద్దలకు ఎంతో చక్కని మాదిరి. మరోవైపున, దుష్టత్వాన్ని అనుసరించేవారు కఠినమైన తీర్పు వస్తుందని ఎదురుచూడవచ్చు. దేవుడు ఈ వ్యవస్థను జవాబు చెప్పడానికి పిలిచినప్పుడు, దుష్టులందరికీ నాశనపు తీర్పు తీరుస్తూ మెస్సీయ తన అధికారపూర్వక స్వరంతో “లోకమును కొట్టును.” (కీర్తన 2:9; ప్రకటన 19:​15 పోల్చండి.) చివరికి, మానవజాతి శాంతిని కలతపరిచేందుకు దుష్టులెవ్వరూ మిగిలివుండరు. (కీర్తన 37:​10, 11) నడుమునకు నీతి, తుంట్లకు సత్యము కట్టుకొనిన యేసుకు దీన్ని సాధించే శక్తి ఉంది.​—⁠కీర్తన 45:3-7.

భూమిపై మారిన పరిస్థితులు

12. బబులోను నుండి వాగ్దాన దేశానికి తిరిగి వెళ్లడాన్ని గురించి ఆలోచించినప్పుడు ఒక యూదునికి కలిగే ఆందోళనలేవి?

12 యూదులు యెరూషలేముకు తిరిగి వెళ్లి ఆలయాన్ని పునర్నిర్మించాలని కోరేషు ఇచ్చిన ఆజ్ఞ గురించి ఇప్పుడే తెలుసుకున్న ఒక ఇశ్రాయేలీయుడ్ని ఊహించుకోండి. అంత దూరప్రయాణం చేసి తమ స్వస్థలానికి తిరిగి వెళ్లడానికి అతడు బబులోనులోని సురక్షితమైన జీవితాన్ని విడిచివెళ్తాడా? ఇశ్రాయేలీయులు అక్కడ లేని డెబ్భై యేళ్ళ కాలంలో, వదిలివేయబడిన పొలాలు కలుపు మొక్కలతో నిండిపోయాయి. నక్కలు, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఇప్పుడా పొలాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. నాగుపాములు కూడా అక్కడ తమ నివాసాలను ఏర్పరచుకున్నాయి. తిరిగి వెళ్లే యూదులు తమ జీవనం కోసం పెంపుడు జంతువులపై ఆధారపడాలి​—⁠పాలు, ఉన్ని, మాంసము కోసం పాడిపశువుల మీదా, గొఱ్ఱె మేకల మందల మీదా, నేలను దున్నేందుకు ఎద్దులమీదా ఆధారపడాలి. వీరు క్రూరమృగాల బారిన పడతారా? చిన్నపిల్లలను పాములు కాటేస్తాయా? ప్రయాణంలో ఆకస్మిక దాడికి గురయ్యే ప్రమాదం విషయమేమిటి?

13. (ఎ) యెషయా ఏ మనోరంజకమైన దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు? (బి) యెషయా వర్ణిస్తున్న సమాధానంలో, క్రూరమృగాల నుండి కాపుదలకంటే ఎక్కువే ఇమిడివుందని మనకెలా తెలుసు?

13 యెషయా ఇప్పుడు, ఆ దేశంలో దేవుడు తీసుకు రాబోతున్న పరిస్థితులను గురించిన మనోరంజకమైన దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు. ఆయనిలా చెబుతున్నాడు: “తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును; వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లాడును; మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యిచాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు; సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.” (యెషయా 11:​6-9) ఈ మాటలు హృదయాన్ని ఆనందపర్చడంలేదా? ఇక్కడ వర్ణించబడిన సమాధానం యెహోవాను గూర్చిన జ్ఞానము మూలంగా కలుగుతుందని గమనించండి. కాబట్టి, క్రూరమృగాల నుండి రక్షణ లభించడం కంటే ఎక్కువే ఇమిడివుంది. యెహోవాను గూర్చిన జ్ఞానము జంతువులను మార్చదు, కాని అది ప్రజలపై ప్రభావాన్ని చూపుతుంది. ఇశ్రాయేలీయులు స్వదేశానికి వెళ్లే మార్గంలో గానీ, పునఃస్థాపించబడిన తమ దేశానికి చేరిన తర్వాత గానీ వారు క్రూరమృగాలకు లేక మృగాలవంటి మనుష్యులకు భయపడవలసిన అవసరం ఉండదు.​—⁠ఎజ్రా 8:21, 22; యెషయా 35:​8, 9; 65:25.

14. యెషయా 11:6-9 వచనాలు విస్తృతమైన విధంగా ఎలా నెరవేరుతున్నాయి?

14 అయితే, ఈ ప్రవచనం మరింత విస్తృతమైన విధంగా నెరవేరబోతోంది. మెస్సీయ అయిన యేసు 1914 లో పరలోక సీనాయి పర్వతంమీద సింహాసనాసీనునిగా చేయబడ్డాడు. “దేవుని ఇశ్రాయేలు”లోని శేషించినవారు 1919 లో బబులోను సంబంధిత నిర్భంధం నుండి విడుదల చేయబడి సత్యారాధనను పునఃస్థాపించడంలో భాగం వహించారు. (గలతీయులు 6:​16) తత్ఫలితంగా, యెషయా పరదైసు ప్రవచనపు ఆధునిక-దిన నెరవేర్పుకు మార్గం తెరువబడింది. “ఖచ్చితమైన జ్ఞానము” అంటే యెహోవాను గూర్చిన జ్ఞానము వ్యక్తిత్వాలను మార్చింది. (కొలొస్సయులు 3:​9, 10, NW) మునుపు హింసించేవారిగా ఉన్న ప్రజలు ఇప్పుడు శాంతియుతమైనవారయ్యారు. (రోమీయులు 12:2; ఎఫెసీయులు 4:​17-24) ఈ పరిణామాలు నేడు లక్షలాదిమందిని ప్రభావితం చేశాయి, ఎందుకంటే భూనిరీక్షణకలిగి, సంఖ్యాపరంగా చాలా వేగంగా వృద్ధి చెందుతున్న క్రైస్తవులు యెషయా ప్రవచన నెరవేర్పులో భాగమవుతున్నారు. (కీర్తన 37:29; యెషయా 60:​22) దేవుని ఆది సంకల్పం ప్రకారం యావత్‌ భూమీ సురక్షితమైన, సమాధానకరమైన పరదైసుగా పునఃస్థాపించబడే సమయం కోసం వేచివుండడాన్ని వీరు నేర్చుకున్నారు.​—⁠మత్తయి 6:9, 10; 2 పేతురు 3:13.

15. నూతన లోకంలో యెషయా మాటలు అక్షరార్థంగా నెరవేరుతాయని మనం సహేతుకంగా ఎదురు చూడవచ్చా? వివరించండి.

15 పునఃస్థాపించబడిన ఆ పరదైసులో, యెషయా ప్రవచనం ఇంకా ఎక్కువగా, బహుశా మరింత అక్షరార్థంగా నెరవేరుతుందా? అలా ఆలోచించడం సహేతుకంగానే అనిపిస్తుంది. ఆ ప్రవచనం, తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులకు ఏ హామీని ఇచ్చిందో మెస్సీయ పరిపాలన క్రింద జీవించేవారందరికీ అదే హామీని ఇస్తోంది; వారూ వారి పిల్లలూ మానవుల నుండి గానీ జంతువుల నుండిగానీ ఎలాంటి హానినీ ఎదుర్కొనరు. మెస్సీయ రాజ్య పరిపాలన క్రింద, భూనివాసులందరూ ఆదాము హవ్వలు ఏదెను తోటలో ఆనందించినటువంటి సమాధానకరమైన పరిస్థితులను ఆనందిస్తారు. నిజమే, ఏదెనులో జీవితం ఎలా ఉండేది లేక పరదైసులో జీవితం ఎలా ఉంటుంది అనేవాటి గురించి లేఖనాలు ప్రతి వివరణనూ ఇవ్వడం లేదు. అయినప్పటికీ, రాజైన యేసు క్రీస్తు జ్ఞానయుక్తమైన, ప్రేమపూర్వకమైన పరిపాలన క్రింద ప్రతిదీ ఎలా ఉండాలో అలాగే ఉంటుందని మనం నిశ్చయత కలిగివుండవచ్చు.

మెస్సీయ ద్వారా పునఃస్థాపించబడిన స్వచ్ఛారాధన

16. దేవుని ప్రజలకు సా.శ.పూ. 537 లో ఏది ధ్వజముగా నిలబడింది?

16 ఆదాము హవ్వలు యెహోవాకు అవిధేయత చూపించేలా వారిని ప్రభావితం చేయడంలో సాతాను విజయం సాధించినప్పుడు స్వచ్ఛారాధన మొదటిసారిగా దాడికి గురయ్యింది. సాధ్యమైనంత ఎక్కువమందిని దేవుని నుండి దూరం చేయాలనే తన లక్ష్యాన్ని సాతాను ఈనాటి వరకు విడిచిపెట్టలేదు. కానీ స్వచ్ఛారాధన భూమిపై నుండి నిర్మూలించబడేందుకు యెహోవా ఎన్నడూ అనుమతించడు. ఆయన నామము దానిలో ఇమిడి ఉంది, తన సేవ చేసేవారి గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. కాబట్టి, యెషయా ద్వారా ఆయన గమనార్హమైన ఈ వాగ్దానాన్ని చేస్తున్నాడు: “ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును, ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును.” (యెషయా 11:​10) దావీదు దేశ రాజధానిగా చేసిన నగరమైన యెరూషలేము, పూర్వం సా.శ.పూ. 537 లో, చెదరిపోయిన యూదా ప్రజల శేషమును తిరిగి వచ్చి ఆలయాన్ని పునర్నిర్మించమని పిలుస్తూ ఒక ధ్వజముగా పనిచేసింది.

17. మొదటి శతాబ్దంలోనూ, మన కాలంలోనూ యేసు ‘అన్యజనుల నేలుటకు ఎలా లేచాడు’?

17 అయితే, ప్రవచనం అంతకంటే ఎక్కువైనదాన్ని సూచిస్తోంది. ముందే చూసినట్లుగా, అన్ని జనాంగాల ప్రజలకు ఏకైక సత్య నాయకుడైన మెస్సీయ పరిపాలనను అది సూచిస్తోంది. తన కాలంలో అన్యజనాంగాలకు చెందిన వారికి క్రైస్తవ సంఘంలో స్థానం ఉంటుందని చూపించడానికి అపొస్తలుడైన పౌలు యెషయా 11:10 ని ఎత్తి చెప్పాడు. ఆయన ఈ వచనపు సెప్టాజింట్‌ అనువాదాన్ని ఎత్తిచెబుతూ ఇలా వ్రాశాడు: “యెషయా యీలాగు చెప్పుచున్నాడు​—⁠యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయనయందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.” (రోమీయులు 15:​12) ఆ ప్రవచనం ఇంకా ముందుకు వెళ్ళి, అన్యజనాంగాలకు చెందిన ప్రజలు మెస్సీయ అభిషిక్త సహోదరులకు మద్దతునివ్వడం ద్వారా యెహోవా పట్ల తమకున్న ప్రేమను చూపిస్తున్న మన కాలం వరకు చేరుతుంది.​—⁠యెషయా 61:5-9; మత్తయి 25:31-40.

18. మన కాలంలో, సమకూడవలసిన స్థలానికి యేసు ఎలా గుర్తుగా ఉన్నాడు?

18 యెషయా ప్రస్తావించిన “ఆ దినము,” ఆధునిక-దిన నెరవేర్పులో, 1914 లో దేవుని పరలోక రాజ్యానికి రాజుగా మెస్సీయ సింహాసనాసీనుడిగా చేయబడినప్పుడు ప్రారంభమైంది. (లూకా 21:10; 2 తిమోతి 3:1-5; ప్రకటన 12:​10) అప్పటి నుండి, యేసు క్రీస్తు ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకూ, నీతియుక్తమైన ప్రభుత్వం కోసం పరితపించే అన్ని జనాంగాలకు చెందిన ప్రజలకూ స్పష్టమైన ధ్వజముగా, సమకూడవలసిన స్థలానికి గుర్తుగా ఉన్నాడు. యేసు ముందే చెప్పినట్లు, మెస్సీయ నడిపింపు క్రింద దేవుని రాజ్య సువార్త అన్ని జనాంగాల వారికీ చేరవేయబడుతోంది. (మత్తయి 24:14; మార్కు 13:​10) ఈ సువార్త శక్తిమంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ‘ప్రతి జనములోనుండి వచ్చిన, యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము’ స్వచ్ఛారాధనలో అభిషిక్త శేషముతో కలవడం ద్వారా మెస్సీయకు విధేయత చూపిస్తుంది. (ప్రకటన 7:9) యెహోవా ఆధ్యాత్మిక “ప్రార్థన మందిరములో” శేషముతో సహవసించడానికి అనేకమంది క్రొత్తవారు రావడం కొనసాగుతుండగా, వారు దేవుని గొప్ప ఆధ్యాత్మిక ఆలయమైన, మెస్సీయ “విశ్రమస్థలము”కు మహిమను చేకూరుస్తారు.​—⁠యెషయా 56:7; హగ్గయి 2:7.

ఐక్యతగల ఒక ప్రజ యెహోవా సేవచేస్తోంది

19. భూమి అంతటా చెదరిపోయిన తన ప్రజల శేషమును ఏ రెండు సందర్భాల్లో యెహోవా పునఃస్థాపించాడు?

19 జనాంగం ఒక శక్తివంతమైన శత్రువు నుండి అణచివేతను ఎదుర్కొన్నప్పుడు మునుపొకసారి యెహోవా రక్షణను అనుగ్రహించాడని తర్వాత యెషయా ఇశ్రాయేలీయులకు గుర్తుచేస్తున్నాడు. ఇశ్రాయేలు చరిత్రలోని ఆ భాగం​—⁠జనాంగాన్ని ఐగుప్తు చెర నుండి యెహోవా విడిపించడం​—⁠నమ్మకమైన యూదులందరికీ ప్రియమైన విషయం. యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులోనుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువబెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును; భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరిపోయిన యూదా వారిని సమకూర్చును.” (యెషయా 11:​11, 12) యెహోవా ఇశ్రాయేలు యూదాల నమ్మకమైన శేషమును చెయ్యి పట్టుకొని నడిపించినట్లుగా, వారు చెదరిపోయిన దేశాలలో నుండి ఆయన వారిని సురక్షితంగా స్వదేశానికి తోడుకొని వస్తాడు. సా.శ.పూ. 537 లో ఇది స్వల్ప రీతిలో జరిగింది. అయితే అధిక స్థాయిలో నెరవేరడం మరెంత మహిమకరంగా ఉంటుందో కదా! యెహోవా 1914 లో, సింహాసనాసీనుడైన యేసు క్రీస్తును ‘జనములను పిలుచుటకు యొక ధ్వజముగా’ నిలబెట్టాడు. దేవుని రాజ్యము క్రింద స్వచ్ఛారాధనలో భాగం వహించాలనే ఆతురతతో “దేవుని ఇశ్రాయేలు”లోని శేషించినవారు 1919 మొదలుకొని ఈ ధ్వజము వద్ద సమకూడుతున్నారు. ఈ అనుపమానమైన ఆధ్యాత్మిక జనాంగము ‘ప్రతి వంశములోనుండి, ఆయా భాషలు మాటలాడువారిలోనుండి, ప్రతి ప్రజలోనుండి, ప్రతి జనములోనుండి’ వస్తుంది.​—⁠ప్రకటన 5:9.

20. బబులోను నుండి తిరిగి వచ్చిన తర్వాత దేవుని ప్రజలు ఏ ఐక్యతను ఆనందిస్తారు?

20 యెషయా ఇప్పుడు పునఃస్థాపిత దేశపు ఐక్యతను వర్ణిస్తున్నాడు. ఉత్తర రాజ్యాన్ని ఎఫ్రాయీముగా, దక్షిణ రాజ్యాన్ని యూదాగా పేర్కొంటూ, ఆయనిలా అంటున్నాడు: “ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును, యూదా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు, యూదా ఎఫ్రాయిమును బాధింపడు. వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు, పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు; ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు. ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు, అమ్మోనీయులు వారికి లోబడుదురు.” (యెషయా 11:​13, 14) యూదులు బబులోను నుండి తిరిగి వచ్చినప్పుడు, వారిక రెండు జనాంగాలుగా విభజించబడరు. ఇశ్రాయేలు అన్ని గోత్రాల సభ్యులూ తమ దేశానికి ఐక్యంగా తిరిగి వస్తారు. (ఎజ్రా 6:​17) వారిక ఎంతమాత్రమూ ఒకరి పట్ల మరొకరు కోపాన్ని, శత్రుభావాన్ని చూపించరు. ఐక్య ప్రజలుగా, వారు తమ చుట్టుపక్కల రాజ్యాల్లోవున్న శత్రువులకు వ్యతిరేకంగా విజయోత్సాహంతో నిలబడతారు.

21. నేడు దేవుని ప్రజల ఐక్యత ఎలా విశేషంగా ఉంది?

21 “దేవుని ఇశ్రాయేలు” యొక్క ఐక్యత మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు చెందిన 12 సూచనార్థక గోత్రాలవారు దాదాపు 2,000 సంవత్సరాలుగా, దేవుని పట్ల తమకున్న ప్రేమపై, తమ ఆధ్యాత్మిక సహోదర సహోదరీల పట్ల తమకున్న ప్రేమపై ఆధారపడిన ఐక్యతను ఆనందించారు. (కొలొస్సయులు 3:14; ప్రకటన 7:​4-8) నేడు మెస్సీయ పరిపాలన క్రింద యెహోవా ప్రజలు​—⁠ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు, భూనిరీక్షణ గలవారు​—⁠క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలకు ఏమాత్రం తెలియని పరిస్థితులైన, సమాధానాన్ని ప్రపంచవ్యాప్త ఐక్యతను అనుభవిస్తున్నారు. తమ ఆరాధనలో జోక్యం చేసుకోవాలని సాతాను చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా యెహోవాసాక్షులు ఆధ్యాత్మిక ఐక్యసంఘటనగా నిలుస్తారు. వారు ఒక ప్రజగా, సమస్త దేశాల్లోను మెస్సీయ రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటించమని, బోధించమని యేసు ఇచ్చిన ఆజ్ఞను నెరవేరుస్తున్నారు.​—⁠మత్తయి 28:19, 20.

అవరోధాలు అధిగమించబడతాయి

22. యెహోవా ఏ విధంగా, “ఐగుప్తు సముద్రముయొక్క అఖాతమును నిర్మూలము చేయును,” ఏ విధంగా “నది మీద తన చెయ్యి ఆడించును”?

22 ఇశ్రాయేలీయులు చెరనుండి తిరిగి రాకుండా అడ్డగించే అక్షరార్థమైన, సూచనార్థకమైన అవరోధాలు అనేకం ఉన్నాయి. వాటిని ఎలా అధిగమిస్తారు? యెషయా ఇలా చెబుతున్నాడు: “యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క అఖాతమును నిర్మూలము చేయును, వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును. ఏడు కాలువలుగా దాని చీలగొట్టును, పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని చేయును.” (యెషయా 11:​15) తన ప్రజలు తిరిగి రావడానికున్న ఆటంకాలన్నిటినీ నిర్మూలించేది యెహోవాయే. (సూయజ్‌ సింధుశాఖ వంటి) ఎర్ర సముద్రపు అఖాతమంత దుర్భేద్యమైన ఆటంకాలైనా, లేదా దాటడానికి దుస్సాధ్యమైన శక్తిమంతమైన యూఫ్రటీసు నదియైనా ఎండిపోతాయి, ఎంతగానంటే ఒక వ్యక్తి తన చెప్పులు కూడా విప్పవలసిన అవసరం లేకుండా అవతలి వైపుకు దాటి వెళ్లగలిగేంతగా ఎండిపోతాయి.

23. ‘అష్షూరునుండి వచ్చు వారికి’ ఏవిధంగా ‘రాజమార్గముండును’?

23 మోషే కాలంలో, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి తప్పించుకొని, వాగ్దాన దేశంలోకి నడిచి వెళ్లేలా యెహోవా ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆయన ఇప్పుడు అటువంటిదే చేస్తాడు: “ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును.” (యెషయా 11:​16) తిరిగి వస్తున్న బంధీలు తమ బంధీగృహం నుండి తమ స్వదేశానికి రాజమార్గంపై నడిచి వస్తున్నట్లుగా యెహోవా వారిని నడిపిస్తాడు. వ్యతిరేకులు వారిని ఆపడానికి ప్రయత్నిస్తారు గానీ వారి దేవుడైన యెహోవా వారితో ఉంటాడు. నేడు అభిషిక్త క్రైస్తవులు, వారి సహవాసులు భయంకరమైన దాడికి గురవుతారు, కానీ వారు ధైర్యంగా ముందుకు సాగుతారు. వారు ఆధునిక అష్షూరు అయిన సాతాను ప్రపంచం నుండి బయటికి వచ్చారు, అలాగే చేయడానికి వారు ఇతరులకు సహాయం చేస్తారు. స్వచ్ఛారాధన విజయవంతమై వర్ధిల్లుతుందని వారికి తెలుసు. అది మానవుని పని కాదు గానీ దేవుని పనే.

మెస్సీయ ప్రజలకు అంతులేని ఆనందం!

24, 25. యెహోవా ప్రజలు ఏ స్తుతి, కృతజ్ఞతల వ్యక్తీకరణలతో గొంతెత్తి ఆలపిస్తారు?

24 యెహోవా మాటల నెరవేర్పును బట్టి ఆయన ప్రజలు అనుభవిస్తున్న ఆనందోత్సాహాన్ని యెషయా ఇప్పుడు ఆనందకరమైన భాషలో ఇలా వర్ణిస్తున్నాడు: “ఆ దినమున మీరీలాగందురు​—⁠యెహోవా, నీవు నామీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి యున్నావు.” (యెషయా 12:1) యెహోవా దారితప్పిన తన ప్రజలకిచ్చే క్రమశిక్షణ తీవ్రంగా ఉంటుంది. కానీ అది, దేవునితో ఆ జనాంగానికున్న సంబంధాన్ని పునరుద్ధరించి స్వచ్ఛారాధనను పునఃస్థాపించడమనే సంకల్పాన్ని నెరవేరుస్తుంది. చివరికి వారిని తాను కాపాడతానని యెహోవా తన నమ్మకమైన ఆరాధకులకు హామీ ఇస్తున్నాడు. వారు మెప్పుదల చూపిస్తున్నారంటే అందులో ఆశ్చర్యం లేదు!

25 పునఃస్థాపించబడిన ఇశ్రాయేలీయులకు యెహోవా పైనున్న విశ్వాసం సంపూర్ణంగా ధ్రువీకరించబడడంతో, వారు ఎలుగెత్తి ఇలా చెప్తారు: “ఇదిగో! నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను; యెహోవా యెహోవాయే [“యా యెహోవాయే,” NW] నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలోనుండి నీళ్లు చేదుకొందురు.” (యెషయా 12:​2, 3) రెండవ వచనంలో, “కీర్తన” అని అనువదించబడిన హీబ్రూ పదం సెప్టాజింట్‌ వర్షన్‌లో “స్తుతి” అని కనిపిస్తుంది. “యా యెహోవా” అనుగ్రహించే రక్షణను బట్టి ఆరాధకులు గొంతెత్తి స్తుతిగీతాలను ఆలపిస్తారు. యెహోవా అనే నామము యొక్క సంక్షిప్త రూపమైన “యా” అన్నది, బైబిలులో స్తుతి కృతజ్ఞతల ఉత్కర్ష భావాలను తెలియజేయడానికి ఉపయోగించబడింది. “యా యెహోవా” అనే పదబంధాన్ని ఉపయోగించడం, అంటే దైవిక నామాన్ని రెండుసార్లు పలకడం దేవుని స్తుతి సాంద్రతను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది.

26. ఈనాడు ఎవరు దేవుని వ్యవహారాలను జనాంగాలకు తెలియజేస్తున్నారు?

26 యెహోవా నిజమైన ఆరాధకులు తమ ఆనందాన్ని తమకే ఉంచుకోలేరు. యెషయా ఇలా ప్రవచిస్తున్నాడు: “ఆ దినమున మీరీలాగందురు​—⁠యెహోవాను స్తుతించుడి! ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవానుగూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను. భూమియందంతటను ఇది తెలియబడును.” (యెషయా 12:​4, 5) అభిషిక్త క్రైస్తవులు 1919 నుండి​—⁠ఆతర్వాత తమ “వేరే గొఱ్ఱెల” సహవాసుల సహాయంతో​—⁠‘చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తమను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేస్తున్నారు.’ వారు ఈ సంకల్పం నిమిత్తం ప్రత్యేకించబడిన, “ఏర్పరచబడిన వంశము . . . పరిశుద్ధ జనము.” (యోహాను 10:16; 1 పేతురు 2:9) అభిషిక్తులు యెహోవా పరిశుద్ధ నామము ఘనమైనదని ప్రకటిస్తూ, దాన్ని భూమి అంతటా తెలియజేస్తారు. వారు, యెహోవా ఆరాధకులందరూ తమ రక్షణ కోసం ఆయన చేసిన ఏర్పాటును బట్టి ఆనందించేలా నడిపింపునిస్తారు. అది సరిగ్గా యెషయా ఉద్ఘాటిస్తున్నట్లుగా ఇలా ఉంది: “సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు.” (యెషయా 12:6) ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధుడు యెహోవా దేవుడే.

భవిష్యత్తు వైపు నమ్మకంతో చూడండి

27. క్రైస్తవులు తమ నిరీక్షణ నిజం కావడం కోసం ఎదురు చూస్తూ దేని విషయమై దృఢ నిశ్చయత కలిగివున్నారు?

27 “ప్రజలకు ధ్వజము” అయిన, దేవుని రాజ్యానికి రాజుగా సింహాసనాసీనుడైన యేసు క్రీస్తు వద్దకు నేడు లక్షలాదిమంది గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఆ రాజ్యానికి విధేయులై ఉండడంలో వారు ఆనందాన్ని పొందుతారు, యెహోవా దేవుడ్ని ఆయన కుమారుడ్ని తెలుసుకోగలిగినందుకు వారు పులకించిపోతున్నారు. (యోహాను 17:3) వారు తమ ఐక్య క్రైస్తవ సహవాసంలో గొప్ప ఆనందాన్ని పొందుతూ, యెహోవా నిజ సేవకుల గుర్తింపు చిహ్నమైన సమాధానాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తారు. (యెషయా 54:​13) యా యెహోవా తన వాగ్దానాలను నెరవేర్చే దేవుడని ఒప్పించబడి, వారు తమ నిరీక్షణ విషయమై దృఢ నిశ్చయత కలిగివుండి, దాన్ని ఇతరులతో పంచుకోవడంలో గొప్ప ఆనందాన్ని పొందుతారు. యెహోవా ప్రతి ఆరాధకుడు దేవుని సేవ చేయడంలోనూ, ఇతరులు కూడా అలాగే చేయడానికి వారికి సహాయం చేయడంలోనూ తన శక్తినంతటినీ ఉపయోగించడంలో కొనసాగు గాక. అందరూ యెషయా మాటలను లక్ష్యపెడుతూ యెహోవా యొక్క మెస్సీయ ద్వారా అందజేయబడుతున్న రక్షణను బట్టి ఆనందించుదురు గాక!

[అధస్సూచీలు]

^ “అభిషిక్తుడు” అనే భావంగల మషీయాక్‌ అనే హీబ్రూ పదం నుండి “మెస్సీయ” అనే పదం వచ్చింది. దానికి సమానమైన గ్రీకు పదం క్రిస్టోస్‌ లేదా “క్రీస్తు.”​—⁠మత్తయి 1:1, అధస్సూచి.

^ “అంకురము” అనే పదానికి హీబ్రూ పదం నెత్సర్‌, ‘నజరేయుడు’ అనే పదానికి హీబ్రూ పదం నాత్స్రీ.

[అధ్యయన ప్రశ్నలు]

[158 వ పేజీలోని చిత్రాలు]

మెస్సీయ, దావీదు రాజు ద్వారా యెష్షయి నుండి వచ్చే “చిగురు”

[162 వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]

[170 వ పేజీలోని చిత్రం]

యెషయా 12:4, 5 వచనాలు మృతసముద్రపు చుట్టలలో ఇలా కనిపిస్తాయి (దేవుని నామము ఇక్కడ స్పష్టంగా కనిపించేలా చూపించబడింది)